Wednesday, February 28, 2007

డెమ్మ డెక్క డాలి

నా పైతరగతోళ్లు ఒగ ఇద్దురు పిల్లకాయలు నాగన్నైవోరి బడికి ఎగనామంబెట్టి వంకలో బుడ్డపక్కెలు (ఒక చేప జాతి) పట్టేదానికి బొయి, వాళ్లమ్మో నాయనో జూసి "*న్‌జా కొడకల్లాలా బడికి బోకండా వంకలంబడీ కాలవలంబడీ ఏమి యారకతినే పన్జేచ్చాండార్రా" అని చేతిలో ఈతబర్రతో యంటబడితే సచ్చితిం బతికితి మని వోళ్లకు దొరక్కండా *న్‌కోని పైన ఉరికినారనుకో - ఈ తమాసా సూసినాంక ఎవురికన్నా సెప్పిందాంకా అన్నం సగిచ్చదుగదా మనకు! వొగేల (ఒకవేళ) సెప్తే ఇంట్లో జెప్పాల. ఇంట్లో జెప్పాలంటే వాళ్లమ్మానాయినా తిట్టిన తిట్లు సెప్పలేము. ఆమాటలు ఎవురో అన్న్యారని కూడా నా నోటెమ్మట రాగూడదు. వొస్తే చెంప పగుల్తాదని తెలుసు. 'న్‌జాకొడకల్లాలా' అనే మాటల్యాకంటే (లేకుంటే) దాంట్లో తమాసా ఏముండాది? ఇంట్లోగాకండా ఇంగెవురికన్నా సెబుదామా అంటే - "రెడ్డేరిపిల్లోళ్లట్టాంటి మాటలు మాట్టాడర"ని ఊర్లో మనకు 'మంచిపేరుం'డాదే! మాట్టాడతాండామని ఇంట్లో తెలిచ్చే బాగుండదు. సూసినా!? మంచిపేరు ఒగోసారి అంత మంచిదనిపీదు. ఊరంతా మాట్టాడతారు. మా నాయనగూడా, ఇంట్లో మాట్టాడ్డుగానీ, బైట మాట్టాడ్డం మొచ్చుగా (మస్తుగా) జూసినాము. మా తాతగూడా అంతే. నేను మాత్రం మాట్టాడగూడదు . కాపోతే, నాకు తెలీని తిట్టుమాటే లేదులే! పిన్నవయసులోనే అన్నీ నేర్చేసుకున్న్యాగానీ మాట్లాడేదానికి మాత్రం వీల్లేని పరిస్థితి. ఇది ఒకటోతరగతి రెండోతరగతి నాటి మాట.

*** *** ***

అన్నీ తెలుసు ననుకున్న్యా గానీ కొత్తకొత్త తిట్లు యింగా శానా ఉండాయని తరవాత్తరవాత తెలుస్సా వొచ్చింది. సువ్వర్, కర్గోష్ ఇట్టాంటియ్యి. బట్టుపల్లెలో సాయిబూల పిల్లకాయలగ్గూడా కర్గోష్ అంటే ఏందో తెలీదు. 'పోరా కర్గోష్ నాయాలా' 'కర్గోష్ నాకొడకా' ఇట్లా రకరకాలుగా తిట్టేదానికి ఈ మాట వాడేవాళ్లు. అర్థం తెలీకపోయినా ఆ మాట అనిపించుకున్నోనికి రోసం మాత్రం వొచ్చేది. కాపోతే, ఈ రకం కొత్తతిట్లు కొంతకాలానికి మాయమై పొయ్యేటియ్యి . పండగలకు యేరే ఊర్లనించి కొత్త పిల్లకాయ లొచ్చినప్పుడు వాళ్లు తెచ్చినయ్యీ, మా ఊరోళ్లు ఇంగోవూరికిబొయి నేర్చుకొనేటియ్యీ ఎక్కువ రోజులు ఉండేటివిగాదు. నిజంగా కోపంలో ఉన్నపుడు కొత్తగా నేర్చుకొన్న తిట్లు నోటికి రావు. ఒగేల వొచ్చినాగానీ, 'అవతలోనికి అర్థంగాపోతే ఫలం లేదుగదా'ని వాడరు. తీరుబడిగా, దిలాసాగా, కుశాలగా, సంబరంగా తిట్టేదానికే ఈ కొత్తతి ట్లు. కుండపోతగా తిట్టాలంటే మనం చిన్నప్పట్నుంచీ నేర్చుకొన్నవే అక్కరకొచ్చేటియ్యి. కాబట్టి ఈరబల్లె తిట్లు శాశ్వతమైనవై చిరకాలం వర్థిల్లుతున్నవి. ఇంతకూ కర్‌గోష్ అంటే కుందేలని ఆతర్వాత పదేండ్లకు హిందీ నిఘంటువులో చూసినపుడు తెలిసింది. ఇది తిట్టెందుకయ్యిందో నాకింకా తెలీదు.

నేను తిట్టుమాటలు మాట్లాడక పోవడం వల్ల వచ్చే లాభమేమిటో మెల్లమెల్లగా అర్థమౌతూవచ్చింది. నేను తిట్లు వాడకపోతే నన్ను తిట్టడానికి ఎవరికీ అవకాశం ఉండదు. ఒకవేళ నన్నెవరైనా తిట్టినా నేను వాళ్లను తిట్టగూడదు అనేది మరొక కఠినమైన ఆంక్ష. నన్ను తిట్టినవాణ్ణి తిడితే నా చెంపలకు చేటు. ఎవరైనా తిడితే నేరుగా ఇంటికొచ్చి ఆ సంగతి చెప్పాలనేది రూలు. ఈ ప్రపంచంలోని తిట్టుమాటలన్నీ కంఠతా వచ్చికూడా, నన్ను తిట్టిన వానిమీద ప్రయోగించలేకపోవడం నాకు చానా బాధ కలిగించేది, ఇంతటి పాండిత్యమూ వృధా అవుతోందని. అయితే దీనివల్ల కలిగిన లాభాలు కూడా మెల్లమెల్లగా తెలుస్తూ వచ్చినాయి. ఇదీ నాలుగు ఐదు అరవ తరగతుల నాటి మాట.

*** *** ***

"ఆ వయసు దాటిపోయింది, అమ్మానాయనా ఇంగ మనల్ని కొట్టరు" అని మనకు అనిపించే, మనం గమనించే సమయం బలే ఉంటాదిలే. తెలిసి చేసినా తెలీక చేసినా ఇంట్లో దెబ్బలు తినాల్సి వస్తుందేమో నని బిక్కుబిక్కుమని గడిపే స్థాయి నుంచి, చెంపదెబ్బలే లేని, వీపు విమానంమోత మోగని జీవితంలోనికి ప్రయాణం. స్కూల్లో ఇంగా తప్పలేదనుకో. పైగా మనల్ను చిన్నచిన్న పనులకు మళ్లోకి (పొలానికి) పంపుతారు. మళ్లో పనిజేసే పెద్దోళ్లతో మనమూ కలవొచ్చు. మాట గలపొచ్చు. ఇప్పుడు మనం తిట్టుమాటలు మాట్లాడినా కూడా ఇంటికి ఫిర్యాదులు వెళ్లవు. తిట్టుమాటలు మాట్లాడటం అంటే మనుషులను తిట్టడమని కాదు.

మాట వినకుండా మాటిమాటికీ మళ్లోబడి పంటను మేసే ఎనుము వల్ల (బఱ్రె) విసుగొస్తే - "బాగా కొవ్వుబట్టింది దీనెమ్మా, దీని మెడకు గుదెయ్యాల్సిందే" అని నేనడం ఆమోదముద్ర పొందిందన్నమాట. అట్టా మాట్లాడితేనే పెద్దమనిషితనం. గుది అంటే పరుగు వేగాన్ని నియంత్రించేందుకు పశువుల మెడకు కట్టి కాళ్ల మధ్యన వేలాడదీసే సుమారు ఒక మీటరు పొడవున్న సన్నని దుంగ. ఒకోసారి పొలంలో చెట్లకు నీళ్లు పారగట్టేటప్పుడు మట్టిపెళ్లల నుండీ రాళ్లకిందనుండి, తేళ్లూ జెర్లులూ మండ్రగబ్బలూ బయట కొస్తుంటాయ్ మామూలుగా. ఒకేసారి ఎక్కువగా కనబడినాయంటే ఒళ్లు జలదరించి - "ఓరి వీటెక్****గా, యాణ్ణుంచీ వస్సాండాయ్‌రా సామీ ఇయ్యన్నీ!" అంటారు. రైతుల్లో ఇట్టాంటి మాటలు సర్వసాధారణం. దొంగ గొడ్లు మడి మేసిపోకండా, సుట్టూ కంప నాటి, ఒక చోట మనిషి బొయ్యేదానికి మాత్రం వీలయేంత ఇరుకుగా ఒక బలమైన పంగలకట్టెను నాటుతారు - దీన్ని ఇరుకుమాను అంటారు.

ఇరుకుమాను నిలబెట్టేదానికి మాను సుట్టూరా రాళ్లేసి దిగ్గొట్టాలనుకో, ఒక రాయిని తీసుకురమ్మనడానికి బదులుగా, 'ఆ రాయిట్ట *న్‌కగాబ్బీ' అంటారు. పొమ్మనడానికి కూడా తిట్టుమాటగా గుర్తింపబడిన పదాన్నే వాడటం కడపజిల్లా పల్లెల్లో సర్వసాధారణం. "తోటలో ఎవురూ లేరనుకోని, పిల్లనాయాండ్లు మామిడికాయల *న్‌కపోదామనొచ్చినారు, నేన్‌ గనబడంగానే *న్‌కోని అద్దేపోత!" నేను ఇట్టా మాట్లాడే వయసుకొచ్చినా నన్నమాట. కానీ ఇంట్లో మాత్రం మాట్లాడకూడదు. బయట పొలాల్లో కూడా చదువుకుంటున్న వాడు ఇట్టా మాట్లాడకపోవడమే గౌరవంగా పరిగణింపబడేది. ఇట్లా మాట్లాడితే మాత్రం జనాల్లో బాగా కలిసిపోవచ్చు.

ముక్కావారిపల్లె గురుకుల పాఠశాలలో తొమ్మిదోతరగతిలో మా ఇంగ్లీష్ మాస్టారొకాయన మాతో చెప్పిన మాట - 'మంచి భాష మాట్లాడటం మీకు గౌరవాన్నిస్తుంది. తిట్టుమాటలు ఆ గౌరవాన్ని దిగజారుస్తాయి' అని . గుర్తుపెట్టుకొన్నాగానీ, మావూరి భాషలో మాట్లాడటమంటేనే నాకు మోజు. అదో తృప్తి. ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులనాటి మాట.

*** *** ***

"నేక్క, న్యాలి, నేమ్మ" - ఇవి అప్పుడప్పుడూ వాడే పదాలే అయినా, 'నేక్కా' మాత్రం ఒక ఊతపదంగా ఉండేది నాకు. కొన్ని సందర్భాల్లో (ఇప్పుడు కూడా) అసంకల్పితంగా వచ్చేస్తుంది. ఉదాహరణకు, ఒక నాలుగేండ్ల చిన్న పిల్లకాయ అలాగ్గా వేమన శతకం మొత్తం అప్పజెప్పేసినాడనుకుందాం. అబ్బురంతో నానోట వచ్చే మాట "నేక్క! అదిరా కొడుకు!". ఆ సామర్థ్యానికి వానిపై అభిమానం మనసులో మెదలడం వల్ల వచ్చిన ప్రశంసాపూర్వకమైన వాచకం - నేక్కా! ఇది తిట్టుమాట అంటే నేనేమీచేయలేను . ఇలాంటివి వాడకపోతే జీవితం ఇప్పుడున్నంత రసవంతంగా ఉండదేమో అనిపిస్తుంది.

రాయలసీమ రెసిడెన్షియల్‌లో ఎంసెట్ బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకునే కాలంలో అక్కడి ఒక మిత్రుడి ప్రవర్తన నాకు నచ్చింది. నెమ్మదస్తుడు, మృదుభాషి, ఆలోచనాపరుడూ అయిన ఆ చిత్తూరువాసి నా స్నేహితుడైతే బాగుండుననుకొన్నాను, కానీ సున్నితంగానే తిరస్కరింపబడ్డాను. కారణం ఆకాలంలో నా భాష, నా దూకుడూ రెండూకూడా అతనికి సరిపడేవికావు. ఈ సంగతి అర్థం చేసుకొన్నాను. "ఈ రకం మాటల వాడకం వీలైనంత తగ్గించా లనుకుంటున్నాను" అని మా హాస్టల్లో ప్రకటించగానే "ఆ పనిచెయ్యి. చాలా మంచిపని" అంటూ నా శ్రేయస్సును అభిలషించిన మెదటివాడు అతనే. "నువ్వు నువ్వుగా ఉంటేనే కదా మజా" అన్నవాళ్లూ చాలా మందే. భాష కొంచెం మార్చుకొన్నానుగానీ, "నేను నేనుగా" కూడా ఉన్నాను.

*** *** ***

ఈరబల్లె సుట్టుపక్కల (ఆమాటకోస్తే రాయలసీమలో) అబ్బాయ్ అనే మాటను 'అబ్బీ, బ్బీ, బ్బే, బ్బా' ఇట్టా రకరకాలుగా చానా మామూలుగా - సావాసగాళ్లు, ఒకే వయసున్నోళ్లు, చిన్నోళ్లను పెద్దోళ్లూ పిలిచే పదమే. 'ఏంబ్బీ బాగుండారూ?', 'సరేలేబ్బా!', 'వాడనేదదిగాదులేబ్బే' లాంటి మాటలు స్నేహపూరిత వాతావరణంలో దొర్లుతుంటాయి. బ్బే అనే పదం తెలంగాణా ప్రాంతాలలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని నేను హైదరాబాదులో చదువుకునేటప్పుడు నల్గోండజిల్లా వాసులైన నా మిత్రులద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాను.

నిద్ర వస్తున్నప్పుడు హాయిగా ఆవులించడం - కడుపునిండా తిని బ్రేవ్‌మని త్రేంచడం - ఒంటరిగా ఉన్నప్పుడు గాట్టిగా పాడుకోవడం - మాట రసవంతంగా ఉంటుందనిపిస్తే తిట్టుమాటైనా సరే వాడుకోవడం - ఇలాంటివన్నీ సభ్యతకు భంగం కలిగించనంత వరకూ - కొనసాగించడమే మంచిదని కడపలో కాలేజీరోజుల్లో నా అమూల్య మిత్ర రత్నాలతో మాటల్లో అనుకొన్నది. మనం ఉన్న వాతావరణం, మన చుట్టూ జనాలు, మన మాటలకు శ్రోతల స్పందన, అవి కలగజేసే ప్రభావం లాంటివన్నీ గణించిత తరువాతే 'నేఖ్ఖ' లాంటి పదప్రయోగాలు.

24 comments:

Anonymous said...

రానారె,

చాన్నాళ్ళకు నీ కీబోర్డుకు పన్జెప్పినావ్. నీ చిన్నబ్బుడి తిట్లు జూసి నాకు బొలే నవ్వొచ్చేసిందిలే. నేను గూడా యాడికాడికో బొయ్యొచ్చినా ఈ యాసం జదివి. చాన బాగ ఎవుడన్న జెబ్తే "ఈడెక్కో ఈడు బొలే నాకొడుకు రో" అని మెచ్చుగునేది కూడ గుర్తొస్తా వుంది.నిన్నంత మాట అన్లేను గానీ. బాగ కుమ్మేసినావ్ పో ఈ టపా తో.

radhika said...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ బాల్యపు రాతలు.కానీ ఈ తిట్ల పురాణం ఏమిటండి.అయినా మీ రాతల్లో ఏదో గమ్మత్తు వుంటుంది అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తూనేవుంటాయి.కష్టపడి నేర్చుకున్న పాండిత్యం అంతా వ్రుధా అయిపోతుందని బాధపడుతున్నరా? అయ్యో రామ...!

తెలు'గోడు' unique speck said...

తిట్లూ బూతులు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మా తెలుగు మాష్టరనే బూతులు గుర్తొచ్చాయి...ఎవడైనా ఫేలయితే ముంతా డాలయ్య అని,కొంచెం ఎక్కువ చేసేవాడ్ని లంకా జగన్నాధం అని పిలిచేవాడు.ఇలా ఎందుకనేవాడో మీ కర్థమయ్యే ఉంటుంది....సంతకం పెట్టడానికి పేర్లలో మొదటి అక్షరాలను ఉపయోగిస్తాం కదా!(ఉదాహరణకి:సుధీర్ కొత్తూరి అంటే సు.కొ)...అలానే ఇప్పుడు పై పేర్లను చూడండి.
ఆత్రేయని కొందరు బూత్రేయ అనేవారు(ఆయన సాహిత్యం అప్పుడప్పుడూ శ్రుతిమించిన పదాలు కలిగుంటాయట).
అయితే శ్రుతి మించితేనే బూతు,తిట్టు అయిపోదు...తెలంగాణాలో చిన్న చిన్న తిట్టు మాటలు సర్వ సాధారణం!(బే,సాలె,మాకి,గా*డు etc etc)
ఒకప్పుడు నా మాటల్లో తిట్టులేని పదాలను భూతద్దం పెట్టుకొని వెతుక్కోవాల్సొచ్చేది.ఇప్పుడు చాలా వరకు నయం!
రానారె! తిట్ల పురానాన్ని కూడా భలే చెప్పావయా!నీ టపా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తొంటే "తిట్టే"సావ్!

Nagaraju Pappu said...

రేనారే
మాండలికంలో ఎంత బాగా రాసేరు..
మాండలికం రాయడం మీద మీరో క్లాసు పీక కూడదూ? అందరికీ ఉపయోగపడుతుంది కదా?
--నాగరాజు

Sriram said...

తెచ్చిపెట్టుకున్నట్టుగా కాక మనసులోంచివచ్చినట్టుగా ఉంటేనే మాటకి అందం అబ్బుతుంది. ఇక్కడ అదే జరిగింది.

సుధాకర్ said...

తూ.గో భాషలో

మీ యెంకమ్మా..బలే రాసారండీ బాబు :-)

Dr.Ismail said...

పొద్దున్నే లేచి, మంచి కాఫీ పట్టుకొని, కూడలిలో కూర్చొని, తేనెగూడును కదిలిస్తే 'రానారె' మరో తేనెధారను వదిలాడోయ్ అని ఆనందిస్తూంటే, తిట్ల తేనెటీగలు ఝమ్ ఝుమ్ అని ముసిరాయి.కానీ తేనె కన్నా ఈ ఝుమ్ ఝుమ్ నాదాలే బాగున్నాయనిపించేలా ఎంత చక్కగా రాశావయ్యా 'రానారె'.

మాండలికంలో అప్పుడెప్పుడో నేనన్నట్టు నెల్లూరు 'ఖదీర్ బాబు',అనంతపురం 'శాంతినారాయణ'లకు ఈ కడప'రానారె' ధీటు!బలే రాసావయ్యా!నేను పట్నంలో పెరిగాను కనుక ఈ మాండలికం అంత వంటబట్టకపోయినా పల్లెల్లో పండుగలకు పోయినప్పుడు విన్న భాష ఎంతో కమ్మగా ఉండేది.

కానీ తిట్లు సార్వజనీనమైన భాష.ఇలాంటి కష్టమైన విషయం మీద ఎంతో చక్కగా...ఆ తిట్లు తెలిసిన వారికి మాత్రం అర్థమయ్యేలా...కొండగుర్తులు పెడుతూ...తిట్ల గురించి చెబుతూనే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించి...మొత్తానికి 'రఫ్ఫాడించేసావు' కదయ్యా రానారె!

ప్రవీణ్ గార్లపాటి said...

నాకు తిట్లు ఎప్పుడూ అలవాటు కాలేదు. హాస్టల్లో నాలుగేళ్ళు ఉన్నా నాకు తెలిసి ఎప్పుడూ తిట్లు ఎక్కువగా వాడలేదు, అలాగని మామూలు తిట్లు నాకు అభ్యంతరంగా అనిపించేవి కాదు కూడా. కాకపోతే నార్తీలు ఎక్కువగా ఎవరో ఒకరిని జోడించి తిడతారు. అది మాత్రం నాకసలు పడేది కాదు. నాతో ఎవరూ అలాంటి తిట్లు వాడేవారు కాదనుకోండి.

ఇప్పటికీ నేను వాడే తిట్లు రెండే అనుకుంట...అదీ ఆంగ్లంలో s**t, f**k. అవి అనుకోకుండా వచ్చేస్తాయి.

కొత్త పాళీ said...

ఆడ పిల్లలకీ మొగ పిల్లలకీ తేడా అదేననుకుంటా - ఇప్పటిదాకా వ్యాఖ్యలు రాసిన వారిలో రాధిక గారొక్కరే ఈ టాపిక్కు జూసి బుగ్గలు నొక్కుకున్నారు :-)
మొగపిల్లలకి - నువ్వు చెప్పినట్టు - బూతులు మాట్లాడగలగటం ఒక coming of age కసరత్తు.
నాదీ ఇంచుమించి నీకున్నలాంటి పరిస్థితే బడి రోజుల్లో. ఇంట్లో శిష్ఠ వ్యావహారికం, బడి మిత్రులతో బూతుల పాండిత్యం. ఇంటి దగ్గర ఆడుకునే స్నేహితుల ముందు ఈ పాండిత్యం చూపించలేక పోతున్ణానే అని యమ బాధగా ఉండేది :-) బూతుల దాకా ఎందుకు, వీధి భాష ఇంటో మాట్లాడితే - కొట్టేవారు కాదుగానీ పురుక్కంటే హీనంగా చూసేవారు. ఇక మా అమ్మయితే వీడు ఇలా పదేళ్ళకే చెడిపోతున్నాడు అని బెంగెట్టేసుకునేది. :-)

రానారె said...

విహారి మరియు సుధాకర్ గార్లకు,
ఘాటు విమర్శలు విన్నాను కన్నానుగానీ, ఘాటైన అబినందనలు తట్టుకోవడం నాకు అలవాటు చేయాలనుకున్నట్టున్నారు మీరు. అవునా? సుధాకరా, నేను కాసింది తూగో యాసలో అని నాకు తెలియదు. :)

రాధికగారూ,
మీ మాట చాలా సంతోషం కలిగించింది. పాండిత్యం వృధాపోలేదండీ. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారుకదా మన పెద్దలు. :)

సుధీర్‌గారూ,
పది-ఇరవై మధ్యవయసులో బూతులు మాట్లాడటం ఒక కిక్కు, కదండీ?

నాగరాజుగారూ,
పాఠాలు చెప్పేటంతవాణ్ణా నేను? గురువుగారూ, అంత పాండిత్యం వచ్చాక అంత వయసూ వచ్చాక వినేవారుంటే అప్పుడు చూద్దాం ఏమంటారు?

శ్రీరామ్‌గారూ,
ధన్యవాదాలు. మీనుండి తొలివ్యాఖ్య అనుకుంటానిది. చాలా సంతోషం.

ఇస్మాయిల్‌సాబ్,
మీరన్నట్లు ఇది కాస్త రఫ్‌. రఫ్‌ అయినాగానీ మీ దయవలన ఆడుతోంది. ఈ రచన బాగుందని రెండుమూడుసార్లన్నారు. మీ అభిమానానికి అమితానందంతోపాటు కాస్త భయం కూడా కలుగుతుంది. ఖదీర్‌బాబు, శాంతినారాయణ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు మహామహులు. జీవితాన్ని లోతుగా చూసినవాళ్లు. వాళ్ల రచనల్లోని లోతు నేనందుకోవాలంటే ఈ జన్మలో సాధ్యం కాదు కదండి. వాళ్ల చదువులు జీవితానుభవపాఠాలు నేర్పివుంటాయి. మార్కులకోసం, ర్యాంకులకోసం చదివిన చదువులు నావి. వాళ్లు చదివింది లోకమనే పాఠశాలైతే, నేను చదివింది ఇరుకైన రెసిడెన్సియల్ డెన్‌లలో. వారువారే, నేనునేనే. హస్తి - మశకం. ఏమంటారు డాక్టర్?

గార్లపాటివారు, ఈ టపాలో చెప్పిన 'తిట్టుమాటలు వాడకపోవడం వలన కలిగే లాభాన్ని' మీరనుభవించారు. అయితే మీకు ఆంగ్ల సారస్వతం అబ్బిందన్నమాట.

కొత్తపాళీగారూ,
మీ వ్యాఖ్యతో ఈ రచనకు పీఠిక రాసినట్లయింది. నేను చెప్పాలని ప్రయత్నించినదాన్ని coming of age అన్న ఒక్క మాటతో మీరు చెప్పేసి - ముందుమాట - రాశారు.

సిరిసిరిమువ్వ said...

రానారే గారు
చాలా చాలా బాగా రాసారండి. మాకు రాయలసీమ మాండలికాన్ని చాలా బాగా పరిచయం చేస్తున్నారు.(తిట్లైనా భాష భాషే కదండి)
మాండలికం లో మాట్లాడటం కంటే రాయటం చాలా కష్టం కదూ?. అందులోనూ భాష కి నగిషీలు దిద్ది అరువు తెచ్చుకున్న మాటలు మాట్లాడటం, రాయటం నేర్చినాక మన సహజ భాష లో రాయాలంటే కొంచం కష్టమైన పనే.(మీకు కాదేమో)

ఒక చిన్న కోరిక--నాకు రాయలసీమ మాడలికం అంటే చాలా ఇష్టం. సినిమాలలో వింటమే కాని నిజ జీవితం లో ఎప్పడూ వినలేదు. ఒక సారి మీ రాతలతో పాటు మాటలు (అచ్చమైన మీ మాటలు) కూడా పంపించకూడదూ, విని ఆనందిస్తాము.

కొత్త పాళీ said...

సి.సి.ము గారి అభ్యర్ధనని ఇంకొంచెం బలోపేతం చేసి ఇది యావద్ బ్లాగ్జనుల డిమాండుగా మీముందుంచుతున్నాను. నీ టపాలని ఆడియో టపాలుగా పెట్టాల్సిందే.
అప్పుడెప్పుడో "స్తుతమతియైన యాంధ్రకవి" పద్యం పాడి చూపించావు, మాకు తెలుసులే.
ఇక నీ వచనాన్ని కూడా నీ మధురమైన గొంతుతో, సుతిమెత్తని యాసతో "వినాలి."

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...

బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధిపతిగా పనిచేసిన మోహన్‌గారు రాయలసీమ తిట్లు అనే అంశం మీద చాలా కాలం క్రిందట ఒక చిన్న పుస్తకం రాశారు.చూస్తే అదిరిపోతారు.అది ఒకరోజున నా బ్లాగులో JPEG గా అప్‌లోడ్ చేస్తాలెండి.

chaitü said...

మీ కథనం చాలా బాగుంటుందండి...

చిన్నప్పుడు నిజంగానే ఏదైన చిన్న తిట్టు వాడాలన్నా ఎంతో భయం గా ఉండేది... మీ వ్యాసం తో ఒక్కసారి మళ్ళీ ఆ సంగతుల్లన్నీ జ్ఞప్తికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

ఇలాంటివి ఎంతో చిన్న విషయాలలాగా అనిపిస్తాయి నిజానికి... అంతగా పట్టించుకోము కుడా... కాని ఇంత చిన్న విషయం కూడా తలుచుకుంటే ఎన్ని జ్ఞాపకాలో కదా...!!

happynadh said...

అన్నా, నెక్క అదరగొట్నావు పో...!!

సినిమాల్లో చూపిచ్చేది మా అసలు రాయలసీమ బాష కాదు, మా మాటలు వేరేగా వుంటాయని జనాలకు చెప్పినానే గానీ, ఎప్పుడూ ఇట్టుంటుందని చూపిచ్చలేక పొయేవాన్ని. ఇప్పుడు నువ్వు వోపికగా రాసి చూపిచ్చినావు. ఈప్పుడందరికీ నువ్వు రాసింది చూపిస్తాండా..!!

నాగరాజా said...

చాలా చాలా చాలా ................................ బాగుంది రానారె! నీకు నువ్వే సాటి.

spandana said...

అరెరె ..ఎలానో మీ పోస్టులను మిస్సవుతున్నా!
అదరగొట్టేశావు రానారె.
నాకైతే ఈ "*న్‌కరా" , "*న్‌కపో" లాంటివాటితో తెగ సమస్య అయ్యేది. ఆదివారం వూర్లో గడిపానంటే సోమవారం నాకు తెలియకుండానే స్కూల్లో నోంట్లోంచి వచ్చేసేవి.
మాకు హిందీ టీచరు ఓ తరహా! ఆయన పిల్లలందరినీ తిట్టడానికి ఓ సూత్రమేదో పాటిస్తాడు.
గొల్ల పిల్లవాన్ని "గొల్ల నాకొడకా"
బలిజ పిల్లవాన్ని "కారం నా కొడకా"
బ్రాహ్మణ పిల్లవాన్ని "సాంబార్ నాకొడకా"
ఇలా కులానికో పేరు బెట్టి పిలిచే వాడు (తిట్టేవాడు).

మీ తిట్ల పురాణం పుణ్యమా అని అవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి.

--ప్రసాద్
http://blog.charasala.com

swathi said...

ఇన్నాళ్ళకి చూశా.
సహజం గా ఆడపిల్లలకి ఈతిట్లు, బూతులు అంతగఆ పడవులెండి.
ఆఆఅనీ అది మగవాళ్ళల్లో అందునా పల్లెల్లో జీవితంలో ఒక సాధారణ భాగం కదా. మీరింత వివరించాక తిట్లు, బూతులు మట్లడేవాళ్ళంటే ఇదివరికున్న అభిప్రాయం మారిందిలెండి. తిట్లు కూడా భాషలోని ఒక ముఖ్య భాగం కదా.
నాకు సంబంధించినంతవరకు చెన్నై లో ఉన్న రోజుల్లో "నీ యబ్బ" అనేది మాత్రం కొద్దిగా అలవాటైంది(అక్కడ తెలుగు తక్కువగా వినటం వల్ల అలా తిట్ట్ల మీద కూడా అభిమానం కలిగిందనమాట).
చావగొట్టటం (విసిగించటం అనే అర్ధం లో) అనే పదానికి చావ దొబ్బటం అంటేనే తృప్తి గా ఉంటుంది.

సుగాత్రి said...

అమ్మాయిలకు బూతులు అంతగా పడవా? ఇది నిజమా??
మీరలా అంటూంటే ఒక జోకు గుర్తొస్తోంది:
ఇద్దరమ్మాయిలు మాట్లాడుకుంటున్నారట: "అబ్బాయిలు మామూలుగా ఏం మాట్లాడుకుంటారే?"
"ఆ...ఏముందీ? మనం మాట్లాడుకునేవే మాట్లాడుకుంటారు." దానికి మొదటమ్మాయి వికారంగా మొహం పెట్టి ఇలా అందట: "ఛీ! మరీ అంత అసహ్యంగా బూతులు మాట్లాడుకుంటారా?"

lalitha said...

సుగాత్రి గారూ,
మీరెక్కడ విన్నారో ఆ జోకు. నాకు తెలిసినంతమటుకూ
ఆడ వాళ్ళిద్దరు కలిసినా, మగ వాళ్ళిద్దరు కలిసినా
ఆడ వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు అన్న జోకే విన్నాను.

ఆడ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది తిట్లు వినడానికి కూడ
ఇష్టపడరు. ఎంత చదువుకున్న వాళ్ళైనా మగ వాళ్ళు మాత్రం ఒకటో
రెండో అయినా తిట్లు ఒక సందర్భంలో అయినా వాడని వారు నాకు
కనిపించలేదు ఇంతవరకూ.

రానారె గారు, మీరు తిట్ల గురించే రాసినా, అందరి వ్యాఖ్యలూ
చదివాక నాకూ మీ టపా చదివే సాహసం చెయ్యాలనిపించింది.
పూర్తిగా చదివాక (గలిగాక)
అభిప్రాయం ఏర్పరుచుకునే సాహసం చేస్తాను.

చాలా మటుకు నేను చిన్నప్పుడు విన్న వాటికి అర్థాలు పెద్దయ్యాక
తెలియడం మూలాన నేను హాస్య సందర్భంలో కూడా
కష్టపడతాను అవి వినడానికి. అర్థం తెలిసి అన్నా, తెలియక అన్నా,
ఏ "excuse" తో వాడినా తిట్లని ఒప్పుకోలేని బలహీనత నాది.

లలిత.

రానారె said...

సిరిసిరిమువ్వగారికి,
మాండలికంలో రాయడం కష్టమని మీరన్నతరువాత ఇదేసంగతి ఒకచోట చదివాను. తెలంగాణ మాండలికం రాయాలంటే కష్టమేమోగానీ నా భాష రాయడానికి నాకు కష్టమేముంది! రాయలసీమ మాండలికం మీకు ఇష్టమన్నారు. సంతోషం. కానీ రాయలసీమలోనే నాలుగు జిల్లోల్లో నాలుగు వైవిధ్యమైన రకాల మాండలికాలున్నాయి. ఒక జిల్లోలోనే రకరకాలున్నాయి. నేను రాసేది వీరబల్లె గ్రామ మాండలికం. అదికూడా తెలుగు పాఠకులందరికీ అర్థమయేలా జాగ్రత్తగా. ఇకపోతే సినిమాల్లో సీమ పేర ఊదరగొట్టే భాష పరమ కృతకమైనది. అది రాయలసీమ భాష కానేకాదు. ఈమధ్య వచ్చిన పందెంకోడి అనే సినిమాలో కాసింత కడపజిల్లా భాష వాడారు. ఈ సినిమా ఒకటే మినహాయింపు. ఒకమారు ఆ యాస వినిపిస్తాను (కొత్తపాళీగారూ వింటున్నారా!).

తాడేపల్లిగారూ, థాంక్యూ. అప్‌లోడ్ చేసినపుడు తప్పక తెలియజేస్తారని ఎదురుచూస్తాను.

చైతూగారు, ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకోవడానికీ, తలచుకోవడానికీ మిగిలేది చిన్ననాటి జీవిత విశేషాలే కదూ!

హ్యాపీనాధుని గోనారె, సినిమా సీమభాష ఎంత కృతకమో అందరికీ తెలియాలి.

నాగరాజాగారు, ప్రసాదుగారు మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

స్వాతిగారు, నిజమే, తిట్లు కూడా భాషలో భాగమే. సిరిసిరిమువ్వగారు కూడా ఇదే అన్నారు. తిట్టుకవిత్వమనే ఒక కవితాశాఖ ఉందికదా.

సుగాత్రిగారు, మీరు దాడికిదిగారా :-)))

లలితగారూ, ధైర్యేసాహసే లక్ష్మీ :) సాహసించి పూర్తిగా చదువాక (గలిగాక) దయచేసి మీ అభిప్రాయం తెలియజేయడం మరవకండి.

సుగాత్రి said...

లలిత గారూ!

జోకుకు జోకు బాగా చెప్పారు. :) ఆ జోకు నేను విన్నదెక్కడైనా చెప్పిందొక మగవాడు. నాకు తెలిసి పల్లెటూళ్ళలో ఆడవాళ్ళు బూతులు ధారాళంగానే వాడతారు. సాహిత్యంలో చూసినట్లైతే వ్యావహారిక భాషలో అద్భుతమైన కథలు రాసిన కథక చక్రవర్తి శ్రీపాద వారు తాను ఆడవాళ్ళు మాట్లాడుకునే మాటలను వింటూ ఉండడం వల్లే అంత చక్కటి వ్యావహారికం రాయగలిగానని చెప్పారు. ఆయన కథల్లో అక్కడక్కడా వచ్చే తిట్లు ఆడపాత్రలు వాడినవే "లాం...జ ముండా" లాంటివి. ఆడవాళ్ళు వాడే "నా బట్టా" లాంటి తిట్లు మగవాళ్ళు వాడే తిట్లకు అదనం. తిట్లలో ఇంకో శాఖ ఉంది (శాపనార్థాలంటే ఇవేనేమో?): "నీకు ధూము తగలా", "సరక తగలా" "నువ్వు నాశనమైపోనూ" "నీ నారు కుళ్ళిపోనూ", "నీ జిమ్మడిపోనూ", "సచ్చినోడా/దొంగసచ్చినోడా",... ఇవి నాకు తెలిసినంతవరకూ ఆడవాళ్ళు మాత్రమే వాడుతారు.

రానారె గారూ! దాడి కాదండీ! రాధిక గారు, స్వాతి గారు రాసింది చూసి ఆ జోకు గుర్తొచ్చింది. తెలుగు బ్లాగర్లేమంటారో చూద్దామని ఇక్కడ రాశాను. అంతే. ఇది ఎవరిమీదా దాడి కాదు. నేను తెలుగులో బూతులు వినగలను గానీ అనలేను. ప్రవీణ్ గారి లాగే ఆంగ్లంలో మనకు 'అంత' మొహమాటం లేదు. నా మూడో తిట్టు ba***rd.

ప్రసాదం said...

ఇంత బాగా రాసిన ఈ టపాను ఇన్నాళ్ళుగా మిస్ అయ్యనే, పొద్దు పుణ్యమా అని ఇప్పటికి చూడగలిగాను. బాహు బాగా రాసారు,

ప్రసాదం

Anonymous said...

చాలా బా రాసారండీ. అయినా మీరు అన్ని తిట్లకీ స్టార్ మార్క్ ఎందుకు పెట్టారు ? మా లాంటి రాయల సీమ తిట్లు తెలియని వాళ్ళకు తెలుస్తాయి కదా? వాటి వల్ల ప్రమాదం ఏమైనా వుందా ? నాకు ఆ స్టార్ మార్క్ లేకుండా మొత్తంగా ఆ పదాల్ని వాడి వుండాలనిపించింది.

నాకు బాగా నచ్చిన రాయల సీమ పుస్తకం నాయని సుబ్రమణ్యం నాయుడు గారి 'సినబ్బ కతలు '. మాండలికం గురంచి అస్సలు ఐడియా లేకుండా.. కేవలం బాపూ బొమ్మల్ని చూసి, పుస్తకం తీసుకున్నా. మొదటి కధ చదవడానికి కాస్త కష్టపడ్డాను. తరవాత ఆ ఫ్లో లో మొత్తం పుస్తకం చదివాను. ఆ తిట్లు.. ముఖ్యంగా 'నా బట్టా' మొదలైనవి చాలా రోజులవరకూ మనసు లో వుండిపోయాయి. మీ పుస్తకం అచ్చు లో వస్తున్నందుకు అభినందనలు. ఇక మీ వీరతాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది.

మీ ట్రావెలాగుళ్ళు కూడా చాలా బాగున్నై. వాట్ని కూడా ప్రచురించండి.

చిన్న రిక్వస్టు : రేడియో ప్రసారాల గురించి మీరు చాలా సార్లు ప్రస్తావించేరు కాబట్టి అడుగుతున్నాను. చిన్నప్పుడు రేడియోలో బోల్డన్ని మంచి పాటలు నేర్పించే వారు. వాటిల్లో ' పిల్లల్లారా పాపల్లార.. రేపటి భారత పౌరుల్లారా ..', 'పడవలో పడవలు, కాగితాలా పడవలు..' నాకు చాలా ఇస్టం. మరి మా విశాఖ రేడియో స్టేషనూ, కడప స్టేషనూ ఒకే లాంటి పాటలు ప్రసారం చేసేవో కాదో తెలియదు. మీకు ఈ పాటలు తెలిస్తే వాటి రచయితలూ.. స్వరకర్తల గురించి కాస్త చెప్తారా ?

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.