Wednesday, June 24, 2009

అలాల్ - ముద్దార్

"కోళ్లను అమ్ముకుంటే లెక్కొస్తాది. కోసుకుంటే యేమొచ్చా౨దీ?" ఇది మాయమ్మ చెప్పే మాట.

చెప్పాల్సిన పన్ల్యా. అమ్ముకుంటే లెక్కొస్సాదని అందరికీ తెలిసిందే. కోసుకుంటే ఏమొచ్చా౨ది? గుడ్లకోడి పులుసు వొగిరిచ్చుకుంటా తినేవోళ్లందరికీ తెలుసు మజా. ఎంత తెలిసినోళ్లకైనా సరే, ఇంట్లో ఎన్ని కోళ్లున్యా సరే, మాంచి గుడ్లకోడిపెట్టను కోస్కోని తినాలంటే గుండెనిబ్బరం కావాల్సిందే. ఎందుకంటే దాన్ని అమ్ముకున్యా లెక్కే. గుడ్లుబెట్టనిచ్చి పొదగబెట్టినా లెక్కే. సరివేలుకిచ్చినా లెక్కే.

రోగాలకూ బావురుబిల్లులకూ ముంగీసలకూ గద్దలకూ డేగలకూ పొయ్యేటియి పోతాండఁగా, పుంజులూ పెట్టలూ బొమ్మెలూ పిల్లలూ అన్నీ కలిపి రోంత అటూయిటూగా నూటాయాబై కోళ్లదాకా వుంటేటియ్యి మా ఇంట్లో.

అది మామిడికాయల కాలం. మా అమ్మమ్మా-తాతా మా ఇంటికొచ్చి, నాల్రోజులు వుండమంటే వున్యారు. మా తాత మధ్యానం పూట సేరు నిండా వొడ్లు ముంచుకొని, మా ఇంటి ముందరి మామిడిచెట్టు కాణ్ణించి పెద్దమామిడి చెట్టుదాకా, ఒక సుట్టు వొడ్లు జల్లి బబ్బబ్బబ్ అని పిలిస్తే... యేయే చెట్లకింద, పాదులకింద, కాలవల్లోనో యారకతింటా వుండే కోళ్లన్నీ రెపరెపరెపా రెక్కలు కొట్టుకుంటా ఎగిరొచ్చి వాలిపొయ్యేటియి.

బొమ్మెలు పెద్దకోళ్లకు బయపడతా గబగబా పొడసక తినేటియ్యి. పెద్దకోళ్లు ఆ బొమ్మెలను తరిమితరిమి పొడిసేటియ్యి. పుంజులయితే, రోంత సక్కదనం కుదిరిన పెట్టబొమ్మెలను చేరబిలుస్తా, తమ సంపాదనంతా తెచ్చి పెడతాన్నిట్టుగా 'ఇదో ఈ గింజ తిను, ఇదో యీడొకటి వుంది సూడు, ఇదో ఈ గింజలన్నీ నీకే, మొత్తం ఈ ఐదెకరాలూ నీదేననుకో' అన్నిట్టుగా తినిపిస్తా తినిపిస్తా, వాలుగా వొక రెక్క జారవిడిసి తొక్కులాడేటియ్యి. ఆ పెట్టబొమ్మెలు ఇదేమీ పట్టనట్టుగా గింజల పొడుస్తా వుండేటియ్యి.

ఈ సందట్లో అన్యాయమయిపొయ్యేది పుంజుబొమ్మెలూ, అప్పుడప్పుడే యారదోలబడిన కోడిపిల్లలూ. అందుకని వాటికి దగ్గరగా ఒకట్రెండు పిడికెళ్లు సల్లేవోడు తాత. ఏదోవొక కోడి వచ్చి తన్నేలోగా గబగబగబా తినేటియ్యి ఈ పిల్లలు. వీటన్నిటికీ దూరంగా పిల్లలకోళ్లకు ప్రత్యేకంగా నూకలు. ఆ కోళ్లల్లోనూ తన్నులాటలే. ఆ కోడిపిల్లలనూ ఈ కోడి, ఈ కోడిపిల్లలను ఆకోడీ పొడిసి పారేసేటియ్యి.

ఈ సంబరమంతా చూస్తావుంటే లెక్క కండ్లముందర కనిపిస్తాండ్లా! ఇంత లెక్కొస్సాంది గదా అనే ధైర్యంలో వొగ గుడ్లకోడిపెట్టను కోస్కోని తినాల్నని నేనూ మానాయనా తీరుమాణించినాం.

********** **********

తెల్లారింది. వొక గుడ్లకోడిపెట్ట తప్ప మిగతా కోళ్లన్నీ మేతకు బొయినాయి. ఆ గుడ్లపెట్ట గంప కిందనే వడ్లగింజలు తింటావుంది. దాని రాళ్లకడుపు నిండింది. గంపలోనుంచీ బైటికి తీసి, గుడ్డ పేలికతో కాళ్లు కట్టేసినాం.

సాకలామె వొచ్చి బోకులు తోమిచ్చింది. మాసిన గుడ్డలు మూటగట్టింది. మొగుడు పాలుమాలినాడని చెప్పింది. సాకలోడు రాలేదని కోణ్ణి కోసేది మానుకుంటామా! అసలు కోణ్ణి కోసేది నేర్చుకోవాల్నని నాకూ చాన్నాళ్లుగా వుండాది. 'కత్తి జారిందంటే వేళ్లు తెగుతాయి వొద్దు' అంటానే వుండాది మాయమ్మ.

కోణ్ణి కోసేది తరవాత మాట. ముందు దాని గొంతు కొయ్యాల గదా!

'కోసేజ్జాం పాండి' అంటి నేను.

'ఊళ్లేకి బొయ్యి అలాల్ జెయ్యిచ్చుకోని రమ్మ'నె మాయమ్మ.

'అలాలెందుకు మనమే కోస్కుందాం'

'అమ్మమ్మోళ్లు ముద్దారు తినరు'

'ఏమి?'

'మనమంతా మస్తాన్ సామి దర్గాకు పొయ్యొచ్చినప్పటి నుంచి ముద్దారు తినరు'

'ముద్దారు ముద్దారు అనగాకు మా, అదేందో తినగూడనిదైనట్టు'

'మీకూ మీ నాయనకూ సరే, అమ్మమ్మకూ తాతకూ ముద్దార్ పనికిరాదు. తొందరగా పొయ్యి అలాల్ చెయ్యిచ్చుకోని రాపో. పొద్దెక్కిపాయ!'

'సాయిబులు అసలు మన వూళ్లోనే లేని కాలంలో యాడిది మనకీ అలాల్? మన తాతముత్తాతలంతా ...'

'మర్యాదగా అలాల్ చేయిచ్చుకోనొస్తావా, ల్యాకపోతే యేమన్నా కావాల్నా?'

కోడికూర ఉడికేదాఁక ´యేమన్నా´ ఏమీ తినగూడదనుకున్యా కాబట్టి, కోణ్ణి సంకనేసుకొని ఈరబల్లెకు బోతి. అప్పుటికే రెండు బారల పొద్దెక్కింది. యండ చరచర మంటాంది. మసీదు కాడికి పొయ్యి, ఆ గోడపక్కన సందులో నిలబడితి వొట్టిచాపలాయన కోసం.

రోజూ మసీదులో అజా౨ ఇచ్చేదీ, ఆ తరవాత ఎవురైనా కోళ్లు పట్టుకోనొస్తే అలాల్ జెయ్యిచ్చేదీ ఆయనే. శనివారం శనివారమూ సంతలో వొట్టిచేపలు అమ్ముతాడు కాబట్టి ఆ సాయిబూ పేరు వొట్టిచాపలాయన అయ్యింది. అసలు పేరేందో ఆయనకే తెలియాల.

********** **********

ఆ సందులో యంత సేపు యండలో నిలబణ్ణా వొట్టిచాపలాయన రాలా. యండ మాత్రమే ఐతే తట్టుకోవొచ్చు. ఆ సందు దిగితే సర్కారుతుమ్మచెట్లు, పక్కనే కుంట. పొద్దన్నే ఆ సందంతా సాయిబూల, కోమటోళ్ల పిల్లకాయలూ ముసిలోళ్లూ పొద్దన్నే గొబ్బెమ్మలు పెట్టిపోతారు. వాళ్లు పొయినాఁక పందులొచ్చి పోతాయి.

ఇంతేగాదు. ఇంగోటుండాది. ఎంతైనా మనం రెడ్డేరి పిల్లకాయలం కదా! కోణ్ణి సంకలో బెట్టుకోని వూళ్లో అందరికీ కనబడితే బయసినం గదా! మన యింటికాడ మనమెట్టున్యా అడిగేవోడుండడు.

మామూలుగా భట్టుపల్లెలో ఐతే అసాన్‌ను పిలవనంపితే ఇంటికొచ్చి కోసిచ్చి పొయ్యేవోడు. భట్టుపల్లెకాణ్ణించి మా సంతనానికి (సంత వనానికి) మారినాఁక, అసాన్ లేడు. కోణ్ణి కొయ్యాల్నంటే, వుంటే మా సాకలోడు, ల్యాకంటే మేము జేసిందే అలాల్. స్టీలుగిన్నెలో నాలుగు ఉప్పురాళ్లు యేస్కొని రక్తం కూడా పట్టుకోడమే. కాలం కొద్దీ యెవురైనా!

ఈ వొట్టిచాపలాయన వొచ్చేటిగా లేడని, మసీదు సందులోనుంచి లోపలికిబొయ్యి గడిగోట రోడ్డుమింద ఆయన ఇంటికెదురుగా నిలబడితి. యండ నేరుగా నా మొగానికే కొడతాంది. నేనెవురో వాళ్లకు తెలీదు. మాతో వాళ్లకు పనేమీ లేదు.

గడిగోట బస్సు దుమ్ము లేపుకుంటా వొచ్చి, నాకూ వొట్టిచాపలాయన ఇంటికీ నడుంగా నిలబడె. నా మొగమంతా దుమ్ము, జుట్టంతా దుమ్ము. బస్సులో నుంచి దిగేవోళ్లు దిగిరి, యెక్కే వో ళ్లెక్కిరి. బస్సు కదిలి, పోయ.

వాళ్లింటి అల్లుడేమో, ఇంటిముందర మంచంమీద పండుకోనుండాడు. వొట్టిచాపలాయన కనబళ్లాగానీ, వాళ్లింట్లోనుంచి ఎవురోవొగరు బైటికి వొస్తానే వుండారు పోతానే వుండారు. 'కోణ్ణి అలాల్ చెయ్యాల, ఇంట్లో యెవురైనా వుండారామ్మా' అని అడిగితిమనుకో, ఆ ఇంట్లోవాళ్లు పెడసరంగానో ఈసడింపుగానో మాట్లాడితే పడొద్దా!? మనమే వాళ్లింట్లోకి తొంగిచూసి 'వొట్టిచాపలాయన ఉండాడామ్మా' అని అడగాలంటే జంకు.

ట్రాక్టర్లు, ఇటికెల బండ్లు, వరిగెడ్డి బండ్లు, బస్సులు వస్సాండాయ్ పోతాండాయ్. పొద్దు ఇంగో బారడు పైకెక్కింది. నేను ఆణ్ణే నిలబడుకోనుండా. నీళ్లు దప్పికైతాండాయ్. నాతోపాటు గుడ్లకోడి. సచ్చే ముందుకాడ పాపం దానికీ నీళ్లు ల్యా. ఇట్టగాదులే అని నేరుగా రోడ్డుదాటి వొట్టిచాపలాయనోళ్ల ఇంట్లోకే బోతి.

వాళ్లింట్లో మాంసం కూర మసాలా వాసన. ఆ వాసనకు నాకు నోట్లో నీళ్లు వూరిపాయ. 'ఇంట్లో ఎవురైనా వుండారామ్మా' అని క్యాకేస్తి. 'ఎవురోళ్లు' అని లోపలినుంచి వొక ఆడామె గొంతు. నేను ఫలానా అని చెప్పుకునే పరిస్థితి గాదు. 'కోణ్ణి అలాల్ జెయ్యిచ్చుకుందామని వొచ్చినా'నంటి. 'తింటాండాడు. రోంచేపు బైటుండు, వొస్సాడు'

********** **********

రోంచేపు గాదు, యంచేపయినా వొట్టిచాపలాయన ఇంట్లోనుంచి బైటికిరాల్యా. మల్లా అడిగితే ఏమంటారో అని గమ్మున నిలబడుకోనుంటి. పో..ఇంచేపుటికి నెత్తిన టవలు, చేతిలో కత్తి, చెమ్ము, చెమ్ములో నీళ్లతో వచ్చె.

కోణ్ణి యల్లకిలా తిప్పి, కాళ్లకుండే గుడ్డ పేలిక కట్లు తెగ్గోసి, కాళ్లూరెక్కలూ కదలకండా పట్టుకోమని నాకుజెప్పి, దాన్ని నోరు దెరిసి, రోన్ని నీళ్లు బోసి, తల పట్టుకోని కసాకసామని దాని గొంతు సగానికి కోశ.

కోడి గిజగిజా తన్నుకుంటాంది. నెత్తర రోడ్డుమిందికి చిమ్మి పారతాంది. సుమారైన కుక్కపిల్ల ఒకటి రక్తం కోసం రాబోతా వుంది. కోడి కాళ్లూ రెక్కలు ఊడిపోకండా పట్టుకోవడం నావల్ల కాలా. పో..ఇంత నెత్తర పొయినాఁక దాన్ని యిసిరి రోడ్డుమిందికి పారేశ. కోణ్ణి కోసినప్పుడు మెడ విరిస్తే మెదడుతో సంబంధం తెగి పెద్దగా నొప్పి తెలీదు, పెద్దగా గింజుకోకుండా తొందరగా పానం పోగొట్టుకుంటాదని మా నాయన చెప్పిన్యాడు. అలాల్ చేసేవోళ్లు మెడ పూర్తిగా కొయ్యనూ కొయ్యరు, యిరిసెయ్యనన్నా యిరిసెయ్యరు.

కింద పడఁగానే, టపటపా రెక్కలు కొట్టుకుంటా రెండు కాళ్లమిందా లేసి పడతా లేస్తా రోడ్డెమ్మడీ పరిగెత్తబట్టింది. కుక్కపిల్ల రోడ్డుమింది నెత్తురును వొదిలిపెట్టి కోణ్ణి నోట కరుసుకుపోవాలని యంటబడింది. కుక్కను అదిలిస్తా నేనూ వొట్టిచాపలాయనా. మా యనకాల ఇంగో మూడు కుక్కలు. మొత్తానికి మా గుడ్లకోడి కుక్కలపాలు గాకుండా చేతికి దొరికింది.

వొట్టిచాపలాయన కత్తికి మల్లా వొగసారి పనిబెట్టేతలికి, తలకాయ యాలాడేసింది. యాలాడిన దాని తలను రెక్కసందులోబెట్టి, కాళ్లూరెక్కలూ కలిపి చాతబట్టుకొని మసీదు సందు గుండా, కుంటకయ్యల్లో పడి మా ఇంటికి జేరితి. ఇంటికి పోఁగానే మాయమ్మ, ¨రోంత పొద్దుండఁగా వొచ్చినావే నాయినా!" అని నిష్టూరం జేసి, "నూరిన మసాల గూడా ఎండిపోతాంది, దాన్ని వొలిచేదెప్పుడు, కాల్చి కోసేదెప్పుడు, ఉడకబెట్టేదెప్పుడు?" అంటా నా చేతిలోనుంచి తీసుకుండె.

మన కోణ్ణి మనమే కోసుకొనుంటే, ఈ యాళకు బంగారట్టా పులుసుజేసుకొని, ఉడుకుడుగ్గా తింటాండాల్సింది గదా! మనకు చాతనైన పనికి ముద్దార్ అని పేరుబెట్టి, పొద్దన్నుంటీ నన్ను యాష్ట(వేసట)బెట్టి, ఇప్పుడు మల్లా పోటుమాట లాడతాందని నాకు కొపమొచ్చింది. వొచ్చిందంటే అంతా ఇంతా కోపం గాదులే. ఆరోజు మద్యానం మిగతావోళ్ల సంగతేమోగాని, నా నాలిక్కు మాత్రం గుడ్లకోడిపులుసు రుసిగా తగల్ల్యా.