ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బొగ్గుల కొలిమి

బట్టుపల్లెకు పడమట దిక్కున ఒకటో రెండో సుంకేసుల చెట్లు తప్ప, కనబడేదంతా రాళ్లచేండ్లూ ఇసకచేండ్లే. తూరూగా సన్నగా వంక పారతా వుంటాది - కొమటోని చెఱువులో అన్ని నీళ్లుంటే. ఎప్పుడన్నా చెరువు నిండితే రోంత వరి పలం నాటుకున్నోళ్లు గూడేస్కుండేదానికి తగినట్టు సిన్న గుంతలు, సాకలోళ్లు గుడ్డలు పిండుకునేదానికి సాకిరేవు, బోయోళ్లు కలమంద పట్టలు ముగరబెట్టుకునే దానికి - జమ్మూ, చుట్టూరా కాకిబుర్రలూ పెరిగిన - మడుగులు, ఎనుములూ వాటితో పాటు రాజుకన్నా బలవంతులైన పిలకాయలూ పొర్లాడే బురద గుంతలు, ఆ దిగవన నాలుగు మామిడి తోటలు వుండబట్టి పల్లెకు తూరుపుదిక్కు కండ్లకు రోంత పచ్చగా కనబడతా వుండేది. ఇప్పుడు వానల్లేవూ, పడినా ఒక రాగాన నీళ్లు పారే పరిస్థితీ లేదు.

వొక సమచ్చరం వానాకాలంలో - నాలుగు రోజులు యిడ్సకుండా వానలుబడి, పాలెంపలం కల్లా వంకలు పొంగి, కుంటలు నిండిపొయ్యి, మా కోమటోని చెఱువు కూడా నిండిపొయ్యి మొరవ బోయింది. మా కోమటోని చెఱువంటే చిన్న చెఱువు గాదు. ఆ మొరవ నీళ్లకు పల్లె మొగదాల పీర్రాతి దాఁక నీళ్లతో మునిగింది. వంక వో అని వొగటే మోరుపు. ఆ మోరుపు పడమట నుండే మా ఇంటి దాంకా యినబడతావుంది. తెల్లారకముందే ఊరంతా వంకను చూసేదానికి పొయ్‌నారు. ఇప్పుడు గన(క) చెఱువు తెగిందంటే ఏయే పల్లెలు కొట్టుకొని పోతాయో, బట్టుపల్లెలో ఎవురెవురి యిండ్లు మునిగిపోతాయో సంబరంగా మాట్లాడుకుంటా వుండారు. చెఱువు నిండిందంటే వూళ్లో సంబరం అంతా యింతా గాదులే. మడుగుల్లో చాపలు దొరుకుతాయి, బాగ తినొచ్చునని బిడ్డలు గలోళ్లందరికీ సంబరమే.

గొర్లకూ, గొడ్లకూ, మేకజీవాలకూ పచ్చఁగా గెడ్డీగ్యాదానికి కొదవుండదు. నీళ్లకూ కొదవ ల్యా. ఊళ్లో శానా మందికి గొర్ఱెల మందలు, మ్యాకల మందలు, గొడ్డూగోదా వుండాయి. ఇన్నాళ్లూ వంకలో పచ్చిక ల్యాక, గొడ్లు వొగ తావున మెడొంచి మెయ్యక, పగిగెత్తతా వుంటే వాటిని మల్లెయ్యను చాతగాక యేడిసే పని వుండదింగ. గొడ్లు వూరోళ్ల చేండ్ల మిందబడి మేసిపోతే, వాళ్లు కన్న మాటలూ అంటా వుంటే యిని సగిచ్చినట్టుగా పడుండాల్సిన ఖర్మ యింగ ల్యా. పెద్దోళ్లకు అన్నిటి కంటే పెద్ద సంబడం ఇదే. గంప, కొండ్రకట్టె (తొలిక్కట్టె) చేబట్టుకోని బైటికొస్తే యాడజూసినా పచ్చిగెడ్డే. వొకరి గెనం మింద దొగతనంగానో, వొగరికి లోబడి అడుక్కోని బుడుక్కోని యింత నీటిసలవ తలిగిన పొలాల్లోనో గెడ్డి కోసరం గెడ్డితినాల్సిన పన్లా.

కంసలోళ్లకూ కొలిమి పనులు, కరమలోళ్లకు కొయ్య పనులు జోరుగా మొదలు. చుట్టు పక్కల వూళ్లల్లో రైతులు పనులు మొదలు బెడతారు గదా, అందుకు. కూలోళ్లకు గిరాకీ పెరిగి పోతుంది. పగలంతా చేతినిండా పని, సాయంత్రానికి చేతిలో కూలి దుడ్లు. పొద్దు గూకే తలికీ కడుపు నిండా సారాయి. తాగి వీదిలేకొచ్చి నేఖ్‌క్క నేమ్మా న్యాలీ అని గలాటా పడేవోళ్లూ, గొంతెత్తి యీదినాటకం పద్యాలన్నీ పాడేవోళ్లు, పెండ్లాం బిడ్డలను కొట్టబొయి దెబ్బలు తిని మూలుగుతా నిద్దరబొయ్యే మొగోళ్లూ, మొగుడు తాగినాడని బాదపడే ఆడోళ్లూ, మొగోడన్న్యాక తాగాల్సిందే తన్నాల్సిందేననే ఆడోళ్లూ, యీ తాగుబోతుల సంపాదనతో ఆనందంగా రోజుకో కోణ్ణి కోసుకుని తినే సారాయి యాపారస్తులతో వూరంతా వొగటే కళకళ. తాగినోళ్లతో శానా తమాస గదా!

-------------------------

అట్టాటి తమాసా కాలంలో కరమలోళ్ల యీరయ్య పగులంతా పన్జేసి, రాత్రికి తాగి, యీదిలో మంచమేస్కోని పండుకోని వూరెత్తకపొయ్యేటట్టు పాటలు పాడేవోడు. బ్రమ్మంగారి కాలజ్ఞానం గూడా రాగాలు తీసి పాడేవోడు. వొగోరోజు ఇంట్లోవాళ్లతోనో, యీదిలోవోళ్లతోనో గలాటా యేస్కున్న్యాడంటే యివతల మాయింట్లో రేడియోలో హరికత, నాటకమూ యినాల్సిన పన్లా. పొద్దుబొయ్యేదాకా నిద్దరొచ్చేదాకా కరమలోళ్ల యీరయ్యే మాకు హరిదాసు, వాళ్ల గలాటే మాకు నాటిక. ఆకాశవాణి భట్టుపల్లె కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం, వూరంతా రిలే. తెల్లారగానే మా పెద్దచేన్లో యాప చెట్టుకింద కొలిమి పనిలో పడిపొయ్యేవాడు.

ఆ బొగ్గుల కొలిమికి గాలి వూదే మిషనొకటుండేది. ఆ కొలిమి మిషన్ను తిప్పాలని నాకు మోజు. దాని మరను చేత్తో నిదానంగా తిప్పితే తగినంత గాలిని అది కొలిమిలోకి తోసి బొగ్గులను మండించేది. గట్టిగా తిప్పితే నెగళ్లు పైకి లేస్తాయి. నెగళ్లతోపాటు బొగ్గులుకూడా ఎగిరిపోతాయ్. అది చూసేదానికి బలే వుంటుంది. "నన్నూరు పెట్టి కొన్న్యాం" అని అడిగినోళ్లకూ అడగనోళ్లకూ చెప్పేవోడు యీరయ్య. రోజూ దానికి కందెన పూసి సుద్దంగా తయారుజేసేవోడు.

కొలిమిలో ఇనుమును యర్రగా కాల్చి పట్టకారుతో బయటకు తీసి బలమైన ఇనపదిమ్మె మింద పెట్టి పట్టుకుంటే, యీరయ్య కొడుకు సుబ్బయ్య ఎదురుగా నిలబడి దాన్ని సమ్మెటతో సత్తవగొదికీ కొట్టేవోడు. వొగోసారి మూడోమనిషి ఎవరన్నా వచ్చి ఆ యర్రటి యినపకడ్డీపైన పదునైన చిన్న యినప జిల్లను నిలబెట్టి యింకో పట్టకారుతో పట్టుకునేవాడు. సుబ్బయ్య రెండు చేతల్తో సమ్మెటను యిస్స్‌మని ఎత్తి హుప్ప్ అని బలంగా జిల్ల మీద దించేవోడు. కాలిన యినుప కడ్డీలోకి జిల్ల దూరి మెత్తగా చీల్చేది. మడక కారు, పార, కొడవలి, గొడ్లి కొండ్రకట్టె తొలిక, యిట్టాటియ్యన్నీ తయారు జేసేవోళ్లు. కూలోళ్లూ రైతులూ వొచ్చి పాత కొరముట్లకు పదును బెట్టమనేటోళ్లు.

సమ్మెట దెబ్బకు నేలంతా అదిరేది. కాలిన యినుము నుంచి యర్రటి నిప్పు రేగళ్లు చిట్లేటియ్యి. సమ్మెటపోటు బలే గురిగా యేసేవోడు సుబ్బయ్య. యీరయ్య గూడా తొణక్కుండా పట్టుకునేవాడు. ఐనా యినుము వొగోసారి కొంచెం జారేది. మూడోమనిషి వచ్చినప్పుడు పిడి సరిగ్గా పట్టుకోమని పోటు పోటుకూ యీరయ్య యెచ్చరిక చేస్తానే వుండేవోడు. పొద్దున్నుంచీ అన్నం కూడా తినకుండా ఆ యాపమాను కింద నిలబడి చూస్తా వుండేవాణ్ణి నేను. ఐనా సరే నన్ను కొలిమి మిషను దగ్గరికి గూడా రానిచ్చేవోడు కాదు యీరయ్య.

'ఎవుడు నిలబడమన్న్యాడు, కుచ్చోరాదా' అంటావేమో! కుచ్చుంటే పనులు జరుగునా?

--------------------------

ఒకసారి యేం జరిగిందంటే - గ్రాంఫోన్ రికార్డులో పాటలు పెట్టి, సైకిలు దిగకుండా పగులూ రేత్రీ తొక్కుతానే వుండే సర్కసోడు మా పల్లె కొచ్చినాడు. కొందురు రాత్రంతా మేలుకోనుండి చూసినారు. వానికి 'ఆర్టుపెయిలు నిలిచిపొయ్యి సచ్చిపోతాడేమో' అని బయపణ్ణారు కొందురు ఆడోళ్లు.

నేనూ మేలుకోని చూస్తా అని ఇంట్లో అడిగితే మా నాయన - 'యేమిరా వాని కర్మ! దాని బదులు నాలుగిండ్లు తిరిగితే అన్నం పెట్టి పంపీమా? వాణ్ణి చూసేదేంది నిద్దర పన్చేటు' అన్న్యాడు.

'నిజమే గదరా! ఎవురికి లాబం దానివల్ల?' అనుకుంటి.

తెలివైనోని మాదిరిగా నేను బైటికొచ్చి అందరితో అదే మాట చెప్తి. జనాలు నన్ను యేమీ అన్ల్యాక, పాపాత్ముణ్ణి చూసినట్టు చూసినారు. నేను బిత్తరపొయ్యి ఇంట్లేకొచ్చి పండుకోని నిద్దరబోతి. ఊహూఁ! తెల్లారేతలికి వాని మర్యాదే మారిపొయ్యిందే! నిమ్మరసం, చెక్కెరనీళ్లు, పానకం, సద్దికూడూ చేతి కొద్దీ పోటీలుబడి పెట్టినారు జనాలు. కొందురైతే దుడ్లుగూడా యిచ్చినారు.

----------------------

అట్టాటి మర్యాద కోసమే నేను గూడా యీరయ్య కొలిమికాడ కుచ్చోకండా నిలబడుకోనుండేది. వొగసారి యీరయ్య కొలిమిలో బొగ్గులైపొయ్‌నాయ్. నేను ఆ పక్కనే నిలబడుకోనుండ్లా?
"ఇంటికాడ బొగ్గులుండాయ్?" అన్న్యాడు వొగ కన్నెగరేసి.
"వుండాయ్"

"వుంటే యింగా యీణ్ణే వుండావే, యెవురికీ తెలీకండా వొగ శాటడు దెన్*రాపో కొలిమిలేకి" అనె.
రఁయ్యమని పరిగెత్తి, వంటింట్లో వుండే మసిగుడ్డ నిండాకూ బొగ్గులేస్కోని, రఁయ్యమని వచ్చేస్తి.

వక్కాకు ఎంగిలి తుపుక్కున దూరంగా వుమ్మి, మసిగుడ్డలోని బొగ్గులను సంచిలో పోస్కుంటా, "మొగోడ్రా రెడ్డి!" అనె యీరయ్య.

"అమ్మగానీ అవ్వగానీ చూళ్ల్యా?" అని అడిగె. నేను తలకాయ అడ్డంగా ఊపితి.
"రెడ్డంటే యేమనుకున్యా? అనుమంతుడు!!" అని మల్లా కన్నొకటి పైకెగరేశ యీరయ్య.

ఇదే సందు అనుకొని, నేను నేరుగా కొలిమి మిషను దగ్గరకు పొయ్యి కూచ్చోబోతి.
"లెయ్ ఆణ్ణించి!!!" ఆ కటినాత్ముడు నన్ను కసిరి పారేశ.

"నేను తిప్పితే అరిగిపోతాదా నీ మిషను? అన్ని బొగ్గులు తెచ్చిచ్చినే!" అనేటప్పటికి నాకు గొంతు పూడకొనిపాయ.

యీరయ్య మాత్రం అదే గొంతుతో, "కాలేకాలే యినుమొచ్చి ఎగిరి పొరపాట్న మిందబడితే యేమైతాదో నాకు దెల్చు, ఆ బ్రమ్మదేవునికి దెల్చు. ఈ పని కాడికి పిలకాయలను రానియ్యడమే పొరపాటు. సమ్మెటేసేటప్పుడు పిడి వూడిందంటే ఇంతే సంగతులు. మిరగళ్లు కండ్లల్లో బడితే మీ నాయనకు నే నేంజెప్పుకోవాల?" అని కోపగిచ్చుకున్న్యాడు.

నేను ఆణ్ణించీ లేసి పక్కకొచ్చేస్తి.

మల్లా నా మొగం జూసి మెత్తబడి, "మేమంటే కర్మబట్టి ఈ శగలో కొలిం పని సేస్సాండాం సామీ. మారాజువు నీకెందుకు దీని జోలి? నువ్వీ సెట్టుకిందికి రాగాకు సామీ, నీ **కు పుణ్యముంటాదీ!" అని రెండు చేతులూ జోడించి తలవంచి నా చెడ్డీకి నమస్తే బెట్టేసినాడు.

ఇంగేం మాట్టాడదాము నువ్వే జెప్పు!

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
9/10

లాస్ట్ లో జోకు సూపర్...

స్టొరీ మరీ చిన్నగున్నట్టుంది

అబ్బో ఫస్ట్ కామెంటు ..కెవ్ కేక్స్
అజ్ఞాత చెప్పారు…
9/10

లాస్ట్ లో జోకు సూపర్...

స్టొరీ మరీ చిన్నగున్నట్టుంది

అబ్బో ఫస్ట్ కామెంటు ..కెవ్ కేక్స్
రవి చెప్పారు…
ఇంగేం జెప్పేది? సెప్పేదేదో ఆ ఈరయ్యే సెప్పినాడు గదా :-) :-)

మొరవ, మోరుపు అంటే ఏందో అర్థం కాల్యా.
dhrruva చెప్పారు…
రానారె... ఏమప్పా ఈ మధ్య నీ టపాలు రావడం లేదేమి!! ఈ టపా మాత్రం కేక.

మా ఊల్లొ కొలిమి క్రిష్నప్ప గూడా అంతె.. ఫొ రెడ్డి పొ అని పంపెస్సాడు.

ఎప్పుడన్నా కత్తి, గొడ్డ్లిలి కోసం పోతె మనకు పది నిమిసాలు జల్సా.

కొంచం రెగ్యులర్ గా టపాలు రాయి సామీ, నీ **కు పుణ్యముంటాదీ! ;)
అజ్ఞాత చెప్పారు…
**కు :)
కొత్త పాళీ చెప్పారు…
చానా గ్యాపకాలు రేపినావు రాంనాథా!
beautiful as usual.
Unknown చెప్పారు…
చాలా బాగుంది రానారె...
చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉంటామో. ఇప్పుడు అసహ్యించుకునే, చిరాకు పడే పనులు కూడా మనకు భలే అపురూపంగా అనిపించేవి.
అజ్ఞాత చెప్పారు…
7/10
Srinivas Sirigina చెప్పారు…
రెడ్డి గారూ, ఎప్పటిలానే చాలా బాగా రాసారు.
కొంచెం ఫ్రీక్వెంట్ గా రాయండి.
9/10
kiraN చెప్పారు…
ఎప్పట్లా భలే రాసావు రాము.
నాకు మాత్రం చిన్నప్పుడు చేసిన కొన్ని పనులు
ఇప్పటికీ చేయాలనిపిస్తుంది

-కిరణ్
spandana చెప్పారు…
రానారె,

అదిరింది. అన్ని వాఖ్యల్లోకీ "కొంచం రెగ్యులర్ గా టపాలు రాయి సామీ, నీ **కు పుణ్యముంటాదీ! ;)" కూడా అదిరింది.

ఇలాంటి అరమరకల్లేని నగ్న సౌందర్యం (సరిగ్గానే అంటున్నానా!!) నీ భాషలో జవజీవాల్ని నింపి చదువుతున్న మనసును వుర్రూతలూగిస్తుంది. భళారె రానారె!

ఈ టపా చదువుతున్నంత సేపూ నేను ఓ ఇరవై ఏళ్ళు వెనక్కెళ్ళి మా వూరి కొలిమి దగ్గర నించున్నా. కంసల మల్లయ్య, సుత్తి వేసే నరసయ్య, కొలిమి తిత్తి వూదే మల్లయ్య భార్య అందరూ కళ్ళముదే కనపడ్డారు.

ముగ్గురు నేర్పుగా సమ్మెటలతో కొట్టడం, బండి చక్రాలకు వేడిచేసిన కమ్మీలు ఎక్కించే దృశ్యం అన్నీ ఒకదాని వెంట ఒకటి సినిమా కనిపించింది.

వూరెళ్ళినా రాని ఇన్ని జ్ఞాపకాలని తెచ్చిన నీ టపాకి వేవేల దండాలు.

@రవి గారూ,
"మొరవ" అంటే చెరువు నిండిన తర్వాత చెరువు నీళ్ళు వెళ్ళడానికి చేసిన మార్గం. చెరువు పూర్తిగా నిండిన తర్వాత మొరవ గుండా నీళ్ళు కిందికి వెళతాయి.

--ప్రసాద్
http://blog.charasala.com
Bolloju Baba చెప్పారు…
యాసలొ చదూతుంటే (నాబోటి వాడు పైకి చదూకుంటే కానీ బుర్రకెక్కదు) చాలా ఆహ్లాదంగా ఉంది.

బొల్లోజు బాబా
అజ్ఞాత చెప్పారు…
8/10
Sriharsha Nandaluri చెప్పారు…
Mee blogs oka samvatsaram nunchi chaduvutunna. Great work andi. Nenu kuda Rayachoty nunchi vachina vanne. Anduke yasa yekkuvaga enjoy cheyya kalugutunna. Thank you.

9/10
అజ్ఞాత చెప్పారు…
నరేంద్ర భాస్కర్ S.P
నమస్తే
మీ గతానుగతాలను మా అనుభవాలు అనుకొని చదువుకునేంత గొప్పగా రాస్తున్నారు, మీరేమన్న పరీచ్చ రాశారా అందరూ మార్కులేస్తున్నారు?

నెనర్లు,
రానారె చెప్పారు…
@శాంతి- anonymous - థాంక్యూ. :-)

@రవి- మొరవ అంటే ప్రసాద్ గారు చెప్పారు. మోరుపు అంటే మొరవనీళ్లు వేగంగా పారేటప్పుడు వచ్చే శబ్దం. మోరుపనేది మొరవనీళ్లకే పరిమితమైన పదం కాదులెండి. ఉదాహరణకు, బస్సు యింజను, గాలిలో విమానం, క్రికెట్ బ్యాటుతో బలంగా కొట్టబడి పరిగెత్తే బంతి చేసే శబ్దాలను కూడా మోరుపు అనే అంటాం.

@ధృవ, రోహిణీకుమార్- :-))) చాలా కృ-లు.

@కొత్తపాళీ, ప్రవీణ్, రెడ్డి, శీను, ఎనోనిమసుగార్లకు ధన్యవాదాలు.

@ప్రసాదుగారు- మీకూ వేలవేల దండాలు. ఇంతకంటే మీతో ఏమీ మాట్లాళ్లేను.

@శ్రీహర్షగారు- చాలా సంతోషం. ధన్యవాదాలు.

@నరేంద్ర భాస్కర్ గారు- నెనరులు. సాంకేతిక కారణాలవల్ల, లేదా ఏం చెప్పాలో తెలీనప్పుడు తెలుగులో వ్యాఖ్యానించలేకపోతే అంకెలతో వ్యాఖ్యానించమని నా బ్లాగులో వ్యాఖ్యల పెట్టె చెబుతుంది, అందుకే అందరూ మార్కులేస్తున్నారు. ఫెయిలు కాకుండా ప్రతినెలా ఒక టపా రాయడమంటే ఇదోరకంగా పరీక్షే అనుకోండి. :-))
Sreeram చెప్పారు…
Tapa : 7/10

Vyakyalaku: 7 1/2
రానారె చెప్పారు…
@చిత్తూరి పిలగాడు
ఇది మరీ బాగుంది. :)
Vinay Chakravarthi.Gogineni చెప్పారు…
10/10.................excellent ani

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ