ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మా హౌసు లీడరు బయపురెడ్డి

చిన్నప్పుడు నేను శానా సన్నగా వుండేవోణ్ణి. అందుకే మా ఇంట్లో నా పేరు వూసోడు. "ఊసన్నా" అనేవోడు మానాయన. పిలుపు యినబడతాన్నెపాటికే నాయన ఎదురుగా నిలబడాల. అది మాకిచ్చిన ట్రైనింగు.

పిక్కల్లో పిడికెడు సియ్య ల్యాకన్న్యా, ఊసుకొవ్వు తక్కవ లేదమ్మా యీనికి, అనేది మాయవ్వ. ఆ అనడంలో వొగ మురిపెం వుంటాదిలే. మన బిడ్డలు పెద్దమొగోళ్లైపోతాండారు అని సంబరపడినట్టుగా వుంటాదామాట. అందుకే మాయవ్వ యేమన్న్యా పెద్దగా పట్టింపురాదు. మేము కొవ్వుపనులు చేసినా మమ్మల్ను యేమన్నా అనకపోతేనే పట్టింపు.

అవ్వతో మాటామాట పెరిగితే "ఆ ముక్కు జూడు .. సక్కదనాల ముక్కు .. యెంత వందనంగా వుండాదో" అని యెక్కిరించేది. ఆమె పేరు చెన్నమ్మ. మాయవ్వకు తెలీని సంగతి వొగటుండాది. తెలీనప్పుడు మనమైనా చెప్పాల గదా అని, "నా ముక్కు చిన్నదైనా చెన్నమ్మ ముక్కుకంటే మేలైందేలే" అంటాననుకో, అప్పుడు మాయమ్మకు కోపమొచ్చేస్సాది. "వూసోడా, తన్నులు గావల్నా" అంటాది. నిజం జెప్పాల్నంటే, లోపల్లోపల అమ్మ నవ్వుకుంటా వుంటాది.

పెండ్లికి ముందొకసారి మాయమ్మను చూసేదానికి వాళ్లింటికి వొచ్చిందంట మావవ్వ. అప్పుడు మా చిన్నమ్మ వొగామె, "ఎవురో కోసినట్టుగా వుండాదే మీయత్త ముక్కు?", అనిందంట. అమ్మే ఈ సంగతి నాతో చెప్పింది. ఇప్పుడేమో కోపంగా చూసి 'తన్నులు గావాల్నా?' అంట. అది కోపమూగాదూ పాడూగాదూ, మొగమాటం కొద్దీ అవ్వ ముందర నన్ను గదమాయించకపోతే బాగుండదని, అట్ట మాట్టాండతాండాదని నాకు తెల్సు. ఆ చూపుతో నేను కుదురుగా నిలబడిపోయి నేలచూపులు చూస్తా, "తన్నులు గావాల్నా? అని యంత బాగ అడిగినావుమా! నాదే అలస్యం. అడగకనే అమ్మయినా పెట్టదనే సామెత చెప్పినోడు యెవుడు మా?" అంటాను. అమ్మకంటే ముందుగా అవ్వ నవ్వేస్తాది.

ఇంట్లో నన్ను వూసోడా అన్న్యా నాకేనాడూ అవమానంగా తోచలా. బయటోళ్లెవురూ నన్నాపేరుతో పిలిచిందేలేదు. నా వయసుకు తగినట్టు ఆటల్లోగాని, సుమారైన పనికి గానీ నేనెప్పుడూ తగ్గిందీలేదు. మా యింట్లో పాలు, పెరుగు, నెయ్యి, పప్పు, మాంసం కొదవల్యాకండా వుండేటియి. నేను మాత్రం సన్నఁగానే వుండేవోణ్ణి!

****** ******

మా వూర్లో రామూసార్ అని ఇంగ్లీషు గ్రామరు చెప్పే సారు వొకాయన వుండాడు. ఆరోతరగతి యండాకాలం శలవల్లో ఆయన దెగ్గిరికి ప్రవేటుకు పంపించినాడు మా నాయన. ప్రవేటు ఎక్కడా అంటే మా అరేరాజుల దేవళంలో. అరేరాజులంటే హరిహరాదులు. పాతకాలంలో విష్ణుభక్తులూ, శివునిభక్తులూ కొట్లాడుకుంటా వుంటే, యిద్దరికీ కలిపి వొగటే దిన్నెమింద కట్టించినారంట దాన్ని. విష్ణుమందిరం తలుపులకూ గడపకూ మధ్యలో రోంత సందుంటాది. ఆ సందు యంత చిన్నదంటే దాంట్లో నేను తప్ప నా తోటిపిల్లకాయల్లో యింగెవురూ దూరి లోపలికి పోలేకపొయినారు. బైట యండ చరచరా కాస్తావున్న్యా దేవళం లోపల సల్లగావుంటాది.

దొంగతనంగా ఆ సందులో గుండా లోపలికి దూరి, "ఓ....మ్.." అంటే అదో రకంగా యినబడేది. ఘనాఘనసుందరా పాట మొదట్లో వచ్చే హరివోం మాదిరిగా. నా గొంతు నాకే ఎంతో బాగున్నిట్టుగా వుండేది. నాకొచ్చిన పాటలూ పద్యాలూ శ్లోకాలూ అన్నీ పాడేవోణ్ణి. వొగరోజు నేను లోపలుండగానే రామూసార్ వచ్చి బీగం తీసి లోపలికొచ్చేసినాడు. ఆయన యనకాల్నే పిల్లకాయలంతా వచ్చేసినారు. ఆయనొచ్చేది చూసి, A noun is a word that describes a person, place or thing... అని గడగడా చదవడం మొదులుబెట్టేసినా. రామూసారు నన్ను కొడతాడని అందరూ బయపణ్ణారు. లోపలికి ఎట్టొచ్చినావురా అని గూడా అయన నన్ను అడగలా.

అడ్డపల్టీలు, నిలువుపల్టీలు, కొన్ని యోగాసనాలు సులువుగా యేసేవోణ్ణి. నేను సన్నంగా వుండబట్టి అంత అలాగ్గా యేస్తాండానని అనేవోళ్లు నా తోటి పిల్లకాయలు, పెద్దోళ్లు గూడా. చొక్కా తీసేసి, పొట్టను లోపలికి బిగబట్టే పోటీ వొగటుండేది మా పిలకాయల్లో. దాంట్లో కూడా నేనే ఫస్టు. ఏ రకంగా చూసినా సన్నగా వుండడం గొప్పసంగతే.

****** ******


నాకూ నారాయణకూ అం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల, ముక్కావారిపల్లె, కడపజిల్లాలో ఎనిమిదో తరగతి సదివేదానికి సీటొచ్చింది. అప్పుడు మా వూళ్లో అదో గొప్పసంగతి. సంబరంగా చేరిపొయినాము. కొన్నాళ్లకు హాస్టలుబతుక్కు అలవాటుపణ్ణాము.

వొగరోజు బక్కీట్లతో నీళ్లుమోసి చెట్లకుపోసే పనిబెట్టినాడు మా పీయీటీ పెంచలయ్యసారు. వొక్కోరూ యిన్నిన్ని బక్కీట్లు పొయ్యాలనేది రూలు. నా బక్కీట పెద్దది. దాని కమ్మీ సన్నది. వేళ్లను నలిపేసేది. అరచెయ్యి కోసుకుపొయ్యేది. బకీట అంచు కాళ్లకు తగిలేది. బక్కీటకు యీపక్క ఒక కాలు, ఆపక్క వొక కాలూ వేసి నిలబడి, మధ్యలో రెండుచేతుల్తో కమ్మీని పట్టుకొని లేపి, అట్టో అడుగూ ఇట్టో అడుగూ యేసుకుంటా, నీళ్లు తొణక్కుండా చెట్టుదాఁక మోసుకుపొయ్యి పోసేటప్పటికి పదోతరగతి పబ్లిక్ పరీచ్చ పాసైనట్టుగా వుండేది నా పానానికి.

మాకన్నా యెంతో పెద్దోళ్లుగా కనబడేవోళ్లూ బలమైనోళ్లూ కండబట్టినోళ్లూ మా తరగతిలోనే వుండారు. వోళ్లు నీళ్లబక్కీటను అలాగ్గా వొంటిచేత్తో మోసకపొయ్యేది చూసి, అప్పుడనిపించిందిబ్బా నేనుగూడా రోంతొక్కరొవ్వ లావుంటే బాగుండునని. పోన్లే, నేను రోంత జంపుగా (ౙంపుగా) అయినా వుండా. అదిగూడా లేనోళ్లు పడే అవస్థలు చూస్తే పాపమనిపిస్సాది.

మా క్లాసులో బయ్యపురెడ్డి అని వొక కచ్చనాయాలు వుండాడు. వాడే మా హౌసు లీడర్. మా పెంచలయ్యసారు నీలమేఘశ్యాముడైతే వీడు ఆయన బంటు ఆంజనేయుడు. బయ్యపురెడ్డికి నీళ్లుమోసే ఖర్మ లేదు. మేము వొగోరం ఎన్ని బక్కీట్లు మోసినామో రాసుకోవడమే వాని పని. బక్కీట్లో కొన్నినీళ్లు తొణికి కిందపడిపోతే బయపురెడ్డి ఆ బకిడీకి లెక్క రాయడు. వానితో మంచిగా వుంటే అరబకెట్ అని రాస్తాడు. అరగాసు పనికోసం వోని గడ్డంబట్టుకోవాల్నా అని బిర్రు నాకు. ('కొంచెముండుటెల్ల కొదవగాదు' అనే మాట ముండమోపిమాట, మురికిమాట అనేది అప్పుడు నామతం.)

నా బిర్రు జూస్తే బయపురెడ్డికి అస్సలు పడేదిగాదు. మావూళ్లో అయితే నాయంతటోణ్ణి నేనే. బళ్లోమాత్రం బయ్యపురెడ్డంతటోడు లేడు. ముఖ్యంగా పీయీటీసారు దగ్గిర. యింత బతుకూ బతికి బయ్యపురెడ్డి కాళ్లూగడుపులూ పట్టుకుండే కర్మ నాకేమని, నా సావు నేను సచ్చేవోణ్ణి.

నిజ్జంగా అయితే, నేను బయపడేది బయపురెడ్డికి కాదు. చిన్నదానికీ చితకదానికీ కూడా చితగ్గొట్టేసే పెంచలయ్యసారుకు. సదువుల్లో యేనాడూ మనం బయపడింది లేదు, ఐవోర్లతో దెబ్బలు తినిందీ లేదు. ఇన్నాళ్లూ బడి అంటే సదువు మాత్రమే వుండేది. ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాలలో చేరినాఁక, బడంటే బయ్యపురెడ్డిగా తయారైంది. క్లాసుల్లో వున్నంతసేపూ బాగుంటాది. బయటికొచ్చినాఁక బయపురెడ్డికి నొప్పితగలకండా నడుసుకోవాల. ఎందుకంటే హాస్టల్లో వాడు ఎప్పుడు డ్యూటీలో వుంటాడో, ఎప్పుడు వుండడో వానికే తెలుసు, వానితో మంచిగా వుండేవోళ్లకు తెలుసు. మా పీయీటీని పెట్ అని పిలుచుకోవాలనుకో, వొళ్లు దెగ్గరబెట్టుకోని, బయపురెడ్డిగాడు ఆ సుట్టుపక్కల యాడన్నా వుండాడేమో సూసుకోవాల. ఇట్టాటి తలనొప్పులు లచ్చాతొంబైరెండు.

మామూలుగా ఐతే, మోటరునీళ్లు బక్కీట్లతో పట్టుకోని చెట్లకు మాత్రమే పొయ్యాల. మనం పోసుకుంటే కరంటు దండగ. పాదులన్నీ నిండినాఁక 'ఇంకచాలు పోండివోయ్, స్నానాలు చేసి ప్రేయరుకు రాపోండి' అంటాడు పెంచలయ్యసారు. వెంటనే మోటర్ ఆపేస్తాడు బయ్యపురెడ్డి. ఆ మాట యినబడతాన్నెపాటికే పిల్లకాయలందరూ బక్కీట్లతో బోరింగు(చేతిపంపు)కాడికి గబ్బగబ్బగబ్బా పరిగెత్తి క్యూలో బక్కీట్లు పెడతారు. ఆ పెట్టడంలో చానా కొట్లాటలు, నిష్టూరాలు, గలాటాలు. వొగోరోజు బోరింగుకాడ పెంచలయ్యసారు వుండడు. అప్పుడు క్యూ వుండదు. బోరింగు మూతికాడ కొన్ని బక్కీట్లు పగిలిపోతాయి. 'సాయంత్రం నీళ్లుబోసుకుంటే సరిపోలా!' అనుకుంటాన్నేను.

అందుకే, ఆరోజు పొద్దన్నే నా వాటా పదిబక్కీట్లూ చెట్లకు పోసేసి, బయపురెడ్డితో నా పేరుపక్కన టిక్కుపెట్టించుకున్యాక, స్నానానికి అదరాబదరా మోటరు నీళ్లతో బక్కీట నింపుకొని పక్కన పెట్టుకున్యా. అది బయ్యపురెడ్డి చూసినాడు. అప్పటికి 'ఇంకచాలు పోండివోయ్' అనేమాట యినబళ్ల్యా.

నేను చూస్తావుండఁగానే "యెవురోడు" అంటా పెంచలయ్యసారు మోటరు దగ్గరికి వొచ్చేశ. బయపురెడ్డి నాకల్లా చూశ. పిల్లకాయలందురూ చూస్తాండారు. పట్టుడుకోడి మాదిరిగా ముడసకపొయ్యి, 'ఈ వొళ్లు నాదిగాదు పో' అనుకొని నిలబడిపోతి. రెండడుగుల్లో మా పీయీటీ నా ముందరికొచ్చి యింతెత్తున చెయ్యెత్తె. మొగంలో రగతం లేనిట్టుగా కండ్లుమూసుకుని, ఎడమచెంపను ఆ చేతికిచ్చేసిన నన్నుజూసి, ఆయనగ్గూడా రోంత కనికరం గలిగిందో యేమో, నన్ను కొట్టలా.

యింగా దెబ్బ పళ్లేదేమిరా - అని మెల్లిగా వొక కన్ను కొంచెం తెరిసి చూస్తి. "కోడ్తే ముదరకపోతావ్..వొకదెబ్బకు తక్కువ రెండేట్లకు ఎక్కువా నువ్వు..పోవోయ్..పో" అనేసి, పొడుగ్గా నల్లగా కదిలిపోయ. 'వూసోడా' అనేమాట నేరుగా అనేదానికీ, ఈమాటకూ శా..నా తేడా వుండ్లా!?

బయపురెడ్డి యీసడింపుగా నన్నొక చూపుజూశ. నాకు దెబ్బలు తప్పిపోవడం వోనికి మింగుడుబళ్ల్యా.

మా పెట్ నన్ను అనిన మాటతో చిన్నప్పుడు మా నాయన పిలిచే పిలుపు గుర్తొచ్చ. బయపురెడ్డికి నామింద ఎందుకంత కసో నాకు అర్థంగాక, వాణ్ణి ఏమీ చెయ్యల్యాకపోతాండామే అనే కసితో, నా కనుగుడ్ల నీళ్లు దిగబోతా వుండఁగా, బయపురెడ్డిగాడు చూస్తే సంబరపడతాడని, గబగబా నాలుగు మగ్గులనీళ్లు ముంచి తలమింద పోసేసుకుంటి. ఆ మాట అనకండా, మా సారు నన్ను పెట్లకొట్టినా అంత నొప్పిగా వుండేదికాదేమో. స్నానం పూర్తయ్యేలోపల నా దుక్కం తగ్గి వొక గట్టి నిర్ణయానికొచ్చేసినా - బయ్యపురెడ్డిగాడు నిద్దరబొయ్యేటప్పుడు బ్లేడుతో కసక్కన కోసిపారేసి, దాన్ని మా పెంచలయ్యసారు చేతిలో పెట్టి, రాజంపేట బస్సెక్కి ఇంటికొచ్చెయ్యాల అని.

***********

అనుకున్నియ్యన్నీ జరగవుగదా! మా బయపురెడ్డి ఇప్పుడు యాడుండాడో ఏంజేస్చాండాడో ఏమోగానీ, మేం తొమ్మిదోతరగతికి వచ్చేటప్పుటికి నన్ను మనిషిగా చూడబట్టినాడు, నాకూ బయపురెడ్డి వొక మామూలు మనిషిగా కనబడబట్టినాడు.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
బావుందండీ... మీ టపాలు చదవి మీ విసనకర్రనైపోయా.. తెలుగంటే మా కృష్ణా జిల్లా వారిదే అనుకునే నాలాంటి వాళ్ళకి ఇతర మాండలీకాల తియ్యదనం చూపించిన మీకు ధన్యవాదాలు.. మీ బ్లాగుతో మొదలు పెట్టి, బావుందే అనుకుని, మిగతా బ్లాగర్ల బ్లాగులు కూడా చదువుతూ, ఇప్పుడు బ్లాగులు చదవడం అనేది నా దినచర్య లో భాగం అయ్యిందంటే అది మీ వల్లే..

నా చాక్లట్ ఏది? :)
రిషి చెప్పారు…
రానారె...బ్రహ్మాండంగా రాసారు.

btw i am also product of A.P.Residential :),me too experienced all that bucket stuff :)
దేవన చెప్పారు…
మాది అనంతపురం జిల్లా అయినా, పులివెందుల కి చాల దగ్గర. కాబట్టి మా ఊరి యాస కూడా ఇలాగె వుంటుంది. బెమ్మాండంగా రాసావ్ అన్నా. నాకు నా చిన్నప్పటి బాష గుర్తుకు వచ్చింది.
Purnima చెప్పారు…
అదృష్టవంతులండీ మీరూ.. నేను కాస్త గాలి ఘాట్టిగా పీలిస్తే నాలుగు కిలోల బరువు పెరుగుతాను. (డైలాగ్ కర్టసీ తోటరాముడి "బరువు-బాధ్యత)

ఎప్పటిలానే సున్నితమైన భావాలను సరళమైన తెలుగులో స్వచ్ఛంగా పలికించారు! అభినందనలు.

ముగింపు చాలా బాగుంది: మనుషలని మనుషలుగా చూడగలగటానికి, మనుషులతో మనిషిలా ఉండటానికి కొన్నిసార్లు ఎందుకో "special effort" కావాలి కదూ!వెనక్కి తిరిగి చూసుకుంటే అసలప్పుడెలా జరిగిందో కూడా అర్థం కాదు.
cbrao చెప్పారు…
ఈ టపా చదువుతున్నంత సేపూ, కాసేపు రాయల సీమ , కడప జిల్లాలో ఉన్న అనుభూతి, ఎదురుగా జరుగుతున్నట్లుగా దృశ్య రూపం గోచరించింది. నేను కడప జిల్లాలో పుట్టి ఉంటే ఇలాగే రాస్తునా? ఏమో? మీ స్కూల్ లో పెంచలయ్యసారు అయితే, మాకు స్కూల్ లో పులి సీతారామయ్య అనే లెక్కల మాస్టారు వుండే వారు. గణితంలో హోంవర్క్ చెయ్యక పోతే, చింత బరిక తీసుకుని ఎడా పెడా నాలుగు అర చేతిలో వడ్డించే వారు. ఆయనంటే పిల్లలకు సింహ స్వప్నం. లాంతరు పుచ్చుకొని, పిల్లకాయిలము, వారి ఇంటికి వెళ్లేవారము, ప్రత్యేక ట్యూషన్కు. క్లాస్ అయ్యాక అక్కడే నిదురించి, పొద్దున్నే ఇంటికి బయలు దేరే వాళ్లము లాంతరుతో సహా. సీతారామయ్య గారి ఇంటి పేరు పులి కాదు. పిల్లకాయలకు ఆయనంటే ఉన్న భయమే, ఆయనకు ఆ పేరు వచ్చేలా చేసింది.

-cbrao
San Jose, CA.
అజ్ఞాత చెప్పారు…
8/10

bhale bhale
స్యాన బాగుండాది
అజ్ఞాత చెప్పారు…
"రెండుచేతుల్తో కమ్మీని పట్టుకొని లేపి, అట్టో అడుగూ ఇట్టో అడుగూ యేసుకుంటా......" భలే..!

మేమూ తిట్టుకునేటోల్లం మా ఫ్రెండ్స్ ని, ఊసు పిర్రలోడా, కొవిటాకు గాడా, తాడి మానూ..ఇట్లా...
kiraN చెప్పారు…
ఎంటేంటేంటేంటి... కసక్కన కోసేత్తావా.. ఎంత కోపం..
'ఈ వొళ్లు నాదిగాదు పో' అనుకొని నిలబడిపోతి. దీనికే ఇవ్వచ్చు ౧౦/౧౦

భలే..



-కిరణ్
చిన్ననాటి జ్ఞాపకాల దొంతరలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు. ప్రతి బడిలో ఒక బయపు రెడ్డి ఉండనే ఉంటాడు.తీయటి అనుభవాలతో విందు చేస్తున్న రానారె గారికి అభినందనలు!
-తవ్వా ఒబుల్ రెడ్డి
అజ్ఞాత చెప్పారు…
>> ముదరకపోతావ్ :) . I still use this.
Sreeram చెప్పారు…
8/10
teresa చెప్పారు…
Oh I missed this post all these days! మీ అమ్మ,నానమ్మల మధ్యనున్న అత్తాకోడ్ళ్ళ dynamics చిన్నప్పుడే మీరు కనిపెట్టేయడం ముచ్చటగా ఉంది చదవటానికి :) ఇప్పుడు ఊరెళ్తే ముద్దుగా ఊసోడా అని పిల్చేందుకు నానమ్మ /ఏ ముసలమ్మయినా ఉన్నారా?
అజ్ఞాత చెప్పారు…
ఆరికె బువ్వలో గొవ్వాకు పప్పు కలుపుకొని తింటున్నట్లుంది అన్నా.
balarami reddy చెప్పారు…
anna.. baagundi.. bucket to neellu poyadam, gaddi koyadam inka baaga gurthundayannamaaata neeku..penchalaiah ante gurthochindi.. gaddi sarigga koyyaledani okasari nannu kotnaDu.. chempa minda acharlu pannyai.. penchalaiah ippudu kadapa lo undadu.. konchem tellanga ayinadanta..
రానారె చెప్పారు…
@పబ్బరాజుగారు
ధన్యుణ్ణి. మంచి తెలుగు రాస్తున్నారు.. మీరూ బ్లాగొకటి మొదలుపెట్టండి. అప్పుడు చాక్లెట్టూ బిస్కట్లూ అన్నీ నడుచుకుంటూ వస్తాయ్.

@రిషి
థాంక్యూ వెరీమచ్. ఐతే మనం ఒకే జాతి పక్షులమన్నమాట! :) బడి సంగతులు రాస్తూ వుండండప్పుడప్పుడూ.

@దేవన అనంతం
మొన్న సి.నారాయణరెడ్డి ఇంటర్యూ ఒకటి విన్నాను. పట్టణాల్లో మాట్లాడే భాషొక్కటే నాగరికమైనదనే భావనలో మాండలికాల పదసంపదనూ నుడికారాన్నీ కోల్పోతున్నామని ఆయన బాధపడతాడు.

@Purnima
ఔనండి నేను అదృష్టవంతుణ్ణే. బరువు విషయంలో మాత్రమే కాదు, బాధ్యత విషయంలోకూడా. :) ఈ టపాపై మీ వ్యాఖ్యకు చాలా సంతోషం.

@cbrao
చాలా సంతోషం. నెనరులు. మీరే నయం. మేమైతే మా పెంచలయ్యసారుకు మారుపేరు పెట్టడానికి కూడా సాహసించలేకపోయాము. అన్నట్టు మీ జైత్రయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను.

@లచ్చిమి
శానా సంతోసము, దండాలు. :)

@రవి
:-))
కొయిటాకు ఇంకా దొరుకుతోందా? ఇంకోటుండేది శిర్రాకు అని... వానలు పడగానే మా మిద్దె వెనక మొలిచేది. తాళింపు భలే వుండేది. కుంటగింజరాకు (గుంటకలగరాకు)తో ఊరిమిండి .. జ్వరమొచ్చినప్పుడు మందు మాదిరిగా పనిజేస్తుంది. మడిగెనాల్లో యియ్యన్నీ మళ్లా మన కంటబడతాయో లేదో!

@కిరణ్
:-))

@ తవ్వా ఓబుల్ రెడ్డిగారు
చాలా చాలా థాంక్సండి.

@రోహిణీకుమార్ తరిగొండ
స్టిల్లేమిటండీ..మనోళ్లతో మాట్లాడేటప్పుడు వాడతానే వుండాల. నామోషీ ఎందుకూ మనకు? :) ఇంతకూ మనది చిత్తూరుజిల్లా తరిగొండ గ్రామమా లేక ఉత్తరాంధ్రమా?

@కొత్తపాళీగారు, చిత్తూరి పిలగాడు
నెనర్లు

@teresaగారు
థాంక్సండీ. ఇప్పుడు నన్నామాటనే అవ్వలూ తాతలూ లేరండి. :-|

@దిల్
నెనర్లు. తెలుగు పరీక్షలో మరీ పది వేసేయకండి సార్. :)

@gongati venkata ramanareddy
అన్నా, అరికెబువ్వ అంటాండావు, నువ్వు నాకన్నా శానా పెద్దోనివిగా వుండావు!! దండాలన్నా. నేను అరికెలను సరిగా సూసిందిగూడా లేదు.

@బలరామిరెడ్డి
ఎంతైనా మన గురువు కదా పెంచలయ్యసారు! ఆయనలో ఒక గొప్ప విషయమేమిటంటే - ఇక్కడెందుకులే, ఇంకో టపాలో చెప్తా. :)
అజ్ఞాత చెప్పారు…
Ramanadha Reddy Garu...
Namaskaram...naa peru Ramesh Reddy, Mukkavari palli poorva vidyathini....maadi mukkavari palli first batch 1983 looo join ayyam...'89 varaku unnam palleloo....chala baga varnincharu..kallakukattinatlu..baayiloo neellu seedukuneevallm appuduu...santhoshanga undi..mukkavaripalli madhurasmuruthulu nemaruveesukuntuntee...well done...eelsooskoni mukkavaripalli gurinchi ingooka tapa rayamani manavi..
naresh చెప్పారు…
who is bayapureddi can i know i am also bayapureddi for bayapureddi palem (nrpm)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత...

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క...

వేదికనలంకరించిన పెద్దలు

ఊరంతా జండాల పండగ. శ్రీ శ్రీనివాస కాన్వెట్లో ఆ పండగపేరు స్వాతంత్ర్య దినోత్సవము. అంతకు ముందు రెండు వారాల నుంచీ రోజూ సాయంత్రం పూట పీ.టీ.పిరుడు, మోరల్ పిరుడు కలిపేసి పిల్లకాయలందర్నీ వక కొటంలో చేర్చి మా అందరి చాతా దేశభక్తి గీతాలు పాడించి నేర్పించినారు. ఆగస్టు పదహైదోతేదీ పొద్దన్నే ప్రెయరు. ఐదోతరగతిలో క్లాసుఫస్టు కాబట్టి, నేనే యస్పీయల్ (స్కూల్ ప్యూప్‌ల్స్ లీడర్). ఐదో తరగతిలో నేను ఎందుకు క్లాసు ఫస్టు అంటే - అంతకు ముందు సమచ్చరం అంటే నాలుగోతరగతిలో నాకన్నా ఫస్టొచ్చే పిల్లకాయలంతా ఈ సమచ్చరం మా బళ్లో ల్యాకపోబట్టి. అది యేరేసంగతిలే. ******* ******* ******* పొద్దన్నే ప్రెయరు. ప్రెయర్లో ప్రతిజ్ఞ . "భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ... మ్... మ్..." ఢమాల్. ఆ తరువాతేందో ప్రతిజ్ఞ చదివేవానికి గుర్తుకు రాల్యా. మామూలుగా ఐతే మూడోతర్తి పిల్లోళ్లల్లో రోజుకొకరు ప్రతిజ్ఞ చెప్పాల. చెప్పలంటే అది కంఠోపాఠం రావాల. రాకపోతే బుక్కుజూసి చదవాల. తరవాత దెబ్బలు తినాల, యండలో నిలబడాల. జండాల పండగ రోజున ఇట్టాటి పంచాయితీ వుండగూడదని ప్రతిజ్ఞ గడగడా చెప్పేసేవాన...