Wednesday, May 27, 2009

గాలి తోలగూడదు - వాన పడగూడదు

శానా పొద్దుబొయినాఁక, ఇంటికాడ అన్నాలు కానిచ్చి, నేనూ మా నాయినా మెల్లిగా అట్టా మా చిన్నతోటలో తిరుగుదామని బైటికొచ్చినాం. చేతిలో మూడుబ్యాటరీల టార్చిలైటుతో మా నాయన ముందు నడుస్సాండాడు. ఆయన అడుగు తీసినచోట అడుగుబెడతా యనకమ్మడీ నేను.

శానా చిన్నప్పుట్నుంచిగూడా నేను మా నాయనతో నడిసినప్పుడల్లా కాలిబాటన మట్టిలో ఆయన అడుగుగుర్తు పడఁగానే ఆ గుర్తుమిందనే నా అడుగు మోపి నడవడం నాకలవాటు. ఆ మాదిరిగా నడిస్తే నేను తేలునో పామునో తొక్కేదానికి ఆస్కారముండదు. ఆ మాదిరిగా నడిస్తే పెద్దయినాఁక నేనూ మా నాయన మాదిరిగా భయం లేకండా మళ్లంబడీ తోటలంబడీ రాత్రుళ్లు పాములకూ, మండ్రగబ్బలకూ, గోరీలకాడ దయ్యాలకూ, కావిలి కుక్కలకూ బెదరకండా ఏ జామునంటే ఆ జామున తిరగ్గలనని నమ్మిక.

మా చిన్నతోట పక్కన సాకేరామన్న తోట. రెంటికీ మధ్యన రోంత ఖాళీ జాగా. ఆ సవుడుజాగాలో బతకల్యాక సావల్యాక అన్నిట్టుగా వుండే మామిడంట్లు. రోజు మార్చి రోజు పట్టుదలగా ఆ అంట్లకు బిందెల్తో నీళ్లు పోసీ పోసీ వాటిని పెద్దజెయ్యాలని చూస్తానే వుండారు.

ఎన్నెల పడి ఆ సౌడున్యాల తెల్లగా మెరుస్తాంది. సల్లగా గాలి తోల్తా వుంది. ఆ గాలికి ఇటు మాతోటలో, అటు సాకేరామన్నతోటలో మామిడాకులు సలసలమని కదుల్తావుండాయి. చెట్లకిందుండే ఎండుటాకులు ఉండుండి ఎగిరిపడతాండాయి.

ఉడుకుడుగ్గా కోడికూరా అన్నమూ కడుపునిండా తినుండటాన చెమటలు పట్టినాయి. ఆ సల్లగాలికి ఇద్దరమూ సౌట్లోకొచ్చి నిలబణ్ణాం. పగలంతా యిరగ్గాసిన యండలకు, వడగాలికి అలిసిపొయిన పానాలకు ఆ గాలి హాయిగా వుంది. గాలికి ఎదురుగ్గా నిలబడి అడ్డపంచెను సల్లుజేసి మల్లా బిగ్గట్టుకొంటి.

"ఎవురోళ్లు?" అని కేక ఇనబడె.

"మేమేలే రామన్నా" అంటా రామన్నతోటలోకి అడుగులేశ మానాయన.

రామన్న "నువ్వాన్నా! ... పెద్దబాబు గదూ? పంచెగట్టింటే ఎవురో అనుకుంటిలే" అని పలకరింపుగా మాట్లాడిచ్చ.

రామన్నతోట దాటి, గడిగోట రోడ్డూ గొట్టీటోళ్ల బాయీ దాటి మా పెద్దతోటకొచ్చినాం. గొడ్లురాకండా తోట సుట్టకారమూ కల్ల యేపించి, మణుసులు దాటుకుండేదానికి ఇరుకుమాను బెట్టిచ్చిన్న్యాం. ఆ ఇరుకుమాను దాటుకుండేటప్పుడు నా పంచె అంచు తగులుకొని పర్ర్‌రుమనె. మా నాయన ఏమన్నా అంటాడేమోననుకుంటి. "వొకటీ" అనె. అంటే చినగాల్సిన పంచెలు ఇంగా శానా వుండాయని అర్థము.

ఆమధ్యనే మా తాత పోవడంతో ఆయన దినానికి మా ఇంటికి శానా అడ్డపంచెలొచ్చిన్న్యాయిలే.

మా నాయన ఇంట్లో వుండేటప్పుడు ఎప్పుడన్నా స్టీలుగెన్నెలూ దబరాలూ కిందబడి చెవులు తూట్లుబడేటిగా జేసినా, నీళ్లకడవలూ బానలూ బిందెలూ జారి కిందబడినా ఎవురినీ ఏమీ అనడు. ఆ గిన్నెలూ కుండలూ చేసే సద్దుకు తగినట్టుగా దరువేస్తాడు. ఆయనకు దగ్గరగా వుండే కుర్చీమిందనో దూలం మిందనో గోడమిందనో, ఏదీ దగ్గిరల్యాకపోతే నోటితోనే. కిందబడేసిన మనిషితో సహా అందురూ నవ్వాల్సిందే. మానాయనమాత్రం నవ్వు రానిట్టుగా గమ్మునుంటాడు. గిన్నెల నొక్కులు తీసుకోవడం, పగిలిన పెంకులు ఏరుకోవడం తరవాత సంగతి.

ఇంతకూ మా పెద్దతోటలో ఈ వార నుంచి మెల్లిగా నడుసుకుంటా ఆ వార చెఱుకురసం చెట్టుకాడికి పొయ్యి నిలబడితిమి. ఆసారి బెంగుళూరుకాయల బరువు మొయ్యలేక మోస్సాండాయి చెట్లు. మలుగుబ్బలు సంగటిముద్దలంత పెద్దయ్యి కాసినాయ్. బేనీషా కూడా బాగా వూరినాయి. గాలి రోంత యిసురుగా తోలేటప్పుటికి ఆడొకటీ ఆడొకటీ కాయలు రాలిపడి దొర్లినట్టు శబ్దమొచ్చ. ఆ గాలి జోరుజూసి నాకు ఒళ్లు జలదరిచ్చింది.

"గాలితో వడగండ్లవానతో మనకెప్పుడూ పెద్దగా నష్టం కలగలేదా నాయనా?"

సెలవుల్లో ఇంటికొచ్చిన ప్రతిసారీ మా నాయన్ను అడగాలనుకొని, చానామాట్లు మర్సిపోయిన మాట. నా మాట మానాయనకు యినబడినట్టు లేదు. గాలికి యినబడక కాదు. ఏదో ఆలోచనలో ఉండాడు.

******* ******* *******

ఆం.ప్ర. బాలుర గురుకుల పాఠశాల (ముక్కావారిపల్లె)లో రోజూ పొద్దన్నే ప్రార్థనకు ముందు పిల్లకాయలంతా పేపరు చదవడం అలవాటు. మొదటిపేజీ, క్రీడాపేజీలకైతే సందు దొరకదు. పేపరును గోడకు ఆనించి ఎత్తిపట్టుకుని ముప్పైనలభైమందిమి ఎగబడి సదివేవాళ్లం. కడపజిల్లా స్పెషలుకు గిరాకీ తక్కువ. దాంట్లో మా వీరబల్లె పేరు పడిందేమోనని నేను రోజూ చూసేవోణ్ణి. మా వూళ్లో గలాటాలు తక్కవ, రాజకీయాలు తక్కవ, యాపారాలూ తక్కవే. అందుకే ఎక్కువగా కనబడదు. క్రైమ్ రిపోర్టులో కూడా కనబడదు.

మా ఊరి మామిడికాయల పేరుజెప్పి హైదరాబాదులోనేగాదు, ఆస్ట్రేలియాలో కూడా అమ్ముకుంటారని పేపర్లో వొచ్చినట్టు ఎవురో చెప్పినారు. యీరబల్లె మామిడికాయలు తియ్యగా వుంటాయని సుట్టుపక్కల జనం అనుకోడమూ, రాయచోటి కడపల్లో ఆ పేరుజెప్పి అమ్మజూపడమూ చూసినాంగానీ అంతకు మించి పేరుబడిందంటే, పేపర్లోబడిందంటే నాకూ ఆశ్చర్యమే.

'కడపజిల్లా స్పెషల్‌'లో మామిడికాయల వార్తలు ఎప్పుడూ ఫలనావూళ్లో గాలివానకు యిన్నిటన్నుల కాయలు రాలిపొయినాయి, ఫలానాచోట మామిడికి వడగండ్ల దెబ్బ, ఫలానా మండలంలో ఇన్ని లక్షలు నష్టం అన్నిలక్షలు నష్టం, రైతన్న డీలా, మామిడిరైతు నోట్లో మట్టి, రైతన్న ఆశలకు గండికొట్టిన గాలివాన, వండగండ్లు-కడగండ్లు ... ఈ మాదిరిగా వుండేటియ్యి. రెండుమూడేండ్లుగా చూస్తానేవుండా. చూసినప్పుడల్లా నాకు శానా బాధ. రైతు తప్ప ఈ దేశంలో నష్టపోయేవోడు ఎవుడూ లేడని.

మావూరి పేరు ఎప్పుడూ పేపర్లో రాకపోయినా ఫరవా ల్యా, ఈరకం వార్తల్లో వీరబల్లె పేరు రాకంటేసాలు సామీ అనుకున్యా.

******* ******* *******


"గాలితో మనకెప్పుడూ పెద్దగా నష్టం కలగలేదా?" మల్లా అడిగితి.

"అన్నీ పోఁగా మిగిలిందే మన సొత్తు."

"పేపర్లో ఫలానా వూళ్లో గాలివానకు ఇన్నిలక్షల పంట నష్టం అంటారే?"

"గాలి తోలగూడదు, వాన పడగూడదు అంటే కుదురుతాదా? పూత బ్రమ్మాండంగా పూసిందంటే కాపుగూడా బ్రమ్మాండంగా వుండాలని లేదు! కాపు ఫుల్లుగా పట్టినా ఆ పిందెలన్నీ నిలబడాలని యేముంది? వొగా౨ల(ఒకవేళ) నిలబణ్ణా ... చీడలు, చిలకలు, రెయ్యిపక్షులు, గొడ్లూ, దొంగలు, గాలి, వాన, అన్నీ తట్టుకొని మిగిలిందే కాపు. ఆ తరవాత కోత సరిగ్గా జరగాల. అన్నిటికీ మించి మండీల్లో సరైన ధర పలకాల."

"మ్"

"ప్రతి సమచ్చరమూ గాలీవానా మామూలే. చెట్లకు యాలాడతాండే కాయలను సూపెట్టుకోని, అదంతా మన సొమ్మేనని లెక్కలేసుకున్యామంటే మనకూ నష్టమే. అట్టగాదనుకుంటే ఏమీ ల్యా. రైతుకైనా అంతే, యాపారస్తునికైనా అంతే, ... ఎవురికైనా అంతే!"

నిజమేగదా అని ఆలోచన చేస్తా నిబడితి.

"... ఆ చెట్టుకింద నిలబడగాకు, మలిగుబ్బాకాయ రాలి నెత్తినబడితే గుండ్రాయితో మోదినట్టే!"

గబుక్కున బైకికొచ్చేస్తి. మానుకింది నుంచీ. ఆలోచనల్లో నుంచీ.

12 comments:

Afsar said...

raa.naa.re gaaru:

katha baagaa chepaaru.

voka saari kadapa velli vacchinattu..akkadi bhaashalo..akkadi manushulato...manasunna manushulato kaasepu gadipi vacchinattu...vundi

afsar

చిలమకూరు విజయమోహన్ said...

అయితే నాయన అడుగుజాడల్లో నడుచ్చాండవన్నమాట, అట్లే నాయన మాదిరి దరువేచ్చావా లేదా ?
"రైతు తప్ప ఈ దేశంలో నష్టపోయేవాడెవడూలేడని"
ప్చ్.. ఏంజేస్తాం మన బతుకులింతే :(

సత్యప్రసాద్ అరిపిరాల said...

శానా బాగా రాసిన్యావు రామనాథరెడ్డా..!!

రాయలసీమ యాస ఈ కథలో చక్కగా ఇమిడిపోయింది. వ్యవసాయ అనిశ్చితి ఆ తండ్రి పాత్రలోనే కాదు ప్రతి రైతు మనసులో ఒక సాధారణమైన సంగతైపోయింది..!!

9/10

Kishore said...

8/10

Anonymous said...

గలాటాలు తక్కువ, రాజకీయాలు తక్కువ, యాపారాలూ తక్కువే.
ఇంకేం, బంగారం లాంటి ఊరండీ మీది. బంగారంలాంటి నాన్న. బంగారంలాంటి కొడుకు, బంగారంలాంటి కతలు.. ఎన్ని బంగారాలేంటీ?

oremuna said...

I read this completely! good one.

>> రామన్న "నువ్వాన్నా! ... పెద్దబాబు గదూ? పంచెగట్టింటే ఎవురో అనుకుంటిలే" అని పలకరింపుగా మాట్లాడిచ్చ.


is this correct? last word?

రాధిక said...

రైతు పరిస్థితిని చాలా బాగా చెప్పారు.

సూర్యుడు said...

7/10

రాకేశ్వర రావు said...

నిన్నన నా కళ్ళ ముందే మా నాయినమ్మ తోటలో కోతుల మంద మాఁవిడి సెట్టెక్కి పండ్లన్నీ కొఱుక్కు తినేశినై. దాం దెబ్బకు మా అయ్య ఇయ్యాల తోటలో మిగిలిన సెట్లకున్న పిందూ పితకా కూడా కోయించి ఇంటికాడఁ బెట్టించాడు. రేపట్నించి మా అమ్మ పిందుల్దినమంటుందో యేమో..

అన్నట్టు మాకు మాఁవిడి చెట్లు ఎక్కువా లేవూ తక్కువా లేవు. అమ్ముకునేంత ఎక్కువా లేవు, తినగలిగేంత తక్కువా లేవు. రోజు ఇంటోళ్ళం మామిడికాయలు తినడం పనిగా పెట్టుకోవల్సుంటుంది.

మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్. said...

చాలా బాగా రాసారండి

Vinay Chakravarthi.Gogineni said...

10/10

రానారె said...

మీ అందఱికీ నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు.

అఫ్సర్ గారూ, మీరు ´గోరీమా´ కథ రాసిన అఫ్సర్ గారేనాండీ?

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.