ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమెరికాలో కరంటు పోయింది

ఎప్పుటిమాదిరిగా సిన్నప్పుటి సంగతి కాకుండా, ఈ నెల్లో రోంత యేరేగా సిన్న కతట్టాడిది చెబ్దామని...

ఆదివారం.

సాయంత్రం ఆరున్నరయింది.

ఇల్లంతా శుభ్రం చేసి, షవరు కింద తలస్నానం చేసి ఫ్యాను కింద నిలబడినాడు సోమూ. ఫ్యాన్ గాలికి జుట్టు తడియార్చుకొంటూ అలసటలో హాయిని అనుభవిస్తున్నాడు. అతని పారవశ్యాన్ని భగ్నం చేస్తూ ఇంటిబయట ఢాంమ్మని శబ్దం. కిటికీవైపు చూశాడు. కళ్లు మిరుమిట్లుగొలుపుతూ మెరుపులు. వాటి వెంబడి, దిక్కులు పిక్కటిల్లజేస్తూ ఉరుములు. పడగ్గదిలోని విద్యుద్దీపం కన్నుకొట్టింది. ఫ్యాను కూడా ఒక క్షణం ఆగి మళ్లీ వేగమందుకొంది. గబగబా చల్లాడమూచొక్కా తొడుక్కున్నాడు.

బయట జోరుగా వర్షం కురుస్తున్న శబ్దం. విసురుగా గాలివీచింది. పెద్దపెద్ద చినుకులు కిటికీని దబదబా బాదుతున్నాయి. ఉన్నట్టుండి కళ్లముందు చీకటి. ఫ్యాను తిరగడం ఆగిపోతున్న చప్పుడు.
తాళాలూ, జేబువాణి(mobilePhone), చేజోలె(wallet) తీసుకున్నాడు. వర్షాన్ని చూద్దామని బయటికెళ్లాడు సోమూ. భీకరంగా వుంది వాతావరణం. 'ఈ అమెరికాలో ఏమొచ్చినా భారీగానే వుంటుంది' అనుకున్నాడు.

అరగంట గడిచింది. వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంట్లోకి వెళ్లాలంటే లోపల ఉక్కపోత. హరికేన్ లాంటి ఉపద్రవమేదో వస్తే తప్ప, పోయిన కరంటు ఇంతసేపు రాకపోవడం అతను చూడలేదు. అందుకే ఇంట్లో కొవ్వొత్తులూ అగ్గిపెట్టే ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోలేదు. అతనికి గుబులు మొదలయింది. జేబులోనుంచి ఫోన్ తీశాడు.

"హలో, గిరీ"

"ఆ.. సోమూ, చెప్పు సోమూ"

"అమెరికాలో కరంటు పోయింది"

"అమెరికాలోనా!!? నువ్వు మరీ అఘాయిత్యం మనిషివి."

"హ్యూస్టనే అమెరికా ఐపోయిందిలే నా ప్రాణానికి. మా ఏరియాలో కరంటు పోయింది"

"మాకూ పోయింది"

"నువ్వెక్కడున్నావిప్పుడు ?"

"ఇంటి దగ్గరే"

"అరగంట దాటినా కరంటు రాకపోయేసరికి ప్రాణం దిగాలుగా వుంది గిరీ! తిండికి కరంటు, నిద్రకూ కరంటు. ఎంతగా అలవాటు పడిపోయామో చూడు."

"నిజంగా. నాకూ అలాగే అనిపించింది. నేనూ కరంటు పోవడంతోనే నిద్రలేచాను. అంతా చీకటి. లైటర్ నా చొక్కాజేబులో వుంది! మొహం కూడా కడుక్కోకుండా కాఫీ తాగుదామని అలాగే బయటికొచ్చాను. మెక్‌డీ వైపు వెళ్తున్నా."

"ఎక్కడున్నావంటే ఇంట్లోనే అన్నావ్?"

"ఇం'ట్లో' అనలేదు. ఇంటి 'దగ్గర' అన్నాను"

"ఏడ్చినట్టుంది"

"ఔను ఏడ్చినట్లే వుంది. మెక్‌డీ వాడు మూసేశాడు. స్టార్‌బక్స్ వైపు వెళ్తున్నాను. నువ్వూ రారాదూ?"

"కాఫీ తాగబుద్ధి కాలా.. ఇంట్లోనూ ఉండబుద్ధి గాలా.. కరంటు రాకపోతే అన్నమెట్లా? హోటళ్లలో ఏవైనా వుంటే ముందుగానే తెచ్చేసుకోవడం మంచిది. రద్దీ ఎక్కువైతే కష్టం."

"హోటళ్లు కాదు సోమూ, రెస్టారెంట్లు. రెస్టరాంట్లు! విష్ణు ఇంటికెళ్దాం. నన్నూ యన్నారయ్యనూ రమ్మన్నాడు. నీకోసమూ వండమని చెబుతాను."

"బాగుంటుందంటావా?"

"ఫరవాలేదు. తినబుల్‌గానే వండుతాడు. వచ్చెయ్"

"ఆయన వంట బాగుంటుందంటావా అని కాదు నేననేది"

"నువ్వూ నీ పనికిరాని మొహమాటాలూ. రా పోదాం. విష్ణు తీరిగ్గానే వున్నాడు. ఆయన భార్యాబిడ్డా ఇండియాలో వున్నారు."

"బలవంతపు బ్రహ్మచారి అయ్యాడన్నమాట! ఐతే సరే.. మీరెళ్లండి.. నేనింకొంతసేపు చూసి వస్తాను."

"మ్.. ఏమిటి నువ్వు చూసేది కొంతసేపు? అదీ ఈ చీకట్లో? నీ మొహమాటానికి మంటబెట్టా!"

"అదేం కాదు. ఇంకో పది-ఇరవై నిముషాల్లో బయల్దేరుతా. నువ్వూ యన్నారయ్యా వెళ్లండి."

"సరే"

జోరున కురుస్తున్న వర్షాన్ని చూస్తూ వరండాలోనే నిలుచున్నాడు సోమూ. ఒక దిశ అంటూ లేకుండా వీస్తున్న గాలి, ఉండుండి తుంపర్లను తనవైపుకు విసిరికొడుతోంది. దూరంగా ఎత్తుగా కనిపిస్తున్న ఫ్రీవే వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు.

'కనీసం వీధిలైట్లయినా వెలుగుతున్నాయా? ఊహూఁ! చీకటి చిక్కబడిపోతోంది. రాత్రి భోజనమెలాగన్నవిషయమై వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. విష్ణుగారి ఇంటికి వెళ్లడమా, హోటలుకెళ్లి ఏమైనా తెచ్చుకోవడమా? రెండోదే మంచిది. తిండి సరే, ఈ ఉక్కలో నిద్రపడుతుందా? ఐనా, ఆలోగా కరంటు రాకపోతుందా! ఒకవేళ రాకపోతే? అప్పుడు చూద్దాంలే. నిజంగా రాకపోతే మాత్రం అమెరికా వేస్టు.'

ఫోను మోగుతున్న చప్పుడు. ఆ రింగ్ టోన్ తనదే! గబుక్కున ప్యాంటు జేబులో చెయ్యిపెట్టి, ఎవరైందీ చూడకుండానే "హలో?" అన్నాడు ఆత్రంగా.

"హలో సోమూ, దిసీజ్ విష్ణూ"

"సార్.. విష్ణుగారూ..చెప్పండి సార్"

"వియార్ వెయిటింగ్ ఫర్యూ. గిరీ, యన్నారయ్యా వచ్చారు..యు కమ్, వియ్ విల్ వాచే డీవీడీ.."

"ఓకే సార్. నేను ఇప్పుడే బయల్దేరుతున్నాను.."

"నీకు మా ఇల్లు తెలుసుగా?"

సోమూ చాలా ఇబ్బందిపడిపోయాడు.
"మీరుండేది రివర్‌గేట్‌లో అని తెలుసుగానీ, ఇంటి నంబరు తెలీదు సార్..అలాగే మీ అపార్టుమెంటు గేట్ కోడ్ .."

"లోపల పార్క్ చేస్తే టో చేస్తారు. లీజింగ్ ఆఫీసు ముందు పార్క్ చేసి, నాకు ఫోన్ కొట్టు"

"ఓకే సార్"

'సోమూ ఎక్కువగా కలవడ'ని జనమనుకోవడం అతనికి తెలుసు. ఫోను తిరిగి జేబులోకి జారిపోతుండగా గమనించాడు - అతని గుండె మామూలు వేగంతో కొట్టుకోవడం లేదు.

కారు తన ఎదురుగానే వుంది. స్టార్ట్ చేశాడు.

తుంపర్ల మధ్య
వైపర్ల మధ్య రోడ్డును చూస్తూ... 'ఈ గిరి నన్ను పిలవమని మాత్రమేగాక, నాకు మొహమాటం అని కూడా చెప్పివుంటాడు. లేకపోతే 'నీకు మా ఇల్లు తెలుసుగా?' అని అడుగుతాడా! నా గుఱించి మాట్లాడుకొని నవ్వుకొంటూ వుంటారేమో! ఇప్పుడు నేను వెళ్తున్నది తిండికోసమే అన్నట్టుగా వుంది. అందుకు కాకపోతే, వెళ్లేవాణ్ణి కాదు గదా? గిరి, యన్నారయ్యా వెళ్లినట్టు సరదాగా విష్ణుగారింటికి నేనెప్పుడూ వెళ్లింది లేదు. అయినా సరే, వస్తానని చెప్పాక వెళ్లక తప్పదు' అనుకుంటూ విష్ణుగారిల్లు చేరుకున్నాడు.

"కమిన్..", తాను ముందుగా ఇంట్లోకి వెళ్తూ, పిలిచారు విష్ణుగారు. సోమూ అనుసరించాడు. లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా కౌచ్‌లో కూర్చుని వున్నారు గిరీ యన్నారయ్యా. వాళ్లు తననే చూస్తూ కౌచ్‌లో కొద్దిగా కదిలారు. వాళ్లకు ఎదురుగా కుడివైపున పెద్ద టీవీ. అది ఆఫ్ చేయబడి వుంది. సోమూ టీవీవైపు చూస్తూ ఒక కుర్చీలో కూర్చున్నాడు. విష్ణుగారు వచ్చి టీవీ పక్కన సోమూ ఎదురుగా కూర్చున్నారు. అక్కడి మౌనం సోమూకు అసహనం కలిగించింది.

"ఎవరూ మాట్లాడటం లేదు, టీవీతో సహా?", చేతులు వెల్లకిలా చేసి, ముగ్గురివైపూ ప్రశ్నార్థకంగా చూశాడు.

"ఇంతవరకూ మాట్లాడుకుంటూ వున్నాం" విష్ణుగారి జవాబు. తన గురించే నేమో ననుకున్నాడు సోమూ.

"అసలు ఈరోజుల్లో నలుగురు మనుషులు తీరికగా కాసేపు ఒక చోట కూర్చోవడమే గగనమైపోతోంది. కదా? అది కుదిరినప్పుడు ఏవో నాలుగు మాటలు మాట్లాడుకోక, టీవీకి ముఖాలప్పగించడం ఏం బావుంటుంది!?" - గిరి.

"వెరీ గుడ్! నలుగురం చేరినప్పుడు టీవీని మాట్లాడించకపోవడమే మంచిది. నేను రాక ముందు మీరేం చేస్తూవున్నారో గాని, నేనొచ్చినప్పటినుంచి మాటల్లేవిక్కడ. మీరుగాక ఇంట్లో ఇంకెవరైనా వున్నారా?" చుట్టూ చూశాడు సోమూ. అతని చూపు వెనక్కు తిరగ్గానే, అక్కడున్న వంటగదిని చూసి, ముఖం ఇంత పెద్దది చేసి, "అరె! ఇక్కడ కిచెనుందే!! చూశారా నేను గమనించనేలేదు. ఇంట్లోకి వచ్చాను...నేరుగా కుర్చీలో కూర్చున్నాను...అసలిక్కడ ఒక గది వుంది అనే స్పృహే నాకు కలగలేదు."

"అదంతా మా చూపుల మహిమ! నిన్ను కుర్చీకి కట్టిపడేశాం" యన్నారయ్య నవ్వుతూ మిగతా వారి ఆమోదం కోసం చూశాడు. వాళ్లంతా 'ఔను మా మహిమేన'న్నట్టు సోమూను చూశారు.

"నిజమే. అలాగే వుంది చూస్తుంటే. ఒప్పుకోవాల్సిందే. ఇంతకూ, విష్ణుగారూ, ఆ నీలంరంగు డబ్బా...ఏమిటండీ అది?"

"ఆక్వేరియమ్" నిర్లిప్తంగా వచ్చింది సమాధానం. అది కూడా తెలీదా అన్నట్టు.

సోమూ మొహం చూసి యన్నారయ్యా గిరీ పగలబడి నవ్వారు. విష్ణుగారు నవ్వుతూ, వారిద్దరినీ చూసి, "ఔను. ఇది ఆక్వేరియమే." అన్నారు స్థిరంగా. వాళ్ల నవ్వులజోరు తగ్గింది. అనుమానంగా చూస్తున్నారు.

"సీరియస్‌లీ ..దట్ వా జె నాక్వేరియమ్"

ముందుగా సోమూ ముఖంలో నమ్మకం కనబడింది విష్ణుగారికి.

"అందులో నేనొక చేపను పెంచేవాణ్ణి."

"ఒకే ఒక్క చేపనా?"

"గోల్డ్ ఫిష్"

అందరి ముఖాల్లో ఆసక్తి. విష్ణుగారు చెప్పసాగారు.

"నేనప్పుడు ఒంటరివాణ్ణి. తెలిసిన మూడు కుటుంబాలవాళ్లు వుండేవాళ్లు. వాళ్లతో ఏం మాట్లాడినా అంతా పైపై మాటలే. అన్నీ ఫీల్ గుడ్ కబుర్లే. నన్ను వారిళ్లకు రమ్మని పిలిచేవాళ్లు. వెళ్తే చక్కగా కౌచ్‌లో కూర్చోబెట్టి తినడానికేవో ఇచ్చేవాళ్లు. బాగున్నావా దగ్గర మొదలుపెట్టి అన్నీ ఇంతకు ముందు అడిగిన ఫీల్ గుడ్ ప్రశ్నలే వేసేవాళ్లు. అంతకు మించి మాటల్లో లోతుండదు. నేనూ అంతకు మించి మాట్లాడటానికీ, ఏమైనా అడగటానికి మొహమాటపడేవాణ్ణి. అక్కడున్నంతసేపూ శరీరానికి సుఖం, మనసులో ఇబ్బంది. ఎన్నిసార్లు కలిసినా మాట్లాడుకున్నా, వాళ్ల ఇళ్లలో ఫ్రిజ్ తెరిచి నీళ్లబాటిల్ తీసుకునే చొరవ నాకు కలగలేదు."

"నిజమే. ఐ కెన్ ఇమాజిన్. ఇండియాలో ఇలాంటి ఫ్యామిలీస్ చూశాన్నేను. అప్పుడు నేను...," యన్నారయ్య తన అనుభవాలు చెప్పటం మొదలుబెడితే, ఎవరు వింటున్నా వినకపోయినా ఎవరికిష్టమున్నా లేకున్నా, బండి ఒకపట్టాన ఆగదనే సంగతి అక్కడున్న ముగ్గురికీ తెలుసు. అప్పుడు గిరి కాస్త చొరవజేసి యన్నారయ్య బండిని పట్టాలు తప్పిస్తుంటాడు, "యన్నారయ్య చెప్పేది నిజమే. ఇండియా అమెరికా అని తేడాలేదు. విష్ణుగారూ, మీరింకా చేప దగ్గరికి రాలేదు."

"వస్తున్నా! అలా రెండేళ్లున్నానక్కడ. 'వీళ్లు నా వాళ్లు' అని నాకెప్పుడూ అనిపించలేదు. ఇంట్లో వున్నా ఒంటరినే, జనంలో వున్నా ఒంటరినే. 'మన మనుషులు' అనిపించుకున్నోళ్లు ఎక్కడో దూరంగా వున్నారు. వాళ్లతో ఫోన్లలోనే మాటలు. అప్పటికి అమ్మ రెండేళ్లనుంచీ పోరుతోంది పెళ్లి చేసుకొమ్మని. ఈ రెండేళ్లలో అమ్మ విషయంలో నేను గమనించిందేమంటే, రానురానూ అమ్మకూ నాకూ దూరం పెరిగింది. మొదట్లో చెప్పినంత చనువుగా చెప్పలేకపోయేది. అమ్మ చెబుతోందని కాదుగానీ, ఈ మానసిక ఒంటరితనం భరించలేక, పెళ్లి చేసుకుందామనుకున్నాను."

యన్నారయ్య అందుకున్నాడు, "భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ - భర్తగ మారకు..."

"ఆపెయ్ ఆపెయ్ ఆపెయ్! ఆపక్కడ. పెళ్లైనోడూ పెళ్లైతే ఎలావుంటుందో తెలీనోడూ అందరూ ఈ పాట పాడి పాడి నా చెవులకు పాడెగట్టారు."

"సారీ విష్ణుగారూ. ఇది అరిగిపోయిన రికార్డే. మీకు పెళ్లి చేస్కోవాలని గట్టిగా అనిపించాక, చేస్కున్నారు. వెరీ గుడ్. నేను ఇండియాలో వుండగా, పెళ్లెందుకు చేస్కున్నావయ్యా అని చాలామందిని అడిగి చూశాను. చాలామంది చెప్పిన సమాధానం - 'నాకు తెలీదు'. కొందరేమో నన్నే ఎదురు ప్రశ్నించారు, పెళ్లి ఎందుకు చేస్కుంటారు ఎవరైనా? అని. పెళ్లీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేశాడొక పెద్దమనిషి. 'నన్నెక్కడ చేస్కోనిచ్చారయ్యా పెళ్లి? మా అమ్మావాళ్లంతా కలిసి నా ఫేట్ డిసైడ్ జేసేశారు' అని నుదుటిమీది చెమటను జేబురుమాలుతో తుడుచుకున్నాడు ఒకాయన పాపం. మరొకాయన, 'అసలు నేను పుట్టాలనే అనుకోలేదు తెలుసా?' అన్నాడు. నా క్లాసుమేటు మందుబాబును అడిగాను, 'శివుడాజ్ఞ అయింది. చీమ కుట్టింది. చేస్కున్నా' అన్నాడు. అన్నీ ఇలాంటి వంకర సమాధానాలే తప్ప, నీలాగ 'చేస్కోవాలనిపించింది. చేస్కున్నా!' అని శుభ్రంగా చెప్పిన మగవాడు లేడు." ముగించాడు.

"వావ్!" చప్పట్లు కొట్టాడు సోమూ .

"దేనికా క్లాప్స్? విష్ణుగారి 'శుభ్రత'కా? మన యన్నారయ్య వాగ్ధాటికా?"

"విష్ణుగారి పెళ్లి నిర్ణయం ఆషామాషీది కాదని మన యన్నారయ్య చెప్పేదాక నాకు అనిపించలేదు"

"నిజమే స్మీ! యన్నారయ్య ఈ జె గుడ్ లిజనర్ టూ... మ్... విష్ణుగారూ, కథలో చేప ఇంకా రాలేదు"

"మీరు మరీనయ్యా! బోరు కొట్టి, పెళ్లి చేస్కుందాం అనుకున్నాను. ఇది అసాధారణమైనదేమీ కాదు."

"సార్... డోన్ట్ బీ సో హంబుల్"

"హం బుల్ బులే హైఁ ఇస్‌కీ... యే గుల్...", యన్నారయ్య అందుకున్నాడు, "ఇస్కీ అంటే గుర్తొచ్చింది, సార్.. విష్ణుమూర్తిగారూ, ఇంట్లో అమృతమేమైనా వుందా?"

"అమృతం చాలా కొంచెమే వుంది. దాన్ని మీకు పంచడానికి నేనిప్పుడు మోహినీ అవతారం ఎత్తలేనుగానీ, సరిగ్గా మూడు బీర్లున్నాయి. నాలుగు గ్లాసుల్లో పోస్కొని తాగుదామంటారా?"

ఇల్లంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. అవి సద్దుమణిగేలోగా వాళ్ల మధ్యనున్న టీపాయ్ మీదికి నాలుగు గ్లాసులూ, మూడు బీరుబాటిళ్లూ, ఒక పెద్ద సీసాలో కాసింత అమృతమూ, హల్దీరామ్ కారాలూ వచ్చి చేరాయి. లైట్లు డిమ్ అయ్యాయి. అమృతం వాసన అందరిలోనూ కొత్త ఉత్సాహం నింపింది.

"స్టోరీ నేత్రకొత్త చెయ్యండి"

"ఔను. కంటిన్యూ చెయ్యండి..."

"పెళ్లి చేస్కుందాం అనుకున్నారు... తరువాత?"

"తరువాత.. మ్.. పెళ్లి చేస్కుందాం అనుకున్నాక ఒంటరితనం రెండింతలైంది. ఆఫీసు నుంచి ఇంట్లోకి రాగానే నేనొకణ్ణే ఈ ప్రపంచంలో మిగిలి ఉన్నట్టుగా, గోడలు నన్నే చూస్తున్నట్టుగా, ఇలా అనిపించడం మొదలైంది. ఇంట్లో ఇంకో జీవి ఉంటే బాగుంటుందనుకున్నాను. అప్పుడే నాకీ ఆక్వేరియం ఐడియా వచ్చింది. అదిగో ఆ 'డబ్బా' లో ఒక గోల్డ్‌ఫిష్ వేసుకొని ఇంటికొచ్చాను. ఆ రోజు నుంచీ ఇంటికి రాగానే దాన్ని పలకరించడం, కాసేపు దాన్ని చూస్తూ ఆనందించడం, ఫిల్టరేషన్, దాని తిండీ గిండీ ఇలా సరిపోయేది. గోడలూ సీలింగూ నన్ను చూడ్డం మానేశాయి. సంబంధాలు వస్తునే వున్నాయి. నిలవడం లేదు. జాతకాలు కుదిరాక, ఎవరో ఒకరికి ఏదో ఒకటి నచ్చదు. అనుకున్నామని జరగవు అన్నీ అన్నాడు గదా ఏయెన్నార్? అలాగయింది పని."

"ఏయెన్నార్ కాదు సార్, ఆత్రేయ"

యన్నారయ్య వైపు ఉరిమి చూశారు గిరీ, సోమూ.

"సరే ఆత్రేయ. నేను ఆత్రపడినంతగా సంబంధాలు ఆత్రపళ్లేదు. ముందొచ్చిన 'బంగారం లాంటి సంబంధాల' గుఱించి, వాటిని అప్పుడు నేను 'కాలదన్నడం' గుఱించి అమ్మ మాటల్లో ఎక్కువగా వినిపించడం మొదలైంది. ఎంత ఓపికగా వుందామనుకున్నా కుదర్లేదు. ఇలాగ తొమ్మిది నెలలు గడిచిపోయాయి. రోజూ బయటనుంచి ఇంటికి రాగానే, నేరుగా చేప మీదికే వెళ్లేది నా చూపు. ఒక రోజు నాకు ఏమనిపించిందంటే, ఈ చేపను ఒంటరిగా డబ్బాలో బంధించి పెట్టడం వల్లే నేనూ ఒంటరిగా వున్నానేమో అనిపించింది."

"ఒకే ఇంట్లో ఇద్దరు ఒంటరివాళ్లు!"

"అలా అనిపించిన వెంటనే, ఇంటికి తాళం వేసి, డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఆక్విమార్ట్ వెళ్లాను. రెండు గోల్డ్‌ఫిష్ తీసుకొచ్చి డబ్బాలో వేశాను. పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఫీలయ్యాను. హుషారుగా అన్నమూ వంకాయకూరా చేసి, తిని హాయిగా నిద్రపోయాను. రెండ్రోజుల తరువాత, సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చి చూద్దునుగదా మూడు చేపలూ కనిపించలా! దాక్కున్నాయేమో అనుకున్నాను. దగ్గరికెళ్లి చూస్తే మూడూ వెల్లకిలా తేలుతున్నాయి."

"ఆ!!!"

"డోన్ట్ టెల్ మీ ..."

"అయ్యో అయ్యో అయ్యో!!!"

"నాకు దిక్కు తోచలేదు కొంతసేపు. ఆశ చావక, వేలితో కదిలించి చూశాను. అప్పటికే పోయాయి. నాకు ఏడుపొక్కటే తక్కువ. పైకి యేడవలేదనుకో."

"ఎందుకు పోయాయి సార్?"

"నేను కొత్తగా తెచ్చిన రెండు పిల్లచేపలకూ ఏదో డిసీజ్..."

"ప్చ్!"

"మ్..."

"సార్... మందు మత్తు మొత్తం దిగిపోయింది"

"విచిత్రమేమంటే, తరువాత నాలుగు రోజులకే నాకు పిల్ల కుదిరింది. వెంటవెంటనే పెళ్లీ జరిగిపోయింది. పాప కూడా పుట్టింది."

"డబ్బా మాత్రం అలా మిగిలిపోయింది!" ముక్తాయించాడు సోమూ.

"ఆ డబ్బాను పారేద్దామంటుంది మా ఆవిడ. దాంతోపాటు నన్నూ పారెయ్యమంటాన్నేను. కనీసం దాన్ని కిచెన్ గోడ మీంచి తీసెయ్యమంటుంది. వద్దని నిదానంగా నచ్చజెప్పాననుకో..."

"???"

"ఎందుకంటే... ఈ ఆక్వేరియంలోని జీవం నేను ఒంటరిగా వున్నప్పుడు తోడుండేది. నాకొక జంట కుదరబోతుండగానే, తన విధి నెరవేరినట్లుగా అది ఎగిరిపోయింది. ఆక్వేరియం మాత్రం మిగిలింది. మీరు 'ట్రాష్' అని కొట్టిపారేయొచ్చు కానీ, ఇన్నాళ్లుగా ఈ ఇంట్లో ఉన్నవాణ్ణి, నాకొక సెంటిమెంటు వుండిపోయింది. ఇప్పుడు మేం ముగ్గురం హాయిగానే ఉన్నాం. ఆక్వేరియాన్ని తొలగిస్తే మాకేదైనా కీడు జరుగుతుందేమోనన్నదే నా భయం."

"..."

"..."

"..."

"చాలా రాత్రయిపోయింది. తెల్లారితే సోమవారం. మీరు ముగ్గురూ ఇక్కడే నిద్రపోవచ్చు. ఈ టైంలో ఇంటికెళ్తారా?"

"వామ్మో! నేనిప్పుడు ఒంటరిగా డ్రైవ్ చెయ్యలేను" సగం నవ్వుతూ అన్నాడు యన్నారయ్య.

"గోడలూ సీలింగూ మిమ్మల్నే చూస్తూవుంటడమేంటండీ బాబూ! నాకు కొత్త ఆలోచన లేపారు మీరు.. నాకిప్పుడు నిద్రొస్తే గొప్ప."

"మా ఇంట్లో కరంటు లేదు", అన్నాడు సోమూ 'మ్యాటర్ ఆఫ్ ఫాక్ట్' ధోరణిలో.

"ఛా!"

ఇల్లు నవ్వులతో దద్దరిల్లింది.

ఆలోచనలు ఆ నీలంరంగు ఆక్వేరియం చుట్టూనే తిరుగుతున్నాయి. తెల్లవారుఝాము కావస్తుండగా సోమూకు మగతగానిద్ర పట్టింది. ఒక బంగారుచేప తళుక్కున మెరుస్తూ తన చుట్టూ తిరుగుతున్నట్టూ, అది క్రమంగా సుందర మత్స్యకన్యగా మారినట్టూ, తనను వలచినట్టూ... తానామెను పెళ్లాడవచ్చునో లేదో తేల్చుకోలేక సతమతమైపోతున్నట్టూ, మత్స్యకన్య తనకోసం చేతులు చాచివున్నట్టూ... ఎడతెగని కల.

కామెంట్‌లు

oremuna చెప్పారు…
ఇరగదీశావ్
వేణూశ్రీకాంత్ చెప్పారు…
చాలా బాగుంది.
రమణ చెప్పారు…
చాలా బాగుంది.
sunita చెప్పారు…
Baagundi!!!
gabhasthi చెప్పారు…
powercut in america ante chaalaa heavy ga uhinchaanu. but lightweight.narration is v.good
feel towards pets is hearttouching .yes we all have such feelings like ;godalu choodadam,goldfish had completed her duty&gone way.At the same time no ,after someother mood, such thinking makes ourselves laugh.
ఊకదంపుడు చెప్పారు…
pannulu paMdinaay. kadha kooDa bAvuMdi.
Hima bindu చెప్పారు…
చాల చక్కగా చెప్పారు.
చైతన్య.ఎస్ చెప్పారు…
చాలా బాగుంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె