ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వసన్ తోళ్లపల్లె మాట

మా అవ్వోళ్ల అమ్మగారివూరు వసంతవాండ్లపల్లె. ఆ వూరేమన్నా పాడిపంటల్తో తులతూగుతా వుంటాదా అంటే, ఏమీ లేదు. వాళ్లంతా బాగా లెక్కలున్నోళ్లా? ల్యాపోతే తిని బలిసినోళ్లా అంటే అదీగాదు. అందురూ అంతంతమాత్రం మణుసులే. ఆ పల్లెలో యేమున్న్యా ల్యాకన్న్యా కుశాలమాటలు మాత్రం యాడజూసినా యినబడతాంటాయ్. ఇద్దురు మణుసులు ఎదురుపణ్ణారంటేసాలు, రెండు యెగతాళి మాటలైనా రాలాల్సిందే. వరసైన ఆడమనిసి పోతాందంటే ఏదోఒకటి అనకండా పోనీరు. ఆ మనిసిమాత్రం? యాడ తగలాల్నో ఆడ తగిలేటిగా జవాబు చెప్పకండాబోదు. ఇయ్యన్నీ నాకెట్టదెలుసు అంటే, సెలవుల్లో నేనా వూరికి పోతాగదా!

ఎవురితోట పోతా? మా సిన్నాయనతోట. మా సిన్నాయనంటే మా అక్కులవ్వ కొడుకు. అక్కులవ్వంటే మా నాయనమ్మకు సొంత అక్క. మా సిన్నాయనోళ్లుండేది మూలపల్లెలో. మూలపల్లెలో ఈ మూల కేకబెడితే వసంతవాండ్లపల్లెలో ఆ మూలకు బ్రమ్మాండంగా యినబడతాది. రెండుపల్లెలకూ మధ్యలో వొగ బండ్లబాట అడ్డమంతే. నేను వసంతోళ్లపల్లె అంటాండాగానీ, మా సిన్నాయనైతే వసన్‌తోళ్లపల్లె అంటాడు. వాళ్ల మేనమామగారిని వసన్-తోళ్లు అంటాడు.

*************

నాకు గుర్తులేదుగానీ, మా అక్కులవ్వచెప్పేది - ఒక మంచి ఆవుండేదంట. పొద్దున్నే దాని పొదుగుకడిగి పాలు పిండుతావుంటే, నేను నిద్దర లేసి మంచం దిగొచ్చి, పొదుగుకు ఆ పక్కన కుచ్చున్యానంట. చెమ్ములో పాలు సుయ్యి సుయ్యిమని పడినప్పుడల్లా గువ్వపిల్లమాదిరిగా నోరు తెరుస్తా వున్న్యానంట. నన్నుజూసి ముచ్చటపడి, చెంబు పక్కనబెట్టి పాలు నా నోట్లోకే పిండితే శర్దగా తాగేసి, మూతి తుడుచుకుంటా లేసినిలబణ్ణానంట.

ఇంగా శానా కతలే చెప్పేది. అయ్యన్నీ నాకు గుర్తులేవు. మా యింటికి వొచ్చేటప్పుడు వెన్నబిస్కెట్లు తెచ్చేది. మేమంటే ఆమెకు శానా ఇష్టం. అక్కులవ్వ నూరిన చెనిగ్గింజల ఊరిమిండి, పొయ్యిగడ్డమింద పాలసెరివె నుంచి అప్పుడే తీసిన కమ్మని మీగడతో అప్పుడెప్పుడో వొకసారి తినిపించిన పొగలుబొయ్యే సంగటిముద్ద రుచి నాకింగా గురుతే.

ఈ రెండుపల్లెల్లో వున్నన్ని చిత్రమైన సామెతలూ, చాటువులూ, పిట్టకతలూ, పొడుపుకతలు, యెగతాళిమాటలూ యాడా వుండవేమో. అందుకే ఆడికి పోతే అంత తొందరగా రాబుద్ధిగాదు.

ఇప్పుడంటే పల్లెకు బస్సుందిగానీ, అప్పుడుమాత్రం కడపరోడ్లో బస్సుదిగినాక శానాదూరం నడక. నేను పుట్టకముందు ఆ బస్సుగూడా లేదు. వీరబల్లెనుంచి ఎద్దలబండ్లో పొయ్యేవాళ్లు, లేదంటే నడిసిపొయ్యేవోళ్లంట. నడిసినంతదూరమూ నవ్వులే.

**************

నేను తొట్టతొలిగా ఎద్దలబండి తోలింది ఆ బాటలోనే. బట్టుపల్లెలో వుండఁగా ఎప్పుడూ నొగల్లో కుచ్చోనిచ్చేవోళ్లుగాదు. ఒకసారి బండితోల్తానని గెట్టిగా అడిగి నొగల్లోకిపోతే, పెద్ద పాలెగానివేలే బండిదిగి ఇవతలికిరా అని కసిరె మాయమ్మ. నేను మొగం గంటుబెట్టుకోనుంటే మాయవ్వ చెప్పింది ... యా వూర్లోనో నాయట్టా పిల్లకాయంట. బండెక్కి నొగల్లో కుచ్చోఁగానే ఎద్దులు బెదిరి దౌడెత్తుకున్యాయంట. పగ్గాలు బట్టుకొని ఆ నొగల్లో కుచ్చునేదానికి వాని కాళ్లపొడుగు సరిపోలేదంట. ఎద్దులు ఒక గెనం ఎక్కి దిగంగానే ఆ పిల్లకాయకు పట్టుదొరక్క నొగల్లోనుంచి జారి కిందబణ్ణాడంట. ఇంగేముండాది! పడతాన్నిపాటికే ఆ పిల్లకాయ మెడలమిందుగా బండిచక్రం పోయెనంట.

ఇట్టాటి కతజెప్పినాఁక ఇంగేమడుగుతా? బండి ఎవురు తోల్తవున్యా, యట్ట తోల్తాండారనేది మాత్రం చూస్తానే వున్యా. ఎప్పుడన్నా మనకూ ఆ అదును రాదా అప్పుడు తోలకపోతామా అని.

వొగ రోజు యద్దలబండ్లో నాలుగు వడ్లమూటలు యేస్కోని వడ్లమిషను కాడికి పొయ్యి వస్సాండాము నేనూ మా సిన్నాయనా. వచ్చేటప్పుడు సక్కఁగా పొడుగ్గా వుండే దోవ జూసి, రోంచేపు పగ్గాలు పట్టుకుంటానని మా సిన్నాయన్ను అడిగినా. మనం అడిగిన అడగటానికి పగ్గాలు చేతికిచ్చి నొగల్లో కూచొబెట్టుకున్న్యాడు.

ఆ యెద్దులు బలే గొడ్లుగా వుండాయి. నేను గొమ్మున పగ్గాలు పట్టుకోని కుచ్చోనుంటే వాటంతకు అయ్యే పోతాండాయి. ఇంగ నేను తోలేదేముండాది? ముల్లుగట్టె చేతికి దీస్కున్యా. పగ్గాలు రెండూ యడమచేతికి తీసుకొని, ముల్లుగట్టెతో యలపటెద్దును మక్కిమింద పొడిస్తి. అది నీలిగి దౌడెత్తుకుండె. దాపటెద్దును కూడా పొడుజ్జాము అనుకుంటిగానీ, ముల్లుకట్టె కుడిచేతిలో వుండాది కదా! జారి పడితే మాయవ్వ జెప్పిన కతలో మాదిరిగా ఔతాదేమోనని భయమేశ.

అప్పుడు బాట యడంపక్కకు మలుపు తిరుగుతాంది. ఇదిగదా మనం బండి తోలేదానికి అదును! కుడిచేతి పగ్గాన్ని వొదిలేసి, యడంచేతిలో పగ్గాన్ని గాట్టిగా లాగి పట్టుకొంటి. దాపటెద్దు మోరపైకెత్తి అట్నే నిలిసిపాయ. యలపటెద్దును టర్‌ర్ మని ఒక పోటుపొడిస్తి ముల్లుగట్టెతో. బండి యడమ గాను(చక్రం) మింద గిర్రుమని తిరిగింది. "ఓవ్ ఓ...వ్.., పగ్గాలు యిట్ట త్యా" అనె మా సిన్నాయన. నోరెత్తకుండా పగ్గాలిచ్చేస్తి.

ఇంటికొచ్చి అన్నం తిన్న్యాక మా సిన్నాయన నన్ను పిలిచి, "నొగల్లో మనిసి గమ్మున పండుకోని నిద్దరబొయినా రాయచోటినుంచిగానీ ఇంటికొచ్చేసే ఎద్దులు. మనం మర్యాదగా జూసుకుండే కొదికీ వాటికీ మనమీద అభిమానం. ల్యాకంటే మొద్దుబారిపోతాయి. చేతికి ముల్లుగట్టె దొరికిందిగదా అని రగతం కారేటిగా పొడుస్సామా!", యలపటెద్దును చూస్తా అనె. నేను పొడిసిన చోట్లనుంచి నెత్తురు కారి ఎండిపొయ్యింది. నెత్తుటి మింద ఈగలు వాల్తావుంటే అది తోకతో కొట్టుకుంటా గడ్డిపోసలు నముల్తాంది.

ముల్లుగట్టె ఇంత పని చేస్తుందనుకోలా. మూడుమూరల పొడుగు సన్నటి వెదురు కట్టె అది. దాని కొసన ఒక అడ్డేలెడు పొడుగు కోసుగా వుంది ఇనప ముల్లు. ఇన్నాళ్లూ నేను జూసిన ముల్లుగట్టెలకు ఇంత పొడుగు ముల్లూ లేదూ ఇంత వాదరా లేదు! వాఁటితో పొడిసినా ఎద్దులకు రోంత సురుకు దప్ప ఏమీ గాదు.

ఆ సాయంత్రం ఎద్దును గాటికాడ కట్టేసినాఁక, దాని గంగడోలు నిమురుతావుంటే అది సగిచ్చినట్టుగా మోర పైకెత్తుకోని కదలకండా నిలబడె. చెయ్యి నొప్పిబెట్టిందాఁక దువ్వి పక్కకొచ్చేస్తి.

నేను చేసిన పని తలచుకొని చాన్నాళ్లు బాధపణ్ణా.

**************

మూలపల్లెకొచ్చిందాఁక ఆ బాట పొడుగునా మాటలూ పాటలూ పద్యాలూ. ఆ దోవన నడిసేటప్పుడు నేర్చుకున్న్య పద్యమొకటి ...

నడినెత్తిన నోరుండు నాగేంద్రుఁడు గాదు
వొంగి తపసు జేయు యోగి గాదు
ప్రజలనుఁబుట్టించు బ్రమ్మదేవుడు గాదు
దీని భావమేమి తిరుమలేశ?!


వొట్టి పద్యమె గాదు (పొడుపు)కత కూడా ఇది. ఇంతకూ దీని భావమేందబ్బా అని ఆలాశన చేస్తావుంటి. తోళ్లపల్లెలో ఒక మామను అడిగితే, "నీ కత నేనెందుకిప్పుతా! నువ్వే యిప్పిసూస్కో నీకే కనబడతాది" అన్న్యాడు. మనమేం తక్కువోళ్లమా! మొత్తానికి కనిపెట్టేసినాం.

ఆ మామ నవ్వి, ఇంగో కత జెప్పె. ఆత్బెరికితే గొల్లూడొచ్చెనని. దీనర్థం నాకు ముందే తెలుసు. కత యినేదానికి అట్టుంటాదిగానీ, దాన్ని యిప్పితే ఏమీలేదు. రోజూ పొద్దన్నే సద్దిలోకి నంజుకునేదే.

ఈ రకంతో నేను అలివిగాని పండితుణ్ణయిపోతానని బయమేమో! సెలవుల్లో వారంకంటే ఎక్కువనాళ్లు అక్కడ వుండనిచ్చేవాడు కాదు మా నాయన. అయినా సరే, నాకు వీరబల్లె బడిసదువులు మరుపుకొస్సాయేమోగానీ 'వసన్‌తోళ్ల' పల్లెసదువులు మాత్రం మరుపు రావు.

కామెంట్‌లు

Dr.Pen చెప్పారు…
10/10
ఇక ఆ పొడుపు కథ నేను విప్పానోచ్!
johnbk చెప్పారు…
9/10
Will wait for the next one..
Srinivas Sirigina చెప్పారు…
ఎప్పటిలానే చాలా బావుంది. మీరు చూసుకున్నారో లేదో కానీ, మీ లంకె బిందెలు మాకు కనబడటం లేదు. మీ ఫాంట్ కలరు, బ్యాక్ గ్రౌండ్ కలరు రెండూ తెలుపే కావడంతో అక్షరాలు అదృశ్యమైపోతున్నాయి. మీరు కావాలనే అలా చేసుంటే సరే, లేకపోతే మీ ఫాంట్ కలరు నలుపు (000000) రంగులోకి మార్చండి.
Unknown చెప్పారు…
10/10
మయూఖ చెప్పారు…
very nice.
kiraN చెప్పారు…
అవును.. మనకేది ఇష్టమైతే అదే బాగా గుర్తుంటుంది.
వెతికి కనిపెట్టి మరీ చదువుకోడానికే ఆ లంకె బిందెలు.



- కిరణ్
ఐతే OK
sreeniyaparla చెప్పారు…
10/10

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె