Monday, May 19, 2008

మ్ర్యాఁవ్...!!

వొక రోజు రాసీట్నుంచి మూడు కొత్త పుస్తకాలు తెచ్చినాడు మా నాయన. వాటి పేర్లు గణిత శాస్త్రము, పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2. అంటే లెక్కలు, సామాన్య, సాంగీక. చింతచెట్టుకింది బళ్లో మాత్రం పుస్కాలు గిస్కాలూ ల్యా. ఐవోరు పలికిచ్చిందే అందరికీ సదువు.

పొద్దు వాటారతా వుండంగా అశ్వనీభరణీలు, చైత్రావైశాఖలు, ప్రభవావిభవలూ పలికిచ్చినాఁక ఆఖరీన జనగణమన. అది పాడతా వుండంగానే మా రాతిమిద్దె బైట గూట్లో దాపెట్టిన కొత్తపుస్తకాల వాసన సాంబ్రాణీ వూదుకడ్డీల పొగ మాదిరిగా తీగలుతీగలుగా సాగుతా వచ్చి ముక్కులకు తగిలినట్టుగా వుంటాది. ...జయ జయహే... అంటాన్నెపాటికే రఁయ్యని పరిగేత్తుకోని యింట్లోకొచ్చి పలకాబలపం నులకమంచం మిందికి యిసిరిపారేసి, సామాన్యా సాంగీకా రెండుచేతలా పట్టుకొని వాటిల్లో మొగంబెట్టి మూజూడాల. వాటి కుండే వాసనంతా కడుపునిండా పీల్చి - యింగ రెండ్రోజులకు వీఁటి వాసన పోతాది గదా - అని ఉగ్గబట్టుకొన్నెంతసేపు ఉగ్గబట్టుకోని వదిలెయ్యాల.

మహా అంటే ఈ కొత్త కరుకు వారముండునో పదిరోజులుండునో! ఎప్పుటికీ వుండేటట్టైతే అయ్యి కొత్తపుస్తకాలెందుకాయ? వాఁటె కోసరం నేను పరిగేత్తుకోని ఎందుకొజ్జును?

*********************************************

ఆ మర్సురోజు సాయంత్రం బళ్లోనుంచి నేనొచ్చిన రావడం జూసి, వసారాలో మంచం మింద కుచ్చోని కలమంద నారతో నులక పేనుకుంటా వుండిన మాయవ్వ ఆత్రంగా, "నాయినా నాయినా పడతావు బద్రం" అనె. మంచం పక్కనే మా యిసుర్రాయితో రాగులు యిసురుకుంటా వుండిందొక యీడిగోళ్లాయమ. నేను హుప్ మని ఇసుర్రాయి మిందిగా ఎగిరిదూకి నేరుగా గూట్లో పుస్తకాలను దించుకోని వాసన పీలుస్తావుంటి. యిసరడం ఆపి, నాకల్లా యగాదిగా చూసి "గూట్లో కొత్త పెండ్లాన్ని కుచ్చనబెట్టినాడు, సంద్యాలపూట కిందికి దింపుకునేదానికొచ్చినిట్టుండాడు. నువ్వూనేనూ జెప్తే యినే పాయంలో వుండాడా నా అల్లుడు?" అని గెలివిగా నవ్వె యీడిగోళ్లాయమ. "నీ నోరు వూరుకోదు గదమ్మే!?" అంటా మాయవ్వగూడా నవ్వె. యింగ మనం ఆడ నిలబడేదానికుంద్యా? నాకేం తెలీదన్నిట్టుగా రయ్య్ మని యీదిలోకి పరిగెత్తినా. యీదిలో పిల్లకాయలు నాకంటే ముందుగా జిల్లాకట్టెతో తయారైపొయుండారు.

*********************************************

మా రాతిమిద్దెలో తేళ్లూ జెర్రులూ జాస్తి. ఇంటి సుట్టూరా రాతి పారిగోడ, యింటి ముందర కొండరాతి తెట్టె వుంటాది కాబట్టి అడపాదడపా పాములు కూడా కనబడతావుంటాయ్. పొద్దు గూకుతాన్నెపాటికే గబగబా అన్నాలు తిని మంచాలెక్కి కుచ్చోవాల. మంచం దిగాలంటే కాళ్లకు మెట్లు, చేతిలో టార్చిలైటు గానీ కిరసనాయిలుబుడ్డీ గానీ వుండాల్సిందే. మేమెవరమన్నా మెట్లేసుకోకండా మంచాలు దిగితే మా నాయనకు శానా కోపమొస్సాది.

మొబ్బు పట్టఁగానే మంచాల మింద పరుపులేస్కొని దోమతెర కట్టుకొని, నాయనమింద కాళ్లూచేతులూ యేసుకొని, రేడియోలో పాటలు వింటా సల్లఁగా నిద్దరబోవడమే మామూలుగా మన పని. కానీ కొత్తపుస్తకాలొచ్చినాఁక యవ్వారమే మారిపొయ్యింది.

ఆ పొద్దు సంద్యాళ పిల్లాపెద్దా అందరమూ అన్నాలు తిన్న్యాక, రేడియోలో మంచి పాట వస్తావుండంగా, దిలాసాగా దోమతెర లోపలికి దూరబోతి. "తినడమూ నిద్దరబోవడమేనా, పుస్తకం చాతబట్టేదేమన్నా వుంద్యా!?" అనె మాయమ్మ. పచ్చిమామిడికాయను తెంచి కిందేసినట్టు రేడియోను పుటుక్కున ఆపుజేశ మా నాయన. "ఆ పుస్తకాలు తెచ్చిండేది మీరు సదువుతారనా, ల్యాకపోతే, చించి పొయ్యిలో బెట్టి కాఫీ కాంచుకుండేదానికా!?" - అమ్మ.

దెబ్బకు నా దిలాసా దిగిపాయ.

*********************************************

ఆ పుస్తకాలను అంతకు ముందే మొచ్చుగా తిరగేసినా. వాటిల్లో బొమ్మలు శానా తక్కవ. ఆ బొమ్మలు గుడకా సూసేదానికి యేం బాల్యా. మూడు పుస్కాలూ చాతబట్టుకోని కాళ్లీడ్సుకుంటా వసారాలోకి వొస్తి. నేను నడిసినంత దూరమూ నా కాళ్ళముందర మా నాయిన టార్చిలైటు వేస్తావుండె. వసారాలో కిరసనాయిలు బుడ్డీ ముందర పోతలూరి వీరబ్రమ్మంగారి జీవిత చరిత్ర పుస్తకం చాతబట్టుకొని సదువుకుంటా కూసోనుంది మాయవ్వ.

ఈ యవ్వారం మనకు కొత్తగాదు, ఇంతప్పట్నుంచి సూసిందే. అమ్మానాయిన్లకు మనం కాబట్టనప్పుడు అవ్వ మనకోసరం కాపెట్టుకోనుంటాది. నా పారిటీలోనే వుండి అమ్మానాయిన్ను తిట్టినట్టే తిట్టినట్టే వాళ్లు చెప్పిన పని చెయ్యిస్తావుంటాది. ఈయమ నా పారిటీనో అమ్మానాయన్ల పారిటీనో తెలీదుగానీ, మన మనిసి మాదిరిగా మాట్టాడతా వుంటే మనకు సొగిచ్చినట్టుగా వుంటాది.

ఆ మూడింట్లో లెక్కలపుస్తకాన్ని తెరిసి లాబం ల్యా. దాన్ని తెరిస్తే పలకా బలపం గూడా చాతబట్టాల. పొద్దు గూకిందాఁకా ఆడుకొని, కడుపు నిండాకూ తిని, నిద్దర బొయ్యే యాలప్పుడు పలకాబలపం పట్టుకోని లెక్కలుజేసేదానికి భూదేవంత ఓర్పు గావాల. యాణ్ణించి వస్సాది?

ఇంట్లో మా ఎంగిలిగిన్నెలూ సద్దిబోకులూ సద్దుకుంటా వుండే మాయమ్మకూ, మిద్దె యనకాల మంచంమిందుండే మా నాయనకూ - యిబడేటట్టు 'సామాన్య' మొదిటి పాఠం గాఠ్ఠిగా సదవబడితి. మోజు కొద్దీ నేనొక్కణ్ణీ కుచ్చోని ఆపొద్దు పగటిపూట సదివేసిన పాఠమే. సులువుగా వుంటుందని మల్లా దాన్నే పట్టుకొంటి. నిద్దరేళ బలంతంగా సదువుతా వుంటే, యక్కడలేని అనుమానాలన్నీ రాబట్టె. పాఠం గట్టిగానూ, వొచ్చిన అనుమానాన్ని మాత్రం మాయవ్వకే యినబడేటట్టు సిన్నగానూ ...


భోజనమునకు ముందు కాళ్లూచేతులూ శుభ్రముగా కడుగుకొనవలయునూ...
"అవ్వా - కడుగంట. కొనాలంట. నువ్వెప్పుడన్నా కొన్న్యావా?"
"నేనెప్పుడూ కొన్లా నాయినా" అనేసి ఆయమ, బ్రమ్మంగారి జీవిత చరిత్రలో నిండా మునిగిపాయ.


పీటపై మఠము వేసుకొని కూర్చుండవలయునూ...
"అవ్వా - యింటాండావా? మఠమంట. బ్రమ్మంగారి మఠం. దాన్నిదెచ్చి మన పెద్దపీటపైన ఎయ్యాల్నేమో!"
మాయవ్వకు నవ్వొచ్చింది, "మఠమంటే పద్మాసనం రా తిక్కలోడా. పీటమింద సక్కలముక్కలు యేసుకొని కుచ్చోవాల"
"ఆ మాటేఁదో సక్కంగా చెబితేనేమి? మఠము, కూర్చుండ-వలయును అనకపోతే...!"
"నీయట్టా తెలివైన బిడ్డ యాడన్నా తగలకపోతాడా అని అట్టా రాసుంటార్లే"


త్రాగునీటిని ...
"అవ్వా - త్రాగునీరంట. నువ్వు నీళ్లను తాగుతావా, త్రాగుతావా?"
బ్రమ్మంగారి పుస్తకాన్ని పక్కనబెట్టేసి, మెల్లగా - "దప్పికైతే నేను మంచినీళ్లు తాగుతాన్నాయినా. మీ తాత మాత్రం త్రాగుతాడు."
"హహ్హ హహ్హ హ్హ"
"కానీ నాయినా, సదువు సదువు"


త్రాగున్రీటిని మ్రుందుగనే స్రిద్ధం చ్రేసిక్రొనవ్రలయున్రూ...
"వొత్తి పలకవే వట్టల పిల్లీ అంటే మ్ర్యాఁవ్ అనిందంట నీయట్టాటిదే ఒక పిల్లి. వొరే! నువ్వు మీ తాతను మించిపోతాండావు గదరా నాయినా! మీ నాయన్ను బళ్లో జేరిపిచ్చేటప్పుడు -మా వోడు ఐవోరికే సదువుజెప్తాడు సూడు- అనేవోడు మీ తాత. సూడబోతే, తాత మాట నిలబెట్టే మనవనిగా వుండావే నువ్వు!"

"అయ్యన్నీ మల్ల మాట్టాడుకుందాంలే, ముందు, ఆ పిల్లి మాట మల్లా జెప్పు! వొట్టి పలకవే ...????"
"వొత్తి పలకవే"

"వొత్తి పలకవే వట్టలపిల్లీ అంటే ..."
"మ్ర్యాఁవ్ అనిందంట"

"ఆ పిల్లి ప్రాలు త్రాగి ఆ క్రూత నేర్చుకోనుంటాది - క్రదా అవ్వా?"
"మీ తాత పెంపకంలో పెరిగుంటాది. దానికి ఆ మహాత్ముడే పోసుంటాడు పాలు."

"ల్యాకపోతే, నాకంటే ముందుగా ఆ పిల్లి 'సామాన్య' సదివుంటాది"
"లేదులే నాయినా, పుస్తకాలు సదివితే అబ్బే విద్యలు కావు యిట్టాటియ్యి. అది జాతి లచ్చణం. మీ నారు మామూలు నారా సామీ! అలివిగానోళ్ళు గదా!"

అంతలో, గోరెచ్చని మీగడపాలల్లో చెక్కెర కలుపుకొని పెద్ద స్టీలు గలాసునిండా తెచ్చిచ్చి గటగటా తాగమని జెప్పి, గొడ్లకు నీళ్లు తాపను పశులకొట్టంలోకి పోయ మాయమ్మ. అమ్మ తీరు జూస్తే మా అవ్వామనవళ్ళ మాటలన్నీ యిన్నిట్టే వుంది. నవ్వొచ్చిదంటే దాసిపెట్టుకోలేదు గదా!

"జాతిపిల్లికి మ్రీగడ ప్రాలు తెచ్చినావంటమ్మా?" అదొకరకం యాసలో అనె మాయవ్వ. సందు దొరికితే సాలు "మీ నారు, మీ జాతి" అని మాట్టాడతాది. ఇద్దరం ఒకే పారిటీ మనుసులుగా వున్నిట్టే వుండాము, మారిపోతా వుండాము.

"ఆ పాలు తాగెయ్ నిద్దరబోదువు" - కుడిత్తొట్టి కాణ్ణించీ ఒక కేకేసింది అమ్మ. నేన్ జెప్పలా? నవ్వొచ్చిందంటే దాయలేదని! దాయాలంటే కోపమొచ్చినట్టు మాట్లాడతాది. ఆ సంగతి నాకు తెలిసిపోతాది. ఏమైనా యిప్పుడు అమ్మ కూడా నా పార్టీలో చేరిపొయినిట్టే! ఈరోజు అమ్మపక్కన నిద్దరబోతే మేలు.

*********************************************

అసలు మా యింట్లో ఎన్నెన్ని పార్టీలుండాయో, ఎవురెవురు పార్టీలు పెడతారో, ఎప్పుడెప్పుడు కలిసిపోతారో గానీ, ఆ రోజు మాత్రం ఎంత లేదన్న్యా రెండు పార్టీలుండాయని నాకు అనుమానం తగిలింది.

దోమతెరలో పరుపుల మిందికి చేరగానే, నా అనుమానం నిజమేనని తెలిసిపొయ్యింది. ల్యాకపోతే నాకు నిద్దర బట్టిందాఁక మా యింట్లో రేడియో తప్ప మణుసులెవురూ నోరుదెరిసి మాట్టాడకండా వుంటారా అని!?

10 comments:

కొత్త పాళీ said...

ఈ టపాకి టైటిలు రెండు పార్టీలు అని పెట్టుండాల్సింది!
"గూట్లో కొత్త పెండ్లాన్ని కుచ్చనబెట్టినాడు, సంద్యాలపూట కిందికి దింపుకునేదానికొచ్చినిట్టుండాడు." - ఇది మాత్రం హైలైట్! :-)

గ్రాంధిక వాదానికీ వ్యావహారిక వాదానికీ వివాదం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో పక్కా గ్రాంధిక వాది ఒకాయన (జయంతి రామయ్య పంతులు గారు అనుకుంటా) "తలకు నూనె వ్రాసుకుని.." అని రాశార్ట. యెగస్పార్టీని యెగతాళి చెయ్యడానికి రవంత ఛాన్సు దొరికితే అబ్బురమా .. ఇవతలి వాళ్ళు వెంటనే ప్రకటించారుట .."పంతులు గారు ఉత్తరాలేమో రాసుకుంటారు, తలకి నూనె వార్సుకుంటారు.."

సుజాత said...

రానారె,

బాగుంది! కొత్త పుస్తకం వాసన....అద్భుతం! మీ ఇంట్లో పార్టీలు....మ్ర్యావ్!

కొత్తపాళీ గారు,
ఇంకెవరూ! జయంతి రామయ్య గారి మీద ఆ విసురు విసిరింది గిడుగు పిడుగే!

sujata said...

నాకు కూడా కొత్త పుస్తకాల వాసనా.. కొత్త రబ్బరు వాసనా.. ఇష్టం! :D

రవి said...

పొద్దుగాల నీ టపా చూసే సరికి ఈడ ఆపీసు ప్రని ఆపేసి ఇది సదవబడితి. రోంచేపయినాంక ఎనకాతల సూస్సే ప్రాజెక్టు మేనేజరు ఎప్పుడొచ్చిన్యాడో ఏమో నిలబడుకుని నా డబ్బా వంకే సూస్సా ఉన్యాడు.

ఈ పాలి బాగా నగిపిచ్చినావబ్బా..

చాలా బాగుండాది.

కృష్ణుడు said...

అబ్బ శానా రోజుల ఇన్నా ఇట్టాంట్టీ యాస.
నా సిన్నప్పుడు మా అయ్య పంజేసే పల్లెలొ ఇన్నా .మల్ల ఎరికజేస్తిరి.

మెట్లు అంటె గుర్తు రావడానికి ఒక క్షణం పట్టింది.
ఇంట్లో యాసలో మాట్లాడకపోయినా చిన్నప్పుడు యాసలో మాట్లాడితే అమ్మ,నాన్న వొప్పుకొనేవారు కాదు.

charasala said...

యధావిధిగా చదువుతున్నంత సేపూ నవ్వూ, నవ్వుతోపాటే కళ్ళల్లో నీళ్ళు (సంతోషంతో).
నీ పోస్టు చదవాలంటే చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి చదవాలి. లేకుంటే గట్టిగా నవ్వుకొనే అవకాశం వుండదు.

మా వూర్లో ఒక నాజూకామె వుంది. ఆమె చదువుకోలేదు గానీ భాష మాత్రం చదువుకున్న వాళ్ళ భాషలా వుండాలని తాపత్రయమేమొ గానీ.. అలానే ప్రతిదానికీ రావత్తు చేర్చి మాట్లాడేది.

--ప్రసాద్
http;//blog.charasala.com

ప్రవీణ్ గార్లపాటి said...

ఆ చదవడం అనే బద్దకం మాత్రం పిల్లలందరికీ కామన్ :)
రాతలో భలే చూపించావు.

Anonymous said...

బాగుంది. కొత్త పుస్తకాల వాసన ఎంతో బావుండేదౌను! చిన్ననాటి జ్ఞాపకాల వాసన కూడా బావుంటుంది. ఈ వ్రొత్తుల గురించి చదువుతుంటే రెండు సంగతులు గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడు య కు రావొత్తు రాయమన్న సంఘటనొకటి. రెండోది.. మా బావ ఒకడు ఇలాగే మ్రాట్టాడేవాడు - కాకపోతే జనాలని ఎగతాళి చేసేందుకు వాడేవాడు.

Reddy said...

8/10

రానారె said...

మీ అందరికీ బహుకృతజ్ఞతలు.
చరసాలగారు, మీకు ప్రత్యేకంగా. [:)]
చదువరిగారు, మీరు "యా కు రావొత్తు" అనే టపా ఒకటి బాకీ పడ్డారు. రెండ్రోజుల్లోగా రాయాలని మా డిమాండ్.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.