ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కోదండరామాంజులు

మనిసన్న్యాక రోంత సున్నితముండాల. మొద్దుబారగూడదు. మనిషి మొద్దుబారితే ముందు వానికేనష్టము, మల్లనే మిగతాజనానికి నష్టము. ఎవురైనా యెందుకుమొద్దుబారతారు అంటే వొగ సిన్న కజ్జెప్తా.

నేను మూడోతరగతివరకూ మా బట్టుపల్లెలో నాగన్నైవోరిబళ్లోనే సదువుకున్న్యిట్టు చెప్తిగదా. శ్రీ శ్రీనివాసాకాన్వెంట్లో నాలుగోతరగతిలో జేరేటప్పుటికి రోంత ఆలస్యమయింది. అప్పుటికే ఇరవైమూడుమంది పిల్లకాయలు చేరిపొయ్యుండారు. శానామంది వొకటోతరగతి నుంచి కాన్వెంట్లో సదివినోళ్లే. వోళ్ల పేర్లుగూడా ఏబీసీడీల ప్రకారమూ తిరగరాసి నంబర్లుగూడా ఇచ్చుండారు.

రెడ్డొచ్చ మొదులుబెట్టు అనేమాట మా నాగన్నైవోరిబళ్లో చెల్లుబాటౌతుందేమోగానీ శ్రీశ్రీనివాసాకాన్వెంట్లో కాదుగాబట్టి "టొంటీఫో..ర్" అంటే "ప్రజెన్ మాస్టే" అని పలకాల. మేడమైతే "యస్ టీచే" అనాల. నాగన్నైవోరిబళ్లోమాదిరిగా చింతచెట్టుకింద ఇసకలోగాదు, బోదకొటంలో బండలమింద గంటలతరబడి మెదలకండా కుచ్చోవాల.

ఆరంకణాల కొటంలో నాలుగోతరగతి ఒకపక్కకూ, ఐదోతరగతి ఇంగోపక్కా మల్లుకొని కూచ్చోవాల. రెండు తరగతులకూ మధ్యలో వుండే దూలానికి కోదండం యాలాడతాంటాది. కోదండమంటే దూలానికి దండమాదిరిగా కట్టిన రెండుమూరల నులకతాడు. మార్కులు తక్కువొచ్చిన పిల్లకాయలనూ, రోజూ బడికి ఆలస్యంగావొచ్చే పిల్లకాయలనూ కోదండం ఎక్కిస్తారు. ఎక్కినోళ్లు కిందికి దిగేటప్పుటికి వాళ్ల తాతముత్తాతలతో సహా దిగుతారు!

నేను చేరిన ఐదునాళ్లకే యూనిట్ టెస్టులు. మల్లికార్జున మాస్టర్ క్లాసులో ఇరవై ఐదుకు ఒక మార్కు తక్కువొస్తే ఈతబర్రతో అరచేతిమింద ఒకదెబ్బ. ఇరవైకి తక్కువొస్తే చెక్కస్కేలుతో చేతివేళ్ల గెనుపులమింద స్కేలుగేడితో దెబ్బలు. పదహైదుకు తక్కువొస్తే క్లాసయిందాఁకా గోడకుర్చీ. అంతకు తగ్గితే కోదండం. కొత్తగాబట్టి నేను యూనిట్‌టెస్టు రాయలా.

నా ఖర్మకాలి నన్నూ ఏదో వొగరోజు కోదండం ఎక్కిస్సారేమో, అదెట్టుంటుందో సూజ్జా౨మని నాకునేనుగా వొగట్రెండుసార్లు స్టూలెక్కి కోదండానికి యాలాడి చూసినా. యాలాడఁగానే వేళ్లు అంటగరసకపొయ్యేటిగా నొక్కేస్తాది. అర్దనిమిషం గూడా వుండల్యాకపొయినా.

యూనిట్‌టెస్టులో రామాంజులుకు మార్కులు ఐదోఆరో వొచ్చినాయి. అప్పుడు మా కాన్వెంట్లో శానామంది రామాంజులులుండేవోళ్లు. వొక్క పోలోళ్లపల్లె నుంచే ముగ్గురు రామాంజులులు. వీళ్లుగాక పోలోళ్లపల్లెనుంచి ఒక రామాంజులు మాస్టరు కూడా వున్యాడు.

ఐదారుమార్కులొచ్చిన రామాంజులును నడుము పట్టుకొని, రెండు అరచేతుల మధ్యలో కోదండం అందేదాఁక పైకెత్తి, ఆ తాడు మీదిగా రెండుచేతులవేళ్లను పెనవేయమని చెప్పి, వదిలేసినాడు మల్లికార్జున మాస్టర్. వేలాడే ఒళ్లు బరువుకు చేతివేళ్లను ఊడిరానీయకుండా కోదండం నొక్కుతావుంటే యట్టుంటాదో రామాంజులును అడగాల్సినపన్ల్యా.

వొగపక్క రామాంజులును కోదండమెక్కించి, ఇంగోపక్క కొందరిని గోడకుర్చీవేయిచ్చి, మల్లికార్జునమాస్టర్ మాకు పాఠం మొదులుబెట్టినాడు. పదైదు నిమిషాలయుంటాది. గోడకుర్చీ యేసినోళ్లు యేడ్సినారు గాని, రామాంజులు మాత్రం కుయ్యికయ్యిమన్ల్యా. పాఠమయినాఁక కిందికి దించితే వేళ్లు నలుపుకుంటా ఉఫ్ ఉఫ్ప్‌మని ఊదుకుంటా కుచ్చున్న్యాడు.

ఆ తరువాత క్లాసు రసూల్ మాస్టర్‌ది. పదైదు మార్కులకంటే తక్కువొచ్చినోళ్లు మాస్టర్ కుర్చీముందుండే బల్ల కాలికింద చేతివేళ్లునాలుగూ పెట్టాల. మాస్టరు బల్లమింద మెల్లగా కుచ్చోని నొక్కుతాడు. రోంచేపు యేడిస్తే తీసేస్తాడు. రామాంజులు యేడ్సడే! నొప్పి జాచ్చీ అయితే ఆ అని నోరుదెరుచ్చా౨డుగాని యాడ్సడు.

అల్లరోడా అంటే కాదు. సదవడా అంటే, దించిన తల ఎత్తకండా సదువుతాడు. మార్కులొచ్చా౨యా అంటే రావు. యీడింతేనని మాస్టర్లు వొదుల్తారా అంటే వొదల్రు. ఒక్కనాడు గాదు, ఆ వొక్క పరీక్షగాదు, సమచ్చ౨రం పొడుగునా యింతే.

రామాంజులుకు యెట్టుండేదో యేమోగాని, ఆ బాదలు చూసేదానికి మాత్రం శానా నిబ్బరం గావాల.

కామెంట్‌లు

Srinivas Sirigina చెప్పారు…
అమ్మో తలచుకుంటేనే వళ్ళు జలదరిస్తుంది. పాపం రామాంజులు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డెమ్మ డెక్క డాలి

నా పైతరగతోళ్లు ఒగ ఇద్దురు పిల్లకాయలు నాగన్నైవోరి బడికి ఎగనామంబెట్టి వంకలో బుడ్డపక్కెలు (ఒక చేప జాతి) పట్టేదానికి బొయి, వాళ్లమ్మో నాయనో జూసి "*న్‌జా కొడకల్లాలా బడికి బోకండా వంకలంబడీ కాలవలంబడీ ఏమి యారకతినే పన్జేచ్చాండార్రా" అని చేతిలో ఈతబర్రతో యంటబడితే సచ్చితిం బతికితి మని వోళ్లకు దొరక్కండా *న్‌కోని పైన ఉరికినారనుకో - ఈ తమాసా సూసినాంక ఎవురికన్నా సెప్పిందాంకా అన్నం సగిచ్చదుగదా మనకు! వొగేల (ఒకవేళ) సెప్తే ఇంట్లో జెప్పాల. ఇంట్లో జెప్పాలంటే వాళ్లమ్మానాయినా తిట్టిన తిట్లు సెప్పలేము. ఆమాటలు ఎవురో అన్న్యారని కూడా నా నోటెమ్మట రాగూడదు. వొస్తే చెంప పగుల్తాదని తెలుసు. 'న్‌జాకొడకల్లాలా' అనే మాటల్యాకంటే (లేకుంటే) దాంట్లో తమాసా ఏముండాది? ఇంట్లోగాకండా ఇంగెవురికన్నా సెబుదామా అంటే - "రెడ్డేరిపిల్లోళ్లట్టాంటి మాటలు మాట్టాడర"ని ఊర్లో మనకు 'మంచిపేరుం'డాదే! మాట్టాడతాండామని ఇంట్లో తెలిచ్చే బాగుండదు. సూసినా!? మంచిపేరు ఒగోసారి అంత మంచిదనిపీదు. ఊరంతా మాట్టాడతారు. మా నాయనగూడా, ఇంట్లో మాట్టాడ్డుగానీ, బైట మాట్టాడ్డం మొచ్చుగా (మస్తుగా) జూసినాము. మా తాతగూడా అంతే. నేను మాత...

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత...

తాతగారి అనుపమితోపమానము

పన్ల కాలం. అందురూ మడికాడికి బొయినారు. అన్నదమ్ములమిద్దరమూ ఇంటికి కావిలి. మాక్కావిలి మా తాత. పొద్దన్నుంచీ సింతసెట్టుకింద నిలబడి సూచ్చాండాం, ఆడుకుండేదానికి పిల్లకాయలెవురన్నా వచ్చారేమోనని. యంతసేపు జూసినా వొక్కడూరాల్యా. మేమిద్దరమే రోంచేపు ఏమన్నా ఆడుకున్యామంటే అది కొట్లాటే. ఊళ్లో పిల్లాపెద్దా అందురూ పన్లకు బొయినిట్టుండారు. వొగ మనిసిగాని గొడ్డూగోదాగాని యెవురేగాని బైట కనపరాల్యా. వడగాలికి సింతసెట్టు కింద నిలబడుకొనుంటే కంసలోల్ల యీరయ్య కొలిమికాడున్నిట్టు అగ్గి సెగ. పడమటగాలి. గాలితోలే సద్దు తప్ప వొక్క పక్షిగూడా యాణ్ణేగాని కూత గూడా బెట్లా. కోళ్లు మాత్రం ఇంటి ముందరుండే సర్కారుకంపచెట్లల్లో చెదులు కోసం చిదుగుతాండాయి. ఉన్నిట్టుండి పెద్దకోడిపుంజు దిగ్గునలేసి బెదురుగా నిలబడె. బొమ్మెలన్నీ యెక్కడియ్యక్కడ నిల్చిపొయ్యి మెడలు పైకెత్తి బీతుగా దిక్కుల్జూశ. పెద్దపుంజు వొగ కన్నుతో ఆకాశంకల్లా తేరిపారజూస్తా సన్నగా కుర్‌ర్‌ర్రుమనె. అట్లనేటప్పుడు దాని ఈకలన్నీ మెరుగుతగ్గి వొంటికి అంటగరసకపాయ. బొమ్మెలన్నీ యెప్పుడు దూరుకున్యాయో యెనుముల కొటంలేకి దూరుకున్యాయ్. పెద్దపుంజుతోపాటుగా పిల్లలకోడిగూడా వసారాలోకి దూరె. "గద్దకయ...