ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

'పాప' పరిహారము!?

ఆ సాలు దీపావళికి మా అత్తమ్మలిద్దర్నీ మా యింటికి పిలిచినాం. బట్టుపల్లెలో కరమలోళ్లూ కంసలోళ్లూ మంగలోళ్లూ సాకలోళ్లూ యీడిగోళ్లూ బెస్తోళ్లూ అందురూ గూడా వాళ్ల వాళ్ల ఆడబిడ్డలను పిలిపిచ్చుకున్యారు. పెండ్లిండ్లయ్యి అత్తగార్లింటికి పోయిన ఈ ఆడబిడ్డలందరికీ పండగలకు అమ్మగారింటికి రావడం, చిన్నప్పటి నుంచి వొకే చోట పెరిగినోళ్లు కాబట్టి వొకరినొకరు పలకరించుకోవడం సంబరమే అయినా, పెండ్లయినపుడు వాళ్లు వొదిలిచ్చుకున్న దరిద్రమొకటి పల్లెకొచ్చినపుడు మల్లా వాళ్లకు చుట్టుకుంటుంది. మా పల్లెకు కాపురానికొచ్చిన ఆడోళ్లకైతే మాత్రం అది తాళిబొట్టు కన్నా గట్టిగా చుట్టుకుంటుంది.

***** ***** ***** *****

ఒళ్లుగ్గానీ వంటగ్గానీ మంచిగ్గానీ చెడ్డగ్గానీ నీళ్లు గావాలంటే మాకుండే ఆధారం మంచినీళ్ల చేద బాయి వొక్కటే. మంచి భద్రమైన రాతి కట్టుడున్న ఆ చేద బాయి దరికి ముందర అర్ధచంద్రాకారంలో BHATTU PALLE అనే అక్షరాల కింద 1934 అని చెక్కివుండే రాతి పలక వుంటుంది. మా ఇంటికి తూరూగా పెద్దచేను, అసాన్ చేను దాటినాఁక, చెఱువు కాలవకు అవతల వుండే ఈ బాయి కాడ -- పండగలప్పుడూ యండాకాలంలోనూ బిందెలు, కడవలు, అండాలు వరస కట్టి కనబడతాయి. పొద్దన్నే చాంతాడు, బకిడీ (బొక్కెన), బిందెలు తీసకపొయ్యి మన వంతొచ్చిందాఁక వరసలో నిలబడి నీళ్లు చేది ఇంటికి తీసకరావాల. తాగేదానికి, బోకులు తోమేదానికీ, నీళ్లు పోసుకునేదానికీ, గొడ్లకూ అన్నిటికీ ఆ నీళ్లే. ఖాళీగా పొయ్యేటప్పుడు దిగుడు. నీళ్లతో వొచ్చేటప్పుడు మిట్ట. పొద్దునా సందేళా ఎదురెండ. ఎన్ని బిందెలు తెచ్చిపోస్తే తొట్లు నిండేది!?

***** ***** ***** *****

పండగ రేపనఁగా ఈ రోజు తెల్లారీ తెల్లారకనే తొట్లలో పాచినీళ్లు తోడి పారబోసి, గార కడిగి, అడుగున సున్నం పూసి, అమ్మ, అవ్వలతోపాటు అత్తమ్మలు కూడా కడవలు, బిందెలు, అండాలు తీసుకొని చేదబాయికి బయల్దేరినారు. బాయికాడ నీళ్లు తోడేదొకరు, బిందెను అసాన్ చేను దాటించేదొకరు, పెద్దచేను దాటించేదొకరు, ఆ మధ్యలో ఎదురందుకొని ఇంట్లో తెచ్చి పోసేదొకరు. వీళ్లంతా ఇంట్లో లేకపొయ్యేటప్పుటికి 'మేమూ వస్సాం బాయికాడికి' అన్యాడు మా గోపీ. అంతే, మా నెత్తుల మిందికి సెరివెలు, సెరివెల నెత్తికి తట్టలూ వచ్చేసినాయ్. బాయి కాడ సెరివెలో నిండుగా తొణక్కండా వుండే నీళ్లు, అసాన్ చేను దాటుకునేటప్పుటికి సెరివె పైనుండే తట్టతో దబక దబకమని మాట్లాడతా వుంటాయ్. పెద్దచేను కాడికి వొచ్చేటప్పుటికి సగం నీళ్లు నిక్కరలోకి దిగిపొయ్యుంటాయ్. చొక్కా మాత్రం తడసదు. యేలంటే అది ఇంట్లో పెట్టెలో వుంటాది కదా! ఇంటి కొచ్చేతలికి, సెరెవెలో ముక్కాలు భాగం నీళ్లుంటే శానా గొప్ప సంగతి.

***** ***** ***** *****


"ఆయమ్మి మాటే మారిపొయ్యిందమ్మా."
"ఏమంటా?"
"బాగు'న్నారా'క్కా -- అంట. అత్తగారి ఊరి యాసొచ్చేసింది."
"నువ్వేమన్యావ్"
"మేం బాగున్నామండీ, మరి మీరు?"
"హి హ్హిహ్హిహ్హి... అండీ"

ఆ దోవన నీళ్లు మోసే ఆడోళ్లు కుశాలగా మాటాడుకునే మాటలు భలే వుంటాయ్.

"మాకు తప్పింది, నీకు పట్టింది ఈ నీళ్లుమోసే అదురుట్టం!"
"మీకేలమ్మా ఈ కర్మ, నేనొక రెండు బిందెలు తెచ్చి పోచ్చే సరిపో(వు)ను గదా?"
"ఈ రెండ్రోజులూ నీ అదురుట్టం మాకూ రోంత కావాల్లేబ్బా."

***** ***** ***** *****

చూస్తాండఁగానే యండ సురసుర మనడం మొదులుబెట్టింది. ఇంటి కొచ్చేతలికి సెరివెల్లో నీళ్లు సగం గూడా నిలవకండా పోతాండాయి. ఆ రకంగా నాలుగు సార్లు బాయికీ ఇంటికీ తిగిరే తలికి ఆ దినం మా స్నానాలు పూర్తయినాయ్. అసలే నాది భీమసేనుని శరీరం కాబట్టి, ఆ యండకు ఇంకో రెండుసార్లు తిరిగితే దెబ్బతింటుందని, తువాలతో నా తల తుడిసి నన్ను ఇంట్లోనే వుండమనింది అమ్మ.

చేనులో బిందెలను ఎదురందుకొని తెచ్చి ఇంట్లో పోస్తావుంది మా చిన్నత్తమ్మ. ఆమె కూడా నా మాదిరే శానా బలమైన మనిసి పాపం. మూడేండ్లకు ముందు సరిగ్గా దీపావళి పండగ రోజున ఆమెకొక కూతురు పుట్టింది. అంతా నీళ్లకు పోగా ఇంట్లో మిగిలింది ఆ కూతురూ, నేనూ మాత్రమే.

పండగకు నీళ్ల ఖర్చు జాస్తిగా వుంటాదని ఇంట్లో వుండే పెద్దపెద్ద సెరివెల్లో కూడా నీళ్లు నింపుతాండారు. అన్నిటికంటే పెద్ద సెరివెలో అంచులకు రోంత తక్కువగా నీళ్లుండాయి. దాన్ని చూసి నేను ఒక చిన్న సెరివెడు నీళ్లను దాంట్లో పోసి, అంచుల పైదాఁక నింపినా. ఒక తట్టను తెచ్చి దాని మింద పెట్టినా. అది నీళ్ల మింద తేలాడతా వుంది. సెరివె అంచుకూ, తట్టకూ మధ్యన ఎంత మందంలో నీళ్లుండాయో నని చూస్తి. ఆ తట్ట మింద చెయ్యి పెట్టి నొక్కుదామనిపిచ్చ. మెల్లిగా నొక్కితి. అంచున వుండే నీళ్లన్నీ మెల్లిగా న్యాలమిందికి పొంగిపాయ.

గమ్మున ఇదాంతా చూస్తా వున్నె అత్తమ్మకూతురు లేసి నిలబడి సెరివె దగ్గరికొచ్చింది. తట్ట తీసి పక్కనబెట్టి మల్లా నిండుగా నింపినా. ఈసారి నోటితో గాలివూది చూసినా, ఎంత గట్టిగా వూదితే నీళ్లు కింద పడతాయోనని. అత్తమ్మకూతురు కిలాకిలా నవ్వింది. అంచు మీద అలలు సద్దుమణిగి నీళ్లు అద్దం మాదిరిగా తయారైనాక, అరచేత్తో ఫట్‌ మని ఒక్క చరుపు చరిస్తి. నీళ్లు ఎగిరి నేలంతా తడిసిపొయ్యింది. ఆ పిల్లకు సంబరం జాస్తీ అయిపోయి రెండు కాళ్లతో నేల మింద నీళ్లను తొక్కుతా ఎగరబట్టింది.

అప్పుడు ఆఖరి బిందెనీళ్లతో అత్తమ్మ ఇంట్లోకొచ్చింది. నేలంతా నీళ్లు చూసి ఆమెకు కోపం పట్టలా. నాకల్లా చూసింది. నేను ఆ పిల్ల కల్లా వేలు చూపిచ్చినా. నీళ్లతో ఆడుకుంటా వుండిన ఆ పిల్ల చెంప ఛెళ్లు మనింది. వాళ్లమ్మకల్లా అయోమయంగా చూసి, నోరంతా తెరిచి గుక్కపట్టి గట్టిగా ఏడుస్తా నా దగ్గరికొచ్చి నన్ను చుట్టేసింది నేనే దిక్కయినట్టు.

***** ***** ***** *****

ఆ పిల్ల ఏడుపూ ఆ మొహమూ మరిచిపోదామన్నా మరుపు రావు. నా పాపానికి ఫలితం ఫలానా శిక్ష అని తెలిసొచ్చి, ఆ శిక్షను మనస్పూర్తిగా అనుభవించేస్తే బాగుంటుందని ఆ తరువాత ఎన్నోసార్లు అనుకుని వుంటాను. ఇప్పుడూ అంతే.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
WOUWWWWW....

ఇది నా చిన్నప్పటి రోజుల్ని చాలా intesity తో మోసుకొచ్చేసింది.

మంచినీళ్ళ బావి ఎంత దూరమో..మధ్యలో వాగు....ఆ ఇసకలో నీళ్ళ బిందె ఎత్తుకొని నడవడం అంటే మాటలు కాదు..అడుగులు ఈడ్చాల్సి వచ్చేది. వచ్చేప్పుడు ఓ steep hike ఉండేది. అక్కడే బిందె భుజాలు మారేది. నేను చిన్న వాణ్ణి కాబట్టి, నాకో చిన్న బిందె, దాంట్లోంచి నీళ్ళు తొలక్కుండా పట్టుకురావడం ఒక చాలెంజ్. వళ్ళంతా తడిసేది(షర్ట్ ఉండేది లెండి. చొక్కా విప్పి బయటకెల్తె, అమ్మ వళ్ళు చీరేస్తది మరి). మా ఇద్దరు అత్తల్లో ఒకరు చేదడం, ఒకరు మోయడం. ఒక బిందె నెత్తి మీద, ఇంకోటి చిన్నది చేతిలో. అది నేను సగం దూరంలో అందుకోవడం. మొన్నెప్పుడో మా అత్తయ్య ఇక్కడికొస్తే ఆ రోజులు గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నాం.

"పండగకు నీళ్ల ఖర్చు జాస్తిగా వుంటాదని ఇంట్లో వుండే పెద్దపెద్ద సెరివెల్లో కూడా నీళ్లు నింపుతాండారు. అన్నిటికంటే పెద్ద సెరివెలో అంచులకు రోంత తక్కువగా నీళ్లుండాయి. దాన్ని చూసి నేను ఒక చిన్న సెరివెడు నీళ్లను దాంట్లో పోసి, అంచుల పైదాఁక నింపినా. " ఇది నాకు చాలా అనుభవం.

ఇక్కడ మీరు చెప్పిందానికి, నాకూ ఒకే ఒక తేడా. బయట వాడే నీళ్ళ కోసం, దగ్గర్లోనే ఓ బావి ఉండేది. కాని అవ్వన్నీ ఉప్పునీళ్ళు.
వామ్మో, ఇంకా చాలా గుర్తొచేస్తున్నాయి. ఆడుకున్న ఆటలు.... ఇంకా బోల్డు. but I better rest.
చాలా థాంక్స్ అండీ ఇది రాసినందుకు..బాగా రాసారు.
అజ్ఞాత చెప్పారు…
ఇవే అనుభవాలు నావీనీ..బావి బదులు, వీధి కొళాయి అంతే తేడా...
Purnima చెప్పారు…
"నోరంతా తెరిచి గుక్కపట్టి గట్టిగా ఏడుస్తా నా దగ్గరికొచ్చి నన్ను చుట్టేసింది నేనే దిక్కయినట్టు."

పాపం ఆ అమ్మాయి! :-(

సెరివెడు అంటే అర్ధం చెప్పగలరు.

కథ ఎప్పటిలానే బహు చక్కగా ఉన్నది.
Unknown చెప్పారు…
అంతవరకూ సరదాగా సాగుతున్న కథ ఆ అబద్ధంతో మనసును ఛెళ్ళు మనిపించింది...
Unknown చెప్పారు…
ఆ పిల్లని పెళ్లి చేసుకోవడమే నీకు సరైన శిక్ష! అప్పుడు రోజూ ఎంచక్కా నీ మీద 'బావా' అంటూ సరసంగా మొటిక్కాయలు చేస్తూ కసి అంతా తీర్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం నాకు భయంకరమైన విలనీ చూపించావు...ఆ పిల్ల కళ్లల్లో నీళ్లు కళ్లారా చూపించావు:-(
(అన్నట్టు తొరలో మీ వూరు వస్తాండా:-)
సిరిసిరిమువ్వ చెప్పారు…
అప్పటి వరకు సరదాగా సాగుతున్న కథనం చివరికి వచ్చేటప్పటికి --- ఒక్కసారిగా ఆ పిల్లని తలుచుకుంటే పాపం అనిపించింది. మీ తప్పుకి ప్రాయశ్చిత్తం త్వరలో దొరకాలని కోరుకుంటూ...
అజ్ఞాత చెప్పారు…
9/10
అజ్ఞాత చెప్పారు…
10/10
అజ్ఞాత చెప్పారు…
Raamna,
Your Blog is very good
I read all your stories.
All are very good.

thanks
R.kranthi
kiraN చెప్పారు…
అలా ఎందుకు చేసావు అని అడగలేను, ఎందుకంటే ఇటువంటిదే ఒక సంఘటన నాకు జరిగింది, భావం అదే.. త్వరలో నా బ్లాగులో చదువుదూ గాని.

చాలా బాగా రాసావు, నేనెప్పుడు అనే మాటే ఇప్పుడు అంటాను 'భలే ఉంది'.

ఉంటాను మరి
కిరణ్
రానారె చెప్పారు…
@independent
మీకూ చాలా థాంక్సు. మీకెంత నచ్చిందో మీ వ్యాఖ్యే చెబుతోంది.

@రవి
కొళాయిలదగ్గర నీళ్లను చేదడం వుండదు! :)
బావిదగ్గర నీళ్లు ఆగిపోవడం వుండదు, ఎండాకాలంలో తగినన్ని నీళ్లు వూరనప్పుడు తప్ప.

@Purnima
థాంక్యూ. సెరివె అంటే అల్యూమినియం చట్టి అనుకోవచ్చు.

@ప్రవీణ్
ఇలాంటి కారణంతోనే ఈ సంగతి నాకూ గుర్తొస్తూ వుంటుంది. :)

@డాక్టర్
క్షమించాలి...వస్తామని మీరు చెప్పినా ఆహ్వానించే పరిస్థితిలో లేను అప్పుడు. ఇక నాకు సైరనశిక్ష పడే అవకాశం లేదులెండి.

@సిరిసిరిమువ్వగారు
నెనర్లు

@Reddy
కృతజ్ఞతలు

@Anonymous
ధాంక్యూ

@క్రాంతి
చాలా థాంక్సు :)

@కిరణ్
ఐతే వోకే :-))
Vinay Chakravarthi.Gogineni చెప్పారు…
sarvaa adi not sereve........ittadi sarvaalu vundevi kada pedda peddavi..........

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ