ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పెట్లగొడతా !

మా అమ్మోళ్ల నాయనకు నేనంటే చానా ఇష్టం. నా తరవాత ఆయనకు ఏడుమంది మనమండ్లూ మనమరాండ్లూ కలిగినా నామిందనే ఆయనకు బ్రమలెక్కువ అనేవోళ్లు. ఆ బ్రమ గుఱించి మాయమ్మ మాటిమాటికీ వొక సంగతి చెప్పేది.

ఒకనాడు నేను గమ్మున కుచ్చోనుంటే మా గోపీగాడు పరిగెత్తుకుంటా వచ్చి గోళ్లతో నా మొగంమింద కచ్చగా గిచ్చినాడంట. అప్పుడే దేవునింట్లో దీపానికి దండంబెట్టి బయటికొచ్చినాడంట, ఇదంతా ఆయన కంటబడింది. నేను నొప్పికి తట్టుకోల్యాక ఏడ్సినానంట. గుడ్లురుముతా పళ్లుకొరుకుతా మా గోపీగాని చెంప పగలగొట్టి, కోపం చల్లారక మొగం యర్రబారి, బుసలుగొడతా, వూగిపోతా, చూపుడువేలు చూపిస్తా "పెట్లగొడతా ఏమనుకున్యావో" అన్యాడంట. అప్పటికి మా గోపీ వయసు మూడేండ్లు కూడా వుండదంటుంది మాయమ్మ.

ఆయన అంతగా సోదీనం తప్పడం ఇంట్లో అందరికీ చానా నొప్పిగలిగించినట్టుంది. "పెట్లగొడతా" అనే మాట గుర్తుండిపోయింది. ఈ మాటను ఆయన తప్ప ఇంగెవురూ అనంగా నేను విన్లా.

****** ****** ******

ఆం. ప్ర. బాలుర గురుకుల పాఠశాల, ముక్కావారిపల్లెలో ఎనిమిదో తరగతి చివరిదినాలు. మాకన్నా ముందు పదోతరగతికి పరీక్షలు. ఏడు, పది తరగతులు ఒక హౌసులో. దాని ఎదురుగా స్టాఫు రూము, మా ప్రిన్సిపాల్ సారు ఆఫీసూ ఇల్లూ ఒక హౌసులో. ఆఫీసు పక్కనున్న హౌసులో ఐదు, ఎనిమిది తరగతులు. దీని ఎదురుగా ఆరు, తొమ్మిది తరగతులుండే హౌసు. పక్కపక్కనుండే హౌసుల మధ్యలో తువ్వాళ్లూ, సొక్కానిక్కర్లూ ఆరేసుకుండేదానికి రోంత ఖాళీజాగా.

కోళ్లఫారం పక్కన నడిసి పోతావుంటే కొటారింపులు, కిలారింపులు, కేరడాలు, రెక్కల టపటపలూ యినబడతావుంటాయే, అదే మాదిరిగా పిల్లకాయలుండే హౌసుల్లో నుంచి ఎప్పుడూ అరుపులూ కేకలూ నవ్వులూ ఏడుపులూ యినబడతానే ఉంటాయ్. అందుకే మా ప్రిన్సిపాల్ ఇంటి కిటికీలు ఎప్పుడోగాని తెరిచివుండవు.

గోలగోలగా ఉన్న హౌసులో వొకోసారి మనకు తెలీకుండానే శబ్దాలన్నీ ఆగిపోతాయ్. పిల్లకాయలంతా పుస్తకాల్లో తలకాయలు పెట్టేస్తారు. ల్యాకపోతే వాళ్లవాళ్ల ట్రంకుపెట్టెల్లో బట్టలూ పుస్తకాలూ సర్దుకుంటా వుంటారు. అదీ వీలు కాకపోతే కనీసం గమ్మున కూర్చుంటారు. ప్రిన్సిపాల్ సారు ఆ హౌసు వాకిట్లోకొచ్చి నిలబడుకోనుంటాడు. ఆయనొచ్చింది చూసుకోకండా మాట్లాడ్డమో నిలబడ్డమో కొట్లాడ్డంలోనో ఏ ఒకరో ఇద్దరో వుండిపోతారనుకో, వాళ్లను అప్పుడేమీ అనడు. అట్లే పో..యించేపు నిలజూసి మెల్లిగా యనక్కుతిరిగి గమ్మున పోతాడు. ఆయన కనుగుడ్లు చానా పెద్దయ్యి. ముక్కు రోంత ముందుకు వొంగి వుంటాది. మొగం తెలుపు. ప్యాంటు లేదా అరపంచె మిందికి అరచేతుల సొక్కా. చేతులమింద చిక్కటి నల్లటి యెంటికలు. ఆయన్ను తలుచుకోఁగానే నాకు వొగ పక్షి గుర్తుకొస్తాది. ఆయన కనుగుడ్లు పెద్దవిజేసి నిలజూస్తే ఎవురైనా బిత్తరపోవాల్సిందే.

ఇంతకూ పదోతరగతి పరీక్షలకు ఇంగో మూడుదినాలుండాది. ఓ సదువుతాండారు. వాళ్లు సదివేటప్పుడు మిగతా హౌసుల్లో చీమ చిటుక్కుమనగూడదని మా హౌసు లీడరు బయపురెడ్డికి ఆదేశము, మాకందఱికీ బలమైన హెచ్చరిక రెండూ వొగటేసారి అందినాయి. ఎవురికైనా వొంటికొచ్చినాసరే బయటికి పొయ్యేదానికి ల్యా. మరీ తట్టుకోల్యాకపోతే, వొంచిన చూపుడువేలు లేదా నిటారు చిటికెనేలు చూపిస్తా లేసి నిలబడుకోవాల. బయపురెడ్డి పొమ్మంటే పోవాల.

అందురూ తలలు పుస్తకాల్లో పెట్టి చూస్తాండారు. డార్మెట్రీ మొత్తం యంత నిశ్శబ్దంగా వుండాదంటే, రాజంపేట-కోడూరు రోడ్లో పొయ్యే బస్సులూ లారీల మోరుపేగాదు, మా బడి చుట్టూరా అడివిలో తెల్లతుమ్మ, కలేచెట్లు, బలుసచెట్లల్లోనుంచి కీసురాళ్ల కీసరగూడా చెవుల్లోబడతాంది. లాంగుస్కేలు చేతిలో బట్టుకోని హౌసంతా పహారా కాసొచ్చి వాని పెట్టెకాడ కూచ్చున్యాడు బయపురెడ్డి. కూసున్నె రోంచేపుటికి వానిసుట్టూ గుసగుసలు, కిసకిసలూ. ప్రిన్సిపాల్ సారు ఇంట్లోకి పొయినిట్టుండాడని అర్థం. బయపురెడ్డే మాట్లాడతాండాడుగదా అని అక్కడక్కడా కొందురు మాట్లాడబట్టిరి. నేనూ లోగొంతుకతో ఏదో పలకరిచ్చినా నా పక్కన్నే సదువుకుంటా వుండే నారాయణను. ఎందుకైనా మంచిదని నారాయణ పలకలా. నారాయణ పలక్కపొయ్యేటప్పుటికి ఎందుకైనా మంచిదని నేనుగూడా పుస్తకంలో తలకాయబెట్టేస్తి.

పదకొండయింది. ప్రిన్సిపాలొచ్చి నంబర్లు చదవమనె. బయపురెడ్డి లేసి నిలబడి వరసగా సదువుతాండాడు. సదువుతాండాడంటే అట్టాయిట్టాగాదులే. యమధర్మరాజు కొలువులో చిత్రగుప్తునికిగూడా పాపుల పేర్లు సదివేటప్పుడు అంత దాష్టీకముండదు. ఆ నంబర్లు గల్లోళ్లు ఒక్కొక్కరే లేసి నిలబడతాండారు. యట్ల? వారం దినాలుగా సలిజొరంతో మంచానబడిన ముసిలోళ్లు కాలూజెయ్యీ కూడదీసుకొని ఊతకట్టె పట్టుకొని లేసినిట్టు.

నంబర్లు వరసగా చానానే సదివె. వాటిల్లో నా నంబరూ వచ్చ. వానితో మాట్లాడినోళ్లయ్యీ, కిసకిసా నవ్వినోళ్లయ్యీ రాలా. నేను లేసి నిలబళ్లా. నాకన్నా ముందే నంబరు పడినోళ్లు కొందరు ఇంగా లెయ్యలా. లెయ్యకపోతే వొదిలేస్తాడేమోననుకున్యా. వొదిల్తే వాడు బయపురెడ్డెందుకవుతాడు? లెయ్యనోళ్ల నంబర్లను మల్లా వొగసారి నొక్కినొక్కి సదివె. ఓరినీ స్కేలుకు చెదులుబట్టా అనుకుంటా లేస్తి.

లేసినోళ్లందర్నీ డార్మెట్రీలోకి రమ్మనె ప్రిన్సిపాల్ సారు. డార్మెట్రీలో చూస్తే, ఖర్మగాలినోళ్లు నిలబడిన వరస చానా పొడుగుంది. మామూలుగా ఐతే, అంతమందినీ కొట్టల్యాక, అన్నానికి యాళయ్యేదాఁక అందరినీ కలిపి నాలుగుమాటలు తిట్టి వొదిలేస్తాడు. ఆరోజు మా గరుత్మంతుని మొగం చూస్తే అట్ట కనపళ్లా.

చేతిలో పోలీసోళ్ల లాఠీమందంలోమూరడుపొడుగున్న యర్రటి చావకట్టె. వరస మొదట్లో ఉన్నోడు బాబు. "ఊళ్లో మీ నాయనగారు నానా అగసాట్లూ బడతా వుంటే, నువ్వు ..." అని మొదలుబెట్టి కట్టె మారితే, "ఇంగెప్పుడూ మాట్లాణ్ణు సార్" అని చేతులు అడ్డంబెట్టుకునె బాబు. "వేళ్లు విరిగిపోతాయ్, చేతులు తీ, తీ రా చేతులు" అని ఫటాఫటా కొడ్తాండాడు ప్రిన్సిపాలు.

ఒక్కొక్కనికీ కీళ్లు ఇరగ్గొట్టుకుంటా వస్తాండాడు. రంకెలు బెడతాండాడు. ఆయన తమ దెగ్గిరికి వచ్చీరాకముందే పిల్లకాయలు క్యాకలు బెడ్తాండారు. ఆ కట్టెతో నన్ను కొడితేమాత్రం పులుసులోకి యెంకలు దొరకవు.
"రెవిడీ నాయాలా, నువ్వు పెద్ద ర్హెవిడీవా..." రెవిడీ నాయాలా అనేది ఆయన ఊతపదం.
"కుక్కతోక వంకర... హ్హీరోజుతో పోవాల..."
"మనిషికో మాట - గొడ్డుకో ద్దెబ్హ..."
"మనం మాటల్తో హ్హినే రకమా?..."
"ఎప్పుడు జూసినా గల్లగల్లగల్లగల్లా మని మ్హాటలు, మ్ఁ..."

ఈ మాదిరిగా మాటకొగ హకారమూ, హకారానికొక ఎమలు ఇరగ్గొట్టే దెబ్బ. "ఇంగెప్పుడే గాని మాట్లాణ్ణు, ఇంగ మాట్లాణ్ణు సార్" అని ఏడుపులూ, హాహాకారాలు.

ఆ దెబ్బలు తినడానికి నేను సిద్ధమయిపొయినా. ఐతే నేనింతవరకూ ఎప్పుడూ చెడ్డగా ఆయన కంటిలో పళ్లా. చదువులో ఫరవాలా. పాటల్లో ఫస్టు ప్రైజు నాకే వొచ్చింది. నేనెవుదెగ్గిరా దెబ్బలు తినడం ఆయన చూళ్లా. అయినా సరే, ఆ రంకెలు చూస్తా వుంటే నన్నుకూడా అందరితోపాటే కొడతాడనే అనిపిస్తాంది. నా పక్కన్నే నా అట్టా పిల్లకాయే ఒకడుండాడు. ఇద్దరమూ పక్కపక్కన్నే నిలబడితే "మీరు కూడానా?" అని చూసీచూడనట్టు వొదిలేస్తాడని నా ఆశ.

మా దగ్గిరికి వొచ్చినాడు. ముందు నేనే.

ఆయన చూపులకు నేను బెదిరిపోలా. కొడతాడని ముందుగానే చేతులు అడ్డం బెట్టుకోలా. "నన్నెందుకు కొడతావు, కొట్టవులే!" అన్నట్టుగా చూస్తి. ఆయన కనుగుడ్లు చిన్నవైనాయి, బుసలు తగ్గినాయి. కొట్టడని తెలిసిపోయింది. నాకు ఈ విద్య మా నాయనే నేరిపించినాడు. ఊళ్లో కుక్కలు మనల్నుజూసి మొరిగినప్పుడు భయపడినట్టు కనబడకుండా స్థిమితంగా చూస్తా నిలబడితే వొచ్చి, కాళ్లు నాకి పోతాయి. భయపడేవాణ్ణి చూస్తే వాటికీ చెలగాటంగా ఉంటుందని. నిజమే! కుక్కలకే గాదు, మనుషులకూ ఆ మంత్రం పనిజేసింది. నా నుంచి చూపు మళ్లించి, గొంతు మాత్రం తగ్గించకండా, నా పక్కనున్న పిల్లకాయతో, "మీరిద్దురూ.., ఇంగోసారి ఈ మాదిరి కనబణ్ణారంటే యీపు పెట్లగొడతా, ఫోండి" అంటా కనుబొమ్మలెగరేసినాడు.

"పెట్లగొడతా" అనే మాట వినఁగానే నాకు భలే నవ్వొచ్చింది. నేను వినఁగా ఆ మాట వాడిన రెండో మనిషీ, ఇంతవరకూ ఆఖరి మనిషీకూడా మా ప్రిన్సిపాలుడే. అసలు నిదానంగా ఆలోచిస్తే ఆయనకూ మా తాతకూ కొన్ని పోలికలుండాయనిపించింది.

రెండుసార్లు నంబర్లు చదివి నిలబెట్టినా అంతమందిలో నాకు దెబ్బలూ తిట్లూ తప్పడం గౌరవంగా అనిపించింది. ఐతే, బయ్యపురెడ్డి ఇంకొక రెండు సార్లు నా నంబరు రాస్తే మాత్రం ఈ మర్యాదలేం మిగలవు. మర్యాద నిలుపుకోవడమనేది ఒకనాటితో జరిగిపొయ్యే పనైతే బాగుండు!

కామెంట్‌లు

sunita చెప్పారు…
ఏమి నాయనా!నువ్వూ, గౌతం, నెలకు ఒక్క టపా మాత్రమే రాయాలని రేషను ఏమన్నా పెట్టుకున్నారా!
రానారె చెప్పారు…
నెలకు ఒక్క టపా మాత్రమే రాయాలని కాదండి.
నెలకు ఒక్క టపా అయినా రాయాలని. :-)
Naveen Garla చెప్పారు…
ఇంతకూ 'పెట్లగొడతా' అంటే ఏంది? వాయగొడతా అనా? లేక బొబ్బలొచ్చేలా కొడతా అనా?
రవి చెప్పారు…
నేను యాడనో విన్నాను, ఈ "పెట్లగొడతా" అనే మాట. జ్ఞప్తికి రావట్లే.

అవును, ముళ్ళకంప ఆకులు జేబులో పెట్టుకుంటే, ఐవారు నుంచి దెబ్బలు పడవు గదా. మళ్ళి రోజు స్కూలుకు పోయేటప్పుడు ఆ ఆకులు పెట్టుకుని పోయేల్లేదా?
Unknown చెప్పారు…
నాకు ఈ విద్య మా నాయనే నేరిపించినాడు. ఊళ్లో కుక్కలు మనల్నుజూసి మొరిగినప్పుడు భయపడినట్టు కనబడకుండా స్థిమితంగా చూస్తా నిలబడితే వొచ్చి, కాళ్లు నాకి పోతాయి. భయపడేవాణ్ణి చూస్తే వాటికీ చెలగాటంగా ఉంటుందని. నిజమే!
అదిరింది
మీరు చెప్పిన గౌరవం నాక్కూడా దక్కింది ఓ మాటు
నెను ఇంటర్ బైపిసి చదువుతుంటే ఓ రోజు ఒకడితో కిలకిలమంటోంటే ఒక మ్యాథ్స్ సార్ వచ్చాడు నా పక్కన వాణ్ని వాయగొట్టాడు.నా దగ్గరకొచ్చి విచిత్రంగా చూసి పెర్సెంటేజ్ అడిగాడు చెప్పాను
కుదురైనోడివి నీక్కూడా ఏం పొయ్యాకాలం పో అని వదిలేసాడు
అంతే వాడు కాస్తా ఆయనయ్యాడు ఎప్పుడూ ఆయన ముందు గోల చెయ్యలే
చైతన్య.ఎస్ చెప్పారు…
>>ఊళ్లో కుక్కలు మనల్నుజూసి మొరిగినప్పుడు భయపడినట్టు కనబడకుండా స్థిమితంగా చూస్తా నిలబడితే వొచ్చి, కాళ్లు నాకి పోతాయి.

:)

'పెట్లగొడతా' ఇప్పుడే విన్నా ఈ పదం
Narendra Chennupati చెప్పారు…
8/10 :)
balarami reddy చెప్పారు…
anna.. principal evvaru?
Unknown చెప్పారు…
Mithramaa..Evaru aa principal saaru?
రానారె చెప్పారు…
@ బలరామిరెడ్డి & రామ్
పేరు చెబితే పెట్లగొడతాడేమోనని నాకిప్పటికీ భయమే. ఈ కథలోనే కొన్ని హింట్లున్నాయి. మీరే కనిపెట్టండి. :-)
రానారె చెప్పారు…
@ నవీను - నువ్వడిగినాఁక బ్రౌణ్యంలో చూశాను. ఇదీ సంగతి:
పెటులు, పెటలు, పెటిలు or పెట్లు peṭulu. v. n. To crack or split, as paint, or as grain does when roasted. To explode or go off, as a gun. పగుళ్లుపారు, చిట్లు. "కల్పాంత దీర్ఘనిర్ఘాతసంఘంబులు పెళపెళపెళమంచు పెటిలిపడిన."

@ రవి - హహ్హహ్హ. ఉండేదిగానీ అట్టాటి నమ్మకాలు నాకు తక్కువే.

@ గీత - నెనరులు. అయ్యవార్లను వారి పరోక్షంలో 'హిందీవోడు, ఇంగ్లీషోడు, లెక్కలోడు, బోటనీవోడు' అనడం నేనూ ఇంటర్లో ప్రయివేటు రెసిడెన్షియల్ కాలేజీలో చేరినాఁక చూసి 'వార్నీ పాసుగలా!' అనుకున్న్యా. పదోతరగతి వరకూ మా గురుకులంలో ఇట్టాంటివి లేవు.

చైతన్య, నాగేంద్ర - థాంక్సు.
Kathi Mahesh Kumar చెప్పారు…
బ్రహ్మాండం. 8/10
balarami reddy చెప్పారు…
అన్నా కనిపెట్న్యా...శ్రీనివాసులు సారు కదా... ఆయప్ప పోయినాకనే మదనమోహన రెడ్డి వచ్చినాడు తర్వాత శంకరయ్య.
రానారె చెప్పారు…
ఔను. ఆయనే. దేవునికైనా దెబ్బే గురువని సామెత. గురుస్సాక్షాత్పరబ్రహ్మ. :-)

ఐతే, శంకరయ్యసారు బాగా తెలుసుగానీ, మదనమోహనరెడ్డి నాకు పరిచయం లేదు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ