Saturday, October 31, 2009

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం.

అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా.

"నిజ్జంగా?!!!"
"నిజ్జంగానే"

"ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు."
"ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్."

"ఓహో..."
"పూర్వం బస్సుల్యాడియ్యి?! అంతా నటరాజా సర్వీసే"

"ఎంతదూరం?"
"గబగబా నడిచ్చే అంతా రెండుగటల్లోగానే పల్లెలో వుంటాము"

"ఐతే బస్సుదిగి నడుస్చాం పట్టు"
"ఈ యండకా? ఈ కాలం పిల్లకాయలు తట్టుకోలేరులే"

"ఇంతున్నెప్పుడే నేను బట్టుపల్లెకు నడిసినా. పాలెంపలం కాణ్ణించి."
"..."

కిటికీ నుంచి మొగం తిప్పి, చిన్నాయనకల్లా చూస్తి. ఆయన అవతలికి చూస్తాండాడు. ఆ పల్లెలో బస్సు నిండిపోయింది. తలమీదిగా గుడ్డకప్పుకొని గొంతుకింద ముడేసుకున్నామెకు ఆ జనంలోగుండా దారిజేస్తా, సంకన సన్నబిడ్డతో వొక పెద్దామె లోపలికి వస్చాంది. అమ్మాకూతుర్లయ్యుంటారు.

"యీడ కుచ్చోండిమ్మా" అంటా లేసి నిలబడె చిన్నాయన. నేనూ లేసి నిలబడితి. అమ్మాగూతుర్లిద్దరూ వొచ్చి సీట్లో కుచ్చుండ్రి. పెద్దాయమ కూతురిని కిటికీపక్కన కుచ్చోబెట్టి బిడ్డను ఒళ్లో పండుకోబెట్టి, వైరుబ్యాగును కాళ్లకాడ సద్దుకుని కుచ్చుండె.

నేను పెద్దాయమ పక్కన్నే నిలబడితి. జనం చానా జాస్తీ ఐపొయిరి. అప్పుటికే నాలుగుబారల పొద్దెక్కడంతో చమటలు కారిపోతాండాయి. రోంచేపుటికి బస్సు కదిలె. లోపలికి పోండియ్యా లోపలికి పోండిమ్మా టికేట్ టికేట్ అనుకుంటా కండక్టరు జనాన్ని తోసుకుంటా వచ్చేగొదికీ, నా ముందర నిలబడుకోనున్న ఒక లావూటాయన నా మెడమీద మోచేత్తో పొడిశ. నొప్పికి "అబ్బ" అని, చిన్నాయనకల్లా చూస్తి. లావూటాయన్ను జూసి మా చిన్నాయన కోపగిచ్చుకోకండా, "ఇంగ రోంత పెద్దోడైనాక మావోనితో కలబడుదువులే పెద్దాయనా" అనె. "సూసుకోల్యా సామీ.." అని నాకన్నా శానా నొప్పిపడె లావూటాయన. బాధపడి గొమ్మునుండకండా, సీట్లో కుచ్చోనున్నె పెద్దాయమను రోంత జరిగి నన్ను కుచ్చోబెట్టుకోమనె. ఆ పెద్దాయమకు సీటిచ్చింది మేమేగదా, ఆయమ రోంత కాళ్లు జరుపుకొని కూతుర్ని జరగమని నాకొక్కరొవ్వ స్థలమిచ్చింది పాపం. నన్ను మరీ సోకరాని జొన్నగింజనుజేశ. ఆయమ ఇస్తే మాత్రం నేనెట్ట కుచ్చునేది!? నేను కుచ్చోలా.

"నీయట్టా పెద్దోళ్లపక్కన కుచ్చోడులేమ్మా, వొగిసులో వుండే ఆడపిల్లోళ్ల జతనైతేనే కుచ్చుంటాడు మావోడు"
"అంతేనంటా..?" అనె లావూటాయన.

ఆ మాటకు ఆ పెద్దాయమతోపాటు ఆ సుట్టుపక్కలున్న జనమంతా యిరగబడి నవ్విరి. ఎందుకు నవ్విరో కనుక్కొని యింగా గట్టిగా నవ్విరి చిన్నాయన మాట యినబడనోళ్లు. ముందుసీట్లలో వున్నోళ్లు తిరిగి సూసిరి. వొంట్లోని నెత్తరంతా మొగంలోకొచ్చినట్టైపోయ నాకు. ఇప్పుడు గనక ఆ పెద్దాయమ పక్కన కుచ్చుంటే మల్లా నవ్వుతారేమోనని అట్టమల్లుకోని కిటికీలోనుంచి బైటకుజూస్తా నిలబడితి.

అర్దగంట తరవాత మాసాపేట వచ్చ. గోడలమింద సినిమా బొమ్మలు. పోలీస్ డ్రస్సులో బాలకృష్ణ, డ్రస్సే ల్యాకండా చిరంజీవి, మోటరుసైకిలుమింద సుమన్. "మ్యాట్నీ జూస్కొని పోదాం" అనె చిన్నాయన. నాకు యక్కడలేని సంబరం! ఐనా బయటపడకుండా "సరే" అంటి. యాల్నంటే, సినిమాలు జూసేవోళ్లూ బయటితిండ్లు తినేవోళ్లూ బాగుపడే రకాలు కాదని మా యింట్లో అనుకునేవాళ్లు. అంతవరకూ నేనెప్పుడూ రాయచోటిలో సినిమా జూసిందే లేదు. వీరబల్లెలో అసలు హాళ్లే లేవు. అప్పిరెడ్డి తాత వడ్లమిషన్ పక్కనే టెంటు వుండేదంట అప్పుడెప్పుడో.

క్రిష్ణా అంగట్లో జంటబిస్కట్లు కొంటే వాటి మధ్యలో ఒక చిన్న సినిమాబొమ్మ వచ్చేది. ఆ బొమ్మమింద సుప్రీంహీరో చిరంజీవి, యువరత్న బాలక్రిష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, ఆంధ్రుల అందాల నటుడు సుమన్, సుహాసినీ, రాధ, రాధిక వీళ్లందరి బొమ్మలూ వొచ్చేటియ్యి. సినిమాలు చూడకపోయినా వీళ్లందురూ తెలుసు నాకు. నా దగ్గర ఆ బొమ్మలు మా అమ్మానాయనా చూస్తే తంతారని పారేసేవోణ్ణి. సుప్రీంహీరో బొమ్మ వొచ్చిందంటే ఆ క్రాపు, ప్యాంటూసొక్కా, చేతికి గ్లోవ్సూ, ఆ పోజూ రోంచేపు చూసి సుబ్రమణ్యానికి ఇచ్చేసేవాణ్ణి. కాన్వెంట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం మూడిట్లో యనకాల సినిమాపేజీ రోజూ చూసేవోళ్లం. మా క్లాసులో చిరంజీవిపార్టీ, బాలక్రిష్ణపార్టీ వుండేటియ్యి. వాళ్లు బాలక్రిష్ణనూ యీళ్లు చిరంజీవినీ యెక్కిరిచ్చేవోళ్లు. ఏ పార్టీలోనూ చేరనట్టుగా వుండేవోణ్ణిగానీ, నేను సుప్రీంహీరో పార్టీ.

సరే, మాసాపేట నుంచి బస్సు యేరు దాటుకొని రాయచోటికి చేరింది. బొమ్మలుజూసి సినిమా పేరు చూద్దామనేలోపునే బస్సు కదిలిపోతాంది. వెంకటేశ్వరా హాలు కాడ బస్సు రోంచేపు నిలబడె. పోస్టరుమింద 'తిరగబడ్డ తెలుగుబిడ్డ'. "బిడ్డ తిరగబణ్ణాడంటే యట్టబణ్ణాడు? యల్లకిలానా? బోళ్లానా? యట్టని?" అనె చిన్నాయన. "గిరగిరా తిరిగిపణ్ణాడనా?" అని నేనూ ఒకటి తగిలిస్తి. అంతలోకే బస్సు కదిలె.

తరవాత సైదియా కాడ వొక్క నిమిషం నిలబడె. గబగబా ఇద్దరమూ దిగేస్తిమి. ఎదురుగా 'అడవిదొంగ'. గోడమింద ఇంత పెద్ద పోస్టరు. సింహంతో చిరంజీవి ఫైట్! అంతే! ఉగ్రనేత్రుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డా పరార్.

టికెట్ నాలుగు రూపాయలు.
"నాకూ ఫుల్ టికెట్టేగదా?!"
"సైదియాలో ఆఫ్ టికెట్టుండదు"

హాలు మధ్యలో కుచ్చుంటిమి. అంతపెద్ద హాలు అంతకుముందు నేనెప్పుడూజూళ్ల్యా. సినిమా మొదులయింది. తెరమిందికి బొమ్మ యాణ్ణించి పడుతుందో చిన్నాయన చూపిచ్చ. సింహంతో చిరంజీవి ఫైటు, అడివిలో రాధ గుడ్డలు మార్చుకునేటప్పుడు కోతి ఫోటోతియ్యడం, ఏనుగులూ కోతులూ చిరంజీవికి సాయం చెయ్యడం, శారద రావుగోపాల్రావుతో శపథం జెయ్యడం, నూతనప్రసాదు రావుగోపాల్రావుతో 'ఫాదరే' అనడం, చిరంజీవి సూటూబూటు తొడిగి జైలుకొచ్చి పోలీసోళ్లను బురిడీ కొట్టించడం, ఇది ఒక నందన వనమూ ఉవ్వ ఉవ్వువ్వ పాటా ... ఓ... సినిమా బ్రమ్మాండం. ఆమాటే చిన్నాయనతో అంటి. ఓ యస్ అనె. ఇద్దరమూ బస్టాండుకొచ్చి కడపబస్సెక్కినాం.

పదీపదైదు నిమిషాలకు బస్సు దిగి, తూరూగా నడవబడితిమి. శానాదూరమే నడసాల మూలపల్లెకు. నేను మా బళ్లోవుండే చిరంజీవిపార్టీ బాలక్రిష్ణపార్టీల గురించి చెప్తావుంటి. అదేదో సినిమాలో బాలక్రిష్ణ, మొగోనివేషంలో వున్నె హీరోయిన్‌ను యాణ్ణో తాకి ఆడపిల్ల అని తెలుసుకొని తత్తరపాటూ, సిగ్గూ, సింగారమూ, తప్పుజేస్తిననే బయమూ, ఆ కొత్త యవ్వారమూ అన్నీ మొగంలోనే పలికిచ్చిన కత వొగటి చెప్పి, అంతటి నటునికి సరైన సినిమాలు రాలేదని బాదపడె మా చిన్నాయన. నాకు తెలిసిపాయ... చిన్నాయన బాలక్రిష్ణ పార్టీ. ఐతే చిరంజీవి సినిమా ఎందుకు చూసినాడు?!!

దోవలో వొగాయన యెదురుపడి, "ఏం బోవ్, మజ్జానం ఆట చూసుకొని వస్తాన్నిట్టుండారే" అనె.
"ఔ.."
"రెండోసారా మూడోసారా?"
"లేదులే, మావోడు రాధ తొడలు జూడాలంటాంటే సూపిచ్చుకోనొస్చాండా"
"మనసినిమా జూస్కోనొచ్చాండావనుకుంటినే"
"యేమిజేతాము? మన సినిమా రెండోమాటు జూసేటిగా వుంటేగదా!"
"...మ్... పాండి పాండి... పెద్దమిషనుకు రెండుమూటల వొడ్లిచ్చిన్యాము. అయ్యి ఆడిచ్చుకోనొజ్జామని రాసీడుకు పోతాండా"
"సరే సరే ఐతే"
"అడివిదొంగ బాగుంద్యా?"
"రాధ కోసం వొగపారి సూడొచ్చునంటాండాడు మావోడు"
"సరే ఐతే .. పస్టుషో చూస్కోనొస్తా"
"మంచిది"

నేను సుప్రీంహీరో చిరంజీవి పార్టీ అయినందుకు సంబరపడతా, చిన్నాయనతో పాటు మూలపల్లెకు నడిస్తి.

21 comments:

balarami reddy said...

9/10

Prasada Martala said...

Ramanadh, Very nice post. Started following your blog recently and it is really amazing to see the story-telling that is as good as the story itself. The narration is simply refreshing!!

మీ శ్రేయోభిలాషి said...

10.10

చదువరి said...

నిజమే.. మీ చిన్నాయన ఎంత తమాసాగా మాట్టాడతారో!
నాకు చాలా నచ్చింది ఈ టపా. పదికి పైమాటే!

చదువరి said...

ఇంతకీ "సైదియా" ఏంటి? ఆ హాలు పేరా? లేక సినిమా హాలునే అలా అంటారా?

kiraN said...

చిన్నాయన చాలా తమాషా మనిషే..
నన్ను మనస్ఫూర్తిగా నవ్వించేవాళ్ళలో నువ్వొకడివి..

-కిరణ్

రాకేశ్వర రావు said...

చాలా బాగుంది. దింపుకొని తీఱికగా చదివాను.
మీరు వ్రాతని ఇంకా కాస్త సీరియస్గా తీసుకొని, పత్రికలకు పంపుతూ పుస్తకం అచ్చు వేయించుకోగలరని నా ఆశ.

ప్రవీణ్ గార్లపాటి said...

ఓహో! నువ్వూ చిన్నప్పుడు చిరంజీవి, రాధ కాంబినేషనుకి పంకావన్నమాట.
శభాషో...

రవి said...

అప్పుట్లో నేను బాలక్రిష్ణ పార్టీలే. బాలక్రిష్ణ సినిమాకి మా స్కూలు పిల్లోళ్ళమందరమూ చేరి, స్టారు తయారు చేసి, కటవుట్ కి అందరికన్నా పైన కట్టేతందుకు ఎగబడతా ఉన్నింటిమి.

చైతన్య.ఎస్ said...

10/10 :)

రానారె said...

అందరికీ నెనరులు. :)
చదువరిగారూ- అది ఆ హాలు పేరే.

Dil said...

10/10

Vinay Chakravarthi.Gogineni said...

nice r.n.r

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

యాందో గానే ఇది చదవతావుంటే నేను పిలగోణ్ణిగా ఉన్న రోజులు గుర్తుకొస్తా ఉండాయి.

rohinikumar said...

10/10.
నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి :)

Nutakki Raghavendra Rao said...

రానారె గారు ! అధ్భుతం మీ యీ యత్నం.
,ప్రాంతీయ మాండలికాల్లో వ్రాయడం ఓ సాహసవంతమైన చర్య.,ఆప్రాంతంలొనే జన్మించి అదే ప్రాంతంలొ పెరిగినా అదె మాండలికంలొ ఏళ్ళ తరబడి మాట్లాడుతూనేవున్నా తాననుకున్న సాహితీ ప్రక్రియలో రచన చేయడం అదో అధ్భుత విన్యాసం. నేనెప్పుడూ చెబుతుంటాను...... "మన మాండలికాలను మనం కాపాడుకుందాం, వాటిని అభివ్రుద్ధి చేసుకొంటూ మన మాత్రు భాష తెలుగును కాపాడుకొందాం" .అని.
అన్ని మాండలీకాలలోనూఅదో విన సొంపైన రిధం వుండి ఆ ప్రాంతీయుల నోట వింటూంటే ...... . రావిశాస్రిగారు మాందలిక ప్రక్రియలో చేసిన సాహితీన్యాయం అందరూ అలవర్చుకోవాలే గాని అధ్భుత రచనలు పుట్టుకు వస్తాయి. తెలంగాణాలో అనెక మాండలీకాలున్నాయి .ఒక దానికి మించి మరొక దానిలో...భాషలో సరళత,సౌందర్యం వుశ్ఛారణలోఈజ్, సౌందర్యం గమనించవచ్చు. రాయలసీమ వాచికంలో ఒక మాందలీకంలో మీ ప్రయత్నం అధ్భుతం .
యింకా కూడా ఎన్రిచ్ చేయండి. అభినందనలతో ...నూతక్కి

Myriad Enigmas said...

mee katha baavundhi. kaanii saidhiyaa antee enti?

vb said...

nuvvu
రాధ కోసం వొగపారి సూడొచ్చు annav kani memu nee post kosam inka chustundama abba. 10/10

4paisa said...

What happened sirji?
Almost one year?

సి.ఎల్.ఎన్.రాజు said...

అన్నా నమస్తే.. తొలిసారి మా బ్లాగు చూశా.. మన ఊరి విశేషాలన్నీ కళ్లముందు మెదిలాయి. మీరు అచ్చమైన మాండలికంలో కథను వర్ణించిన తీరు అద్భుతం. మీ కథను బట్టి.. మీది వీరబల్లి అని ఊహించా.(కరెక్టో.. కాదో మీరే చెప్పాలి). నాది వీరబల్లి పక్కనే ఉన్న గురప్పగారిపల్లె. మీలాంటి వాళ్ల ప్రోత్సాహంతో ఇటీవలే నేను కూడా బ్లాగు లోకంలోకి ప్రవేశించాను. (http://clnraju.blogspot.com) మీ పూర్వాపరాలు తెలుసుకోవాలని ఉంది. ధన్యవాదములు..

Ghanta Siva Rajesh said...

చాలా బాగుంది.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.