ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

బొగ్గుల కొలిమి

బట్టుపల్లెకు పడమట దిక్కున ఒకటో రెండో సుంకేసుల చెట్లు తప్ప, కనబడేదంతా రాళ్లచేండ్లూ ఇసకచేండ్లే. తూరూగా సన్నగా వంక పారతా వుంటాది - కొమటోని చెఱువులో అన్ని నీళ్లుంటే. ఎప్పుడన్నా చెరువు నిండితే రోంత వరి పలం నాటుకున్నోళ్లు గూడేస్కుండేదానికి తగినట్టు సిన్న గుంతలు, సాకలోళ్లు గుడ్డలు పిండుకునేదానికి సాకిరేవు, బోయోళ్లు కలమంద పట్టలు ముగరబెట్టుకునే దానికి - జమ్మూ, చుట్టూరా కాకిబుర్రలూ పెరిగిన - మడుగులు, ఎనుములూ వాటితో పాటు రాజుకన్నా బలవంతులైన పిలకాయలూ పొర్లాడే బురద గుంతలు, ఆ దిగవన నాలుగు మామిడి తోటలు వుండబట్టి పల్లెకు తూరుపుదిక్కు కండ్లకు రోంత పచ్చగా కనబడతా వుండేది. ఇప్పుడు వానల్లేవూ, పడినా ఒక రాగాన నీళ్లు పారే పరిస్థితీ లేదు. వొక సమచ్చరం వానాకాలంలో - నాలుగు రోజులు యిడ్సకుండా వానలుబడి, పాలెంపలం కల్లా వంకలు పొంగి, కుంటలు నిండిపొయ్యి, మా కోమటోని చెఱువు కూడా నిండిపొయ్యి మొరవ బోయింది. మా కోమటోని చెఱువంటే చిన్న చెఱువు గాదు. ఆ మొరవ నీళ్లకు పల్లె మొగదాల పీర్రాతి దాఁక నీళ్లతో మునిగింది. వంక వో అని వొగటే మోరుపు. ఆ మోరుపు పడమట నుండే మా ఇంటి దాంకా యినబడతావుంది. తెల్లారకముందే ఊరంతా వంకను చూసేదానికి పొయ్‌నారు.