ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

పారిగోడ పడిపోయిన కత

వారంనాళ్లుగా పట్టినముసురు పట్టినట్టేవుండాది. జోరుగా వాన కురుస్తాంది. మా పెంకుటింటి వరండాలో మంచాలమింద కుచ్చోనుండాము నేనూ, మాయవ్వా, మా గోపీ, మా మామ. మామా అని పిలవడం మాకు అలవాటుజేసినారుగానీ నాకంటే రెండున్నర నెలలే పెద్ద. మా అత్తమ్మ కొడుకు. వరండా ఎదురుగ్గా పారిగోడ. ఆ ఇటికెలగోడ కింద మోకాటెత్తుదాఁక వుండాల్సిన గునాదిరాళ్లు మాత్రం లేవు. దాంతో పారిగోడ గాల్లోనిలబడినిట్టుగా వుండాది. ఆ గోడకిందికి పిల్లాపీచూ గొడ్డూగోడా రాకండాజూస్తాంది మాయవ్వ. వానజోరు పెరిగేగొదికీ మా పారిగోడ పర్ర్‌మని, రోంత పక్కకు ఒరిగినిలబడె. తోస్తేపడేటట్టుగా వుండాది. మాయవ్వ శానా బాదపడిపాయ. మా మామగూడా అవ్వతోపాటు బాదపడతాండాడు. "ఆ గోడకట్టేదానికి అంత శం-బడితిమి ఇంత శం-బడితిమి, అంతంత సిమ్టీ(సిమెంటు) పోసి నిలబెడితిమి, ఆ సిమ్టీ గెట్టిపడేదాఁకా పీర్రాతికాణ్ణించీ నీళ్లుమోసకచ్చి ఒకమొయిన పోసిపోసి వొడబడితిమి" అని మొదులుబెట్టింది మాయవ్వ. "యట్టా పడేదేగదా, నేనే తోసిపడేచ్చా౨" అంటా మంచం దిగితి. గోపీ కూడా దిగబాయె. "పెద్ద పయిలుమానువేలే, మర్యాదగా వొచ్చి మంచం మింద కుచ్చో" అవ్వ నన్ను కసిరిన కసరటానికి గబుక్కున మంచమెక్కేసినా.