పదహారు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది. యండాకాలానికీ వానాకాలానికీ మధ్యలో ఒక రోజు రాత్రి. గాలి తోలటం లేదు. చూరు కింది అరుగుపై బొంత పరుచుకొని పడుకుని వున్నాడు బుట్టోడు. వాని నాయన శివుడు కొట్టంలో సంగటి తింటూ వున్నాడు. ఆ ఇంట్లో వాళ్లిద్దరే. ఆపొద్దు వాళ్లింట్లో సియ్యలకూర. రెడ్డేరి ఇంట్లో మాంచి గుడ్లకోడిపెట్ట. రోగం తగిలి ఆ రోజే తూగి చచ్చింది. చచ్చిన కోడిని రెడ్డేరు తినరు. తోటకు కావలి కాస్తూ ఇతర పనులు చూసుకునే శివునికి ఇచ్చారు. దాన్ని కోసి కూరజేసి, రెడ్డేరింటికాడ రెండుముద్దల సంగటి అడిగిపెట్టించుకొని, వస్తూవస్తూ రెండు పాకెట్ల సారాయి కూడా తెచ్చుకొని పండగ జేసుకుంటున్నాడు శివుడు. గుండెకాయ, గుడ్డుసొన లాంటి మెత్తనివన్నీ బుట్టోనికి తినిపించి, ఎముకలను కూడా మిగలనీయకుండా జుర్రేస్తున్నాడు. వాళ్ల నాయన అట్టా తింటూవుంటే బుట్టోనికి భలే సంబరం. పైన చుక్కలను చూస్తూ ఇంట్లో నుంచీ వచ్చే శబ్దాలను ఆనందంగా వింటున్నాడు. సియ్యలకూర తిన్నప్పుడు మాత్రమ...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!