ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమ్మను తిట్టగాకురా నీయమ్మనాయాలా

మా యీరబల్లెలో సుబ్బమ్మ అని పాపం ఒక ముండమోపామె వుండేది. నేను శ్రీ శ్రీనివాసా కాన్వెంటుకు పొతాన్నెప్పుడు చేత కట్టె బట్టుకొని, అడుగులోఅడుగేసుకొంటా, మెల్లిగా రోడ్డెంబడీ శివయ్యంగడికాడికి వస్తా కనబడేది. ఆఖరిగా ఏడోతరగతి పబ్లిక్ పరీచ్చలప్పుడు చూసినానంతే.

ప్రతిదినామూ కనిపిచ్చే సుబ్బమ్మకు పాపం ఎవురూ లేరని నాకెవరో చెప్పినప్పుడు - "ఐతే, ఆమెప్పుడన్నా పాలుమాలితే ఏమి గతీ?" అనేది నాకొచ్చిన మొదటి అనుమానం. యాల్నంటే, కాన్వెంటుకు పొయ్యి వచ్చేటప్పుటికి నాకు దినామూ తల నొచ్చేది. దొంగ తలనొప్పి కాదు. నాకు తలనొస్తే మా నాయనకు తలనొచ్చినట్టుగా బాధపడతాడు. మాయమ్మ ఆముదం పట్టు వేసేది. కణతలు నొక్కేది. కాఫీ జేసిచ్చేది. అనాసిన్ సగం తుంట మింగిచ్చేది. పాత గుడ్డతో తలను బిగిచ్చి కట్టేది. కాళ్లొత్తేది. నేను నిద్దరబొయ్యేదాక ఆణ్ణించి కదిలేదిగాదు. ఇట్టగాదన్జెప్పి కాన్వెంటు మానిపిచ్చేసింది. సుబ్బమ్మకు తల నొస్తే ఏమి గతి? జొరమొస్తే కాళ్లొత్తే మాట పక్కనబెట్టు, రోంత కూడు వుడకేసేవోళ్లెవురు?

ఎవురో వొగరు వుంటార్లే అనుకుండేదానికిల్యా. యేమంటే, సుబ్బమ్మ మొగం జూస్తే దరిద్రమని మా కాన్వెంటు పిల్లకాయల నమ్మిక. బడికిపొయ్యేటప్పుడు గడిగోట రోడ్డుమింద ఎదురుగ్గా ఆమె కనిపిచ్చిందంటే సాలు అందురూ ఒగరినొగరు యెచ్చరిచ్చుకొని, ఆమె దాటిపొయ్యిందాఁక తలలు దించుకొని గబగబా నడిసేవోళ్లు. అందురూ భయపడేది చూసి నేనూ కొన్నాళ్లు అట్నే జేసినా. ఆమె దాటిపొయినాఁక కొందరుపిల్లకాయలు ఆమెను తిడతా ఇటికపెళ్లలూ రాతిబెచ్చలూ ఆమె మిందికి యిసిరేసేవాళ్లు. బళ్లోనేమో కందుకూరి వీరేశలింగమూ రాజారామ్మోహనరాయి. బయటేమో సుబ్బమ్మకు తగిలీతప్పొయ్యేటిగా యిసిరేసే రాయి. ఇటికపెళ్లను రోడ్డుకేసి ఠఫీమని కొడ్తే అది నుజ్జునుజ్జయి, ఆ మన్ను సుబ్బకు తాకాలని పంద్యాలుగట్టేవోళ్లు.

వొగరోజు నేను బడికి ఆలస్యంగా వస్తావుంటే దారిలో సుబ్బమ్మ మొగం కనబడింది. నాకు రోంత భయమేసింది. ఆపొద్దు మొదటి పిరుడు శేఖరమాస్టరు చెప్తావుండాడు. లేటుగా వచ్చినందుకు నన్నేమీ అన్లా. నిన్నటి పేపర్లిచ్చినాడు. మంచి మార్కులూ వొచ్చినాయి. అసలు ఆ రోజంతా దెబ్బల్లేవు. నాకు సుబ్బమ్మంటే బయం ల్యాకండాబొయ్యింది. అంతేనా? ఆరోజు ఇంటికొస్తావుంటే మాదిగపల్లె దాటుకున్యాక రోడ్డుమింద రూపాయబిళ్ల దొరికింది. కొత్తది. మినమినా మెరిసేబిళ్ల. తీసి, ఉఫ్పుమని దుమ్ము పొయ్యేటిగా వూదేసి, నిక్కరజేబీలో యేస్కోని రఁయ్యన ఇంటికి పరిగెత్తినా.

ఆ మరుసురోజు సుబ్బమ్మ కనబళ్లా. ఆ పై దినమూ కంటబళ్లా. నేను దినామూ చూస్తానే ఉండా. నాలుగోరోజు మళ్లా కనబడింది. సుబ్బమ్మ మొగాన్ని తేరిపారా చూస్తా అనుకున్యా - పది రూపాయల నోటు దొరకాల సామీ - అని. నాలుగంటే నాలుగే అడుగులు. గడికోట రోడ్డుమింద అర్థరూపాయ బిళ్ల. దాన్ని చేతికి తీస్కోగానే ఒక సాయిబూల పిల్లకాయ వచ్చి, "మా యింటిముందర పడిపోయిందది మాది" అని చెయ్యి సాపె. ఔరా కొడకా! అనుకుంటి. మనం శ్రీనివాసా కాన్వెంట్లో యస్పీయల్ కదా! "ఈ రోడ్డుమింద బస్సు నిలబడతాది అదిగూడా నీదేనా? దోవనపొయ్యే ట్రాక్టర్లు, యెద్దలబండ్లు, గొడ్లూ అన్నీ నీయ్యేనా? నీయట్టాటోళ్లను చానామందిని చూసినాం పోరా పెద్దమణిసీ!" అని మాట్టాడితి. "ఈణ్ణే వుండు" అని వాడు నన్ను మంత్రమేసినట్టు నిలబెట్టి, అక్కసుగా ఇంట్లోకి బాయ. వాడు ఎవురినో పిల్చుకొచ్చి పంచాయితీ బెట్టిందాఁక మనం ఆణ్ణే వుంటామా?

మిగతా తొమ్మిదిన్నర సాయంత్రంలోగా దొరికుతుందిలే అనుకుంటా బడికొచ్చేస్తి. ఆరోజు పొద్దుబొయ్యేదాఁక చూసినా ఏమీ దొరకలా. బంగారుగుడ్లు పెట్టే బాతుకథలో మాదిరిగా వొగటేరోజు పది రూపాయలు కావాలనుకున్నందున ఈరోజు అర్ధరూపాయే దొరికిందిలే అనుకున్యా.

మళ్లా చాన్నాళ్లు సుబ్బమ్మ కనబళ్లా. వొగరోజు ఆదివారము మా పెద్దతోటకాడికి పోతావుంటే మంచినీళ్లబాయి కాడ కనబడింది. నేరుగా ఆమె మొగంలోకే చూస్తి. ఇంత లెక్క కావాల అని కోరుకోలా. యెంత ప్రాప్తముంటే అంత దొరకనీలే అనుకున్యా. మంచినీళ్లబాయికాడ చిన్న మోరీ ఒకటుంది. నువ్వు నమ్మూనమ్మకపో, ఆ మోరీ కింద ఒక రూపాయనోటు కనబడింది. ఏమీ మహత్యమూ, సుబ్బమ్మమింద కనికరం వుంది కాబట్టి దేవుడు నాకు మేలుచేస్తావుండాడేమో అనుకుంటి.

ఆ తరవాత రెండుసార్లు, "ఈరోజు నాకు రోంత లెక్క దొరుకుతుంది" అని గట్టిగా అనుకోఁగానే ఐదు రూపాయలు దొరికింది. ఇదంతా ఎవురికైనా చెబితే లెక్క దొరకడం మానేస్తుందేమోనని నేను ఎవురితో చెప్పకుండా గమ్మునే వుండిపోతి. ఆ తరవాత దొరకడం మానేసింది. సుబ్బమ్మ గురించి కాక, లెక్క గురించి ఆలోచనలెక్కువైపోవడాన దొరకలేదేమోలే అనుకున్యా. ఆమె మాత్రం అప్పుడప్పుడూ కనబడతానే వున్నింది.

ఏడో తరగతి పబ్లిక్ పరీచ్చలప్పుడు ఒకసారి కనబడింది. నాకు మంచి మార్కులు రావాల అనుకుని సుబ్బమ్మ నన్ను తొలగి పొయ్యిందాక చూస్తానే వుంటి. ఏడులో మండలం ఫస్టు మనమే! మా నాయన్ను మా హెడ్మాస్టరూ ఆయన భార్యా టీపార్టీ అడిగినారంట. ఇంటికొచ్చి మాయమ్మతో చెప్పినాడు. టీపార్టీ అనే మాట అంతకుముందెప్పుడూ నేను విన్లా. నాకు తెలిసిన పార్టీలు రెండు రకాలు. గలాటాలూ తగరాదులూ పడే పార్టీ ఒకటి. రెండో రకం కాంగ్రేసూ తెలుగుదేశం పార్టీ. ఏ ఫార్ యాపిల్ అన్నిట్టుగా టీ-పార్-టీ బలేవుందే అనుకుంటి. టీపార్టీ అంటే ఏందిమా అని మాయమ్మను అడిగితి.

మా టీచర్లంతా నన్ను మెచ్చుకున్యారు. మా నాయనకు శానా సంతోషమయ్యింది. టీపార్టీ అంటే ఏందో నాకప్పుడు తెలిసింది. ఆ టీపార్టీ ఇచ్చేసి సాయంత్రం ఇంటికొస్తావుంటిమి. వచ్చేటప్పుడు "సుబ్బమ్మ కనబడితే బాగుండు" అనుకుంటి. కనబళ్లా.

సుబ్బమ్మ మిందికి రాళ్లేసినోళ్లూ, ఆయమను చూసి బయపణ్ణోళ్లూ, ఎదురొచ్చిందని తిట్టుకున్నోళ్లూ, నేనూ - అందరమూ ఒకటే జాతి ఫో అనిపిస్సాదిప్పుడు. వీరేశలింగమూ రామ్మోహన్రాయీ నన్ను జూసినారంటే ఇటికరాళ్లు తీసుకొని యంటబడతారేమో! :-)

కామెంట్‌లు

kiraN చెప్పారు…
ఎప్పటిలా భలే ఉంది అని చెప్పను.
ఎందుకంటే ఇప్పటివరకూ నువ్వు రాసినవాటిలో ఇది నాకు చాలా నచ్చింది.

మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
ఎవ్వరూ లేని ఒకామెను గురించి ఆలోచించావు ఆ వయసులో అది చాలు.- కిరణ్
ఐతే OK
చైతన్య చెప్పారు…
బాగుంది :)
మీరు రాసే భాష చదవటం నాకు కొంచం కష్టమే ... అయినా చదువుతున్నా... అర్థమవుతుంది కుడా... కొన్ని పదాలు context ని బట్టి అర్థం చేసుకున్నా.

పైకి కాస్త కామెడీ గా అనిపించినా... ఏదో depth ఉందనిపిస్తుంది!
నాకైతే బాగా నచ్చింది!
Bhãskar Rãmarãju చెప్పారు…
౧౦/౧౦

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ