Tuesday, September 26, 2006

కంచు - కనకము - మంచి - చెడ్డ

శ్రీ శ్రీనివాస కాన్వెంట్లో నేను ఐదోతరగతి చదివేనాటి సంగతి.
మా తరగతి గది కాన్వెంటు ఉత్తరద్వారానికి ఆనుకొని వుండేది.
ఉత్తరద్వారం ఎదురుగా రోడ్డవతలున్న ఇంట్లో వీరబల్లె హైస్కూల్లో పన్జేసే టీచరొకాయనుండేవాడు.
[రెండేళ్లక్రితమే ఈ హైస్కూలు జూ.కాలేజీ అయింది]
ఆయనకు నాకంటే సుమారుగా పెద్దయిన ఇద్దరో ముగ్గురో కూతుళ్లు.
నా ఐదోతరగతి మిత్రులంతా నాకంటే వయసులో కనీసం ఒక సంవత్సరం పెద్ద.
*** *** ***
ఎందుకంటే ... ఇదీ సంగతి:
చింతచెట్టుకింద ఇసక. ఇసకమీద గాడ్రేజి కుర్చీ. కుర్చీలో నాగన్నసారు.
నాగన్నసారు చేతిలో ఈతబర్ర [లేక ఈతబెత్తం].
ఆ బర్ర దెబ్బ తగలడానికి అనువైనంత దూరంలో నాగన్నసారు చుట్టూతా పిల్లకాయలు.
ఈ రంగస్థల అధికార నామము: జిల్లా ప్రాథమిక పాఠశాల, భట్టుపల్లె గ్రా., వీరబల్లె మం.
నా నాలుగో ఏటనే నా పాత్ర ఈ రంగస్థలప్రవేశం గావించబడింది.
సాధారణంగా ఐదేళ్లు నిండిన పిల్లలను బళ్లో చేర్చేవాళ్లపుడు.
*** *** ***
శ్రీ శ్రీనివాస కాన్వెంట్లో నేను ఐదోతరగతి చదివేనాటి సంగతికి వస్తే...
మనమే క్లాస్ ఫస్టు. మనమే క్లాస్ లీడరు. మనమే మాస్టర్లకు మేడంలకూ ప్రియశిష్యుడు.
నాలుగో తరగతిలో నాకంటే మంచిమార్కులు తెచ్చుకొనే యిద్దురు పిల్లోళ్లు ఆ సంవత్సరం
మా కాన్వెంట్లో చేరకపోవడంతో ఇదంతా సాధ్యమయ్యింది.

వొగరోజు మధ్యానం అన్నం తిని ఊరికే పిట్టాయీదిలోకి అట్టా నడిసి తిరుక్కోని వొచ్చేటప్పుడు
హైస్కూల్లో పన్జేసే టీచరోళ్ళ ఇంటెనకాలకు రాగానే, మా అందర్లోకీ కొంచం ముదురైన
రామాంజులు చ్స్..చ్స్.. అని మమ్మల్ని ఆపి వినండి అన్నట్లుగా ఆ ఇంటి దొడ్డివాకిలిని
చూపిస్తూ మన సినిమాల్లో సునిల్ 'ఏయాఁ' అన్నట్లు ఒక హావం ప్రదర్శించేసరికి...

అందరం దగ్గరకు పోయి వింటే జాలాట్లో నుంచీ అంటే స్నానాలూ గట్రా చేసే పెరట్నుంచీ నీళ్లశబ్దం వస్తోంది.
దీంట్లో విశేషమేముందబ్బా అని ఒకరిమొగాలొకరం జూస్కోని రామాంజుల్ని చూస్తే ఆయన
చెవులు ఆ తలుపు పక్కన ఆనించి ధ్యానంలో ఉన్నాడు...
ఙ్ఞానోదయమైన యోగి మాదిరిగా మరొక హావం ప్రదర్శించి తద్భావమేమిటో మాకవగతమయేలోగా
దబదబదబా తలుపుబాది రయ్య్ మని కాన్వెంటు ఉత్తరద్వారం ద్వారా మా తరగతి గదిలో ప్రవేశించినాడు.
తలుపుబాదగానే లోపలనుంచీ కెవ్వ్ అని కేక. ప్రమాదం అర్థమైంది.
అర్థమైనపాటునే ఇద్దరు వుషారైన పిల్లకాయలు రామాంజులు వెనకాల్నేపరిగెత్తినారు.

నేనూ ఇంగోపిల్లకాయ ఆణ్ణేనిలబణ్ణాఁము యేంజెయ్యాల్నో అర్థమయ్యీకాక.
రోంచేపాణ్ణేవుండి దేనికైనా మంచిదని యెనిక్కితిరుక్కోని పిట్టాయీదికి బొయ్యి బద్రయ్య అంగడికాణ్ణుంచి
రాజమార్గంలో కాన్వెట్లోకి బోతే ...
హైస్కూల్లో పన్జేసే టీచరు రామాంజుల్ని జుట్టుబట్టుకోని మోదింది మోదిందే, పక్కనే
రామాంజులు యనకాల పరిగెత్తిన వుషారైన పిల్లకాయలకు నర్సిమారెడ్డిమాస్టర్ చేతిలో
ఈతబర్రల పూజ... బర్రలు చీలిపొయ్యిందాఁకా జరుగుతానేవుండాది.

ఒణుకు మొదులైపోయింది నాకు. అసలే నర్సిమారెడ్డిమాస్టర్.
నాతప్పేమీ లేదని చేప్పుకొనే ఛాన్సివ్వడు. ఇంకా రెండు బర్రలు అందుబాట్లో వుండాయ్.
చేత్తో కొట్టినా బర్రతో కొట్టినా రాబోయే 48గంటల్లో మన ఆరోగ్య పరిస్థితుల్లో చెప్పుకోదగ్గమార్పేమీ వుండబోదు.
ఆ తలుపుతట్టడం అల్లకల్లోలసముద్రంలో చేపలవేట అని రామాంజులుకు వాతావరణ సూచన అందినట్టులేదు.
ఇప్పుడు వీపున వాతలు వరదలై పొంగుతాండయ్.

రామాంజులు దుర్మార్గుఁడేమీ కాదు.
మెదడు పరిణామక్రమంలో మాకంటే కొంత ముందుండటంతో ఆడపిల్ల స్నానంచేస్తుండొచ్చని ఊహించినాడు.
అంతే. ఆ పని చేసుండాల్సిందికాదనితెలిసేంతగా మెదడు పరిణామం చెందలేదు.
అది చెడు అని, ఇది దాని పరిణామనీ రామాంజులుకు మాకూ కఠిన పాఠం ఇది.
ఆ సమయంలో ఆ బృందంలో వుండడం నేను చేసిన మహాపరాధం.
*** *** ***
నావంతు వచ్చినపుడు నర్సిమారెడ్డిమాస్టర్ అన్నాడు "చెడు సావాసం చెరుపు. తస్మాత్ జాగ్రత్త".
అతరువాత నాకనిపించింది "ఆ... చెడు సావాసం వల్ల చెరుపు అనేదేమీ లేదు.
ఆ ప్రభావం నామీద పడదు. ఆమాత్రం అదుపుంది నా మీద నాకు"
*** *** ***
ఈ అభిప్రాయం కూడా మార్చుకొన్నా - కఠిన పాఠం లాంటిదేమీ లేకుండానే.
1998 అక్టోబర్లో గాంధీగారి ఆత్మకథకు తెలుఁగు అనువాదం పుస్తకం ఒకటి దొరికింది.
అందులో వుంది - గాంధీ కూడా ముందు నాలాగే అనుకొన్నాడు. అనుభవంమీద తెలుసుకొన్నాడు.
ఆయన కంటే మనసుపై అదుపున్నోణ్ణికాదని అర్థమైంది. కఠిన పాఠాలు చేదు అనుభవాలు నాకొద్దనిపించింది.
*** *** ***
సజ్జనుల సాహచర్యం చేసే మేలును గురించి కొత్తగా చెప్పుకొనేదేముంది...
మన శతకాలు, భారత, భాగవత, రామాయణాలన్నింటిలో ఈ ప్రస్తావన వుందిగదా.

18 comments:

నవీన్ గార్ల said...

సానా బాగా సెప్పినావబ్బా. నువ్వు నీ కత సెప్పే తీరు సానా మంచిగుండాది. ఇట్టాగే బ్లాగుతూండు.

Ramanadha Reddy said...

సంతోషం. మీమాటను నా మిత్రుడొకరు ఇలా పూరించాడు "ఇట్టాగే బ్లాగుతూండు, ఏదో ఒకరోజు నీకు మూడుతుంది అన్నట్లుంది" :))

Anonymous said...

రామ నాధ రెడ్డి గారు,

మీరు చానా మంచిగా చెప్పినారు. అచ్చమైన భాషలొ స్వచ్చంగా వుంది.
మీ భాష మార్చకండి. భావం అద్భుతం గా వుంది.
ఇట్లాంటి బ్లాగ్ కోసం ఎదురు చూసే పిల్లకాయళ్ళో నేనొకడ్ని.
నేను ఇట్లాంటి భాష కోసం ఎబ్బుట్నుంచో చూస్తావుండ.
మీరు నాకన్న పెద్దొళ్ళో కాదో తెలీదు కాని మీరిట్లాగే
బ్లాగండి.

విహారి
http://ideenaamadi.blogspot.com

kiran kumar Chava said...

blaaguMdi

Anonymous said...

గా ఈరబల్లెకు బోవాలంటే ఎట్లబోవాలె నాయనా? ఇటేపా అటేపా? గాడ నాగ్గూడ సదువు జెప్తరు గదా!!!

చేతన said...

చాలా.. బాగున్నాయి (సొంతంలో సునీల్ "చాలా .. క్లోజ్" శైలిలో) :-). మీ చెప్పే విధానం, భాషా రెండూనూ.

spandana said...

"నాలుగో తరగతిలో నాకంటే మంచిమార్కులు తెచ్చుకొనే యిద్దురు పిల్లోళ్లు ఆ సంవత్సరం
మా కాన్వెంట్లో చేరకపోవడంతో ఇదంతా సాధ్యమయ్యింది"
ఇది బాగ సెప్పినారు!
--ప్రసాద్
http://www.charasala.com/blog/

Ramanadha Reddy said...

మీ మాట విని (చూసి) నాకు నవ్వాగలేదు. ఎదురుగా వుంటే అడుగుదామనిపించింది- ఎందుకండి మీకంత సంబరం? ఉన్నమాట చెప్పినా నేను.

చేతన said...

రెడ్డిగారూ, ఇంతకీ మీరు ఎవర్ని ఉద్దేశించి అన్నారు?

Anonymous said...

భేషుగ్గా బ్లాగారు. బహు బాగు బ్లాగు.

Ramanadha Reddy said...

చరసాల గారిని ఉద్దేశించి. మీ కామెంట్ కు సంతోషం. నేనూ సునిల్ dialogue delivery కి timing కి అభిమానిని.

చేతన said...

నేను అడిగింది నా కామెంట్‌ని ఉద్దేశించా అని కాదులెండి :-) ఎవరి గురించో అర్థంకాక..

అనిల్ చీమలమఱ్ఱి said...

అబ్బాయా! శాన మంచిగ శెప్పినావ్...

పిల్లకాయలు అంటె అమాత్రం సందడి, సేయరా ఏంటి?

రెడ్డీ, నువ్వు మోరీ కాడ కూర్చొని బీడీలు తాగిన సంగతికుడా చెప్పబ్బా....(తమాషాకి)

అనిల్ చీమలమఱ్ఱి
http://aceanil.blogspot.com

సుధాకర్ said...

మీ ఆటోబయోగ్రఫీ చాలా బాగుందండి, ఛా ! నాకిలాంటి బాల్యం లేదేంట్రా బాబు అనిపించేంతగా...

Ramanadha Reddy said...

నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు, నా కుటుంబ నేపధ్యం, అప్పటి మా పరిస్థితులు, విషయం గ్రహించగల మెదడు - ఇవన్నీ కలిసి ఒక ఆసక్తికరమైన బాల్యం కుదిరింది. నేనదృష్టవంతుణ్ణే. కానీ ఈ ఫీలింగ్ ఇటీవలి సంవత్సరాల్లో తవ్వకాల్లో బయల్పడింది. ఇన్నేళ్ళూ బతుకుదెరువుకై చదువుబరువులో గడిచిపొయినయ్. మీరూ తవ్వకాలు ప్రారంభించండి ;)

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

చాలా బాగా రాసారు కానీ ఈ కథలో సునీల్ హావభావ ప్రస్తావన కన్నా మీరే ఆ ఎక్స్ ప్రెషన్ ని పదాల్లో వివరించి ఉంటే బాగుణ్ణు.ముఖ్యంగా మీ కథ కాల పరిమితిపై కూడా ప్రభావం చూపిస్తుంది.సునీల్ సార్వకాలీనతపై మీ కథ కాలం ఆధారపడుతుంది.సార్వజనీనత పోతుంది.బాల్యం ఎప్పుడైనా ఎక్కడైనా బాల్యమే గాని సునిల్ ఎప్పుడైనా(అనుమానం) ఎక్కడైనా(ఖచ్చితంగా) సునిల్ కాదు
సార్వకాలీన సార్వజనీనమస్తు
---సంతోష్ సూరంపుడి
9/10

రానారె said...

సంతోష్ గారు, మీ(సూచన)కు అనేక కృతజ్ఞతలు. దాదాపు రెండేళ్ల ముందరి టపా ... మళ్లీ ఇప్పుడు చదువుతూ వుంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి నాకే నవ్వొచ్చింది.

పూర్ణిమ said...

గాంధీగారిని అప్పటి వరకూ.. "అవతార పురుషుడు" అంటూ అనుకునేదాన్ని. ఆయన ఆత్మకథ చదివాకా.. మామూలు మనిషి కూడా... "మహాత్ముడు" కాగగలరని తెలుసుకున్నా. మీ టపా చదివితే.. నాకదే జ్ఞాపకం వచ్చింది.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.