Thursday, July 23, 2009

జిమ్మీ అటాక్ - 1

కుక్కలకు పేర్లుంటాయని మాకప్పుడు తెలీదు.


మేం బట్టుపల్లెలో వుండగా మాఇంట్లో ఒక కుక్క వుండేది. మా తాత మంచానికి బారడు దూరంలో కుచ్చోనుండేది. రోజుకు రెండుపూటలు దాని గిన్నెలో దానికి అన్నం. ఆయన తినేముందు దానికీ ఒక ముద్ద సంగటో అన్నమో పెట్టేవాడు. ఆ దారిన ఎవరు కదిలినా గుర్ర్‌ర్ మని బెదిరించేది. భలే కుక్క అనేవాళ్లు మా తాతతో పనిబడి వచ్చినోళ్లు. అది జాతికుక్కేమీ కాదు. ఊరకుక్కే సంతానమే. ఐతే దానిజాతిలో అది గొప్పదేనని మా తాత మోజుగా పెంచినాడు. మావాళ్లంతా మడికాడికి పోయినా, మా తాతపక్కనే వుండి ఇంటికి కావిలి కాసేది. కొన్నేండ్లు పొయినాయ్. ఒకసారి ఏదో రోగం తగిలి పల్లెలో శానా కుక్కలు సచ్చినాయ్. వాటితో పాటే మాదీ. దాని కతలు నాకేం గుర్తులేవు.

మేము పల్లెనొదిలి మా సంతనానికి (సంత వనానికి) వొచ్చేసినాం. ఐదోతరగతిలో.

ఇంటి సుట్టూరా మడి, మామిడిచెట్లూ, కాలవలూ కట్టలూ, గెడ్డీ గ్యాదం వుండటాన కోళ్లకూ గొడ్లకూ మంచి అనువు. బావురుపిల్లులకూ ముంగీసలకూ అనుకూలమే. కల్ల భద్రంగా వున్న్యాగాని దొంగగొడ్లు రాత్రిపూటొచ్చి మళ్లోఁబడి మేసిపొయ్యేటియి. అడివిపందులూ ఊరపందులూ కూడా వొచ్చి చెనిక్కాయలు లోడేటియ్యి. ఇంటి సుట్టూరా పురుగూ పుట్రా తిరుగుతా వుంటాయి. తోటలో ఒక కావిలికుక్క వుంటే అన్నిటికీ ఎచ్చరికగా వుంటాది గదా అనుకున్న్యాం.

భట్టుపల్లెదే ఒక కుక్క, మా తోట పక్కన ఇటికబట్టీల్లో పిల్లలను పెట్టింది. వాటిల్లో తెల్లగా సూడముచ్చటగా ఒక పోతుపిల్ల వుండె. దాని మూతి మాత్రం నలుపు. నల్లమూతి కుక్కలకు కచ్చ ఎక్కువంటారు. దాన్ని ఇంటికి పట్టకచ్చినాం. టౌన్లల్లో 'వుండేవాళ్లు' కుక్కపిల్లలకు పేర్లు బెట్టుకుంటారని అంతకుముందే మాకు తెలిసింది.

మా కుక్కపిల్లకు ఏం పేరు బెడదామా అని ఆలాశనజేసి, మామూలుగా జనం ఏం పేర్లు బెడతారా అని కనుక్కుంటిమి. శానా మంది నాపేరే బెట్టుకున్న్యారు. అది తప్పితే, టైగర్! ఒకే ఇంట్లో రెండు రామూలెందుకులే, ఒకర్ని పిలిస్తే ఇద్దురు పలుకుతాంటారని, మా కుక్కకు టైగర్ అని పేరుబెడితిమి.

అప్పటికి మాయవ్వ వాళ్ల అక్కోళ్ళూరికి పోయిన్నింది. ఊరినించి ఇంటికి రాఁగానే, కుక్కపిల్లను చూసి ఇజ్జూ అని పిలుస్చాంటే, దానిపేరు ఇజ్జూగాదు టైగర్ అన్జెప్తిమి. మాయవ్వ

"టైగరు? టైగరా?" అని నవ్వింది. అంతమంచి పేరుబెడితే ఈమెకు నచ్చలేదా అని నాకు ఒళ్లుమండింది.

అవ్వ నవ్వి, "టైగరంటే ఇంగిలిపీసులో పులి అనిగదా, పులి అని పిలుస్చానే కుక్కపిల్ల పులిపిల్లైపోతుంద్యా?" అనింది.

"ఞిఞిఞీ... పులి 'పిల్లై' పోదుంద్యా...!" అని నేను ఎక్కిరిస్తి.

"ఆ ముక్కు జూడమ్మా సక్కదనాల ముక్కు.. ఆ ముక్కు ఇంగ రోంత పొడుగ్గా వున్నింటే పిల్లకాయ న్యాల మింద నడుసునా!"

నా ముక్కు మాయవ్వ ముక్కుకన్నా బానే వుంటాది. ఇంగా ఏమన్నా మాట్లాడితే ఆమె ముక్కే నాకొచ్చింది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా నా ముక్కును యెక్కిరించకండా మాత్రం వుండదు. చెప్పేకొద్దీ జాస్తి.

"టైగర్ బాలేదంటే నువ్వు చెప్పరాదా ఒక పేరు?"

"ఇచ్చిత్రం గాకపోతే, ఇజ్జూ అంటే పలకను పొమ్మనింద్యా?"

"అనింది"

"..."

"పోనీ గ్రామసింహారెడ్డి అని పెడదామా?"

"వొద్దులే నాయినా టైగరే బాగుంది"

దాని గిన్నెలో పాలు పోసేటప్పుడు మాత్రం అలవాటుకొద్దీనో కావాల్ననో ఇజ్జూ అనే పిలిచేది మాయవ్వ. ఇజ్జూ అని అలవాటుజేస్తే దానికీ ఊరకుక్కలకూ తేడా యేముంటాదని, మేం మాత్రం 'టైగర్ .. కమాన్ టైగర్' అనేవాళ్లం. దాని పేరు ఇజ్జూ కాదని గుర్తుజేస్తానే వుండేవాళ్లం. రోజూ బడికిపొయినప్పుడు తప్ప, రోజంతా టైగర్‌తోనే. ఇంట్లోనే కట్టేస్తే బలహీనపడుతుందని, తాగిన పాలు అరగవని, రోజూ నేనూ గోపీ మా ఇంటిచుట్టూ పరిగెత్తించేవాళ్లం.

సిట్, స్టాండ్, జంప్, రన్ నేర్పించినాం. రోజూ మోటరుబెట్టినప్పుడల్లా పైపులో నుంచి నీళ్లు దుంకే కాడికి తీసకపొయ్యి సబ్బేసి రుద్ది నీళ్లుపోసినాం. చూస్తాండంగానే రెణ్ణెల్లయ్యింది. టైగర్ మాంచి దిట్టంగా హుషారుగా తయారైంది. ఇంటి చుట్టుపక్కల ఎవరొచ్చినా మొరిగి భయపెట్టింది. టైగర్‌ను కట్టేయడం మానేసినాం. ఇంట్లోనే పడమటి కొటంలో పండుకోవడం దానికి అలవాటయింది. తెల్లారీ తెల్లారకనే లేచి ఇంటి బయటికొచ్చి చెలగాటంగా పరిగెత్తేది.

వొగ రోజు రాత్రి ఇంటిబైట మంచాల మింద కుచ్చోని అన్నం తింటాండాం. మే మప్పుడు దొంగ కరెంటు వాడేవాళ్లం. మేమే గాదులే పల్లెల్లో శానామంది దొంగ కరంటే. అంటే, మా మోటర్లకొచ్చే కరంటు వైర్లకే, రాగి తీగల కొక్కాలను దోటెకట్టెతో తగిలిచ్చి, గుంజల మిందిగా మా ఇంటిదాఁక ఒక లాగేది, రెండో పేసు (ఎర్తు) భూమిలోకి దించేది. ఒక పేసులో కరంటు వున్నెప్పుడు, ఎర్తుకు నీళ్లు పోస్తే బల్బులు ఎలిగేటియ్యి. ఆ ఎర్తును ముట్టుకుంటే షాక్ కొడుతుంది. నీళ్ల తడి వున్నెప్పుడైతే పానాలు పోతాయంటారు. దాన్ని ఎవురూ ముట్టుకోకండా దాని సుట్టూ సిమెంటు పైపు దించినాం. ఒక రకంగా చెప్పాలంటే ఇదేమీ దొంగ కరంటూ కాదు. వూళ్లో నుంచి పోళ్లు నాటి వైర్లు లాగండ్రా, మీటర్లు బిగిచ్చుకుంటాం అన్న్యాగాని, పట్టిచ్చుకున్నోళ్లు లేరు. దానికి తగినట్టు ఆ కరంటు గూడా అంతే నాణ్ణెంగా వుంటాది లే. వారానికీ రెండు వారాలకూ ఒక బల్బు కాలిపోతావుంటాది.

మ్.. ఆ రోజు రాత్రి, ఇంటిబైట మంచాల మింద కుచ్చోని అన్నం తింటాండాం. అమ్మ ఇంట్లో నుంచి అన్నమూ కూరలూ తెచ్చి పెడతావుంది. ఆ దావలో మా టైగ దేనితోనో ఆడుకుంటా పిల్లి మాదిరిగా ఎగిరెగిరి పడతాంది. ఏందిరా అని చూస్తే, ఇంత పెద్ద మండ్రగబ్బ! మా యవ్వ మంచం దిగి, టైగర్‌ను పక్కకు తరిమి, కొండ్రకట్టె తీసుకొని మండ్రగబ్బను సంపేశ.

ఆ పూట టైగరును శానా ముద్దు జేసి, పాలూ అన్నమూ కలిపి పెట్టింది. ఆ రాత్రి మంచి గాలీ వానా వచ్చినాయ్.

తెల్లారింది. నేను లేసి బయటికొస్తి. రెండు బారల పొద్దెక్కింది. టైగర్ కనబళ్లా. తోటలోకి పొయ్యిందేమోలే అనుకున్న్యాం. పోతే మాత్రం ఇంత సేపు రాలేదేమా అని, దాన్ని పిలుస్తా తోటంతా తిరుక్కోనొస్తి. యాడా కనబళ్లా. ఆ రోజు పొద్దన్నే పల్లెనుంచి మా మామ ఒకాయన వొచ్చిన్న్యాడు. నేను యెతికేది చూసి ఆయనా ఇంటి సుట్టూ తిరిగి, 'అద్దో ఆ వొరిగడ్డిలో పండుకోని వున్నిట్టుందే, అదేనేమో సూడు' అనె. పొద్దన్నే ఆ నీరెండలో తడిసిన వరిగెడ్డిలో దాని రంగు కలిసిపొయ్యి, దగ్గిరికి పొయ్యిందాఁక కనబళ్ల్యా. పండుకోనుంది. పిలిస్తే పలకలా.

భయంభయంగా దగ్గరకు పొయ్యి నిలబడితే, దాని నోట్లో రాగి తీగ చిక్కుకొని పండ్ల సందున ఇరక్కపొయ్యింది. మా మామ దూరం నుంచి, "దెగ్గిరికి పోగాకు" అని అరుస్తా వచ్చె. నేను కదలకండా ఆయన కల్లా చూస్తి. "యడంగా రా" అనె. రెండడుగులు యనక్కు వేసి, ఆయన చూసేదిక్కు చూస్తే యవ్వారం అర్థమయ్యింది. రాత్రి గాలివానకు కరంటు గుంజ పడిపొయ్యింది.

మామూలుగా రెండు చినుకులు బడితే సాలు, నాలుగు రోజులు కరంటు రాదు. ఆ రోజు మా ఖర్మగొదికీ తెల్లారగానే వొచ్చేసింది. కటింగ్ ప్లయర్‌తో తీగను అటూ ఇటూ కత్తిరిచ్చి, ఆ తీగతోనే దాన్ని లాగి గుంతలో యేసి మట్టికప్పేస్తిమి. రోజూ దాంతో ఆడుకోవడం అలవాటు కావడంతో కొన్నాళ్లు నాకేంజెయ్యాల్నో దిక్కుతెలీలా. 'బంగారట్టా కుక్కపిల్ల' అని మాయవ్వ యెన్ని సా ర్లనుంటుందో లెక్కే ల్యా.

మల్ల కొన్ని నెల్లకు ...

13 comments:

రవి said...

మా ఇంట్లోనూ ఒక టామీ ఉన్నింది. అదీ ఊరకుక్కేలే. అట్లాగే భైరవ్. ఇప్పుడు స్నూపీ అనేదొకటి తిరుగుతాంది. ఇదీ ఊరకుక్కే. ఈ మజ్జన ఊరకుక్కలకు ఇంగిలీసు పేర్లు, ఇంట్లో కుక్కలకు తెలుగు పేర్లు డిసైడు చేస్తన్నారు. మా ఇంటి ఎదురుగ్గా బంగళాలో వాళ్ళ కుక్క పేరు సుధాకర రావు!

Vinay Chakravarthi.Gogineni said...

@ravi excellent name pettaru arevaro.......

@raanare
me 2 had such experiances.........
nice post

8/10

sunita said...

చిన్నప్పుడు మేము పెంచిన కుక్క పేరు ఇప్పటి ఒక గొప్ప సినీ మరియు రాజకీయ నాయకుడి పేరు రెండక్షరాల్లో పెడితే మా నాన్నగారు "తప్పు" మీకు ఎంత ఇష్టం లేకపోయినా మనుషుల పేర్లు జంతువులకు పెట్ట కూడదు అని అంటే అపుడు దానికి "జిమ్మీ" అని పేరుపెట్టాము. ఇపుడు నా మేనల్లుడి కుక్క పేరు కూడా "జిమ్మీ"నే.
ఆ ముక్కు జూడమ్మా సక్కదనాల ముక్కు.. ఆ ముక్కు ఇంగ రోంత పొడుగ్గా వున్నింటే పిల్లకాయ న్యాల మింద నడుసునా!"
కుడి ఎడంగా నేనూ మా పిల్లలను ఇలానే వెక్కిరిస్తుంటాను.

సిరిసిరిమువ్వ said...

మీ టైగర్ లానే మా రామూ కూడా...గుండె లోతుల్లోని గాయాన్ని రేపారుగా..ఒకసారి http://vareesh.blogspot.com/2009/07/1.html చుడండి.

ప్రవీణ్ గార్లపాటి said...

బాగుంది కత.

మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఓ కుక్క ఉండేది. దాని పేరు రాంబో. చిన్నప్పటి నుంచి దానితో తెగ ఆడేవాళ్ళం.

@ రవి: కేక. ఇలాంటి పేర్లు కుక్కలకా :-)

rohinikumar said...

ఒకే ఇంట్లో రెండు రామూలెందుకులే, ఒకర్ని పిలిస్తే ఇద్దురు పలుకుతాంటారని .. :)

కొత్త పాళీ said...

ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా టైగర్ టైగరే.

Anonymous said...

10/10. Excellent.

lakshminaresh said...

mee bhasha...rayalseema karakudananni vinipisthe...andulo bhavam matram,aa karakudanam chatuna dagina apyayatani choopinchindi...final gaa chaala bagundi

జీడిపప్పు said...

Touching and wonderful!

వేణూ శ్రీకాంత్ said...

బాగుంది రానారె గారు, మీ టైగర్ కధ.

మధు said...

చాన్నాళ్ళక్రితం ఇలాగే ఒక దున్నపిల్ల మీద రాసారు. అది కూడా చనిపోయింది. దానికి దీనికీ ఏమైనా సంబంధం ఉందా! 5/10

Anonymous said...

దూడపిల్లా ? అంటే ఏంటి ? మీరనేది కొంపదీసి దూద కాదు కాదు గదా ? దేవుడా ! ఇది ఇంగ్లీషుమీడియమ్ ప్రభావం కాదు గదా ?

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.