ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నాలుగు నల్లలారీలు - ఆరు యర్రలారీలు

తోటలోకి లారీ వొచ్చింది. మా(మి)డికాయల కాలంలో తప్ప మా ఊళ్లో లారీ అనేటిది కనపరాదు. మాడికాయలు తప్పితే లారీల్లో మోసకపొయ్యేంత పంట ఈరబల్లె మండలంలో ఇంగోటి లేదు. చెనిక్కాయలుగానీ ఒడ్లుగానీ పొద్దుతిరుగుడు గింజలుగానీ ట్రాక్టరుతొట్టి నిండితే గొప్పసంగతి.

తోటలన్నీ ఎక్కువగా రైతులవి. కొనేటోళ్లు ఎక్కువగా సాయిబూలు. మాడితోటల్లోకి లారీ వొచ్చిందంటే పీర్లపండగ మెరవణి మాదిరిగా ఉంటాదనుకో. అందరికీ లారీని దెగ్గిర నుంచీ సూడాలనుంటాది. పనిబడి పిలిస్తే పలక్కండా బొయ్యేటోళ్లంతా లారీ వచ్చిందంటే పాలెగాళ్లైపోతారు. ఈ కొత్త పాలెగాళ్ల పెత్తనం ఎవురి మిందనో గాదు, ఊరి పిల్లకాయల మిందనే. ఒగటే అదిలింపులు... "రేయ్ దూరంగాబోండ్రా, టైర్లకింద బణ్ణారంటే పిసురైపోతారు, పడ్తే మల్లేం ల్యా నా కొడకల్లాలా, రేయ్ గుండునాయాలా, రోయ్, ఓరి గుండోడా, ఏమిరా నాయాండ్లాలా సజ్జామని వచ్చినారేమిరా, పోండిదూరంగా, ..."

తోటగల్ల పెద్దమనిషి గనక దగ్గర్లో ఉన్యాడంటే పెత్తనం పెద్దరికంగా మారిపోతుంది - "సూడున్నా పిల్లనాకొడుకులు చెబితే యింటాండారేమో, మన తోటకాడ ఏమన్నా అయితే మనకేగదా మచ్చ, యీళ్ల నాయనగార్లకు జవాబు జెప్పేదెవురు, ...".


కాయలన్నీ లారీకి లోడెత్తుతారు, ఏదో రోంతసేపు పనిజేసిన సాంగ్యం జేస్తే నాలుగు పండ్లు తినొచ్చు, యింగా నాలుగుపండ్లు చేతబట్టుకోని పోవచ్చు గాబట్టే ఆ జాగ్రత్త, ఆ చొరవ. ఇంతకుముందెప్పుడూ ఈ పాలెగాడు ఏ పనికీ వొళ్లొంచిన రకం కాదని తెలిసినా, పోదోసుకోల్యాక, "యేదో వొగదానికి పనికొస్సాడులే" అనుకొంటాడు ఆ తొటను గొన్న సాయిబు. (తోటను కొనడమంటే చెట్లూ భూమీ శాశ్వతంగా కొనేయడంగాదు, ఆ సమచ్చరం కాపు మాత్రమే)

బడికాణ్ణించీ ఇంటికన్నా తోటే దెగ్గిర. వొంటరిబెల్లు కొట్టినప్పుడు వొంటికి బోసుకుండేదానికి మేము రోడ్డుమింద కుంట దెగ్గిరికొస్సామే, ఆణ్ణించీ నాలుగు మడి కయ్యలు దాటుకుంటే మా తోట్లో ఉంటాము. ఐతే యెప్పుడేగాని ఆ పక్కకు దిగింది మాత్రం ల్యా. కుంట మోరీమింద నిలబడి సుయ్‌య్యిమని పని కానిచ్చేసి సక్కంగా బళ్లేకి బోవాల. మడికయ్యల్లేకి దిగితే మక్కెలిరగ్గొడతారు బళ్ళో.

కింద కాలవలో రాలి ఎండిన జిల్లేడు,కానగాకులమింద మోరీపైన్నుంచీ పోసి దడదడలాండించమంటే ఇష్టం. దీంట్లో మల్లా పందాలు. అట్టపెట్టెలు, థర్మోకూల్ అట్టలు (టీవీలు అప్పుడే కొత్తగా ఊళ్ళోకొచ్చినాయ్), కిరసనాయిలు డబ్బాలు - ధఢధఢలాండించుకోవచ్చు. వొంటరిబెల్లప్పుడు మా పక్కన్నుంచే గెడిగోట బస్సు పోతుంది. డైవరుకు టాటా జెప్పాలగదా! సగంలో ఆపేసైనా సరే, ఇటుదిరిగి టాటా మాత్రం చెప్పాల్సిందే. ఇయ్యన్నీ రోజూ ఉండేటియ్యే. కానీ లారీ మాత్రం రోజూ రాదే!!

పొద్దున్నుంచీ బళ్లో ఉండానేగానీ, పానమంతా తోటలోనే ఉంది. యట్టనోగట్ట మజ్జాన్నమాయ. లంచిబెల్లు. పరుగోపరుగు. తోట్లోనే సంగటీ నీళ్లూ. అదేంచిత్రమో తోటలో ఏమితిన్యా బలే రుచిగా ఉంటుంది. ఎంతతిన్యా రోంచేపటికే మల్లా ఆకలైతాది. అమ్మో అవ్వో నాయనో ఎవురో ఒగరు తినేటప్పుడు మనకూ సంగటి పిడసలుజేసి చెనిగ్గింజలఊరిమిండో, పప్పో కలిపి నోటికందిస్తే గుటుక్కున మింగడమే మన పని. అదొక భోగం. నిజ్జంగా, ఇప్పుడనుకుంటే నోట్లో నీళ్లూరతాయిగానీ, తినిపిస్తే తినేంత తిండి... తినమంటే తిన్లేం.

తోట్లోకి పోఁగానే పెద్ద బేనీషా చెట్ల వరస మధ్యలో నిలబడి ఉంది లారీ. దిట్టంగా, ఠీవిగా. సుద్దంగా ఉండే అద్దాలమీద మామిడికొమ్మల, మోడాల, ఆకాశాల ప్రతిబింబాలు. దాని ఎదురుగ్గా నిక్కి నిలబడితి. లారీ నాకంటే చానా ఠీవిగా బలమైందిగా ఉంది. ఎదురొమ్ము నిండా గాలిబీల్చి ముంచేతులు నడుంపైన బెట్టుకొంటి. అయినాగానీ మహాపర్వతానికి ఎదురు నిలబడిన పొట్టేలుమాదిరిగానే ఉండాది నాపని. రాక్షస లారీ. దీనితో మనం తూగలేంలే అని తెలిసిపోయింది. "ఐనా, మనం చెప్పినమాట యిని, మన తోట్లోకి వొచ్చిందిగాబట్టి, ఇది మన లారీ. ఇప్పుడు దీనికి మనం యజమానులం. దీంతో పోటీ అవసరంలేదు", అనుకున్యా. అనుకోఁగానే దానిమీద చెయ్యేసి నిమరాలనిపించ - మన కోడెదూడన్నిమిరినట్టు. పక్కకుబొయ్యి నిలబడితి. ఎక్కడ చెయ్యెయ్యాల? ఎక్కడ నిమరాల? దాని గాండ్లే నాయంత ఎత్తుండాయ్ (గాను = చక్రం).

గానుమింద చెయ్యిబెట్టబుద్ధిగాక కాలుబెడితి. పైకి ఎక్కేదానికి ఏమన్నా పట్టు దొరుకుతుందేమోనని ఎగజూస్తి. "ఛ్స్..ఛ్స్.." అని శబ్దం యినపడె. తలకాయ తిప్పి చూస్తి. ఎవురో చింపిరిజుట్టు పెద్దమనిషి. లారీపక్కగా బేనీషా చెట్టు మొదిట్లో టారుబాలు పట్టమింద పండుకొని నిద్దరకండ్లతో ఎర్రగా నన్నే జూచ్చాండాడు. భయపడి లారీగానుమిందనుంచీ కాలు తీస్తి. ఆ సూపునుబట్టి సూచ్చే, నేనంటే యేమాత్రమూ లెక్కాజమా లేనిట్టుండాది. ఇది నాకు నచ్చలా. "మాతోట్లోకొచ్చి, నన్నే 'ఛ్స్..ఛ్స్..' అని ఉడతను అదిలిచ్చినట్టుగా పిలుస్తాడా!? నేనెవుర్నో తెలిసినిట్టు లేద"నుకోని, "మేం ఈ తోటగల్లోళ్లం." అంటి.

"నువ్వాణ్ణించీ పక్కొస్సావా రావా?"

నేను చెప్పింది యిన్యాడోలేదోనని అనుమానమొచ్చి, "ఈతోట మాదే." అంటి.

"నువ్వాణ్ణించీ వొచ్చేదుందా, నన్నురమ్మంటావా?" - చింపిరిజుట్టు పక్కన యింగోడు. మాంఛి కండబట్టి పక్వానికొచ్చిన మా బేనీషా కాయను కరుం కరుం అని నముల్తా, నన్నే బెదిరిస్తాండాడు - యీనెయ్య.

అర్థమైంది. లారీ డ్రైవరు, క్లీనరు తప్ప, యింత మిడిమేలంగా మాట్లాడేవోడు యింగెవుడూ మాతోట్లోకి రాడు. యింగా ఆణ్ణేవుంటే బైసినమేగదా! పక్కకొస్తిని గానీ లారీనొదిలి పోబుద్దిగాల్యా. యనకాలకు పొయ్యి నిలబడితి. యెనకాల ఆంజినేలుసామి బొమ్మ. లారీకి పసుపు, ఎరుపు రంగులేసినారు. పసుపూ-కుంకం. ఆంజినేలుసామి ద్యావళాల్లోగూడా యియ్యేగదా రంగులు. గుక్కతిప్పుకోకుండా గబగబా "నాలుగు నల్లలారీలు - ఆరు యర్రలారీలు" అనమనేవాళ్లు ఇంగా చిన్నప్పుడు. సామి మాదిరిగానే లారీలుగూడా చానా బలమైనయ్యి. "అందుకేనేమో లారీడైవరు క్లీనర్లకు అంత పొగరు. వొడొగ పాలెగాడు, వానికి యీడొగ ఆలెగాడు. యీళ్లకొగ సరైన మిండగాడు గావాల. బండి ఎక్కుతాన్నిపాటికే వాళ్లపాలికివాళ్లు అనుమంతుని భుజమెక్కి కూచున్న రామలక్ష్మణులం అనుకుంటారు. ల్యాకపోతే నాతో అంత పొగురుగా మాట్లాడతాడా, సరే మావోళ్లు రానీ చెప్తా - అనుకున్యా.

యింగోటుంది. అదేందంటే లారీల యనకాల - "ప్లీజ్ సౌండ్ హారన్". "హలో, టైం ప్లీజ్" అన్నట్టుగా, "సౌండ్ హారన్ ప్లీజ్" అంటే బాగుంటుందని నా ఉద్దేశం. కొన్ని లారీలకైతే "చిక్కడు-దొరకడు" అని ఉంటాది. లంకాదహనంలో ఆంజినేయుని మాదిరిగా భలే గొప్పగా ఉండ్లా!? కొన్ని లారీలకు "అన్నదమ్ముల అనుబంధం" అని కూడా ఉంటాది. ఎందుకో నాకుదెల్దు. ఇంగొ లారీకి "వెంట పడకురా వెర్రివాడా!" లారీ అనేది ఆడదైతే అట్లాటిమాటలు బాగుంటాయేమోగానీ, లారీ మగదని నా గట్టి నమ్మకం.


చెట్లకే మాగిన కాయలూ చిలకలుగొట్టిన పండ్లూ తింటా, నేను లారీ సుట్టూ తిరుగుతాండంగానే, పొద్దుగూకిపాయ. కోతగాళ్లు కాయలన్నీ కోసి లారీకెత్తి టారుబాలుపట్ట కప్పేసిరి. లారీలోకి డ్రైవర్ ఎక్కి కూర్చోబోతాండంగా నేను గూడా ఎకబాకి పైకి ఎక్కబోతి. మా నాయనే నన్ను కసిరి కిందకుదిగమనె. మా నాయనుండఁగా డ్రైవరు నన్నేమీ అనలేడు అనుకొంటి. అనుకునిందొకటి, అయిందొకటి. క్లీనరు నన్ను ఈసడింపుగాజూశ. చెప్పరాని బాధాయ.

ఆపై సమచ్చరాల్లో కూడా ఇంతే. నన్నెప్పుడూ లారీకి దూరమే చేసినారు.
'ఎన్నో యేండ్లు గతించి పోయినవి.' యంతకాలమని కావిలి గాచ్చారు యెవురైనా?
మనకేంజరుగుతుందోనని మనవాళ్లబాధ. ఏం జరిగినా ఫరవాలేదు, అనుకున్నది చేసెయ్యాలని మన నైజం.

**** **** **** ****


పోయిన వారం నా స్నేహితుడొకతను ఇల్లుమారినాడు. ఇది అందరూ ఇండ్లు మారే కాలమంట. దానికితోడుగా డీన్ అని పెనుగాలివాన భయం ఒకటి. బాడుగకు లారీకోసం వెతకడంలో కొంచెం ఆలస్యం జరిగింది. దాంతో మాకు మిగిలింది ఒక పాత పేద్ధ డొక్కు ట్రక్కు అనబడు లారీ. అది నేనెక్కిన తిరిగిన మొదటి లారీ. అందులో ఆడియో కేసెట్ ప్లేయరుంది. మాదగ్గరున్నవాటిలో పాతది ఒకటి పెట్టాం. యాదృచ్ఛికంగా మొదటిపాట నాకు అత్యంత ఇష్టమైన హిందీ గాయనీగాయకులనోట బ్రహ్మాండమైన యుగళం: "ఆప్ యూహీఁ అగర్ హమ్ సే మిల్ తే రహే - దేఖియే ఏక్ దిన్ ప్యార్ హోజాయెగా ..."

కామెంట్‌లు

విహారి(KBL) చెప్పారు…
లారీకి కూడా లింగ భేదాలు వుంటాయా రానారె గారు.
రానారె చెప్పారు…
ఉండవండీ :-)
విశ్వనాధ్ చెప్పారు…
భలే బావున్నదండీ మీ వ్యాసం-
నేను ఇంతకుముందెన్నడూ మీ బ్లాగ్ చూడలా-
మీరు రాసే విధానం చూసాక నేనూ మీ అభిమానినైపోయా -
అజ్ఞాత చెప్పారు…
ఈ లెవెల్లో రతనాలసీమ భాష వినలేదండి ఎప్పుడూ. నిజం చెప్పాలంటే, మీ బ్లాగుల్లో విషయాన్ని మీ భాష వెనక్కు తోసేస్తుంది (విషయం బాగోలేదని కాదండొయ్). నా ఉధ్ధేశ్యం, అసలు మీ భాషే మీ తురుపుముక్క. దాన్ని చాలా బాగా వాడుతున్నారు మీరు.
రాధిక చెప్పారు…
మా రైసుమిల్లు లారీ వెనుక"శాంతం కన్నా సముద్రం చిన్నది" అని వుంటుంది.అది చూసే ఎక్కడున్నా మా లారీ ని గుర్తుపడతాను.మిగతా అన్ని లారీల వెనుక మీరు చెప్పినట్టు పిచ్చి పిచ్చి గా ఏవో రాసి వుంటాయి.చిన్నప్పుడు లారీ ఎక్కడం అంటే ఎంత ఇష్టమో.అంత ఎత్తున కూచుని ఏదో విక్రమార్క సిం హాసనం లో కూర్చున్నంత బిల్డప్ ఇచ్చేవాళ్ళం.చిన్నతనపు పొగరు,ఉక్రోషం,బాధ...అన్నీ ఈ టపాలో చక్కగా కనిపిస్తున్నాయి.
అజ్ఞాత చెప్పారు…
అయ్యో మామిడి కాయలే గాదుబ్బా టమ్యాటా కాయలు గూడ ఏసుకోని బొయ్యేదానికి ఒజ్జినబ్బుడు ఈ క్లీనర్లు గాళ్ళకు డౌలెక్కువ. ఈళ్ళిట్ల ఎక్కనీరని మా వూర్లో పిల్లోడొగడు టమ్యాట బుట్లకింద దూరుకోని పూడిసినాడు. సాయిబూ మండి కాడ బుట్లు దించేడబ్బుడు ఆడ్నుండి దుమికేసి పూడిసినాడంట.

ఏమైనా ఎంత ఓపికయ్యా ఇంత పెద్ద టపా రాయడానికి. ఒకటికి పది సార్లు చూసుకుంటే కానీ యాస కుదురి చావదు.

-- విహారి
GKK చెప్పారు…
కథ చానా బాగుంది రానారన్నా. కానీ చిన్న పిల్లోన్ని ఒక్కతూరైనా లారీ
ఎక్కిపిచ్చింటే బాగుంటుండె.
kiraN చెప్పారు…
భలే ఉంది నీ లారీ కధ.

"ఐనా, మనం చెప్పినమాట యిని, మన తోట్లోకి వొచ్చిందిగాబట్టి, ఇది మన లారీ. ఇప్పుడు దీనికి మనం యజమానులం. దీంతో పోటీ అవసరంలేదు", అనుకున్యా.

- కిరణ్
చదువరి చెప్పారు…
మరి చలికాలం.. రాత్రి ప్రైవేటు వదిలాక/తెల్లారుగట్ట కాసేపు చదివినట్టు నటించి ఇంటికెళ్ళేటపుడు దారిలో చలిమంటేసుకోని, ఆ మంటలో రాళ్ళేసి, అయ్యి బాగా కాలాక, ఆటి మీద పోసేవాళ్ళా? ..ఆ మోతే వేరు!
కొత్త పాళీ చెప్పారు…
లారీ సంగతేమో గానీ నా చిన్నప్పుడు విజయవాడలో ప్రైవేటు సిటీబస్సులుండేవి. ఆ బస్సుల డ్రివర్లు నాకు పెద్ద హీరోల్లాగా కనిపించేవారు.
"మా నాయనుండఁగా డ్రైవరు నన్నేమీ అనలేడు అనుకొంటి. అనుకునిందొకటి, అయిందొకటి. క్లీనరు నన్ను ఈసడింపుగాజూశ. చెప్పరాని బాధాయ.
"
అవును, అత్త తిట్టిన దానికంటే తోటికోడలు నవ్వినందుకు బాధెక్కువ కదా! :-)

రానారె త్వరలో ప్రకటించబోయే "ఏరబల్లె ఈరుడు కతలు" అనే కథా హారంలో ఇంకో మణిపూస!
రానారె చెప్పారు…
విశ్వనాథగారు, చాలా సంతోషం. స్వాగతం.
అభిమానులైపోతే ఒకోసారి నిరాశ చెందగలరు జాగ్రత్త. :)

వికటకవిగారు, 'వినిపించింద'న్నారు. అది నా విజయంగా భావిస్తున్నాను. మీకు నా కృతజ్ఞతలు.

థాంక్యూ రాధికగారు,విహారిగారు, కిరణ్. పునఃస్వాగతం.

మన చేతుల్లో ఉంటే పిల్లోన్ని ఎప్పుడో లారీ ఎక్కించేసుందును తెలుగుతమ్ముడూ. ఐనా, పిల్లకాయ గనక లారీ ఎక్కింటే, మనకు ఈ కత జెప్పేవోడుగాదేమో!?

చదువరిగారు, ఓ... ఆ కతలు చెబితే శానా ఉండాయ్. :-)

కొత్తపాళిగారు, నమస్తే.
Unknown చెప్పారు…
నీ లారీ సంగతులు బాగున్నాయి రానారె. చిన్నప్పుడు లారీలెక్కడం అంటే నాక్కూడా భలే సరదాగా ఉండేది.
అలాగే నాన్న కి ట్రాన్స్ఫర్ అయిన ప్రతీ సారీ లారీ లో సామానంతా తరలించడం ఓ ప్రహసనం.
chavera చెప్పారు…
Visited ur blog for the first time. I am moved by it. It pushed me to seventies , and brought memories of my friend, A Adi Narayana Reddy, our co-medico in SVMC, Tirupati, who is to regale us with BELOW THE BELT Cuddapah dialect. He suddenly disappeared with out atrace in the third year.
spandana చెప్పారు…
రానారె,
ఎప్పట్లాగే అదిరింది.

మొత్తానికి "దడ లాడించడం.." దానికి తోడు చదువరి "సుర సుర లాడించడం" చదివి ఇంకా నవ్వుతూనే వున్నా.

"ఈరబల్లె ఈరుడు కథల" కోసం ఓపిగ్గా ఎదురు చూస్తా! నా పిల్లలకు కానుకగా ఇవ్వొచ్చు.

--ప్రసాద్
http://blog.charasala.com
అజ్ఞాత చెప్పారు…
మీరు దడ దడ లాడించెవాల్లు చదువరి గారు చుర చుర లాడించెవాల్లు మరి మెమొ మొరి నుచి కిందికి పిల్ల కాలువ తీసి కాలువ అలాగె వుంచి రొజు దాన్ని పారించెవాల్లము. హీ హీ

దిలీప్.
అజ్ఞాత చెప్పారు…
కథ బలేగా రాసారే, పిల్లొడిని లారీ ఎక్కిస్తారేమోనని అనుకున్నాను. ప్చ్, లేదుగా. చాలా బాగా రాసారు. అబినందనలు
అజ్ఞాత చెప్పారు…
కథ బలేగా రాసారే, పిల్లొడిని లారీ ఎక్కిస్తారేమోనని అనుకున్నాను. ప్చ్, లేదుగా. చాలా బాగా రాసారు. అబినందనలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత...

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క...

వేదికనలంకరించిన పెద్దలు

ఊరంతా జండాల పండగ. శ్రీ శ్రీనివాస కాన్వెట్లో ఆ పండగపేరు స్వాతంత్ర్య దినోత్సవము. అంతకు ముందు రెండు వారాల నుంచీ రోజూ సాయంత్రం పూట పీ.టీ.పిరుడు, మోరల్ పిరుడు కలిపేసి పిల్లకాయలందర్నీ వక కొటంలో చేర్చి మా అందరి చాతా దేశభక్తి గీతాలు పాడించి నేర్పించినారు. ఆగస్టు పదహైదోతేదీ పొద్దన్నే ప్రెయరు. ఐదోతరగతిలో క్లాసుఫస్టు కాబట్టి, నేనే యస్పీయల్ (స్కూల్ ప్యూప్‌ల్స్ లీడర్). ఐదో తరగతిలో నేను ఎందుకు క్లాసు ఫస్టు అంటే - అంతకు ముందు సమచ్చరం అంటే నాలుగోతరగతిలో నాకన్నా ఫస్టొచ్చే పిల్లకాయలంతా ఈ సమచ్చరం మా బళ్లో ల్యాకపోబట్టి. అది యేరేసంగతిలే. ******* ******* ******* పొద్దన్నే ప్రెయరు. ప్రెయర్లో ప్రతిజ్ఞ . "భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ... మ్... మ్..." ఢమాల్. ఆ తరువాతేందో ప్రతిజ్ఞ చదివేవానికి గుర్తుకు రాల్యా. మామూలుగా ఐతే మూడోతర్తి పిల్లోళ్లల్లో రోజుకొకరు ప్రతిజ్ఞ చెప్పాల. చెప్పలంటే అది కంఠోపాఠం రావాల. రాకపోతే బుక్కుజూసి చదవాల. తరవాత దెబ్బలు తినాల, యండలో నిలబడాల. జండాల పండగ రోజున ఇట్టాటి పంచాయితీ వుండగూడదని ప్రతిజ్ఞ గడగడా చెప్పేసేవాన...