ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పిల్లోళ్లను కారిమింటుకు పంపీ

యండాకాలం శలవల్లో చింతచెట్టుకింద జిల్లాకోడి ఆడుకుంటావుంటే యింట్లోకి పిలిసి, పలకమీద A B C రాసి, దిద్ది నేర్చుకొని రాసిమ్మన్యాడు మా నాయిన. వాటిని బలపంతో రెండుసార్లు దిద్ది చెరిపేసి, టకీమని రాసి చూపిచ్చి, మల్లా చింతచెట్టుకిందికి పరిగెత్తినా. రోంచేపటికి మల్లా పిలిచి ఏబీసీడీలన్నీ రాసి పలికిచ్చి, రేపట్లోగా పలకడము, దిద్దడమూ నేర్చుకొమ్మనె. ఈ ఏబీసీడీలు పలకడం నాకు ముందే తెల్సు. "ఏబీసీడీయఫ్ - మీ తాత ఉఅ* ఠప్" అని ఒక పాటవుండేది. ఈ పాటతోనే నాకు ఏబీసీడీలు తెలిసింది. యింగ్లీసంటే ఏందో గూడా నాకు రెండోతరగతిలోనే తెల్సు. గాంధీతాత పాఠమొకటి వుంది. దాంతో తెల్లదొరలు, బ్రిటీషువారు, ఇంగ్లండు కూడా తెలుసు. ఆ తరువాత యాంట్ చీమ, బోయ్ బాలుడు, క్యాట్ పిల్లి వుండే బొమ్మలపుస్తకం కూడా నేర్చేసుకున్న్యా. "సదువంతా నువ్వే నేరిపిస్చావా, పిల్లోళ్లను కారిమింటుకు పంపీ" అని మా యింటికొచ్చిన పెద్దోళ్లంతా మా నాయనకు చెప్పబట్టిరి.

ఆ 'కారిమింటు' నాకేం కొత్తదిగాదు. మా పల్లెకు సుమారిగా ఒక మైలు దూరాన వీరబల్లెలో వుంటాది శ్రీ శ్రీనివాస కాన్వెంటు. భట్టుపల్లె బళ్లో వొగటో తరగతి సదవంగానే, రెండో తరగతికి నన్ను దాంట్లోనే జేరిపిచ్చినారు. ఆ కాన్వెంటుకు పొద్దన్నే అన్నం కట్టుకోని పొయ్యి, మధ్యానం బళ్లోనే తిని, క్యారీ కడుక్కోని, సాయంత్రం నాలుగున్నరకు ఇంటికొచ్చేతలికి వొగటే తలపోటు. ఆడుకుండే దానికి బదులు ఓ అని కణతలు నొక్కుకుంటా పండుకోవడమే. యేమిరా సామీ యిట్టయిపోతివి అని మాయమ్మ దిగులుగా మంచంమింద కుచ్చోని నా తలకు ఆముదంపట్టు కట్టి, కణతలు రుద్దుతా వుండేది. రోంచేపటికి నిద్రబోతే, రేయన్నం తినిపిచ్చేదానికి మల్లా నిద్దరలేపేది. తల దిమ్ముగా వుండేది. తలనొప్పి తగ్గిందా నాయినా అనడిగితే యేం జెప్పాల్నో తెలిసేదిగాదు.

పొద్దన్నే బడికి బయల్దేరేటప్పుడు నాకు ఆకలిగా ల్యాకన్న్యా తినాల్సిందే. సద్దిబువ్వగానీ, వుడుకుబువ్వగానీ, యేం కట్టిచ్చినా మజ్జానానికి పాసిపోయినట్టుండేది. అన్నము యింట్లో వున్న్యంత రుచిగా బళ్లో వుండదు. వొగరోజు సాయంత్రము నేను బడినుంచి తలనొప్పితో యింటికి రాఁగానే, మాయమ్మ వొగ సిలవరు తట్టనిండా వుడకేసిన చెనిక్కాయలిచ్చింది. వుడకబెట్టిన కొత్తచెనిక్కాయలంటే నాకు శా...నా యిష్టం. రెండు కాయలు వొలిసి తినేటప్పటికి నాకు ఓపిక ల్యాకండా పొయ్యింది. చెనిక్కాయలు తినాలని వొగపక్క పానం పీకుతాంది. యింగోపక్క తలపోటు. రెండు గింజలు నోట్లో యేసుకొని చప్పరిస్తా, రెండు చేతుల్తో తలను అదిమిపట్టుకోని అట్నే నులమంచం మింద ముడసకపోతి. మాయమ్మ వొచ్చి పక్కన కుచ్చోని "వొలిచిస్తా తింటావా" అనె. కణతలు పోటుబోతావుంటే వొలిసినగింజలు నమిలేదెవురు? ఈ వొక్కరోజు తలనొప్పి రాకండా వుంటే ఈ వుడకేసినచెనిక్కాయలు తినుండేవోణ్ణి గదరా బగమంతుడా అని, నొప్పికి తట్టుకోల్యాక కండ్లనీళ్లు పెట్టుకొంటి. నన్ను వొళ్లో పండబెట్టుకొని, రెండు చేతులా నా తలకాయ వొత్తుతా "యేమిరా సామీ యీ కర్మ" అనె మాయమ్మ. ఆ మాటనేటప్పటికి మాయమ్మ గొంతు పూడకపోయ. నేను నిద్దరబొయ్యిందాక గూడా ముక్కు యెగజీదుకుంటానే వుండె. ఆ మర్సునాటి నుంటి రెండూ మూడూ తరగతులు నాగన్నసార్ బళ్లోనే కుశాలగా జరిగిపాయ.

మల్లా రెండేండ్లకు, యీరబల్లె నుంచి మా యింటికొచ్చిన పెద్దోళ్లంతా "సదువంతా నువ్వే నేరిపిస్చావా? పిల్లోళ్లను కారిమెంటుకు పంపీ" అని మా నాయనకు చెప్పబట్టిరి. "వొకరు చేరిపిచ్చేదేంది, వాడు పెద్దోడైనాడు, వాణ్ణే అడగండి" అనె మా నాయన. నన్ను, తమ్ముణ్ణి, మా అత్తమ్మకొడుకును ముగ్గురినీ చేరమని అడిగిరి. మనకు పెద్దరికమిచ్చినాఁక కాదంటే యేం బాగుంటాది? చేరతాలే అంటి. "సరే రేపొచ్చి చేరతార్లే" అని మా నాయన వాళ్లకు అభయహస్తం సూపిచ్చినాడు.


ఆ మర్సురోజు పొద్దన్నే క్యారీడబ్బాల్లో అన్నం కట్టుకోని ముగ్గరమూ కాన్వెంటుకు నడిసి పోతిమి. కోడిపెట్ట కనబడకపోతే దాని పిల్లలన్నీ పియోవ్ పియోవ్ మని మొత్తుకున్నిట్టుగా కాన్వెంటుపిల్లకాయలు మొత్తుకుంటా వుండారు. మేము వాకిళ్లు తెరుచుకొని నేరుగా వొగ తరగతి లోపలికి పోతిమి. కోడి కనబడగానే అరుపులు మానేసిన పిల్లలమాదిరిగా, పిల్లకాయలంతా సద్దుమాని మా ముగ్గుర్నీ సూడబట్టిరి. మమ్మల్ని జూసి, "యేంగావాల?" అన్నిట్టు కండ్లెగరేశ వాళ్ల మాస్టర్ ( ఐవోరిని కాన్వెంటులో మాస్టర్ అంటార్లే). "మమ్మల ముగ్గురినీ బళ్లో జెరిపిచ్చుకోవాలంట" అంటి. మాస్టర్ నవ్వినాడు. "మా నాయన జెప్పినాడు" అంటి. మాస్టర్ యింగా గట్టిగా నవ్వి, హెడ్మాస్టర్ అక్కడుంటాడు పొయ్యి అడగండి అనె. పోయి ఆయనతో ఇదే మాట జెప్తిమి. ఆయనా నవ్వె. మా నాయన జెప్పినాడు అంటిమి. నవ్వడం ఆపేసి మా పేర్లడిగి నోటుబుక్కులో రాస్కున్న్యాడు.

న్యాలికతో ముక్కు నాక్కుంటాయే ఆవులూ ఎనుములూ, ఆ మాదిరిగా మూతిమీది మీసాన్ని కొరుక్కుంటా ఒక మాస్టరొచ్చి, "రేపట్నుండి ఈ డ్రెస్సుతో వస్తే బయట నిలబెడతా. స్కూల్ డ్రెస్ తొడుక్కోని రావాల. చెప్పు మీ నాయనకు." అనె. బళ్లో జేరిన మొదటిరోజే దబాయింపు. ఆరోజునుంచి నాలుగో తరగతంతా దబాయింపులే దబాయింపులు. యెందుకురా అంటే, యేమో నాకు దెల్దు. మామూలుగా అందర్నీ అమ్మానాయినా వచ్చి చేరిపిస్తారు. కొంతమందినైతే రెట్టబట్టుకోని రోడ్డెంబడి యీడ్చుకోని వస్తావుంటే, వాళ్ల యేడుపులు, మెట్లు (చెప్పులు) జారిపోవడం, పుస్తకాలసంచి విసిరెయ్యడం, నోరు కొట్టుకోవడం, అమ్మానాయన్ను తిట్టరాని తిట్లన్నీ తిట్టడం, చెయ్యి కొరకడం, నిక్కరు తడుపుకోవడం ... అబ్బో రచ్చరచ్చ. పాపం వాళ్లంతా కర్మబట్టినోళ్లు.


యేమైనా మా మాదిరిగా శ్రీనివాసాకాన్వెంటులో చేరిన పిల్లకాయే లేడు! :-)

కామెంట్‌లు

sriku చెప్పారు…
మీ సీమ టపా కాయలు మొదట్లో పూర్తిగా చదవడానికి కష్టంగా అనిపించేవి గాని ఆ యాసకి అలవాటు పడ్డాకా భలేగా ఉన్నాయి
సూర్యుడు చెప్పారు…
బాగుంది, మీ కాన్వెంట్ కథ :-)
అజ్ఞాత చెప్పారు…
7/10 .... less humor, less dialect words....

రెట్టబట్టుకోని or రెక్కబట్టుకోని
రానారె చెప్పారు…
రెడ్డిగారు, నిక్కచ్చిగా మీ అభిప్రాయాన్ని రాసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. రెట్ట అనే పదానికి భుజము అనే అర్థం వాడుకలో వుంది. చొక్కా కాలర్ ను, చొక్కాచేతులను కూడా చొక్కారెట్ట అనే అంటారు. ఈ పదానికి బ్రౌణ్యములో యిచ్చిన మొదటి అర్థం ఇదే. ఒకోసారి మాండలికాల్లో వాడే పదాలకు దురదృష్టవశాత్తు నిఘంటువుల్లో అర్థాలు దొరకవు. ఈమాటు మాత్రం నేను అదృష్టవంతుణ్ణే. :)
అజ్ఞాత చెప్పారు…
Just asked... I didn't encounter that word before.... nothing else.
Thanks for the clarification.
అజ్ఞాత చెప్పారు…
5/10
Unknown చెప్పారు…
స్కూల్ అనగానే నాకు భలే జ్ఞాపకాలు వస్తాయి. బావుంది.
Kolluri Soma Sankar చెప్పారు…
మీ కాన్వెంటు అనుభవాలు బావున్నాయి. ఇంతకి తలనొప్పి ఎందుకు వచ్చినట్లో?

వుడకబెట్టిన కొత్తచెనిక్కాయలంటే నాకు కూడా శా...నా యిష్టం.
kiraN చెప్పారు…
బాగుంది మీ ఇస్కూలు జాయిను.
నాక్కూడా చా..లున్నాయి ఇటువంటి అనుభవాలు

-కిరణ్
[ఐతేOK.blogspot]
అజ్ఞాత చెప్పారు…
రానారె,
ఎప్పుడు రాసినా నా కథే రాస్తావు కదబ్బా..క్యారీ మజ్జాన్నానికి పాసి పోయినట్టుండడం, ఉడకేసిన శనక్కాయలు , నాగన్న సారూ, ఇవి మూడు నా చిన్నప్పటి సంగతులే. అయితే, ఎందుకో ఏమో, నీ టపాలు చదవక ముందు ఇలాంటివి గుర్తు రావు!

"కోడిపెట్ట కనబడకపోతే దాని పిల్లలన్నీ పియోవ్ పియోవ్ మని మొత్తుకున్నిట్టుగా "

ఉపమా రానారె మహాశయస్య,
విహారేః అర్థ గౌరవం !
కొత్త పాళీ మహాభాగినః పదలాలిత్యం
..... సంతి త్రయో గుణాః

సంస్కృతాన్ని రాచి రంపాన పెట్టినందుకు మన్నించండి.
ఆఖరు వరుస మీరే పూరించుకోండి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె