ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

గాలి తోలగూడదు - వాన పడగూడదు

శానా పొద్దుబొయినాఁక, ఇంటికాడ అన్నాలు కానిచ్చి, నేనూ మా నాయినా మెల్లిగా అట్టా మా చిన్నతోటలో తిరుగుదామని బైటికొచ్చినాం. చేతిలో మూడుబ్యాటరీల టార్చిలైటుతో మా నాయన ముందు నడుస్సాండాడు. ఆయన అడుగు తీసినచోట అడుగుబెడతా యనకమ్మడీ నేను. శానా చిన్నప్పుట్నుంచిగూడా నేను మా నాయనతో నడిసినప్పుడల్లా కాలిబాటన మట్టిలో ఆయన అడుగుగుర్తు పడఁగానే ఆ గుర్తుమిందనే నా అడుగు మోపి నడవడం నాకలవాటు. ఆ మాదిరిగా నడిస్తే నేను తేలునో పామునో తొక్కేదానికి ఆస్కారముండదు. ఆ మాదిరిగా నడిస్తే పెద్దయినాఁక నేనూ మా నాయన మాదిరిగా భయం లేకండా మళ్లంబడీ తోటలంబడీ రాత్రుళ్లు పాములకూ, మండ్రగబ్బలకూ, గోరీలకాడ దయ్యాలకూ, కావిలి కుక్కలకూ బెదరకండా ఏ జామునంటే ఆ జామున తిరగ్గలనని నమ్మిక. మా చిన్నతోట పక్కన సాకేరామన్న తోట. రెంటికీ మధ్యన రోంత ఖాళీ జాగా. ఆ సవుడు జాగాలో బతకల్యాక సావల్యాక అన్నిట్టుగా వుండే మామిడంట్లు. రోజు మార్చి రోజు పట్టుదలగా ఆ అంట్లకు బిందెల్తో నీళ్లు పోసీ పోసీ వాటిని పెద్దజెయ్యాలని చూస్తానే వుండారు. ఎన్నెల పడి ఆ సౌడున్యాల తెల్లగా మెరుస్తాంది. సల్లగా గాలి తోల్తా వుంది. ఆ గాలికి ఇటు మాతోటలో, అటు సాకేరామన్నతోటలో మామిడాకులు సలసలమని క