ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

బొగ్గుల కొలిమి

బట్టుపల్లెకు పడమట దిక్కున ఒకటో రెండో సుంకేసుల చెట్లు తప్ప, కనబడేదంతా రాళ్లచేండ్లూ ఇసకచేండ్లే. తూరూగా సన్నగా వంక పారతా వుంటాది - కొమటోని చెఱువులో అన్ని నీళ్లుంటే. ఎప్పుడన్నా చెరువు నిండితే రోంత వరి పలం నాటుకున్నోళ్లు గూడేస్కుండేదానికి తగినట్టు సిన్న గుంతలు, సాకలోళ్లు గుడ్డలు పిండుకునేదానికి సాకిరేవు, బోయోళ్లు కలమంద పట్టలు ముగరబెట్టుకునే దానికి - జమ్మూ, చుట్టూరా కాకిబుర్రలూ పెరిగిన - మడుగులు, ఎనుములూ వాటితో పాటు రాజుకన్నా బలవంతులైన పిలకాయలూ పొర్లాడే బురద గుంతలు, ఆ దిగవన నాలుగు మామిడి తోటలు వుండబట్టి పల్లెకు తూరుపుదిక్కు కండ్లకు రోంత పచ్చగా కనబడతా వుండేది. ఇప్పుడు వానల్లేవూ, పడినా ఒక రాగాన నీళ్లు పారే పరిస్థితీ లేదు. వొక సమచ్చరం వానాకాలంలో - నాలుగు రోజులు యిడ్సకుండా వానలుబడి, పాలెంపలం కల్లా వంకలు పొంగి, కుంటలు నిండిపొయ్యి, మా కోమటోని చెఱువు కూడా నిండిపొయ్యి మొరవ బోయింది. మా కోమటోని చెఱువంటే చిన్న చెఱువు గాదు. ఆ మొరవ నీళ్లకు పల్లె మొగదాల పీర్రాతి దాఁక నీళ్లతో మునిగింది. వంక వో అని వొగటే మోరుపు. ఆ మోరుపు పడమట నుండే మా ఇంటి దాంకా యినబడతావుంది. తెల్లారకముందే ఊరంతా వంకను చూసేదానికి పొయ్‌నారు. ...

మ్ర్యాఁవ్...!!

వొక రోజు రాసీట్నుం చి మూడు కొత్త పుస్తకాలు తెచ్చినాడు మా నాయన. వాటి పేర్లు గణిత శాస్త్రము, పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2. అంటే లెక్కలు, సామాన్య, సాంగీక. చింతచెట్టుకింది బళ్లో మాత్రం పుస్కాలు గిస్కాలూ ల్యా. ఐవోరు పలికిచ్చిందే అందరికీ సదువు. పొద్దు వాటారతా వుండంగా అశ్వనీభరణీలు, చైత్రావైశాఖలు, ప్రభవావిభవలూ పలికిచ్చినాఁక ఆఖరీన జనగణమన. అది పాడతా వుండంగానే మా రాతిమిద్దె బైట గూట్లో దాపెట్టిన కొత్తపుస్తకాల వాసన సాంబ్రాణీ వూదుకడ్డీల పొగ మాదిరిగా తీగలుతీగలుగా సాగుతా వచ్చి ముక్కులకు తగిలినట్టుగా వుంటాది. ...జయ జయహే... అంటాన్నెపాటికే రఁయ్యని పరిగేత్తుకోని యింట్లోకొచ్చి పలకాబలపం నులకమంచం మిందికి యిసిరిపారేసి, సామాన్యా సాంగీకా రెండుచేతలా పట్టుకొని వాటిల్లో మొగంబెట్టి మూజూడాల. వాటి కుండే వాసనంతా కడుపునిండా పీల్చి - యింగ రెండ్రోజులకు వీఁటి వాసన పోతాది గదా - అని ఉగ్గబట్టుకొన్నెంతసేపు ఉగ్గబట్టుకోని వదిలెయ్యాల. మహా అంటే ఈ కొత్త కరుకు వారముండునో పదిరోజులుండునో! ఎప్పుటికీ వుండేటట్టైతే అయ్యి కొత్తపుస్తకాలెందుకాయ? వాఁటె కోసరం నేను పరిగేత్తుకోని ఎందుకొజ్జును? *****************************************...