ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దీపావళి - చివరికి మిగిల్చేది

నాకు తొమ్మిదేళ్లప్పుడు ఒక దీపావళి పండగొచ్చింది.
పటాకుల రేట్లు జాస్తి ఐపొయినాయని పల్లెలో పెద్దోళ్లంతా అనుకొంటాండారు.
"ఈసారేంకొనబళ్లా" అంటున్నారు నిష్ఠూరంగా.

"మ్మా...పటాకులకు లెక్కగావాల" అని అమ్మనడిగితే
"నాదగ్గిర్లేదు నాయనా, మీ నాయన్నడుగుపోండి" అని సమాధానం.
నాయన్నడగడానికి యాడికోబోవాల్సిన పన్లేదు పక్కన్నే వుండాడు.
అడగాల్సిన పనీలేదూ, నేనడిగింది యింటానే వుండాడు.
కానీ అట్టమల్లుకోని యెనిక్కి చేతులుగట్టుకోని నీలుక్కోన్నిలబడి
మెడ పైకెత్తి పెంకుటింటి వసారాకిందనించీ ఆకాశంలో మోడాలుజూచ్చాండాడు.
వాతావరణం ఏంబాలేదు. ఐనాసరే, "నాయినా" మొండిగా పిల్చినా.
"ఊఁ" నిలబడినకాణ్ణుంచి మెడగూడా తిప్పకండానే అన్నాగానీ మన పని
జరుగుతుందనిపించి, "లెక్కగావాల".

"దేనికి?"
మా గోపీ నా పక్కనే వున్నాడు. వాడు నోరెత్తడంలా. సపోర్టు ఇవ్వకండా
డబ్బిస్తే పటాకులుమాత్రం కొనుక్కుంటాడని నాకు వానిమింద ఉక్రోషం.
"పటాకులకు"
"అయ్యి కొని వాటిని కాల్చడమెందుకు, లెక్క గావాలంటే యిస్తా,
తీస్కబొయి పొయ్యిలోబెట్టు, కాలిపోతుంది, పండగైపోతుంది"
నా మెహం మాడిపోయింది ఈ మాటతో. ఇదెప్పుడూ విన్లా. కొత్త కాన్సెప్టు.
గోపీకేదో అర్ధమైనట్టు గొమ్ముగా ఆణ్ణుంచి బయటికిపొయినాడు.
నేనుమాత్రం కదల్లా. మొండిగా యదవమొగమేస్కోని ఆణ్ణే నిలబణ్ణా.

మానాభిమానాలు మనకెందుకని నిలబడిన నాకు పదిరూపాయలిచ్చినారు.
పెద్ద డబ్బే. మా శ్రీ శ్రీనివాస కాన్వెంటునెల ఫీజే ఇరవైయ్యైదు రూపాయలు.
నాకిచ్చినారుగాబట్టి గోపీకీ పదిరూపాయలిచ్చినారు. ఇది నాకు నచ్చలా.
సిగ్గుమానంలేకండా సాధించినాంకా ఇంట్లో వుండబుద్దిగాక ఆ సాయంత్రం
కాన్వెంటుకుబోయి అక్కడ బండపటాకులు, కుక్కపటాకులు, చాంతాడు,
వెన్నముద్ద పటాకులు, విష్ణు,భూ చక్రాలు, రాకెట్లు, పాంమ్మాత్తర్లు
కాకారపూలు కొని కాల్చిపారేసినా. ఐపోగానే మిగిలింది ఏవిటి అంటే-
సగం కాలి చెల్లాచెదురుగా పడిన కాయితం ముక్కలు.

శ్రీధర్ గారు మన తెలుగు రచయితలమీద గీసిన దీపావళి కార్టూన్ లలో,
"చివరికి మిగిలేది" రచయిత బుచ్చిబాబుగారు ఇలా సగం కాలి చెల్లాచెదురుగా
పడిన కాయితం ముక్కలు చీపురుతో వూడుస్తున్నట్లు గీసిన కార్టూన్ నాకు
ప్రతి సంవత్సరం దీపావళి పొద్దున మన రోడ్లను చూస్తే గుర్తొస్తుంది.

మా గోపిగాడు మాత్రం చూస్తావుండిపోయినాడు. కొన్లా, కాల్చలా.
పొద్దున్నే శనివారం. వీరబల్లెలో సంత. పదిరూపాయల్తో వారం గడుస్తుంది
మా అవ్వ వక్కాకు, మా తాత బీడీలతో కూడా కలిపి.
ఆరోజు ఆ సంతకు అక్కరకొచ్చింది గోపీ ఇచ్చిన దీపావళి పదిరూపాయలు.
ఏడుపుమొగంబెట్టి డబ్బు రాబట్టి కాల్చింది నేను - వయసులో పెద్దోణ్ణి.
వాడు నాకంటే చిన్నోడు. నా మీద నాకే రోతపుట్టింది.
అదే నా చివరి దీపావళి పటాకుల సంబరం.

ఇప్పుడు నాకు డబ్బు పెద్దసమస్య కాకపోవచ్చు. ఐనా సరే
పటాకులు కొనే బదులు, సమస్యల్లో వున్న ఒక కుటుంబానికి
ఆ డబ్బును ఖర్చుపెట్టొచ్చు. భవిష్యత్తులో నా పిల్లలకు నేను ఇలా
నచ్చజెప్పగలనా... ఏమోమరి.

*** *** *** ***

ఈమధ్య ఒక స్థానిక కన్నడిగ మిత్రుణ్ణి ఫోన్లో పలకరిస్తే "హ్యాపీ దీపావళి రామూ" అన్నాడు.
చాలా ఆనందంగా "నువ్వొక్కడివేనయ్యా చక్కగా దీపావళి అన్నది.
ఫోన్లలో, ఈ-మెయిల్లో,ఛాటింగ్లో ఎవ్వడూ ఇలా చెప్పలేదు.
అందరూ దివాలీ దివాలీ ద్దివాలీ"...- అన్నాన్నేను.
"ఆ మాటంటే నాకు చిరాకు" అన్నాడు మిత్రుడు.
మహానందమైంది నాకు. దీపావళి అనలేని దక్షిణాది వాడంటే నాకు కంపరం.
సరిగ్గా నా తీవ్రతతో ఈ విషయంలో ఏకీభవించిన కన్నడిగుడొకడుండడం ఒక స్వాంతన.
ఉత్తరాదివాడు ఆ మాటంటే - దివాలీ అని - దానికొక అర్థం పర్థం.
మనం "దీపావళి" అని పలికితేనే అందం-చందం, తల్లి-బిడ్డ న్యాయం.
తెలుగోడు దీపావళి అనాలి. దీపాల వరుస లేక సముదాయం అని అర్థం.

ప్రశాంతంగా కన్నుల పండుగగా వుండే దీపావళి ఇప్పుడు కర్ణ కఠోరంగా
కళ్లు చెదిరిపోయేలా ఇంకా ముదిరి ఒళ్లు కాలిపోయేలా కూడా మారిపోయింది.

మెత్తని గుడ్డ పొత్తిళ్లలో హాయిగా నిదురపోవలసిన పసిపిల్లకు
ఆ వారం పది రోజులూ కలత నిదురే. పాపం పండగ.
శబ్దం భరించలేని వృద్ధులు అనారోగ్యంతో వున్నవారు చిన్నపాటి నరకమే చూస్తారు.
వుండుండి వచ్చే టపాకాయల శబ్దానికి నిదురలోనే వులిక్కిపడే చిన్న పిల్లాణ్ణి చూస్తే
అవి పేల్చినవాణ్ణి కోసి ఆ మాంసంతో ఊరగాయ పెట్టాలనిపిస్తుంది నాకు.

దారిలో నడిచే మనుషులకు, వాహనాలకు, చివరికి జంతువులక్కూడా
ఈ పండగ పేరుతో కలిగేది ఇబ్బందే.
కాంక్రీటుభవనాలపక్కనే నివసంచే పూరి గుడిసెలు, కొట్టాలవాళ్లు!? పాపం.
ఎప్పుడు నిప్పంటుకుంటాయోనని కంటినిండా కునుకుండదు. అదీ పండగ.

ఘంటసాల పాటొకటి గుర్తొస్తోంది: "ఇదేనా మన సంప్రదాయమిదేనా ..."

కామెంట్‌లు

Naveen Garla చెప్పారు…
ఎమబ్బా రానారె, నువ్వు బెంగళూరులో ఉంటావా ఏంది. ఒగేల ఉంటే గనక చెప్పు.
Naveen Garla చెప్పారు…
కానీ నువ్వు mail చేసే వేళలు చూస్తే..USAలో ఉన్నట్టనిస్తాదే!! నిజమేనా?
Dr.Pen చెప్పారు…
అబ్బీ,

బలే బాగా చెప్పావు.నీలో మంచి రచయిత దాగున్నాడు...
"అయ్యి కొని వాటిని కాల్చడమెందుకు, లెక్క గావాలంటే యిస్తా,
తీస్కబొయి పొయ్యిలోబెట్టు, కాలిపోతుంది, పండగైపోతుంది"

ఇది చదివి పడీ పడీ నవ్వా! నీ ఎత్తుగడ బాగుంది.గుండె ల్లోంచి వచ్చే ఆ పల్లెటూరి మాటల్ని విని అక్కడ ఉన్నట్టే ఉంది..మనస్సుని ఆహ్లాదపరిచినందుకు థాంక్స్!
అజ్ఞాత చెప్పారు…
చాలా చక్కగా రాసారు.., మీ ఊరు ఒక్కసారి మా కళ్ళముందు చూపించారు. యాస చాలా చక్కటి తెలుగులో అందించారు.. బాగుంది.
రాధిక చెప్పారు…
"అయ్యి కొని వాటిని కాల్చడమెందుకు, లెక్క గావాలంటే యిస్తా,
తీస్కబొయి పొయ్యిలోబెట్టు, కాలిపోతుంది, పండగైపోతుంది caalaa baagundandi.manci message kudaa cepparu.
spandana చెప్పారు…
"కానీ అట్టమల్లుకోని యెనిక్కి చేతులుగట్టుకోని నీలుక్కోన్నిలబడి
మెడ పైకెత్తి పెంకుటింటి వసారాకిందనించీ ఆకాశంలో మోడాలుజూచ్చాండాడు."

రానారె,
ఇది చదివి మోయలేనంతగా నా గుండె బరువెక్కింది. పొందికైన చిన్న మాటలతో అక్కడున్న మొత్తం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. రానూ రానూ యాస తీవ్రత దగ్గిందే! "చీపురు" స్థానంలో "పొరక" వాడాలేమొ!

--ప్రసాద్
http://blog.charasala.com
అజ్ఞాత చెప్పారు…
చాన బాగ చెప్పినావప్పా. మా వూర్లో నేను కోడి గుడ్డు జామున్నే లేచి నీళ్ళు పోసుకున్నట్టుగా పోసుకుని పరిగెత్తుకునొచ్చి టపాసులు గాల్చినట్టు గానే వుంది.

విహారి
అజ్ఞాత చెప్పారు…
Thanks edo cheppalani vundi kaani modati padam tappa inka emi alochana ki raavatam ledu.
uma చెప్పారు…
నేను కూడా మేలాగే నండి, దీపావళి రోజున టపాకాయలు కాల్చరాదని నిర్ణయించుకుని 2 సంవత్సరాల నుంచి కాల్చట్లేదు. కాని నేను ఇంటికి వెళ్తే మా అమ్మా, నాన్న గొడవ పెడ్తారు. వాళ్ళకి నేచెప్పేది అర్ధం కాదు. నేను కచ్చితంగా చెప్పేశా, ఇంక నేను ఒకరికి ఇబ్బంది కల్పించే ఈ టపాసులు కాల్చటాన్ని మానేస్తున్నా అని.
Myriad Enigmas చెప్పారు…
అచ్చమైన రాయలసీమ మాండలీకం లో రాయడం బాగుంది. ఇది చదువుతుంటే కడప లొ ఉన్నట్లే ఉంది. దీపావళి కి వొచ్చిన కష్టమే సంక్రాంతికి కూడా వొచ్చింది. North వాళ్ళు ఎలా అన్నా ఎమీ అనిపించదు కానీ మన వాళ్ళు కూడా దీవాళి అంటూంటే బాధగా ఉంటుంది.
రానారె చెప్పారు…
అందరికీ వందనాలు. మీ వ్యాఖ్యలు నాకెంత సంతోషం కలిగించాయో మాటల్లో చెప్పలేను.
చాలా బాగుందండీ..
మీకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
ఈ సంవత్సర కాలంగా -చక్కనిచుక్క- ఎవరైనా అగుపణ్నారా లేదా..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె