Monday, December 22, 2008

కోదండరామాంజులు

మనిసన్న్యాక రోంత సున్నితముండాల. మొద్దుబారగూడదు. మనిషి మొద్దుబారితే ముందు వానికేనష్టము, మల్లనే మిగతాజనానికి నష్టము. ఎవురైనా యెందుకుమొద్దుబారతారు అంటే వొగ సిన్న కజ్జెప్తా.

నేను మూడోతరగతివరకూ మా బట్టుపల్లెలో నాగన్నైవోరిబళ్లోనే సదువుకున్న్యిట్టు చెప్తిగదా. శ్రీ శ్రీనివాసాకాన్వెంట్లో నాలుగోతరగతిలో జేరేటప్పుటికి రోంత ఆలస్యమయింది. అప్పుటికే ఇరవైమూడుమంది పిల్లకాయలు చేరిపొయ్యుండారు. శానామంది వొకటోతరగతి నుంచి కాన్వెంట్లో సదివినోళ్లే. వోళ్ల పేర్లుగూడా ఏబీసీడీల ప్రకారమూ తిరగరాసి నంబర్లుగూడా ఇచ్చుండారు.

రెడ్డొచ్చ మొదులుబెట్టు అనేమాట మా నాగన్నైవోరిబళ్లో చెల్లుబాటౌతుందేమోగానీ శ్రీశ్రీనివాసాకాన్వెంట్లో కాదుగాబట్టి "టొంటీఫో..ర్" అంటే "ప్రజెన్ మాస్టే" అని పలకాల. మేడమైతే "యస్ టీచే" అనాల. నాగన్నైవోరిబళ్లోమాదిరిగా చింతచెట్టుకింద ఇసకలోగాదు, బోదకొటంలో బండలమింద గంటలతరబడి మెదలకండా కుచ్చోవాల.

ఆరంకణాల కొటంలో నాలుగోతరగతి ఒకపక్కకూ, ఐదోతరగతి ఇంగోపక్కా మల్లుకొని కూచ్చోవాల. రెండు తరగతులకూ మధ్యలో వుండే దూలానికి కోదండం యాలాడతాంటాది. కోదండమంటే దూలానికి దండమాదిరిగా కట్టిన రెండుమూరల నులకతాడు. మార్కులు తక్కువొచ్చిన పిల్లకాయలనూ, రోజూ బడికి ఆలస్యంగావొచ్చే పిల్లకాయలనూ కోదండం ఎక్కిస్తారు. ఎక్కినోళ్లు కిందికి దిగేటప్పుటికి వాళ్ల తాతముత్తాతలతో సహా దిగుతారు!

నేను చేరిన ఐదునాళ్లకే యూనిట్ టెస్టులు. మల్లికార్జున మాస్టర్ క్లాసులో ఇరవై ఐదుకు ఒక మార్కు తక్కువొస్తే ఈతబర్రతో అరచేతిమింద ఒకదెబ్బ. ఇరవైకి తక్కువొస్తే చెక్కస్కేలుతో చేతివేళ్ల గెనుపులమింద స్కేలుగేడితో దెబ్బలు. పదహైదుకు తక్కువొస్తే క్లాసయిందాఁకా గోడకుర్చీ. అంతకు తగ్గితే కోదండం. కొత్తగాబట్టి నేను యూనిట్‌టెస్టు రాయలా.

నా ఖర్మకాలి నన్నూ ఏదో వొగరోజు కోదండం ఎక్కిస్సారేమో, అదెట్టుంటుందో సూజ్జా౨మని నాకునేనుగా వొగట్రెండుసార్లు స్టూలెక్కి కోదండానికి యాలాడి చూసినా. యాలాడఁగానే వేళ్లు అంటగరసకపొయ్యేటిగా నొక్కేస్తాది. అర్దనిమిషం గూడా వుండల్యాకపొయినా.

యూనిట్‌టెస్టులో రామాంజులుకు మార్కులు ఐదోఆరో వొచ్చినాయి. అప్పుడు మా కాన్వెంట్లో శానామంది రామాంజులులుండేవోళ్లు. వొక్క పోలోళ్లపల్లె నుంచే ముగ్గురు రామాంజులులు. వీళ్లుగాక పోలోళ్లపల్లెనుంచి ఒక రామాంజులు మాస్టరు కూడా వున్యాడు.

ఐదారుమార్కులొచ్చిన రామాంజులును నడుము పట్టుకొని, రెండు అరచేతుల మధ్యలో కోదండం అందేదాఁక పైకెత్తి, ఆ తాడు మీదిగా రెండుచేతులవేళ్లను పెనవేయమని చెప్పి, వదిలేసినాడు మల్లికార్జున మాస్టర్. వేలాడే ఒళ్లు బరువుకు చేతివేళ్లను ఊడిరానీయకుండా కోదండం నొక్కుతావుంటే యట్టుంటాదో రామాంజులును అడగాల్సినపన్ల్యా.

వొగపక్క రామాంజులును కోదండమెక్కించి, ఇంగోపక్క కొందరిని గోడకుర్చీవేయిచ్చి, మల్లికార్జునమాస్టర్ మాకు పాఠం మొదులుబెట్టినాడు. పదైదు నిమిషాలయుంటాది. గోడకుర్చీ యేసినోళ్లు యేడ్సినారు గాని, రామాంజులు మాత్రం కుయ్యికయ్యిమన్ల్యా. పాఠమయినాఁక కిందికి దించితే వేళ్లు నలుపుకుంటా ఉఫ్ ఉఫ్ప్‌మని ఊదుకుంటా కుచ్చున్న్యాడు.

ఆ తరువాత క్లాసు రసూల్ మాస్టర్‌ది. పదైదు మార్కులకంటే తక్కువొచ్చినోళ్లు మాస్టర్ కుర్చీముందుండే బల్ల కాలికింద చేతివేళ్లునాలుగూ పెట్టాల. మాస్టరు బల్లమింద మెల్లగా కుచ్చోని నొక్కుతాడు. రోంచేపు యేడిస్తే తీసేస్తాడు. రామాంజులు యేడ్సడే! నొప్పి జాచ్చీ అయితే ఆ అని నోరుదెరుచ్చా౨డుగాని యాడ్సడు.

అల్లరోడా అంటే కాదు. సదవడా అంటే, దించిన తల ఎత్తకండా సదువుతాడు. మార్కులొచ్చా౨యా అంటే రావు. యీడింతేనని మాస్టర్లు వొదుల్తారా అంటే వొదల్రు. ఒక్కనాడు గాదు, ఆ వొక్క పరీక్షగాదు, సమచ్చ౨రం పొడుగునా యింతే.

రామాంజులుకు యెట్టుండేదో యేమోగాని, ఆ బాదలు చూసేదానికి మాత్రం శానా నిబ్బరం గావాల.

1 comment:

శిరిగిన సీను said...

అమ్మో తలచుకుంటేనే వళ్ళు జలదరిస్తుంది. పాపం రామాంజులు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.