ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పేరు గలవాడేను మనిషోయ్

పదహారు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు.

కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది.


యండాకాలానికీ వానాకాలానికీ మధ్యలో ఒక రోజు రాత్రి. గాలి తోలటం లేదు. చూరు కింది అరుగుపై బొంత పరుచుకొని పడుకుని వున్నాడు బుట్టోడు. వాని నాయన శివుడు కొట్టంలో సంగటి తింటూ వున్నాడు. ఆ ఇంట్లో వాళ్లిద్దరే. ఆపొద్దు వాళ్లింట్లో సియ్యలకూర. రెడ్డేరి ఇంట్లో మాంచి గుడ్లకోడిపెట్ట. రోగం తగిలి ఆ రోజే తూగి చచ్చింది. చచ్చిన కోడిని రెడ్డేరు తినరు. తోటకు కావలి కాస్తూ ఇతర పనులు చూసుకునే శివునికి ఇచ్చారు. దాన్ని కోసి కూరజేసి, రెడ్డేరింటికాడ రెండుముద్దల సంగటి అడిగిపెట్టించుకొని, వస్తూవస్తూ రెండు పాకెట్ల సారాయి కూడా తెచ్చుకొని పండగ జేసుకుంటున్నాడు శివుడు. గుండెకాయ, గుడ్డుసొన లాంటి మెత్తనివన్నీ బుట్టోనికి తినిపించి, ఎముకలను కూడా మిగలనీయకుండా జుర్రేస్తున్నాడు.

వాళ్ల నాయన అట్టా తింటూవుంటే బుట్టోనికి భలే సంబరం. పైన చుక్కలను చూస్తూ ఇంట్లో నుంచీ వచ్చే శబ్దాలను ఆనందంగా వింటున్నాడు. సియ్యలకూర తిన్నప్పుడు మాత్రమే శివుడు సారాయి తాగుతాడు. తాగిన రోజు రాత్రి ఆనందంగా బిగ్గరగా వీధినాటకం పద్యాలూ పాటలూ పాడతాడు. తినడం అయినట్టుంది. గిన్నె కడిగి, నీళ్లను వాకిట్లోనుంచే బయటకు విసిరేశాడు. అంతవరకూ వాకిట్లో ఓపికగా పడుకొని వున్న వీధికుక్క ఒకటి ఆ నీళ్లతో పాటే పరుగెత్తి, అవి పడినచోట తోక ఊపుకుంటూ చుట్టూ తిరిగి ఆత్రంగా ముక్కు ఎగబీల్చి, చిన్న ఎముక కూడా దొరక్కపోవడంతో నిరాశగా మరోచోటును వెతుక్కుంటూ వెళ్లిపోయింది.

శివుడు కూడా ఇంట్లో కిరసనాయిలు బుడ్డీని ఆర్పి, తన బొంతను తీసుకొచ్చి, ఇంకో అరుగుపై పరచి, కాటి సీను పద్యం అందుకున్నాడు — “యెన్నో యేండ్లు గతించిపోయినవీ… కానీ…ఈ…ఈ…”

చంద్రుడు తూరుపుకొండపైకి మెల్లగా చేరుకుంటున్నాడు. బుట్టోనికి నిద్ర పట్టడంలేదు. శివుడు పాడే పాటలవల్ల కాదు. నిజానికి, తండ్రి అట్టా ఎలుగెత్తి పాడుతూ వుంటే యెంతసేపైనా వినాలనుంటుంది వానికి. తండ్రి ఆ ఆనందంలో వుండగానే ఆరోజు వాడు అడగాలనుకున్న సంగతి ఒకటుంది. అలా పాడి పాడి అలసి నిద్రపోకముందే అడగాలి. అంతలో శివుడు పాట ఆపి — “అబ్బీ సీనారాయుడూ, ఇంగా మేలుకోనే వుండావా? కంబడి కప్పుకో, ఈ దోమలు రగతం పీల్చి సంపేటిగా వుండాయ్” అన్నాడు. బుట్టోడు పలకలేదు. ఉక్కగా వున్నా మారు మాట్లాడకుండా కంబళిని మీదకు లాక్కున్నాడు.

బుట్టోని అసలుపేరు శ్రీనివాసనారాయణ. వాడు పుట్టకముందే వానికా పేరు సిద్ధం చేసింది వాళ్లమ్మ. కొండకు తీసుకువెళ్లి గుండుకొట్టించింది కూడా. ఇప్పుడా పేరుతో పిలవడానికి ఆమె లేదు. శివుడు చాలా కష్టంచేసి కొడుకును పెంపుజేసినాడు. శ్రీనివాసనారాయణ చిన్నతనంలో జుట్టు కత్తిరించకుండా, తల మట్టిగొట్టుకుపోయి, బుట్టలాగా వుండేదని ఆ వూర్లో అందరూ వాణ్ణి బుట్టోడు అన్నారు - వాళ్ల నాయనతో సహా. బుట్టోణ్ణి బుట్టోడా అని కాక, మరేపేరుతో పిలిచినా వానికి సిగ్గు. సియ్యలకూర తిని, రెండుపొట్లాల సారాయి తాగినప్పుడు శివునికి కొడుకు మీద వాత్సల్యం పొంగి “సీనారాయుడూ” అంటూ బయటపడుతుంది. నాయన అట్టా పిలవడం ఎవరయినా వింటే ఎగతాళి చేస్తారని బుట్టోనికి యిబ్బంది. ఆమధ్య వాళ్ల మామ విన్నాడేమో, “ఏమప్పా సీనారాయుడు గారూ, బాగుండావా” అని ఇప్పటికీ ఎకసెక్కాలే. బుట్టోడు సిగ్గుపడితే మామా నాయనా ఇద్దరూ కలిసి నవ్వుతారు.

శివుడు జోరుగా సత్యహరిశ్చంద్ర నాటకంలో లీనమైపోయి పద్యాలు, సంభాషణలు దంచేస్తున్నాడు. “… ఇచ్చోటనే… లేత యిల్లాలి నల్లపూసల సౌరు గంగలో…వో..వో…కలిసి పోయే…యే…” అంటూ ఏడుపు లంకించుకున్నాడు. ఏవో జ్ఞాపకాలు అతని మనసులోకి వచ్చినట్టున్నాయి. బుట్టోనికి ఇదంతా కొత్త కాదు. పరిస్థితి చెయ్యి దాటకముందే అడగాల్సింది అడిగేయాలని నిశ్చయించుకొని, లేచి కూర్చుని మెల్లగా పిలిచాడు.

“అయ్యా!…”
“….ఇచ్చోటనే…..” తారాస్థాయిలో పాడుతున్నాడు శివుడు.

“అయ్యోవ్!…”
“ఊఁ… నాయినా సీనారాయుడూ .. ఏమి నీకోరిక…” నాటకం ఊపులోనే అడిగాడు.

“మనకొక రేడియో వుంటే బాగుంటాది గదా!”
“ఓ … బెమ్మాళంగా వుంటాది గదా!”

“రెడ్డేరింట్లో మాదిరి మనమూ వొకటి కొందాము”
“రెడ్డేరింట్లో వుంటే మనింట్లో వున్నిట్టే! మనింట్లో మనమే వొక పెద్ద లేడియో! యింకోటేల? నిమ్మళంగా కొందాము లే …”

“కొందాంలే అంటే కాదు, పండగకు రెడ్డేరిచ్చే దుడ్డుతో నాకు సొక్కవా నిక్కరా వొద్దులే, రేడియో కొను”. బుట్టోని గొంతులో పంతాన్ని పసిగట్టాడు శివుడు.
“వొరే బుట్టోడా, లేడియో కొనడం గాదురా, దానికి బ్యాటరీల దప్పిక జాస్తి. అయ్యి ఎవుడు కొంటాడు? పైగా అది మనింట్లో వుండాల్సిన వొస్తువు కాదులేరా …”

బుట్టోనికి విషయం అర్థమయింది. గట్టిగా తోస్తే పడిపోయే మంటిగోడ, తడికెతలుపు గల తమ సుట్టింట్లో, విలువైనది ఏదయినా సరే కాపాడుకోవడం సమస్యే. రేడియో దాక ఎందుకు, అపురూపంగా తన సొంతమయిన సరైన కాగితాన్నొకదాన్ని ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా చేయగలిగిందేమీ లేదు. తాను మాటిమాటికీ ఓడిపోతున్నట్లు అనిపించింది.

తండ్రి సన్నగా గురకతీస్తూ నిద్రపోతున్నాడు. ఏడుపొకటి తక్కువ అన్నట్టుంది బుట్టోని పరిస్థితి. చాలాసేపు అరుగుమీద అలాగే కూర్చున్నాడు. కాలి బొటనవేలికి పైనున్న నరం మీద నాలుగు దోమలు చేరి పొడుస్తున్నాయి. మనసులోని బాధ ముందు ఈ నొప్పి తెలియలేదు. దోమలు రక్తం తాగుతున్నాయి. బుట్టోడు చూస్తూ వుండగానే వాటి పొట్టలు నిండాయి. అప్పుడు కసితీరా పళ్లు బిగించి బొటనవేలిపైన ఫట్ మని కొట్టాడు. దోమల కడుపులు పగిలి, ఆ రక్తం అరచెయ్యంతా చిందింది. కచ్చగా అరచేతివంక చూసుకున్నాడు. చేతిలో మూడు శవాలు మాత్రమే కనిపించాయి. నాలుగోది పొట్టనిండా తన రక్తం తాగేసి తన చేతిలో చావకుండా తప్పించుకుందని పిచ్చికోపం వచ్చింది. ఆ కోపంతో గట్టిగా తిట్టడం మొదలెట్టాడు.

ఆ తిట్లకు బుట్టోని నాయనకు మెలకువ వచ్చింది. దిగ్గున లేచి కూర్చుని పక్కనున్న కొడవలిని చేతబట్టుకున్నాడు. కొడుకు తిడుతున్న వైపు చూస్తూ, “ఎవుర్రా నాయినా, ఎవురది?” అన్నాడు ఆదుర్దాగా. తండ్రి ముఖంలో కంగారును చూసేటప్పటికి బుట్టోని ఆవేశం మాయమై ఈ లోకంలోకి వచ్చాడు. పిచ్చి చూపులు చూస్తున్న కొడుకును రెండు అంగల్లో చేరుకుని, “కలేమయినా వచ్చిందేమిరా నాయినా? భయపణ్ణావా?” అంటూ పక్కనున్న నీళ్లచెంబును నోటికందించాడు. చెంబులో మొహాన్ని దాచుకుని బావురుమన్నాడు బుడ్డోడు. కొడుకును అంతగా కలవరపెడుతున్న విషయమేమిటో తెలియక శివుని ప్రాణం విలవిలలాడింది.

కొడుకు భుజం చుట్టూ చెయ్యివేసి “పద, నిద్దర పట్టేటిగా లేదుగానీ, మంచి యెన్నెల కాస్తావుంది, అట్టా తోటకల్లా తిరుక్కోనొద్దాం పద” అని బయల్దేరదీశాడు. ఇద్దరూ ఇంటిపక్కనే వున్న వేరుశనగ పొలాల వైపుకి వెళ్లారు. సన్నటి బాట వెంబడి తండ్రి ముందూ, కొడుకు వెనుకా నడుస్తున్నారు. “ఈ ఉక్కకు బొక్కల్లో వుండలేక తేళ్లూపాములూ బైట తిరుగుతా వుంటయ్. రోంత దావ సూసుకోని నడుసు” కొడుకును హెచ్చరించాడు శివుడు. ఆ పొలంలో ఎత్తైన తిన్నెపైన పెద్ద బండ వుంది. దానిపైన చేరి ఇద్దరూ తూరుపుదిక్కుగా కూర్చున్నారు.


బళ్లో ఆ ముందురోజు మధ్యాహ్నం నాగన్నసారు, పాఠం అయినాక డిక్టేషను చెబుతున్నాడు. పిల్లలంతా ఆయన చెప్పినది రాస్తూవుంటే, అయ్యోరు ఈతబర్ర చేతబట్టుకొని వాళ్ల మధ్య తిరుగుతూ గమనిస్తున్నాడు. బుట్టోడు మాత్రం పరధ్యానంలో వున్నాడు. వాలకం చూసి, బర్రతో వీపు మీద చిన్నగా కొట్టి, “ఏఁరా నారాయణా, ఏ లోకానుండావు? చెప్పేది రాయకుండా యగమల్లుకోని ఎక్కణ్ణో చూస్తాండావే!”, అంటూ ముందుకెళ్లిపోయాడు. బుట్టోడు వులికిపడి, “రాస్తా వుండా సార్” అంటూ మొహం దాచుకున్నాడు. అదే వీపు బుట్టోనిది కాక మరెవరిదైనా అయ్యుంటే బర్ర అంత మెత్తగా తాకివుండేది కాదు.

బడి వొదిలేసినాక నాగన్నసారు బుట్టోణ్ణి పక్కకు పిలిచి అడిగినాడు, “యేమిరా, నిన్నమొన్నట్నుంచి చూస్తా వుండా మనిషివి మనిషిగా లేవే, ఏంది కత?”. ఆ మాట అడిగే మనిషికోసమే పొద్దన్నుంచి చూస్తావున్నిట్టు, బుట్టోని కండ్లలో నీళ్లు తిరిగినాయి. అయ్యోరు వాని భుజం తట్టి సంగతేమిటో చెప్పమన్నాడు.

“పోయిన యండాకాలం శలవులకు ముందు…”
“ఊఁ …”

“క్లాసు కంతటికీ ఫస్టుగా వొచ్చినానని నాకు ఒక …. ”

పోయిన సంవత్సరం అన్ని పరీక్షల్లో యాభైకి నలబై ఐదు పైన మార్కులొచ్చింది ఆ బడి మొత్తానికి బుట్టోనికొక్కనికే. కష్టపడి చదువుకునే పిల్లలను చూస్తే నాగన్నసారుకు గొప్ప సంతోషం. బళ్లోని పిల్లలందరిముందూ బుట్టోణ్ణి పిలిచి, ‘అందరూ వీని మాదిరిగా శ్రద్ధగా చదవాల’ని చెప్పి, ఒక పెద్ద తెల్లకాగితం మీద ప్రాథమిక పాఠశాల ముద్రవేసి చేవ్రాలు పెట్టి, ‘నారాయణకు నేనిచ్చే బహుమతి… చప్పట్లు…’ అంటూ ఇచ్చినాడు. బళ్లో పిల్లలంతా చప్పట్లుకొడుతూవుంటే బుట్టోడు రవ్వంత సిగ్గుగా, చాలా గర్వంగా దాన్నందుకున్నాడు.

” … మా యింట్లో దాన్ని భద్రంగా దాచిపెట్టలేక పోయినా … చేత్తో పట్టుకుంటే చెమట అంటుతాదని పుస్తకాలమధ్యలో పెట్టి యింటికి తెచ్చి, మడత బెట్టకుండా దాన్ని మాయింట్లో దాయడానికి సరైన తావే కనపళ్లా. సగానికి మడవక తప్పలా. ఆ తరవాత పరీచ్చల్లో ఈ కాయితాన్ని వాడదామంటే మనసొప్పలా. అంచులు బైటికొచ్చి చినిగిపొయ్యేటిగా వుంది. మొన్న వానలకు కవరుసంచిలో దాచిపెట్టినా నా పుస్తకాలు నెమ్మెక్కినాయి. శలవులయ్యేటప్పటికి తెల్లకాయితం కాసింత పచ్చబడి, అంచులు పెళుసుబారిపొయినాయి. దాన్ని పట్టుకుంటే చినిగిపొయ్యేటిగా తయారౌతాంది. నువ్విచ్చిన బహుమతి నా సేతిలో మూణ్ణెల్లు కూడా నిలబడేటిగా లేదు సార్”, తల వంచుకొన్నాడు బుట్టోడు.

ఎంతో సంతోషంగా నవ్వి, “ఒక పన్జెయ్యి. ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన మాటలనే రేపు ఆ కాగితం మీద రాసుకొని రా. దానిమీద మన బడి ముద్ర, నా చేవ్రాలు వుండనే వుండాయి. నువ్వు రాసిన కథను రేడియోకు పంపుదాం. చిన్నపిల్లల కథలపోటీ వుందిలే. కాగితం బహుమతి నీకు ఎందుకు వచ్చిందో చెబుతూ మొదలుపెట్టు.” అన్నాడు.


పగలు కాసిన యర్రటియండకు బండ యింకా కాస్త వెచ్చగానే వుంది. మౌనంగా తదేకంగా చందమామనే చూస్తున్నాడు బుట్టోడు.

“యంత,.. వొక నూర్రూపాయల్లో దొరకదట్రా లేడియో?”
“…”

“కొందాము. మన చేతికి మించిందేమీ కాదుగదా!”
“ప్చ్…వొద్దులేయ్యా… నువ్వు జెప్పినమాటే రైటు… మనగ్గావాల్సింది రేడియో గాదులే…”

“ఊఁ… లేడియో వొద్దంటా!?”
“గాఠ్ఠి యిల్లు గావాల. రెడ్డేరి యిల్లట్టాటి మాంఛి బద్రమైన యిల్లు కట్టాల!” - బుట్టోని మాటలో గట్టి నిశ్చయం.

శివునికి ఫక్కున నవ్వొచ్చింది. నవ్వకుండా “ఊఁ…” అన్నాడు. మాటలకోసం తడుముకుంటున్నాడు బుట్టోడు. “ఐతే … యిల్లు కట్టుకుందామంటావ్…” అందించినాడు శివుడు.

“అవ్! యేమంటే … వస్తువేదైనా సరే భద్రంగా మన దగ్గర వుండాలంటే సరైన యిల్లు కావాల గదా? ఒక రేడియో కోసరమనే గాదు. పుస్తకాలుగానీ, మా అయ్యోరు నాకు బహుమానమిచ్చిన తెల్లకాయితం గానీ… ఆ కాయితానికీ నాకూ ఋడం తీరిందని - దాన్ని భద్రంగా దాయలేక నేను పడిన పాట్లన్నీ కథమాదిరిగా రాసి, తిరిగి అయ్యోరికిస్తి. ఆయన దాన్ని రేడియోకు పంపించినాడు. నెగ్గితే మన కథను, మన పేరును, బడిపేరునూ సదువుతారంట. అన్నీ మనం రేడియోలో వినొచ్చంట.”

“అట్లనా? ఐతే నీ పేరు రేడియోలో సదూతారంట్రా!?” - అబ్బురంగా అడిగినాడు శివుడు.

“కత బ్రమ్మాడంగా వుందన్నాడు మా అయ్యోరు. అయ్యోరు ఆ మాటన్నాడంటే ఏమని మరి? అందుకే ఈ రోజు మధ్యానము రెడ్డేరింటికి పొయ్యి, అయ్యా! వొచ్చే ఆదివారం రేడియోలో నా పేరు సదువుతారంట, నీతో పాటు నేనూ యింటానయ్యా అని అడిగితే, ఆడున్నోళ్లంతా గొల్లున నవ్విరి.”

‘ఆడున్నోళ్లంతా’ అంటే ఎవరో శివునికి తెలుసు. కొడుకు ప్రయోజకత్వానికి మురిసిపోతూ, అడిగాడు - “రెడ్డేరు ఏమన్నాడు?”

“ఏమీ అన్లా. వులకడూ పలకడూ …ఆయనకేమి మారాజు…”

“ఊఁ….”

కొడుకు భుజంమీద ఆప్యాయంగా చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు శివుడు. నాయన దగ్గరుంటే చాలు, యిల్లు కూడా అక్కరలేదనిపించింది బుట్టోనికి. అంతలో, వాళ్లింటి వాకిట్లో ఆశాభంగానికి గురైన కుక్క, నేలను వాసన చూస్తూ వచ్చి వాళ్లకు దగ్గరగా నిలబడింది. బుట్టోడు దాని మెడమీద చెయ్యేశాడు. కూస్ కూస్ అంటూ అది వానికి మరింత దగ్గరగా చేరింది. అది ఎక్కడో కడుపు నింపుకొని వచ్చినట్లు గ్రహించి శివుడు సంతోషపడ్డాడు.

“రెడ్డేరితో నేను పొద్దున్నే మాట్లాడతా గానీ… ‘ఆయనకేమి మారాజు’ అంటివే… ఆ మారాజు కూడా మనం పడే అవస్థనే పడతావుండాడు తెలుసునా?”

బుట్టోడు గిరుక్కున తండ్రివైపు చూసినాడు. కుక్క కూడా శివునివైపు తల తిప్పింది.

“అవున్రా. రెడ్డేరికి కారు మింద మోజు. కొనగానే అయిందా! మన బండ్లబాటల్లో అది నడవొద్దూ? ఈ రాళ్లలో గుంతల్లో వొక మైలు పరిగెత్తిందంటే దానికి వొళ్లు పులిసిపోతుందంట. దానికి వొళ్లు పులిసిందంటే, రెడ్డేరి జేబుకు తూటు పడినట్టే. వేలతో పని. లేడియో కొన్నాగానీ దానికి బ్యాటరీలెయ్యాలంటే మనకు ఎంత కరుసవుతాదో, కారు బాగోగులు సూడాలంటే రెడ్డికీ అంతే కరుసౌతాది. మనం యిల్లుగట్టడమెంతో రెడ్డేరు రోడ్లేయించడం అంత. ఈ యండావానలకు తలదాచుకోను కుక్కకు యిల్లులేదు. నాజూకైన వస్తువు దాచుకోను మనకు సరైన యిల్లు లేదు. కారు నడుపుకుండేదానికి రెడ్డేరికి సరైన రోడ్లులేవు. అంతా ఒకటేరా.”

అప్పుడే మెల్లగా కదలనారంభించిన పడమటి గాలివలెనే బుడ్డోని మనసు కూడా చల్లబడింది. తండ్రి భుజంమీద జారగిలపడి, చందమామను చూస్తూ అన్నాడు, “అంతా వొగటే అయ్యోవ్… సందమామ రెడ్డేరికీ మామే, మనకూ మామే, కుక్కకూ…!! దీనిగ్గూడా మామేనా అయ్యా?”

కుమారుని మాటలకు శివుడు ముచ్చటపడ్డాడు. సందేహానికి నవ్వుకొన్నాడు - “భూదేవితల్లి బిడ్డలందరికీ సందమామ మామేరా! కాకపోతే వొరే, నాలుగచ్చరాలు సదివినోడు మన వొగిశంలోనే లేడు నీ దాఁక. నువ్వు నా అంత పెద్దోనివయ్యే లోగా కచ్చితంగా యిల్లు కడతావురా సీనారాయుడా! ఇల్లేంది… రెడ్డేరికి రోడ్లుగూడా …”

“రెడ్డేరికేనా!?” అని నవ్వినాడు బుట్టోడు. శివునికి నవ్వు రాలేదు. తమ మాటలెవరైనా వింటున్నారేమోనని ఆదుర్దాగా చుట్టూ చూశాడు.

బుట్టోని పక్కనజేరి వెచ్చగా పడుకున్న కుక్క నిశ్శబ్దంగా ఆవులించింది. తెల్లారితే ఆదివారం.


పొద్దు కండ్లలో పడడంతో మెలకువొచ్చింది బుట్టోనికి. కండ్లు నులుముకుంటూ అరుగుదిగి బొంత మడతబెట్టినాడు. రాత్రి శనగచెట్లల్లో బండమీద నిద్రపోయినవాడు, తెల్లారేసరికి అరుగుమీదకెట్లా వచ్చినాడో వానికి తెలుసు. శివునికోసం యింట్లోనూ యింటిచుట్టూరా చూసి, కనబడకపోయేసరికి మళ్లీ శనగచేల దారిబట్టినాడు. తోవలో వేపమండ నొకదాన్ని తుంచి నములుతూ, మధ్యమధ్యలో “అయ్యోవ్…., వోయ్యా…” అని యెలుగెత్తి పిలుస్తూ నడవసాగినాడు.

వాడు పొలాలవెంట తిరిగితిరిగి కాళ్లీడ్చుకుంటూ యింటికి చేరేసరికి యండ చరచర మొదలవుతూ వుంది. తినడానికి యింట్లో తిండేమీ లేదు. తండ్రి కనబడకపోయేసరికి, ఆ పూట బువ్వెట్టాగోనని దిగులు మొదలయింది బుట్టోనికి. యింక మిగిలింది రెడ్డేరిల్లు. అక్కడుంటాడేమోనని బయల్దేరినాడు.

“ఇప్పుడు తెల్లారిందేమిరా!”, బుట్టోణ్ణి చూడగానే నిలేసింది రెడ్డేరమ్మ.

“లేదులేమ్మా, పొద్దన్నుంచీ మా అయ్య కోసరం చేలన్నీ తిరిగితిరిగి, యాడా కనబడక పోతే…, మనింటికాడ వుంటాడ్లే అని…”

“మొనగానివేలే! పొయ్యి నీ గిన్నె కడుక్కొచ్చుకో పో, రోంత సద్ది మిగిలుండాది, తాగుదువు.”

చల్లచల్లగా ఉప్పుప్పగా వున్న సద్దిలోకి నంజటగా యర్రగడ్డ నొకదాన్ని గబగబా కొరికి జుర్రుతూ వుంటే తెలిసొచ్చింది వానికి - వాడెంతగా ఆకలిగొని వున్నాడో.

సద్ది బలే వుండాదిమ్మా - అన్నాడు. “ఇంగో బారడు పొద్దుబొయినాఁక తాగితే యింగా రుచిగా వుంటాది”, నవ్వుతూ అంది రెడ్డేరమ్మ. మా రెడ్డేరమ్మ సల్లనితల్లి - అనుకున్నాడు మనసులో. “మా అయ్య యాడుండాడో నీకేమన్నా తెలుసునంటమ్మా”, అని అడుగుదామనుకుంటూ వుండగా, ఆమె యింట్లోకి పోయింది. బుట్టోడు గిన్నెకడిగి, మూతి తుడుచుకొంటూ వుండగా యింటి లోపలి నుంచి ఆకాశవాణి పలుకులు చెవినబడ్డాయి. అప్పుడు గుర్తొచ్చింది వాడు పంపిన కథ సంగతి. మరో పది-పదిహేను నిముషాల్లో కార్యక్రమం మొదలవుతుంది. తనపేరునూ బడిపేరును చదువుతారో లేదోననే ఆత్రం నిముషనిముషానికీ పెరిగిపోసాగింది.

సరిగ్గా రెండు నిముషాల తరువాత లోపలనుంచి “వొరే బుట్టోడా…” అని రెడ్డేరమ్మ పిలుపు. “అమ్మా”, అంటూ గబుక్కున తలుపుదగ్గరగా వెళ్లి నిలబడ్డాడు బుట్టోడు. “మన పెద్దమామిడితోట కాడ, పొద్దట్నుంచి నలుగురు మనుషులు కట్టెలు కొడతాండారు, మీ నాయన గూడా ఆణ్ణే వుండాడు, వాళ్లకు సంగటి జేసినా గానీ, నువు పొయ్యి యిచ్చిరాపో, యీపాటికే శానా పొద్దెక్కిబాయ”, అంటూ సంగటిబుట్ట వాని నెత్తినబెట్టేసింది. ఎంత గబగబా నడిచినా పోయిరావడానికి ఒక్క గంటయినా పడుతుంది. బుట్టోని బాధ ఇంత అని చెప్పడానికి వీల్లేదు. కండ్లలోకి నీళ్లు దిగగా, చేసేదిలేక అడుగులోఅడుగు వేసుకుంటూ ఆ సల్లనితల్లి చెప్పినట్టు పెద్దతోటవైపు సాగిపోయినాడు.


ఆరోజు సాయంత్రం యండవేడిమి చల్లబడ్డాక, ఇంటి ఆవరణంలో ఒక కానుగచెట్టు కింద, మంచాలమీద రెడ్డేరు, ఆయనతోపాటు ఆ వూళ్లోని పెద్దమనుషులు, చెట్టునీడన ఆ మంచాల చూట్టూ సన్నాబన్నా మనుషులు కూడా కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుతూవున్నారు. వానలు పడేవరకూ ఆ మాటలే వాళ్లకు తిండీ-నీళ్లూ. రెడ్డేరు సిగరెట్టు వెలిగిస్తూ, మొహమంతటినీ అగ్గిపుల్ల గీసిన చేతుల్లోకి భక్తిగా దూరుస్తూ, ఏదో గుర్తొచ్చినట్టు అడిగినాడు, “మన వూళ్లో శ్రీనివాసనారాయణ అనే పేరు గలవాడు యెవురన్నా వుండాడా? యెవురిపిల్లకాయ?” అని. అందరూ మొహామొహాలు చూసుకొన్నారు. “మనకు తెలీకుండా ఆ పేరుగల మనిసి యెవురబ్బా? తెలీదే, యాల?” అని అడిగినారు.

“మనవూళ్లోనే యెవురో పిల్లకాయుండాడు. వాడు రాసిన ఒక కతను సదివినారప్పా రేడియోలో! రాసినోని గొప్పదనమో, సదివినోని గొప్పదనమో గానీ… దాన్ని మీరు గనక వింటే కండ్లల్లో నీళ్లు తిరగాల్సిందే. వానికి సదువు కూడా బాగా వొస్తుందని మన బళ్లోని అయ్యోరి సర్టిఫికేటు.”

“మన బళ్లోనే!? మన వూరిపేరుగూడా చెప్పినారా?”, అన్నాడొక పెద్దమనిషి నమ్మకం లేనట్టు.
“వూరేగాదు, మండలం పేరు, జిల్లాపేరుగూడా చెప్పినారు. బోగస్ అయ్యే మాటే లేదు.”

“మన వూరిపేరు రేడియోలో వొచ్చిందంటే - అట్టాటి తెలివైన పిల్లకాయ గనక నిజంగా మనూళ్లో వుంటే వాణ్ణి చేరదియ్యాల. రోంత పుణ్యమైనా దక్కుతాది.”, ఇంకో పెద్దమనిషి వొళ్లు విరుచుకుంటూ అన్నాడు.
“నేనూ యిదేమాట అనుకుంటిలే!”, ఆమాత్రం ఔదార్యం తనకూ వుందని పోటీ పడినాడు రెడ్డేరు.

మంచం కోడుకు చేరగిలబడి, అంతవరకూ వాళ్ల మాటలన్నీ వింటూవున్న బుట్టోని మామకు - వీడు తన అల్లుడేనేమో - అనే అనుమానం వచ్చింది. ఇక ఆగలేక, సందేహిస్తూనే, “మా శివమామ కొడుకుపేరుగూడా సీనారాయుడనే పెట్టుకునిందిలే వాళ్లమ్మ గూడా”, అంటూ నసిగినాడు. సరిగ్గా ఆ సమయానికి బుట్టోడు, వాని స్నేహితుడు పెంచలుగాడు నిలువుగా కోసిన ట్రాక్టరుటైరు ముక్కలను జానెడు పొడవున్న కానుగ కట్టెలతో కొట్టి దొర్లిస్తూ, ‘రఁయ్ రఁయ్’ మని అరుస్తూ, పోటీలుబడి అటుపక్కనుంచీ పరిగెడుతున్నారు. బుట్టోడు రేడియో వింటానని నసిగిన సంగతి అప్పుడు మసకమసగ్గా తట్టింది రెడ్డేరికీ, నిన్న ‘ఆడున్నోళ్లు’ కొందరికీ. కానీ వాళ్లకు పూర్తి నమ్మకం కలగలేదు. బుట్టోడు పరుగెత్తుకుంటూ వాళ్లకు దూరమయ్యే లోపు, మంచం మీద కూర్చోనున్న ఒక పెద్దమనిషి “రోయ్, ఓరి సీనారాయుడా, యిట్రారా” అని పిలిచినాడు.

బుట్టోనికి కాళ్లకు సడన్ బ్రేకు పడింది. టైరుమాత్రం దొర్లుకూంటూ పోయి ఒక రాయికి తగిలి ఎగిరి కిందపడింది. పెంచలుగాడు కొంతదూరాన నిలబడినాడు. బుట్టోడు వెనుకకు తిరిగి చూసినాడు. “పిలిసింది నిన్నే …రారా బేగ” చెయ్యి వూపుతూ పిలుస్తున్నాడు బుట్టోని మామ. అందరి ముఖాలూ బుట్టోనివైపే చూస్తున్నాయి. పెంచలుగాడు టైరుతో సహా మాయమైనాడు. మామూలుగా యే బీడీలకట్టో అగ్గిపెట్టో తేవడానికి పిలుస్తారు. చిల్లర ‘వుంచుకో రా’ అంటారు. కానీ ఇప్పటి పరిస్థితి అట్లా లేదు. బుట్టోనికి భయం మొదలయింది. చెతిలోని కానగకట్టెను పారెయ్యాల్నో వద్దో తెలీనట్లు పట్టుకొని, అడుగులో అడుగు వేసుకుంటూ, వాళ్ల ఎదుటకు వచ్చి, ఎందుకైనా మంచిదని కొంత దూరంలో నిలబడినాడు.

“నీ పేరేమి రా?” అడిగినాడొక పెద్దమనిషి.

‘ఓరి సీనారాయుడా’ అని పిలిచి పేరడుగుతూ వున్నారంటే యిది మామ చేసిన ఎకసెక్కెపు పనే ననుకున్నాడు.
“నీ పేరంట. చెప్పరా…” అన్నాడు మామ. బుట్టోడు మాట్లాడకుండా అనుమానంగా చూస్తూ నిలబడినాడు.

రెడ్డేరు అడిగాడు, “బళ్లో నీ పేరేందిరా?”
“శ్రీనివాస నారాయణ”

“రేడియోకు కథ రాసింది నువ్వేనా?”
“నాగన్నసారు రాయమంటే రాస్తి.”

“ఈరోజు నీ కత, నీ పేరు, మన వూరిపేరు రేడియోలో వొచ్చిందిరా! రేడియోలో మనూరిపేరు రావడం యిదే మొదులు.”
రెడ్డేరు బుట్టోణ్ణి దగ్గరికి పిలిపించుకొని వీపుతట్టి మాట్లాడుతున్నాడు. బుట్టోనికి అది కలో నిజమో అర్థంకాలేదు.
కట్టెలు కొట్టే పని ముగించుకొని, బుట్టోణ్ణి వెతుక్కుంటూ అక్కడికి చేరిన శివునికి సంతోషంతో మాట రాలేదు.
వూరిలోని పెద్దమనుషులందరూ వాణ్ణి మెచ్చుకుంటున్నారు. వాణ్ణి చదివిస్తానన్నాడు రెడ్డేరు.

ఆ సాయంత్రం పొద్దుగూకిన తరువాత అందరికీ దండాలు పెట్టి, బుట్టోణ్ణి యింటికి తీసుకుపోయి పరకపుల్లలు కాల్చి దిష్టితీసినాడు శివుడు.


ఆ రోజునుంచీ బుట్టోని పేరు శ్రీనివాసనారాయణగా వూర్లో అందరికీ తెలిసిపోయింది. “సీనారాయుడూ…” అని ఎవరైనా పిలిస్తే వాడిప్పుడు సిగ్గుపడడు.

కామెంట్‌లు

ఆద్యంతమూ ఆసక్తిగా సాగింది
కొత్త పాళీ చెప్పారు…
Excellent job Ranare!
sunita చెప్పారు…
Too good.
వేణూశ్రీకాంత్ చెప్పారు…
చాలా చాలా బాగుంది రానారే గారు.
GIREESH K. చెప్పారు…
8/10
Unknown చెప్పారు…
చాలా చాలా బాగా వ్రాసారండి. అభినందనలు.
balarami reddy చెప్పారు…
anna chaana baaga raasinav
15/10
కొత్త పాళీ చెప్పారు…
మళ్ళా కథనంతా ఒక సారి చదివా. చివరాఖరికి వొచ్చేప్పటికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. అద్భుతంగా రాశావు రాంనాథా.
శ్రీ చెప్పారు…
ఇది తెలుగునాడి లో కూడా వచ్చింది అంది... ఇది చదివి ఇయనకి కాల్ చేస్తే రామనాథ రెడ్డి గారు ఎప్పుడు బిజీ ...
KumarN చెప్పారు…
రానారె గారూ,
నేను సాధారణంగా మాండలీక ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న కధల్ని తొందరగా పేజీలు తిప్పేయడం కాని, అసలుకే వదిలేయడం కాని చేస్తుంటాను.

గత సంవత్సర కాలంగా మీర్రాసినవన్నీ కూడా ఒక్క అక్షరం వదిలేయకుండా చదివా. ఆ యాస మనసులో మాట్లాడుకుంటూ చదివితే ఆ అనుభూతే వేరు. సద్దన్నంలో ఎర్ర బద్ద వేసుకొని తిన్నట్లే.

బహుశా పెరిగిన వాతావరణం చాలా చాలా దగ్గరగా ఉండడం వల్లనుకుంటా, మీర్రాసినవి చాలా తొందరగా, దగ్గరగా అతుక్కుంటాయి నాకు.
shankar చెప్పారు…
1o/10
కమల్ Kamal చెప్పారు…
maa oori kathalaa undi very nice

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ