Monday, May 07, 2007

పిల్లలూ దేవుడూ - బడితెపూజ

బోర్డుమింద ఆరు పేర్లుండాయి. కొన్ని పేర్లపక్కన ఇంటూలు గూడా వుండాయి. మాస్టర్ లేనప్పుడు మాట్లాణ్ణ్యామంజెప్పి, ఆ పేర్లేసింది క్లాసులీడరు రాశ్శేకర్. ఎందుకు మాట్టాణ్ణావు అనేది అనసరం. గొనిగినావా, గునిసినావా, గుసగుసలాణ్ణాఁవా, సైగజేసినావా అనేదిగూడా అనవసరం. మాట్టాణ్ణావా లేదా!? అంతవరకే. అస్సలు ములాజా లేదు. వొగసారి బోర్డుమింద పేరుబణ్ణాక, మల్లా మాట్టాడితే వొగ ఇంటూ. మల్లామాట్టాడితే యింగో ఇంటూ. పేరుపక్కన ఎన్ని ఇంటూలు బడితే వాని కర్మ ఆరోజు అంత బలంగా వున్నిట్టు. కర్మకన్నా బలవంతుడు మణ్యం. మణ్యం పేరుపక్కన ఇంటూలు బోర్డును దాటి గోడమీదిగ్గూడా బొయినయ్. వాని పేరు కిందనే నా పేరూ ఉండాది. ఇంటూల్లేవు.

క్లాసురూము బయట మల్లికార్జునమాస్టర్ గొంతు యినబడింది. ఇంగో మాస్టర్‌తో కుశాలగా నవ్వుతా ఏందో మాట్టాడతాండాడు. ఆ గొంతు వెలుగు దగ్గరగా రాగానే, పిల్లకాయలంతా పుస్తకాల్లో తలలు దూర్చి ఒకటే దీక్షతో తపస్సుజేస్తున్నిట్టుగా సదవడం మొదులుబెట్న్యారు. బయట ఎంత నవ్వినా లోపలికి రాఁగానే ఆయన "మాస్టర్" అయిపోతాడని మాకుదెల్సు.

మాస్టర్ అడుగుల సప్పుడు దగ్గరైంది. దూరంగా తోడేలు అలికిడి యినపడఁగానే మేత ఆపి, చెవులు రిక్కించి, బొబ్బరిచ్చుకొని, కనుగుడ్లు పెద్దవిజేసి, మోరలు పైకెత్తి ఆపక్కకు చూసే గొడ్లమంద మాదిరిగా, పిల్లకాయలంతా సదవడం ఆపేసి, పుస్తకాల్లోనుంచి తలలు పైకెత్తిరి.
వచ్చినపాటికే ఆయన కండ్లు బోర్డుమింద బణ్ణ్యాయి. మా అదృష్టం బాగుంటే ఒక్కోపారి డస్టర్ తీసుకొని బోర్డు తుడిపేసి నేరుగా పాఠం మొదులుబెట్టేస్తాడు. ఆ పొద్దు అదృష్టం బాలేదు.

రాశ్శేకర్ బోర్డుకాడ నిలబడి పేర్లు సదూతాండాడు. పేరు యినబడగానే ఆ పేరుగల్లోడు లేసి నిలబడాల. యినబడనట్టుగా గమ్మునుంటే వొగోసారి తప్పించుకోవచ్చు. అట్ల అదృష్టాన్ని పరిక్షించుకున్నవాళ్లలో మణ్యం కూడా ఒకడు. అందువలన(చేత) వాని పేరు రెండోసారి చదవబడింది.

వొక్కోరికీ బడితెపూజ ప్రారంభం. అరచేతుల మింద యర్రగా ఈతబర్రతో సర్‌ర్ మని వాతలు తేలడం మొదలైంది. మణ్యం వంతు వచ్చింది. బోర్డు మీద మణ్యం పేరు పక్క ఇంటూలవరస బోర్డు చివరినుండీ గోడమిందికి కూడా పాకి ఉండటం మాస్టర్ కళ్లబడింది. బర్రను పక్కనబెట్టి, పళ్లు బిగించి, కిందికి చెయ్యిజాపినాడు. మాస్టారి చేతి వేళ్లను తన పొత్తికడుపు కిందనుండి పక్కకులాగేసే విఫలయత్నంలో మణ్యం.

వేళ్లు బిగిసినప్పుడే కాదు, వదిలినప్పుడుకూడా కాళ్లమునివేళ్లపై లేస్తూ "కూస్ కూస్" మంటున్నాడు. ఫోర్త్ డిగ్రీ చిత్రహింసను పంటిబిగువున వీలైనంత నిశబ్దంగా భరిస్తున్న దేశభక్తుడైన యుద్ధఖైదీ మాదిరిగా. ఆ దీక్షకు మనసు ప్రసన్నమై, మాస్టర్ నోటెమ్మట "నెక్స్ట్" అనే మాట వచ్చేదాఁకా అట్టా మెలికలు తిరగడం మణ్యానికి బాగాతెలుసు.

తరువాత నేనే. "రారా!" విసుగ్గా అన్న్యాడు మాస్టర్. పోయి చెయ్యిజాపి నిలబణ్ణ్యా. ఆ రెండు క్షణాలు ఈ శరీరం మనదికాదు - అనుకొని ఈతబర్ర సురుకు భరించేదానికి మానసికంగా సిద్ధమయ్యే గిజగిజలో ఉండగానే, సర్‌ర్రుమనే శబ్దంతో అరిచెయ్యి కమిలిపోయింది. కనుగుడ్ల నిండా నీళ్లు. స్... అని చెయ్యి విదిలించి, ఆలస్యం జెయ్యకండా ఇంగో దెబ్బ తినేదానికి మల్లాజాపినా. మాస్టర్ నన్ను పొమ్మంటాడో ఇంకో పీకు పీకుతాడో తెలీదుగనక, పొమ్మనేదాకా చెయ్యిజాపి దెబ్బలు తినడం మంచి విద్యార్థి లక్షణం. ఇంగోసారి బర్ర పైకెత్తినాడు. నేను కండ్లు మూసుకున్న్యా. దెబ్బ పళ్లా. "పోరా, నీకు ఒక దెబ్బతక్కువ, రెండెక్కువ, సావోడా" అన్న్యాడు. అవమానాన్ని దిగమింగి, "మనం తొందరగా పెద్దోళ్లమైపోతే బాగుండు ..." అనుకొన్న్యా.

పిల్లబ్బుడు జ్వరమొచ్చినప్పుడు ఆస్పత్రికిబోతే అక్కడ నర్సమ్మ మనకు సూదేచ్చుంది కదా. వొగో నర్సమ్మ సూదేచ్చే అస్సలు యేసినిట్టే ఉండదు, వొగామె అయితే గిచ్చినట్టుగా, ఇంగో నర్సమ్మైతే గుచ్చినట్టుగా, కొందరు నర్సమ్మలైతే పొడిసినట్టుగానూ ఉంటాది. ఆ సూదిలో ఉండే మందును బట్టి గుడకా నొప్పి ఉంటాదని మనకు తెలుసు. ఒగోసారి రగతమొచ్చాది, వాపు గూడా వస్సాది. మనకు జరమొచ్చినపుడు ఏ రకం నర్సమ్మ ఏ మందేచ్చుందో మనకు తెలీదుగదా. అప్పుడు గఠ్ఠిగా కండ్లు మూసుకొని బలంగా ఊపిరిబీల్చి, "మోహమెందుకీ దేహంపై, ఇది గాలి తిత్తిరా జీవా, ఉత్త తోలుతిత్తిరా జీవా" అనుకొని మన జబ్బ జూపిస్తాం. దానిమీదున్న కండను జూసి భయపడి, "ఇక్కడేస్తే యమకకు సూది తగుల్తాది, నడుము తీ" అంటుంది నర్సమ్మ. అంటూనే కర్తవ్యం నిర్వహించేస్తుంది. అవమానాన్ని దిగమింగి, "మనం తొందరగా పెద్దోళ్లమైపోతే బాగుండు ..." అనుకొంటాం, అది వేరే సంగతి.

పాఠం మొదులుబెట్టబొయ్యి, నన్ను జూసి - "స్కూల్ డ్రెస్సు ఏస్కోలేదేంరా యీడు" అన్న్యాడు. "పుట్టినరోజు మాస్టర్" అన్న్యారు మిగతా పిల్లకాయలు. "ఓర్నీ, ఆ సంగతి అప్పుడే జెప్పింటే వాతలు తప్పేటియ్యిగదరా" అన్న్యాడు. అంతవరకూ కుక్కుకొని ఉన్న కండ్లనీళ్లు జలజలా రాలిపడగా, బ్యార్ మని ఏడ్చేసినా. మాస్టర్ నా దెగ్గిరికొచ్చి, నా పుస్తకాల సంచిలోనుంచీ రెండు చాక్లెట్లుదీసి నా నోట్లోగొట్టి, "మెనీ హ్యాపీ రిటర్న్‌స్ అఫ్ ది డే" అన్న్యాడు. హ్యాపీ అంట. హ్యాపీ రిటర్న్స్. ఒకటీ రెండూగాదు, మెనీ.

చిన్న పిల్లోళ్లకు జ్వరం తగ్గించడం కోసరం సూదులేయడం మంచిదే. క్లాసులో మాట్లాణ్ణందుకు ...

16 comments:

రాజు సైకం said...

చాలా బాగుందండి.... స్కూల్ రోజులు గుర్తుకొచ్చాయి..

రాకేశ్వర రావు said...

రాత్రి కలల్లోకి మాస్టారు బెత్తముచ్చుకొని ఇంకా వస్తున్నారు. మీ పోస్టు చదివి నాకు ఏడుపు, కోపం వస్తున్నాయి.

నాగరాజా said...

కదిలించింది టపా. ఇటువంటి కారణాల వల్ల నాకు స్కూలు జీవితం అంటే విరక్తి ఇంకా తగ్గలేదు.

-నేనుసైతం said...

రానారె, మీరు ఈత బెత్తం దెబ్బలే తిన్నరేమో నెను అయితే వెదురు బెత్తం దెబ్బలు తిన్నా..మా ప్రైవేటు మాస్టారు తో. మా మంచి మాస్టారు.

కొత్త పాళీ said...

కొంత మంది నిర్వేదంగా .. "ఇది నా డ్యూటీ" అన్నట్టు బాదేవారు. కొంత మంది "ఇది నీ మంచికోసమేరా" అన్నట్టు ప్రేమగా బాదేవారు. మరి కొంతమంది (లక్కీగా చాలా కొద్దిమంది) వాళ్ళ అధ్వాన్నపు బతుక్కి కారణం నువ్వేనన్నంత కచ్చగా బాదేవారు. చింత, ఈత, వెదురు బెత్తాలు, గుండ్రటి రూళ్ళ కర్ర, స్కేలు బద్ద - ఇత్యాదులు ఆయుధాలు.

ఎనిమిదో క్లాసులో లెక్కలు చెప్పావారు రామారావు మేస్టారు. కొట్టకపోవటమే కాదు, కోపమొచ్చినా గొంతు పెంచి అరిచే వారుకూడా కాదు. ఆయనిచ్చే పనిష్మెమంటు యోగాసనాలు వేయించడం!

కొట్టనవసరం లేకుండా పిల్లల్ని ఆకట్టుకుని చదువు చెప్పగలగడం టీచరుకి అత్యవసరమైన కళ.

రానారె - ఇట్లా టపాలన్నీ గుండెనలిపేట్టుగా రాస్తా ఉంటే ఎట్టా చచ్చేదబ్బా!

ప్రసాద్ said...

భలే నవ్వుకున్నా. హమ్మయ్య ఇప్పుడేదో ప్రభుత్వం చట్టం తెచ్చిందట గదా పిల్లకాయలను కొట్టగూడదని.

--ప్రసాద్
http://blog.charasala.com

DSG said...

"అంతవరకూ కుక్కుకొని ఉన్న కండ్లనీళ్లు జలజలా రాలిపడగా, బ్యార్ మని ఏడ్చేసినా." -

వాడాల్సిన చోట వాడాల్సిన మాటలు వాడాల్సిన విధంగా వాడటం అంటే ఇదే..brilliant

ఇక్కడ కన్నీళ్ళొచ్చింది చేతికి పడ్డ దెబ్బల తాలూకు బాధ వల్ల కాదు.."ఏడవటానికి కారణం ఇది" అని ఒక్క మాటలో చెప్పేస్తే ఆ బాధ intensity ని సరిగ్గా వ్యక్తపరచలేము..అలాంటి విషయాన్ని ఇలా కదిలించేల వ్రాయటం గ్రేట్.

ఈ పోస్టుకు నూటికి నూట రెండు మార్కులు..

- గౌతం

Anonymous said...

నాకు నా పేరుకు వచ్చిన ఇంటూ అవార్డులు బాగా గుర్తుకొచ్చినాయ్.

"ఇంటూలు బోర్డును దాటి గోడమీదిగ్గూడా బొయినయ్"

దొంగ వెధవ కావలనే నాకు ఎక్కువ అవార్డులు ఇచ్చేవాడు

-- విహారి

చైతన్య said...

మీ బాధ చదివితే నా దెబ్బల భాగోతం గుర్తొచ్చింది. నేను చదివిన కార్పొరేట్ కాలేజీ లో ప్రతి నెలా మంత్లీ తెస్టుల రిజల్ట్స్ వచ్చాక మూడునాలుగువందల మంది విద్యార్ధులను సమావేశ పరచి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని పేరుపేరునా పిల్చి మా కరెస్పాండెంట్ అందరిముందు ఈత బెత్తాలతో బాదేసేవాడు.నా వంతు కోసం గుండెలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చునేదాన్ని.అందరిముందూ దెబ్బలు తింటానికి మహా అవమానం గా అనిపించేది.తెగ ఏడుపొచ్చేది.మళ్ళి తర్వాత నెల మామూలే :)

Harinath Mallepally said...

చాలా బాగుందండి మీ బ్లాగు పోస్టు. నాకు గుతొచ్చిన మాస్టరు మా పి ఇ టి సారు వెంకట్ రెడ్డి గారు. ఇనుప రాడ్డు తీసుకొని అరచెతి పూరి లాగా వాచెలాగా కొట్టెవాడు. ఉందయం ఐదు లోపల అయన వెసిన మూడు విస్సిలు విని లెచి బనీన్ నిక్కరు కన్వాస్ షూ వెసుకొని అసెంబ్లి పాయింట్ లొ రెడి గా లెకపొతె పెరు ఎక్కెది పపెర్ పైకి.

కిరణ్ said...

రానారె గారికి,
ఆంగ్లంలో ఒక సామెత ఉంది. Power corrupts, absolute power corrupts అbsolutely అని. ఈ మేష్టార్లకు పిల్లలపై పూర్తి అధికారం చలాయించే అవకాశం వల్ల పిల్లలు బలయి పోతూ ఉంటారు. మీరు చెప్పిన సంఘటన చూస్తే, అధికారం చలాయించే లక్షణానికి పిల్లలు కూడా అతీతులు కారు అనిపిస్తుంది.
monitor గా ఉన్న పిల్లవాడు కూడా మిగిలిని పిల్లలపై అధికార దుర్వినియోగానికి తెగిస్తాడు. తనకంటే మెరుగైన పిల్లలపై కచ్చతో వాళ్ళను అయ్యవారితో అకారణంగా కూడా
కొట్టిస్తాడు. మనిషి లోని పశు ప్రవృత్తి అవకాశం దొరికితే బయట పడటానికి వెనుకాడదు. కడప మాండలికంలో మీరు గొప్పగా రాశారు. బాగుంది.

కృష్ణ మోహన్ కందర్ప said...

చిన్నప్పటి పుట్టిన్రోజుని ఏం గుర్తు చేసినావబ్బా!
బాధైనా మధురస్మృతే సుమా!

చదువరి said...

మల్లికార్జునమాస్టరు మీద కోపం తెప్పించారు గదా ఈ పూట!!

రానారె said...

అందరికీ నమస్కారం - మాస్టరుమీద కోపం వచ్చినవాళ్లకు, రానివాళ్లకూ అందరికీ. టపాలన్నీ గుండెనలిపేట్టుగా రాస్తే బాగుండదని, ఈసారి పొడిపొడిగా రాశాను. నూటికి నూటరెండు మార్కులు వేసిన గౌతమ్‌గారు ఈమారు కాస్త నిరాశపడొచ్చు.

radhika said...

ఇది నేనెలా మిస్ అయ్యాను? ఈత బెత్తమో,వెదురుబెత్తమో,స్కేలో ఏదో ఒక దానొతో దెబ్బలు తినకుండా స్కూల్ పూర్తి చేసిన వాళ్ళు బహు అరుదుగా వుంటారేమో? పుట్టిన రోజయితే కొట్టరని హోంవర్క్ చెయ్యని ఒక రోజు పుట్టినరోజని అబద్దం చెపితే క్లాసులో ఒక అబ్బాయి ద్వారా నిజం తెలుసుకున్న మాస్తారు కొట్టిన దెబ్బలను ఇప్పటిదాకా మర్చిపోలేదు.అప్పట్లో అతనే నా మొదటి శత్రువు.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

బయట ఎంత నవ్వినా లోపలికి రాఁగానే ఆయన "మాస్టర్" అయిపోతాడని మాకుదెల్సు.
పై లైను మాత్రం ఇరగదీసిందండీ.అద్సరే గానండీ.దేవుడు నవ్వుకుని పక్కనబెట్టేసుంటాడు గానండీ చాల్సార్లు మా ఊరి సుబ్బారాయుడి గుళ్లో మా సారు సచ్చిపోవాలని మొక్కుకుని దణ్ణాలు పెట్టేస్కున్ననండీ.
---సంతోష్ సూరంపూడి

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.