ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వేదికనలంకరించిన పెద్దలు

ఊరంతా జండాల పండగ. శ్రీ శ్రీనివాస కాన్వెట్లో ఆ పండగపేరు స్వాతంత్ర్య దినోత్సవము. అంతకు ముందు రెండు వారాల నుంచీ రోజూ సాయంత్రం పూట పీ.టీ.పిరుడు, మోరల్ పిరుడు కలిపేసి పిల్లకాయలందర్నీ వక కొటంలో చేర్చి మా అందరి చాతా దేశభక్తి గీతాలు పాడించి నేర్పించినారు. ఆగస్టు పదహైదోతేదీ పొద్దన్నే ప్రెయరు. ఐదోతరగతిలో క్లాసుఫస్టు కాబట్టి, నేనే యస్పీయల్ (స్కూల్ ప్యూప్‌ల్స్ లీడర్).

ఐదో తరగతిలో నేను ఎందుకు క్లాసు ఫస్టు అంటే - అంతకు ముందు సమచ్చరం అంటే నాలుగోతరగతిలో నాకన్నా ఫస్టొచ్చే పిల్లకాయలంతా ఈ సమచ్చరం మా బళ్లో ల్యాకపోబట్టి. అది యేరేసంగతిలే.

******* ******* *******

పొద్దన్నే ప్రెయరు. ప్రెయర్లో ప్రతిజ్ఞ . "భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ... మ్... మ్..." ఢమాల్. ఆ తరువాతేందో ప్రతిజ్ఞ చదివేవానికి గుర్తుకు రాల్యా. మామూలుగా ఐతే మూడోతర్తి పిల్లోళ్లల్లో రోజుకొకరు ప్రతిజ్ఞ చెప్పాల. చెప్పలంటే అది కంఠోపాఠం రావాల. రాకపోతే బుక్కుజూసి చదవాల. తరవాత దెబ్బలు తినాల, యండలో నిలబడాల. జండాల పండగ రోజున ఇట్టాటి పంచాయితీ వుండగూడదని ప్రతిజ్ఞ గడగడా చెప్పేసేవానికి ఆ పని అప్పజెప్పినాము. ముఖ్య అతిథిని చూసి భయపణ్ణాడో యేమో వాడు మూడులైన్లకు మించి చెప్పల్యాకపాయ.

******* ******* *******

"స్కూల్ డిస్పర్స్". ఐదోతరగతి పిల్లకాయలు ముందుగా కాన్వెంటు బైటివొచ్చి నాలుగు లైన్లుగా నిలబడిరి. యనకాల మిగతా తర్తులు. అందరి సొక్కాలకూ జాతీయ జండా స్టిక్కర్లు. కొందరి చేతల్లో జాతీయ జండాలు. టీచర్ల చేతిలోనూ నాచేతిలోనూ మిగతా క్లాసు లీడర్ల చేతిలోనూ ఈతబర్రలు. రైలు మాదిరిగా వీధుల్లో తిరుగుతా "తేనెల తేటల మాటలతో, జయజయజయ ప్రియభారత, ..." గాట్టిగా పాడుకుంటా పోవాల. వీటిల్లో "విజయీ విశ్వతి రంగా-ప్యారా" ఒకటి.

రంగా అనేది తెలుగుపేరు. ప్యారా అనేది తురక పేరు కాబట్టి ఇది హిందూ-ముస్లిం-భాయి-భాయి రకం పాటేమో అనుకుండేవాణ్ణి; అసలాపాట తెలుగుపాట కాదనీ, ఆ పదం రంగా కాదు తిరంగా అనీ నాలుగేండ్ల తరవాత ముక్కావారిపల్లె బళ్లో మా రసూల్‌సార్ (హిందీ ఐవోరు) చెప్పినదాఁక.

ఊరేగింపు తరువాత... సభ. అందులో ముందుగా ప్రసంగాలు. మా మాస్టర్లూ టీచర్లూ ఒక్కోక్కరే వచ్చి "వేదికనలంకరించిన పెద్దలకు ..." అన్నెప్పుడల్లా మాకు డౌటు. రంగు కాగితాలన్నీ కత్తిరించి, మైదాపిండితో ఆ దూలాలకూ, వాసాలకూ, కూసాలకూ అతికించి, పెద్ద పెద్ద పురికొసలకు కూడా అతికించి, ఊపిరిబుడ్డలు ఊది, బెంచీలూ కుర్చీ సర్ది, నానా అగసాట్లుబడి వేదికను అలంకరించింది మేమైతే... అంతా సిద్ధం చేసినాక వచ్చి కూర్చొనేవాళ్లు 'వేదికనలంకరించిన పెద్దలు' యట్లౌతారబ్బా ... అని.

******* ******* *******

పిల్లకాయల ప్రసంగాలు. ఒకరిద్దరి తరవాత నా వొంతు. నేను మాత్రం వేదికనలంకరించిన అన్ల్యా. "అధ్యక్ష, ఉపాధ్యాయ, సోదరసోదరీమణులారా..." అన్యా.

"ఇది మన దేశానికి 43వ స్వాతంత్ర్య దినోత్సవం. మనం సాధించింది ఎంత? అమెరికా, జపాన్, రష్యా దేశాలు స్వాతంత్ర్యం పొందిన తరువాత ఇదేసమయంలో సాధించిన అభివృద్ధితో పోల్చిచూస్తే ...."

"... సినారె అన్నట్లు - పులినిచూస్తే పులి ఎన్నడు బెదరదూ, మేకవస్తే మేక ఎన్నడు అదరదూ, మాయరోగమదేమొగానీ మనిషిమనిషికి కుదరదూ ... ఎందుకో తెలుసా? ఉన్నదీ పోతుందన్న బెదురుతో... అనుకున్నదీ రాదేమోనన్న అదురుతో..."

"మహాకవి శ్రీశ్రీ మాటల్లో ... అవినీతీ బంధుప్రీతి చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటుదిగజారు ... కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ.... సమసమాజ నిర్మాణమె నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం... ఏక దీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభసందేశం ...."

"... జైహింద్!" --- మా నాయన రాసిచ్చి, ఎట్లా చదవాల్నో, ఎట్లా పాడాల్నో వారం పొడుగునా ట్రైనింగిచ్చి పంపించిన ప్రసంగాన్ని పొల్లుబోకుండా చదివి, అందరూ అబ్బురంగా చూస్తావుండంగా, "మనకేలే ఫస్టుప్రైజు" అనే ధీమాతో వచ్చి నా స్థలంలో కుచ్చున్యా.

******* ******* *******

నా తరవాత పిల్లకాయలు చానామంది వస్సానే వుండారు. వేదికనలంకరించిన పెద్దలకు అని ఒక్క మాటతో పోగొట్టడంల్యా. పేరుపేరునా అందరు టీచర్లకూ అతిథులకూ నమస్కరించి, ఆ పైన గాంధీ నెహురూ లాలా సర్దార్ అని ఒక పేద్ధ లిస్టు చదివి, అందరికీ వందనాలు -- ఒక దండకం. 'నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ...' యింకొక పెద్ద దండకం. ఈ రెండుదండకాల మధ్యలో చెప్పేదేం పెద్దగా వుండదు.

అంతమందిలో మాట్లాడిందే గొప్పసంగతి వాళ్ల పానానికి. నా ఉపన్యాసం తప్ప మిగతాది ఒక్కటీ నచ్చలా నాకు. ఇంక ఆపేసి నాకు ఫస్టుప్రైజు ఇచ్చేస్తే బాగుండుననిపించింది. నాతోపాటుగా మిగతాపిల్లకాయలూ మాస్టర్లూ మేడాలూ అందురికీ విసుగ్గా ఉన్నిట్టు అనిపించబట్టింది. మొత్తానికి చానా సేపటికి ఉపన్యాసాలిచ్చే పిల్లకాయలంతా ఐపొయినారు. తరువాత "వేదికనలంకరించిన పెద్దల" ఉపన్యాసాలు. వాళ్లెవురూ నామాదిరిగా చెప్పల్యాకుండారు. వొక్కరుగూడా మధ్యలో పాటలు పాళ్ల్యా.

అనుకున్నిట్టుగానే మొత్తానికి నాకే ఫస్టు ప్రైజు. మా నాయన మాదిరిగా ఉపన్యాసాలు రాసిచ్చేవాళ్లు వూళ్లోనే లేరనిపించింది. దాంతోపాటు క్లాసు ఫస్టు, బెస్టు స్టూడెంటు, బెస్టు సింగరు అన్నీ నేనే. ఆటల్లో మాత్రం ఒక్క ప్రైజుగూడా రాల్యా. "ఐనా.. సదువుకునేవోనికి ఆటల్తో పనేమి? అది రానోనికే ఆటల్లో ప్రైజులొచ్చేది" అనుకుని, ఆఖర్లో న్యూట్రీన్ మెత్తచాక్లెట్లు, పిప్పరమెంట్లు నిక్కర జేబీ నిండాకూ ఏస్కోని వొచ్చిన ప్రైజున్నీ చాతబట్టుకోని ఇంటికొస్తి.

******* ******* *******

ఆనందంగా మధ్యాన్నం అన్నం తిన్న్యాక, ఆడుకుండేదానికి యీదిలోకి పొతాండంగా మాయమ్మ పిలిచి, "ఆ గోడ మింద రాసిండేది నిన్ను సూడమన్న్యాడు మీ నాయన" అంటా మా వరండా గోడను సూపిచ్చ. ఏందబ్బా అనుకుంటా చూస్తి.

"గర్వము వినాశనమునకు నాంది. __ బైబిల్"

లాంగునోట్‌బుక్కు పేపరును మూడడ్డేళ్ల యడల్పున చించి గంజితో గోడకు అతికిచ్చి పెట్టి, బ్లాకింకు పెన్నుతో నీటుగా ...

అన్నింటికంటే ముందు నాకేమనిపించిందంటే - "శబాస్!! మా నాయనకు బైబిలుగూడా తెలుసు!!"

తరువాత - నన్నెందుకు సూడమన్న్యాడబ్బా!? ఎవురికి గర్వం? నాకేం లేదే. నాకు బెస్టు స్టూడెంట్ ప్రైజుగూడా ఇచ్చినారు గదా? అని అయోమయం. నాకు గర్వం లేదంటే పూర్తిగా నమ్మబుద్దిగాల్యా. ఏమన్నా వుంటే మొగాన్నే చెప్పాలగానీ ఇట్ట గోడలమింద రాయడాలెందుకు? కోపమొచ్చింది.

ఐనా అంత కొవ్వు పనులు నేనేం జేసినా? నేనేమేంజేసినానో మెల్లమెల్లగా మతికొచ్చ. ఆలాశన సెయ్యంగా సెయ్యంగా మనకు కొవ్వు రోంతొక్కరొవ్వ జాచ్చిగానే పట్టిందని అర్తమైతా వచ్చ గానీ, వొప్పుకోబుద్దిగాల్యా. పండగపూట అన్ని ప్రైజులు గెల్చుకోని ఇంటికొస్తే ఎందుకు నన్నిట్టా ఏడిపియ్యాల అని కడుపులో చానా వుడుకుబుట్టె. యెవురూ కొట్టకండా తిట్టకండానే కండ్లమ్మట నీళ్లు దిగె.

******* ******* *******

ఆ దెబ్బతో గర్వభంగమై గంధర్వరూపందాల్చి ఉత్తమపురుష బిరుదాంకితుఁడనై శాశ్వత కీర్తిప్రతిష్టలు గడించడమట్టాటి సందమామ కతేమీ జరగలేదుగానీ, ఎప్పుడన్నా మనం రొంత అతిజేసినామని అనిపించినప్పుడు ఆ గోడ మింద లాంగునోటుబుక్కు పేపరు, దానిమింద నల్లింకుతో రాసిన బైబిలు సూక్తి గుర్తుకొచ్చి చిన్న హెచ్చరిక మాత్రం చేస్తావుంటాయ్.

కామెంట్‌లు

kiraN చెప్పారు…
ఇది నా గురించి:
అన్నింటికంటే ముందు నాకేమనిపించిందంటే - గర్వం.
ఎందుకు - ముందుగా నేనే ఈ పొస్టుకి కామెంట్ చేసినందుకు :).

ఇది నీ గురించి:
అన్నింటికంటే ముందు నాకేమనిపించిందంటే - నీకు గర్వం లేదు.
ఎందుకు - ఉంటే ఇక్కడెందుకు రాస్తావు. నీ కండ్లమ్మట నీళ్లు దిగగానే నీ గర్వం కూడా దిగిపొయుంటుంది, కదా..

భలే నచ్చింది ౧౦/౧౦

- కిరణ్
కొత్త పాళీ చెప్పారు…
అమ్మలకీ నాయన్లకీ ఈ టెక్నిక్కు ఎలా తెలుస్తుందో గదా!
అద్సరే గానీ మా లెక్కలో ఫస్టు ప్రైజు మీ నాయనకే.
టోపీలు తీసేస్తున్నాం.
teresa చెప్పారు…
Oh,that's really cute!
As usual, మీ narration కూడాబావుంది.
రానారె చెప్పారు…
కిరణా, చాలా చాలా సంతోషంగా వుంది. బ్లాగుమొదలెట్టిన కొత్తల్లో నీ వ్యాఖ్యలు ముందువరుసలో వచ్చేవి. మళ్లీ ఇప్పుడు. ఇక గర్వం సంగతికొస్తే - అది మనిషిని అంత సులభంగా వదలదు కదా. వదిలేసిందంటే మాత్రం వానిని ఒక్క క్షుద్బాధ తప్ప ప్రపంచంలోని ఏ ఇతర సమస్యలూ బాధించలేవేమో!

కొత్తపాళీగారు, తెరెసాగారు - బహుధా ధన్యవాదాలు. నేను కూడా టోపీలు తీసేశా! :)
Unknown చెప్పారు…
సిద్ధం చేసినాక వచ్చి కూర్చొనేవాళ్లు 'వేదికనలంకరించిన పెద్దలు' యట్లౌతారబ్బా ... అని.
ఇవాళే తెవికీలో ఆంధ్ర మహాసభ వ్యాసాన్ని చదువుతూ వేదికనలంకరించారంటే నిజంగా వేదికను అలంకరించారా అనుకుని నవ్వుకున్నా.

అవును మీ నాయనకు నిలబడి టోపీలు తియ్యాల.
గిరి Giri చెప్పారు…
బావుంది.
ఇది చదువుతూ ఉంటే నాకు స్కూల్లో నేను వెలగబెట్టిన నిర్వాకం గుర్తుకొచ్చింది. మా నాన్న నాకు ప్రసంగించాల్సిందంతా రాసిచ్చారు, సరే అని స్టేజ్ ఎక్కానా గాభరాలో 'గౌరవనీయులైన ప్రిన్స్ పాల్ గారికి..' లాంటివి అన్ని మర్చిపోయి ఉదుటున ప్రసంగంలోకి దూకి, మొదటి వాక్యం చెప్పగానే మిగతాదంతా మర్చిపోయా..ఒక నిమిషంపాటు నీళ్ళు నములిన నన్ను చూసి మా ప్రిన్స్పాల్ గారు, 'సే తాంక్యు,సే తాంక్యు ' అని చెప్పి, చెప్పించి స్టేజ్ దింపారు. భరింపరాని అవమానం అనిపించింది అప్పట్లో
అజ్ఞాత చెప్పారు…
"ప్యారా తిరంగా" అంటూ ఈ పాటను రాసింది "శ్యాంలాల్ గుప్త పార్ష్వద్". చిన్నప్పడు ఇస్కూలులో తోటి విద్యార్థినీలందరూ భలే పాడేవారు:)
బ్లాగేశ్వరుడు చెప్పారు…
రామనాథా! నవ్వుకోలేక చచ్చాను, నీ ఆఖ్యానం చదువుతూ
చదువరి చెప్పారు…
మీ శైలిలో బాగా రాసారు. కొత్తపాళీ గారన్నట్టు మీ నాన్నకు అభినందనలు.

"అన్నింటికంటే ముందు నాకేమనిపించిందంటే - నీకు గర్వం లేదు. ఎందుకు - ఉంటే ఇక్కడెందుకు రాస్తావు. నీ కండ్లమ్మట నీళ్లు దిగగానే నీ గర్వం కూడా దిగిపొయుంటుంది, కదా.." - చక్కగుంది ఈ వ్యాఖ్య!

రాత్రి ఈ వ్యాఖ్యను పంపించాననుకున్నా. పొద్దున చూస్తే కనబడలేదు. మళ్ళీ రాస్తున్నా.
braahmii చెప్పారు…
బావుండాది,మళ్ళీ ఓ డౌటు,


"... సినారె అన్నట్లు - పులినిచూస్తే పులి ఎన్నడు బెదరదూ, మేకవస్తే మేక ఎన్నడు అదరదూ, మాయరోగమదేమొగానీ మనిషిమనిషికి కుదరదూ ... ఎందుకో తెలుసా? ఉన్నదీ పోతుందన్న బెదురుతో... అనుకున్నదీ రాదేమోనన్న అదురుతో..."

ఇది అన్నది సినారెయేనా
ముళ్ళపూడి వెంకటరమణ అనుకుంటున్నానే.
Sriram చెప్పారు…
కాస్త ఆలస్యంగా చూస్తున్నా...ఎందుకో కానీ కధనం,భాషలలో పాతవాటికన్నా కాస్త తేడా వచ్చింది అనిపించింది.
ఏమైనా, మీ తండ్రిగారికి తప్పక పుత్రోత్సాహమూ,గర్వమూ వచ్చేలా రాస్తున్నావు. అందుకో అభినందనలు.
అజ్ఞాత చెప్పారు…
రామనాథమూ..ఈ టపా గురించి ప్రత్యేకంగా చెప్పను కానీ..నీ ప్రతి టపా చదువుతూంటే.."వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకొని దాని మీద కమ్మటి ఆవు నెయ్యి వేసుకొని అందులో తాళింపు నంజుకొని తిన్నంత" బాగుంటుంది. ఇప్పటికి కడుపు నిండిపోయింది. మళ్ళీ నాకు త్వరలో ఆకలౌతుంది మరి!!
రానారె చెప్పారు…
తెలుగువీరా, మేము చేసిన అలంకారాల వలన కాక, పెద్దలు ఆసీనులవడం వలన వేదిక అలంకరించబడింది అనే భావం కలగాలంటే ముందుగా వారంటే మనకు గౌరవం ఉండాలి కదా? వారంతా మా బడి యాజమాన్యంతో కలిసి ఇస్పేటాకులు (పేకాట) ఆడటం మాకు తెలుసు. ఇంకా, వాళ్లంతా ఉద్యోగస్తులు, మాకన్నా కొంచెం ధనికులు. ఆ వయసులో అంతకుమించి వారి గురించి మాకేమీ తెలియక పోవడంతో వేదికకు వాళ్లు అలంకారం తెచ్చారనిపించేదికాదు. :)
గిరిగారూ, మాది తెలుగు మాధ్యమం కావడంవల్లనేమో మీకొచ్చిన సమస్య నాకు ఎదువరలేదు. ఐనా, అమృతం సీరియల్లో చెప్పినట్లు మన అవమానాలూ గాయాలన్నీ... ఆలోచిస్తే... అయొడిన్‌తో ఐపోయేవే కదా! :)
@చక్కనిచుక్క - ఈ కలంపేరు చాలా ఆకర్షణీయంగా వుంది, బహుశా ఇది ఒక చక్కనిచుక్క నాకు తారసవపడితే బాగుండుననిపించే కాలం కావడంచేత కాబోలు. గీత రచయితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. విద్యార్థినులు+అందరూ అని కలపాలేమో! :)
బ్లాగేశ్వర, చదువరిగార్లకు కృతజ్ఞతలు. బ్రాహ్మీజీ, అది పాటలో భాగమండి. ఆ పాట రాసినవారు సినారె.
శ్రీరామా, ధన్యవాదాలు. కథనం భాషలలో కాస్త లేడా ఉన్నమాట నిజమే. ఈ తేడా ఎబ్బెట్టుగా తోచిందా?
నవీన్... నీ వ్యాఖ్య చదవగానే నాకు ఒక్కసారిగా ఆకలి పెరిగిపోయింది. నిజంగా. :))
రాధిక చెప్పారు…
baagumdabbayyaa.
9/10
అజ్ఞాత చెప్పారు…
బాగుంది రానారె.

ఇస్కూలు అయివోర్లు కొంతమంది అంతేలే. పిప్పరమెంట్లు చాక్లెట్లూ గూడా ఇంటికి తీస్కోని పోతారు. జెండా పండగబ్బుడు మేము గూడా బాగ మైదాపిండి పూసే వాళ్ళం పిలకాయలకు.... గొడగ్గాదులే.


-- విహారి
Sudhakar చెప్పారు…
10/10. Excellent narration
అజ్ఞాత చెప్పారు…
10/10
ranare gaaru, eeroju nunchi nenu mee fan ni. innaallu ela miss ayyaano mee blog ni ani badhapaduthunna.
alankarinchindi memaithe peddavaallani antaarenti ane paragraph chaduvuthunnappudu peddaga chappudochela navvesi office lo koddiga ibbandi padina you really made my day.
mee narration and dialect are just awsome :) added to my favourites and will be checking for updates everyday from now on.
రానారె చెప్పారు…
టింక్, సుధాకర, విహారి, రాధికగార్లకు - ధన్యవాదాలు.
టపా రేటింగ్ 10య10. మీనాన్నగారిది 99/10. అలరించినకి, అలంకరించడానికీ తేడాకనిపెట్టలేక, ముందు చెప్పిన వాడిని కాపీ కొట్టడంవల్ల వచ్చిన తిప్పలు. మీటపాల్లో బాలేనివి వెతుక్కోవడం కష్టం.
పుత్రోత్సాహంతో మీనాన్నగారికి గర్వం పట్టలేనంత వచ్చే ఉండాలే ఈపాటికి
కొత్త పాళీ చెప్పారు…
నేనొక్కణ్ణేనేమో అనుకున్నా, నీ టపా రుచిని మళ్ళీ ఆస్వాదించడానికి ఇలా దొడ్డి్దారినవచ్చి చూస్తే, నా ముందు ఆచార్య వర్యులు, ఇతర పెద్దలు .. మళ్ళా చెబుతున్నా, ఏం రాసినావబయా .. ఒక్కొక్క వాక్యం మంత్యమై మెరిసిందనుకో. మరోసారి సెబాసు.
ఈ సారి ఈ వాక్యం చదివి అన్నిటికంటే గట్టిగా నవ్వుకున్నా -
"శబాస్!! మా నాయనకు బైబిలుగూడా తెలుసు!!"
SumaLahari చెప్పారు…
ఈ కధ చాలా నచ్చింది. ముగింపు కూడా.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె