ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సృజన + ఆత్మక'థ'

"కోటి కోటి గుండెలలో పులకింతలు పులకింతలు
కోటి కోటి గొంతులలో ప్రభవించే ఆశయాలు
సాటి మనుషులందరిపై సౌమనస్య భావనలు
మేటి మేటి నడతలోన రేపటి మన నవ్వులు
చిరునవ్వులు చిరునవ్వులు చిరునవ్వులు"

ఆకాశవాణిలో ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే "పాట నేర్చుకుందాం" కార్యక్రమంలోని పాట. పిల్లలకోసం చిత్తరంజన్‌గారు నిర్వహించే ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమయేది. దాన్ని మా కడపకేంద్రం రిలే చేసేది. ఈ పాటను విని నేర్చుకొనే జ్ఞానము వయసు రెండూ నాకు లేని వయసులో మా నాయన రేడియో వింటూ నాతో రాయించి అర్థం చెబుతూ నేర్పినాడు.

ఆ తరువాత ఇదేపాటను నేను శ్రీనివాసా కాన్వెంట్లో, మా జడ్‌.పీ‌ హైస్కూల్లో, రాయచోటి భారతి స్కూల్లో, ఆ తరువాత ముక్కావారి పల్లెలో పాడిందే పాడరా పాసిపండ్ల దాసరీ అన్నట్టుగా శ్రోతలు మారినప్పుడల్లా చెడబాడి 'బహు'మతులు పోగొట్టాను/రాబట్టాను. ఇవన్నీ మరచిపోతానేమోగానీ పదేళ్ల వయసులో "బాలవిహార్" చిన్నపిల్లల కార్యక్రమంలో ఈ పాటను పాడటం మాత్రం మరపురాని అనుభవం. ఆకాశవాణి కడప కేంద్రంలో రికార్డయి ప్రసారం చేయబడిన నా ఏకైక కార్యక్రమం ఇదే.

మన ఆంధ్రదేశంలోని ఎంసెట్ జాడ్యం నన్నూ సోకిన తరువాత పాటలు, పుస్తక పఠనం, ఆటలు మొదలైనవాటిపై నా ఆసక్తి, సృజన వాడిపోయినాయి. కళ్లకు జోళ్లొచ్చినాయి. మెడిసిన్ సీటు మాత్రం రాలా. ఆ తరువాతేముందీ... కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది అనుకుంటుండగా తంతే బూరెల బుట్టలో పడినట్టు ఈ రంగంలోకొచ్చి పడ్డాను.

సరే, మళ్లీ పాటలోకొస్తే ఈ క్రింది చరణం అనుకోకుండానే అప్పుడప్పుడూ మనసులో మెదులుతూ ఉంటుంది. మెదిలిన ప్రతిసారీ మూడో పంక్తి గుర్తుకు రాదు. రాని ప్రతిసారీ నా నాయనకేమైనా గుర్తుందేమో అడుగాలనుకొంటాను. అనుకొన్న ప్రతిసారీ తప్పకుండా మరచిపోతాను. ఇదిగో ఆ చరణం:

"మనమూ మనమని పలికే మనసుంటే అదే మతం
సౌజన్యం, సహజీవన సౌశీల్యం మనిషి వ్రతం
---- ---- ----- ----- ---
మానవతకు విలువ పెంచి సాగాలోయ్ అనవరతం సాగాలోయ్ అనవరతం" |కోటి కోటి|

మంచి విషయం కదా! ఈ పాట రచయిత పేరు "సంపత్" అన్నట్టు గుర్తు. రికార్డింగ్ రూము సౌండ్‌ప్రూఫ్ అని తెలుసుకొని అదెలా చేస్తారోనని చాలా ఆశ్చర్యంగా ఆలోచించాను. రకరకాల మైకులు, అద్దాల గోడలు, నెమ్మదిగా తనంతట తానే మూసుకొనే తలుపు, రౌండ్‌ టేబులు, ఇడ్లీమూసల్లాంటి రికార్డింగ్ టేప్ పరికరాలు చూడటం అదే మొదటిసారి. ఒకోదాని గురించీ చాలాచాలా ఆలోచనలు.

ఫలానా ఆదివారం నా పాట రేడియోలో ప్రసారమౌతుందనగా ఆ రోజు నేను మా బంధువుల ఇంట్లో ఉన్నాను. సరిగ్గా ప్రసార సమయం దగ్గరవుతుండగా మా తాత (అమ్మ యొక్క నాన్న - ష.త.సమాసము) వాళ్లవూరికి ప్రయాణం కమ్మని అందరినీ తొందరపెట్టి, నా అభ్యంతరమనే పూచికపుల్లకు అగ్గిబెట్టడంతో రేడియోలో నా పాటను వినే అవకాశం నాకు లేకుండాపోయింది. బస్సులో ప్రయాణమౌతూ "ఈ పాటికి రేడియోలో నా పాట అయిపోయుంటుంది, ఎవరైనా విన్నారో లేదో" అని నాకు నేనే అనుకోవాల్సి వచ్చింది. మా నాయన ఆ రోజు నాతోపాటు ఉండి ఉంటే ఇదంతా జరగనిచ్చేవాడు కాదు.

ఇది జరిగిన సంవత్సరానికి బాలవిహార్ కార్యక్రమంలో ఆకాశవాణి కడపకేంద్రం పన్నెండేళ్లలోపు పిల్లలకు ఒక చిన్న పోటీ పెట్టింది. "కలసి ఉంటే కలదు సుఖం, దురాశ దుఃఖానికి చేటు, చెరపకురా చెడేవు, ..." ఇలా ఐదారు సామెతలు చెప్పి, వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని దాని ఆధారంగా ఒక కథ రాసి పంపమన్నారు. ఆ కథ నేనే రాశానని, నా వయస్సు పన్నెండులోపేనని ధృవీకరిస్తూ మా పాఠశాల ప్రధానోపాధ్యాయులుంగారి చేవ్రాలు తప్పనిసరి. కథరాసి అయ్యవారి సముఖమునకు గైకొనివెళ్లగా, అసలందులో ఏముందో చూడకుండా "ఆ... అది!" అనేసి సంతకం పెట్టి, అటెస్టెడ్ అని రాజముద్రవేసి "ఫో!" అనేశారు చేపపిల్లను మళ్లీ నీళ్లలో వదులుతున్న పిల్లాడిలాగా సంబరంగా మొహంబెట్టి. ఆయన ఆ కథను చదివి మెచ్చుకొని ఏమైనా సవరణలు సూచిస్తారేమోననుకొనడం వల్ల కొద్దిపాటి నిరాశ. రాజముద్రితమైన పిదప/తదుపరి/తరువాత ఆ పత్రమును రిజిస్టర్డ్ పోస్ట్ చేసి ఇంటికొచ్చేశాను.

అదే నా మొదటి కథ. ఈనాటివరకూ అదే చివరిదీనూ.

కథ ఎలా రాశానో గుర్తులేదుగానీ ఇతివృత్తం ఏమిటంటే - వీరబల్లెలాంటి ఒక చిన్న ఊరిలో ఒక శెట్టిగారు కిరాణాషాపు పెట్టుకొని భార్యాపిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. ఆయన పక్కనే ఉంటున్న మరో ఆసామికి కాలం కలిసొచ్చి ధనయోగం పట్టడంతో మంచి మేడ కట్టేస్తాడు. నడమంత్రపుసిరి కలిగించిన మిడిసిపాటుతో ఆసామి ఇల్లాలు పెడసరంగా మాట్లాడటంతో శెట్టిభార్య నొచ్చుకుంటుంది. తానెంతగానో ఇష్టపడే పడతి తనఎదుట బొటబొటా కన్నీరుకారుస్తూ వగచి వాపోవడాన్ని శెట్టి భరించలేకపోతాడు. ఆసామికి ఇల్లాలికి దీటుగా తనఇల్లాలిని చూసుకోవాలనే తాపత్రయంలో ఆవేశంలో ఆస్తులు తెగనమ్మి డంబాలకై ఖర్చుచేసి చిక్కుల్లోపడతాడు. తానెంత పెద్దతప్పు చేస్తున్నాడో ఆలస్యంగానైనా గ్రహించి ఆ మొగుడూపెళ్లాలిద్దరూ ఊహాలోకాన్ని వదలి ఇహలోకంలోకి రావడంతో కథ ముగుస్తుంది. నేనెంచుకున్న సామెత - "పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు".

ఈ కథ పోటీలో మొదటిస్థానం సంపాదించింది. కానీ అది రేడియోలో ప్రసారమైనప్పుడు నేను వినలేకపోయాను. స్కూలు మరి. అలా నా రెండు కార్యక్రమాలూ నేను వినలేదు. నేను తప్ప మిగతా అందరూ విన్నారు. "కర్మణ్యేవాధికారః తే, మా ఫలేషు, కదా చిన్నా!?" అని చిన్నికృష్ణుడు చిన్నప్పుడే చిన్నపిల్లలకు అర్థమయ్యేలా చెప్పేశాడంటారు, మీరేమైనా విన్నారా?.

పెద్దబాలశిక్షలో ఒక కథ ఉంది. ఎద్దును బెదిరించాలని ఒక మూర్ఖపు కప్ప తన పొట్టను పెద్దదిగా చేసి బుసకొడుతూ, ఉపిరి పీల్చి పీల్చి పొట్టపగిలి చస్తుంది. ఈ కథే నా కథకు మూలం. ఇలా ఒకదాని నుండి మరోటి సృష్టించడమే కదా సృజనకు నాంది. మీగ్గానీ సాలూరి రాజేశ్వరరావు గారబ్బాయి కోటి గుర్తొస్తున్నాడా? కోటి కోటి గుండెలలో పులకింతలు పుట్టించే మంచి సంగీతాన్ని ఆయన సృజించారు కూడా కదా! :)

కాబట్టి కామ్రేడ్స్ ఇంతకూ నేన్‌జెప్పేదేమిటంటే (యమగోలలో అన్నగారు) - రేడియోలో పిల్లల కార్యక్రమాలు వినడం, వినిపించడం, పెద్దబాలశిక్ష చదివించడం, వీటన్నిటి వెనక తల్లి/తండ్రి శ్రధ్ధవహించడం వల్ల ఒక సామాన్యుడైన పిల్లకాయ యొక్క తలకాయ కాస్త పెద్దకాయ అవుతుంది. వాడు కోటి కావచ్చు, రెహమాన్ అయినా అయిపోవచ్చు ఆశ్చర్యంలేదు. చిన్నపిల్లలలో సహజంగా ఉండే సృజనశక్తిని పెంపొందించడం తల్లిదండ్రుల బాధ్యత. "హూఁ... ఇట్టాటి బేకార్ మాటలు యింటా గూసుంటే మావోనికి మార్కులొచ్చినట్టే" అంటారా? ఎక్కువ కష్టపడకుండా మార్కులు రావాలంటే మెదడు లేతచిగురులాగా ఉండాలంటారు తెలిసినవారు. సిలబస్ చట్రంలో మెదడును బిగించేస్తే చిగురించే లక్షణాన్ని అనగా సృజనాత్మకతను కోల్పోయి మొద్దుబారునని అనుభవపూర్వకంగా చెబుతున్నాను నేను.

సిలబస్ తప్ప ఇంకే పుస్తకంతోనైనా తమ బిడ్డను చూస్తే - "వీడు మన వంశ వినాశనానికై శాపవశమున జన్మించిన కలుపుమొక్క" అని తీర్మానించి, "ఈ పోటీ ప్రపంచంలో ...." అని చాలా సీరియస్‌గా మొదలుబెట్టి జన్మమధ్యంలో మళ్లీ వాడు కోలుకోకుండా చికిత్స జరిపే తల్లి, తండ్రి, గురువు మొదలగు దైవములను చూస్తుంటాము.

మార్కుల మాఫియా, ర్యాంకుల మాయా రెసిడెన్షియల్ స్కూళ్లలో కాలేజీలలో తమ పిల్లలను మగ్గబెడుతున్న వారందరూ తాము ఏ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారో కొట్టుమిట్టాడుతున్నారో ఒక మారు ఆగి గమనించాలి.


"ఈ పోటీ ప్రపంచంలో ...." అనే సీరియస్ సీనియర్ సిటిజనులు తాము తేలికపడటానికై ఒకసారి చూడవలసిన సన్నివేశం "గోదావరి నదీ తీరంలో....". "ఔనన్నా కాదన్నా" అనే చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారి అద్భుత పాటవం - "గోదావరి నదీ తీరంలో... వెన్నెల వెలుగులో ... మేం ఒంటరిగా స్నానమాచరిస్తున్నాం... మాకు అల్లంత దూరంలో ... ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై జలకాలాడుతున్నారు..." ఇలా తమ భావుకతను అక్కడికక్కడ ప్రదర్శించగలగడమే సృజన. కదా!?

కామెంట్‌లు

Unknown చెప్పారు…
ఏమిటో మరి అంతా కంగారు కాలం అయిపోయింది. అయినా కొందరు బాగానే బాలెన్స్ చేస్తున్నారనుకుంట. మన డాక్టరు గారు లేరూ ?

మీరు రేడియో అంటే గుర్తొచ్చింది. అది మేము వరంగల్ లో ఉన్నప్పుడు. ఒక సారి ఇలాగే నాకూ రేడియో లో పాడే అవకాశం వచ్చింది. పిల్లల ప్రోగ్రాము అన్నమాట. "పిల్లలూ ఇందులో నీతేంటి ?" అని ఏదో ప్రోగ్రాం వస్తుందే అది.

అక్కడ ఇక అందరం కాసేపు ఊదరగొట్టాము... నాకు వచ్చిన పాట నేనూ పాడాను అప్పుడు. అందరూ చప్పట్లు కొట్టగానే ఛాతీ పొంగిపోయింది.

ఆ ప్రోగ్రాము ఎప్పుడొస్తుందో కనుక్కుని ఆ సమయానికి రేడియో ఆన్ చేస్తే తెలిసింది అది FM ఉన్న రేడియోలోనే వస్తుందని. ఇక పక్కింట్లోకి పరుగు. అక్కడ జనాలు కూడా నాతో పాటూ పాడారు లేండి. ఇక ఊపిరి బిగపట్టి వింటుండగా టప్.. కరెంటాఫ్. మళ్ళీ కరెంటొచ్చేసరికి "పిల్లలూ నీతి..." దగ్గరొచ్చి ఆగింది. మాకందరికీ మొహాలూ మాడిపోయాయి మరి దెబ్బకి. (తర్వాత మళ్ళీ ప్రసారం అయి విన్నామనుకోండి.)

అదో తీపి జ్ఞాపకం. బాగా గుర్తు చేసావు రానారె.
అజ్ఞాత చెప్పారు…
raanaare gaaru,

Your experience brought me back pleasant memories from my school days. My school used to prepare for balaanandam (vinodam) (whichever is the slot for younger of the kids on saturday) for every independence day. I was lucky to get chosen for one such event.

I couldn't hear mine either, because it was a live event.

I try to recreate to some extent, such simple pleasures like listening to balanandam, reading Chandamama etc., through my website.

Can I say that creativity, or any talent for that matter, doesn't get lost. It may only take a back seat while other things take turns taking their due priority.

As parents and teachers, while we encourage creativity, it is also our responsibility to set limits for kids.

Your thoughts on parenting are interesting. You will not forget to refer to your notes when you are on that path, will you? :-)

lalitha.
రాధిక చెప్పారు…
నాకు మిమ్మలిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.ఏదో తెలీకుండానే మీ నాన్నగారి మీద[ఇలా అంటే రాజుల వంశం అనుకుంటారేమో?మా తూగోజీలో ఇలాగే అంటారు]చాలా గౌరవం,అభిమానం ఇంకా ఇలాంటి ఎన్నో మంచి అభిప్రాయాలు కలిగేస్తున్నాయి.పిల్లల్లో కళా తృష్ణ ను పెంచేవాళ్ళు చాలా తక్కువమంది వుంటారు.పెద్దవాళ్ళు నేర్పారు కదా అని నేర్చేసుకునే పిల్లలు ఎంతమంది వుంటారు?మన రానారే ఎంతన్నా గ్రేట్ కదా.బహుముఖ ప్రజ్ఞాశాలి రానారే కు ఒక "ఓ"వేసుకొండి.నిజం గా చెపుతున్నాను మా అబ్బాయిని రానారే లా చెయ్యాలనుకుంటున్నాను.
రానారె చెప్పారు…
రాధికగారూ,
మీ అభిమానానికి చాలా సంతోషం కలిగింది. నేనేదో చాలా సాధించేశాననే భావం కలుగజేసినట్లున్నాను. అదే బహుశా నా బహుముఖప్రజ్ఞ. అంతకుమించి ఇంకేం లేదు. కలాం అంటారు - "నాకు పూర్వం లక్షరెట్ల ప్రతిభ, పట్టుదల, కమిట్‌మెంట్ కలిగిన గురువులు, దార్శనికులు చూపినదారిలో నడవడం తప్ప నా గొప్పేమీలేదు" అని. మేరువులాంటి మనీషి. అయనే తననెవరైనా ప్రజ్ఞావంతుడవంటే ఈ మాటతో కొట్టివేస్తారు. మరి అంతటి వారే ఆ మాటంటే, నేనేమిటి గడ్డిపోచను కూడా కాను. Jack of all trades, master of none అనే మాట వినే ఉంటారు. నాలాంటివాడికి "ప్రజ్ఞ" అనేది చాలా పెద్ద పదం కదండి. అయితే, మీ మాటవిని ఎవరైనా కొన్ని "ఓ"లు వేసుకొంటే మాత్రం తప్పకుండా తీసుకొంటాను. కాలనాళికలో భద్రపరచను. ఇంతకూ మీరీ టపామీద మీ అభిప్రాయం చెప్పలేదు.

లలితగారు,
మీ వెబ్‌సైటు చాలా గొప్ప ప్రయత్నం. మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీరన్నది నిజం. తల్లిదండ్రులు తమ పిల్లలకు హద్దులు పెట్టవలసిందే, వారి సృజనాత్మకతకు కాదు, దానికి మాత్రం పదునుపెట్టాలి. చివరగా మీరడిగిన ప్రశ్నకు నేనిప్పుడు మాటల్లో సమాధానం చెప్పడం నిరుపయోగం అనుకుంటున్నాను.

ప్రవీణ్, నా కార్యక్రమం మాత్రం మళ్లీ ప్రసారమైన సంగతి మా అమ్మో నాయనో చెబితేనేగానీ తెలీలేదు :(
సిరిసిరిమువ్వ చెప్పారు…
రానారే గారు
మీ కథ దాని తరువాత పిల్లల గురించి మీ అభిప్రాయం బాగున్నాయి. పిల్లలలోని స్పృజనని మెచ్చుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ కూడా వారి చదువులకి ఆటంకం లేకుండా చేయవచ్చేమో. ఎందుకంటే ఇప్పటి రోజులలో రెండూ అవసరమే. చదువుని పక్కన పెట్టేస్తే ఈ పోటీ ప్రపంచంలో కష్టం కదా. అలా అని చదువే లోకం కాకూడదు. పిల్లల ఇష్టాలకి, వారి అభిప్రాయాలకి విలువనిస్తూ వారిని ప్రోత్సహించాలి. రేపు పెద్దయాక వాళ్ళు మనల్ని వేలెత్తి చూపేటట్లు వుండకూడదు. మీరు మమ్ముల్ని చదువుకోమని చెప్పలేదు అని వాళ్ళు అనేటట్లు వుండకూడదు కదా? వాళ్ళకి దేనిమీద మక్కువైతే దానిని ఎంచుకోనివ్వాలి. కాకపోతే దాని మంచిచెడులు, దాని పర్యవసానములు అన్నీ వాళ్ళకి విడమరిచి చెప్పాలి.Decision making వాళ్ళకే వదిలి వేయాలి, కాని మన guidance వుండాలి.
రానారే మళ్ళీ తినేసాడు. చాలామంచివిషయాలు చెప్పారు. ఎప్పుడూ చదువో అని పోరుపెట్టడంకన్నా పిల్లల సృజనాత్మకత పెంచడం ముఖ్యం. రాధికగారూ. క్షమించండి. మీఅబ్బాయిని మీఅబ్బాయిలాగే పెరగనివ్వండి. మా అమ్మాయి ఒకసారి అడిగింది,'నాన్నా, నేను పెద్దయ్యాకా ఎవరిలా అవ్వాలనుకొంటున్నావు'. శ్రావ్య(తన పేరు) లా అవ్వు అన్నా.
S చెప్పారు…
bAgumdi mI anubhavam. sounD rikArDing rUmanTE gurtu vaccindi... O sAri ilAgE #curiosity# koddI rikArDing rUm elA unTUnDO chUddAmani veLLi irukku pOyA. akkaDEmO mATlADarAdu. O pakkEmO gAlunDadu ... visugoccEsindi nEnu veLLina maniShi rikArDing pUrti ayyEsariki.
Myriad Enigmas చెప్పారు…
kadapa radio station ki velli rhymes paatalu paadina gnaapakaalu gurthu chesaru. ala vocchina 2 3 programs maa vallu record cheyyadam valla ippatiki vinadam veelavuthondi.
కొత్త పాళీ చెప్పారు…
అబ్బో, మన బ్లాగ్లోకంలో చాలామంది బాల కళాకారులున్నారే! చాలా సంతోషం.
రానారె - టపా .. యధావిధిగా .. చాలా బాగుంది.
నెలకొకటి రాసినా .. గంగిగోవు పాలల్లాగా .. బహురుచిగా ఉంటున్నాయి. నీ చమత్కారం కూడా ఒక మెట్టు పైకెక్కింది ఈ టపాలో .. బహుశా పొద్దు గడి ప్రభావమా? :-)
అద్సరేగానీ, "అమ్మ యొక్క నాన్న" - షష్ఠీ తత్పురుష అవుతుంది, పంచమి కాదు :-))
"నువ్వు నీలానే పెరుగు" అన్న సత్యసాయిగారి ఆశీస్సుకూడా బాగుంది.
సృజనాత్మకతో బాటు పిల్లలకి సహజంగా ఉండేది, మనం దోహదం చెయ్యాల్సింది ఇంకోటి ఉంది - negotiating skill. పిల్లలు కాస్త మాట్లాడే వయసు వచ్చేప్పటికి మనం బిజీ ఐపోయి, డిసిప్లిన్ పేరిట జులుం చెలాయించడం మొదలవుతుంది. ఆ తరవాత జీవితంలో, వాళ్ళేర్పరుచుకునే సంబంధాల్లో పిల్లలు కూడా ఈ నమూనానే పాటిస్తారు - ఏ సమస్యనైనా negotiate చేసి సాధించవచ్చు అనే సత్యాన్ని మరిచిపోతారు.
రానారె చెప్పారు…
కొత్తపాళీ గారూ, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టపాలోని చమత్కారాలను ఎవరైనా గమనిస్తారేమోనని ఎదురుచూశాను. కానీ దాదాపు అందరూ "విషయం" పైనే దృష్టి నిలిపారు. పంచమి తత్పురుషమని రాయలేదండీ, నేను రాసిందిదీ:
(అమ్మ యొక్క నాన్న - ష.త.సమాసము)

సిరిసిరిమువ్వగారు, మీ అభిప్రాయమే నాదీను. చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని దాన్ని నెత్తికేసి రుద్దరూడదు. మార్గనిర్దేశం పెద్దలది. నిర్ణయం పిల్లలదే. ధన్వవాదాలు.

కొవ్వలిగారు, థాంక్యూ. మీ మాటకు శ్రావ్య ఏమందో చెప్పలేదు.

యస్ మరియు మిరియడ్ ఎనిగ్మాస్ గార్లకు -- కృతజ్ఞతలు. మీ జ్ఞాపకాలను నిదురలేపినందుకు నాకూ ఆనందంగా ఉంది.
rākeśvara చెప్పారు…
"ముక్కు పగిలేదాకా సూటిగానే పోదాం..."
బాగా చెప్పారు. ఈ విషయంలో మీ ముక్కు వెలకాలే నా ముక్కు ఉంది. :)
శ్రావ్య ఏమందో, ఏమనుకొందో చెప్పలేనేమో కాని, రాధికగారు ఫీలయినట్లున్నారని ఊహించగలను.
రాధిక చెప్పారు…
సత్యసాయిగారూ అయ్యయ్యో ఎంత మాట.ఈ టపా వచ్చి చాలా రోజులయిపోయింది కదా అందునా నాకు కూడలిలో ఈ కామెంట్లు కనిపించలేదు.చివరిలో మీరిచ్చిన రాధిక ఫీల్ అయివుంటుందన్న కామెంటు తప్ప.అది చూసి ఇటు వచ్చాను అంతే గానీ ఫీల్ అవ్వడాలు అలాంటివి ఏమీ లేవండి.ఒకవేళ నిజం గా ఫీల్ అయితే బాధపడ్డాను అనొ మరోటనో కామెంటు పెట్టేస్తాను.అయినా మీరన్నది చాలా మంచి మాట.ఏమన్నా పిల్లలమీద మన ఇష్టాలు రుద్దకూడదుకదా.నేను అన్నది ఏమిటంటే ఒక్క చదువు మీదే కాకుండా మిగిలిన అన్నింటిలోను మా అబ్బాయికి తన ఇష్టం వచ్చినట్టు వుండేలా[నేర్చుకునేలా] చేసి మంచి వ్యక్తిత్వం నేర్పుతాను అని.రానారేలా చేస్తాను అనడం కన్నా రానారే నాన్నగారిలా వుంటాను అనాల్సింది.ఈ కాలం లో చూస్తూనే వున్నాము కదా చదువే కాకుండా మిగిలిన వాటికి కూడా తల్లిదండ్రులు చాలా ప్రాముక్యతను ఇస్తూన్నారు.కానీ అవి పిల్లలకి ఇష్టమో కాదో చూడకుండా మ్యూసిక్ క్లాసుకు,కరాటే క్లాసుకు,స్విమ్మింగ్ క్లాసులుకు అని కాసులు సమర్పించి పసితనాన్ని క్లాసుల పాలు చేసేస్తున్నారు.నేను అలా వుండకుండా వుండడానికి ప్రయత్నిస్తాను.
రాధిక చెప్పారు…
రానారే ఈ టపా మీద అభిప్రాయం చెప్పలేదన్నారు.నేను టపాకన్నా టపాలోని విషయానికి ఎక్కువ ఆకర్షితురాలినయ్యాను.అందుకే నా మనసు నుండి అలాంటి మాటలు వచ్చాయి.ఇలా చెప్పాను అంటే టపాకూడా బాగున్నట్టేకదా.అయినా ఏదో ఒక్క సారి బాగా రాస్తే చెపుతాము కానీ అన్ని సార్లూ బాగా రాసేస్తే చెప్తామా ఏమిటి?అర్ధం చేసుకోరూ..[ఈ చివరి పదాన్ని అదేదో సినిమాలో భానుప్రియ అన్నట్టు చదువుకోంది ]
రాధికగారు నావ్యాఖ్యలని సహృదయంతో తీసుకొన్నారని తెలిసి సంతోషం. ఒక్కోసారి విజృంభించి వ్యాఖ్యలు రాసేస్తుంటా. ఆనక అనిపిస్తుంది - ఏమైనా శృతి మించిందా అని.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?!

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమ