ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు.

మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర[1]తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు[2] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి[3] సూద్దామంటే మొగదాట్లో[4] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా.


యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడెగానికీ దొక్కలు[5] లేసేదాఁకా కుడితినీళ్లు తాపి మల్లా పోయి పండుకున్న్యారు. నాతోపాటు కాడి[6] గట్టేదానికని రామారం సంతలో మొన్నబట్టకచ్చినారు - వానిపేరేమో కోడెగాడంట, మా రామునికి నేనింగా లేగదూడనే. తెల్లారుఝామున రెండుగంటలు కావస్తాందనఁగా గాలి సల్లగా కదలడం మొదులుబెట్టింది. అందురూ ఆదమరిసి నిద్దట్లోకి జారుకున్న్యారు.


కాసింత కన్ను మూసినానోలేదో ఇదో ఈ గుఱ్రపీగ, దీని నారు[7]కు నట్టు[8] దగలా… అసరసంద్యాల మా నెత్తరదాగుతాయి సరే. మబ్బుబడినాంక మల్ల కనపరావు మామూలుగా. దీనెమ్మ ఇదేం జాతిదో తెల్లారుజామున నా పానందీసేదానికొచ్చింది. “దేవుడా, ఇదేందిదీ నా నోటెమ్మట ఇట్టాఁటి మాటొచ్చింది!?” అనుకొంటా ఊపిరి ఒక్కసారిగా వదులుదామంటే మొగదాటి కింద కాలు నా గొంతునొక్కుతాంది. పక్కకు దొల్లేదానికిజూస్తే యమకల్లో నొప్పి. యేమాత్రం కదిలేదానిగ్గూడా ల్యాకండా ఉండాది. నోరు దెరిసి అరుజ్జామంటే గొంతు పెగల్లా. నిజ్జంగానే నా పానానికొచ్చిందీ ఈగ. నా పాటుకు కోడెగానికి మెలకవొచ్చింది, నేను సద్దు జెయ్యకపొయ్యేతలికి మల్లా గురకదీసి నిద్దరబోతాండాడు. నిన్నపగులుగాసిన యర్రటి యండలో యకరం మడి ఇరసాలు[9] దున్తిమి. నడిరేయిదాఁక ఉక్కతో నిద్దరబట్టకపోయ. ఇప్పుడన్నా గురకబెట్టకపోతే వాడు ఎద్దా ఇంగేమన్నానా? నేనూ అట్నే నిద్దరబోతాంటి. దోమలు కుడితే మెలకవరాదు. జోరీగలు, గుఱ్ఱపీగలు కుడితే మాత్రం మహామంట వీఁటి జాతికి అగ్గిబెట్టా.


ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!? మా రామునికి మెలకవొచ్చి లేస్తే బాగుండు. నన్ను కట్టేసిన మామిడిచెట్టు పక్కనే ఆరుబయట పండుకోనుండాడు. నాకు మతిబోతాన్నిట్టుగా వుండాది. మగతగా మబ్బుగమ్మినట్టు… వొగేల నిజ్జంగానే నేను సస్తే మా రాముడు తట్టుకో గలుగుతాడా! సమదాయించేదానికి వాళ్లమ్మానాయనాగూడా ఊళ్లో లేరే! నాకు మొగదాడు కుట్టొద్దని మా రాముడు యంత ఆగం[10] జేసినా “పిల్లకాయవు, నీకు తెలీదు నోరుముయ్యరా! పొయ్యి పుస్తకం బట్టి సదూకోపో” అని మూసేసిరి. దబ్బణం[11] తో నా ముక్కుకు బొక్కబెట్టి నూనెబూసిన నూలుతాడు ఆ బొక్కలోగుండా సర్రున లాగి కట్టేసిరి. శారెడు రగతం కారిపాయ. నాలుగురోజులు అవస్థబడితి. మల్ల మానిపాయ.
సరిగ్గా కనమపండగ నాడు కనింది మాయమ్మ నన్ను, సచ్చి ఏలోకంలో ఉండాదో మహాతల్లి. వర్సగా ఆరు మంది మగబిడ్డలను కనిందని మాయమ్మకు యింట్లో భలే మర్యాద. నేను ఏడోవోణ్ణి. సంకురేతిరి దినాలుగదా, అప్పుడు బడికి సెలవులు. కంటిమింద రెప్పెయ్యకండా నా సుట్టూతానే ఉండేవోడు మా రాముడు.


ఐదెకరాల మడి. అందులో సగం మామిడితోట. తోటలోనే ఆరంకణాల పూరిల్లు. దానికానుకోని నాకూ మాయమ్మకూ వసారా. వానబడితే తప్ప, మమ్మల్ని ఇంటి ముందరున్న పెద్దమామిడి చెట్టు కిందే కట్టేవాళ్లు. మడి సుట్టూ బద్రంగా కంప. నేనూ, మాయమ్మ, మా రాముడు, మా రాముని అమ్మానాయన - మాదే రాజ్యం. యేరే మనిసిగానీ, గొడ్డుగానీ మాకు తెలీకండా లోపలకొచ్చే మాటేలేదు. పుట్టిన మరుదినం నుంచి తోటంతా చెంగనాలెయ్యడమే[12] పని. నాతోపాటు దౌడుదీస్తే వాళ్లమ్మ తిడతాదని దూరం నుంచి సూస్తా వుండేవోడు రాముడు. పచ్చని తోటలో తెల్లగా మెరిసిపోయే నన్ను సూసి మావోళ్లు మురిసిపోతే సాలు, పాలుగూడా అక్కరలేదు నాకు, తోకను జెండామాదిరిగా నిటారుగా పైకినిలబెట్టి తోటంతా దౌడుదీసేవాణ్ణి నేను. మెల్లమెల్లగా గడ్డిపోసలు కొరకడం మొదులుబెట్టేటప్పుడు మెత్తని శొంఠిగడ్డలు,గరిక తెచ్చి నోటికందించేవాళ్లు. నాకు తినిపించడమంటే మా రామునికి ఇప్పటికీ ఇష్టమే. “పొద్దుగూకులూ ఆ దూడతో ఆటలేనా, పుస్తకంబట్టి పబ్లిక్ పరిచ్చలకు సదుకునేదేమన్నా వుంద్యా?” ఇంట్లో నుంచీ నాయన బెట్టిన కేకతో మొగం చిన్నబుచ్చుకొని నన్నొదిలి ఇంటికిబొయ్యేవోడు.


మల్లా మూణ్ణెల్లకు యండాకాలం శలవలకు ఇంటికొచ్చినాడు. వొచ్చినరావడం నేరుగా నాకాడికే వచ్చినాడు. మామిడిచెట్టు కింద గుంజకు నన్నుగట్టేసిన తావుకొచ్చాంటే సెప్పలేనంత సంతోసమాయె నాకు. లేసి నిబబడి మోరెత్తి పలకరిస్తి. నా యీపు మింద అరచేత్తో ఆప్యాయంగా తట్టి, గంగడోలు నిమురుతాంటే “రామూడూ నువ్వు యల్లకాలం సల్లంగుండాల”ని మనసులోనే అనుకున్యా. మొదుట్నుండీ పుస్తకాల కంటే సెట్టూచామా గొడ్డూగోదా మింద బ్రమలెక్కువ గాబట్టి, ఆ యండాకాలం శలవులతోనే సదువు యండగట్టేసినాడు. వాళ్లనాయన యంత బాద పణ్ణాడో నేను అంత సంబరపణ్ణా. మామూలుగానే చిన్నబిడ్డను సూసుకొన్నిట్టు సూసుకొంటారు నన్ను. రాముడొచ్చినాంక నాకు నా ఐదెకరాల సామ్రాజ్యం రామరాజ్యమే అయింది.


ఆ రాముని దయవల్ల మా రాముడు సంతోసంగానే ఉండాడు. ఈమధ్యనే మంచి జోడీ కుదిరింది. సదువుకున్న పిల్ల. పెద్దగా కష్టం సెయ్యలేదు గానీ, మా రామునికి కష్టం కలిగించే పని సెయ్యదు. రోంతొక్కరవ్వ నాజూకైన మనిసి. ఈ మళ్లల్లో యండలకు వానలకు అగసాట్లుబడే బదులు టౌనుకు బొయ్యి సిన్న యాపారమేదైనా బెట్టుకొని సులబంగా బతుకుదామని ఆశ. కాపోతే నేనంటే మాత్రం ఇష్టమే. ఇష్టంకన్నా జాలి ఎక్కువ. నేనేదో నా శక్తికి మించి పనిజేసి అలిసిపోతాండాననని. పిచ్చిపిల్ల.


నన్ను గుంజకు కట్టేసేటప్పుడు అట్టాయిట్టా తిరిగేదానికి, వీలుగా పొడుగాటితాడుతో కట్టేసేది. మా రాముడు మాత్రం ఎప్పుడూ కురసగా కట్టేసేవోడు పెద్దగా తల తిప్పేదానిగ్గూడా వీల్లేకండా. కానీ నా కర్మగుదికీ ఆ పొడుగుతాడే నా కాళ్లకు సుట్టుకోని కిందబడేసిందిప్పుడు. నిజ్జం జెప్తాండ్లా! మొగుడూపెండ్లాలిద్దరూ నా మింద ఈగ వాలనిచ్చేవాళ్లుగాదు. అట్టాటిది ఇయ్యాల ఈ గుఱ్రపీగ ఎంతపనిజేసిపాయ.
నా పానం బోతాందని నాకు అర్తమైతాంది. ఎప్పుడూలేనంత బయం. బయపడితే పొయ్యేది పోకమానుతుంద్యా! యెప్పుటికైనా పోవాల్సిందే, యల్లకాలం యీణ్ణే వుంటామా? నేను బోతే మా రాముడు పాపం గుండెలు పగిలేదాంకా యేడుచ్చాడు. అసలు నాది నిజంగా సావు బయమా? సచ్చినాంక నా గతేమైపోతుందో అని దిగులా? మా రాముణ్ణి మల్లా సూచ్చానో సూళ్లేనో. సచ్చినాంక నేనేమైపోతానో, నన్నెవురు జూసుకుంటారో! నా ఐదెకరాల తోటను, మా ఇంటినీ, మా రాముణ్ణీ సచ్చినా వదలగూడదు. నేను యాడికీబోను. ఈణ్ణే ఉంటా.


ఇట్టా యేందేందో దిక్కూదరీలేకండా అనుకుంటా వుండంగానే నా నొప్పి మెల్లిగా మాయమైపోయ. పక్కటెమకల్లో నొప్పిలేదు. మెల్లిగా కుడిపక్కకు పొల్లుదామని సూస్తే అంతా ఉలకంగా ఉంది. మొగదాట్లోనుంచీ కాలు ఊడొస్తుందేమో అని మెల్లిగా లాగితి. అసలు మొగదాడే లేదు. గట్టిగా ఊపిరి పీలుద్దామంటే నా చాత కాలా. అసలా అవసరమే లేనట్టుంది. లేసి నిలబడితి. రెండడుగులు పక్కకేసి సూస్తి. కోడెగాడు ఇంగా గుఱ్రుబెట్టి నిద్దరబోతాండాడు మొద్దునాయాలు. పక్కన్నే నేనూ పండుకోనుండా. మొగదాట్లో నా కాలు అట్నే చిక్కుబడుంది. నా కండ్లు బెదిరినట్టు యర్రగా పెద్దగా తెరుసుకోనే ఉండాయ్. తెల్లగా మెరిసిపొయ్యే నా ఒళ్లుమాత్రం నిగారింపు తగ్గిపొయ్యి నల్లకప్పేసింది[14]. నానుంచీ నేను పక్కకొచ్చి నన్నునేనే సూసుకోవడం కొత్తగా ఉండాది. మామిడిచెట్టు కిందినుంచి మెల్లిగా నడుసుకుంటా బైటికొస్తి.


పైకి జూస్తి ఆకాశంలోకి. ఆ దినం అమాస. సుక్కలన్నీ కండ్లు నిక్కబొడుసుకోని కిందికి సూచ్చాండాయ్. ఇంతకూ యేమి జరుగుతాండాదని సూచ్చాండాయబ్బా అని నేనూ సుట్టూజూస్తి. ఏముండాదీ, యండకాలం తెల్లారుజాము, సల్లగ గాలి, గాలికి చిన్నగా ఊగుతా కాపుతోవున్న మామిడిచెట్లు, అప్పుడోటీ అప్పుడోటీ రాలిపడే పిందెలు, సెట్లల్లో వాలి సలసలా సప్పుడు జేసే రెయ్యిపచ్చులు, తింటేతిన్న్యాయిలే అన్నిట్టు లోకమే మరిసి సల్లగా దోమతెరల్లో మంచం మింద నిద్దరబోతాండే మా సీతారాములు, మాడిసెట్టుకింద మా కోడెగాడు, అడిపక్కన్నే నేనూ… నేనా! కాదు, దిక్కులేని సావు సచ్చిన నా బొంది. ఆహా! యేమంటిని యేమంటిని? సచ్చింది నేనుగాదు నా బొంది. హహ్హ! బలే తమాసాగా వుండ్లా!?


అట్టా ఆలోశన సేసి, నాకు నేనే నవ్వుకోని, పైకి సూసీ సూసీ మెడ నొప్పిబెడుతుందేమో నని కిందికి దించితే, ఇద్దురు పెద్దమనుసులు చేతులు గట్టుకోని నా ఎదురుఁగా నిలబడుండారు. ఎందుకైనా మంచిదని నేనే వాళ్లకు నమస్కారంబెడితి. వాళ్లూ పోటీలుబడి నాకు నమస్కారంజేసిరి. యీళ్లిద్దురూ తప్ప, జన్మలో నాకు నమస్కారం జేసినోడు యెవుడేగాని లేడు, మాయమ్మతోడు. ఆకాశాన్ని సూస్తా “బయలుదేరుదామా స్వామీ” అన్న్యాడొకొకాయన. ఆ బాసకు చిరాకొచ్చింది నాకు. “యాడికి బొయ్యేది? వచ్చానని[15] ఇంతకు ముందే పిలిసి సెప్పినట్టుగా - పాండి స్వామీ - అంటాండారే! నేను యాడికీ రాను. ఇంతకూ యెవురుసామీ మీరు? రేతిరిపూట తోట్లోకి జొరబణ్ణారే!”


ఆ మాట అంటాండంగానే వాళ్లెవురో ఎందుకొచ్చినారో నా అంతట నాకే తెలిసిపొయ్యింది.


“తప్పదు స్వామీ. బయలుదేరాల్సిందే.”


“అయ్యా, రోంతసేపుంటే మా రాముడు నిద్దరలేచ్చాడు, ఒక మాట సెప్పి పోదాము”


“సూర్యోదయానికి ముందే ఈ లోకం నుంచీ నిష్క్రమించాలి మనం. ”


“ఓర్నీపాసుగలా! ఒక్క అర్థగంట తట్టుకోండియ్యా. ఠంచనుగా ఐదుగంటలకే లేచ్చాడూ” అని నిష్ఠూరమాడితే ఇద్దురూ మొగామొగాలు జూసుకోని “సరే” అన్నారు. తూరుప్పక్క మెల్లిగా తేటబడతాంది. మంచానికి నాలుగడుగుల దూరంలో నిలబడి సూచ్చాండా నేను. పెద్దమనుషులిద్దురూ చేతులుగట్టుకోని విసుగనే మాటే కనపరానీకండా నిలబడుండారు. “నువ్వెంత అజ్ఞానపుదానివో నీకు తొందర్లోనే తెలుచ్చుందిలే” అన్నిట్టు వాళ్లిద్దురూ ముసినవ్వు మొగాల్తో సూచ్చాండారు.
హాయిగా మెల్లిగా గాలి తోల్తాండాది. తెలతెలవారతాందనంగా మెలకవొచ్చింది మా రామునికి. యల్లకిలా పండుకోని పండుకోనే కండ్లు తెరిసినాడు. మెడసుట్టకారమూ చెయ్యేసి ఒత్తిగిలి నిద్దరబోతాంది పెండ్లాము. ఆ చెయి మడికట్టును మెల్లిగా పట్టుకోని, మెలకువ రానీకండా మెడపట్టు తప్పించి పక్కకు జరిగి , అంతకంటే మెల్లిగా దోమతెర తీసి మంచం దిగినాడు. తన నిద్దర చెడగొట్టగూడదనే మొగుని తాపత్రయానికి మురిసిపోతూ నిద్దర్లోనే వున్నిట్టుగా కండ్లుమూసుకోని పండుకోనుందామె. ఒక్క పెండ్లాన్నేగాదు, అమ్మానాయన్నూ, నన్నూ మాయమ్మనూ, ఆమాటకొస్తే యెవురినైనాగాని నొప్పిదగలనీకండా సూసుకొని మసలే ఓపికైన మనిసి మా రాముడు.


అట్టాంటి నా రాముడు జీవంలేని నా బొందిని సూసి తట్టుకుంటాడా? నిలువునా కుప్పగూలిపోతాడేమో. మంచందిగి నేరుగా మామిడిసెట్టుకిందికే బోయినాడు. నా పరిస్తితి సూణ్ణే సూసినాడు. బెదిరి అట్టే నీలక్కపోయిన నా కండ్లుజూసి మెరుపు మాదిరిగా కదిలి చెట్టుమొదుట్లో కొడవలి అందుకోని నా మొగదాడు కోసేశ. దొక్కమింద రెండుచేతుల్తో అదమిసూసినాడు. నా యనక్కాలు మెడకిందనుండి పక్కకు జరిగె. తల మెల్లిగా నేలకు జారిపాయ. రాముడు మల్లా నా కండ్లదిక్కు సూసినాడు. కండ్లు బెదిరినట్టు పెద్దగా తెరుసుకోని నీలక్కపోయే వుండాయ్. ముక్కల చెయ్యిబెట్టి సూశ. మల్లా నా కండ్లదిక్కు జూశ. రాముని సూచ్చావుంటే నాకు తొలిసారి భయం. ఏమైపోతాడో యేమోనని.


ఆ బుజానున్న తువ్వాలు దిగలాగి ఈభుజానికి మార్చుకొంటా, నా బొంది పక్కన్నే నేలమింద కూసుండిపోయ. నా మెడకింద తాడు బిగసకపోయిన గుర్తు జూసినాడు. పొడుగ్గా కట్టేసిన తలుగుతాడు జూసినాడు. కండ్లనిండా నీళ్లు. కిందికి జారనీలా. కోడెగాడు లేసి నిలబడి నా బొందినీ, రాముణ్ణి మార్చి మార్చి సూస్సాండాడు బయంగా. ఎప్పుడొచ్చిందోయేమో మా రాముని పెండ్లాము పక్కన్నే నిలబడి భోరుమని యేడుపెత్తుకొనింది. మొగం పైకెత్తి పెండ్లాం మొగం జూస్తే తానూ ఏడుచ్చాడనే బయ్యమేమో, తలెత్తి సూళ్లా. నా ముక్కుకు తాడుజేసిన గాయం ఆమె కంటబడింది. యేడుపు గొంతుతో “పానంబొయ్యే ముందర యంత నొప్పి బడింటుందో” అని మొగుణ్ణిజూసి బావురుమనింది. పెండ్లాం మొగంలోకి జూడకండా, లేసి నిలబడి ఆమె బుజంమింద సెయ్యేసి వూరుకోమన్నిట్టుగా తట్టి, జీరగొంతుతో “గొడ్డుమింద అంత అబిమానం … పనికిరాదే. దాన్నెట్టా కట్టెయ్యాల్నో చిన్నదానివి నీకు దెలీకపోతే, నేనన్నా జెప్పాలగదా… తప్పునాది.” అన్యాడు. ఆమెకు పొరబాటు అర్తమైనిట్టుండాది. పాపం జేసిన దాని మాదిరి బయపడిపొయ్యింది. రాముడు ఆమె మొగంలోకి జూసి, ఏం ఫరవాలేదన్నిగా ఇంగోసారి బుజం తట్టి “తప్పు నాది. వూరుకో. జరుగుతాయ్. ఒగోసారంతే.” అని యడమ చేతిలోని తువ్వాలుతో కండ్లుదుడుసుకోని, ఇంగో పక్కకు బొయ్యి ముక్కుజీది, క్యాకరిచ్చి థూప్‌మని ఊసినాడు. ఇదంతాగూడా దుక్కం దిగమింగేదానికే. చిన్నపిల్లకాయ కాదుగదా. పెండ్లాంతో బాటుగా ఏడిసేదానికి మొగమాటం.


పక్క తోటలో ఉండే మనిషిని కేకేసి పిలిసినాడు. పరుగు పరుగున బూసిగాడు వచ్చి ఎదురుగ్గా నిలబడె. “బూసిగా, రేతిరి మన కోడెదూడ సచ్చిపొయ్యిందిరా.” నేలను జూస్తా మెల్లిగా అన్యాడు. సచ్చిందాకా నేను దూడనే మా రామునికి. “బాగుండెగదప్పా… యేమాయప్పా వున్నిట్టుండి? పురుగేమన్నా మూజ్జూసింటాదా?[16] ” అడిగినాడు బూసిగాడు. ఏమయ్యిందో చెప్పేదానికి మా రామునికి మొగమెక్కలా. “పానంబొయ్యి యంతసేపాయప్పా” బూసిగాడు మల్లా అడిగె.


ఒక నిట్టూరుపు వొదిలి… “తెల్లారుజామున్నే పొయినిట్టుండాదిరా. మీ పల్లెలో ఎవురికన్నా …”


రాముడా మాట అనంగానే బూసిగాని మొగంలో వెలుగు. “ఔ ప్పోవ్, ఆలీశమైతే చర్మం పనికిరాకండా బోతాది. ఎవురికో ఎందుకుప్పా మా నాయనకే జెప్తాలే, మొగంగడుక్కోని వస్సాడు” ఆనందంగా అనేసి, నాలిగ్గరుసుకోని, “బాగుండెగదప్పా, ఏమాయె ఉన్నిట్టుండి …ప్చ్!” అంటా లేని నొప్పి యల్లగక్కె. రాముడు ఇదంతా పోదోసి, “చర్మం అమ్ముకోని లెక్క[17] సాయంత్రానికి తెచ్చియ్యాల.” అంటే “అట్నేప్పా” అంటా వాళ్ల పల్లెదిక్కుబోయ బూసిగాడు.
రాముడు నా చర్మం సొమ్ముజేసుకోవాలని మనుషులను పురమాయించినాడు. నేను అనుకున్నిట్టు పెద్దగా బాదపణ్ణిట్టు కనబళ్లా. నా పక్కనున్న పెద్దమనుషులిద్దరూ అప్పటికే నేలనొదిలి పైకి పయనమౌతూ నన్నుజూసి పొడినవ్వు నవ్వి, నన్ను పైకి రమ్మన్నారు. నేనూ మెల్లగా నేలనొదిల్తి. నాకు రాముని మీద కోపంలేదు. జాలికూడా లేదు.


అమ్మానాయన్ను ఆదరంగా సూచ్చాండాడు, పెండ్లాన్ని కంటికిరెప్పమాదిరి కాపాడతాండాడు, నేను పుట్టినప్పట్నుంచీ రాముడు నాకు ఏ లోటూ రానీలా. నా బొందిమింది తోలు అమ్ముకుంటే మాత్రం తప్పేముండాది? శివరాతిరి పండక్కు ఖర్చులకైనా వస్సాది గదా. నా బొంది ఆణ్ణేబెట్టుకోని వారంరోజులు ఏడిస్తే నాకేమొస్సాది! నా తోలుగూడా పనికిరాకండాబోతాది గదా!? జన్మమెత్తినందుకు తన ధర్మాన్ని తాను చేసుకుపోతాండాడు. మర్నేను!? నా శక్తికొద్దీ శంబడి రామునికి సాయం జేసినా. మా రాముడు సంతోసంగా ఉండాలని ఆ రామునికి దినామూ మొక్కినా. నా ధర్మం నేనూ జేసినా. సరిపోయ. రుడం తీరిపాయ. రాముడు నాకోసం రెండ్రోజులైనా యేడవలేదని బాదపడ్డమంటే యెర్రిగాక ఇంగేంది !? బతికున్నోడు తన పని తాను చేసుకుపోతాండంగా, నాకెందుకింత ఆలోచన? అయినా… రేపు పొద్దున్నేలేసి నాకు కుడితినీళ్లు తాపుదామని ఆదమరుపుగా చెట్టుకిందికొచ్చి మల్లా బావురుమనడూ …


ఇట్టా అనుకుంటా కిందికిజూస్తే ప్రపంచం ఐదెకరాలకంటే ఎంతపెద్దదో తెలిసొచ్చింది. నా పక్కన పెద్దమనుషులు లేరు. తేలికపడిన మనసుతో సూరీణ్ణి, సందమామను, సుక్కలను దాటి పోతా పోతాండా. ఇంత - అన్జెప్పేదానికే యీల్లేనంత బెమ్మాండమైన ఆకాశంలో “నేను” అనేదేదీ యేరేగా లేకండా “అంతానేనే” అనిపించబట్టింది. సావుపుటకలు చానా మామూలు సంగతులు. ఇందులో బయపడాల్సిందేమీ లేదు. ఈ పయనం ఎంతదూరమైనా ఇప్పుడు నాకు పట్టింపు లేదు.
వ్యవసాయ నేపథ్యం లేని మరియు కడపజిల్లా మాండలికం తెలియని వారికోసం: 1. ముల్లుగర్ర - ఎద్దులకు చురుకు తగిలించి వేగంగా నడిపించడానికి వాడే కర్ర. దీని చివర ఒక చిన్న ఇనుప ముల్లు ఉంటుంది.

 2. తలుగు - పశువులను కట్టేయడానికి వాడే తాడు లేదా ఇనుప గొలుసు.

 3. మోర - మెడ, మెడపైని తల భాగము

 4. మొగదాడు - ముక్కుతాడు

 5. దొక్కలు - డొక్కలు

 6. కాడి - ఎద్దుల జత

 7. నారు - జాతి

 8. నట్టు - రోగం

 9. ఇరసాలు - (ఇరు = రెండు; సాలు=దున్ను) నిలువుగా ఒకసారి మళ్లీ అడ్డంగా ఒకసారి దున్నటం

 10. ఆగం - అల్లరి లేదా నిరసన

 11. దబ్బణం - సూదిలాంటిదే, కానీ సూదికన్నా చాలా పెద్దది

 12. చెంగనాలు - చిన్న దూడలు వేసే గంతులు

 13. గంగడోలు - పశువుల గొంతు కింద వేలాడే చర్మం

 14. నల్లకప్పేసింది - ఆనారోగ్యంతో ఉన్న పశువుల చర్మం నిగారింపు తగ్గుతుంది - దాన్ని నల్లకప్పు వేయడం అంటారు. ప్రాణం పోయాక కూడా నిగారింపు తగ్గుతుంది.

 15. వచ్చానని [ఇక్కడ ‘చ’ ను చాప అని పలికినట్టు చప్పగా పలకాలి] - వస్సానని - వస్తానని

 16. పురుగు మూజూసుంటాదా - పురుగు వాసన జూడటం - పాము కాటేసి ఉంటుందా అనడానికి భయపడి, ఈ euphemism వాడతారు.

 17. లెక్క - డబ్బు

కామెంట్‌లు

Unknown చెప్పారు…
అక్కడ "శోచితుమర్హసి" అని ఉన్నది కాస్తా ఇక్కడ "శోచిసుమర్హసి" ఐందేమిటబ్బా?
రానారె చెప్పారు…
పడాల్సిన మొట్టికాయే. ఇప్పుడు మార్చా. థాంకులు.
teresa చెప్పారు…
Very good story- tripuraneni Gopichand gaari 'aRRu kaDigina eddu' ni talapiMchiMdi.
rākeśvara చెప్పారు…
చాలా బాగుంది కథ.
మా నాన్న ఉన్నారు కాబట్టి ముక్కు తాడు అంటే ఎంటో తెలుసుకోగలిగాను.
ఆ తరువాత రోడ్డుమీద ఒక దూడని చూసా, దానికి ముక్కుతాడు ఉంది. నాకు ఈ కథ గుర్తుకువచ్చి చాలా బాధ కలిగింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

తాతగారి అనుపమితోపమానము

పన్ల కాలం. అందురూ మడికాడికి బొయినారు. అన్నదమ్ములమిద్దరమూ ఇంటికి కావిలి. మాక్కావిలి మా తాత. పొద్దన్నుంచీ సింతసెట్టుకింద నిలబడి సూచ్చాండాం, ఆడుకుండేదానికి పిల్లకాయలెవురన్నా వచ్చారేమోనని. యంతసేపు జూసినా వొక్కడూరాల్యా. మేమిద్దరమే రోంచేపు ఏమన్నా ఆడుకున్యామంటే అది కొట్లాటే. ఊళ్లో పిల్లాపెద్దా అందురూ పన్లకు బొయినిట్టుండారు. వొగ మనిసిగాని గొడ్డూగోదాగాని యెవురేగాని బైట కనపరాల్యా. వడగాలికి సింతసెట్టు కింద నిలబడుకొనుంటే కంసలోల్ల యీరయ్య కొలిమికాడున్నిట్టు అగ్గి సెగ. పడమటగాలి. గాలితోలే సద్దు తప్ప వొక్క పక్షిగూడా యాణ్ణేగాని కూత గూడా బెట్లా. కోళ్లు మాత్రం ఇంటి ముందరుండే సర్కారుకంపచెట్లల్లో చెదులు కోసం చిదుగుతాండాయి. ఉన్నిట్టుండి పెద్దకోడిపుంజు దిగ్గునలేసి బెదురుగా నిలబడె. బొమ్మెలన్నీ యెక్కడియ్యక్కడ నిల్చిపొయ్యి మెడలు పైకెత్తి బీతుగా దిక్కుల్జూశ. పెద్దపుంజు వొగ కన్నుతో ఆకాశంకల్లా తేరిపారజూస్తా సన్నగా కుర్‌ర్‌ర్రుమనె. అట్లనేటప్పుడు దాని ఈకలన్నీ మెరుగుతగ్గి వొంటికి అంటగరసకపాయ. బొమ్మెలన్నీ యెప్పుడు దూరుకున్యాయో యెనుముల కొటంలేకి దూరుకున్యాయ్. పెద్దపుంజుతోపాటుగా పిల్లలకోడిగూడా వసారాలోకి దూరె. "గద్దకయ

మా హౌసు లీడరు బయపురెడ్డి

చిన్నప్పుడు నేను శానా సన్నగా వుండేవోణ్ణి. అందుకే మా ఇంట్లో నా పేరు వూసోడు. "ఊసన్నా" అనేవోడు మానాయన. పిలుపు యినబడతాన్నెపాటికే నాయన ఎదురుగా నిలబడాల. అది మాకిచ్చిన ట్రైనింగు. పిక్కల్లో పిడికెడు సియ్య ల్యాకన్న్యా, ఊసుకొవ్వు తక్కవ లేదమ్మా యీనికి, అనేది మాయవ్వ. ఆ అనడంలో వొగ మురిపెం వుంటాదిలే. మన బిడ్డలు పెద్దమొగోళ్లైపోతాండారు అని సంబరపడినట్టుగా వుంటాదామాట. అందుకే మాయవ్వ యేమన్న్యా పెద్దగా పట్టింపురాదు. మేము కొవ్వుపనులు చేసినా మమ్మల్ను యేమన్నా అనకపోతేనే పట్టింపు. అవ్వతో మాటామాట పెరిగితే "ఆ ముక్కు జూడు .. సక్కదనాల ముక్కు .. యెంత వందనంగా వుండాదో" అని యెక్కిరించేది. ఆమె పేరు చెన్నమ్మ. మాయవ్వకు తెలీని సంగతి వొగటుండాది. తెలీనప్పుడు మనమైనా చెప్పాల గదా అని, "నా ముక్కు చిన్నదైనా చెన్నమ్మ ముక్కుకంటే మేలైందేలే" అంటాననుకో, అప్పుడు మాయమ్మకు కోపమొచ్చేస్సాది. "వూసోడా, తన్నులు గావల్నా" అంటాది. నిజం జెప్పాల్నంటే, లోపల్లోపల అమ్మ నవ్వుకుంటా వుంటాది. పెండ్లికి ముందొకసారి మాయమ్మను చూసేదానికి వాళ్లింటికి వొచ్చిందంట మావవ్వ. అప్పుడు మా చిన్నమ్మ వొగామె, "ఎవురో కోసినట్టుగా