Thursday, August 13, 2009

జిమ్మీ అటాక్ - 2

మల్ల కొన్ని నెల్లకు ...

ఇంకో చిన్న కుక్కపిల్ల. యర్రమన్ను రంగు. మూతి నలుపు. టైగర్ సోదరుడే. దీనికి మాత్రం మేం పేరు పెట్టగుడదు అనుకున్న్యాం. టైగర్ చచ్చిపొయినాఁక, కుక్కలు ఎన్నాళ్లు బతుకుతాయి అని కనుకున్న్యా. డాగ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాన్ - అంటారు గానీ, మహా ఐతే అది పదీ పన్నెండేండ్ల ఫ్రెండ్షిప్పే - యెంత జాతికుక్కయినా. అందుకే ఈ కుక్క పిల్లను ముద్దుజెయ్యకూడదు అనుకున్న్యాం.

పొద్దన్నుంచి రేడియోలో కామెంటరీ వస్తాంది. ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ టోర్నమెంటు. ఇండియా గెలుస్తుందనే అనుకున్న్యాం. ఓడిపోయింది. కారణం జిమ్మీ ఆడమ్స్ బ్యాటింగ్.

ఆ రకంగా కుక్కపిల్లకు జిమ్మీ అని పేరుబెట్టినాం. 'జిమ్మీ వుస్కో' అంటే ఏంబాగుంటాది? వుస్కో బదులు 'జిమ్మీ అటాక్' అంటే బాగుంటాదిగదా, మనకు ఇంగ్లీషు వచ్చినట్టుగూడా కనబడతాదని 'అటాక్' అలవాటుజెయ్యాలనుకున్యాం.

మళ్లో దొంగగొడ్డు వొచ్చి పడబోతాందనుకో, అప్పుడు 'జిమ్మీ అటాక్' అన్యాం. సరైన కుక్కపిల్లైతే గొడ్డును తరమాల గదా? ఊహూఁ! తోక వూపుతా దగ్గరకొచ్చింది. ఇట్ల చెబితే దీనికి తెలీదని, 'వాయమ్మో..దొంగ గొడ్డు..మడి మొత్తం నాశనంజేశ..జిమ్మీ అటాక్' అని ఆగిత్తం జేసి, చెయ్యి జూపి, సత్తవకొద్దీ అరిస్తి. నేను అరిసేకొద్దీ దాని తోక వూపడం, దాని ముచ్చ జాస్తి ఐపోవడం తప్ప, అటాక్ చెయ్యదు గిటాకూ జెయ్యదు. సరే చిన్నపిల్లగదా అని నేనే ఆ దొంగగొడ్డును తరమబోతే నా వెనక పరిగెత్తుతుందిగానీ ముందుకుబోదు. నేను రయ్యన పరిగెత్తితే అదీ రయ్యన యంటబడతాది. నా పరుగుతగ్గితే అదీ తగ్గిచ్చేస్తుంది. గుడ్డిలో మెల్లగా మొరుగుతాది దాని పుణ్యాన.

జిమ్మీని పందిట్లో కట్టేసి మేమంతా మా కొటంలో అన్నానికి కుచ్చుంటే, కూస్ కూస్ మని అల్లల్లాడిపోతాది. గోళ్లతో గడపను బరబరా గీకుతాది. చిన్నపిల్లగదా భయపడతాంది అనుకున్యాం. దాని అరుపులు తట్టుకోలేక ఇంట్లేకి రానిచ్చినాం. మేము తినే గిన్నెల్లో అది మూతిబెట్టకుండా దూరంగా పెట్టాలంటే బర్ర చాతబట్టుకోవాల్సొచ్చింది. దెబ్బలైనా తింటాదిగానీ దూరంలో మాత్రం వుండదు. కొట్టినప్పుడు గట్టిగా కండ్లు మూసుకుంటాది - ఇట్టాటి జీవాన్ని కొడితే మనకే పాపం చుట్టుకుంటాదేమో అనిపిచ్చేటిగా.

దాని సంగటి కోసం వొగ గిన్నె బెడితే, ఆ గిన్నెను నేలమీద పొల్లిచ్చి తింటుంది. ఆ నేల పేణ్ణీళ్లతో అలికిన నేల. గిన్నెలో గాకుండా, పెద్ద బండమీద పెట్టడం మొదులుబెడితిమి. ఆ బండ వొగోసారి యండకు చరచరామంటావుంటాది. అట్టాటప్పుడు..మల్లా గిన్నెలోనే.

వానాకాలంలో ఐతే, వసారాలో మా మంచాలకిందనే యెచ్చగా సంచిపట్ట మింద దాని పడక. వూళ్లోవుండే మిగతా కుక్కలకంటే బలంగా నిగనిగా వుండేది. ఇంటికాడ వున్నెంతసేపూ దాని దెబ్బకు కొత్తోళ్లు ఎవురైనా రావాలంటే భయపడేవాళ్లు.

ఐతే, రాత్రిళ్లు అన్నం తిన్న్యాక మేము మంచాలమింద పండుకోని రేడియోలో నాటికో చిత్రసీమో హరికథో యింటావుంటామనుకో..మాకోసం అన్నిట్టుగా ఐదు నిమిషాలు సంచిపట్టమింద పండుకుంటాది. ఐదు నిముషాలకు, గంటకొట్టినట్టు లేసి నిలబతాది. ఏదో మరిచిపోయినదాని మాదిరి అటు వీరబల్లెపక్కకో ఇటు మాదిగపల్లెపక్కకో తిరిగి మొరుగుతాది. ఏదో పనిబడినదాని మాదిరిగా రయ్యఁమని పోతాది. తోటకు కావిలి?

పోయినపోవడం మల్లా ఎప్పుడొస్చాదో, దానికే తెలియాల. వొగోసారి రెండుమూడ్రోజులు కనబడదు. ఇంటికొచ్చేటప్పుటికి దాని ఒళ్లంతా కాట్లు, దెబ్బలు, పిడుదులు.

ఈ రకంగా, ఆఖరికి గజ్జి కూడా తెచ్చుకునింది. బొచ్చు ఊడిపోయి, చర్మం కనబడతా గబ్బుగబ్బుగా తయారైంది. నిగారింపు మాయమై కండ అనేదే కనబడకుండా సన్నబడిపొయ్యింది. అన్నం తినేదానికి మాత్రం వచ్చేది. అది వచ్చిందే అన్నంకోసం గదా అని పెట్టేవోళ్లు అమ్మా అవ్వా. గుర్తుబట్టేదానికే వీల్లేకండా అయ్యింది. సచ్చిపోతుందేమో అనుకున్యాం.

ఒకనాడు, ఇంటికిరాఁగానే ముందు అన్నంబెట్టకుండా, ఒళ్లంతా నీళ్లు చిలకరిచ్చి, గబ్బుమందు (గమాక్సిన్) మెత్తినాం. రోజూ ఇంటికి రాబట్టింది. ఆ మాదిరి వర్సగా నాలుగైదు సార్లు చేసేగొదికి, అంతా రెండు వారాల్లోపల్నే దాని గజ్జి మొత్తం తగ్గిపోయింది. పిడుదులు రాలిపొయినాయి. కండబట్టింది. పొంగి నిగారింపుకొచ్చేసింది. తిరుక్కున్న్యాక, మల్లా ఇంటికి రావడం మానేసింది.

'ఓయమ్మ నీ కుమారుడు ...' అన్నిట్టుగా, మా జిమ్మీ గుఱించి అప్పుడప్పుడూ చెప్పేవాళ్లు వూళ్లో జనాలు. ఆ తరవాత నేను ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల (ముక్కావారిపల్లె)కు పోవడంతో జిమ్మీ సంగతులు నాకు పెద్దగా తెలీలా. ఐతే అది చాన్నాళ్లు బతికింది. సెలవుల్లో ఒకసారి ఇంటికొచ్చింది. మా అవ్వ చెప్పిందాక అది జిమ్మీ అని నేను గుర్తుపట్టలా. జిమ్మీ అని పిలిస్తే అది వున్నచోట్నుంచి కదలకండా తోకమాత్రం వూపింది.
(అంతే!)

5 comments:

sunita said...

Baagundi!!!

రవి said...

జిమ్మీ అటాక్ అన్నందుకు, కడాకు మీ మిందనే అటాక్ చేసిందన్నమాట.
మా ఇంట్లో టామీ, మా ఇంట్లో అన్నం తిని, ఇంకొకరింటికి కాపలా కాస్తా ఉన్నింది. అయితే వాళ్ళింటి ముందర రోడ్లో లారీ మీదెక్కి చచ్చిపాయె.

చిలమకూరు విజయమోహన్ said...

కడప యాసతో చాలా బాగా అటాక్ చేసారు.కృష్ణాష్టమి శుభాకాంక్షలు

భాస్కర రామి రెడ్డి said...

ఇంకో చిన్న కుక్కపిల్ల. యర్రమన్ను రంగు. మూతి నలుపు. టైగర్ సోదరుడే.. super opening. Very good.

కొత్త పాళీ said...

కొన్ని చోట్ల మాండలికం మందగించింది, ముఖ్యంఘా క్రియా రూపాల్లో.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.