ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తాతగారి అనుపమితోపమానము

పన్ల కాలం. అందురూ మడికాడికి బొయినారు. అన్నదమ్ములమిద్దరమూ ఇంటికి కావిలి. మాక్కావిలి మా తాత. పొద్దన్నుంచీ సింతసెట్టుకింద నిలబడి సూచ్చాండాం, ఆడుకుండేదానికి పిల్లకాయలెవురన్నా వచ్చారేమోనని. యంతసేపు జూసినా వొక్కడూరాల్యా. మేమిద్దరమే రోంచేపు ఏమన్నా ఆడుకున్యామంటే అది కొట్లాటే.

ఊళ్లో పిల్లాపెద్దా అందురూ పన్లకు బొయినిట్టుండారు. వొగ మనిసిగాని గొడ్డూగోదాగాని యెవురేగాని బైట కనపరాల్యా. వడగాలికి సింతసెట్టు కింద నిలబడుకొనుంటే కంసలోల్ల యీరయ్య కొలిమికాడున్నిట్టు అగ్గి సెగ. పడమటగాలి. గాలితోలే సద్దు తప్ప వొక్క పక్షిగూడా యాణ్ణేగాని కూత గూడా బెట్లా. కోళ్లు మాత్రం ఇంటి ముందరుండే సర్కారుకంపచెట్లల్లో చెదులు కోసం చిదుగుతాండాయి.

ఉన్నిట్టుండి పెద్దకోడిపుంజు దిగ్గునలేసి బెదురుగా నిలబడె. బొమ్మెలన్నీ యెక్కడియ్యక్కడ నిల్చిపొయ్యి మెడలు పైకెత్తి బీతుగా దిక్కుల్జూశ. పెద్దపుంజు వొగ కన్నుతో ఆకాశంకల్లా తేరిపారజూస్తా సన్నగా కుర్‌ర్‌ర్రుమనె. అట్లనేటప్పుడు దాని ఈకలన్నీ మెరుగుతగ్గి వొంటికి అంటగరసకపాయ. బొమ్మెలన్నీ యెప్పుడు దూరుకున్యాయో యెనుముల కొటంలేకి దూరుకున్యాయ్. పెద్దపుంజుతోపాటుగా పిల్లలకోడిగూడా వసారాలోకి దూరె. "గద్దకయితే అంతగా బెదరవే" అనుకుంటి. "కుందేటిసారవ ,కుందేటిసారవ"(డేగ) అని అరుచ్చా మావోడు అడ్డం పరిగెత్తె. అల్లంతదూరంలో సారవ! కిందనే ఎగుర్తా నక్కలగుట్ట దిక్కు పోతాంది. కోడిపిల్లను తన్నకపోతాందో యేమో! గాలిగూడా నిల్చిపొయినిట్టుంది. సద్దే లేదు. నా గుండెకాయ దడాదడామని ఎదురొమ్ముకు కొట్టుకుంటాన్నింట్టుగా అనిపిచ్చె.

యాడ దాంకోనున్నిందోయేమో, పిల్లలకోడి ముందుగా 'కొటా కొక్కొక్కొక్కొ కొటా'మని కొంప కాలిపోతాన్నిట్టు కొటారిచ్చబట్టె. దాన్నిజూసి మిగతాకోళ్లుగూడా వాటి ఓపిక్కొద్దీ కొటారిచ్చబట్టినాయ్. సారవ భయానికే సగం పానం పోతాది. ఒక్క కోడిగూడా ఇంట్లోనించీ బైటికి రాల్యా. ఎన్ని పిల్లలుండాయో ఎన్నిబోయనోనని దానిబాధ. మావోనికీ అదే ఆదుర్దా. కంపలోకి బొయ్యి, 'నేనుండంగా మీకేం బయంలేద'న్నిట్టు నిలబడి, కంపల్లోనే ముడుక్కోనుండిపోయిన పిల్లలను యతకబట్టె. అవతల వాఁటెమ్మ ఇంట్లోనుంచే వాఁటెను పిల్చబట్టె. ఐనా ఒక్క పిల్ల గూడా మెదల్ల్యా. నేను పొయ్యి కంపకూ ఇంటికీ మధ్యలో నిలబడితి. అప్పుడు వొగదాన్ని జూసుకోని వొగటిగా కంపలోనించీ పిల్లలన్నీ వాఁటెమ్మదెగ్గిరికి రెపరెపా వొచ్చి వాలె. ఇద్దరమూ లెక్కబెట్టి జూస్తిమి. అన్నీ వున్యాయి. అన్నీ అంటే పొయ్యేటియి పోఁగా మిగిలింది ఆరేలే. కాకులకూ గద్దలకూ పోనిచ్చే కోడిగాదు గానీ ముంగీసను ఎంత కోడైనా ఏమీ జెయ్యలేదు గదా!

****

కుందేటిసారవ పెద్దపెద్ద కోడిపుంజుల్నే లెక్కజెయ్యదు.అది వాలేటప్పుడు బుమ్మ్‌మ్మని మోరుచ్చుందని వొగసారి మాయవ్వ జెప్పింది. వొగరోజు అట్టాటి మోరుపు యిని పరిగెత్తుకుంటా పోతే, పెద్దచేన్లో సుమారైన కోడిపెట్ట తలకాయ వాలిపొయ్యి కొన ఊపిరితో కనబడింది. దాని యీపుమీద యేలెడంత లోతు గాట్లు దిగిపోయుండాయి. ఆ గాట్లుకు మాయవ్వ యఱ్ఱమన్ను పూసి, పసుపు పూసి, ఆ గాయం మింద మేమూ పోసి వైద్యంజేస్తే చాన్నాళ్లకు ఆకోడి మల్లా తిరుక్కునింది. బతికిందిగానీ బతికినన్నాళ్లూ యాడన్నా కాకి వాలినా బయపడ్తాన్నింది పాపం. కుందేలుగూడా ఆ మోరుపుకు కాళ్లాడక యాడిది ఆణ్ణే శిలైపోతుందంట. అప్పుడు సారవ దాన్ని తన్ని కనుగుడ్లు పెరికి, దొమ్మల చీల్చి, మెత్త గుండెకాయ మాత్రం తిని, కడుపునిండినాఁక వొదిలేసి పోతుందంట. పాలెంపలం అడివిలో సారవ దెబ్బకు కండ్లుబోయిన కుందేలొకటి వొగ ముసిలామెకు దొరికిందంట.

****

కోళ్లుగూడా ఇంట్లోకి బొయినాంక, మా తాత "ఇంట్లేకి రాండి నాయినా!" అన్యాడు. తాత ఏమన్నా చెప్తే దానికి యిరుడ్డంగా ఇంకో పని చెయ్యడంలో మా ఇద్దరికీ బలే ఐకమత్యం. మేము ఉలకల్యా పలకల్యా. మల్లా బిలిసినాడు. పో బుద్ది కాల్యాగానీ, రెండుబారల పొద్దెక్కింది, బైట యండ సంపుతాంది. ఆ వడగాలికి బైట చింతచెట్టుకింద ఉండబుద్ధిగాక వొగరి మొగ మొగరం జూసుకోని ఇంట్లోకి బోతిమి. కుందేటిసారవ పెట్టిన బెత్తురు తగ్గినాగానీ, యండకు తట్టుకోల్యాక కోళ్లుగూడా యనమలకొట్టంలోనే పేడకళ్లు సిదుక్కోని యారకతింటాండాయ్.

కోడిపిల్లలను రక్షించినామనే సంతోషంలో ఇద్దరమూ వసారాలో మంచంమింద కూసున్యాం. మాకు రోంత దూరంలో వాకిటికెదురుగ్గా మా తాత మంచం. అయన మంచం మింద ఎప్పుడూ పరిసిన పరుపు పరిసినిట్టే, కట్టిన దోమతెర కట్టింది కట్టినట్టే ఉంటాయి. పరుపుకింద - ఉతికిచ్చిన కొత్త జంకాళమూ, పరుపుమింద - సుబ్బరమైన దుప్పటీ, మూడు పక్కల పరుపుకిందికి చొప్పించి కుడిపక్కన పైకి కట్టిన దోమతెర. అంతా సుద్దంగా ఉంటాది.

****

రోంత సద్దు మణిగినాఁక, పిల్లలొచ్చి కోడి రెక్కలకింద దాంకుండె. కొటారిచ్చి కొటారిచ్చి అలిసిపొయ్యిందేమో అన్నింటినీ రెక్కలకింద పొదుక్కోని మాగన్నుగా నిద్దరబోతాంది. అంతా నిశబ్దం. మెల్లిగా మా తాత పిల్చె -

"నాయినా, ఇద్దురూ ఇట్టొచ్చి నా పక్కన గూసోండి."
"..."

"ఆ మంచం బాగలేదు. ఇద్దురూ ఈ మంచంమిందికొచ్చి కుచ్చోండి."
"..."

"చెప్తే యినాల. ఆ మంచం బాలేదు. కుసులు ఇరిగిపోతాయ్. వొగరు యిట్రాండ్రా అంటే..."
"నీ మంచమే బాగలేదు. నువ్వే ఈడికి రా!" - మావోడు.

"యిరుడ్డమంటే చెరిసగం అంటావు గదరా నాయినా. రామూ నువ్వురా నాయినా."
"..."

పిల్లలకోడిగాక మిగతా కోళ్లన్నీ వొగటొగటీ ముడుక్కున్న్యాయి. పెద్దపుంజు కండ్లు తెరుసుకోనే నిద్దరబోతాంది. మల్లా రోంచేపు సద్దులేదు.

****

కోడిపిల్లల మాదిరిగా మేము ఆయన పక్కన ముడుక్కోవాలని ఆయనకు ఇష్టం. ఆయన మాకు ఏనాడూ వొగ కతగానీ పద్యంగానీ చెప్పిందిల్యా. ఊరికే ఆయన చేతులకింద మమ్మల్ను కుచ్చనబెట్టుకోవాలని మా తాతకు మోజు. ఐతే ఆయన తొడుక్కునే పంచా, సొక్కావ రెండూ మందుల గొబ్బు. ఆయన పెట్టె నిండా ఏంటేంటియ్యో మందుసీసాలూ మాత్తర్లూ, అలోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, సొంతవైద్యం అన్నీ.

పెట్టెదగ్గరికి మమ్మల్ని అస్సలు రానీడు. వాఁటెల్లో వామ్ము, మాదీఫల రసాయనము నాకు తెలిసిన మందులు. బట్టుపల్లోళ్లు ఎవురైనా ఊళ్లేకి (వీరబల్లెకు) పోతాంటే వాళ్ల చేతికి ఐదు రూపాయలు లెక్క (డబ్బు) ఇచ్చి, "సీతమ్మ అంగట్లోనుంచీ వొగ సీసా మాదిగపల్లె రసాయనం తెమ్మ"ని పురమాయించినట్టుగా యినబడేది. ఇదేం మందురా దేవుడా - అనుకున్న్యా. వొగరోజు ఆ సీసాను మంచం దెగ్గర పెట్టుకోనుంటే దాని పేరు చదివినా.

ఈ మందుల వాసన గాక, ఊపిరి వొదిలినా మాట్లాణ్ణ్యా పొగ వాసన. మంచానికి రోంత దూరంలో ఎంగిళ్లు. మంచం సుట్టకారమూ ఆయన తాగి పడేసిన బీడీ ముక్కలు. రోజూ పొద్దనా సాయంత్రం పూటా చింతసెట్టు కింద బండమీద కూసోని మా తాత వొదిలిన పొగతోనే ఆకాశంలో తెల్లటి మోడాలు తయారైనాయని నా నమ్మకం.

****

"కనుగుడ్లు పీక్కపొయ్యే దొంగలు తిరుగుతాండారంట. బైటికి పోగాకండి. ... పిల్లోళ్ల దొంగలొచ్చినారంట ... మత్తుమందు జల్లి యత్తకపోతారు ... దొరికినారంటే మల్లేంల్యా ... వాళ్ల చేతల్లోబణ్ణారంటే అంతే సంగతులు. గద్ద కోడిపిల్లను తన్నకబొయ్యినిట్టే!" - తాత ఊరికే ఉండ్లా.

మామూలుగా ఐతే భయపడం గానీ, ఇంట్లో ఎవురూ లేరయిరి. ఊళ్లోగూడా ఎవురూ ఉన్నిట్టులేరు. ఇప్పుడు గనక కనుగుడ్ల దొంగ లొచ్చినారంటే మా తాత గూడా ఏమీ చెయ్యలేడు. అయనే సరిగ్గా లేసి నిలబడి నడసలేడు. చేతికర్ర ఉంటుందిగాబట్టి ఫరవాలేదు.

ఐతే తాత చేతిపట్టు చానా బలమైంది. ఎప్పుడన్నా పొరబాటున నా రెక్క దొరకబుచ్చున్న్యాడంటే అది యిరిగిపోతుందేమో అని భయమేస్తుంది. కాబట్టి దొంగలోస్తే ఆయన పక్కన గుచ్చోవడమే మంచిదేమో! 'సారవను జూసి కోళ్లు యిట్టనే భయపడతాయేమో గదా!' అనుకుంటి.

****

'మూడువందలా ముప్పైమూడూ పాయింట్ మూడు మీటర్లూ అనగా తొమ్మిదివందల కిలోహెడ్జ్‌పై మా రెండో ప్రసారం' ప్రారంభమయ్యే టైము ఇంగా కాల్యా. ఐనా గానీ మావోడు రేడియో ఆన్జేసినాడు. అది "కూ..." అంటాంది. దాని కోసం ఇద్దరమూ కొట్లాడుకోకండా, పొద్దన్నుంచీ చేతిలోనే బెట్టుకున్యాడు. దాని కూత నాకు సగిచ్చలా. "ఆపెయ్‌ రా!" అన్న్యా.

నా మాటలో కరకుదనం వానికి అస్సలు నచ్చలా. ఇంగా సౌండు పెంచినాడు. రోంచేపు అట్నే విసుగ్గా సురుగ్గా చూసినా. "మీ తాతకు జెప్పుకో పో!" అన్నిట్టుగా వాడూ జూసి అట్ట మల్లుకున్న్యాడు. ఠకీమని రేడియో గుంజుక్కున్న్యా. నా చేతిలోనుంచీ దాన్ని మల్లా గుంజుకోజూసినాడు. వాని చేతులను తోసేసినా. ఆ తొయ్యడంలో టప్‌మని చిన్న శబ్దం వచ్చింది. వాడు నిజంగానే నన్ను కొట్టినాడు. నాకు ఒక చేతిలో రేడియో ఉండిపోయింది గాబట్టి, నేను నా కాలు ఉపయోగంలోకి తెచ్చినా. మావాడు రెండుకాళ్లూ ఉపయోగపెట్టినాడు.

రేడియోను పక్కన బెట్టి, మంచానికి తలవైపు నేనూ కాళ్లవైపు వాడూ మా తలలు పెట్టి పండుకోని, మధ్యలో ఒరినొకరం ధనధనధనధన తన్నుకుంటాండాం. "ఒరే ఒరే నాయినా, ఆయాలపాటున తగిలిందంటే పానం బోతాదిరా. తగిలినాఁక అమ్మాఅన్న్యాల్యా అబ్బాఅన్న్యాల్యా ... నామాటిని ఆ రేడియోముండను నా చేతికిచ్చి ఇద్దురూ నాకు చెరో పక్కన కూసోండ్రా" - పాపం మా తాత మొత్తుకోళ్లు అన్నీ గాలికే. మా తన్నులాట సూళ్ల్యాక ఊతకర్ర పక్కనబెట్టి ఎట్టనోగట్ట మా దగ్గరికి రాబొయినాడు. వొచ్చినాడంటే ఇద్దరినీ పట్టుకుంటాడు. దొరికినామంటే వొదలడు. ఆ బీడీకంపు, మందుల వాసన పీలుస్తా ఉండాల్సిందే.

బాగా దెగ్గిరికి రానిచ్చి, ఇంద్దరమూ మంచంమింద నుంచీ పక్కకు దుంకి బైటికి పరుగోపరుగు. మంచం పక్కనుంచీ రేడియోను చేతిలోకి తీసుకోని కాసింత నిరాశగా - "అబ్బా అబ్బా అబ్బా, పిల్లోళ్లు గాదురా సామీ మీరు. తలకాయకు డమ్ముంటే ఏనుగుల గెందేవోళ్లురా నాయినా !"

****

అప్పుడు సరిగా అర్థం కాల్యా గానీ, ఆయన అన్నె మాట సచ్చేదాఁక మరుపురాదు. ఆయన పోయి పద్నాలుగేండ్లయినా, ఆ సృజనాత్మకతాఉపమానమూ ఎప్పుడు గుర్తొచ్చినా తలచుకోని తలచుకోని నవ్వుకుంటా ఉంటాం. మా మింద యంత అభిమానాలున్న్యా భ్రమలున్న్యా, మమ్మల్ను పక్కన కూసోబెట్టుకోవాలనుకున్యా మేము ఏనాడూ ఆయనకు దగ్గరగా చేరిందేలేదు. కొన్నికొన్ని సంగతులు చాన్నాళ్లగ్గానీ అర్థంకావు.

కామెంట్‌లు

విశ్వనాధ్ చెప్పారు…
చాలా బాగా రాసారు.
మీ శైలి కూడా భలేగుంటుంది.
మరో టపా కోసం ఎదురు చూస్తుంటా..
అజ్ఞాత చెప్పారు…
10/10
రానారె,
మీ బాల్యపు బంగారు రోజులు చాలా బాగా చెబుతున్నారు. అన్ని కలిపి పుస్తకం గా తీసుకురండి.

"మా రెండో ప్రసారం" - రెండో ప్రసారం 11:45 కి మొదలయ్యేది అనుకుంటా?

-నేనుసైతం
చేతన_Chetana చెప్పారు…
11/10

మ్మ్.. మాదీఫలం.. మా మామ్మ (నానమ్మ) పక్కన చేరి అరచేతిలో పోయించుకుని తాగేవాళ్ళం. భలే ఉండేది. ఆ రుచి ఇప్పటికీ నా నొట్లోకి వస్తుంది. మా మామ్మకి పళ్ళూడిపోయి, నడుఁవొంగిపోయినా, ఒక్కత్తే ఊళ్ళన్నీ చక్కపెట్టేది, ఆఖరివరకూ కూడా.
Unknown చెప్పారు…
అదుర్స్...
నువ్వు రాసిన వాటిలో వనాఫ్ ది బెస్టు.
ఇలాంటి అనుభవాలు చిన్నప్పుడు ఉన్నాయి కాకపోతే తాతగారి బదులు తాతమ్మ. మాకెన్నో మంచి మంచి కథలు చెప్పేది. రస్కులు అవీ పెట్టేది.
రాధిక చెప్పారు…
"కొన్ని సంఘటనలు చివరికి గానీ అర్ధం కావు" నిజమే. నేను పశ్చాత్తాప పడే వాటిలో ఇలాంటి సంఘటన ఒకటి.
"మాదిగపల్లె రసాయనం" ఇది మా తాతయ్య కొనేవారు.కానీ "మాదిగఫల రసాయనం " అనేవారు.
ఇది కాక"వామరుకు" కూడా తాగేవారు.ఇవి రెండూ ఎవరో ఒకాయన సైకిల్ లో వెనుక బుట్టలో ఒక 10,12 సీసాలు మాత్రమే పెట్టుకుని 2 నెలలకోసారి వస్తూ వుండేవారు.తాతయ్య లానే అది కొనేవారు ఆ చుట్టుపక్కల మొత్తం 10 మందే వున్నారట.తాతయ్య పోయాకా కూడా అప్పుడప్పుడూ వస్తూవుండేవాడు ఆ పెద్దాయన.
Sriram చెప్పారు…
చదువుతున్నంతసేపూ పొందిన ఆనందానికి నీకు ఎన్ని నెనర్లు చెప్పినా తక్కువే!
అజ్ఞాత చెప్పారు…
చూడుబ్బా రామ్నాధమూ. ఇట్లా ఎబ్బుడూ రాస్తానే ఉండల్లబ్బా. ఇట్లాంటివి జదవతా వుంటే మనుసు యాడాడికో పొయ్యి వస్తాది. చానా బాగా రాచ్చావుండావు గానీ. ఈట్ని పుచ్చకంలో ఏపిచ్చలంటే నాకు జెప్పు. నా ఈడోల్లు కొంత మంది ఈ పని జేచ్చారంట.

-- విహారి
Dr.Pen చెప్పారు…
కోళ్లు మాత్రం ఇంటి ముందరుండే సర్కారుకంపచెట్లల్లో చెదులు కోసం చిదుగుతాండాయి...మా పెద్దతాత ఎక్కడెక్కడి చెదలనీ పట్టుకొచ్చి కోళ్లకు వేయడం గుర్తుకొచ్చింది. రానారె 'విహారి' అన్నట్టు 'కాదరయ్య కథలు' అని ఓ పుస్తకం తేవాల్సందే...లేకుంటే అంతర్జాలంలో లేని తెలుగు సాహిత్యాభిమానులందరూ ఏదో కోల్పోతారు! 100/100
GKK చెప్పారు…
ఎప్పటిలాగే శైలి బాగుంది రానారన్నా.చిన్నపిల్లల మనసుల సునిశిత పరిశీలన కూడా మంచిరచయితవని చెప్పకనే చెబుతోంది.
కానీ నవల్లో రెండు పేజీలు చదివినట్టుంది. విడిగా చూస్తే అసంపూర్తిగా అనిపిస్తుంది. తప్పకుండా పుస్తకంగా రావలసిన రచనలు.
అజ్ఞాత చెప్పారు…
రానారె,

జ్యోతక్క సూచన,గురువు గారి ఆజ్ఞ, మా వంటి అభిమానుల కోరిక ప్రకారం, మీరు ఇంక మీ కాదరయ్య కథలని వినిపించాలి. :)
-నేనుసైతం
కొత్త పాళీ చెప్పారు…
రాంనాథా, నీ సూచన ననుసరించి పాత కథలు మళ్ళి చదువుదామని వచ్చాను. ఎందుకో నీ లంకెబిందెల లిస్టు కనుమరుగయ్యింది. బహుశా అక్షరాల కలరింగుతో తంటా ఏమో. మూషికంతో "హైలైటు" చేస్తే కనిపిస్తున్నై, పక్కన నొక్కితే మాయంవుతున్నై. ఒకసారి దాని సంగతేంటో చూడు. ముందుగానే థాంకులు.
అజ్ఞాత చెప్పారు…
"తలకాయకు డమ్ముంటే ఏనుగుల గెందేవోళ్లురా" Please explain...
Dr.Pen చెప్పారు…
అది అక్షరాల రంగు తంటా కాదు...పల్లెల్లో సర్వసాధారణంగా ఉపయోగించే భాషను (explicit)రాముడు కాస్త తిరగేసాడంతే! హన్నన్నా రామన్నా;)
చదువరి చెప్పారు…
రానారె, పదాలను దపాలుగా మార్చిన మీ చతురత బావుంది. కొత్తపాళీ గారూ, లంకెబిందెలను తడుముకునేలా కావాలనే పెట్టినట్టున్నాడీయన!
రానారె చెప్పారు…
కొత్తపాళిగారు, ఈ టపాలోని ఏ అంశంమీద మొదటి వ్యాఖ్య వస్తుందోనని నా పరిస్థితి రోట్లో తల పెట్టి రోకటిపోటుకు వెరచినట్లుగా అయింది. ఎందుకంటే, సాధారణంగా మొదటి వ్యాఖ్య ప్రభావం ఎంత లేదన్నా తర్వాతి వ్యాఖ్యాతలపై ఉండితీరుతుందని నా అనుభవం. మీకు కృతజ్ఞతలు.

విశ్వనాథ, నేనుసైతం, ప్రవీణ్‌, సాహిగార్లకు నెనర్లు. ఔనండి. 11.45కే. :) త్వరలో ఒక కథను వినిపించే ప్రయత్నం చేస్తాను. కథలను వినిపించడం వాటిని రాసినంత సులువు కాదని తెలుస్తోంది. :)

చేతనగారు, థాంక్యూ. శ్రీనివాస కాన్వెంటులో తప్ప ఇన్ని మార్కులు నాకెవ్వరూ ఇవ్వలేదు. పెద్దవాళ్లుగానీ, చిన్నావాళ్లుగానీ బతికున్నంతకాలం మీ మామ్మగారిలాగా వారు చేయగలిగినంత పని చేస్తూ ఉంటేనే గౌరవింపబడతారనుకుంటాను.

శ్రీరామ్, మీకూ అన్నే నెనర్లు. మీ వ్యాఖ్య చదవగానే, ఈ టపాతో మంచి పఠనానుభవం కలిగించానన్న విజయానందంతో "యస్"అని గాలిలో ఒక పంచ్ ఇచ్చాను. పునర్నెనర్లు [Thanks again :)]

విహారి, స్మైల్‌భాయ్, తెలుగాభిమాని, నేనుసైతంగార్లకు కృతజ్ఞతాశతములు. ఇప్పుడు వీటిని అచ్చువేశామంటే ఆ పుస్తకం కవరుపేజీలు బాగా మందంగా ఉండాలేమో. :) లేకపోతే అది కరపత్రంలాగా కనిపించవచ్చు.

లంకిరెడ్డిగారు, మీరిలా నలుగురిలో నిలదీస్తారనుకోలేదు. సమయానికి స్మైల్‌భాయ్, చదువరిగార్లు నన్ను ఆదుకోకపోతే నా పరిస్థితేంగావాలి? :-))

చదువరిగారు, లంకెబిందెల విషయంలో మీరూ ఈ ప్రశ్ననే అడిగారు ఒకసారి. నేను ఆ టపాలోనే సమాధానం చెప్పాను. కొత్తపాళిగారికి వేగుద్వారా చెప్పాను.
అజ్ఞాత చెప్పారు…
రానారె గారూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మా ప్రాంతంలో ఇది నేనెప్పుడూ వినలేదు, అందుకని. ఇప్పుడు అర్థమయ్యింది. ;)
LoongTerm చెప్పారు…
Annaaa,

Supurb, Scene gurthu ledu kaanee, Concept suparu. Chaaala baagaa raasinaavu. taatanu gurthu chesinaavu. Naalugu nee photolu pampinchu, choosi aanandistaaa....!!!
బ్లాగేశ్వరుడు చెప్పారు…
తాటకి కి కర్ణుడిని తనయుడిగా ఇక్కడ చేశాను
ఒకసారి వచ్చిచూడవలసినదిగా ప్రార్థన

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె