Tuesday, April 24, 2007

చిరకాలమున్న నేకార్యమగును!?

వీరబల్లె.
పదిహైదేండ్ల క్రితం.
ఊరికి పడమట ఉన్న రక్షకభటనిలయం ఆవరణం లో...
అప్పటికి దాని చుట్టూ ఇనుపకంచె లేదు, ఇప్పుడున్నంత బందోబస్తు లేదు, నక్సలైట్లు లేవు, వీధిలైట్లు మాత్రమే ఉండేవి.

పొద్దుగూకి చానా సేపయింది.
దట్టమైన పెద్దపెద్ద రావిచెట్ల గుంపు.
అడుగడుక్కూ ఒక గూడు కట్టి కాకులు దాన్ని మరింత చిక్కగా చేశాయి.
అవి గూళ్లకు చేరే వేళ మహా కోలాహలంగా ఉంటుందక్కడ.
ఆ మానుల మీద పున్నమైనా సరే, కింద మాత్రం అమవాస్యే.

పండు వెన్నెల. ప్రశాంతమైన గాలి.
కాకులన్నింటికీ నిద్రపట్టినట్లుంది. ఒక కాకిపిల్ల మాత్రం మేలుకొనే ఉంది.
"మ్మా..." వాళ్లమ్మ మెడ కింద మెల్లిగా ముక్కుతో గీకింది.
"ఊఁ..." అలసి ఉన్నా ఓపిగ్గా మృదువైన కంఠంతో ఏమిటని అడిగింది అమ్మ.

"పుట్టినరోజు పండగ మనింట్లో ఎప్పుడొచ్చాది?" ఎన్నో దినాలుగా అడగాలనుకొన్న సంగతి అడిగింది.
అమ్మకు ఆ ప్రశ్న చాలా ముచ్చటగొలిపింది. మగతలోనే మురిపెంగా అంది -
"నువ్వు బుట్టింది పున్నమినాడు నాయినా. ఆ యెన్నెట్లో సందమామ మాదిరి నిగనిగ మెరిసిన నిన్నుజూసి..."
"మడే, ఈరోజు పొద్దన్నే పోలీసోళ్లింట్లో ... ఆ పండగ. మనింట్లో ఎప్పుడూ అని"
"అదా, వాళ్ల పిల్లోడుపుట్టి ఇరబైయ్యేండ్లయిందంట. వోళ్లు మనుసులు నాయినా. అందుకు పండగ."
"మనకు!?"
"మనకు యా పూటకాపూట కడుపు నిండితే పండగ, ల్యాకంటే యండగ" ఆవులిస్తూ నవ్వేసింది అమ్మ.

కాకులన్నీ అరమోడుపు కండ్లతో మగతలోనే వింటున్నాయీ సంభాషణ.
"కాకి చిరకాలమున్న నే కార్యమగును!?" అవ్వ నోట పలికిందీ మాట.
వేదాంత ధోరణిలో అందో లేక -మీకేమైనా తెలుసా- అని అడిగిందో!

అవ్వ చెప్పిన మాట అమ్మకాకితో సహా ఎవ్వరికీ నచ్చినట్లు లేదు.
"సరే, మనిసి బుట్టి యేముద్దరించినాడంట, అంత సంబరం జేసుకుండేదానికి!?" అందొక పెండ్లిగాని ముదురు మగ కాకి.

ఆ నోటిదురుసుకు మనసులోనే నవ్వుకొని, "మనం మాత్రం ఏం ఉద్ధరిస్తున్నాం గనక..."
వయసు నేర్పిన అనుభవంతో దీర్ఘం తీసింది అవ్వ. ఈ మారు పెండ్లిగాని కాకి గతుక్కుమంది.
కొన్ని కన్నెకాకులు కిసుక్కుమన్నాయి. అవ్వ వాటిని వారించింది.

కాకులు ఆలోచనలో పడ్డాయి. అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
అవ్వ గొంతు సవరించుకొంది. కాకులన్నీ చెవులొగ్గాయి.

"నేను బుట్టినప్పుడు కరువొచ్చింది. నీళ్లు దొరికేదే గగనం. అట్టాటి కరువు మీరెవురూ సూళ్యా. మడుసులకే టికానా లేదు. గౌరుమింటోళ్లు తలాయింత గంజిబోస్తే దోసిట్లోబట్టి ఒక్క గుటకన తాగి, అరిచేతులు, మోచేతులు, ముక్కులూ మూతులూ నాకుతాన్న్యారు. గంజి కోసరం కొట్టుకుంటాన్న్యారు.ఒక్క సుక్క నీళ్లుగూడా కనపరాల్యా మాకు. ఐనాగానీ, తాగేదానికీ తినేదానికీ యేమన్నా కండ్లబడిందంటే యినపణ్ణెంత దూరం క్యాకేసి పిలిసి దొరికిందే అందరం తలా ఇంత తిని పానాలు ఉగ్గబట్టుకున్యాం. కలిమిడితనం. పెద్దోళ్లు మాకు నేరిపింది ఇది. ఇదే మేము మీకు నేరిపింది. మీరు మీ బిడ్డలకు నేరిపేదీ ఇదే. చిరకాలము నుంచీ కాకి చేస్తాండే కార్యం ఇదే. ఉద్ధరించమంటే ఇదేరా. ఇంగేందోగాదు."

అని ఆపి, తల పైకెత్తి చందమామనును చూసింది. కాకులన్నీ అవ్వ చూసినవైపే చూశాయి.
"నిజమేగదా" - అన్నట్లుంది చందమామ చూపు. నిజమేనని కాకులన్నీ తలలూపాయి.
నిశ్శబ్దాన్ని కూడా శ్రద్ధగా వింటున్నాయి. పెండ్లిగాని కాకి అవ్వకు దగ్గరగా జరిగింది.

అవ్వ మళ్లీ అందుకుంది నెమ్మదైన స్వరంతో - "ఎంతమంది బుట్టినారు, ఎంతమంది సచ్చినారు, ఎన్ని పుట్టినరోజు పండగలు జేసుకున్యారు - ఇయ్యన్నీ యెందుకూ కొరగావు. పుట్టినదినం అసలు పండగెందుకురా నాకు తెలీకడుగుతా! ఇన్నాళ్లు బతికినామని సంకలు గుద్దుకునేదానికా? ఆయుసులో ఒక సంవత్సరం కరిగి పోయనే నని యేడిసేదానికా? ఎందుకు పుట్టినామో తెలీదు. పుట్టడమనేది పెద్ద గొప్పసంగతా, కాదు. అది నీ చేతుల్లో లేదు. పుట్టినాంక నువ్వు ఎట్టా బతుకుతాండావనేదే నీచేతుల్లో ఉంటాది. నలగరి కోసరం. అంతే. నీకోసరమే నువ్వు బతికితే, నీకు ఇరబైయ్యేండ్లొచ్చే యెవునిగ్గావాల, నూరేండ్లు నిండితే యెవున్నిగ్గావాల,నూకలు జెల్లిపోతే యెవునిగ్గావాల? ఏ పండగైనా పదీ మందికీ పండగైతేనే నీకూ పండగ."

ఊపిరి తీసుకోవడానికి రెండు క్షణాలు ఆగింది అవ్వ.

"పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా, పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ యే హాయి రాదోయి నీవైపు మరుకు" అని చెప్పేవోళ్లూ సేసేవోళ్లూ మనుసుల్లోగూడా ఉండారు. వాళ్లుగూడా మన కాకి జాతే. వాళ్లు గూడా చిరకాలం ఉంటార్రా. శాశ్వతంగా ఉంటారు. మనుసులు పోవచ్చు. వోళ్లుజెప్పిన మాటలు బోవు. అదే కార్యం. చిరకాలం ఉండడమంటే అదే." అని ముగించింది.

ఒక్క నిముషం కాకులన్నీ అవ్వ చెప్పిన మాటను నెమరు వేసుకొన్నాయి. సులభంగా ఆ మాటలను వాటి రక్తంలోకి జీర్ణించుకొన్నాయి. మనుషులకు అంత జీర్ణశక్తి లేదు పాపం.

అవ్వ చెప్పిన చివరి మాటలు విన్న కాసేపటికి, రేడియోలో సినిమా సినిమాపాటలు శ్రద్ధగా వినే ఒక కన్నెకాకికి ఏదో గుర్తుకు వచ్చింది.
రాగానే అమాంతంగా మొదలెట్టేసింది ఎనౌన్స్‌మెంటుతో సహా. అయితే, చాలా మధురంగా పాడింది:

చిత్రసీమ చిలింజీతాలు.
... చిత్రంలోని పాట వింటారు రచన సీనా-రాయణరెడ్డి, గాయని పీసుశీల.

పుట్టినరోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ...
.....
.....
ప్రతి కాకీ తన జన్మకు పరమార్థం తెలుసుకొని
తన కోసమే కాదు, పరుల కొరకు బ్రతకాలి
తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి ||పుట్టినరోజు||


పాట పూర్తయేసరికి కాకులన్నీ నిద్రపోయాయి. పెళ్లికాని నోటిదురుసు మగ కాకి మాత్రం ఆ గాయనీమణిని ఎంతో ఆరాధనగా, ఆర్తిగా, ఆపేక్షగా, ఆశగా చూస్తూ పండువెన్నెల్లో పాటకు పరవశమైపోసాగింది. గాయనీమణులను, నటీమణులను, ఇతరమణులను చూసి అలా పరవశమైపోవడం దానికి మామూలేగానీ, పాపం కన్నెకాకికి మాత్రం కొత్త.

14 comments:

చేతన said...

:-) .. bAgundi.

radhika said...

పంచతంత్రం కధలా కాకుల తో నీతిని చెప్పించారు. బాగుంది.

-నేనుసైతం said...

రానారె,

"మృదువైన కంఠంతో ఏమిటని అడిగింది అమ్మ"- ఎంత కమ్మనైన భావన.

"And in the end, its not the years in your life that count. Its the life in your years" - Abraham Lincoln

--నేనుసైతం

నాగరాజా said...

ఏమని వర్ణించనూ... రానారె ముందర పోనారె అందరు...

వెంకట రమణ said...

కాకులతో చెప్పించినా, కాకిగోలలా కాకుండా, చాలా బాగుంది.

ప్రవీణ్ గార్లపాటి said...

ఇదీ అని చెప్పలేను కానీ బాగుంది ఈ కాకుల కథ.
జీవితానికో అర్థం, పరమార్థం అవసరమయినా దానిని తెలుసుకోవడంలోనే జీవిత కాలం గడిచిపోతుంది.

chaitanya said...

రానారే గారూ,
చాలా బాగుందండీ కాకి కధ..మంచి నీతి వుంది ఈ కధ లో....ఇంతకీ పెళ్ళికాని కాకి కధ సుఖాంతమేనా? :)

ప్రసాద్ said...

గంజి కరవు గురించి మా తాత నా చిన్నప్పుడు ఇలాగే చెప్పేవాడు. మీ పెద్దవాళ్ళ నుండి ఇంకా వివరాలు తెలిస్తే చెప్పండి.

--ఫ్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

మనసు తడిసేలా చెప్పావు. ఎందుకొచ్చిన పద్యాలు చెప్పు - హాయిగా ఇట్లాంటి కథ వారానికొకటి చెప్పకూడదూ?

సత్యసాయి కొవ్వలి said...

నిశ్శబ్దాన్ని కూడా శ్రద్ధగా వింటున్నాయి.
మంచి ప్రయోగం. గాయనీమణుల్ని వాళ్ళనీ చూస్తూ కూర్చుంటే పెళ్ళవుతుందా ఎక్కడైనా?

Anonymous said...

ఈ సారెవరైనా కాకుల గోల అంటే ఈ టపా చూపిస్తా. దెబ్బకు నోర్మూసుకుంటారు

-- విహారి

Syam said...

మహానుభావా! నా తెలుగు సరిదిద్దినందుకు చాలా చాలా కృతఙుడనై ఉంటాను. కాస్త మధ్య-మధ్యలో నా టపాలు చూస్తూ ఉండండి.మీ బ్లాగ్ చాలా బావుంది. మీ ఆలోచానలూ అలానే.

mee template lo heading inka comments daggara telugu aksharalu podiga vidividiga vasthunnai. mee html lO #header anna tag vasthundi. aa tag lo letter spacing ani untundi. aa line delete cheyyandi. mee page title malli maamoolu telugu lo vacchesthundi.

mee comments kosam #comments anna tag kosam vethakandi.
idi try chesthe saripovali. emaina help kavalante cheppandi.

Syam

Syam said...

మీ వంటి వారు చెప్పగా మావంటి వారు చెయ్యక పోవడమా?

"బ్లాగర్లు సేయగరాని మార్పు గలదే రానారె సేయమనగన్" :)

మీరు మాత్రం మీ template ఇంకా అలా పొడి అక్షరాలకే వదిలేసారు?:)

రానారె said...

కథ నచ్చిందంటూ అభినందించినందుకు చేతన, రాధిక, నేనుసైతం, రమణగార్లందరికీ కృతజ్ఞతలు. చైతన్య గారు, మీ ప్రశ్నకు సమాధానం ఈ సారి వీరబల్లెకు వెళ్తేగానీ తెలీదు. ప్రసాద్‌గారు, నాదీ మీ పరిస్థితే, ఈ కథలో చెప్పినది తప్ప అంతకు మించి ఆ కరవు గురించిన వివరాలు నాకూ తెలీవు. కొత్తపాళిగారు, మీరన్నట్లే నాకూ అనిపిస్తోంది - ఎందుకొచ్చిన పద్యాలు చెప్పు - అని. కానీ సరైన పద్యం ఒక్కటైనా రాయకుండా వదిలేయడానికి మనసొప్పలేదు. ఐనా కథే నాకు ప్రధానం, పద్యాలూ కవితలూ ఆ తరువాతే. ముంబైలో సినిమాల్లేని కొందరు హీరోయిన్లు అంటూంటారే - "తెలుగే నాకు ప్రధానం, ఆతరువాతే బాలీ ఐనా హాలీ ఐనా" అని, అలాగా {:-)}. సత్యసాయిగారు, నేనూ చెప్పిచూశానండీ అవీఇవీ చూస్తూ కూర్చుంటే ఔతుందా అని, విన్లా. నాగరాజ, విహారి మరియు శ్యామ్‌గార్లకు ధన్యవాదాలు. ప్రవీణ్, మ్యాటర్ సీరియస్ అంటారా! ;)

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.