ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క...

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత...

పేరు గలవాడేను మనిషోయ్

పదహారు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది. యండాకాలానికీ వానాకాలానికీ మధ్యలో ఒక రోజు రాత్రి. గాలి తోలటం లేదు. చూరు కింది అరుగుపై బొంత పరుచుకొని పడుకుని వున్నాడు బుట్టోడు. వాని నాయన శివుడు కొట్టంలో సంగటి తింటూ వున్నాడు. ఆ ఇంట్లో వాళ్లిద్దరే. ఆపొద్దు వాళ్లింట్లో సియ్యలకూర. రెడ్డేరి ఇంట్లో మాంచి గుడ్లకోడిపెట్ట. రోగం తగిలి ఆ రోజే తూగి చచ్చింది. చచ్చిన కోడిని రెడ్డేరు తినరు. తోటకు కావలి కాస్తూ ఇతర పనులు చూసుకునే శివునికి ఇచ్చారు. దాన్ని కోసి కూరజేసి, రెడ్డేరింటికాడ రెండుముద్దల సంగటి అడిగిపెట్టించుకొని, వస్తూవస్తూ రెండు పాకెట్ల సారాయి కూడా తెచ్చుకొని పండగ జేసుకుంటున్నాడు శివుడు. గుండెకాయ, గుడ్డుసొన లాంటి మెత్తనివన్నీ బుట్టోనికి తినిపించి, ఎముకలను కూడా మిగలనీయకుండా జుర్రేస్తున్నాడు. వాళ్ల నాయన అట్టా తింటూవుంటే బుట్టోనికి భలే సంబరం. పైన చుక్కలను చూస్తూ ఇంట్లో నుంచీ వచ్చే శబ్దాలను ఆనందంగా వింటున్నాడు. సియ్యలకూర తిన్నప్పుడు మాత్రమ...

అమెరికాలో కరంటు పోయింది

ఎప్పుటిమాదిరిగా సిన్నప్పుటి సంగతి కాకుండా, ఈ నెల్లో రోంత యేరేగా సిన్న కతట్టాడిది చెబ్దామని... ఆదివారం. సాయంత్రం ఆరున్నరయింది. ఇల్లంతా శుభ్రం చేసి, షవరు కింద తలస్నానం చేసి ఫ్యాను కింద నిలబడినాడు సోమూ. ఫ్యాన్ గాలికి జుట్టు తడియార్చుకొంటూ అలసటలో హాయిని అనుభవిస్తున్నాడు. అతని పారవశ్యాన్ని భగ్నం చేస్తూ ఇంటిబయట ఢాంమ్మని శబ్దం. కిటికీవైపు చూశాడు. కళ్లు మిరుమిట్లుగొలుపుతూ మెరుపులు. వాటి వెంబడి, దిక్కులు పిక్కటిల్లజేస్తూ ఉరుములు. పడగ్గదిలోని విద్యుద్దీపం కన్నుకొట్టింది. ఫ్యాను కూడా ఒక క్షణం ఆగి మళ్లీ వేగమందుకొంది. గబగబా చల్లాడమూ చొక్కా తొడుక్కున్నాడు. బయట జోరుగా వర్షం కురుస్తున్న శబ్దం. విసురుగా గాలివీచింది. పెద్దపెద్ద చినుకులు కిటికీని దబదబా బాదుతున్నాయి. ఉన్నట్టుండి కళ్లముందు చీకటి. ఫ్యాను తిరగడం ఆగిపోతున్న చప్పుడు. తాళాలూ, జేబువాణి(mobilePhone), చేజోలె( wallet ) తీసుకున్నాడు. వర్షాన్ని చూద్దామని బయటికెళ్లాడు సోమూ. భీకరంగా వుంది వాతావరణం. 'ఈ అమెరికాలో ఏమొచ్చినా భారీగానే వుంటుంది' అనుకున్నాడు. అరగంట గడిచింది. వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంట్లోకి వెళ్లాలంటే లోపల ఉక్కపోత. హరికేన్ లాంటి ...

జిమ్మీ అటాక్ - 2

మల్ల కొన్ని నెల్ల కు ... ఇంకో చిన్న కుక్కపిల్ల. యర్రమన్ను రంగు. మూతి నలుపు. టైగర్ సోదరుడే. దీనికి మాత్రం మేం పేరు పెట్టగుడదు అనుకున్న్యాం. టైగర్ చచ్చిపొయినాఁక, కుక్కలు ఎన్నాళ్లు బతుకుతాయి అని కనుకున్న్యా. డాగ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాన్ - అంటారు గానీ, మహా ఐతే అది పదీ పన్నెండేండ్ల ఫ్రెండ్షిప్పే - యెంత జాతికుక్కయినా . అందుకే ఈ కుక్క పిల్లను ముద్దుజెయ్యకూడదు అనుకున్న్యాం. పొద్దన్నుంచి రేడియోలో కామెంటరీ వస్తాంది. ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ టోర్నమెంటు. ఇండియా గెలుస్తుందనే అనుకున్న్యాం. ఓడిపోయింది. కారణం జిమ్మీ ఆడమ్స్ బ్యాటింగ్. ఆ రకంగా కుక్కపిల్లకు జిమ్మీ అని పేరుబెట్టినాం. 'జిమ్మీ వుస్కో' అంటే ఏంబాగుంటాది? వుస్కో బదులు 'జిమ్మీ అటాక్' అంటే బాగుంటాదిగదా, మనకు ఇంగ్లీషు వచ్చినట్టుగూడా కనబడతాదని 'అటాక్' అలవాటుజెయ్యాలనుకున్యాం. మళ్లో దొంగగొడ్డు వొచ్చి పడబోతాందనుకో, అప్పుడు 'జిమ్మీ అటాక్' అన్యాం. సరైన కుక్కపిల్లైతే గొడ్డును తరమాల గదా? ఊహూఁ! తోక వూపుతా దగ్గరకొచ్చింది. ఇట్ల చెబితే దీనికి తెలీదని, 'వాయమ్మో..దొంగ గొడ్డు..మడి మొత్తం నాశనంజేశ..జిమ్మీ అటాక్'...

జిమ్మీ అటాక్ - 1

కుక్కలకు పేర్లుంటాయని మాకప్పుడు తెలీదు. మేం బట్టుపల్లెలో వుండగా మాఇంట్లో ఒక కుక్క వుండేది. మా తాత మంచానికి బారడు దూరంలో కుచ్చోనుండేది. రోజుకు రెండుపూటలు దాని గిన్నెలో దానికి అన్నం. ఆయన తినేముందు దానికీ ఒక ముద్ద సంగటో అన్నమో పెట్టేవాడు. ఆ దారిన ఎవరు కదిలినా గుర్ర్‌ర్ మని బెదిరించేది. భలే కుక్క అనేవాళ్లు మా తాతతో పనిబడి వచ్చినోళ్లు. అది జాతికుక్కేమీ కాదు. ఊరకుక్కే సంతానమే. ఐతే దానిజాతిలో అది గొప్పదేనని మా తాత మోజుగా పెంచినాడు. మావాళ్లంతా మడికాడికి పోయినా, మా తాతపక్కనే వుండి ఇంటికి కావిలి కాసేది. కొన్నేండ్లు పొయినాయ్. ఒకసారి ఏదో రోగం తగిలి పల్లెలో శానా కుక్కలు సచ్చినాయ్. వాటితో పాటే మాదీ. దాని కతలు నాకేం గుర్తులేవు. మేము పల్లెనొదిలి మా సంతనానికి (సంత వనానికి) వొచ్చేసినాం. ఐదోతరగతిలో. ఇంటి సుట్టూరా మడి, మామిడిచెట్లూ, కాలవలూ కట్టలూ, గెడ్డీ గ్యాదం వుండటాన కోళ్లకూ గొడ్లకూ మంచి అనువు. బావురుపిల్లులకూ ముంగీసలకూ అనుకూలమే. కల్ల భద్రంగా వున్న్యాగాని దొంగగొడ్లు రాత్రిపూటొచ్చి మళ్లోఁబడి మేసిపొయ్యేటియి. అడివిపందులూ ఊరపందులూ కూడా వొచ్చి చెనిక్కాయలు లోడేటియ్యి. ఇంటి సుట్టూరా పురుగూ పుట్రా తిరుగుతా వు...

అలాల్ - ముద్దార్

"కోళ్లను అమ్ముకుంటే లెక్కొస్తాది. కోసుకుంటే యేమొచ్చా౨దీ?" ఇది మాయమ్మ చెప్పే మాట. చెప్పాల్సిన పన్ల్యా. అమ్ముకుంటే లెక్కొస్సాదని అందరికీ తెలిసిందే. కోసుకుంటే ఏమొచ్చా౨ది? గుడ్లకోడి పులుసు వొగిరిచ్చుకుంటా తినేవోళ్లందరికీ తెలుసు మజా. ఎంత తెలిసినోళ్లకైనా సరే, ఇంట్లో ఎన్ని కోళ్లున్యా సరే, మాంచి గుడ్లకోడిపెట్టను కోస్కోని తినాలంటే గుండెనిబ్బరం కావాల్సిందే. ఎందుకంటే దాన్ని అమ్ముకున్యా లెక్కే. గుడ్లుబెట్టనిచ్చి పొదగబెట్టినా లెక్కే. సరివేలుకిచ్చినా లెక్కే. రోగాలకూ బావురుబిల్లులకూ ముంగీసలకూ గద్దలకూ డేగలకూ పొయ్యేటియి పోతాండఁగా, పుంజులూ పెట్టలూ బొమ్మెలూ పిల్లలూ అన్నీ కలిపి రోంత అటూయిటూగా నూటాయాబై కోళ్లదాకా వుంటేటియ్యి మా ఇంట్లో. అది మామిడికాయల కాలం. మా అమ్మమ్మా-తాతా మా ఇంటికొచ్చి, నాల్రోజులు వుండమంటే వున్యారు. మా తాత మధ్యానం పూట సేరు నిండా వొడ్లు ముంచుకొని, మా ఇంటి ముందరి మామిడిచెట్టు కాణ్ణించి పెద్దమామిడి చెట్టుదాకా, ఒక సుట్టు వొడ్లు జల్లి బబ్బబ్బబ్ అని పిలిస్తే... యేయే చెట్లకింద, పాదులకింద, కాలవల్లోనో యారకతింటా వుండే కోళ్లన్నీ రెపరెపరెపా రెక్కలు కొట్టుకుంటా ఎగిరొచ్చి వాలిపొయ్యేటియి. బొమ్...

గాలి తోలగూడదు - వాన పడగూడదు

శానా పొద్దుబొయినాఁక, ఇంటికాడ అన్నాలు కానిచ్చి, నేనూ మా నాయినా మెల్లిగా అట్టా మా చిన్నతోటలో తిరుగుదామని బైటికొచ్చినాం. చేతిలో మూడుబ్యాటరీల టార్చిలైటుతో మా నాయన ముందు నడుస్సాండాడు. ఆయన అడుగు తీసినచోట అడుగుబెడతా యనకమ్మడీ నేను. శానా చిన్నప్పుట్నుంచిగూడా నేను మా నాయనతో నడిసినప్పుడల్లా కాలిబాటన మట్టిలో ఆయన అడుగుగుర్తు పడఁగానే ఆ గుర్తుమిందనే నా అడుగు మోపి నడవడం నాకలవాటు. ఆ మాదిరిగా నడిస్తే నేను తేలునో పామునో తొక్కేదానికి ఆస్కారముండదు. ఆ మాదిరిగా నడిస్తే పెద్దయినాఁక నేనూ మా నాయన మాదిరిగా భయం లేకండా మళ్లంబడీ తోటలంబడీ రాత్రుళ్లు పాములకూ, మండ్రగబ్బలకూ, గోరీలకాడ దయ్యాలకూ, కావిలి కుక్కలకూ బెదరకండా ఏ జామునంటే ఆ జామున తిరగ్గలనని నమ్మిక. మా చిన్నతోట పక్కన సాకేరామన్న తోట. రెంటికీ మధ్యన రోంత ఖాళీ జాగా. ఆ సవుడు జాగాలో బతకల్యాక సావల్యాక అన్నిట్టుగా వుండే మామిడంట్లు. రోజు మార్చి రోజు పట్టుదలగా ఆ అంట్లకు బిందెల్తో నీళ్లు పోసీ పోసీ వాటిని పెద్దజెయ్యాలని చూస్తానే వుండారు. ఎన్నెల పడి ఆ సౌడున్యాల తెల్లగా మెరుస్తాంది. సల్లగా గాలి తోల్తా వుంది. ఆ గాలికి ఇటు మాతోటలో, అటు సాకేరామన్నతోటలో మామిడాకులు సలసలమని కదుల్తా...

పెట్లగొడతా !

మా అమ్మోళ్ల నాయనకు నేనంటే చానా ఇష్టం. నా తరవాత ఆయనకు ఏడుమంది మనమండ్లూ మనమరాండ్లూ కలిగినా నామిందనే ఆయనకు బ్రమలెక్కువ అనేవోళ్లు. ఆ బ్రమ గుఱించి మాయమ్మ మాటిమాటికీ వొక సంగతి చెప్పేది. ఒకనాడు నేను గమ్మున కుచ్చోనుంటే మా గోపీగాడు పరిగెత్తుకుంటా వచ్చి గోళ్లతో నా మొగంమింద కచ్చగా గిచ్చినాడంట. అప్పుడే దేవునింట్లో దీపానికి దండంబెట్టి బయటికొచ్చినాడంట, ఇదంతా ఆయన కంటబడింది. నేను నొప్పికి తట్టుకోల్యాక ఏడ్సినానంట. గుడ్లురుముతా పళ్లుకొరుకుతా మా గోపీగాని చెంప పగలగొట్టి, కోపం చల్లారక మొగం యర్రబారి, బుసలుగొడతా, వూగిపోతా, చూపుడువేలు చూపిస్తా "పెట్లగొడతా ఏమనుకున్యావో" అన్యాడంట. అప్పటికి మా గోపీ వయసు మూడేండ్లు కూడా వుండదంటుంది మాయమ్మ. ఆయన అంతగా సోదీనం తప్పడం ఇంట్లో అందరికీ చానా నొప్పిగలిగించినట్టుంది. "పెట్లగొడతా" అనే మాట గుర్తుండిపోయింది. ఈ మాటను ఆయన తప్ప ఇంగెవురూ అనంగా నేను విన్లా. ****** ****** ****** ఆం. ప్ర. బాలుర గురుకుల పాఠశాల, ముక్కావారిపల్లెలో ఎనిమిదో తరగతి చివరిదినాలు. మాకన్నా ముందు పదోతరగతికి పరీక్షలు. ఏడు, పది తరగతులు ఒక హౌసులో. దాని ఎదురుగా స్టాఫు రూము,...

అమ్మను తిట్టగాకురా నీయమ్మనాయాలా

మా యీరబల్లెలో సుబ్బమ్మ అని పాపం ఒక ముండమోపామె వుండేది. నేను శ్రీ శ్రీనివాసా కాన్వెంటుకు పొతాన్నెప్పుడు చేత కట్టె బట్టుకొని, అడుగులోఅడుగేసుకొంటా, మెల్లిగా రోడ్డెంబడీ శివయ్యంగడికాడికి వస్తా కనబడేది. ఆఖరిగా ఏడోతరగతి పబ్లిక్ పరీచ్చలప్పుడు చూసినానంతే. ప్రతిదినామూ కనిపిచ్చే సుబ్బమ్మకు పాపం ఎవురూ లేరని నాకెవరో చెప్పినప్పుడు - "ఐతే, ఆమెప్పుడన్నా పాలుమాలితే ఏమి గతీ?" అనేది నాకొచ్చిన మొదటి అనుమానం. యాల్నంటే, కాన్వెంటుకు పొయ్యి వచ్చేటప్పుటికి నాకు దినామూ తల నొచ్చేది. దొంగ తలనొప్పి కాదు. నాకు తలనొస్తే మా నాయనకు తలనొచ్చినట్టుగా బాధపడతాడు. మాయమ్మ ఆముదం పట్టు వేసేది. కణతలు నొక్కేది. కాఫీ జేసిచ్చేది. అనాసిన్ సగం తుంట మింగిచ్చేది. పాత గుడ్డతో తలను బిగిచ్చి కట్టేది. కాళ్లొత్తేది. నేను నిద్దరబొయ్యేదాక ఆణ్ణించి కదిలేదిగాదు. ఇట్టగాదన్జెప్పి కాన్వెంటు మానిపిచ్చేసింది. సుబ్బమ్మకు తల నొస్తే ఏమి గతి? జొరమొస్తే కాళ్లొత్తే మాట పక్కనబెట్టు, రోంత కూడు వుడకేసేవోళ్లెవురు? ఎవురో వొగరు వుంటార్లే అనుకుండేదానికిల్యా. యేమంటే, సుబ్బమ్మ మొగం జూస్తే దరిద్రమని మా కాన్వెంటు పిల్లకాయల నమ్మిక. బడికిపొయ్యేటప్పుడు గడిగో...

వసన్ తోళ్లపల్లె మాట

మా అవ్వోళ్ల అమ్మగారివూరు వసంతవాండ్లపల్లె. ఆ వూరేమన్నా పాడిపంటల్తో తులతూగుతా వుంటాదా అంటే, ఏమీ లేదు. వాళ్లంతా బాగా లెక్కలున్నోళ్లా? ల్యాపోతే తిని బలిసినోళ్లా అంటే అదీగాదు. అందురూ అంతంతమాత్రం మణుసులే. ఆ పల్లెలో యేమున్న్యా ల్యాకన్న్యా కుశాలమాటలు మాత్రం యాడజూసినా యినబడతాంటాయ్. ఇద్దురు మణుసులు ఎదురుపణ్ణారంటేసాలు, రెండు యెగతాళి మాటలైనా రాలాల్సిందే. వరసైన ఆడమనిసి పోతాందంటే ఏదోఒకటి అనకండా పోనీరు. ఆ మనిసిమాత్రం? యాడ తగలాల్నో ఆడ తగిలేటిగా జవాబు చెప్పకండాబోదు. ఇయ్యన్నీ నాకెట్టదెలుసు అంటే, సెలవుల్లో నేనా వూరికి పోతాగదా! ఎవురితోట పోతా? మా సిన్నాయనతోట. మా సిన్నాయనంటే మా అక్కులవ్వ కొడుకు. అక్కులవ్వంటే మా నాయనమ్మకు సొంత అక్క. మా సిన్నాయనోళ్లుండేది మూలపల్లెలో. మూలపల్లెలో ఈ మూల కేకబెడితే వసంతవాండ్లపల్లెలో ఆ మూలకు బ్రమ్మాండంగా యినబడతాది. రెండుపల్లెలకూ మధ్యలో వొగ బండ్లబాట అడ్డమంతే. నేను వసంతోళ్లపల్లె అంటాండాగానీ, మా సిన్నాయనైతే వసన్‌తోళ్లపల్లె అంటాడు. వాళ్ల మేనమామగారిని వసన్-తోళ్లు అంటాడు. ************* నాకు గుర్తులేదుగానీ, మా అక్కులవ్వచెప్పేది - ఒక మంచి ఆవుండేదంట. పొద్దున్నే దాని పొదుగుకడిగి పాలు పిండుతా...

పారిగోడ పడిపోయిన కత

వారంనాళ్లుగా పట్టినముసురు పట్టినట్టేవుండాది. జోరుగా వాన కురుస్తాంది. మా పెంకుటింటి వరండాలో మంచాలమింద కుచ్చోనుండాము నేనూ, మాయవ్వా, మా గోపీ, మా మామ. మామా అని పిలవడం మాకు అలవాటుజేసినారుగానీ నాకంటే రెండున్నర నెలలే పెద్ద. మా అత్తమ్మ కొడుకు. వరండా ఎదురుగ్గా పారిగోడ. ఆ ఇటికెలగోడ కింద మోకాటెత్తుదాఁక వుండాల్సిన గునాదిరాళ్లు మాత్రం లేవు. దాంతో పారిగోడ గాల్లోనిలబడినిట్టుగా వుండాది. ఆ గోడకిందికి పిల్లాపీచూ గొడ్డూగోడా రాకండాజూస్తాంది మాయవ్వ. వానజోరు పెరిగేగొదికీ మా పారిగోడ పర్ర్‌మని, రోంత పక్కకు ఒరిగినిలబడె. తోస్తేపడేటట్టుగా వుండాది. మాయవ్వ శానా బాదపడిపాయ. మా మామగూడా అవ్వతోపాటు బాదపడతాండాడు. "ఆ గోడకట్టేదానికి అంత శం-బడితిమి ఇంత శం-బడితిమి, అంతంత సిమ్టీ(సిమెంటు) పోసి నిలబెడితిమి, ఆ సిమ్టీ గెట్టిపడేదాఁకా పీర్రాతికాణ్ణించీ నీళ్లుమోసకచ్చి ఒకమొయిన పోసిపోసి వొడబడితిమి" అని మొదులుబెట్టింది మాయవ్వ. "యట్టా పడేదేగదా, నేనే తోసిపడేచ్చా౨" అంటా మంచం దిగితి. గోపీ కూడా దిగబాయె. "పెద్ద పయిలుమానువేలే, మర్యాదగా వొచ్చి మంచం మింద కుచ్చో" అవ్వ నన్ను కసిరిన కసరటానికి గబుక్కున మంచమెక్కేసినా....

కోదండరామాంజులు

మనిసన్న్యాక రోంత సున్నితముండాల. మొద్దుబారగూడదు. మనిషి మొద్దుబారితే ముందు వానికేనష్టము, మల్లనే మిగతాజనానికి నష్టము. ఎవురైనా యెందుకుమొద్దుబారతారు అంటే వొగ సిన్న కజ్జెప్తా. నేను మూడోతరగతివరకూ మా బట్టుపల్లెలో నాగన్నైవోరిబళ్లోనే సదువుకున్న్యిట్టు చెప్తిగదా. శ్రీ శ్రీనివాసాకాన్వెంట్లో నాలుగోతరగతిలో జేరేటప్పుటికి రోంత ఆలస్యమయింది. అప్పుటికే ఇరవైమూడుమంది పిల్లకాయలు చేరిపొయ్యుండారు. శానామంది వొకటోతరగతి నుంచి కాన్వెంట్లో సదివినోళ్లే. వోళ్ల పేర్లుగూడా ఏబీసీడీల ప్రకారమూ తిరగరాసి నంబర్లుగూడా ఇచ్చుండారు. రెడ్డొచ్చ మొదులుబెట్టు అనేమాట మా నాగన్నైవోరిబళ్లో చెల్లుబాటౌతుందేమోగానీ శ్రీశ్రీనివాసాకాన్వెంట్లో కాదుగాబట్టి "టొంటీఫో..ర్" అంటే "ప్రజెన్ మాస్టే" అని పలకాల. మేడమైతే "యస్ టీచే" అనాల. నాగన్నైవోరిబళ్లోమాదిరిగా చింతచెట్టుకింద ఇసకలోగాదు, బోదకొటంలో బండలమింద గంటలతరబడి మెదలకండా కుచ్చోవాల. ఆరంకణాల కొటంలో నాలుగోతరగతి ఒకపక్కకూ, ఐదోతరగతి ఇంగోపక్కా మల్లుకొని కూచ్చోవాల. రెండు తరగతులకూ మధ్యలో వుండే దూలానికి కోదండం యాలాడతాంటాది. కోదండ మంటే దూలానికి దండమాదిరిగా కట్టిన రెండుమూరల నులకతాడు...

యీటి రంగే పచ్చనేమో సామీ!

మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, గోగాకు ఊరిమిండి, అన్నీ కలిపికొట్టి యింగో పుల్లగూరా, యిట్ట యెన్నిజేసినా నాకు మాత్రం యిష్టంగా ముద్ద దిగేదిగాదు. అన్నిట్లో వం, బెం, టం, గోం. యింట్లో ఎవురికీ బువ్వ మాత్రం సగించేదిగాదు. ఆ చెట్లల్లో తిరిగి, పుచ్చులు యేరేసి, పండుగాయలు పారేసి, మల్లా అయ్యే తినాలన్యా తింటారేమోగానీ, కాయలు కోసి మూటగట్టి గంపలకెత్తి, బస్సులో మనుషులకూ లగేజికీ చార్జీలు బెట్టి రాయచోటికి యేసకపొయ్యి మండీల్లో అమ్ముకోని యింటికొచ్చి లెక్కజూసుకుంటే, కూలీలు బోఁగా యాభై నష్టమని వొగరోజు, పద్నాల్రూపాయిలు లాభమని యింగోరోజు తేలేటప్పుటికి ఎవురికైనా తిండి సగిస్తాదేమో నువ్వేజెప్పు! సీలకూర తినాలని గెట్టిగా అనిపిచ్చింది. మా నాయన, పండ్లు ల్యాకపొయ్‌నా మా తాత - సీల కూరకు ఎప్...