ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తా నొరులకు నవి సేయకునికి ...

ఆ పొద్దు శనివారం.

బళ్లో మజ్జానం పూట అన్నానికి గంట కొట్టఁగానే, వడిసెల యిడిసిన రాయి మాదిరిగా రఁయ్‌య్యిమని కుంటకయ్యల్లో గుండా అడ్డంబడి వొక్క పరుగున యిల్లు చేరి, నేరుగా జాలాట్లో తొట్టికాడికి బొయ్యి, చెంబునీళ్లతో గబగబా కాళ్లూజేతులూ మొగమూ కడుక్కుంటా సుట్టూ జూస్తి - అమ్మగానీ అవ్వగానీ కనబడతారేమోనని.

జాలాడు పక్కన యండలో నులకమంచం మింద ఆరేసిన తువ్వాలుతో మొగం తుడుసుకుంటా, "మ్మా..." అని అరిస్తి. అరిసినప్పుడు నా మొగం తువ్వాల్లోనే వుండాది. మొగాన్ని బయటబెట్టి "మ్మో...వ్" అని యింగా గెట్టిగా వొక కేకబెడితి.

"అప్పుడే పన్నెండయింద్యా?" - మా చెనగచెట్లల్లో కూలోళ్లతోపాడు గడ్డి తొవ్వుతా మడి కాణ్ణుంచి అమ్మ. ఆ మాట అనడంలో వులికిపాటు. చెనిగచెట్లల్లో గెడ్డి బలిసిపొయ్యింది. తొవ్వే పని రోంత కూడా జరిగినట్టు లేదీరోజు. పన్నిండు అనే మాట యినబడితే కూలోళ్లు లేసిపోతారు. అసలు ఆ యండకు వాళ్లు అంత వరకూ పనిచెయ్యడమే గొప్పసంగతి.

ఇదంతా పట్టించుకునేంత తెలీదు మనకప్పుడు.

"పన్నిండు ఎప్పుడో దాటిపోయింది. ఇంగ్లీషు వార్తలు గూడా అయిపొయినాయి." - ఇంగ్లీషు వార్తలు అయిపొయ్యేది పన్నెండు గంటలా ఐదు నిముషాలకేనని అమ్మకు తెలుసు.

"గోపయ్య గూడా వొచ్చినాడా?" ఈ సారి మాయవ్వ.
"వాడింగా రాల్యా."

"ఈడ రోంత పనుండాది, వస్తాండాము. రోంచేపు (రవ్వంతసేపు) తట్టుకో. వాడూ రానీ."
" నాకు ఆకలైతాంది, నువ్వొచ్చి అన్నం బెట్టు"

"పొద్దన తిని పొయిన సద్దిబువ్వ, పచ్చిపులుసు, మీగడా అంతలోనే అరిగిపాయెనంట్రా!?" - అవ్వ.
"ఆఁ..."

"అంత తట్టుకోల్యాకపోతే అన్నమూ కూరా ఆణ్ణేవుండాయి పెట్టుకోని తినుపో" - అమ్మ.
"యాడుండాయి?" - యాడుంటాయో నాకు తెలీక కాదు. వొళ్లు బరువయ్యి.

"చెప్తా నీకు యాడుండాయో! ఇప్పుడుగాని నేను ఆడికొచ్చినానంటే పూర్తిగా అర్తమయ్యేటిగా జెప్తా కొడకా!!"
"ఓవ్... అట్లయితే వొద్దులే మా!"

పుల్లగూరసట్టిని ఉట్టి దింపాలంటే మసిగుడ్డతో పట్టుకొని దింపాల. ల్యాకపోతే చేతులకు మసి అంటుకుంటాది. దింపినాఁక దాన్ని యాడబెట్టాల? న్యాల మింద బెడితే నేలంతా మసైతాది గాబట్టి, ఈతాకుల సుట్టమీదనో, తీండ్రతీగల సుట్టమీదనో పెట్టాల. పొయ్యిమూలన ఆ సుట్టలు యాడుండాయో యెతకాల. ఒక కూరను దింపేదానికే ఇంత శంబడితే (శ్రమపడవలసి వస్తే) -- గరిటెలూ అన్నంతినేగిన్యా కడిగి, అన్నమూ కూరా వడ్డించుకొని, చెంబుతో కడవలోనీళ్లు ముంచుకొని, తినడానికి కూర్చోవాలంటే యంత శంబడాల్నో కదా! అందుకు.

పైగా మన స్కూల్ డ్రస్సుకు మసి అంటగూడదు గదా!

సరే, అమ్మ వొచ్చేటిగా లేదు, ఈ పూటకు మనమే పెట్టుకొని తిందామని ఇంట్లోకి పోఁగానే, "ఇప్పుడు తిని పోతివి, అంతలోనే అదేమి ఆకలిరా నాయినా" అంటా ఇంట్లోకొచ్చేసింది.

******** ******** ********

అంత వొళ్లుబరువైతే అమ్మ వొచ్చిందాఁక వుండచ్చుగదా, అంత తొందరేమి - అనొచ్చు నీయట్టాటి పెద్దమనిసి. వొకోసారి పనుల్లో వుండేటప్పుడు కోపగిచ్చున్యా గానీ, ఆకలి పేరుజెప్తే అమ్మ యాడున్యా రావాల్సిందే. కానీ అసలు సంగతి ఆకలి గాదు. బడికి ఆలస్యమౌతాదనీ కాదు. మరింగెందుకు తొందర!?


******** ******** ********

శనివారంనాడు యీరబల్లెలో సంత. ఆ దినము కూరగాయలు తెచ్చుకుంటే వారం పొడుగునా తినేదానికి పడుంటాయి. సంతలో నైతే రోంత అగ్గవగా దొరుకుతాయి. ఆపొద్దు గనక కొనకపోతే, మిగతా దినాల్లో అయే కూరగాయలు కోమటోళ్ల అంగళ్లలో కొనాలంటే శానా పిరము. రూపాయిచ్చి నాలుగు పచ్చిమిరక్కాయలిమ్మంటే నాలుగంటే నాలుగే - పొట్లంగట్టి సేతిలో బెడతారనుకో.

దాంట్లో శానా తమాసా వుంటాదిలే. చేతినిండాకు యిచ్చేవాని మాదిరిగా ఐదువేళ్లూ మిరక్కాయల్లో జొనిపి, కొనవేళ్లతో తొమ్మిదో పదో సున్నితంగా పట్టుకోని, పొట్టం కట్టే కాగితం కాడికొచ్చేటప్పటికి మూడోనాలుగో జారిపోగా మిగిలిన మిరపకాయలది అదృష్టం. ఆమాత్రం మిరక్కాయలకు పొట్లం, దాని సుట్టూ భద్రంగా ఓ..వోపినంత దారమూ. వొక్క ళ్లనిగాదులే, కూరగాయలూ పండ్లూ పండిచ్చేవోడు గాక యెవుడమ్మినా గిట్టుబాటే!

ఇట్టాటిదే వొక తమాసా నేనూ నేర్చుకున్యా. యట్ట నేర్చుకున్యా నంటే --

వొగసారి బళ్లో వొంటికిబెల్లు కొట్టినప్పుడు, న్యూట్రిన్ మెత్త చాక్లెట్లు కొనుక్కుందామని, నేనూ సుబ్రమణ్యమూ వొక అంట్లోకి పొయినాము. యే అంగడికి అంటే ... యెందుకులే... ఆడ వుండేదే నాలుగు అంగళ్లు. అందులో రద్దీగా వుండేది వొకటే. ఫలానా శెట్టి అంగడి అనుకో. ఆ అంగడికే పొయినాము. ఏదో పండగ అనుకుంటా సరిగా గుర్తులేదు. శెట్టి, శెట్టెమ్మ (అంటే శెట్టి పెండ్లాములే!) తీరికల్యాకండా వుండారు. పెద్దపెద్ద బేరాలూ, అర్జెంటు బేరాలూ తప్ప మాయట్టా శాకిలెట్టూ బిస్కట్టు బేరాలను పట్టించుకునే పరిస్థితి కాదు.

"ఈ పావలాకు యెన్నబిస్కెట్లీ న్నా" అంటా యింగో పిల్లకాయ వచ్చ. చేతిలో పావలాబిళ్ల పట్టుకోని ఓపిగ్గా నిలబడుకోనుండాడు. ఆ రద్దీలో శెట్టి వాణ్ణీ పావలానూ అప్పుడప్పుడూ చూస్తావుండాడు గానీ పావలా తీస్కోల్యా, బిస్కెట్లీల్యా. యాబైరూపాయల నోటు చూపిచ్చేవాళ్లే అరగంట సేపు నిలబడతా వుంటే పావలాకు పలికే పరిస్థితి వుంద్యా?

అడిగి అడిగి నొప్పి బెట్టిందేమో, పావలా జేబులో యేస్కోని గమ్ముగ నిలబణ్ణాడు. వాని అవస్థ జూస్తే అయ్యో పాపమనిపిచ్చ. వానికి బిస్కెట్టూ లేదు, నాకు శాకిలెట్టూ లేదు. వాడు మాటిమాటికీ అడుగుతాండాడు, నేను ప్రయత్నం సెయ్యడం ల్యా.

అంతలో శెట్టి రోంత సందు జేసుకొని - "ఆఁ... ఏందిబ్బీ నీకు, బిస్కెట్లా, ఇంద" అని పిల్లకాయ చేతిలోబెట్టె. అయ్యి చెడ్డీజేబులో యేస్కోని వాడు బైటికొచ్చేశ.

పావలా !!?

శెట్టి అడగడమూ మరిసిపోయినాడు, వాడు యీడమూ మర్సిపొయినాడు. అప్పుడు నాకొక తమాసా ఆలోచనొచ్చింది.

******** ******** ********

నమ్మకస్తులైన మనుషులెవురైనా సంతకు పోతావుంటే, వాళ్లతో ఆ వారానికి మా సంతసరుకులు తెప్పిస్తుంది అమ్మ. ఆ రోజు మాత్రం సరుకులు నేనే తేవాలని తొందరగా ఇంటికి రావడము, అమ్మతో ఆ పూట సంతసరుకులు చెప్పించుకొని, చీటీ రాసుకొని, లెక్క(డబ్బు) జేబులో బెట్టుకొని, సంచి సంకలోబెట్టుకోని పోవాలని ...అందుకూ ఈ తొందరంతా.

******** ******** ********

నాలుగున్నరకు లాంగుబెల్లు కొట్టఁగానే బళ్లో మాయమై సంతలో తేలినా. పొద్దు గూకొచ్చిందంటే సరైన కూరగాయలు దొరవు. నాలుక్కు ముందరైతే యాపారస్తులు బేరమాడనీరు. వాళ్లెంతకు చెబితే అంతకే కొనాల, ల్యాకంటే పోతాండాల. హైస్కూలయివోర్లు, పోలీసోళ్లు, మండలాఫీసు, యమ్మారో (జనమంతా యమ్మారావంటారీయన్ను) ఆఫీసుల్లో పన్జేసే వుజ్జోగస్తులైతేనే మజ్జానం సంతకొచ్చి మంచిసరుకును కొనేది. నాలుగు దాటిందంటే, పొద్దు గూట్లోబడతాంది తొందరగా సరుకంతా అమ్ముకోవాలని యాపారచ్చులు గూడా రోంత మెత్తబడతారు. సుట్టుపక్కల పల్లెలనుంచీ వొచ్చేవోళ్లు గూడా మజ్జానం యండకు బయపడి, సంద్యాల సల్లపొద్దునే సంతకు యల్లబారతారు.

ఒక వంకాయల యాపారస్తుని దగ్గర చానామంది చేరి కొంటావుండారు. వాడు మావూరోడు గాదు. రాయచోటి నుంచి వచ్చినోడు. వంకాయలు నవనవలాడతాండాయి. వంకాయలాయన శానా అడావుడిగా తూకమేస్తా, లెక్క(డబ్బు)దీస్కుంటా, సిల్లర మారుచ్చా వుండాడు. నేను ఆడికి పొయ్యి నిలబడి చేతిలో ఐదురూపాయలు పట్టుకొని ముందుకు సాచి, "యట్టయ్యా!?" అంటి.

"కేజీ రెండ్రుబా" - నాకల్లా తల దిప్పకుండా, ఇంగోరికి కాయలు తూకమేస్తా చెప్పె. మా వూరోడైతే అట్ట మాట్టాడ్డు. మర్యాదగా - కేజీ రెండ్రూపాయలే బాబూ/న్నా/య్యా/మ్మా/ప్పా! - అంటాడు. కొందువు రా - అని పిలిసినట్టుంటాది. రెండ్రుబా - కొంటే కొను ల్యాకపోతే ఫోరా - అన్నిట్టుంటాది. మేము వంకాయలు పండిచ్చినప్పుడు వాటిని కొనే దిక్కు ల్యాకపాయ. గంపల్లో, మూటల్లో కట్టి బస్సులో రాయచోటికి తీస్కపొయ్యి, మండీలో వాళ్లు జెప్పిన రేటుకు అమ్మి, యింటికొచ్చి "శార్జీలకు లెక్క దండగ" అనుకొంటాన్న్యారు యింట్లో. నేను శానాసార్లుయిన్యా.

"వొగటిన్నరకేజీ గావాల" అంటా సందుజేసుకోని కుచ్చోని, ఒక చేతితో నోటు చూపిస్తా, మంచికాయలు ఏరి పక్కనబెడతా కుచ్చుంటి. నేను ఏరిన కాయల్లో ఒకటీ రెండూ తీసి వేరేవాళ్లకు తూకంలో ఏచ్చాండాడు ఆ మనిసి. నేను ఐదురూపాయల నోటును నిక్కర జేబులో పెట్టుకోని, నాకన్నా ముందొచ్చినోళ్లందరూ పోయినాక, "వొగట్టిన్నర కేజీ" అంటి యిసిగి పొయినోని మాదిరి.

నేను ఏరిన కాయల్లో నాలుగు తక్కెడలో వేసేలోపు ఆయనా గబగబా ఏరి, తక్కెడలో పెట్టబట్టె. వాటిల్లో పుచ్చులు, ముదుర్లు నేను తీసి పారేసేలోపు తూకం సమమైంది. "ఇదో, పట్టు" అని సంచిలో పోసేశ.

తూకమైపోఁగానే సందియ్యకుండా - "నా సిల్లర రెండ్రూపాయలు?" అంటి.

"యాడికిబోతాంది నీ రెండ్రూపాయలు? ఇదో తీస్కో ..." అంటా సంచిపట్ట మింద పోసిన సిల్లరలోనుంచి మూడు రూపాయబిళ్లలు తీసి నా సేతిలోబెట్టి, మిగతా జనానికి తూకాలెయ్యడంలో పడిపాయ.

******** ******** ********

ఆకులు, వక్కలూ, పొగాకు, కట్టెలపొడి బస్సులో యేస్కోని ప్రతి శనారం సంతకొస్తాడొక సాయిబు. వాడూ రాసీటోడే (రాయచోటివాడు). యీరబల్లె మండలంలో వక్కాకు యేస్కునే ముసిలోళ్లకూ, వొగిసోళ్లకూ వాడే దిక్కు. వాడే దేవుడు. వక్కాకు సాయిబు సల్లగ తుమ్మచెట్లకింద టారుబాలు పట్ట (టార్పాలిన్) పరిచి, ఎత్తుగా పీటేస్కోని కుచ్చుంటాడు. ముసిలోళ్లందరికీ అదే పుణ్యక్షేత్రం. వాడే యంగటేస్పరుడు. వాడే ఆంజినీలు. వాని అంగడికాడ తిరనాలే అనుకో. వాడెంత జెప్తే అంత. సాయంత్రానికి సాయిబు నిక్కరజేబుల్లో పట్టనన్ని నోట్ల కట్టలు చేరతాయి. ఆ లెక్కకు మొత్తం సంతనే కొనిపారెయ్యొచ్చు.

సంత ఖర్చులో మూడొంతుల పైగా వక్కాకూ బీడీలకే!! యాఁ, వక్కాకు యేస్కోకంటే పానం పోతాద్యా!?పోతాదంట! అమ్మకు తెలీకండా వొగసారి మావవ్వను అడిగితే చెప్పింది.

వక్కాకుసాయిబుకు మనుసులంటే లెక్కల్యా. ఎవుర్నీ లెక్కజెయ్యడు. మాట కఠినం మనిసి. అందుకే వాడంటే నాకు మంట. కానీ ఐదురూపాయల నోటు చూపిచ్చి చిల్లరడిగే మంత్రం సాయిబు మీద పనిచెయ్యలా. "నువ్వు లెక్క యీలే"దంటాడు. "ఓ... ఔ, నిజమే, లెక్క నా నిక్కరజేబీలోనే వుండాదే!" అని అబ్బురపడిపోయి, యెర్రి నవ్వు నవ్వి, ఇవ్వాల్సొచ్చింది. కానీ వీని దగ్గర్నే మనం లెక్క గుంజాల్సింది. అసలైనోడు వీడే. శానా వుషారైనోడు. మూడు వారాలు వరసగా చూసినా. ఇది నాలుగోవారం. అదేపనిగా చేస్తే నన్ను గుర్తుబెట్టుకుంటాడు. కాబట్టి ఈసారికి వొద్దు. అసలు సాయిబు మన సంగతి కనిపెట్టేసినాడేమో అని నాకొక అనుమానం.

******** ******** ********

పొద్దుగూకుతాంది. వొక ముసిలామె బెండకాయలు అమ్ముతాంది. ముసిలామెను మోసం చెయ్యడం మంచిది కాదనిపించింది. ఫలానావోళ్ల పిల్లకాయలంటే బుద్ధిమంతులనీ పేరు. అసలు ముందు ఇట్టాటి పని మనలాంటోళ్లు చెయ్యాల్సింది గాదు. కానీ ఈ ముసిల్ది కూడా రైతుల దగ్గర అగ్గవగా కొని, రెండింతలుజేసి అమ్ముకునేదే గదా! ఐదురూపాయలు సూపిచ్చి, అరకేజీ బెండకాయలిమ్మంటి. తూకమేసినాఁక సిల్లరిమ్మంటి.

"లెక్కేదీ"

"ఇచ్చినా సూడు - ఐదు రూపాయలు"

"కాయలు ఏరేటప్పుడు నిక్కర జేబీలో పెట్టుకుంటివే" - నా మొహంలో నిరాశ. ముసిలామె కనిపెట్టేసిందని నాకు అనుమానం కూడా. అసలీ పని చేసుండాల్సిందే కాదు.

"ఓ... ఔనే..." - నటనలో వుషారు లేదు.

"ఔరా కొడకా! ఈ గంపంత ఎత్తులేవు, యంత శాలుందిరా నీదెగ్గెర!"

"ల్యా! నిజ్జంగా నీకు లెక్కిచ్చినా ననుకున్యా" - నమ్మించే ప్రయత్నం. కానీ నా మాట శానా పేలవంగా వుంది. దేనికైనా అనుభవం వుండాల. యేంజేసినా మనసు పెట్టి చెయ్యాల. ఇది అట్టాయిట్టాగాని యవ్వారమైపాయ!

"ఔరా! పసి గుడ్డువు, గడ్డనబడి కండ్లుగూడా సరిగా తెరవల్యా, ఇప్పుడే యీ తరాలో వుండావే, నువ్వు కండ్లుదెరిచ్చే లోకాన్నే దిగమింగవూ!?" - పురుగును చూసినట్టు చీదరగా ఆమె జూసిన సూపు - నన్నెవురూ ఎప్పుడూ అంతగా అసహ్యించుకోలా. నాకు వొణుకుబుట్టింది. యంత బైమేసిందో చెప్పలేను.

"నిజ్జంగా మర్సిపొయినా! కావాలంటే ఐదురూపాయలూ నువ్వేబెట్టుకో, నాకు సిల్లరగూడా వొద్దు"

"నీ సొమ్ము నాకేల నాయినా, వొగరి సొమ్ముకు నువ్వు ఆశిచ్చకుంటే సాలు"

******** ******** ********

ఇంట్లోనుంచి అమ్మ - "అరేయ్, ఇదేమి వంకాయలు త్యావడం నాయినా! యిట్రా, అన్నీ పుచ్చులూ ముదుర్లు, యిట్టసూడు, యీటిని కొయ్యడమే దండగ, యీ నాలుగు ముక్కలతో కూరేం జేచ్చాం రా సామీ ... బెండకాయలూ అంతే, ...ఎప్పుడు నేర్చుకుంటావ్ నాయినా..."

ఆ వారం కోమటోళ్ల అంగళ్లో కూరగాయలు కొనాలంటే, నేను వుపాయంజేసి మిగిలిచ్చిన డబ్బుగూడా సాలదు. అమ్మకు తెలీకుండా డబ్బు దాసిపెట్టాల. తెలీకుండా ఖర్చుబెట్టాల. అట్టజెయ్యాలంటే తెలీకుండా శానా పనులే జెయ్యాల. వక్కాకు సాయిబు మింద నాకెందుకు కోపం వుండాల్నో నాకే తెలీదు. వాణ్ణి మోసం చెయ్యల్యాక ముసిలామెను మోసంజెయ్యాలనుకోవడం ఎందుకో, మాటలు పడటం ఎందుకో ... ఏ రకంగానూ నేను జేసిన పని మంచిదని చెప్పుకోలేనే! పోనీ లాభంగా నయినా లేదే! నేను యిట్ట చేసిన సంగతి మావాళ్లకు ఎవురికన్నా తెలుసునేమో!? యింట్లో తెలిస్తే గోవిందా, బైటతెలిస్తే డబల్ గోయిందా.

సోమవారం బళ్లో యూనిట్ టెస్టుంది. చవద బుద్ది గావడం ల్యా. ఆ రేతిరి పుస్తకం ముందరేస్కుని కుచ్చుంటే బుడ్డీలో కిరసనాయిలు దండగ.

ఆ ముసిలామె మాటలే జ్ఞప్తికొస్తాండాయ్. లోకాలను మింగడం, సముద్రంలో ముంచడం రాక్షసులు చేసినపని. నేను దేవతలపక్షం అనుకున్నానే ఇన్నాళ్లూ! నేను పెద్దోణ్ణయి లోకాన్ని మింగబోతే విష్ణుచక్రం నన్ను తరిమితరిమి నా తలను తెగ్గోస్తుందా!?

******** ******** ********

బళ్లో నుంచి పరీక్ష రాసి ఇంటికి రాగానే, బయట మామిడిచెట్టు కింద అమ్మ - "మ్..ఎన్ని మార్కులీరోజు?"

ఆ అడగడంలో వొక భరోసా. యేముందిలే యప్పటిమాదిరే ఇరవైనాలుగో ఇరవైనాలుగున్నరో వచ్చుంటాయని. కనీసం ఇరవైమూడుకు తగ్గవనీ. నాలుగోతరగతి వయసులో ఐదో తరగతి చదువుతా వున్యా, మార్కులకేం కొదవలేదు మనకు. కానీ ఆరోజు పరిస్థితి వేరే. యంతసేపూ ముసిలామె మాటలూ, సంతలో నేను జేసిన పనులూ, ముసిలామె గమనించినట్టు ఎవురన్నా చూసినారేమోనని అనుమానము, నేను పేద్ధ పామునై భూగోళాన్ని మింగినట్టు, మావాళ్లంతా వూపిరాడక గిలగిలలాడినట్టూ, పుచ్చొంకాయలు, సాయిబూ జేబులనిండా నోట్ల కట్టలు, శెట్టి అంగడి, బడి గోడలమీద చెరపకురా చెడేవు, కండ్లలో నీళ్లు, మల్లా ముసిలామె మాటలు, గిరగిరా ... పరీక్ష రాయడానికి మాకిచ్చిన ముఖ్కాలుగంట(45ని) యిట్లే సరిపోయింది. నేను రాసిందేముంది!?

తూరుపుదిక్కున ముట్టికొండ కల్లా తిరిగి చెప్తి - "పజ్జినిమిదే వొచ్చినాయి".

"ఎన్నో ర్యాంకు?"

"ఆరు" - ఈసారి వుత్తరంగా పాలకొండను చూస్తా చెబితి.

సరేలెమ్మని యింట్లోకి పోబాయ అమ్మ. మార్కులు తగ్గినాయేమిరా అని నన్ను యేమీ అడక్కపొయ్యేటప్పటికి, నేను జేసిన పనంతా తలచుకొని, నాకే థూ అనిపించి, బ్యార్ మని గాట్టిగా యేడ్చేస్తి. అమ్మా నాయినా యిద్దురూ వచ్చి, "పోన్లేరా నాయనా, వొగసారి ర్యాంకు తగ్గితే యేమి, యింగ టెస్టులే లేవా, నువ్వు మల్లా ఫస్టు రావా!" అని నన్ను ఓదార్చడం మొదులుబెట్టినారు.

ర్యాంకు తగ్గినందుకు నేను యేడుస్తాండాననుకోని, మహా సంతోషపడిపోతూ నన్ను దగ్గరకు తీసుకోవడంతో నా మీద వాళ్లకుండే నమ్మకానికి కించపడిపోయి, - నా యేడుపు అదిగాదు - అని చెప్పల్యాక వుక్కిరిబిక్కిరై యింగోసారి యింకా గట్టిగా బ్యారుమంటే - సంతోషంతో మా నాయనకూ అమ్మకూ నవ్వు, కన్నీళ్లూ వొగటేసారి.

కామెంట్‌లు

balarami reddy చెప్పారు…
chala baagundanna..
oka saari mukkavaripalle school lo 25 ki 15 vachinappudu intlo nenu edchina roju gurthukochindi..
అజ్ఞాత చెప్పారు…
10/10
Kiran చెప్పారు…
శానా బాగుండాది రానారె!
Kiran చెప్పారు…
శానా బాగుండాది రానారె!
అజ్ఞాత చెప్పారు…
raanaare annaa raayalaseema maaMDalikaMlO caalaa baagaa raastunnaaru.caalaa baagundi.

ramaNaareDdi.
Srividya చెప్పారు…
Chaala baga raasaaru.
Unknown చెప్పారు…
బాగుంది రానారె.
పిల్లాడిలో అపరాధ భావన ఇంకొద్దిగా బాగా కాప్చర్ చెయ్యవచ్చని అనిపించింది.
సూర్యుడు చెప్పారు…
చాలా బాగా వ్రాశారు. మాండలీకం చదవడం, అర్ధం చేసుకోవడమే కొద్దిగ కష్టమైంది :-)

~సూర్యుడు :-)
teresa చెప్పారు…
బాగుంది, బెండకాయల ముసలమ్మ పెట్టిన గడ్డి మరీ బాగు!!
manipravalam చెప్పారు…
పిల్లలు ఒకదానికి బాధపడితే తల్లితండ్రులు ప్రేమతో మరోదానికనుకోవటం చాలా నిజం.బాగా రాసారు.పిల్లల మనస్తత్వాన్ని చక్కగా చెప్పారు.

వెన్నెల
manipravalam-vennela.blogspot.com
కొత్త పాళీ చెప్పారు…
పురుగును చూసినట్టు చీదరగా ఆమె జూసిన సూపు - నన్నెవురూ ఎప్పుడూ అంతగా అసహ్యించుకోలా. నాకు వొణుకుబుట్టింది. యంత బైమేసిందో చెప్పలేను.
- అద్భుతం. ఇతరుల్లోని దౌష్ట్యాన్నో క్రౌర్యాన్నో చూసినప్పుడూ కలిగే భయం కన్నా భయంకరమైనది ఈ ఫీలింగ్.
వక్కాకు సాయిబు మింద నాకెందుకు కోపం వుండాల్నో నాకే తెలీదు.
- ఈ వొక్క పాయింటు మీద డోస్టోయెవ్‌స్కీ ఏకంగా క్రైం అండ్ పనిష్మెంట్ అంత నవల రాశాడు.

నాక్కొంచెం డబ్బా కొట్టుకోవాలని ఉంది - ఈ కథని నేను రానారె గొంతులో విన్నానొహో!
Naveen Garla చెప్పారు…
కొత్తగా చెప్పేదేమీలేదు :)
అజ్ఞాత చెప్పారు…
ప్రతి పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చే బిడ్డ ఏ ఆరో ర్యాంకు వచ్చినా ఫర్వాలేదులే, త్వరలో పుంజుకుంటాడనే ధీమా ఆ రోజుల్లో.
మరి నేటి పరిస్థితి అందుకు భిన్నంగా, దైన్యంగా ఉంది. ర్యాంకుల మోజులో తల్లిదండ్రులే పసిమొగ్గల బాల్యాన్ని రెసిడెన్షియల్ స్కూళ్లల్లో చిదిమేస్తున్నారు.
రెండు తరాల మధ్యా బోలెడంత అంతరం..
అచ్ఛమైన రాయలసీమ మాండలికంలో పసందుగా సాగిపోయింది.. సూపర్..
మాలతి చెప్పారు…
చాలా బాగా చిత్రించారు పిల్లలమనస్తత్త్వం. రాయలసీమభాష నాక్కూడా కష్టమే కాని ఇదీ మరీ అంతకష్టంగా అనిపించలేదు. కొన్నితెలుగుమాటలకి తెలుగు అర్థాలు ఇవ్వడం నాకు తమాషాగా అనిపించింది. ఇది 80వ దశకంతరవాత వచ్చిన మార్పు రచనల్లో.
రానారే గారు ఇది ఒక అబ్జర్వేషన్ మాత్రమే. :)
రాధిక చెప్పారు…
చాలా బాగుంది రానారే.మొదటిసారి మీ కధలో ఉత్కంఠత కలిగించారు.దొరికిపోతారేమో అని భయం భయం గా చదివాను.ముసలవ్వ అలా అనే సరికి నన్నే అనేసిందేమో అని బాధ కూడా కలిగింది.మళ్ళా చాలా రోజుల తరువాత మీ టపాల్లో బాగా నచ్చిన టపా ఇది.
రవి చెప్పారు…
రెడ్డీ, ఎందుకో తెలీదు. పోగొట్టుకున్న నా బాల్యం గుర్తొస్తది. మా అమ్మ కి,నాయనకీ జెప్పకుండా కెనాలు కి బోయి, ఈత నేర్చుకుందామని చూసినా చిన్నప్పుడు.ఇప్పుడు అమ్మా లేదు, కెనాలు లేదు, బాల్యమూ లేదు. ఈ సాఫ్టువేరు లో పడి కొట్టుకుండా వుండాము.

నువ్వు మాత్రం ఇట్టే రాస్తా వుండాల ఎప్పుటికీ.

ఇంగోటి. మా అనంతపురం లో, మా భాషా ఇట్టానే వుండెది చిన్నప్పుడు. ఇప్పుడు ఆ భాష మర్చిపోయి సచ్చినాం.
రానారె చెప్పారు…
ప్రవీణ్ - నిజమే. సరిగ్గా పట్టేశావు. :) థాంక్యూ.

శ్రీ, కెకె, శ్రీవిద్య, రెడ్డిత్రయము, తెరెసా గార్లకు -- ధన్యవాదాలు.

రవి- దీర్ఘాయుష్మాన్ భవ అని మీరు నన్నుదీవించినట్టేవుంది. ధన్యోస్మి.

కొత్తపాళీగారు- కనీసం ఇంకో సంవత్సరంపాటు రాస్తూవుండొచ్చుననే ధీమా కలిగించాయి మీ మాటలు.

నవీన్, రాధికగారు- చాలా థాంక్సు. :)

సూర్యుడు, వెన్నెల, తె.తూలిక గారలకు- కృతజ్ఞతలు. యాస కష్టమేం లేదండీ. ఒకటిరెండు కథల పుస్తకాలు తెప్పించండి మా మాటలు అలవాటైపోతాయి. :)
Dileep Charasala చెప్పారు…
బలె బాగా చెప్పావుబ్బా, నాకు బలె నచ్హింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ