Wednesday, September 24, 2008

గోమాతలు - జోరీగలు - బుద్ధిమంతులు

పొద్దు గూకింది. వరి మడి గెనం మీదుండే గడ్డిని మా జెర్సీ ఆవు గబగబా మేస్తాంది. బాయిలో నీళ్లు సరిగా వూరక, వూరినా తోడేదానికి కరంటు సరీగా రాక, కనాకష్టంగా కాపాడుకొంటా వుండిన వరిమడి. సందు దొరికితే నాలిక చాపి నోటినిండా పచ్చని వొరిమడిని అందుకొని తినెయ్యాలని కూడా చూస్తా వుంది ఆవు. దాని మొగదాడు పట్టుకొని గెనం మింద నిలబడుకొని .. నేను. అప్పుటికి దాని దొక్కలు* సుమారుగా పైకి లేసినాయి.

ఆకాశంలో పడమటి దిక్కున వుండే వొకట్రెండు మోడాలు యర్ర రంగు నుంచి నలుపుకు తిరుక్కుంటాండాయి. మొబ్బయితే యింటికి తోలకపోయి కట్టేచ్సామని మా యావుకు తెలుసు. నాకు ఆ బుద్ధి పుట్టనీకండా 'శానా పనుండాది నాకు' అన్నెట్టుగా శర్దగా మేస్తాంది. జెర్సీ ఆవుకు యంత గెడ్డి మాత్రం యేమి సరిపోతాది?

సందేల పూట ఆ రకంగా మేసే ఆవును మొగదాడు పట్టి ఇంటికి తోలకపొయ్యి నీళ్లు తాపి కట్టేసేవాడు పాపాత్ముడు. ఆ మాట ప్రకారం నేనుగూడా పాపాత్ముణ్ణే. యేం జేచ్చాము? ఆ మొబ్బులో చీటీగలు* కరుచ్చాంటే యంతసేపని గెనం మింద నిలబడుకోని మేపుతాము!? కాకపోతే ఆ రోజు మాత్రం, దాని దొక్కలు నిండి, నీళ్ల కోసం దానికదే యింటికి పరిగెత్తిందాఁక - నేనుగా తోలక పోగూడదనుకున్యా. ఇంగా రోంత యలతర* గూడా వుండాది.

అంత శర్దగా మేచ్చా మేచ్చా వుండే ఆవు వున్నిట్టుండి యెనక్కాలితో గభీ మని కడుపుతో తన్నుకునింది. దానికి యంత సురుకు తగిలిందో ఏమోగానీ మేత ఆపేసి మొర పైకెత్తి గట్టిగా కండ్లు మూసుకునింది. ఎందుకురా అంటే - ఏ జోరీగో గుఱ్ఱపీగో సుర్రుమనిపిచ్చి వుంటాది. ఆ తన్నుకు కడుపులో తగిలిన దెబ్బకు తట్టుకోల్యాక, నెమ్మనెక్కన్యాలి అని వరసలు చూడకండా ఆ ఈగను తిట్టింటాదేమో! ఆవు మల్లా మేతకు వొంగె. మల్లా కుట్టినట్టుంది ఈగ, ఈసారి కాలు గట్టిగా ఝాడిచ్చింది. బుస్సమని బుసపెట్టింది.

అంతలో రేడియో చాత బట్టుకొని మా గోపీగాడు వచ్చినాడు. ఆవును పట్టుకోమని జెప్పి తాడు వాని చేతికిచ్చి ఆవు పొదుగుకాడ చూద్దును గదా, జోరీగలూ గుఱ్ఱపు ఈగలూ చెప్పేదానికి ల్యాకండా దాడికి దిగినాయి. నాలుగు ఈగలు వాలిన చోట అరచేత్తో ఫట్ మనిపిస్తి. చెయ్యంతా నెత్తర. తీరా చూస్తే సచ్చింది వొక్కటే. నా అరిచెయ్యి చానా చిన్నది కావడాన, ఈగలు సులువుగా తప్పిచ్చుకుంటాండాయ్. రబ్బరు మాదిరిగా వుండే గుర్ఱపీగలు నా వేళ్ల సందుల్లో నక్కి, చెయ్యి తియ్యగానే ఎగిరిపోతాండాయ్. తప్పిచ్చుకున్న ఈగలు మల్లా వచ్చి వాల్తాండాయ్. చేత్తో కొట్టేదానికి వాటం కూడా సరిగా కుదరలా. 'ఇట్టగాదు తీ' అనుకొని, నా కాలికుండే హవాయ్ చెప్పు చేతికి దీస్కుంటి.

'ఏం ఫరవాలా' అన్నిట్టు తలాడిచ్చ మా గోపీగాడు. వొక్క దెబ్బకు నాలుగైదు జోరీగలు చచ్చినాయి. అంతలో ఇంటికాణ్ణించీ మాయవ్వ వొచ్చి నేను జేసే పని జూసి లబలబా మొత్తుకుండె. 'వొకో దెబ్బకు ఎన్ని ఈగలు చస్తాండాయో నువ్వే సూడువ్వా' అని చూపిస్తి. "గోమాత...! కాలిమెట్టు...!దరిద్రం...!" అనె. 'ఈగలు కుడతాంటే చూస్తా గమ్మునుంటే దరిద్రం లేదా' అంటిమి. 'అరిష్టం నాయినా' అనె. చెబితే యినే రకమైతే గదా మేము!

వాలిన ఈగను వాలినట్టే చంపేస్తా వుంటే ఆవు సగిచ్చినట్టుగా మేస్తావుండె. మాయవ్వకు మాత్రం మేము జేసే పని యేమాత్రం సగిచ్చలా. జరమొచ్చినపుడు సూదులు పొడిసినట్టే ఇదిగూడా అని నేను, అదీ-ఇదీ వొగటి గాదని మాయవ్వ - ఈ రకంగా మాటల్లో వుండగా మా ఆవు సుమారు సుమారుగా మడి మేసేసింది.

పొద్దన్నే అమ్మ చూసిందంటే తిట్లు, నాయన జూస్తే తన్నులు పడినా పడొచ్చు కాబట్టి - ఏ కారణం చేతయినా సరే హవాయి చెప్పుతో ఆవును కొట్టడం తప్పేననీ, వరిమడి మేసింది మా ఆవు కాదని, వూరోళ్లది దొంగ గొడ్డు వొచ్చి పడి తినిందనీ మా అవ్వతో ఒప్పందం జేసుకొని బుద్ధిమంతులమనిపిచ్చుకున్యాం.


*దొక్కలు - డొక్కలు
*చీటీగలు - చీకటీగలు - దోమలు
*యలతర - యెలుతురు - వెలుతురు

12 comments:

చంద్ర మోహన్ said...

బాగుండాదినోవ్ మీ కత!మెట్టుతో గొట్టితే కొట్టినారుగానీ, కడుపునిండా కసువు మేపిచ్చిన పుణ్యిం ఊరికే బోతిందా.

jhansi papudesi said...

చాలా బావుందండి. ఆ ఈగల్ని పిడిదులు అంటారనుకుంటా మా వూర్లో...:)

రవి said...

నీళ్ళలో ఉడకేసిన శనక్కాయలు తింటన్నట్టున్న్యాదబ్బా, సదువుతాంటే..

కొత్త పాళీ said...

హ హ హ
ఇండియా పాకిస్తాన్‌ శిఖరాగ్ర చర్చల లెవెల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అన్నమాట!

kiraN said...

7/10
ఎలా సంపితే ఏంటి?? సచ్చినాయ లేదా.. అదే కావల్సింది.
నాకేంటో ఈ సారి టపా పుసుక్కున అయిపోయినట్టుంది.

-కిరణ్

Reddy said...

7/10

Rohini Kumar Tharigonda said...

బాగుంది.

Babu Bhuma said...

కధ సదవతావుంటే సద్ది తాగి కానగ సెట్టు కింద నిద్దరపోయే రోజులు గుర్తొచ్చె.

teresa said...

:)

రానారె said...

@చంద్రమోహన్
మీయట్టా మారాజుల నోటివాక్కులేన్నా, మాదేముండాది!

@Jhansi papudesi
థాంక్సండీ. పిడుదులు వేరే. అవి ఎగరవు. వంటికి కరుచుకొని వుండిపోతాయ్.

@రవి
ఇప్పుడు నాకు శనిక్కాయలు తినాలనిపిస్తాంది మడే! నువ్వే ఉడకబెట్టియ్యాల.

@కొత్తపాళీగారు
ఔనండి, శిఖరాగ్రం కంటే ఒక్కరవ్వ ఎత్తున్నే! :)

@కిరణ్
అందరూ మన మాదిరిగా ఆలోచిస్తే యింకేముంది! :)

@Reddy, RohiniKumar Tharigonda
నెనరులు

@Babu Bhuma
ఐతే మనకూ శానా కతలే వుండాయన్నమాట,సెప్పుబ్బా యిందాము.

@teresaగారు
:-))

యువ said...

నీకు శనిక్కాయలు తినాలనిపిస్తాఉందా... నాకు కందిబుడ్డలు గావాల. మా జేజికి ఫోను జేస్తే, అమెరికాలో అన్ని దొర్కతాయంటివి గదరా ప్యాకెట్లల్లో అని నన్నే అడిగ్య...

Vinay Chakravarthi.Gogineni said...

JOREEGALU ANTAARU ANUKUNTA..NAKUM.TECH CHESETAPPUDU KOODA HOLIDYS LO EE ANUBHAVAM VUNDI...................

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.