ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు.
వొక్కటంటే ఒక్క మాట. అంతే.
బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట.
చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట.
భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా.
ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే.
మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది.
ఇంతకూ కతేందంటే ...

వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట.

ఇంతేబ్బా కత!
పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత.

అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద కుచ్చోనుండటం బోయోళ్లెంగటసామికి యిచిత్రంగా లేదు. ఆ దోవన పోతాపోతా వున్నె గుమ్మనాగని నాయనకు యిచిత్రంగా కనబడింది. యంగటసామిని కదిలిచ్చినాడు. యంగటసామి యండకన్నా ఛఱ్రమని మండిపణ్ణాడు. ఆ మాట ఎవురో యిన్న్యారు. పల్లెంతా నవ్వుకున్న్యారు. అది కత మాదిరిగా నిలిసిపొయ్యింది.

"నువ్వు కతజెప్పి శాన్నాళ్లైపోయ, యేదో వొగటి చెప్పుబ్బా" అన్యాడొగాయన. ఆయన కోసమని, యేదీ దొరక్క ఈ పిట్టకత చెప్తాండా. మామూలుగా ఐతే ఈ కత నాకు నేనే చెప్పుకుంటా వుండాల్సిన కత. బయటోళ్లకు జెప్పే కతగాదు. నేను గూడా రోంత కుడియడమగా యంగటసామి జేసినట్టే శాచ్చావుంటా యెప్పుడన్నా కోపంలో.

కామెంట్‌లు

balarami reddy చెప్పారు…
నవ్వుకోని మతికి పెట్టుకుంటాడు ల్లే న్నా....
spandana చెప్పారు…
ఏబ్బీ ఈ కథ్జెప్పి గూడా చాన్నాళయిపాయినే!
teresa చెప్పారు…
:)
Vinod చెప్పారు…
10/10

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతగారి అనుపమితోపమానము

పన్ల కాలం. అందురూ మడికాడికి బొయినారు. అన్నదమ్ములమిద్దరమూ ఇంటికి కావిలి. మాక్కావిలి మా తాత. పొద్దన్నుంచీ సింతసెట్టుకింద నిలబడి సూచ్చాండాం, ఆడుకుండేదానికి పిల్లకాయలెవురన్నా వచ్చారేమోనని. యంతసేపు జూసినా వొక్కడూరాల్యా. మేమిద్దరమే రోంచేపు ఏమన్నా ఆడుకున్యామంటే అది కొట్లాటే. ఊళ్లో పిల్లాపెద్దా అందురూ పన్లకు బొయినిట్టుండారు. వొగ మనిసిగాని గొడ్డూగోదాగాని యెవురేగాని బైట కనపరాల్యా. వడగాలికి సింతసెట్టు కింద నిలబడుకొనుంటే కంసలోల్ల యీరయ్య కొలిమికాడున్నిట్టు అగ్గి సెగ. పడమటగాలి. గాలితోలే సద్దు తప్ప వొక్క పక్షిగూడా యాణ్ణేగాని కూత గూడా బెట్లా. కోళ్లు మాత్రం ఇంటి ముందరుండే సర్కారుకంపచెట్లల్లో చెదులు కోసం చిదుగుతాండాయి. ఉన్నిట్టుండి పెద్దకోడిపుంజు దిగ్గునలేసి బెదురుగా నిలబడె. బొమ్మెలన్నీ యెక్కడియ్యక్కడ నిల్చిపొయ్యి మెడలు పైకెత్తి బీతుగా దిక్కుల్జూశ. పెద్దపుంజు వొగ కన్నుతో ఆకాశంకల్లా తేరిపారజూస్తా సన్నగా కుర్‌ర్‌ర్రుమనె. అట్లనేటప్పుడు దాని ఈకలన్నీ మెరుగుతగ్గి వొంటికి అంటగరసకపాయ. బొమ్మెలన్నీ యెప్పుడు దూరుకున్యాయో యెనుముల కొటంలేకి దూరుకున్యాయ్. పెద్దపుంజుతోపాటుగా పిల్లలకోడిగూడా వసారాలోకి దూరె. "గద

అంతా వానిష్టమేనా అని!

"దేవుడు బలే నాయాలు. కద మా!?" అంటిన్నేను. దీగూటికి ఎదురుగ్గా నిలబడి దీపానికి దణ్ణం బెట్టుకుంటాన్నింది మా అమ్మ. కండ్లు దెరిసి గోడకు తగిలిచ్చిన దేవుని పటాలకల్లా చూసి యివతలి కొచ్చేసింది గానీ, యేం మాట్లాళ్లా. ఇంట్లో ఎవురి మింద కోపమొచ్చినా, "ఈ పాపిష్టి దేవుడు నన్నింగా తీసకపోలేదే" అనే మా అవ్వ గూడా ఏమీ అన్లా. ****************************************** కతేందంటే ... మా బూదకోడిపెట్ట పద్నాలుగు గుడ్లు బెట్టింది. గుడ్లుబెట్టడం దానికిదే మొదులు. గంపలో ఇసక బోసి, వరిగెడ్డి పేర్చి, పిడుదులూ గోమారీ పట్టకండా గబ్బుమందు చల్లి దాన్ని పొదగ బెడితిమి. అది గూడా శర్దగా పొదిగింది. వొగ రోజు సందేళ నాలుగు గుడ్లు పిగిలినాయి. తెల్లారుఝామున మంచం దిగి చూస్తే ఒకటి తప్ప మిగిలిన గుడ్లన్నీ పిగిలి పిల్లలైనాయి. ఆ మిగిలింది మురుగుడ్డు కాగూడదురా దేవుడా అనుకుంటా వుండాం. తెల్లారి పొద్దెక్కేటప్పుటికి ఆ గుడ్డులో వుండే పిల్ల ముక్కుతో పొడిసి బొక్కబెట్టింది. మిగతా పని బూదకోడి చేసేసింది. ఒక్క గుడ్డు గూడా వోటు పోనీకండా వుండే కోడిపెట్ట అందరికీ వుండదు గదా. రెండోరోజు పిల్లలన్నిట్నీ యెంటేస్కోని ఇంట్లోనుంచి మొదుటి స

డెమ్మ డెక్క డాలి

నా పైతరగతోళ్లు ఒగ ఇద్దురు పిల్లకాయలు నాగన్నైవోరి బడికి ఎగనామంబెట్టి వంకలో బుడ్డపక్కెలు (ఒక చేప జాతి) పట్టేదానికి బొయి, వాళ్లమ్మో నాయనో జూసి "*న్‌జా కొడకల్లాలా బడికి బోకండా వంకలంబడీ కాలవలంబడీ ఏమి యారకతినే పన్జేచ్చాండార్రా" అని చేతిలో ఈతబర్రతో యంటబడితే సచ్చితిం బతికితి మని వోళ్లకు దొరక్కండా *న్‌కోని పైన ఉరికినారనుకో - ఈ తమాసా సూసినాంక ఎవురికన్నా సెప్పిందాంకా అన్నం సగిచ్చదుగదా మనకు! వొగేల (ఒకవేళ) సెప్తే ఇంట్లో జెప్పాల. ఇంట్లో జెప్పాలంటే వాళ్లమ్మానాయినా తిట్టిన తిట్లు సెప్పలేము. ఆమాటలు ఎవురో అన్న్యారని కూడా నా నోటెమ్మట రాగూడదు. వొస్తే చెంప పగుల్తాదని తెలుసు. 'న్‌జాకొడకల్లాలా' అనే మాటల్యాకంటే (లేకుంటే) దాంట్లో తమాసా ఏముండాది? ఇంట్లోగాకండా ఇంగెవురికన్నా సెబుదామా అంటే - "రెడ్డేరిపిల్లోళ్లట్టాంటి మాటలు మాట్టాడర"ని ఊర్లో మనకు 'మంచిపేరుం'డాదే! మాట్టాడతాండామని ఇంట్లో తెలిచ్చే బాగుండదు. సూసినా!? మంచిపేరు ఒగోసారి అంత మంచిదనిపీదు. ఊరంతా మాట్టాడతారు. మా నాయనగూడా, ఇంట్లో మాట్టాడ్డుగానీ, బైట మాట్టాడ్డం మొచ్చుగా (మస్తుగా) జూసినాము. మా తాతగూడా అంతే. నేను మాత