ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పారిగోడ పడిపోయిన కత

వారంనాళ్లుగా పట్టినముసురు పట్టినట్టేవుండాది. జోరుగా వాన కురుస్తాంది. మా పెంకుటింటి వరండాలో మంచాలమింద కుచ్చోనుండాము నేనూ, మాయవ్వా, మా గోపీ, మా మామ. మామా అని పిలవడం మాకు అలవాటుజేసినారుగానీ నాకంటే రెండున్నర నెలలే పెద్ద. మా అత్తమ్మ కొడుకు.

వరండా ఎదురుగ్గా పారిగోడ. ఆ ఇటికెలగోడ కింద మోకాటెత్తుదాఁక వుండాల్సిన గునాదిరాళ్లు మాత్రం లేవు. దాంతో పారిగోడ గాల్లోనిలబడినిట్టుగా వుండాది. ఆ గోడకిందికి పిల్లాపీచూ గొడ్డూగోడా రాకండాజూస్తాంది మాయవ్వ.

వానజోరు పెరిగేగొదికీ మా పారిగోడ పర్ర్‌మని, రోంత పక్కకు ఒరిగినిలబడె. తోస్తేపడేటట్టుగా వుండాది. మాయవ్వ శానా బాదపడిపాయ. మా మామగూడా అవ్వతోపాటు బాదపడతాండాడు.

"ఆ గోడకట్టేదానికి అంత శం-బడితిమి ఇంత శం-బడితిమి, అంతంత సిమ్టీ(సిమెంటు) పోసి నిలబెడితిమి, ఆ సిమ్టీ గెట్టిపడేదాఁకా పీర్రాతికాణ్ణించీ నీళ్లుమోసకచ్చి ఒకమొయిన పోసిపోసి వొడబడితిమి" అని మొదులుబెట్టింది మాయవ్వ.

"యట్టా పడేదేగదా, నేనే తోసిపడేచ్చా౨" అంటా మంచం దిగితి. గోపీ కూడా దిగబాయె.

"పెద్ద పయిలుమానువేలే, మర్యాదగా వొచ్చి మంచం మింద కుచ్చో" అవ్వ నన్ను కసిరిన కసరటానికి గబుక్కున మంచమెక్కేసినా.

"ఈ వానలకు యట్టా పడిపొయ్యేదే గదా, మనమే పడేజ్జా౨ము. ఎవురైనా దానికింద పడతారేమోనని కావిలిగాసే పనుండదుగదా!" ఈసారి మావయ్యా మామామా నన్ను వొగ సూపుజూసినారూ .. అంత యీనంగా జూసినారు.

నాతోమాట్టాడ్డం మానేసి, వానదేవునితో చెప్పినిట్టుగా, "ఈనాటితో ఇల్లు బోసిపాయ. పల్లెకు మొగదాల వుండాం, పారిగోడ ల్యాకండాపాయ!" ఏడుపుమొగంబెట్టి చెబుతానేవుండాదిగాని, అవ్వకు దుఃక్కంరాలా. వొస్తేబాగుండునని శం-బడతాన్నిట్టుగా వుండాది నాకు ఆమె మాటలు యింటావుంటే. ఏమంటే, ఆ గోడను నా యడమకాలితో ఒక్క తోపుతోసి, అంత గోడ దబ్బున కిందబడి పగిలిపోతే యెట్టుంటాదో సూడాల - అని ఒకపక్క నాకు పీకుతాంది.

ఇంతకూ పారిగోడకిందున్నె రాతికట్టు యాడికిబోయెనో నేను చెప్పలా కదా? అది యాడికో పోలా. మా సంతవనంలో గునాదుల్లోకే పొయింది. సంతవనం అంటే మా చిన్నమామిడితోటా వొరిమడీ వుండేచోటే. మా తాతకాలంలో ఆ స్థలంలో సంత జరిగేదంట. ఆ సంత ఆ తరవాతెప్పుడో యీరబల్లెకు మారిపొయ్యింది.

బట్టుపల్లెలో చేదబాయికాణ్ణించి నీళ్లుమోసే పని తప్పినట్టూ, ఆ రాతిమిద్దెలో తేళ్లబాధ తప్పించుకున్నట్టూ, గొడ్డూగోదా పడకుండా మామిడితోటను పెంచినట్టూ, కూత బెడితే యీరబల్లెకు యినబడేంత దగ్గిరగావున్నిట్టూ, దొంగదో-మంచిదో కరంటు కూడా వున్నిట్టూ వుంటాదని సంతనంలో చిన్న బోదకొటం ఒకటి యేస్కొని వుండిపోదామనుకున్యాం. కలిగిననాడు ఒక చిన్న హవేలీ కట్టుకుందాం అని గునాది తీసిపెట్టినాం. ఆ గునాదికోసమే బట్టుపల్లె పారిగోడ నుంచి రాతికట్టును వూడబెరకడం. మంచి కొండరాళ్లు.

పొయ్యిలోకట్టెలకు కొదవల్యా. బుడ్డీ ఎదురుగ్గా పుస్తకంబట్టుకోని కూచ్చునేబాద ల్యా. బుడ్డీమిందికి తూగి తలెంటికలు కాల్చుకునే బదులు, కరంటు బలుబు కింద హాయిగా సల్లగాలిలో మంచం మింద కుచ్చోని సదువుకోవచ్చు. బుడ్డీ ఆరిపోతుందనే భయంల్యా. శ్రీ శ్రీనివాసా కాన్వెంటుకు క్యారీల్లో అన్నంబెట్టుకొని పోవాల్సిన పన్లా. మధ్యానం ఇంటికే వొచ్చి, చిత్రసీమ ఫిలింగీతాలు వింటా తిని, సెకండుబెల్లు కొట్టేలోగా పోవచ్చు. అన్నిటినీ మించి - ఇష్టమొచ్చినన్ని నీళ్లుబోస్కోని ఇష్టమొచ్చినన్నిసార్లు స్నానాల్జెయ్యొచ్చు. ఇష్టమొచ్చినప్పుడు మా బాయిలో ఈతాడిరావొచ్చు. ఈ వారందినాల ముసురుకు, ఆరోజు పెద్దవానకూ కోమటోనిచెఱువు మొవరబోతాందన్యారు చూసొచ్చినోళ్లు. చెఱువునిండి కాలవసాగిందంటే మా బాయి నిండుతాది. సమచ్చ౨రం పొడుగునా బాయిలో నీళ్లుంటాయి.

సంబరపడాల్సింది ఇంతుండఁగా - ఆ ఒంటిపొరగోడ వొరిగిపోతాందని వొగటే బాధపడిపోతాందే మాయవ్వ! కచ్చితంగా నాటకమాడతాందని నాకు అర్థమైపొయ్యింది.

ముట్టికొండ మింద నిట్టనిలువుగా ఒక మెరుపు మెరిశ. కండ్లు నాశనంగాపోతాయేమో అనిపిచ్చింది. అప్పుడొచ్చిందొక శబ్దమూ - పెఠిళ్లుమని మా పెంకుటిల్లు పగిలిపోతుందనేటిగా వొచ్చింది. భయపడి అందరమూ చెవులు మూసుకున్యాం. నేనైతే నిజ్జంగా బిత్తరకపొయినా. మా ముగ్గురినీ చేతలకిందికి తీసుకొని "అర్జనా పాల్గుణా" అనె వాయవ్వ. ఆ వురమడం వురమడము వొగ నిమిషంసేపు యిమానాలమోతమాదిరిగా మోగిపొయ్యింది. ఉరుము సద్దుమణుగుతానే వచ్చేసింది చూస్కో వాన.. ముట్టికొండ నుంచి నక్కలగుట్టమిందికీ నక్కలగుట్టకాణ్ణించి బట్టుపల్లెమిందికీ నిముషంలో వొచ్చేసింది. బలమైన మోజు.

హోరుమని కుండపోతగా పో..యించేపు పెద్దపెద్ద చినుకులతో నిలకురిసేటప్పుటికి, "ధున్" అని శబ్దంజేస్తా వొక పక్కన పడిపాయ మా పారిగోడ. అప్పుడొచ్చేసింది మాయవ్వకు యేడుపు, నిజ్జంగా కడుపులోనుంచి పెరక్కొచ్చేసింది. మా మామ ఏడ్చేసినాడు. వాళ్లనుజూసి నాగ్గూడా యేడుపొచ్చేసింది. మా గోపీగాడు ఆ వాననూ, పారిగోడనూ, మాయవ్వనూ మార్చి మార్చి చూస్చాండాడు. ఇల్లిడిసిపెట్టిపోతాండము, పల్లెనే యిడిసిపెట్టేసి పోతాండామే, దరిద్రమంతా ఈణ్ణే యిడిసిపెట్టిపోతాండామని అనుకుంటాండామే - మ్.. అయినా యేడుపేనా!

కామెంట్‌లు

Bhãskar Rãmarãju చెప్పారు…
7/10
GIREESH K. చెప్పారు…
8/10
చాలా బాగుంది.రాయలసీమ మాండలికాన్ని దించారు.చిన్న సూచన
ఈ పదాలు ఇలా వుంటే ఇంకా బాగుండేదేమో

మా అత్తమ్మ కొడుకు ---మా అత్త కొడుకు

పెద్ద పహిలుమానువేలే ---పెద్ద పయిల్మానువులే

శ్రీ శ్రీనివాసా కాన్వెంటుకు -- శ్రీ శ్రీనివాసా కాన్మెంటుకు
రానారె చెప్పారు…
@భాస్కర్ రామరాజు, గిరీశ్ గార్లు- నెనరులు
భాస్కర రామిరెడ్డిగారూ, నమస్తే. మీరు చేసినవి చాలా మంచి సూచనలే. యాసవిషయంలో నాకు సందేహం లేదు కానీ, కొన్నిపదాల విషయంలో వుంది. ఉదాహరణకు, మామూలుగా అందరూ అత్త అనే పలుకుతారు. అత్తమ్మ అనేది మాయింట్లో మాకలవాటు కాబట్టి అట్లే నిలిపితే బాగుంటుందనిపించింది. పయిల్మాను-పహిల్మానులలో మొదటిది సరిగా అర్థంకాదేమోననే సందిగ్ధంతో కొంచెంసేపు ఊగిసలాట - ఇప్పుడు మార్చేస్తా. కాన్వెంటును మామూలు జనాలంతా కారిమింటు అనేవాళ్లు. కొందరు పిల్లకాయలు, కొందరు చదువుకున్నోళ్లూ కాన్మెంటు అనేవాళ్లు. ఆ రెండూ తప్పే, ఒకసారి స్పెల్లింగు చూడు అని మా నాయన మాకు చెప్పడంతో కాన్వెంటు అనడం మొదట్నుంచీ నాకలవాటయింది. రాసే ప్రతిసారీ నాకు ఊగిసలాటే. నేను చెబుతున్న కథ కాబట్టి నేను పలుకుతూవుండిన పదాల్లోనే చెప్పాలనుకున్నాను. సరిపోతుందంటారా?
దేవన చెప్పారు…
కత బాగుండాది.
చైతన్య.ఎస్ చెప్పారు…
బాగుంది రానారె గారు.
నేస్తం చెప్పారు…
చాలా బాగుందండి
రవి చెప్పారు…
పెద్ద పయిలుమానువేలే - పెద్ద పాలేగానివిలే అని మా వూరు మాండలికం.
పయిలుమానువేలే అన్నది కూడా అప్పుడప్పుడు వాడతాం.
చిత్ర సీమ - ఫిలిం గీతాలు పన్నెండు - నలబై కి, మళ్ళా ఒగటిన్నరకి. ఒగటి పదహైదుకి పాడిపంటలు - ఏకాంబరం, చిన్నవ్వ :-) భలే గుర్తుకొస్తన్నాయ్ అన్నీ
కొత్త పాళీ చెప్పారు…
ఆ యాసలో పుట్టి మునిగి నాని పైకి తేలిన వాళ్ళక్కూడా, ఆ ప్రాంతం నించి దూరంగా ఉండి ఇట్టాంటి కతల్రాసేటప్పుడు ఇట్టాంటి డవుట్లొస్తా ఉంటాయి. ఇట్టాంటి డవుటొచ్చినప్పుడు నిన్ను నువ్వు ఒక ప్రెశ్నేసుకో. ఈ కత చెబుతున్నది ఎవరి గొంతు? ఎనిమిత్తొమ్మిదేళ్ళ రాముదా, అమెరికాలో ఉన్న రానారె దా?
రామనాధ రెడ్డి గారూ!
మీ "పారిగోడ " ఆత్మ కథామాలిక ఆసక్తికరంగా ఉంది.
మరిన్ని మీ అనుభవాలను ఆస్వాదించేందుకు ఎప్పటిలాగే ఎదురుచూస్తూ!
.తవ్వా ఓబుల్ రెడ్డి.
అజ్ఞాత చెప్పారు…
paari goda bagundi. meeru anumatiste e kathani maa 'navya' weekly lo prachuristam. mee abiprayanni 'navyaweekly@rediffmail.com'ku post cheya galaru.
- jagannadha sarma
editor
navya weekly

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె