ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంతా వానిష్టమేనా అని!

"దేవుడు బలే నాయాలు. కద మా!?" అంటిన్నేను.

దీగూటికి ఎదురుగ్గా నిలబడి దీపానికి దణ్ణం బెట్టుకుంటాన్నింది మా అమ్మ. కండ్లు దెరిసి గోడకు తగిలిచ్చిన దేవుని పటాలకల్లా చూసి యివతలి కొచ్చేసింది గానీ, యేం మాట్లాళ్లా.

ఇంట్లో ఎవురి మింద కోపమొచ్చినా, "ఈ పాపిష్టి దేవుడు నన్నింగా తీసకపోలేదే" అనే మా అవ్వ గూడా ఏమీ అన్లా.

******************************************

కతేందంటే ...

మా బూదకోడిపెట్ట పద్నాలుగు గుడ్లు బెట్టింది. గుడ్లుబెట్టడం దానికిదే మొదులు. గంపలో ఇసక బోసి, వరిగెడ్డి పేర్చి, పిడుదులూ గోమారీ పట్టకండా గబ్బుమందు చల్లి దాన్ని పొదగ బెడితిమి. అది గూడా శర్దగా పొదిగింది. వొగ రోజు సందేళ నాలుగు గుడ్లు పిగిలినాయి. తెల్లారుఝామున మంచం దిగి చూస్తే ఒకటి తప్ప మిగిలిన గుడ్లన్నీ పిగిలి పిల్లలైనాయి. ఆ మిగిలింది మురుగుడ్డు కాగూడదురా దేవుడా అనుకుంటా వుండాం. తెల్లారి పొద్దెక్కేటప్పుటికి ఆ గుడ్డులో వుండే పిల్ల ముక్కుతో పొడిసి బొక్కబెట్టింది. మిగతా పని బూదకోడి చేసేసింది.

ఒక్క గుడ్డు గూడా వోటు పోనీకండా వుండే కోడిపెట్ట అందరికీ వుండదు గదా.

రెండోరోజు పిల్లలన్నిట్నీ యెంటేస్కోని ఇంట్లోనుంచి మొదుటి సారి బైటికొచ్చింది. రొండు తప్ప తక్కినియ్యన్నీ నల్ల పిల్లలే. అన్ని బియ్యపు నూకలు తెచ్చి అరుగు చాటున పోసింది మాయవ్వ. కోడిపెట్ట మాంచి ఆకలిమింద వున్యాగానీ ఆత్రంగా పొడసక తినకండా పిల్లలకు నేరిపించబట్టింది. ఆ పిల్లలు పడతా లేస్తా, పొడిసీ పొడసకా, తినీ తినల్యాకా, తూల్తా వుంటే మాకు బలే సంబరంగా వుండె. 'ఇంత బాగుండా'యని చెప్పబళ్ల్యా, అంత బాగుండాయి పిల్లలు.

తింటా తింటా వుండే పిల్లనొకదాన్ని చేతిలేకి తీస్కోవాలనిపిచ్చ. నా పోకడ జూసి మొగం చిట్లించుకొని "వొద్దు, తిన్నీ" అనె మా గోపీగాడు. చెప్తే యినే రకమా మనము? చొరవగా దూరి వొగ పిల్లను చేతిలోకి తీస్కుంటి. కోర్ర్‌ర్ మని బొచ్చరిచ్చుకొని లేసి యెగిరి మొగాన తన్నింది కోడి. బిత్తరపొయ్యి చేతులు మొగానికి అడ్డం బెట్టుకుంటి. పిల్ల నా చేతిలోనే వుండాది. కోడి మల్లా యెగిరి తన్నబాయ. "పిల్లనిడుసు" అనె గోపీ. గబక్కన పిల్లను జారిడిసి పరిగెత్తినా. రోంత పక్కకు బొయ్యి చూసుకుంటే అరిచేతి నుంచి నెత్తర కారబట్టింది, వొగటే మంట.

"పిల్లలకోడి జోలికిపోతే తన్నదా?" అంటా పసుపు దెచ్చి కోడి గోరు దిగిన చోట మెత్తబోయింది మాయమ్మ. "ఆహాఁ! 'వూసన్న'ను తన్నదు. ముద్దు బెట్టుకుంటాది." అనె మాయవ్వ. సన్నగా వుంటానని ఆయమే ఆ పేరు బెట్టింది నాకు. మాయవ్వ మాటకు నాకు మండే లోగా, గాటు మీద పసుపు భగ్గున మండింది. మంట తట్టుకోల్యాక నేనరిసిన అరుపుకు కోళ్లన్నీ బెదిరి కొటారించబట్టినాయ్.

"మాంచి పౌరుషమైన కోడిపెట్ట రోవ్! గద్దలకు ఒక్క పిల్లనుగూడా పోనిచ్చేటిది కాదిది", అవ్వ సర్టీఫికటు.

ఇదే కోడిపెట్ట గుడ్లకొచ్చి క్యారతా వుంటే దాన్ని తరిమి తరిమి పట్టుకొని గంపకింద మూసి పెడ్తా వుంటిమే! పిల్లలకోడి కాఁగానే యేమి ధైర్యమొచ్చిందిరా దీనికి అనుకుంటి నేను. రోంత తెపులుకొని, "నన్నే తన్నిందంటే, గద్దను బతనిచ్చాదా?" అని, అరిచేతి గాటు మీదికి నోటితో గాలి వూదుకుంటా వుంటే మా గోపీగాడు నవ్వల్యాక, నవ్వాపుకోల్యాక అగసాట్లు బడతా వుండాడు.

వొగ మూడు దినాలు పిల్లలను కాకులెత్తకపోనీకుండా చూసుకున్యాము.

మా కదిరిజాజి చెట్టు పందిలి (పందిరి) కింద కోడి సిదుగుతా వుంటే పిల్లలు తింటా వుండాయ్. మేము రోంత యేమారి (ఏమరుపాటుగా), మామిడిచెట్టు కింద మంచాల మీద కుచ్చోని మాడికాయల ఊరిమిండి, నెయ్యీ కలుపుకొని అన్నాలు తింటాండాము.

చెట్టు మింద నుంచి ఒక కాకి... పిల్లను తన్నకపొయ్యే దాని మాదిరి దిగొచ్చింది. కోడి కసిగా దాని యంటబడింది. ఈ లోపున మామిడిచెట్ల మింద నుంచి రెండు కాకులు తలో పిల్లనూ తన్నకపొయ్యి మొదుటి కాకితో పాటు చేరి తోటల్లోకి ఎగిరి పోతాండాయ్. వాటి కాళ్లసందులో నుంచి పిల్లలు 'పియోవ్ పియోవ్' మని అరుచ్చాండాయ్. కాకులు మా కండ్లకు కనబణ్ణెంత దూరమూ నేనూ మా గోపీగాడూ మా సత్తవ కొద్దీ యంటబడి హూడ్ దాడ్ అని కేకలు పెడతా పరిగెత్తినాం.

యేం లాబం ల్యా. గస బోసుకుంటా తిరిగొస్తిమి. వొచ్చి పందిలి కింద చూద్దుము గదా, ఒక పిల్ల, కోడిపెట్ట కాలికింద బడి తనకలాడతా వుంది. ఈసారి మా గోపీగాడు గబుక్కున దూరి, కోణ్ణి తరిమి దాన్ని తీసుకోని ఇంట్లేకొచ్చేసినాడు. అప్పుటికే మెడకాయ యాలాడేసింది కోడిపిల్ల. మాయవ్వ వొచ్చి రెండుచేతుల్లో దాన్ని పట్టుకొని నోటికాడ బెట్టుకొని యెచ్చగా 'ఆయి' పట్టేకొదికీ, రోంచేపటికి మెల్లిగా 'పీవ్' మనింది. మాకు పానాలు లేసొచ్చినాయ్. దాని కాలొగటి విరిగి యాలడతా వుంది. గబగబా యర్రమన్ను తడిపి, గుడ్డపీలికతో కట్టు కట్టేసింది అవ్వ.

చేతిలో కోడిపిల్ల అరుచ్చానే వుండాది. వాకిటి బయట కోళ్లన్నీ కొంపలు కాలిపొయ్యినట్టు కొటారిస్తా వుండాయ్.

****** ****** ******

మర్సురోజు పొద్దన్నే గంపెత్తి చూస్తే రెండు కోడిపిల్లలు చచ్చి నీలుక్కోని పడిపొయ్యుండాయి. ఊళ్లో కోళ్లకు రోగాలొచ్చిన సంగతి మాకూ ఆ పొద్దే తెలిసింది. మజ్జానానికల్లా మిగతా పిల్లలన్నిటికీ ముక్కుల మీద కురుపు లొచ్చేసినాయి. సాయంత్రానికి యింగ మూడు పిల్లలు తూగి సచ్చినాయి. ఆ రోజు సాయంత్రం పశువు లాస్పత్రి నుంచి కోళ్ల మాత్తర్లు దెచ్చి మా కోళ్లన్నిటికీ మింగిచ్చినాం. రెండోరోజు తెల్లారి నాలుగు బారల పొద్దెక్కే తలికి - మా చేతుల్లో వున్న కుంటి కోడిపిల్ల తప్ప - పిల్లలన్నీ మా దిబ్బలో ఎరువైపొయినాయ్. పాపం బూదకోడి వొక్కటీ మిగిలింది.

రోంత తూగినట్టు అగుపణ్ణె కోణ్ణల్లా కోసి పారేసి పులుసు జేస్కొని చారులో, మజ్జిగలో కూడా కలుపుకొని తిన్యాం ఆ నాలుగు నాళ్లూ. మజ్జిగలో కోడికూర బలే రుసిగా వుంటాండ్ల్యా!

******************************************

కుంటిపిల్లకు మూతి కురుపులు మెల్లిగా తగ్గినాయి. దాని కాలు మాత్రం సరిగ్గా కట్టుకోలా. దానెమ్మ దగ్గర యిడిస్తే కాకులు అలాగ్గా ఎత్తకపోతాయని యింట్లోనే బెట్టినాం. మా గోపీకి తెలీకండా దానికి నేను వొగ పేరు పెట్టినా. దానికి నూకలు తినిపిచ్చేటప్పుడల్లా దాన్ని 'గోపీ' అని పిలుస్తావచ్చినా.

వొగరోజు వాడూ నేనూ మాత్రమే ఇంట్లో వుండంగా 'గోపీ' అని పిలిచినా. "ఊఁ" అని పలికినాడు. ఈ లోగా కుంటుకుంటా ఎగురుకుంటా గింజలకోసం నా దెగ్గిర కొచ్చేసింది పిల్ల. మా గోపీగాడు యేమన్నా అంటాడేమో అని నవ్వుతా చూసినా. వాడు యేమన్లా. 'మూతి కురుపుల గోపీ' అన్యా. ఊఁహుఁ! ఉలకలా పలకలా. వాడు కుళ్లుకోవాలని నేను యెన్ని జేసినా వాడస్సలు పట్టిచ్చుకోలా. ఆ తరవాత నేను ఆ పిల్లను పేరుతో పిలవడం మానేసినా.

నాల్రోజుల తరవాత వొగ నాడు ఇంట్లో అందరూ వుండంగా 'రామన్నా' అని పిలిచినాడు. నేను పలికేలోగా కోడిపిల్ల రెపరెపా రెక్కలు కొట్టుకుంటా వాని దగ్గరికి చేరిపొయ్యింది. వార్నీ పాసుగూలా! ఎప్పుడు నేరిపిచ్చినాడో నేరిపిచ్చేసినాడే!

మనం పెట్టిన పేరు అంతలోనే మరిచిపోతుంద్యా అని, నేనూ 'గోపీ' అని పిలిచినా. అది యిన్లా. గబగబా పిడికెడు నూకలు తెచ్చి కింద చల్లి, 'గోపీ' అన్యా. అప్పుటికే వాడు దానికి సద్దగింజలు తినిపిస్తాండాడు. నేను 'బ్బా బ్బా' అన్యాగానీ ఆ పిల్ల నాకల్లా తల గూడా తిప్పి సూళ్ల్యా. అప్పుడు వాడు నన్ను జూసి నవ్వినాడు.

"సూడు మా!" అన్యా అమ్మకల్లా తిరిగి. పలకదే!

"వూసు కొవ్వు తక్కవగా పట్టలేదురా యీనికి" అనింది మాయవ్వ నన్నే! 'ధర్మానికి కాలమా!?' నువ్వే జెప్పు!

****** ****** ******

మజ్జానం నుంచి ఉమ్మదంగా వుంది. గాలి తోలడమే మానేసింది. మా(ప)టికి వాన గ్యారంటీ అనుకుంటాండంగా, పలపలపలా పడె పెద్దపెద్ద సినుకులు. బైట మామిడి చెట్టు కింద కుచ్చోనున్నోళ్లం మంచాలు లేపి కోళ్లకొటంలో యేసేదానికి లేస్తిమి. కట్టెలు తడిస్తే పొయ్యి మంటేసేదానికి అగసాట్లు గదా అని, సందెడు కట్టెలు చాతబట్టుకొని ఇంట్లో పొయ్యి కాడ పడేజ్జామని ఆదరా బదరా తలుపుదీసింది మాయమ్మ. తలుపు తియ్యఁగానే ఆ మబ్బుటింట్లో రయ్యిమని వచ్చి కాలికింద పడె కోడిపిల్ల. కాలికింద మెత్తగా తగిలే తలికి ఉలిక్కిపడి అడుగు తీసి యింగో అడుగెయ్యంగానే ఆ అడుక్కిందికీ వచ్చి పడె. భయపడి కట్టెలు కింద పడేసి చూస్తే యింగేముండాది!

ఆయి పట్టడం, నోరు దెరిసి నీళ్లు బొయ్యడం, చట్టి కింద మూసి తట్టడం అన్నీ అయినాయి. దాన్నీ తీసకపొయ్యి దిబ్బలో కప్పెట్టేసి వొస్తి. చిన్న పిల్లను తొక్కి చంపేసిన పాపం జుట్టుకుంటుందని భయపడిందేమో అర్జంటుగా దేవునికి దణ్ణం బెట్టుకునింది మాయమ్మ.

"ఓరి దిక్కుమాలిన దేవుడా, వొగ పిల్లనన్నా బతకనీకపోతివి గదరా!", అనె అవ్వ. మాయవ్వకు దేవుణ్ణి తిట్టే అధికారం వుండాదిలే. ప్రతీ పున్నానికీ ఆ గూడు కడిగి, దూదర్లు తుడిసి, పటాలకు బొట్లుబెట్టేది, మాతోపాటు దేవునిగ్గూడా రోంత ప్రసాదం బెట్టేది ఆయమే గదా! పెట్టినమ్మకు తిట్టే అతికారం గూడా వుండాదంట్లాడ్లా!? అందుకే మాయింట్లో తిడితే మాయవ్వే తిట్టాల - దేవుణ్ణిగానీ మమ్మల్నిగానీ.

మాయమ్మ పరిస్థితి జూసి, నాకూ దేవుణ్ణి తిట్టాలనిపిచ్చ.

"దేవుడు బలే నాయాలు. కద మా!?"

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
10/10
అజ్ఞాత చెప్పారు…
ఇదెబ్బుడొచ్చిందీఁ . నేనిట్టాంటివి చానా జూసినా.
యథా ప్రకారం సెభాసో.

-- విహారి
వికటకవి చెప్పారు…
>>ఇదే కోడిపెట్ట గుడ్లకొచ్చి క్యారతా వుంటే దాన్ని తరిమి తరిమి పట్టుకొని గంపకింద మూసి పెడ్తా వుంటిమే! పిల్లలకోడి కాఁగానే యేమి ధైర్యమొచ్చిందిరా దీనికి అనుకుంటి నేను.

:-)

అదేంటి, రోగం వచ్చిన కోళ్ళనీ తినేస్తారా?
Purnima చెప్పారు…
ఈ కథ నాలో లేపిన ప్రళయాలు అన్నీ ఇన్నీ కావు. మనసు అదోలా అయ్యిపోయింది. నాకు అత్యంత సన్నిహితురాలుగా ఉండే, ఒక స్నేహితురాలి అమ్మగారు చనిపోయినప్పుడు నేను దేవుణ్ణి బాగా తిట్టుకున్నాను!! లాభం లేకపోయింది.. కనీసం నా కోపం కూడా తీరలేదు.

మీరు వాడే భాష.. కథను నడిపించే తీరు.. అన్నీ ఒక స్థాయిలో ఉన్నాయి. అభినందనలు!!
Sriharsha Nandaluri చెప్పారు…
10/10.

Faram kolla rojullo mee naatu kodi petta katha lively ga undi.......
Unknown చెప్పారు…
సూపర్...
కోడిపిల్లలు "పియోవ్" మనడం నాకు భలే నచ్చుతుంది. (నీ కల్పితమేనా ?)
అజ్ఞాత చెప్పారు…
నరేంద్ర భాస్కర్ S.P.
రానారె గారికి
చాలా బాగా రాసారు భయ్యా!
కోదాడ లో మేము ఉండేది డాబా మీద ఐనా నేనూ కొళ్ళూ పెంచుకున్నాను, మళ్ళీ ఆ ఙాపకాల్ని గుర్తు చేసారు, గొప్పగా రాసారు, పూర్ణిమ గారన్నట్టు, మీరు కథ నడిపించే తీరు చాలా గొప్పగా ఉంటుంది. నెనర్లు
Kottapali చెప్పారు…
yup.
Bolloju Baba చెప్పారు…
బాగుంది
బొల్లోజు బాబా
అజ్ఞాత చెప్పారు…
6/10

ఎందుకో అనిపించింది రెడ్డీ, నీ స్థాయిలో లేదేమోనని. నా మూడే బాగా లేదేమో లేకపోతే?

ఇవీ నాకు తోచిన కారణాలు!

"అవ్వ సర్టీఫికటు" ... ఈ వాక్యం.,ఉహూ..అతకలే.

కోడి పిల్లల మీద అప్యాయత గురించి రాసేప్పుడు, వాటిని కోసుకుని తినడం...ఇది కూడా ఉహూ..మరీ ఇంకోసారి అతకలే.

కొంచెం మాండలికం పాలు ఎక్కువయింది. ఇదివరకు కథలో అందంగా ఇమిడిపొయేది.ఈ సారి, కథను డామినేట్ చేసింది.

ఏమో, నా మూడే బాగాలేదేమో ఖర్మ!
GKK చెప్పారు…
దేవుడు బలే నాయాలు. కద మా!?"-ఎత్తుగడ బాగాలేదు. వేపచేదులాగా అనిపించింది. రవి వెలిబుచ్చిన అభిప్రాయం బాగుంది. మాండలికాన్ని సంభాషణకే పరిమితం చేసి కధనానికి సరళమైన తెలుగు వాడితే బాగుంటుందేమో.
Srinivas Sirigina చెప్పారు…
ఎప్పటిలానే, చాలా బాగా రాసారు. నా చిన్నప్పటి విషయాలు గుర్తుకు వచ్చాయి. నేను పుట్టినది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో. జిల్లాలు వేరయినప్పటికీ మనిద్దరి బాల్యం ఒకే విధంగా గడచినట్లనిపిస్తుంది.
అజ్ఞాత చెప్పారు…
రానారే,
కథ బాగా రాశారు గానీ, పిల్లల కోడిపెట్ట కులుకుల గురించి ఇంతకుముందే నామిని గారు రాసినట్టు గుర్తు. ఐనా మీకథ బాగుంది. నాకేవీ మాండలిక డామినేషన్ కనపళ్ళేదు కథలో. వొకనుమానం, "దేవుడు బలే నాయాలు. కద మా!?" అనే ప్రయోగం కోపాన్ని బదులు ఆశ్చర్యాన్ని వ్యక్థం చేస్తుందేవో!

మీరు రాయగలరు కాబట్టి, ఈ కథ చదివిన తర్వాత నాదో చిన్న విన్నపం. తడిసిన కట్టెలు పొయ్యిలో పెట్టి, అయి మండక, ఆ వూదురు గొట్టం తో వూది, వూది పొగకి కళ్ళు యెర్రబారి నీళ్ళు కారే అమ్మ మీద వొక కథ రాయకూడదు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి
రానారె చెప్పారు…
@రెడ్డి, విహారి: నెనర్లు

@వికటకవి: రోగమొచ్చి చచ్చిన కోళ్లను కూడా తింటారు.

@పూర్ణిమ, శ్రీహర్ష, నరేంద్రభాస్కర్, కొత్తపాళీ: ధన్యుణ్ణి.

@ ప్రవీణ్: థాంకులు. పిల్లలు పియోవ్ మనడం భగవత్కల్పితమే. :)

@రవి: మీరు కోళ్లను పెంచి వుంటే మీకిది అతికేదేననుకొంటా. కోడిపిల్లలు ముద్దే. కోడి మాంసమూ ముద్దే.

@తెలుగు అభిమాని: మీ సూచన గుర్తుంచుకుంటాను. కృతజ్ఞతలు.

@సీను: ఔనండి. ప్రపంచవ్యాప్తంగా పల్లెల్లో మన బాల్యాలన్నీ దాదాపుగా ఒకే తీరు (అట).

@రవికిరణ్: మీ వ్యాఖ్య చూసి సంతోషం కలిగింది. ఆ మాటలో కోపం, ఆశ్చర్యం, బాధ, అయోమయం అన్నీ వున్నాయని మీకు అనిపించే వుంటుంది. మీరడిగిన కథ (కట్టెల పొయ్యి ముందు అమ్మ) మాటకొస్తే నేనిక్కడ రాసేవేవీ కథలు కావండి. నేను మరిచిపోతానేమో అనిపించే జ్ఞాపకాలివన్నీ. ఈ సన్నివేశం కూడా జ్ఞాపకం వుంది. యర్రబారిన కళ్లు, కన్నీళ్లే కాదు, నాకెంతో కోపం తెప్పించిన, అసహాయుడిగా అనిపింపజేసిన పరిస్థితులున్నాయి. మీరన్నట్టు ఒక పెద్ద కథే రాయొచ్చు. రాస్తాను కూడా. ఆరోజు మళ్లీ మీకు కృతజ్ఞతలు చెబుతా.
అజ్ఞాత చెప్పారు…
గ్రామీణ జీవన స్రవంతి లోని అమాయకత్వం, ముగ్ధత్వం అన్నవి ఆస్వాదించేప్పుడు మాంసాహారం అన్న ideal గుర్తు రాకూడదు. మీరన్నది నిజమే.

రవికిరణ్ గారి వ్యాఖ్య ఇంతకు ముందు చదవలేదు. ఇప్పుడు ఇక్కడ ఆఫీసులో చదవగానే (అమ్మ కళ్ళు తడిసిన కట్టెలు మందక గొట్టం వూదుతూ ఎర్రబారడం) మా అమ్మ ఙ్ఞాపకాలు బలమైన అలల్లా తాకాయి. కన్నీళ్ళు ఆపుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది.
అజ్ఞాత చెప్పారు…
సిన్నప్పుడు నేను కూడా కోళ్ళు పెంచేవోన్ని. సదవతా వుంటే బాల్యం గుర్తొచ్చింది. నెనర్లు.
మాలతి చెప్పారు…
మామూలుగా నాకు ఇలాటి ప్రాంతీయం అర్థం చేసుకోడం కష్టం కానీ, ఇది ఆపకుండా చదివేశానండీ. కానీ, ఇదే వున్నదున్నట్టుగా కేవలం వ్వవహారికంలోనే రాస్తే ఇంత ఆసక్తికరంగా వుండేదా అన్న ఆలోచన వచ్చింది. బహుశా వుండేది కాదని కూడా అనిపిస్తోంది. అభినందనలు.
రానారె చెప్పారు…
@నాగప్రసాద్,మాలతిగార్లు
నెనరులు. థాంకులు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె