Tuesday, January 15, 2008

పదుగురాడు వేట ...

సంకురేత్రికి సలి సంకల్లో వుంటాదంట - శివరాత్రికి శివశివా అంటాదంట. బట్టుపల్లెలో బడిపిల్లకాయలంతా దీన్నొగ పాట మాదిరిగా పాడతాంటారు. సలిమంటలకాడ ముసిలోళ్లు గూడా ఆ మాటే అనుకుంటాంటే యిన్న్యా. అందురూ పొద్దన్నే లేసి సలిమంటేస్కుండే దానికోసం రేతిరిపూటే పుల్లలూ కంపలూ యేరుకొని దాసిపెట్టుకుంటారు. మాకు మాత్రం రేతిరి తెల్లారిందాఁక మా సింతసెట్టు రాల్చిన పుల్లలే సరిపోతాయ్. సరిపోకపోతే కావలసిన్ని కందిపుల్లలుండాయి. వొరిగడ్డి గూడా వుందిగానీ, అది మండుకున్నంత సేపు కూడా కాలకుండా ఆరిపోతాదని దాన్ని కాల్చితే పెద్దోళ్లు తిడతారు. మంచోనికి కోపమొస్తే అది వొరిగడ్డి మండినంత సేపుగూడా వుండదని పెద్దోళ్లు పద్యం గూడా చెప్తా వుంటారు. ఆ మంటలో రాళ్లేసి, అయ్యి యర్రఁగ కాలినాఁక అప్పటిదాక బిగబట్టుకున్నోళ్లం వాటిని సుర్రుమనిపిచ్చినామంటే... ఆడికి ఆ పూట సలిమంట ముగిసినట్టు. కొన్ని రాళ్లైతే ఫట్టుమని పగులుతాయి.

"ఎందుకురా ఆ సలికి వొణుకుతా పుల్లలేరడం, ఆ పుల్లలు మంచుకు తడిసి మండకపోవడం, వాటికి మంటబెట్టేదానికి కొటానికుండే బోదపీసు పీకడం, ఇంతాజేసి మండితే ముందుకు కుచ్చుంటే యీపున సలి, యీపుకు సలిగాసుకుంటే పొట్టలో సలి, పుల్లలు అయిపోంగానే మల్లా వొచ్చి పండుకుంటారు, అంతలో సంబడానికి కందిపుల్లలు దండగ, అగ్గిపుల్లలు దండగ, గబ్బుసమురు (కిరసనాయిలు) దండగ..."

అమ్మకు తెలీని సంగతేందంటే మొన్న పొద్దన్నే నిప్పు చిట్లి నా స్వెటరు మింద పడి చిన్న బొక్కపెట్టింది. నాకే బయమేసిన సంగతేందంటే దుప్పటి కప్పుకోని సలిమంటకాడ చానాసేపు గొంతుగుచ్చోని కాళ్లు తిమ్మిరెక్కి, కండ్లుదిరిగి, బోర్లబొక్కలా మంటలో పడబొయ్యి తమాయించుకున్యా. అప్పుడు మాయవ్వ నాకన్నా జాచ్చీగా బయపడింది. ఇద్దరమూ యెవురికీ చెప్పలా -- చెబితే మల్ల సలిమంటకాడ కుచ్చోనీరని. మంట న్యాలికలు సాఁచుతా వుంటాది. యీపుకు సలిగాంచుకుండేటప్పుడు దుప్పటి కనక మంటెత్తుకునిందంటే మల్లేం ల్యా. అమ్మజెప్పేదంతా నిజమే గానీ, నాకు మటుకు పొద్దన్నే లేసి సలిమంట కాడ కుచ్చోవాలని మోజు.

***** ***** ***** *****

మొత్తానికి సంకురాత్రి దాటిపాయ. శివరాత్రి గూడా వచ్చేశ. మాడిమి తోటలో పూత, పిందెలు, కాయలు అన్నీ ఒకేసారి కనబడతాండాయ్. పల్లెలో కొంతమంది యింగా సలిమంటలు యేస్కుంటానే వుండారు. సలి కాంచుకోవడం కోసరం సలిమంటగాదు, సుట్టకారమూ గుచ్చోని కుశాలగా మాటలు జెప్పుకుండేదానికి సలిమంట. యిట్టాంటి మంటలు యండకాలం వొచ్చిందాంక వుంటాయ్.

***** ***** ***** *****

అప్పుడు నేనూ మా గోపీ పొద్దన్నే లేసి మా నాయనతో పాటు మామిడితోటకు బయల్దేరినాం. ఆ రకంగా పొద్దన్నే లేసి నాయనతో మడికాడికి పోతావుంటే రాజకుమారుడు యాటమార్గం బయల్దేరినట్టుంటాది. దోవలో మమ్మల్ను సూసినోళ్లంతా, "యేం బ్బోవ్! సిన్నరెడ్లు పొద్దన్నే యాడికో యల్లబారినారే" అంటారు.

"మాడితోట కాడికి గిని" మేమిద్దరం పోటీబడి రొమ్ములిరుసుకోని చెప్తాం.

అప్పుడు వాళ్లు కిందికి వంగి గాఠ్ఠిగా గడ్డం పట్టుకొని మా దవడలు నొచ్చేటట్టు వూపి, వాళ్ల దవడలు బిగించి "పెద్ద పాలెగాళ్లైపొయ్‌నారుబ్బా!" అంటారు. దానికి జవాబు యేం జెప్పాల్నో తెలీక ఇద్దరం మొగామొగాలు జూస్కుంటా వుంటే, వాళ్లు మమ్మల్ని వొదిలేసి "ఈ తూరి కాపు బానే వుందంటన్నా!?" అని, నాయనతో మాటల్లో బడతారు.

నడుం మింద ముంచేతులు బెట్టుకోని మెడలు పైకెత్తి నిలబడి పెద్దోళ్ల మాటలు అట్టనే వింటా వుండాల. మనం పెద్ద పాలెగాళ్ల మైపొయినాం గదా మడే! (కదా మరే!)

***** ***** ***** *****

సంతవనం కాడికి వొచ్చినాఁక మోటరు బెట్టి నీళ్లు పారగట్టాలని బాయి కాడ నిలబణ్యాం. మోటరుబెట్టాలంటే చానా సమస్యలు. పుట్బాలుకు (ఫుట్‌వాల్వ్) నీళ్లు పొయ్యాల, కరెంటు సరిగ్గా వుండాల, పైపు లీకేజీలు యింకా నానా తలకాయనొప్పు లుంటాయిలే. అన్నీ అయ్యి సక్రమంగా మోటరు నడిసెటప్పుడు కరంటు కన్నుగొడుతుంది. అంటే రెప్పపాటున కరెంటు పోయి మళ్లా వస్తుంది. మల్లేముంది, 'కరెంటొచ్చ - మోటరుబెట్టు' అనే సామెత వినే వుంటారు. అందుకోసం మోటరు నడుచ్చా వుంద్యా లేదా అని కనిపెట్టుకొని వుండేదానికి వొగ మనిసి బాయి కాడ కావిలి గావాల. మోటరు నిల్చిపోఁగానే పారగట్టే మనిసికి కేకబెట్టి చెప్పాల. ఆ మనిసి వొచ్చి కరెంటుందో లేదో చూసి, వచ్చినాంక మల్లా మోటరుబెట్టాల. కరంటు వొగోసారి పోతే రెండు పేసుల్లో వస్సాది. రెండు పేసుల కరంటు మోటరుకు సాలదు. మూడు పేసుల్లో వచ్చినా వోల్టేజీ సక్రమంగా వుండాల. చెప్తాబోతే చానా కతే వుందిలే. నీళ్లు పారగట్టడమంటే సావే అనుకో.

రోంత సేపు కరెంటు మమ్మల్ని ఇట్టా అగసాట్లు బెట్టినాఁక, నాయన నన్ను పిలిచి, పెద్దతోట కాడికి పొయ్యి సూసిరమ్మనె. వాళ్లిద్దర్నీ సంతవనంలో మోటరుకాడ వొదిలేసి నేను బయల్దేరితి. సంతనం కాణ్ణించి రెండు తోటలు దాటి, గడిగోట రోడ్డూ ఇంగో రెండు తోటలు దాటుకోని పోతే మా పెద్దతోట.

***** ***** ***** *****

ఎవురన్నా వుండారేమో అని సూసుకుంటా తోటలోకి అడుగుబెడితి. తోటలో ఎవురూ లేరు. సద్దూసప్పుడూ లేదు. ఇట్టాంటప్పుడు బయపడకండా వుండాలనే -- నాయన నన్ను ఒక్కణ్ణే తోటలోకి పంపించింది. నిలబడిన చోటే చుట్టూరా చూస్తి - పెద్ద మామిడిచెట్ల మొదళ్లు, గుబురుగా కొమ్మలూ. ఎవురూ కనబళ్ల్యా. వొక్కడే మాడితోటలో వుండాలంటే యంత పాలెగానికైనా రోంత బయమేస్సాది. నాకూ అంతే. కాబట్టి నేను కూడా సుమారైన పాలెగాణ్ణే!

ఈ పెద్దచెట్ల గుంపుకు పక్కన్నే రోంత బీడుంది. అది సవుడు న్యాల కావడాన ఆ రోంత జాగాలో మాడిచెట్లు బతికినిట్టుల్యా. ఉన్నిట్టుండి కొమ్మల్లో ఏందో సలసల మనె. నేను వుడత మాదిరిగా సర్‌ర్ మని సౌడుబీట్లోకి పరిగెత్తినా. సలసలమనిండేది పామేమో అని అనుమానమొచ్చ. మామూలు పామైతే ఫరవాల్యా. ముట్టికొండ మింద వొక కొండసిలవ అడివిగొర్రెను పట్టిందని అందురూ చెప్పుకుంటాంటే యిన్యా. కొండకూ తోటకూ చానా దూరమేం లేదు.

యెనిక్కి తిరిగి చూస్తే ఎండిన కొమ్మొకటి కొనగొమ్మల్లో నుంచి రాలి పడె. హమ్మయ్య! నేను బయపడేది ఎవురైనా సూచ్చాండారేమో అని అనుమానమొచ్చ. "హో...య్‌య్! ఎవురాడుండేది" గాట్టిగా ఒక గావుకేక బెడితి. "యెవురోళ్లూ... ఆ... నాయినా! రా! రా!" ఆ మూల నుంచి సిన్నప్పని గొంతు.

పెద్దమామిడితోటకు కావిలి మనిషి సిన్నప్పడు. చిన్న మంటబెట్టి, ఎండి రాలిన మామిడి పుల్లలను ఆ మంటలో వొక్కోటిగా ఎగదోస్తా,..

"మెల్లంగా రా , ఆ దోవన పల్లేరుగాయలుండాయ్ బద్రం"
"మెట్లు(చెప్పులు) తొడుక్కోనొచ్చినాలే. సలిమంటేసినావే!" అంటి.
"తుమ్మ ముండ్లు గూడా వుంటాయ్ రోంత సూస్కోని రా. మెట్ల(చెప్పుల) గుండా దిగబడతాయి ."

దగ్గరికి పోయి చూస్తే ఒక ఇనుప చువ్వకు మాసం చెక్కి ఆ మంట మింద దాన్ని కాలుచ్చాండాడు. కోణ్ణి కోసేటప్పుడు గుండెకాయ పక్కకు తీసి మంటమింద కాల్చినట్టు. సిన్నప్ప కాల్చేది జూస్తే కోడి మాదిరి లేదు. యలక మాదిరిగా వుండాది.

"యేందది? ... యలకా?"
"..."

వినబళ్లేదేమో నని, సలిమంటకు ఎదురుగా కుచ్చోని మల్లా అడిగితి, "యేందది?"

"ఉడత లే ...", నీ కెందుకులే అన్నట్టుంది సమాధానం. వినబడక కాదన్నమాట ఇంతకుముందు చెప్పకపోవడం! దాన్ని చూస్తేమాత్రం యలక మాదిరే వుంది. మెత్తగా వొత్తుగా వొళ్లంతా వుండే బొచ్చు కాలిపొయ్యి, రాములవారి వేలిముద్దర్లు మాయమై, చర్మం మసిబారి, కుచ్చుతోక చుట్టూ వుండే బొచ్చంతా మాయమై యలక తోక కన్నా సన్నంగా ... చానా అద్దుమాన్నంగా వుంది. యట్టుండే వుడత యట్టైపోయనని నాకు చానా బాధాయ. సచ్చినాంక మనం గూడా ఇంతే గదా అనిపిచ్చ. రోంత భయమేశ. మాంచి నెమిలి సోగలుండే కోడుపుంజును కూడా కోసి, బొచ్చు వొలిచి, కాల్చితే ఇంతేగదా! ఎన్నో కోళ్లను చూసినాం, కోసినాం, తిన్యాం గానీ ఎప్పుడూ ఈ మాదిరిగా బాధపళ్లా. చిటుక్ చిటుక్‌మని బలే వుషారుగా వుండే వుడతను సంపి యెందుకిట్ట జేసినావన్నిట్టు సిన్నప్పణ్ణి జూస్తి. సిన్నప్పనికి పాపం తగులుకుంటుంది అనుకుంటి.

"పుల్లాచెదులు[1] కోసం యేసిన వుచ్చులో పొద్దన్నే యియ్యి బణ్ణాయి ... ... ఉడతలు తెలివైనియ్యి. సామాన్యంగా బండ వుచ్చులకు చిక్కవు. యేం జేజ్జాము! ... పారేజ్జామా?... కోసి పొట్టపేగులు పారేసి కాలుచ్చాండా." అని యింగో ఉడతను బైటికి తీసి పక్కనబెట్టె.

మాసం మంటల్లో దోరగా కాల్తాంది. అందులోనుంచి కొవ్వు వూరతాంది. వూరిన కొవ్వు కూడా మంటల్లో మండబట్టింది. ఉడత ఇంత కొవ్వు పట్టివుంటుందని నేను అనుకోలా. దోరగా కాలిన ఆ మాంసం వాసన ముక్కుకు తగలఁగానే నాకు నోరూరింది. ఆకలి పుట్టింది. అందునా పరగడుపున లేసి తోటలోకి వచ్చినా. సిన్నప్పడు నాకూ వొక ముక్క యిస్తాడా? యియ్యకపోతే సిన్నప్పకు నా దిష్టి తగులుకుంటాది.

"ఇందా యీ ముక్క దీస్కో. నోరు కాలిపోతాది - వుఫ్ వుఫ్ మని వూపుకోని తిను."

మారు మాట్టాడకుండా చేతికి దీసుకొంటి. ముక్క వాసనకు నోరు వూరిపాయ. నాకు పాపం తగులుకున్యా ఫరవాలేదనుకుని నమిలి తినేస్తి. ఒక ముక్క నోట్లో యేసుకోని చప్పరిస్తా, "బాగుండ్లా!" అనె చిన్నప్పడు . "బ్రమ్మాండంగా వుండ్లా!!" అంటి నేను.

"యెవురితో అనగాకు"
"యాఁ??"
"యేమంటే యేం జెప్తాం, వుడతల కొట్టి తిన్యామని జెప్పుకుందామా?"
"..."
వుడతలను నేను కొట్టల్యా పట్టల్యా. ఔరా సిన్నప్పడా! నన్ను గూడా కలిపేసినావు గదరా అనుకుంటి.


రెండో వుడతకు తోలు తీసి పేగులు వొలిచి వొక మామిడి చెట్టు మిందికి యిసిరేశ చిన్నప్పడు. పేగులు కింద పడక ముందే ఒక కాకి వాటిని తన్నకపాయ. వుడతను కడ్డీకి గుచ్చి, మంటల్లో కాలుచ్చాండాడు. అంతలో "సలిమంటేసినారా! ... యేందో తింటాండారే!?" అంటా యనక నుంచి వచ్చ మా గోపీ. సిన్నప్పడు మా యిద్దరికీ చెరో మాంసం ముక్క చేతిలో బెట్టి "యెవుర్తో అనగాకండి, బాగుండదు" అనె. అంతలో మా నాయనొచ్చ. సిన్నప్పడు మా ముగ్గరికీ ఆ మాటే జెప్పె. ఆ దోవన యింగో మనిసి పోతాంటే పిలిచి, ముక్క చేతిలో బెట్టి, "యెవురితో అనగాకండి, బాగుండదు" అనె చిన్నప్పడు. "చెప్తే యేమి?" అనె అంతదాఁక ముక్కలు నమిలిన మా గోపీగాడు. వానికి అర్థమయ్యేటట్టు చెప్పేసరికి చిన్నప్పనికి తిన్నది అరిగిపాయ. చిన్నప్పనికి తినింది అరిగిపోగానే, - మీ జుట్లు నా చేతిలో వుండాయిలే - అన్నిట్టు పెద్దపెట్టున నవ్వె మా గోపిగాడు. నవ్వి, తమాషగా "యాఁ??" అనె. ఈసారి చిన్నోనికి రోంత కోపమొచ్చినట్టుంది.

"యేమంటే యేం జెప్తాం, వుడతల కొట్టి తిన్యామని జెప్పుకుందామా?"
"..."

అందర్నీ పిలిచి పిలిచి చెప్పడమెందుకు, మాంసం ముక్కలు తినండని చేతిలో బెట్టడమెందుకు, తిన్యాక యెవురికీ చెప్పగాకండి అనడమెందుకు... రోంత అర్థమైంది. ఒకడే జేస్తే వాడు దొంగ. పదిమంది జేస్తే ...

ఈ పొద్దు దాఁక నీకు తప్ప నేనెవురికీ చెప్పలా. నువ్వు గూడా ఎవురికీ చెప్పగాకు. [:)]

****************************************


  1. పుల్లాచెదులు - పుల్లని రంగులో ఈకలు కలిగిన పక్షులు. మామిడి తోటల్లో ఎక్కువగా కనబడతాయి. ఒక కట్టె పుల్లకు రెండు వేరుశెనగ కాయలను కట్టి, ఒక చెట్టుకింద ఒక బండను ఆ పుల్ల సాయంతో నాజూకుగా ఏటవాలుగా నిలబెట్టితే, ఈ పక్షులు వచ్చి, శెనక్కాయలకోసం పుల్లను కదిలించి, బండకింద పడి చస్తాయి. ఉడతలు ఈ పక్షులకంటే తెలివైనవి. సాధారణంగా ఇలాంటి ఉచ్చుల జోలికి రావు.

18 comments:

అగంతకుడు said...

యాజ్ యూజువల్....సూపరో సూపర్

Reddy said...

9/10

teresa said...

హహ, మీ సిన్నప్పడు చాలా తెలివైనవాడు!
పుల్లని రుచి తెలుసుగానీ పుల్లని
రుచేవిటీ,ఎప్పుడూవిన్లా?

teresa said...

oops, Typo.. పుల్లని రంగేవిటీ?

వికటకవి said...

యధాప్రకారం వెరీ గుడ్డు.

చాలా ఉంది said...

సూపర్, కానీ పుల్లని రంగు అర్తం గాల్యా.
గ్యాసు నూనెను గబ్బుసమురు అనికూడా అంటారల్లే ఉంది.

రవి వైజాసత్య said...

బాగుంది. (10/10)
పుల్లని రంగంటే blonde hairలో బ్లాండ్ అని చెప్పచ్చు. కిరోసిన్ = గ్యాసు నూనె, గబ్బు నూనె, మంటి నూనె, మట్టిసమురు, గబ్బుసమురు

చదువరి said...

బాగుంది.

కొత్త పాళీ said...

పదుగురాడు మాట పాడియై ధర జెల్లు ..
అట్లనే .. పదుగురు ఉడతలని వేటాడితే ..???
టాం సాయర్ని బట్టుపల్లెలో ఇరవయ్యో శతాబ్దంలో మావిడితోటలో నిలబెట్టావు!
ఈ కతలో నువ్వు చెప్పిన అనేక కాంసెప్టులు .. చలీ గాచుకోవడం, భూతదయ లేకపోతే పాపం తగలడం, పక్కోడు తినే రుచికరమైన వస్తువు మనక్కూడా పెట్టడా అని ఆశగా చూడ్డం .. విశ్వవ్యాప్తంగా పిల్లల కథలే!

ప్రవీణ్ గార్లపాటి said...

చాలా బాగుంది రానారె.
మధ్య మధ్యలో నీ ఆలోచనలు, అభిప్రాయాలు జొప్పించడం కూడా బాగుంది.

రానారె said...

అందరికీ నమస్కారం. మీరు చదివి ఆనందించగలిగేలా ఈ సంఘటనను చెప్పగలిగినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతాశతములు.
@తెరెసా గారూ, పుల్లని రంగు అంటే రవిచెప్పినట్లు blond అనుకోవచ్చు.
@చాలా ఉంది: కొత్త సంవత్సరంలో మీ బ్లాగులో కొత్తటపాలను చూడగలనని ఆశిస్తున్నాను.
కొత్తపాళీగారు - టామ్ సాయర్ కథలను చదివేటప్పుడు సరిగ్గా నేనూ ఇలాగే అనుకున్నాను - విశ్వ వ్యాప్తంగా పిల్లల మనసులు దాదాపు ఒక్కలాగే వుంటాయని.

రాధిక said...

10/10

happynadh said...

Annaaa,

Idi pratipakshaala KUTTRRA, Charitranu marchi, maaa pai prajalaku tappudu abhipraayaalu kaliginchi, maa reputation debba teeyadam meeku tagadu. deenni memu Khandistunnam....!!

Vudata medadu tinte neeku burra perugutundi raa, nuvvu class lo second, tinte first vastaav ani, amaaayakudinaina naaku, maaya maatalu cheppi, daaani medadu tinipinchindi nuvvu kaadaaa ani adugutunnam adhyakshaaaa...!!

Story writing is supurb, keep going buddy...!!

Anonymous said...

10^10/10
గురూజి,
నేనెం పాపం చేసాను గురూజి.ఈనాడు సండే స్పేషల్ చదివితిని పో. అక్కడితో ఆగకుండ కూడలి కి వస్తిని పో.అక్కడితో ఆగకుండ నా కర్మ కాలడం మూలనేమొ మీ బ్లాగు చూడటం ఎందుకు?. చూసిన వాడిని ఊరికె వుండకుండ వచ్చి మొదటి నుండి చివరి వరకు చదవటం ఎందుకు? అంత అయిపోగనే టైం చూడటం ఎందుకు? రాత్రి నాలుగు అయ్యిందని తెలుసుకొని షాక్ అవడం ఎందుకు? పొద్దున్నె మేనజర్ నన్ను చూపులతోటే చంపటం ఎందుకు? ఇంత జరిగాక కూడ మళ్ళి మళ్ళీఇ కొత్త బ్లాగ్ ఎమైన రాసారెమొ అని మీ బ్లాగ్ కు రావడం ఎందుకు? మళ్ళి మళ్ళీ మొదటి నుండి చివరి వరకు చదవటం ఎందుకు? ఇది షరా మాములు అయిపొయింది గురూజి.

నాకు ఇన్ని కష్తాలు కలిగించి నందుకు మీరు ఇలాగే చిర కాలం మెరు బ్లాగ్స్ రస్తానే వుండాలని, వాటిని చదవటనికి నాలాగే మీ ఏ సి లు నిద్రను మరచిపొయి వాళ్ళా వాళ్ళా మేనజర్ల చూపులతొనే మర్దర్లు అయిపోవలని మనసార కోరుకుంటు.

ఇది రాయడనికి లేఖిని లొ గంట కస్టపడటం ఎంటో? టెంప్ట్ అయిపోయవుర శివ

ఊపసంహరం: ఇది నా జీవితం లో నే రాసిన మొట్ట మొదటి కామెంట్. తప్పులుంటే శిక్షగ ఓ పది బ్లాగ్స్ రాసేయండి

రానారె said...

@happynadh, రాధికగారు - ధన్యవాదాలు.
@శివగారూ - గంటసేపు కష్టపడి వ్యాఖ్యరాశారనే సంగతి నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. లేఖిని వాడకం మొదలెట్టారు కనుక, మీరూ ఒక బ్లాగు మొదలెట్టండి. మీరు బ్లాగరైతే అనామకం(anonymous)గా కాకుండా మీ పేరుతోనే వ్యాఖ్య రాయవచ్చు.

చివరిగా, మీ మానేజర్‌ను కూడలికి తీసుకురండి. :)

balarami reddy said...

anna..
chana baga rasinavanna..
"ee desamegina endu kalidina pogadara nee talli bhoomi bharatini" annatlu vere desam lo unna mana kadapa mandalikanni marchipokunda chana baga raasinav..asalaina "palegaadu" nuvve anna..

రానారె said...

థాంక్యూ తమ్ముడూ. :-))

Dil said...

Superb annaa..

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.