Monday, December 17, 2007

యేందిబ్బా యేమర్థంగాల్యా!

బైట చానా రొచ్చుగా వుండాది. మూడు దినాల నుంచీ వొగటే ముసురు. మోజులుమోజులుగా తువ్వర రాల్తానే వుంది. ఈ జడితో యెవురికీ మేలు ల్యా. పెద్దవాన పడి సస్తే చెఱువన్నా మొరవబోతాది, బావులు నిండతాయి, బడికి శలవలన్నా యిడుచ్చారు.

శుక్రవారం తుంపరలోనే బడికిబోతిమి. బళ్లో పిల్లనాయాండ్లు తొక్కితొక్కి న్యాల మొత్తం రొచ్చు రొచ్చు జేసిరి. శనివారం గూడా అంతే. ఆ రొంపి లోనే సల్లటి బండల మింద సాయంత్రం దాఁక కుచ్చోనొచ్చినాం. సరే అనుకుంటే ఆదివారంగూడా అదే ముసురు. బైటికిబొయ్యి ఆడుకుండేదానికి ల్యా. యాలంటే [ఏలనంటే] ఇంటి బైటనే పెద్ద గుంత తొగిచ్చినాంలే బయోగ్యాస్ కోసరమని. ఆడుకుంటా ఆడుకుంటా మేము యాడన్నా ఆ గుంతలో బడతామేమో నని. ఆ గుంత గూడా నీళ్లతో నిండల్యా. అట్టాటి పనికిమాలిన వాన. మాకు కావిలి మా తాత. కాయితాల్తో పడవలు జేసి వరండా నీళ్లలో వొదిల్తే చినుకులకు తడిసి ఆణ్ణే మునుగుతాండాయి.

ఇంటికాడ ఎవురూ లేరు. "అయిన కాడికి శెనిగచెట్లు పెరికి ఓదె బెడదాం, మల్ల యట్టైతే అట్టగానీ. ఇట్టే ఇంగ రెండ్రోజులు ముసురు పట్టిందంటే పంట కుళ్లిపోతాది, శనక్కాయలు మోసులొచ్చాయి" అని, దొరికిన కాడికి కూలోళ్లను బలంతం [బలవంతం] జేసి మడి కాడికి పిలచక పొయినారు.

"మ్మా! నేనుగూడా మీతో పాటు మడికాడికి వస్సా" అన్న్యా.

"వొద్దు నాయినా, ఈ వానకు తడిచ్చే పడిశం [జలుబు] బడతాది, జరమొచ్చాది" అంటాదేమో అనుకున్న్యా.అప్పుడు మనం యింగా రోంత గారం జేసి, "గొడుగు బట్టుకొని వొచ్చి చెట్టుకింద నిలబడుకోనుంటాలే" అనొచ్చనుకున్న్యా. అన్నీ మనం అనుకున్నిట్టు జరిగితే ఇంగేంగావాల!?

"పెద్ద పాలెగానివే లే! పుస్తకం చాతబట్టి యేమన్నా సదివేదుందేమో సూడు. ముందు నువ్వు ఇంట్లోకి బొయ్యి చొక్కాగుడ్డ తొడుక్కో. బఱ్రెంకలన్నీ [పక్కటెముకలు] బైటక్కనబడతాండాయ్. ఈ సలిగాలికి నువ్వు మడికాడికి రాకంటే పంచేట్ల్యా [పనికి చేటు లేదు]." గదురుకొనె మాయమ్మ. నేను ఏడుపు మొగం బెట్టబోతి.

అంతలో మా తాత, మంచానబణ్ణోడు వూరికే వుండకండా లేసి కుచ్చోని, "అద్ది. అట్టజెప్పుమ్మా. లయ్యబడతాండాడు లయ్యబణ్ణాగాని." అనె. నా ఏడుపుమొగం యేమీలేనిమొగంగా మారిపోయ.

ఎందుకు యీళ్లిద్దరికీ ఇంత కచ్చ? అమ్మ ఆ మాట అనిందంటే సరే. పోనీలే అనుకోవచ్చు. తాతకెందుకు నా మింద అంత కసి? పండుకోనున్నోడు లేసి కుచ్చోని ఆ మాట చెప్పి దగ్గి గసబోసుకోవడం దేనికి? అనుకునే గుదికీ నాకు యేడుపు బదులు కోపమొచ్చేశ. అంతకు ముందు గూడా అట్టాంటియ్యే చానా పనులు జేసినాడు. నా మింద ఇంత కసి పెట్టుకోనుండాడు ముసిలోడు, చింతబర్ర దీసుకోని వాతలు పడేటిగా కొడదామనిపిచ్చ. కానీ మన బలం అసలు సరిపోదు. చూసేదానికి అట్టుంటాడు గానీ చేతుల్లో చానా బలముంది. ఇంట్లో ఎవురూ లేనప్పుడు ఆయన నిద్దరబోతా వుంటే మేము జుట్టు పీకి పరిగెత్తుతాము. ఎప్పుడన్నా మెలకవతో వుండి నా రెక్క పట్టుకుంటే యిరిగిపోతుందేమో అనిపిస్సాది. అంత గట్టి పట్టు.

అంతలో బైట ధభీమని శబ్దం. "అర్జునా ఫల్గుణా పార్థా కిరీ... " అనె మా తాత. అది ఉరుము కాదని నా అనుమానం. 'బైటికి పొయ్యి చూస్తా'నని నేను. 'వానకు తడిసినారంటే అమ్మతో చెబుతా'నని మా తాత.

"బైట పిడుగులు పడతాండాయ్. నువ్వు గూడా అర్జునా ఫాల్గుణా అను."
"అనను"
"అంటే నీకే మంచిది. ఆవిశ [ఆయుష్షు] గెట్టిగా వుంటాది."
"నా ఆవిశకేం పరవాల్యా. నీ కంటే గెట్టిదే లే."
"అదే సామీ నాగ్గూడా కావాల్సిందీ, నా ఆవిశగూడా మీరే బోసుకోని యల్లకాలం బతకండి నాయినా", అని, పైకి జూసి నోటికొచ్చిన దేవుని పద్యాలన్నీ సదవబట్టె. అన్నీ ఐపొయినాఁక, "మీ ఆవిశ గెట్టిదిగావడమే సామీ నాగ్గావల్సింది. సల్లగ బతుక్కోండి నాయినా!" చానా నమ్మకంగా పలికె.

ఏదో వొక రకంగా కొట్లాట బెట్టుకుందామని నేననుకొంటే, ఈ రకానికి తిరుక్కొనె.
"యేందిబ్బా ఈ మనిసి నాకేమర్థంగాల్యా" అనుకుంటి.

ఆరోజు సాయంత్రం మా ఎనిపేదూడల్లో [ఎనుము దూడ/బఱ్ఱెదూడ] వొకటి కనబళ్లేదని అందురూ యెతకబట్టిరి. నాకు టక్కున గుర్తుకొచ్చ మధ్యాన్నం ధభీమని శబ్దమొచ్చిన సంగతి. "బయోగ్యాస్ గుంతలో చూసినారా?" అంటి నేను. లాంతర దీస్కోని గుంతలో జూస్తే దాంట్లోనే గమ్మున నిలబడుకోనుంది దూడ.

"పొద్దనెప్పుడు బడిందో, కాలిరిగెనో కన్నిరిగెనో, పొద్దన్నుంచీ యియ్యాల దాకా యే అవస్థబడెనో... గుఱకబెట్టి నిద్దరబోయేదానికైతే ఇంటికాడ వుండి యేమిలాభము?" అంటాంది మాయవ్వ. ఆమె అంటాండేది తాతనే అని నాకు తెలుసు. "మధ్యానమే సూచ్చానంటే తాత వొద్దన్యాడు" అని చెబుదామనుకున్యా - ఇంగా తిట్టిజ్జామని.

"నా ఆవిశగూడా మీరే బోసుకోని ...", అనే మాట గుర్తుకొచ్చ.
మన తాత మనం అనుకున్నెంత చెడ్డోడు కాదనిపిచ్చ.
పోనీలే అని వొదిలేచ్చి.

19 comments:

oremuna said...

మొత్తం పోస్టు మొత్తం చదవలేదు, కానీ బులుగు రంగులోనివి మాత్రం చదివినాను! వాటిలో లయ్య తప్ప మిగిలినవి అన్నీ మా ఊరిలో (ఖమ్మం ) లో కూడా వాడటారు!
:)

కొత్త పాళీ said...

నూకల గురించి రాశావేమో అనుకున్నా తాత ప్రసక్తి కనబడగానే.

నాగరాజా said...

బాగుంది ఆవేశంతో కూడిన ఆవిశ!

సత్యసాయి కొవ్వలి said...

10/10. ఇది కాపీ చేసుకుని టపా రాయగానే అతికించేసుకో - నాకెందుకు కష్టం.
మీ తాతచాలా మంచోడన్న మాట.

కొత్త said...

ఆచార్య కొవ్వలి గారు .. అబ్జెక్షను. తాతలందరూ మంచోళ్ళే .. ఆ మాటకొస్తే అమ్మమ్మలూ బామ్మలూ కూడా. మా అమ్మ తలంటికి ముందు నూనెతో తల అంటుతూ చదివే ఆశీర్వచనాల పనస నా చెవుల్లో రింగుమంటోంది.

Anonymous said...

బావులు =బాయిలు
నూనెతో =నూనితో
పై పదాలు మీ ఊర్లో వేరే అయితే ఓకే.

పదార్థం చాలా బావుంది. కథనం ఇంకా కొంచెం వుంటే బావుండేది కొంచెం కథలా .

మీ తాత దగ్గర కర్ర లేనందుకు నేను బాధ పడుతున్నా :-)

-- విహారి

teresa said...

'పోనీలే అని వదిలేస్తి'.... నీ గుండె గుమ్మడికాయ రామనాధమా!

రానారె said...

థాంక్యూ ఒరెమూనా! 'లయ్య' అనే పదానికి బ్రౌణ్యంలో ఇచ్చిన అర్థం, 'లయ్యబడటం' అనే మాటకు వ్యవహారంలో వచ్చే అర్థం వేరువేరు అని మీరు గ్రహించివుంటారనుకుంటా. :)

కొత్తపాళీగారు, మీ మాటే ఈ టపాకు ప్రేరణ. నూకలే ఆవిశ. నాకెందుకో గొప్ప నమ్మకం. ఆయనకంటే నా ఆవిశ గట్టిదే అని. ఆయనే ఇచ్చాడుకదా కొన్ని నూకలు.

నాగరాజాగారు, నెనర్లు.

ఆచార్యా, ఇవే మార్కులు సంపాదిస్తూ మీకు కష్టం కలిగించకుండా మరికొంతకాలం నేనిట్టా రాయగలిగితే 'పట్టా'భిషేకం జరిగినంత ఆనందం.

విహారిగారు, మీ వ్యాఖ్య నన్ను నవ్వించింది - ఎప్పటిలాగే. కర్ర లేకేం. ఆయనకు అవసరం వున్నకాలంలోనూ లేనికాలోనూ కూడా బలమైన ఊతకర్ర వుంది. దాన్ని అప్పుడు నా మీద ప్రయోగించి వుంటే వికలాంగుల జాబితాలో చేరిపోయేవాణ్ణి. :-) బావి ఏక వచనాన్ని మాత్రం బాయి అని పలుకుతారు. బహువచనం మాత్రం బావులు. అలాగే నూనె నూనే. మీ యాస నాకు కొంత పరిచయమే.

తెరెసాగారు, ఔనండి. నా గుండె గుమ్మడికాయే :-) ఒకోసారి అది పలుగుతుంది. ఒకోసారి కరిగి నీరైపోతుంది. ఒకోసారి నీరు నిలువై చెఱువౌతుంది. చెఱువు మొఱవౌతుంది. ఇంకా చాలాచాలా ఔతుంది. అదెప్పుడన్నా హల్వా అయితే మాత్రం అందరికీ పంచుతా :-))

రవి వైజాసత్య said...

బావుంది..మా తాత భుజాల మీదెక్కి శనిక్కాయల శాలెమ్మడి తిరిగిన రోజులు గుర్తుకొచ్చ

రాధిక said...

మీరిలాగే ఇంకో పది పోస్టులు ఏకలెక్కన రాసేస్తే నాకు కూడా మీ యాస వచ్చేస్తుందనుకుంటా.ఇప్పటికే ఎవరైనా రాయల సీమోళ్ళు కనపడితే నా తొక్కలో పరిజ్ఞానమంతా వుపయోగించేసి మీ టపాలన్నీ కళ్ళముందర గిర్రున తిప్పేసుకుని ఆ యాసలో మాట్లాడేస్తున్నాను.చెప్పడం మరిచాను.మీ టపాలయితే అదురుతున్నాయిగానీ హాస్యం పాలు కొద్దిగా తగ్గుతున్నట్టనిపిస్తుంది.

స్మైల్ said...

ఆహా! మరో చెఱుకు ముక్క...కానీ చివర్లో మీ జేజినాయన వీపు విమానం మోత మోగించుంటే మహా సరదాగా ఉండేది:-)

Anonymous said...

మా ఊళ్ళో నేను చెప్పినట్టే మాట్లాడుకుంటారు.

వాళ్ళకు నాలుగు బాయిలుండాయి.
అంగిడికి బొయ్యి సెనిగి నూని తీస్కోని రాబో

-- విహారి

రానారె said...

"మీ యాస నాకు పరిచయమే" అంటే అర్థం మీరన్నది నిజమే అని. మీ వూరి విషయంలో మిమ్మల్నే కాదనగలనా? :)

చైతన్య | chaitü said...

బాగుందండీ :)

మేము ఇంతకు ముందు ఉన్న ఇంటి దగ్గర, కింది వాటా లో కడప వాళ్ళు ఉండేవారు... అప్పట్లో వాళ్ళ మాటలు అర్థం చేసుకోవటానికి చాలా కష్టపడేదాన్ని...

మీ బ్లాగు ఇంకొంచం క్రమం తప్పకుండా చదివితే నేను కూడా ఆ యాస లో మాట్లాడగలననిపిస్తుంది :)

కొత్త పాళీ said...

"నూకలే ఆవిశ."
అదా సంగతి! ఐతే ఓకే.

Reddy said...

8/10 (relative to old posts).

రానారె said...

రవీ, మీలా భుజాలెక్కే ఛాన్సు నాకు దక్కలేదు. :(
రాధికగారు, మీరన్నట్టు హాస్యంపాళ్లు తగ్గినసంగతి గమనించాను. ధన్యవాదాలు.
స్మైల్‌భాయ్, థాంక్యూ. ఎవరి వీపు విమానం మోత మోగాలంటున్నారు మీరు? :)
చైతన్యగారు, రెడ్డిగారు, థాంక్యూ.

Dr.Subba said...

Dear Ramanatha Reddy garu...

Excellent....

Manasara anandinchanu..

prematho..
Subba Reddy.

రానారె said...

ధన్యోస్మి డాక్టరుగారూ!

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.