ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొండికి గండిదేవుడు

చింతమాని కింద ఇసకలోనే మా నాగన్నైవోరి బడి. భట్టుపల్లె ప్రాథమిక పాఠశాల అని దానికి ఇంగో పేరు గుడకా వుండాది - చింతమానికి తగిలిచ్చిన యినపరేకు మింద. ఐవోరు యింగా బడికి రాల్యా. పిల్లకాయలంతా ముందే ఇసకలో జేరి ఆడుకుంటా వుండారు. నాగ్గూడా వాళ్లమాదిరే ఆడుకోవాలనిపిస్తాది గానీ, మాయమ్మ నాకు పొద్దన్నే నీళ్లుబోసి, ఇస్తిరిగుడ్డలు తొడిగి, తలకు ఆముదం పెట్టి దువ్వి, మొగానికి పౌడరుపూసి పంపిస్తాది. మాయమ్మకు అన్నీ వచ్చుగానీ నా జుట్టుకు నొప్పి తెలీకుండా తల దువ్వడం మాత్రం రాదు. దానికి మాయవ్వ రావాల్సిందే. మాకు జుట్టు దువ్వేటప్పుడు మాయవ్వ చెప్పే సదువు ఏమిట్రా అంటే - 'బడి యిడిసిపెట్టినాఁక గూడా దువ్వినజుట్టు దువ్వినట్టే వుండాల, వూళ్లో పిల్లకాయలకూ రెడ్డేరి పిల్లకాయలకూ తేడా తెలియాల, అల్లరి జనంతో ఆడుకుంటే కొట్లాటలొస్సాయి, మనం ఇంకొకరితో మాటలు పడగూడదు' అని.

పొద్దన్నే చింతమాని కింద ఇసక సల్లగా సక్కిలిగిలి పెడతాన్నిట్టు వుంటాది. ఒకరిద్దరు పిల్లకాయలు తొడలకిందుగా చెడ్డీలో ఇసకపోసుకోని దాని సలవను పిర్రలకు సూపిస్తాండారు. కన్నాగాడు వొక్కడే వొగ పక్కన కుచ్చోని చూస్తావుండాడు. వాళ్లమ్మ గూడా వానికి పొద్దన్నే నీళ్లుబోసి, ఉతికిన సొక్కావా నిక్కరా తొడిగిచ్చి, ఆముదం పెట్టి తలదువ్వి, పౌడరు పూసి సుద్దంగా పంపించింది. ఇసకలో ఆడుకోవద్దని కూడా గెట్టిగా జెప్పినిట్టుంది. గుడ్డలు మాపుకున్యా జుట్టు మాపుకున్యా వానికి యీపు యిమాణం మోత మోగిస్తాది వాళ్లమ్మ. సొక్కాతో సీమిడి తుడుసుకోవద్దని కూడా చెప్పింది. అందుకే వాడు సీమిడిముక్కుతో సొక్కాభుజాలు తుడుసుకుంటా, సింతమాని పక్కన పారిగోడకు ఆనుకోని సక్కలముక్కాలేసుకోని కుచ్చోనుండాడు.

ఇంతలో ఒక సాకలోళ్ల పిల్లకాయ నిక్కర నిండా ఇసక నింపుకోని, అది జారిపోకండా తొడల దగ్గర బిగిచ్చిపట్టుకొని వంగి నడుస్తా వచ్చి, కన్నాగాని నెత్తిన గుమ్మరించేసినాడు. ఉలిక్కిపడి జుట్టు దులుపుకున్యాడు కన్నాగాడు. ఆముదము, యిసక కలిసిపొయినాయి. వానికి పిచ్చికోపమొచ్చింది. నోటి కొచ్చిన తిట్లు తిట్టడం మొదులుబెట్టినాడు. వాడు తిట్టే కొద్దీ సాకలోళ్ల పిల్లకాయ నవ్వుతావుండాడు.

అంతలో చేదబాయి కాణ్ణించీ నీళ్లు మోసకపోతావుండే వాళ్లమ్మ రానేవచ్చింది. వచ్చీరాఁగానే "ఇప్పుడనఁగా నీళ్లుబోసి పంపిచ్చే, అప్పుడే గలాటా పెట్టుకోని, మంట్లో పొల్లాడి, ... నా కొడకా", అని నాలిక మడతబెట్టి కన్నాగాని చెంప పగలగొట్టింది. వాడు దిక్కుతెలీక యేడుపెత్తుకున్యాడు. "మన్ను వాడు పోసుకోల్యాక్కా" అంటి నేను. వాళ్లమ్మ ఇంకో యేటు కొట్టబోయి నా మాటిని (మాట విని) నిలబడింది. "ఆ నవ్వుతా నిలబడుకోనుండేవోడే పోసినాడు" అని చెప్తి. కొడుకును కొట్టినందుకు శానా బాధపడిపొయ్యి, యిసకపోసినోణ్ణి నిష్టూరంగా తిట్టి, నీళ్లకడవను సంకనెత్తుకుని, కన్నాగాని చెయ్యిబట్టుకోని యింటిదారి బట్టిందామె.

అంతవరకూ తిట్లుతిన్నోడు నా ఎదురుగా వొచ్చి నీలుక్కొని నిలబడె. ఇంగో ముగ్గురు వానికి తోడైరి. నలుగురూ నన్ను గుడ్లురిమి చూస్తాండారుగానీ, వొక్కడు గూడా నోరు తెరిసి మాట్లాళ్లా. నా తప్పేమన్నా వుంటేగదా నన్నేమన్నా అనేదానికి! అందురూ నాకంటే జంపుగా (పొడుగ్గా) వుండారు. నాకంటే పెద్దోళ్లే. ఏమీ మాట్లాడకండా నా ఎదురుగ్గా నిలబడుకోని మింగేసేవోళ్ల మాదిరి చూస్తావుంటే నాకు రోంత భయమేశ.

నాకేం భయం లేనిట్టుగా అడిగితి - "యాఁ?, నువ్వు యిసక బొయ్యలా?"
నామాట కోసమే కాసుకోని వున్నిట్టుగా, "మర్యాదిచ్చినంతవరకే నేను మంచోణ్ణి, ఇంగో పారి నా జోలికొచ్చినావంటే మర్యాద ల్యా!" అనె వాడు.
"రెడ్డేరి పిల్లోణ్ణే గదమాయిస్తాండావేంది రోవ్", అనె వాళ్లలో ఒకడు.
"యాఁ? రెడ్డేరైతే కొమ్ములొచ్చినాయా?", ఇంకోడు.
"ఎవురికి రెడ్డేరు? రెడ్డితనమేమన్నా వుంటే వాళ్లింటికాడ. మన కాడ గాదు."
"'రెడ్డీకరణం పైనంట - కిటికిటి మాదిగోడు కిందంట' ఇది పాతపాట. 'రెడ్డీకరణం కిందంట - కిటికిటి మాదిగోడు పైనంట' ఇద్దీ కొత్తపాట."
దానికేంజెప్పాల్నో నాకు తెలీల్యా. ఊరందరికీ రెడ్డేరిని నేనేనని నేనెప్పుడన్నా చెప్పింటేగదా!


అంతలో నాగన్నైవోరు చేతిలో గొడుగు బట్టుకోని బళ్లోకొస్తా కనబడె. ఈ నలుగురూ మాయమైపోయిరి. పిల్లకాయలంతా గబగబా వరసల్లో కుచ్చోని, ఐవోరు చెట్టుకిందికి రాఁగానే లేసినిలబడి "నమాస్-తే-సా-" అని దీర్ఘందీసిరి. నేను గూడా అందరితోపాటు లేసినిలబడి దీర్ఘందీస్తిని గానీ, నాలోకమే మారిపొయ్యింది. నాతో అంతవరకూ యెవురూ అట్ట మాట్లాళ్లా. నాగన్నైవోరు హాజరుపట్టీలో పేర్లు సదువుతావుండాడు. "వొచ్చినా సా..." అని ఆ పేర్లగలోళ్లు పలుకుతాండారు.

మా తాత కాలంలో ఆయన రెండు మండలాలకు రెడ్డి అని అందురూ చెప్తావుంటారు గానీ, ఆయన రెడ్డితనంతో మాకొచ్చిందేమంటే - రెడ్డేరమనే పేరొగటి. మా కాలంలో మాయింటికే మేము రెడ్లము. అయినా సరే, ప్రతి దినామూ, ఒకరిద్దరన్నా గిన్నె చాతబట్టుకొని మాయింటికొచ్చి, "రెడ్డేరింటికాణ్ణించీ ఇంత కూరాకు పెట్టించుకోని రమ్మనింది మాయమ్మ" అని అడిగి పెట్టించుకోని పోతావుంటారు. పల్లెలో ఎవురికన్నా వొళ్ళు బాగల్యాకపోతే మజ్జిగనీళ్లు ఖచ్చితంగా దొరికేది "రెడ్డేరింటికాణ్ణే". ఏదైనా చిన్నాచితకా పనులకు పిలిస్తే పలుకుతారు. నాకు తెలిసి మేమెప్పుడూ యెవురింటికీ దేనికోసమూ పోలా - కలిగినకాలమైనా కరువుగాలమైనా. ఈపొద్దు నన్ను గదమాయచ్చిన పిల్లనాయాండ్లతో సహా మావూళ్ళో అందురూ మా యింటిని రెడ్డేరిల్లు అంటారు. వాళ్లే మమ్మల్ని 'మా రెడ్డేరు' అంటారు.

*****************************************************************

యండాకాలం కావడాన మాకు ఒంటిపూట బడి. నాగన్నైవోరు పాపం రెండేర్లు దాటుకోని పొద్దన్నే రానైతే వస్తాడుగానీ, మధ్యానము బడి యిడిసిపెట్టినాఁక మా పల్లెలోనే వాళ్ల చుట్టాల ఇంటికాడ నిద్దరబొయ్యి, సాయంత్రము యండ రోంత తగ్గుమొగం పడతాందనఁగా మెల్లిగా నడుసుకుండా వాళ్లు ఊరికి పోతాడు. యంత యండగాసినా ఐవోరికి కాయాల్సిందేగానీ పిల్లోళ్లగ్గాదు. కాదా అని కడ్డాయంగా అడిగితే --పిల్లోళ్లగ్గూడా యండే - సదువుకుండేదానికి మాత్రము. ఆట్టాడుకుండేదానికైతే యండ ల్యా.

పల్లెలో వుండే పిల్లకాయలంతా బడి యిడిసిపెట్టగానే ఆడుకుండేదానికి మా సింతమాను కిందికి రావాల్సిందే. దానికిందైతే రోంత నీడ దొరుకుతాది. ఊరికి మొదిటిల్లు మాదే కావడాన పడమటిగాలి కూడా భోరుమని తోల్తావుంటాది. పడమట దిక్కున నువ్వు సూసినంత దూరాన బీడుభూమే. సరైన పచ్చటి చెట్టు వొకటి నీ కండ్లకు కనబడితే నాకుజెప్పు. యేమంటావేమో - అదంతే. పడమటగా వుండే రాళ్లచేను, బింద్యావళం చేను, బసిరెడ్డోళ్ల చేండ్లు అన్నీ గూడా అగ్గిగుండం మాదిరి మండతాంటాయ్. మెట్లు ల్యాకండా ఆ చేండ్లల్లో నడిస్తే అరికాళ్లు బొబ్బలుబోవాల్సిందే. కుంటకాలవ గట్టున సర్కారుతుమ్మచెట్లు తప్ప పచ్చనాకు కానరాదు.

మా వూళ్లోకొచ్చే మనిషైనా గొడ్డైనా ఆఖరికి గాలైనా సరే మా సింతమాని కిందికొచ్చి సల్లబడాల్సిందే. దూరం నడిచి దప్పికగొన్నోళ్లు మా మాను కింద నిలబడి మంచినీళ్లడిగి తాగిపోతావుంటారు. సుమారు అరమైలు దూరానున్న చేదబాయి అడుగునుంచి తోడుకొని కడవల్లో, బిందెల్లో మోసుకొచ్చినా, యింటి ముందుర దప్పికగొని నిలబడిన మనిషికి మంచి నీళ్లు పొయ్యకుండా వుండేదెట్ట!? చెట్టుకింద ఆడుకునే పిల్లకాయలు ఆ యండలకు దప్పిగ్గొని, నీళ్లిమ్మని మాయవ్వను అడుక్కునేవాళ్లు. వాళ్లవాళ్ల యిండ్లకు నీళ్లు తాగను పోతే వాళ్లమ్మానాయనా ఇంట్లో గుంజకు కట్టేసి తలుపులు మూసేచ్చారని భయం. ఎత్తిన చెంబు దించకుండా పిల్లకాయలు గుటగుటా తాగుతావుంటే అడక్కుండానే పెద్దచెంబుతో నీళ్లు తెచ్చిచ్చి సంబరంగా చూస్తావుండేది మాయవ్వ. ఆ మాదిరిగా మంచి నీడా, మంచినీళ్లూ దొరికే తావు అది.

బళ్లో నన్ను బెదిరిచ్చినోడు, వాని సావాసగాళ్లూ కూడా ఆడుకుండేదానికి వొచ్చిరి. వాళ్లు వొచ్చీరాఁగానే నేను ఇంట్లోకిబొయ్యి జరిగింది మొత్తం మాయవ్వతో చెప్పి, "ఎవురికి రెడ్డేరు?" అన్న్యారు గాబట్టి, మన చింతమాని కింద నుంచి ఆ నాయండ్లను తరిమెయ్యమంటి. నాకొచ్చినట్టుగా అవ్వకు వాళ్లమీద కోపం రాల్యా. వసారాలో నులకమంచంమీద కుచ్చోని పెరుగన్నములో మామిడికాయ వూరగాయ నంజుకోని నిమ్మతిగా తింటా, "ఒకనికి నలుగురు తోడై కూడబలుక్కున్నిట్టు మాట్టాణ్ణారంటే - మన పక్కనుంచే ఏదన్నా దోసముందేమో ఆలాశన జేస్కోవాల నాయినా. ఇంద యీ ముద్ద తిని పోదువు రా, మీగడపెరుగూ వూరగాయా కలిపిపెట్టినా... యిదో" అని నా నోటికొక ముద్ద అందిచ్చేశ. ఆ ముద్ద యంత కమ్మగా వున్నిందంటే, గిన్నెలో అన్నంమొత్తం నాకే పెట్టిందాఁక నేను కదల్యా. వొక్కో ముద్దా నోటికందిస్తా అవ్వ చెప్పేసింది వాళ్లెందుకట్టా అన్యారో.

*****************************************************************

జిల్లాకట్టె, పుట్టచెండు, గోలీలాట - మార్చిమార్చి సాయంత్రందాక అడటమే మా పని. ఆ దోవన పొయ్యే ప్రతొక్కడూ - జిల్ల తగిల్తే కండ్లుపోతాయని చెప్పేవాళ్లే - ఆ సంగతి మాకు తెలీనట్టు. సరేలెమ్మని అప్పుడప్పుడూ పుట్టాచెండు ఆడతాం. పుట్టాచెండు కూడా జిల్లాకట్టె మాదిరే. జిల్ల బదులు రబ్బరు చెండు. జిల్లను బద్దికి అడ్డంగా పెట్టి కోడు(కట్టె)తో జిమ్మినట్టే, చెండును కూడా జిమ్మడం. మనం జిమ్మినప్పుడు దాన్ని కింద పడనీకుండా అవతలి వాళ్లు పట్టుకుంటే అక్కడికి మన బారి ముగిసినట్టు. పట్టుకోల్యాక పోతే... మనం కోడును బద్దిమీద అడ్డంగా పెట్టాల, చెండుతో అవతలోళ్లు దాన్ని కొట్టాల. కొడితే మన బారి కట్టు. కొట్టల్యాకపోతే కోడునూ బద్దినీ దాటి చెండు ఎంత దూరం పొయ్యిందో కోడుతో కొలుస్తాము -- ఒకటి కొండి, రెండు కట్టె, మూడు ముంచ, నాల్ నఱ్ఱ, ఐదు గిరిగి, ఆరు పటక, ఏడు పిల్లి, ... మల్లా మొదుట్నుండి కొండి, కట్టె, ముంచ... యిట్లా. నీకు తెలీకండా వుంటాయా! మీరుగూడా పుట్టచెండు ఆడేవుంటారు గదా?

ఆటలో గలాటా వొచ్చిందంటే నేను జేసే పని ఒకటే - బద్దిలో వుచ్చలు బొయ్యడము, మా యింటికాణ్ణించి పోండి అని బెదిరిచ్చడము. మాయింటికాడ కాకపోతే ఇంగోచోట ఎవురూ చేండ్లల్లో ఆడుకోనీరు. ఎవురూ మంచినీళ్లీరు. సదరమైన న్యాల, సరైన నీడ యాడుండాయి చెప్పు! కాబట్టి, గలాటా వొచ్చిందంటే మనం యాపక్కనుంటే ఆపక్క గెలుస్సాది. అవతల యంత పెద్ద ఆటగాడున్న్యాగాని మన దెబ్బకు దిగిరావాల్సిందే. "రెడ్డితనమేమన్నా వుంటే వాళ్లింటికాడ" అంటే ఇదే!

"నీటిలోన ముసలి..." పద్యం జెప్పినట్టు నా రెడ్డితనం మా యింటికాడ పనిజేసినట్టు బళ్లో చెయ్యలా. ఆపొద్దునుంచీ బద్దిని తడపడము, "మాయింటికాణ్ణించి ఫో!" అనడమూ పూర్తిగా మానేస్తి. మొండిజెయ్యడం తగ్గించినాక, జిల్లాకోడి బాగా ఆడటం కూడా వచ్చింది. జిల్లను లేపి గాల్లోనే నాలుగు పైయేట్లు కోడ్తే ఆట మనదే. అప్పుడు - మా దిక్కున వుడాలంటే మాదిక్కునుండాలని - పోటీలుబడి మనల్ను కోరుకుంటారు. సెప్పాలంటే అదే సరైన రెడ్డితనము. మనలో మన మాట - మనం మొండిజేసినా అవతలోనికి నొప్పితెలీకండా జెయ్యాల.

కామెంట్‌లు

krishna చెప్పారు…
యాసలో బాగానె రాసిండారె.
జిల్లకట్టె కాదెమో అది చిల్లకట్టె అంటారు.చిల్ల అంతే జానెడున్న చిన్న కర్ర.కట్టె అంతె సుమారు మూరెడు కన్న కొంచం పెద్దగా వుంటుంది.

అంతా బాగానె జెప్పి ఆ చివరి వాక్యం ఎంటో?????
అదేనేమో రెడ్డితనం అంటే?
అంతా బాగానె జెప్పి ఆ చివరి వాక్యం ఎంటో?????
అదేనేమో రెడ్డితనం అంటే?
కొత్త పాళీ చెప్పారు…
నీకు నూరేళ్ళాయుస్సు. ఈ పొద్దే నీ సంగతి అనుకుంటిమి.
ఇదేందబ్బయా, నీ కతల జదివి నాక్కూడా నీ భాష వస్చాందే! :)
నిక్కర్లో ఇసక, ఆవదం రాచి దువ్విన జుట్టులో ఇసక, ఇసక మీంద రెడ్డేరి తనమూ .. శబాసో!
సిరిసిరిమువ్వ చెప్పారు…
జిల్లకట్టె--మా వేపు బిళ్ళం కోడు (బిళ్ళం కోడి).
"బడి యిడిసిపెట్టినాఁక గూడా దువ్వినజుట్టు దువ్వినట్టే వుండాల" ఇది చదువుతుంటే ఇది గుర్తుకొచ్చింది, "మా తరగతిలో ఒక అబ్బాయి జుట్టు దువ్వింది దువ్వినట్ట్లే ఉండేది, పడుకుని లేచాక కూడా అలానే ఉండేది. ఎవరైనా జుట్టు చెరిగిపోకుండా అలా ఎలా ఉంటుంది అంటే, పడుకునేటప్పుడు తల తీసి పక్కన పెడతాను అని జవాబిచ్చేవాడు, కొంతమంది చిన్న పిల్లలు అది నిజమేననుకునేవాళ్ళు.
Unknown చెప్పారు…
శబాసో...
బాగుంది. ఈ ఆటలు అన్నీ ఆడిన అనుభవం నాకూ ఉందోచ్ :)
Rajiv Puttagunta చెప్పారు…
ee yaasa gurinchi cinemaallo vinadamey gaanee...yevaru maatlaadagavinalaa.

Ippudu mee tapaa valla yevaro raaylaseema pallello vundey vaaru maatlaadinattu gaaney vundhi.

baagundaadhi
అజ్ఞాత చెప్పారు…
అర్రె, మా చిన్నప్పుడు విషయాలన్నీ నీకెట్ల తెలిసె ? "మొండి కి గండ దేవుడున్నాడు " అనుకునేటోల్లం గానీ, ఇంతవరకు ఆ గండ దేవుడెవురో అగపళ్ళే.

నువ్వు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది, చిల్లా కట్టె లో " కొండి, కట్లు, మంచాల్, గిలిగిలి, పటకర, పిల్లా...మళ్లీ తిరగా మొదత్నించీ...మా వూళ్ళో, వరస ఇది.

బద్దీ లొ వొంటికి పోసెది, ఇది నేనూ, చిన్నప్పుడు చేసిండెదె. ఇంగోటి. మా ఐవోరి పేరూ, నాగన్నే.

మొత్తానికి చిన్నప్పొడి ముచ్చట్లన్నీ బాగా చెప్పిండావు.
అజ్ఞాత చెప్పారు…
ఏందిబ్బో యవ్వారం చానా దూరం వచ్చిందే.

మీ జిల్లాకట్లో.... అడేటబ్బుడు కడుపులో జెర్రి బెట్టుకోని ఆడే వోళ్ళు కాదా లేకుంటే మతికి రాలేదా?

బద్ది లో మేము బండ రాళ్ళు ఏసే వాళ్ళం.

ఏందో పేపర్లో రెడ్లే...బ్లాగుల్లో రెడ్లే.. అందుకే ఒగ మార్కు పీకేస్తా వుండా. 9/10.

-- విహారి
రానారె చెప్పారు…
కృష్ణుడుగారు- జగన్నాటసూత్రధారి పేరుగలిగిన మీరు వెయ్యవలసిన ప్రశ్నేనా అది!? :)

కొత్తపాళీగారు- వారు వీరౌతారంటారే, అలాగన్నమాట. :)

సిసిముగారు- :-))

రవి- గండి దేవస్థానాల్లో వుండే దేవుడు ఆంజనేయుడే కదా.

రెడ్డి, ప్రవీణ్, రాజీవ్- థాంక్యూ.

భూపతిమహారాజా- పేపర్లో రెడ్లే అనేమి! పేపర్లో కనబడని కులమే లేదు. నాకు ఒక్క మార్కు పీకేస్తే ఫరవాలేదు, 'తెలుగులో నూటికినూరు రావులే' అనుకుంటా. పేపర్లో కనిపించే కులాలపై మాత్రం విహారి మార్కు టపాకాయ ఒకటి పేల్చితే చాలు.
Dr.R.P.Sharma చెప్పారు…
చాలా బాగుంది. మీరు అంత చక్కగా పల్లె భాషలో మీరెలాగ రాయగలుగుతున్నారు? మీ కథలు భాషా విశ్లేషకులకు కూర్చున్న దగ్గరే సామగ్రి చేకూర్చుతుంది.మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
రానారె చెప్పారు…
శర్మగారు, ధన్యోస్మి.
మాలతి చెప్పారు…
రానెరా గారూ, అంకెలలో 8/10.
నాకు ఈభాష చదువుతుంటే మళ్లీ నాభాషలోకి అనువదించుకోవాలి. చాలాబాగా ఆవిష్కరించారు.
నిన్న వైదేహితో మాటాడుతుంటే, ఆవిడ చెప్పారు మీకథలు చాలాబాగుంటాయని. ఆలస్చంగానైనా మీ న త్వం శోచితుమర్హసి కూడా చదివాను. మీకు పల్లెవాతావరణం అంత బాగా మనసుకు హత్తుకుంది నాకెంతో అనందంగా వుంది.
ధన్యవాదాలు.
మాలతి
సుజాత వేల్పూరి చెప్పారు…
ఇంత మంచి కథను ఇంత లేటుగా చదివినందుకు బాధగా ఉంది. నామిని గారిని గుర్తుకు తెచ్చారు సుమా!మీరు పత్రికలకెందుకు రాయరూ?
Dr.Pen చెప్పారు…
>>అప్పుడు - మా దిక్కున వుడాలంటే మాదిక్కునుండాలని - పోటీలుబడి మనల్ను కోరుకుంటారు. సెప్పాలంటే అదే సరైన రెడ్డితనము.
-మొత్తానికి బ్లాగ్లోకంలో కూడా మీ రెడ్డితనాన్ని చూస్తున్నాము:-)
రానారె చెప్పారు…
@మాలతిగారూ, థాంక్యూ. వైదేహి గారికి కూడా.

@సుజాతగారు - అప్పుడప్పుడూ మీలాంటివారు నామిని నాయుడిని గుర్తుచేసుకుంటున్నారుగానీ, జీవితానుభవాలను ఆ మహానుభావుడు రాసినంత నిజాయితీగా అన్ని సంగతులనూ నేను కళ్లకుకట్టడంలేదు. కల్పించి రాయకున్నా కొన్నింటిని దాస్తున్నాను. పత్రికలకు రాయమని మీలాగే కొందరు పెద్దలు కూడా సలహాయిచ్చారు కానీ ఇవి నా స్వీయానుభవాలు. వీటికి నా బ్లాగుండగా మరొకరిని దివిటీ పట్టమనడ మెందుకులెమ్మనే ఆలోచన నాది.[తప్పో ఒప్పో!:)]

@ రాయలవారు, తమరు రాజ్యం చేయు కాలమున రెడ్లగురించి తమరే ఒక పద్యం చెప్పియున్నారు. గుర్తుంటే మళ్లీ వినిపించమని ప్రార్థన.
ఈ కథ తెలుగు సాహిత్యంలో పీటేసి కూర్చోబెట్టవలసిన కథ.తనదైన తావులో ఏ కులపోరైనా గొప్పోరే.తావులు తప్పితే ఠావులు దప్పుతాయి.మంత్రం మొదలెట్టాల్సి వచ్చినప్పుడు వైదీకం బ్రాహ్మలు,లా పాయింటు లాగేప్పుడు కరణాలు,తన జమానాలో రాజులు,వ్యాపారం గురించి మాహాడేప్పుడు కోమట్లు గౌరవింప బడతారు.కాబట్టి అన్ని పనులు నేర్చుకున్న వాడు అన్ని వేళలా గౌరవింపబడతారని నాకొహాయన చెప్పినదాన్ని ఇంత అద్భుతంగా పోర్ట్రే చేసారు.
---సంతోష్ సూరంపూడి
రానారె చెప్పారు…
@సంతోష్ సూరంపూడి
సాహిత్యంలాంటి పెద్దపెద్ద చోట్లెందుకు గానీ, మీ మనసులో పీటేసి కూర్చోబెట్టారు, సంతోషం. కృతజ్ఞతలు. :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె