ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏ తీరుగ నిను నువు జూసెదవో ... !!

చింతచెట్టుకింద గోలీలాట ఆడుకుంటాండాం. మొదిటాట మా దిక్కు ఓడిపొయినాం. చానూవాళ్ల దిక్కు గెల్సినారు. గోలీలాటలో చానూను కొట్టేవోడు బాదుల్లా వొక్కడే.

గెలిచిన దిక్కు వుండే వోళ్లు వొగోరూ మా గోలీని యంత దూరం కొడితే అంతదూరం నుంచీ ఓడిపొయినోళ్లము మోచేత్తో బద్దె దాఁక దేకాల గదా. నా దెగ్గిర ఒక గుబ్బగోలీ వుంటే దాన్నిచ్చినా కొట్టుకోండి సూజ్జామని. గుబ్బగోలీని కదిలిచ్చడం అంత సులువుగాదు. కదిలిచ్చినా మోచెయ్యి దోక్కపోకండా బద్ది దాఁక దేక్కరావొచ్చని నా ఆలాశన.

అవతల మా గోపీగాడు వుండాడు గదా! వాని దెగ్గిర అంతకంటే పెద్ద గోలిగుండు వుంది. వాడు దాన్ని చానూకిచ్చినాడు. పెద్దగోలీతో కొడ్తే గుబ్బగోలీ ఎగిరి యాణ్ణోబొయ్యి పడె. ఆ తరవాత చానూదిక్కోళ్లు ఎవురూ దాన్ని కదిలిచ్చల్యాక పొయిరి. ఇంగ దేకేటప్పుడు గెల్చినోళ్ల ఊలలూ కేకలూ. మా దిక్కు బాదుల్లా వొక్కడే సరైన ఆటగాడు. మిగతావాళ్లము సరిగ్గా ఆడల్యాకనే ఓడిపొయినాం. ఐనాసరే నన్ను వద్దనిజెప్పి బాదుల్లా వొగడే గోలీని మోచెత్తో బద్దిలోకి దొల్లిచ్చిపారేశ.

*** *** *** *** *** *** *** ***

జిల్లాకోడైతే జిల్లను ఎరగేసి మూడేట్లు నాలుగేట్లు కొట్టేసి నేనొక్కణ్ణే గెలిపించిపారేస్తాగానీ గోలీలాట నా శాతగాల్యా. జిల్లాకోడికైతే అందరూ వాళ్ల దిక్కు కోరుకుంటారు గానీ, గోలీలాటైతే నన్నెవురూ కోరుకోరు. అడేవోళ్లలో శానామంది నాకంటే పెద్దోళ్లే. "నువ్వు నిలబడుకోని సూచ్చా వుండు బాబూ. ఈసారి మనమే గెలుస్సాండాం" అంటారు - బాదుల్లాగానీ చానూగానీ యింగెవురన్నాగానీ. నేను నిలబడి సూచ్చా వుంటే వోళ్లే ఆడి, వోళ్లే గెలిచి, వోళ్లే ఓడి, ... అంతా వోళ్లే.

మా దిక్కు వోడిపోతే మాత్రం నాకు బాధ. గెల్చినప్పుడు నాకేం పెద్ద సంబరం ల్యా. నేనాడింటే గదా పండగజేస్కునేదానికి! "యిట్టైతే మీరే ఆడుకోపోండి, మా చింతచెట్టుకింద ఆడగాకండి" అందామా అనిపిస్సాది. ఐతే ఆ మాట అంత సులువుగా అనలేం లే.

ఎందుకంటే ఎవురన్నా మెండి జేసి, వాళ్లు కొట్టాడుకోని, ఆట నిల్చిపొయ్యే పరిస్థితి వొచ్చినప్పుడు నన్ను న్యాయం చెప్పమంటారు గదా! అప్పుడు నేను చెప్పిందే న్యాయం గదా! "బాబు చెప్తాండాడు గాబట్టి వొప్పుకుంటాండాం" అంటారు గదా! న్యాయం జెప్పేదానికి మనం ల్యాకపోతే "మొండికి గండిదేవుడు (ఆంజినేయులు సామి) సూపిస్సాడు పోరా" అని నిష్టూరమాడి ఆట నిలిపేస్సారు గదా! మనల్ని పెద్దమనిషి మాదిరిగా సూసి, న్యాయం జెప్పమని మన దెగ్గిరికి యెవురన్నా వచ్చేటప్పుడు మనం గూడా పెద్దమనిసి తరా సూపిచ్చాల గదా! సూపిచ్చాల్నా లేదా!? సూపిచ్చాల. సూపిచ్చాలంటే నేను నిలబడుకొని సూచ్చా వుండాల్సిందే.

*** *** *** *** *** *** *** ***

అట్టాంటి ఆట మధ్యలో వొగోసారి తొండాకులూ నలికిర్లూ దూరతాయి. లేదా అయ్యుండే తావుకు మనమే పోతాం. నలిరికికి వుషారెక్కువ. మనిషిని సూడంగానే సర్రసర్రామని సింతమాని మొదిట్లోనో ల్యాకపోతే రాళ్ల తెట్టె సందులోనో బొక్కలోకి దూరుకోని తలకాయ బైటబెట్టి సూచ్చావుంటాది. గోలీలాట ఆడతా ఆడతా రాళ్ల తెట్టె కాడికి పోతిమి. ఆ తెట్టెలో గోలీకాడ సిన్న నలికిరి పిల్ల. మమ్మల్నే సూచ్చా నాలికలు కోచ్చాంది.

"నలికిరీ నలికిరీ నాగుబాము తమ్ముడా - మీ యన్నకు జెప్పగాకు మీ నాయనకు జెప్పగాకు - నా పేరు బాదుల్లా!" బయపణ్ణిట్టుగా నలికిరితో మాట్లాణ్ణాడు బాదుల్లా. "ఈ బాబు రెడ్డేరి పిల్లోడు." అని నన్నుగూడా నలికిరికి పరిచయం చేసేసి మళ్లా ఆటలో బణ్ణాడు. బాదుల్లా బయం జూస్తే నాకు నవ్వొచ్చింది.

నేను యట్టా ఆడుకోడం ల్యా గదా! నలికిరి దూరిన రాళ్లతెట్టె కాడికి పొయ్యి చూస్తి. మాటిమాటికీ తలకాయ బైటబెట్టి నన్ను సూచ్చాంది నలికిరి. దాని కండ్లు యంత నల్లగుండాయంటే అంత నల్లగుండాయ్. అంతకంటే నల్లగా యింగే వస్తువూ వుండదు. మధ్య మధ్యలో వొక్కరవ్వ నోరు దెరిసి నాలికలు కోస్తా వుంది. నలికిరి మొగమంతా నున్నటి బంగారు పొలుసులు. వొళ్లంతా నాజూగ్గా ఆరోగ్యంగా మెరిసిపోతాంది.

"నలికిరి పెద్దదైతే నాగుబామైపోతాది బాబూ! నాగరాజు వాళ్లన్నే!! పగ బట్టినాడంటే యేడేడు జన్మాలు కాటేసి సంపందే సల్లారడు!!!" బాదుల్లా నా చెవుల్లో రహస్యం చెప్పినాడు - నలికిరికి యినబడకుండా. ఆట సాలిచ్చి యెప్పుడొచ్చినాడో యేమో.

'యీపున రెండు నల్ల గీతలు, నాలుగుకాళ్లూ గనక ల్యాకపోతే నలికిరి అచ్చం నాగుబాము పిల్లే. వొగ్యాల నిజంగానే నాగుబాము తమ్ముడేనేమో!' అనిపిచ్చగానే నాకూ భయం పట్టుకుండె. ఆణ్ణించీ వొచ్చేద్దామా అనుకుంటి. రాళ్లతెట్టె లోపల వాళ్లన్నతో నా గురించి యేమన్నా చెప్తాదేమో ననిపిచ్చ. నేనుగూడా బాదుల్లా మాదిరిగా సన్నగా - "నలికిరీ నలికిరీ నాగుబాము తమ్ముడా - ఎవ్వురితో యేమీ జెప్పగాకు సామీ - నేనెవురికీ చెడ్డజేసేవోణ్ణి కాదు" అని చెప్పి మెల్లిగా ఆణ్ణించి లేసి పక్కకొచ్చేస్తి. యిట్టాటియ్యన్నీ మూఢనమ్మకాలని మనకు తెలుసు. తెలిసినా సరే చెప్పకపోతే యింగోసారి తెట్టె పక్కకు పోవాలంటే గిలిగా వుంటాండ్ల్యా!?

*** *** *** *** *** *** *** ***

లేసి ఇవతలకు రాఁగానే, చేతికి దొరికిన రాళ్లన్నీ యేరుకొని సుంకేసుల చెట్టుమిందికి కోపంగా యిసురుతాండాడు బాదుల్లా. నన్ను సూడంగానే - "దీనికి మనుసులంటే లెక్కా జమా ల్యా బాబూ. ల్యాకపోతే నన్ను యెక్కిరిచ్చుంద్యా ఇది!" అని, మల్లా సుంకేసుల కొమ్మ మిందికి రాళ్లు యిసురుతా "రాయ్యే, ఈ పక్కకు రాయ్యే నియ్య*" అని తిట్టబట్నాడు. తొండాకిని తిడతాండాడని నాకు అర్థమాయ గానీ, కొట్టగాకు వొద్దని చెప్పినా యినడనీ, యింగ రోంచేపటికి ఆ తొండాకి నుజ్జునుజ్జైపోతుందనీ, తరవాత దాన్ని యిసకలో బూడ్సిపెట్టి దేవునికి దణ్ణంబెట్టుకుంటాడనీ నాకు తెలుసుగాబట్టి చెప్పల్యా. ఇంతకూ ఆ తొండాకి జేసిన యెక్కిరింత యేందంటే - సుంకేసుల కొమ్మ మింద నిల్చి, ఆణ్ణుంచి కిందుండే మనిషిని చూసి తలను పైకీ కిందికీ ఆడించడమే.

*** *** *** *** *** *** *** ***

మనకుండే అక్కరలను బట్టి, సుట్టకారమూ వుండే మనుసుల అక్కరలను బట్టి -- వొగసారి పెద్దమనిసిగానూ, వొగసారి భయస్తునిగానూ, వొగోసారి భయమే తెలీని మొగోనిగానూ, వొగసారి భారతంలో అర్జునుని మాదిరిగా నిమిత్తమాత్రునిగానూ -- మనకు మనం కనిపిస్సా వుంటామేమో!!

కామెంట్‌లు

మన యాస కోసమైనా జ్ఞాపకాలకోసమైనా మీ టపా టపాకు మాదిరి పేలినట్టే ఉంటాదిబ్బా...
kiraN చెప్పారు…
ఎప్పటిలా 'భలే' రాసావు. నీ పుణ్యమా అని యాస లోని చాలా పదాలకు అర్ధాలు తెలుసుకుంటున్నాను.

ఆఖర్న రాసిన ఆ నాలుగు లైన్లు నా మనసుకి హతుకున్నాయి

లేటయినందుకు క్షమించాలి.


- కిరణ్
అజ్ఞాత చెప్పారు…
బాగుంది.

మామూలుగా అయితే 9/10.
పాత రెఫెరెన్సులను బట్టి GATE స్కోరు లాగయితే 7/10.

ఇందులో "రాయల" ధనం పాళ్ళు తగ్గి నాన్ "రాయల" కి ఫణం గావించబడింది.

-- విహారి
రానారె చెప్పారు…
@కృష్ణమోహన్ - చాలా కృతజ్ఞతలు.
@కిరణ్ - వ్యాఖ్య రాయడమే మహాభాగ్యం. లేటైనా లోటేమీ లేదు. థాంక్యూ.
@విహారి - ఈ నెల అసలేమీ రాయకుండా వుందామనుకున్నాను. సరిగా పూనుకోకపోవడం ఈ టపాలో తెలుస్తున్నట్లుంది. మీలాగ మొహమాటం లేకుండా మార్కులేయడమనే పద్ధతి నాకు చాలా ఉపయోగం. నెనర్లు.
చదువరి చెప్పారు…
ఈ జిల్లాకోడి ఏంటి? కర్రా బిళ్ళా లాంటి ఆటేదైనానా? (దాన్ని మేం బిళ్ళంగోడు అనేవాళ్ళం)
రానారె చెప్పారు…
ఔనండి. అదే. దాన్ని వీరబల్లెలో జిల్లాకోడి లేదా జిల్లాకట్టె అంటారు. జిల్ల అంటే రెండుపక్కలా జిగరబడిన జిట్టెడు కర్ర ముక్క. కోడి అంటే ఒకవైపు జిగరబడిన మూరడుపొడవుండే కర్ర. మళ్లీ ఈ జిగురేమిటి అంటారా? జిగురు/జివురు = (కొడవలితో/కత్తితో)చెక్కు అని వాడుక. బ్రౌణ్యంలో లేదిది.
అజ్ఞాత చెప్పారు…
చిత్తూరు జిల్లాలో కూడా ఈ ఆటను "జిల్లాకోడి" అనే అంటారు.
అజ్ఞాత చెప్పారు…
మా ఊర్లో (కల్లూరు) మామూలు ఆటలతో విసుగొచ్చినప్పుడంతా తొండాకుల్ను చంపేదానికి పిల్లోళ్ళంతా పొలోమని బయలుదేరేవాళ్ళు. ఒక్కో ట్రిప్పులో కనీసం ఇరవై తొండాకిలు ఫట్. నలికిరి కనిపిస్తే మాత్రం..."నలికిరి నలికిరి నాగుపాము తమ్ముడు.." అని మంత్రం అందుకునే వాళ్ళు.
RG చెప్పారు…
ఇది ఏ యాసండీ? నెల్లూరుయాసలా అనిపిస్తోంది. రాయలసీమయాస కూడా అయిఉండవచ్చా?
రానారె చెప్పారు…
@rsg
రెండు దశాబ్దాల క్రితం నాటిభట్టుపల్లెలో జనం మాట్లాడిన యాస ఇది. సినిమా, టీవీ మరియు రవాణా సౌకర్యాలు, జీవన శైలీ ప్రమాణాలు మెరుగుపడుతూ రావడంతో ఇది కొంచం కొంచం మారుతూ వస్తూ వుంది.
Dr.Pen చెప్పారు…
ఇలాంటి ఆటలు ఆడాలంటే పల్లెల్లోనే...ఆ ఆనందమే వేరు.సినీరంగంలో 'బాబు'ల్లా మీ భట్టుపల్లె మొత్తానికి నువ్వే ఏకైక 'బాబ'న్నమాట:-)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె