ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తాతగారి అనుపమితోపమానము

పన్ల కాలం. అందురూ మడికాడికి బొయినారు. అన్నదమ్ములమిద్దరమూ ఇంటికి కావిలి. మాక్కావిలి మా తాత. పొద్దన్నుంచీ సింతసెట్టుకింద నిలబడి సూచ్చాండాం, ఆడుకుండేదానికి పిల్లకాయలెవురన్నా వచ్చారేమోనని. యంతసేపు జూసినా వొక్కడూరాల్యా. మేమిద్దరమే రోంచేపు ఏమన్నా ఆడుకున్యామంటే అది కొట్లాటే. ఊళ్లో పిల్లాపెద్దా అందురూ పన్లకు బొయినిట్టుండారు. వొగ మనిసిగాని గొడ్డూగోదాగాని యెవురేగాని బైట కనపరాల్యా. వడగాలికి సింతసెట్టు కింద నిలబడుకొనుంటే కంసలోల్ల యీరయ్య కొలిమికాడున్నిట్టు అగ్గి సెగ. పడమటగాలి. గాలితోలే సద్దు తప్ప వొక్క పక్షిగూడా యాణ్ణేగాని కూత గూడా బెట్లా. కోళ్లు మాత్రం ఇంటి ముందరుండే సర్కారుకంపచెట్లల్లో చెదులు కోసం చిదుగుతాండాయి. ఉన్నిట్టుండి పెద్దకోడిపుంజు దిగ్గునలేసి బెదురుగా నిలబడె. బొమ్మెలన్నీ యెక్కడియ్యక్కడ నిల్చిపొయ్యి మెడలు పైకెత్తి బీతుగా దిక్కుల్జూశ. పెద్దపుంజు వొగ కన్నుతో ఆకాశంకల్లా తేరిపారజూస్తా సన్నగా కుర్‌ర్‌ర్రుమనె. అట్లనేటప్పుడు దాని ఈకలన్నీ మెరుగుతగ్గి వొంటికి అంటగరసకపాయ. బొమ్మెలన్నీ యెప్పుడు దూరుకున్యాయో యెనుముల కొటంలేకి దూరుకున్యాయ్. పెద్దపుంజుతోపాటుగా పిల్లలకోడిగూడా వసారాలోకి దూరె. "గద్దకయ...

నాలుగు నల్లలారీలు - ఆరు యర్రలారీలు

తోటలోకి లారీ వొచ్చింది. మా(మి)డికాయల కాలంలో తప్ప మా ఊళ్లో లారీ అనేటిది కనపరాదు. మాడికాయలు తప్పితే లారీల్లో మోసకపొయ్యేంత పంట ఈరబల్లె మండలంలో ఇంగోటి లేదు. చెనిక్కాయలుగానీ ఒడ్లుగానీ పొద్దుతిరుగుడు గింజలుగానీ ట్రాక్టరుతొట్టి నిండితే గొప్పసంగతి. తోటలన్నీ ఎక్కువగా రైతులవి. కొనేటోళ్లు ఎక్కువగా సాయిబూలు. మాడితోటల్లోకి లారీ వొచ్చిందంటే పీర్లపండగ మెరవణి మాదిరిగా ఉంటాదనుకో. అందరికీ లారీని దెగ్గిర నుంచీ సూడాలనుంటాది. పనిబడి పిలిస్తే పలక్కండా బొయ్యేటోళ్లంతా లారీ వచ్చిందంటే పాలెగాళ్లైపోతారు. ఈ కొత్త పాలెగాళ్ల పెత్తనం ఎవురి మిందనో గాదు, ఊరి పిల్లకాయల మిందనే. ఒగటే అదిలింపులు... "రేయ్ దూరంగాబోండ్రా, టైర్లకింద బణ్ణారంటే పిసురైపోతారు, పడ్తే మల్లేం ల్యా నా కొడకల్లాలా, రేయ్ గుండునాయాలా, రోయ్, ఓరి గుండోడా, ఏమిరా నాయాండ్లాలా సజ్జామని వచ్చినారేమిరా, పోండిదూరంగా, ..." తోటగల్ల పెద్దమనిషి గనక దగ్గర్లో ఉన్యాడంటే పెత్తనం పెద్దరికంగా మారిపోతుంది - "సూడున్నా పిల్లనాకొడుకులు చెబితే యింటాండారేమో, మన తోటకాడ ఏమన్నా అయితే మనకేగదా మచ్చ, యీళ్ల నాయనగార్లకు జవాబు జెప్పేదెవురు, ...". కాయలన్నీ లారీకి లోడెత...