ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పెద్దోళ్ల కోడిపుంజులాట

నాలుగేండ్లకే ఒకట్లో జేరిపించడంతో, మూడోతరగతి వయసుకే నాకు నాలుగోతర్తి పూర్తైంది. శలవలొచ్చాండాయనే మాట యినపరాంగానే చెవుల్లో తేనెబోసినట్టయింది. యండాకాలం సెలవలు. యాభై రోజులు బడీగిడీ ల్యా. నాబోటి పిల్లకాయలందరికీ అలివిగాని సంబరం.

ఎందుకంటే, పొద్దుపొద్దన్నే బడిని గుర్తుజేసుకొని లెయ్యనక్కర్ల్యా. రోజూ నీళ్లు బోసుకోనక్కర్ల్యా. తలకు ఆముదం పెట్టుకోనక్కర్ల్యా. "మల్లేసు మాస్టరు కొడ్తాడు, నాకు బయం, నేనుబోను, నా కడుపుగూడా నొస్సాంది" అని రోజూ ఏడుపుమొగం బెట్టుకోని మా చిన్నోడు చేసే కార్యక్రమం ఉండదు. నిజంగానే కడుపు నొచ్చాన్యాగానీ తల నొచ్చాన్యాగానీ నీరసంగా ఉన్యాగానీ అట్నే ఏడ్సుకుంటా బడికిబోనక్కర్ల్యా. వగేల యారోజన్నా బడికిబోకపోతే ఎందుకుబోలేదో చెప్పేదానికి మర్సురోజు నాయన్నుంచీ చీటీ దీస్కపోనక్కర్ల్యా. మా అత్తమ్మకొడుకు కూడా బడికొచ్చాన్న్యాడు. నిజ్జంజెప్పాలంటే ఆయనతోబాటు మేం బడికిబోతాన్న్యాం. ఎందుకంటే మా అందర్లోకీ గట్టోడు, గలాటాలొస్తే తట్టుకోని నిలబడేవోడు గాబట్టీ. నాకన్నా రెండున్నర నెలలు పెద్దోడు అంతే. చిన్నప్పట్నుంచీ ఆయన్ను మామా అనడం అలవాటుజేసినారు మావోళ్ళు. మామ ఇప్పుటికీ మామే. ఇంగ రోంచేపటికీ మామే!

మా ముగ్గరికీ బడి టయానికి అన్నం తయారుగాక, ఊదుబుర్రతో పొయ్యికాడ పొగతో అగసాట్లు బడే కర్మ ఈ శలవ దినాల్లో అమ్మగ్గూడా తప్పుతాది. పస్టుబెల్లు కొట్టేలోగా టిఫినుడబ్బాల్లో కనీసం పెరుగన్నమూ ఊరగాయన్నా సర్దకపోతే సెంకడుబెల్లుకల్లా బడికి పోలేము. ప్రెయరుకు లేటుగాబోతే మమ్మల్ని కొట్టి ఎండలో నిలబెడ్తారని తెల్సుగాబట్టి మాకన్నా అమ్మకే బయమెక్కువ. పొయ్యిలో కట్టెపేళ్లు మండనిదానికి యెవురేంజేచ్చారు. కానీ, అమ్మ పడే ఆదుర్దా నా తలకూ పాకుతాది.

ఉతికేదానికి సాకలోడు తీస్కబొయిన స్కూల్ డ్రస్సు రాకపోతే అది ఇంగో పెద్ద అవస్థ. స్కూల్‌డ్రస్సు యేసుకోకపోతే పైన్లు, దెబ్బలు, ఎండలో నిలబెట్టడాలు. ...

ఈ బాధలన్నీ వొగ యాభైరోజులపాటు ఉండవ్.

మల్లా బడి తెరిసేలోగా రోజంతా ఆట్లాడుకోవాలనుకున్న్యాం. ఐతే మమ్మల్నేం ఊరికినే ఒదిలిపెట్టింటేగదా! ఇన్నాళ్లూ నేర్సుకునింది ఈ శలవల్లో మరిసిపోకండానూ పైతరగతిలో వొచ్చే సదువు ముందుగానే నేర్చుకుండేదానికనిన్నీ ఇంట్లోనే రోజూ ఏదోటి సదుకోవాలని మా నాయన తీరుమాణం. తీరుమాణం నిక్కచ్చిగా జరగాల్సిందే. జరిపించే బాధ్యత అమ్మది.

సింతసెట్టు కింద జిల్లాకోడో గోలీలాటో పుట్టాచెండో జోరుగా ఆడుకుంటా ఉంటాం. మాంచి పట్టులో ఉండంగా మా సింతసెట్టు మొదిట్లో నుంచీ, "ఆండింది సాలు, రోంత యల్తరుండఁగానే వచ్చి పుస్తకాలు బట్టుకోండి, మొబ్బైతే బుడ్డీలకాడ చీటీగల్తో మీరు సదివేదిల్యా, సదివినా ఒంటబట్టేదిల్యా. వూరికే కిరసనాయిలు దండగ". ఆటొదిలేసి సదవను బోవాలంటే నా పానం చేత్తో పట్టి యిగ్గబీకినట్టుంటాది. అప్పుడు పాలిపొయిన నా మొగాన్నిజూసి, అక్కడుండే మిగతా పిల్లకాయల్నుగూడా వాళ్లవాళ్ల ఇండ్లకుబొమ్మని అప్పుడప్పుడూ కసురుకుంటాది మాయవ్వ గూడా. "నేనొగణ్ణేగాదు, ఎవురూ ఆడుకోల్యా. నేను పోగొట్టుకునిందేం లేదుగాబట్టి సదువుకోవొచ్చు" - అని నేననుకోవాలని.

సెలవల్లో మా ఇంట్లో పిల్లగుంపు రోంత పెద్దదైతాది. ఆడుకునేదానికి బాగుంటాది. యెండాకాలంలో మా సుట్టాల్లో అయినోళ్లంతా ఒక చోట కలవడం మామూలే. అది ఎక్కువగా మా ఇల్లే. కొన్ని శలవలు అయిపోయినాయ్.

ఒకరోజు మా మామోళ్ల అమ్మ వొచ్చింది. ఆమొచ్చిందంటే ఆ కతే మారిపోతాది. ఇంట్లో అమ్మ, అత్తమ్మ, అవ్వల మాటలు, నవ్వులు, మా పిల్లగుంపు ఆటలు అల్లర్లు... యీఁటన్నిటితో ఒగటే సంబరంగా ఉంది మా కత. శలవల్లో ఎంత సంబరమో శలవ లైపోతాండా యనఁగా అంతకు రెండింతలు దిగులు. వొగోరే సుట్టాలంతా ఎల్లిపోతారు. మా పిల్లగుంపులో ఆఖరికి ఇంట్లో మిగిలేది మేమే. ఒక్కొక్కరే బస్సెక్కి పోతాంటే సిన్న బాధగాదు. కానీ ఇదంతా జరిగేదానికి ఇంగా కొన్నిదినాలుంది.

వొగ రోజు వొగటే గాలి, వాన. సాయంత్రం మొదులైంది. రాత్రిగూడా తెరిపి ల్యాకండా పడతానే ఉంది. వానకు తోడు వో...మని ఈదురుగాలి. కిరసనాయిలు బుడ్డీలు తట్టుకోని నిలబడేరకంగా లేదు. మాది పాత రాతిమిద్దె. తేళ్లు, మండ్రగబ్బలు, జెర్లు జాస్తి. ఆ వానకు తేళ్ళూ, పాములూ, జెర్లు, మండ్రగబ్బలు బైటికొచ్చి తిరుగుతాంటాయ్. టార్చిలైటు ల్యాకండా వసారాల్లో కాళ్లకు మెట్లు లేకండా తిరిగినామంటే ఆరోజు కర్మ బలంగా ఉన్నిట్టే. మొబ్బైనాంక, మా పిల్లకాయలందరికీ నులక మంచాలేసి, మేము అడుగు కిందబెట్టకండా మా యవ్వను కాపలాబెట్టి, అన్నాలూ కూరలూ నీళ్లూ మంచాలమీదికే తెచ్చిపెట్టే పని మా అమ్మది అత్తమ్మది. తినేపని మాది.

మేమందరం అన్నాలు తినడం ఐపొయినాఁక గూడా గాలియీదర వానవాదర రెండూ తగ్గల్యా. గాలి దిశమారినప్పుడల్లా తుంపర్లు యిసురుగా వసారా లోపలికొచ్చి మామింద పడతాండాయ్. సలికి తట్టుకోల్యాక, పిల్లకాయలమందరం వొగ మంచం మింద ముడుక్కున్యాం. ఉండుండి పెఠిల్లున ఉరిము యినబణ్ణప్పుడల్లా ఉలిక్కిపడడం, మల్లా మాకేం భయంలేదన్నిట్టుగా మేకపోతుగాంభీర్యం. ఆ మేకపోతులను కనిపెట్టి బయట బెట్టేదానికి యేదో యగతాళి మాటలు. ఆ మాటలకు రోసాలు. అంతలోనే నవ్వులు...

"ఆ తుంపర్లలో ఏందిరా ఆ కోతిమాటలు? అందురూ లోపలికి రాండి" ఇంట్లో నుంచి పిలుపు. ఆ పిలుపు మా సంబరానికి గొడ్డలిపెట్టు. అందరం సద్దుజెయ్యకుండా గమ్మునైపోయినాం. "మీ నాయన పిలుచ్చాంటే యినబళ్లేదంట్రా?" మాయమ్మ అదిలింపు. మా కుశాలమాటలు వొదిలేసి పొయ్యేదానికి మనసొప్పకపొయినా పోవాల్సిందే.

లోపల అమ్మ, నాయన, అత్తమ్మ మాకోమే అన్నిట్టుగా కుచ్చోని సూచ్చాండారు. అమ్మానాయనా చెరో మంచంమింద, అత్తమ్మ కుర్చీలో. వాతావరణం బయటెంత సలిగా హాయిగా ఉందో లోపల అంత వేడిగా ఇబ్బందిగా ఉంది. "యెట్టెట్టుండాయి నాయినా మీ సదువులు?" మమ్మల్ని అడిగినిట్టుగా అనింది అత్తమ్మ. ఆ మాటకు మేమేంజవాబు జెప్పాల? మేంజెప్పలేం గాబట్టి మా అమ్మానాయనా జెప్పాల. "సెప్పడమ్యాల? సూపిచ్చే పోల్యా!?" అనుకున్నిట్టుండారు, ముందుగా "అల్పుడెపుడుబల్కు చెప్పరా" అన్న్యాడు మా నాయన. నేను చెప్పేసినా. "నువ్వు జెప్పరా, మేడిపండుజూడ ..." అంటానే మా మామ సంకల్లోకి చేతులు గట్టుకోని బిర్రుగా లేసినిలబడి, నా కంటే పెద్దగొంతుతో గడగడా ఒప్పజెప్పేశ.

మాయమ్మ, అత్తమ్మ -- ఇద్దురూ తృప్తిగా సూచ్చాండారు మా ప్రయోజకత్వం.

ఇష్టం ల్యాకండా పందేనికి దిగిన కోళ్లమాదిరిగా ఉంది మామ కత నా కత. మా బాధలు మాయ్యి. మా భయాలు మాయ్యి. ఇది పద్యాలతో ముగిసేదిగాదని మాకుదెలుసు. అంతలో మా నాయనగొంతు, "తొమ్మిదెనుముదులెంత?". నాకు మొగం యర్రగైపొయింది. ఎక్కాలు తప్ప యింగేదైనా నాకంత బయంల్యా. తొమ్మిదెనుముదులెంతో నాకు దెల్దు. నన్నిడిగింటేగనక నేను యెగమల్లాల్సిందే. చమటలు పట్టేసినాయ్. తల తిరుగుతాన్నిట్టుంది. మామ బిస్సగా లేసి నిలబడి సంకల్లోకి చేతులుగట్టుకోని "డెబ్బైరెండు" అనె.

"వెరీగుడ్‌. పద్మూడైదుల?"

అడిగింది మామనే. మామకు ఎక్కాలు బాగా గుర్తుంటాయ్. నాగ్గూడా పద్మూడైదుల అరవైయ్యైదు గుర్తుండాది. ఇది నన్నడిగింటే బాగుండు. ఇదిగాక ఇంగేమన్నా నన్నడిగితే నేను బెబ్బే. ముక్కుచెంపలు తినాల్సిందే. మామూలుగా ఐతే తినొచ్చు. ఇంటికి సుట్టాలొచ్చినప్పుడు వాళ్లముందర దెబ్బలు తినడమంటే యంత బైసినం! నాయన కొడ్తే సరే, మామతోనే ముక్కుచెంపలు[లెంపలు] కొట్టిస్తే!!? అంతకంటే బైసినం యింగోటుంటాదా? ఐనా, రెండొకట్ల రెండు, రెండురెండ్ల నాలుగు, రెండుమాళ్లారు ... బాగుంది. పదో ఎక్కం, ఇరవయ్యో ఎక్కం కూడా పాటమాదిరిగా వొగ పద్దతిలో ఉంటాయ్. అయ్యైతే గాఠ్ఠిగా చెప్పెయ్యొచ్చు. ఈ మిగతా ఎక్కాలే, వాఁటెక్కా... వొగ పద్దతీపాడూ ఏముండదు. ఇట్టా హలాల్ అయ్యేటప్పుడు కోడిబొమ్మెకొచ్చే ఆలోచన్లు శాచ్చాండఁగా, మామ "అరవై" అనె. "థూ నాకు ఇదిగూడా సరిగా గుర్తులేదు" అని తిట్టుకున్న్యా. పద్మూడైదులరవై అని రెండుసార్లు మనసులోనే గట్టిగా అనుకున్న్యా.

"నువ్వుజెప్పరా"

అడిగింది నన్నేనని తెల్సు. కానీ ఎందుకడుతాండాడో తెల్దు. మామజెప్పింది తప్పుగాబట్టీ అడుగుతాండాడా ల్యాపోతే నాకు తెలుసునోలేదో కనుక్కుందామన్యా? అరబయ్యా అరవైయ్యైదేనా? అరబైయ్యైదా అరవయ్యేనా? ఇప్పుడు నా పరిస్థితి అలాలయ్యే కోడికన్నా అద్దుమాన్నంగా తయారైంది. సరే యేదైతే అదైంది అలాలయ్యేకోడికి ఆదివారమైతేయేంది, శనివారమైతేయేంది అనుకొని, "అరవైయ్యైదు" అనేసినా. సరిగ్గాజెప్పు అని రెట్టిస్తాడేమో అనుకున్న్యా. ఊహు!

"వానికి ముక్కుచెంపలెయ్"

అలాలయ్యేకోడికి అసాన్‌సాయిబు చెయ్యికొరికే అవకాశం. యేదో నా రాత బాగుండి ఈ అవకాశమొచ్చింది. ఇది తప్పితే ఎక్కాల్లో ముక్కుచెంపలన్నీ నేనే తినాల. అత్తమ్మ ముందర బైసినం బైసినమే, అదెట్టా తప్పదు. అందువలన(చేత) నేను కొట్టగలిగినంత గఠ్ఠిగా కొట్టాల. ఆ తరువాత మామ ఎన్నికొట్టినా చెల్లుకుచెల్లు ఐపోవాల. అట్టా అనుకొని రెండు చేతులూ సాఁచి ఫాఠ్ మని మామ చెంపలు పగలగొట్టేసినా. అత్తమ్మ హతాశురాలైపోయింది. మాయమ్మగూడా అంతే. అంత దెబ్బతినిగూడా మామ బిర్రబిగుసుకొనే ఉండాడు. చేతులు సంకలోనే ఉండాయి. ముందుగా మాయమ్మ తేరుకుని, "యేమిరా నాకొడకా, అంతేటుగొడితివేమిరా" అనింది. నేను మా నాయనకల్లా జూసినా - నువ్వు కొట్టమంటేనేగదా - అని నా సూపుకు అర్థం. మా నాయనగూడా అంతే. మొగంలో నెత్తరసుక్కలేదు. దుక్కం పొంగుతాండగా ఆపుకొంటా అత్తమ్మ, "యేమినాయినా, ఇంత కసి బెట్టుకున్నావుగదరా, వా డేమి జేసినాడ్రా?". ఈ మాట అడిగడానికే ఆగినట్టుగా ఆమె దుఃఖం పొంగుకొచ్చేసింది. ఆమెకు తోడుగా మాయమ్మా అవ్వకూడా కన్నీళ్లుపెట్టినారు.

అప్పటికి గాలివాన రోంత తెరపిచ్చింది. ఆ ప్రశ్నకు, ఆమె దుఃఖానికీ సమాధానాలతోపాటుగా ఓదార్పులు, చరిత్రలు, అనునయాలు, భరోసాలు, సంబంధబాంధవ్యాల పునురద్ధరణ వంటి కార్యక్రమాలన్నీ మా అమ్మ చేపట్టాల్సివచ్చిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ ప్రయత్నంలో భాగంగా నామీద తిట్ల తుంపరలు కూడా బాగానే కురిసినాయనీ వేరే చెప్పనక్కర్లేదు!

వాళ్లంతా మాట్లాడుకుంటాండంగానే మామకూ నాకూ నిద్దరబట్టేసింది.

కామెంట్‌లు

Sudhakar చెప్పారు…
పదో ఎక్కం, ఇరవయ్యో ఎక్కం కూడా పాటమాదిరిగా వొగ పద్దతిలో ఉంటాయ్. అయ్యైతే గాఠ్ఠిగా చెప్పెయ్యొచ్చు. ఈ మిగతా ఎక్కాలే, వాఁటెక్కా... వొగ పద్దతీపాడూ ఏముండదు.

Super...చాలా బాగా చెప్పారు.
కొత్త పాళీ చెప్పారు…
beautiful and touching.
క్రాంతి చెప్పారు…
టపా చాలా బాగుంది.నాకు కుడా ఎక్కాలంటే మహా చిరాకు. కాని నాకు రెండు పదాలు అస్సలు అర్ధం కాల్యా."మెబ్బతే","బైసినం" అంటే ఏంటో చెప్పండి.
చదువరి చెప్పారు…
ఎక్కాల ఇబ్బందులు బాగున్నాయి. అవునూ, ఇదివరకు లంకెబిందెలు చూడగానే కనబడేవి.. ఇప్పుడేంటి, వెతుక్కుంటే గానీ చేతికందడం లేదు? లంకెబిందెలవటానా?
త్రివిక్రమ్ Trivikram చెప్పారు…
పిల్లోల్లను పందెంకోల్లనుజేసి సదువులోనో, మాటకారితనంలోనో, పనితనంలోనో ఒకరిమిందొకర్ని పోటీకిడిసేదీ పెద్దోల్లే. పోటీలో ఉన్నెప్పుడు ఆ పిల్లోల్ల గుండెల్లో బితుకును తెలుసుకోకుండా దానికి కసి అనో, ఇంకొకటో తమకు మాత్రమే అర్తమయ్యే పేరు బెట్టి ఆగంజేసేదీ పెద్దోల్లే. ఈ టపాకు పెట్టిన పేరే హైలైటు.

క్రాంతి గారూ!
అది "మెబ్బతే" కాదు "మొబ్బైతే" = మొబ్బు(=మబ్బు/చీకటి)+ఐతే = చీకటి పడితే
బైసినం = అవమానం/చిన్నతనం
క్రాంతి చెప్పారు…
హన్నన్నా!! "మెబ్బతే","బైసినం" అంటే ఇంత మతలబు ఉందా!
spandana చెప్పారు…
అబ్బా ఈ ఎక్కాల భయాన్ని తల్చుకుంటే నాకిప్పటికీ పదురే!
స్కూలుకు పోవాలంటే నాకు మహా వుషారు, సెలవులంటేనే బెరకు. సెలవు రోజంటే పొలం పని చేయాల్సొస్తుందని, ఏ ఎద్దులు మేపడానికో, ఎనుముల మేపడానికో పోవాల్సి వస్తుందని భయం. స్కూల్లో అయితే క్లాసుకు మనమే రాజా గనుక ఆ హోదా అదీ ఇంటి దగ్గర ఎలా వస్తాయి?

అయితే ఎక్కాలంటే మాత్రం నాకూ దడే! నాకిప్పటికీ పన్నెండైదుల తర్వాత రావు. అయితే పలకలో రాయడం మాత్రం 20 ఎక్కం వరకూ రాసే వాన్ని. ఎలా అంటే కూడికలతో! కానీ ఎలెమెంటరీ స్కూల్లో సాయంత్రం బడి విడిచే ముందు అందరినీ గోడ చుట్టూ నిలబెట్టి ఒక్కొక్కరితో ఓ ఎక్కం పలికించే అలవాటు వుండేది. పిల్లకాయల్లో తెలివిమంతుడిగా నాకున్న పలుకుబడి వల్ల పదో స్థానంలోనో, 11 స్థానంలోనో ఇరుక్కునేవాన్ని అవయితే సులభంగా చెప్పేయొచ్చు గదా! అయితే ఒక్కోసారి శతావధానం మల్లే randomగా అడిగేవారు. అప్పుడుంటుంది తమాషా! మీరు మీ మామ పడ్డదే!

--ప్రసాద్
http://blog.charasala.com
teresa చెప్పారు…
aadyaMtamoo oopiri bigabaTTi chadiviMche saili, kaLLakkaTTinaTlu varNana.. chaalaa 'real'gaa, touching gaa uMdamDee!
విహారి(KBL) చెప్పారు…
మీ రచనలొ పల్లెటూరి సువాసనలు గుభాలించాయి.బాగా నవ్వించారు.
Naga Pochiraju చెప్పారు…
మనలో లేని ఇజాలను పెద్దవాళ్ళు పేరు తో మనలో నాటుతారు
మీ బ్లాగు చదువుతున్నంత సేపూ నా ఎక్కాల కష్టాలు గుర్తుకొచాయి..మా రాయలసీమ కమ్మదనం మీ బ్లాగులో నిండుగా ఉంచుతున్నందుకు అభినందనలు
రానారె చెప్పారు…
సుధాకర్, కొత్తపాళి, ప్రసాద్, తెరెస, విహారి(kbl), పోచిరాజు, చదువరి, త్రివిక్రమ్‌, క్రాంతిగార్లకు - పెక్కు థాంకులు. ఎక్కాలు గుర్తుపెట్టుకోవడం మంచిదేగానీ, కొట్టి నేర్పించనవసం లేదుకదా! క్రాంతిగారికి సమాధానం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు మళ్లీ థాంక్సు. క్రాంతిగారు మళ్లీ "మెబ్బతే" అనే రాశారు :-)
రానారె చెప్పారు…
చదువరిగారు, ఔనండి, లంకెబిందెలవటానే.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె