అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని పెద్ద ఖగోళ శాస్త్రవేత్త మాదిరి ఆలోచనలో ఉండగా మా నాయన పాట మొదలు పెట్టినాడు నేను పలకడం మొదలుపెట్టినా. *** *** *** తెల్లారేసరికి భట్టుపల్లె లో నేనో ఘంటసాల, నా పేరు కాదరయ్య ఐంది. విజయవంతంగా రాకెట్ ప్రయోగించిన అబ్దుల్ కలాం మాదిరిగా సంబర పడి ఉంటాడు మా నాయన బహుశా . ఆ పాటతో నాకు వచ్చిన గుర్తింపు ఆ తరువాత కూడా కొనసాగుతూ ఉంది. బెస్తోళ్ళ పెద్దోడు ఇప్పటికీ నేను కనబడితే "ఏం కాదరయ్యా బాగుండా(వా)?" *** *** *** చిన్నప్పటి నుండి "ఓ పెద్దోడా...!!" అని అరవడమే అలవాటైంది పెద్దోడు నిజెంగానే నా కంటే వయసులో చానా పెద్దోడని తెలిసేసరికి పిలుపులో మార్పు ఎబ్బెట్టుగా ...
మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!