ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలాల్ - ముద్దార్

"కోళ్లను అమ్ముకుంటే లెక్కొస్తాది. కోసుకుంటే యేమొచ్చా౨దీ?" ఇది మాయమ్మ చెప్పే మాట.

చెప్పాల్సిన పన్ల్యా. అమ్ముకుంటే లెక్కొస్సాదని అందరికీ తెలిసిందే. కోసుకుంటే ఏమొచ్చా౨ది? గుడ్లకోడి పులుసు వొగిరిచ్చుకుంటా తినేవోళ్లందరికీ తెలుసు మజా. ఎంత తెలిసినోళ్లకైనా సరే, ఇంట్లో ఎన్ని కోళ్లున్యా సరే, మాంచి గుడ్లకోడిపెట్టను కోస్కోని తినాలంటే గుండెనిబ్బరం కావాల్సిందే. ఎందుకంటే దాన్ని అమ్ముకున్యా లెక్కే. గుడ్లుబెట్టనిచ్చి పొదగబెట్టినా లెక్కే. సరివేలుకిచ్చినా లెక్కే.

రోగాలకూ బావురుబిల్లులకూ ముంగీసలకూ గద్దలకూ డేగలకూ పొయ్యేటియి పోతాండఁగా, పుంజులూ పెట్టలూ బొమ్మెలూ పిల్లలూ అన్నీ కలిపి రోంత అటూయిటూగా నూటాయాబై కోళ్లదాకా వుంటేటియ్యి మా ఇంట్లో.

అది మామిడికాయల కాలం. మా అమ్మమ్మా-తాతా మా ఇంటికొచ్చి, నాల్రోజులు వుండమంటే వున్యారు. మా తాత మధ్యానం పూట సేరు నిండా వొడ్లు ముంచుకొని, మా ఇంటి ముందరి మామిడిచెట్టు కాణ్ణించి పెద్దమామిడి చెట్టుదాకా, ఒక సుట్టు వొడ్లు జల్లి బబ్బబ్బబ్ అని పిలిస్తే... యేయే చెట్లకింద, పాదులకింద, కాలవల్లోనో యారకతింటా వుండే కోళ్లన్నీ రెపరెపరెపా రెక్కలు కొట్టుకుంటా ఎగిరొచ్చి వాలిపొయ్యేటియి.

బొమ్మెలు పెద్దకోళ్లకు బయపడతా గబగబా పొడసక తినేటియ్యి. పెద్దకోళ్లు ఆ బొమ్మెలను తరిమితరిమి పొడిసేటియ్యి. పుంజులయితే, రోంత సక్కదనం కుదిరిన పెట్టబొమ్మెలను చేరబిలుస్తా, తమ సంపాదనంతా తెచ్చి పెడతాన్నిట్టుగా 'ఇదో ఈ గింజ తిను, ఇదో యీడొకటి వుంది సూడు, ఇదో ఈ గింజలన్నీ నీకే, మొత్తం ఈ ఐదెకరాలూ నీదేననుకో' అన్నిట్టుగా తినిపిస్తా తినిపిస్తా, వాలుగా వొక రెక్క జారవిడిసి తొక్కులాడేటియ్యి. ఆ పెట్టబొమ్మెలు ఇదేమీ పట్టనట్టుగా గింజల పొడుస్తా వుండేటియ్యి.

ఈ సందట్లో అన్యాయమయిపొయ్యేది పుంజుబొమ్మెలూ, అప్పుడప్పుడే యారదోలబడిన కోడిపిల్లలూ. అందుకని వాటికి దగ్గరగా ఒకట్రెండు పిడికెళ్లు సల్లేవోడు తాత. ఏదోవొక కోడి వచ్చి తన్నేలోగా గబగబగబా తినేటియ్యి ఈ పిల్లలు. వీటన్నిటికీ దూరంగా పిల్లలకోళ్లకు ప్రత్యేకంగా నూకలు. ఆ కోళ్లల్లోనూ తన్నులాటలే. ఆ కోడిపిల్లలనూ ఈ కోడి, ఈ కోడిపిల్లలను ఆకోడీ పొడిసి పారేసేటియ్యి.

ఈ సంబరమంతా చూస్తావుంటే లెక్క కండ్లముందర కనిపిస్తాండ్లా! ఇంత లెక్కొస్సాంది గదా అనే ధైర్యంలో వొగ గుడ్లకోడిపెట్టను కోస్కోని తినాల్నని నేనూ మానాయనా తీరుమాణించినాం.

********** **********

తెల్లారింది. వొక గుడ్లకోడిపెట్ట తప్ప మిగతా కోళ్లన్నీ మేతకు బొయినాయి. ఆ గుడ్లపెట్ట గంప కిందనే వడ్లగింజలు తింటావుంది. దాని రాళ్లకడుపు నిండింది. గంపలోనుంచీ బైటికి తీసి, గుడ్డ పేలికతో కాళ్లు కట్టేసినాం.

సాకలామె వొచ్చి బోకులు తోమిచ్చింది. మాసిన గుడ్డలు మూటగట్టింది. మొగుడు పాలుమాలినాడని చెప్పింది. సాకలోడు రాలేదని కోణ్ణి కోసేది మానుకుంటామా! అసలు కోణ్ణి కోసేది నేర్చుకోవాల్నని నాకూ చాన్నాళ్లుగా వుండాది. 'కత్తి జారిందంటే వేళ్లు తెగుతాయి వొద్దు' అంటానే వుండాది మాయమ్మ.

కోణ్ణి కోసేది తరవాత మాట. ముందు దాని గొంతు కొయ్యాల గదా!

'కోసేజ్జాం పాండి' అంటి నేను.

'ఊళ్లేకి బొయ్యి అలాల్ జెయ్యిచ్చుకోని రమ్మ'నె మాయమ్మ.

'అలాలెందుకు మనమే కోస్కుందాం'

'అమ్మమ్మోళ్లు ముద్దారు తినరు'

'ఏమి?'

'మనమంతా మస్తాన్ సామి దర్గాకు పొయ్యొచ్చినప్పటి నుంచి ముద్దారు తినరు'

'ముద్దారు ముద్దారు అనగాకు మా, అదేందో తినగూడనిదైనట్టు'

'మీకూ మీ నాయనకూ సరే, అమ్మమ్మకూ తాతకూ ముద్దార్ పనికిరాదు. తొందరగా పొయ్యి అలాల్ చెయ్యిచ్చుకోని రాపో. పొద్దెక్కిపాయ!'

'సాయిబులు అసలు మన వూళ్లోనే లేని కాలంలో యాడిది మనకీ అలాల్? మన తాతముత్తాతలంతా ...'

'మర్యాదగా అలాల్ చేయిచ్చుకోనొస్తావా, ల్యాకపోతే యేమన్నా కావాల్నా?'

కోడికూర ఉడికేదాఁక ´యేమన్నా´ ఏమీ తినగూడదనుకున్యా కాబట్టి, కోణ్ణి సంకనేసుకొని ఈరబల్లెకు బోతి. అప్పుటికే రెండు బారల పొద్దెక్కింది. యండ చరచర మంటాంది. మసీదు కాడికి పొయ్యి, ఆ గోడపక్కన సందులో నిలబడితి వొట్టిచాపలాయన కోసం.

రోజూ మసీదులో అజా౨ ఇచ్చేదీ, ఆ తరవాత ఎవురైనా కోళ్లు పట్టుకోనొస్తే అలాల్ జెయ్యిచ్చేదీ ఆయనే. శనివారం శనివారమూ సంతలో వొట్టిచేపలు అమ్ముతాడు కాబట్టి ఆ సాయిబూ పేరు వొట్టిచాపలాయన అయ్యింది. అసలు పేరేందో ఆయనకే తెలియాల.

********** **********

ఆ సందులో యంత సేపు యండలో నిలబణ్ణా వొట్టిచాపలాయన రాలా. యండ మాత్రమే ఐతే తట్టుకోవొచ్చు. ఆ సందు దిగితే సర్కారుతుమ్మచెట్లు, పక్కనే కుంట. పొద్దన్నే ఆ సందంతా సాయిబూల, కోమటోళ్ల పిల్లకాయలూ ముసిలోళ్లూ పొద్దన్నే గొబ్బెమ్మలు పెట్టిపోతారు. వాళ్లు పొయినాఁక పందులొచ్చి పోతాయి.

ఇంతేగాదు. ఇంగోటుండాది. ఎంతైనా మనం రెడ్డేరి పిల్లకాయలం కదా! కోణ్ణి సంకలో బెట్టుకోని వూళ్లో అందరికీ కనబడితే బయసినం గదా! మన యింటికాడ మనమెట్టున్యా అడిగేవోడుండడు.

మామూలుగా భట్టుపల్లెలో ఐతే అసాన్‌ను పిలవనంపితే ఇంటికొచ్చి కోసిచ్చి పొయ్యేవోడు. భట్టుపల్లెకాణ్ణించి మా సంతనానికి (సంత వనానికి) మారినాఁక, అసాన్ లేడు. కోణ్ణి కొయ్యాల్నంటే, వుంటే మా సాకలోడు, ల్యాకంటే మేము జేసిందే అలాల్. స్టీలుగిన్నెలో నాలుగు ఉప్పురాళ్లు యేస్కొని రక్తం కూడా పట్టుకోడమే. కాలం కొద్దీ యెవురైనా!

ఈ వొట్టిచాపలాయన వొచ్చేటిగా లేడని, మసీదు సందులోనుంచి లోపలికిబొయ్యి గడిగోట రోడ్డుమింద ఆయన ఇంటికెదురుగా నిలబడితి. యండ నేరుగా నా మొగానికే కొడతాంది. నేనెవురో వాళ్లకు తెలీదు. మాతో వాళ్లకు పనేమీ లేదు.

గడిగోట బస్సు దుమ్ము లేపుకుంటా వొచ్చి, నాకూ వొట్టిచాపలాయన ఇంటికీ నడుంగా నిలబడె. నా మొగమంతా దుమ్ము, జుట్టంతా దుమ్ము. బస్సులో నుంచి దిగేవోళ్లు దిగిరి, యెక్కే వో ళ్లెక్కిరి. బస్సు కదిలి, పోయ.

వాళ్లింటి అల్లుడేమో, ఇంటిముందర మంచంమీద పండుకోనుండాడు. వొట్టిచాపలాయన కనబళ్లాగానీ, వాళ్లింట్లోనుంచి ఎవురోవొగరు బైటికి వొస్తానే వుండారు పోతానే వుండారు. 'కోణ్ణి అలాల్ చెయ్యాల, ఇంట్లో యెవురైనా వుండారామ్మా' అని అడిగితిమనుకో, ఆ ఇంట్లోవాళ్లు పెడసరంగానో ఈసడింపుగానో మాట్లాడితే పడొద్దా!? మనమే వాళ్లింట్లోకి తొంగిచూసి 'వొట్టిచాపలాయన ఉండాడామ్మా' అని అడగాలంటే జంకు.

ట్రాక్టర్లు, ఇటికెల బండ్లు, వరిగెడ్డి బండ్లు, బస్సులు వస్సాండాయ్ పోతాండాయ్. పొద్దు ఇంగో బారడు పైకెక్కింది. నేను ఆణ్ణే నిలబడుకోనుండా. నీళ్లు దప్పికైతాండాయ్. నాతోపాటు గుడ్లకోడి. సచ్చే ముందుకాడ పాపం దానికీ నీళ్లు ల్యా. ఇట్టగాదులే అని నేరుగా రోడ్డుదాటి వొట్టిచాపలాయనోళ్ల ఇంట్లోకే బోతి.

వాళ్లింట్లో మాంసం కూర మసాలా వాసన. ఆ వాసనకు నాకు నోట్లో నీళ్లు వూరిపాయ. 'ఇంట్లో ఎవురైనా వుండారామ్మా' అని క్యాకేస్తి. 'ఎవురోళ్లు' అని లోపలినుంచి వొక ఆడామె గొంతు. నేను ఫలానా అని చెప్పుకునే పరిస్థితి గాదు. 'కోణ్ణి అలాల్ జెయ్యిచ్చుకుందామని వొచ్చినా'నంటి. 'తింటాండాడు. రోంచేపు బైటుండు, వొస్సాడు'

********** **********

రోంచేపు గాదు, యంచేపయినా వొట్టిచాపలాయన ఇంట్లోనుంచి బైటికిరాల్యా. మల్లా అడిగితే ఏమంటారో అని గమ్మున నిలబడుకోనుంటి. పో..ఇంచేపుటికి నెత్తిన టవలు, చేతిలో కత్తి, చెమ్ము, చెమ్ములో నీళ్లతో వచ్చె.

కోణ్ణి యల్లకిలా తిప్పి, కాళ్లకుండే గుడ్డ పేలిక కట్లు తెగ్గోసి, కాళ్లూరెక్కలూ కదలకండా పట్టుకోమని నాకుజెప్పి, దాన్ని నోరు దెరిసి, రోన్ని నీళ్లు బోసి, తల పట్టుకోని కసాకసామని దాని గొంతు సగానికి కోశ.

కోడి గిజగిజా తన్నుకుంటాంది. నెత్తర రోడ్డుమిందికి చిమ్మి పారతాంది. సుమారైన కుక్కపిల్ల ఒకటి రక్తం కోసం రాబోతా వుంది. కోడి కాళ్లూ రెక్కలు ఊడిపోకండా పట్టుకోవడం నావల్ల కాలా. పో..ఇంత నెత్తర పొయినాఁక దాన్ని యిసిరి రోడ్డుమిందికి పారేశ. కోణ్ణి కోసినప్పుడు మెడ విరిస్తే మెదడుతో సంబంధం తెగి పెద్దగా నొప్పి తెలీదు, పెద్దగా గింజుకోకుండా తొందరగా పానం పోగొట్టుకుంటాదని మా నాయన చెప్పిన్యాడు. అలాల్ చేసేవోళ్లు మెడ పూర్తిగా కొయ్యనూ కొయ్యరు, యిరిసెయ్యనన్నా యిరిసెయ్యరు.

కింద పడఁగానే, టపటపా రెక్కలు కొట్టుకుంటా రెండు కాళ్లమిందా లేసి పడతా లేస్తా రోడ్డెమ్మడీ పరిగెత్తబట్టింది. కుక్కపిల్ల రోడ్డుమింది నెత్తురును వొదిలిపెట్టి కోణ్ణి నోట కరుసుకుపోవాలని యంటబడింది. కుక్కను అదిలిస్తా నేనూ వొట్టిచాపలాయనా. మా యనకాల ఇంగో మూడు కుక్కలు. మొత్తానికి మా గుడ్లకోడి కుక్కలపాలు గాకుండా చేతికి దొరికింది.

వొట్టిచాపలాయన కత్తికి మల్లా వొగసారి పనిబెట్టేతలికి, తలకాయ యాలాడేసింది. యాలాడిన దాని తలను రెక్కసందులోబెట్టి, కాళ్లూరెక్కలూ కలిపి చాతబట్టుకొని మసీదు సందు గుండా, కుంటకయ్యల్లో పడి మా ఇంటికి జేరితి. ఇంటికి పోఁగానే మాయమ్మ, ¨రోంత పొద్దుండఁగా వొచ్చినావే నాయినా!" అని నిష్టూరం జేసి, "నూరిన మసాల గూడా ఎండిపోతాంది, దాన్ని వొలిచేదెప్పుడు, కాల్చి కోసేదెప్పుడు, ఉడకబెట్టేదెప్పుడు?" అంటా నా చేతిలోనుంచి తీసుకుండె.

మన కోణ్ణి మనమే కోసుకొనుంటే, ఈ యాళకు బంగారట్టా పులుసుజేసుకొని, ఉడుకుడుగ్గా తింటాండాల్సింది గదా! మనకు చాతనైన పనికి ముద్దార్ అని పేరుబెట్టి, పొద్దన్నుంటీ నన్ను యాష్ట(వేసట)బెట్టి, ఇప్పుడు మల్లా పోటుమాట లాడతాందని నాకు కొపమొచ్చింది. వొచ్చిందంటే అంతా ఇంతా కోపం గాదులే. ఆరోజు మద్యానం మిగతావోళ్ల సంగతేమోగాని, నా నాలిక్కు మాత్రం గుడ్లకోడిపులుసు రుసిగా తగల్ల్యా.

కామెంట్‌లు

Unknown చెప్పారు…
కేక! అదరగొట్టినావుబో...
Vinay Chakravarthi.Gogineni చెప్పారు…
iraga deesaru kada....................

11/10
Unknown చెప్పారు…
siyyala kooraa thineetappu ettuntaadoo..attannee vundi yoooo .chanduvuthanteee...
GIREESH K. చెప్పారు…
10/10
మయూఖ చెప్పారు…
రామనాధరెడ్డెన్నా నా చిన్నతనాన్ని గుర్తు చేసినావన్నా.మేము చిన్నప్పుడు మా ఇంట్లో కూడా నూరు ,రెండు వందలకు తగ్గకుండా కోళ్ళు వుండేవి.పొద్దు గూకుతానే వాటిని గంపల కింద మూసి పెట్టేది మా పనే.తిరిగి పొద్దున్నే గంపల కిందనుండి తెరిచేది మా పనే.ఎవరైనా చుట్టాలు రాత్రి వస్తే పరవాలేదు,ఎందుకంటే కోన్ని పొద్దున్నే గంపలు తెరిచే ముందు పట్టుకునే వాళ్ళం.ఒక వేళ పొద్దన పూట చుట్టాలు వస్తే మాత్రం,కోన్ని పట్టుకోవడాని మేము పడే పాట్లు అన్నీ ,ఇన్నీ కావు.నేను,మా నాయన, చిన్నాయన వాళ్ళు వురుకి వురికి కోన్ని తరిమి తరిమి పట్టుకునేవాళ్ళం.మా ఇంట్లో కూడా మాయమ్మ ముర్దార్ తినేది కాదు.మా వూర్లో అలాల్ చేయడానికి సాయబు ఉండే వాడు కాదు.అలాల్ చే ఇంచుకోవడానికి మూడు కి.మీ. దూరంలో ఉండే లాగల దగ్గర ఉన్న సత్తార్ దగ్గరికి పోయే వాళ్ళం.మధ్యలో నక్కలు కనిపించేవి.మా కోన్ని తినడానికి అది ప్రయత్నిస్తున్నట్లు అనిపించేది.చాలా భయం వేసేది.అలాల్ చేఇంచినామని మేమే కోసుకొని వస్తే ఎలా అని మాయమ్మను అడిగితే ,రుచిని బట్టి కనుక్కుంటానని మాయమ్మ చెప్పేది.కోడి పొదిగినప్పుడు ఆ పొదుగును తీసివేయడానికి ,నీళ్ళలో ముంచి దాని ముక్కులో ఈకను పెట్టే వాళ్ళం.గుడ్లమీద పొదిగినప్పుడు ఇరవై ఒక్క రోజుల తర్వాత గుడ్డు లోనుంచి వచ్హే చిన్న కోడి పిల్లలను చూసి ఎంత సంబర పడే వాళ్ళమో.ఆ పిల్లలను తన్నుకు పోవడానికి గద్దలు వచ్హినప్పుడు "ఓయ్" అని మా వీధిలో ఉండే వాళ్ళందరూ అరిచే వాళ్ళు.అప్పుడు ఆ గద్ద భయపడి పారి పోయేది.కోడి కూడా తన పిల్లలను కాపాడుకోవడాని గద్దను ఇంతెత్తుకు ఎగిరి వెంట పడేది.ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు వచ్హాయన్నా ,గుర్తు చేసినందుకు చాలా సంతోషమన్నా.
sunita చెప్పారు…
ఇన్ని రోజులాయ ఏమీ రాయలేదే అనుకున్నా! ఎలానో మిస్స్ ఐన టపా ఇవ్వాళ కొత్తటపా ఓపను కాక హోము కెళితె ఇది కంట పడింది. చాలా బాగా రాసారు అనను. అలా అంటే మీ రాత ను తక్కువ చేసినట్లే. గుడ్ల కోడి పులుసు తిన్నట్టే ఉంది. చిన్నప్పుడు తాత గారి ఊర్లో పెంచిన కోళ్ళు తిన్న కోళ్ళు అన్నీ గుర్తుకోచ్చాయి.
యేయే చెట్లకింద, పాదులకింద, కాలవల్లోనో యారకతింటా వుండే కోళ్లన్నీ రెపరెపరెపా రెక్కలు కొట్టుకుంటా ఎగిరొచ్చి వాలిపొయ్యేటియి.

రోంత సక్కదనం కుదిరిన పెట్టబొమ్మెలను చేరబిలుస్తా, తమ సంపాదనంతా తెచ్చి పెడతాన్నిట్టుగా 'ఇదో ఈ గింజ తిను, ఇదో యీడొకటి వుంది సూడు, ఇదో ఈ గింజలన్నీ నీకే, మొత్తం ఈ ఐదెకరాలూ నీదేననుకో' అన్నిట్టుగా తినిపిస్తా తినిపిస్తా, వాలుగా వొక రెక్క జారవిడిసి తొక్కులాడేటియ్యి. ఆ పెట్టబొమ్మెలు ఇదేమీ పట్టనట్టుగా గింజల పొడుస్తా వుండేటియ్యి.

టూ గుడ్
Ghanta Siva Rajesh చెప్పారు…
'ఇదో ఈ గింజ తిను, ఇదో యీడొకటి వుంది సూడు, ఇదో ఈ గింజలన్నీ నీకే, మొత్తం ఈ ఐదెకరాలూ నీదేననుకో' అన్నిట్టుగా తినిపిస్తా తినిపిస్తా, వాలుగా వొక రెక్క జారవిడిసి తొక్కులాడేటియ్యి

10/10

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె