నాలుగేండ్లకే ఒకట్లో జేరిపించడంతో, మూడోతరగతి వయసుకే నాకు నాలుగోతర్తి పూర్తైంది. శలవలొచ్చాండాయనే మాట యినపరాంగానే చెవుల్లో తేనెబోసినట్టయింది. యండాకాలం సెలవలు. యాభై రోజులు బడీగిడీ ల్యా. నాబోటి పిల్లకాయలందరికీ అలివిగాని సంబరం. ఎందుకంటే, పొద్దుపొద్దన్నే బడిని గుర్తుజేసుకొని లెయ్యనక్కర్ల్యా. రోజూ నీళ్లు బోసుకోనక్కర్ల్యా. తలకు ఆముదం పెట్టుకోనక్కర్ల్యా. "మల్లేసు మాస్టరు కొడ్తాడు, నాకు బయం, నేనుబోను, నా కడుపుగూడా నొస్సాంది" అని రోజూ ఏడుపుమొగం బెట్టుకోని మా చిన్నోడు చేసే కార్యక్రమం ఉండదు. నిజంగానే కడుపు నొచ్చాన్యాగానీ తల నొచ్చాన్యాగానీ నీరసంగా ఉన్యాగానీ అట్నే ఏడ్సుకుంటా బడికిబోనక్కర్ల్యా. వగేల యారోజన్నా బడికిబోకపోతే ఎందుకుబోలేదో చెప్పేదానికి మర్సురోజు నాయన్నుంచీ చీటీ దీస్కపోనక్కర్ల్యా. మా అత్తమ్మకొడుకు కూడా బడికొచ్చాన్న్యాడు. నిజ్జంజెప్పాలంటే ఆయనతోబాటు మేం బడికిబోతాన్న్యాం. ఎందుకంటే మా అందర్లోకీ గట్టోడు, గలాటాలొస్తే తట్టుకోని నిలబడేవోడు గాబట్టీ. నాకన్నా రెండున్నర నెలలు పెద్దోడు అంతే. చిన్నప్పట్నుంచీ ఆయన్ను మామా అనడం అలవాటుజేసినారు మావోళ్ళు. మామ ఇప్పుటికీ మామే. ఇంగ రోంచేపటికీ మామే! మా...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!