Tuesday, January 02, 2007

ఎర్రికాలంలో పీర్లపండగ సంబరం

మొహర్రమ్ మొన్నటిది. కానీ పీర్లపండగ నా చిన్నప్పట్నుంచీ వుంది.ఏమన్నా మాట్లాడితే తాతల కాలంనుంచి, వాళ్ల తాతల కాలంనుంచీ కూడా వుంది. మా అవ్వ చెప్పేది - ఈ పండగ నిజానికి ఓ ఇద్దరు సమరవీరులగురించిన సంతాపం అని. వీరబల్లె చుట్టుపక్కల ఏ పల్లెలోజూసినా సంతాపం కాదుగదా దాని వాసనగూడా కనబడేదిగాదు.

"ఉసేను అనే వీరుడు ఇంగా కొంతమందీ, జనంకోసం రాజుకు ఎదురునిలబడి తలలుపోగొట్టుకొన్నారు. వాళ్ల తెగువ, ధైర్యం ఏపొద్దూగూడా మనమెవురమూ మరిసిపోకండా వుండేదానికే ఈ పండగ జేసుకొనేది. వొగో పీరు వొగో వీరునికి గుర్తు" ఇట్లా ఏదో చెప్పేది మాయవ్వ. నాకు మాత్రం ఉసేను చావకండా వుంటే బాగుండుననిపించేది. సరే ఎదురుదిరిగినారు, దొరికిపోయి ప్రాణాలుపోగొట్టుకొనేలోగా ఎంతమందిని చంపినారు అని అడిగితే మాయవ్వగ్గూడా తెలీదు. "వొగోరూ వొగ యిద్దర్నన్నా సంపింటారుగదువ్వా?" అంటే కూడా నాక్కావాల్సిన జవాబురాదు. సచ్చేలోపల ఒక్కణ్ణైనా సంపింటే బాగుండునని నా ఆశ. "సంపింటార్లేవ్వా" అనేసి తృప్తిపడేవాణ్ణి. "ఒక్కొక్కడూ ఒక్కణ్ణైనా తెగనరికి సంపిటార్లే" అని మరోసారి మనసులోనే గట్టిగా అనుకొని, తృప్తిపడి, మన పార్టీమనుషులు సచ్చినందుకు బాధపడ్తా అవ్వకాణ్ణించి లేసి యీదిలోకొస్తే...

వొగటే సంబరం. ఎవురికీ వుసేను గురించి తెలిసినట్టే లేదు. [నాగ్గూడా ఇప్పుడే తెలిసిందిలే]. ఊర్లో అందురూ చానా అడావిడిగా తిరుగుతాండారు పిల్లాజల్లా ముసిలీముతకా అని తేడా లేకండా. అందరి మొగాల్లో ఆనందం. మా యింట్లో గూడా. మాయవ్వ గూడా ఆనందంగా వుంది. ఉండరా మడే! పీర్లపండగంటే అందరిండ్లకూ సుట్టాలొస్సారు. అత్తగారిండ్లనుంచి కూతుళ్లొస్సారు. అల్లుళ్లొస్సారు, వాళ్ల బిడ్డలొస్సారు. అందరికీ కొత్తగుడ్డలొస్సాయి. చానామందికి మంచి తిండిగూడా. అందుకే నాగ్గూడా ఆనందంగా వుంది. అందర్నీ జూసి నేన్‌గూడా వుసేను మాట మర్సిపొయ్‌నా.

సాయంత్రం కావచ్చాంది. పల్లెకు తూరుప్పక్కనించీ పలకల సద్దు ఇనపడతాంది. జగ్గనక్ జగ్గనక్ జగ్గనక్... అంతకుముందురోజు మాదిరిగానే ఆదినంగూడా పీర్రాతికాణ్ణించీ పీర్లు మెరవణి (ఊరేగింపు) వస్సాండాయ్. మాయవ్వ, అమ్మ, అత్తమ్మలు, పిల్లకాయలమూ అందరం మా కాంపౌండు వాకిట్లో చేరిపొయినాము. వరండాలో మా నాయన, కొంచెం ముందు నిలబడి మా తాత, అందరం మెడలు సాంచి సూస్సాండాం. పీర్లు రామునిదేవళంకాడికి రాంగానే తరవాతొచ్చేది మాయింటికే. పలకల సద్దు పెరిగి గుండెకాయ అదుర్తాంది. దేవళంకాడ రోంచేపు నిలిపి, పలకలోళ్లు వొరిగెడ్డి కట్టలు మండిచ్చి పలకలుగాంచుకోని, అట్నే రోంత సారాయి గొంతులో బోసుకోని కడుపులు నిండినట్టుగా 'హా!!' అని ఒకర్నొకరు సూసుకోని
"పాండి పాండిబ్బే పొద్దంతా యీణ్ణేబాయనో" అని వొగర్నొగరు అదిలించుకుంటా పీర్లమెరవణి మాయింటిముందరికొచ్చేస్తాంది.

అంతకు ముందే అస్సాన్‌చేనుకవతల చెరువుకాలవ దాటి చేదబాయిలోనించీ సచ్చీబతికీ తెచ్చిన రెండు మంచినీళ్ల బిందెలు అరుగుమిందనించీ తీస్కోనొచ్చి వాకిలి మెటికలమీద పెట్టింది అమ్మ. సద్దిబడిన్నీళ్లు పెట్టగూడదు. [చేను మాదే, అస్సానుకు గుత్తకిచ్చినాం. వానలుబడితే చెనిక్కాయలు బానే పండేటివి ఆ చేన్లో.]

పీర్లు మాయింటి ముందు వరసగా నిలబడంగానే వాటిముందర గొంతుకూచ్చుని వరపడే బిడ్డలుగలగని ఆడోళ్ల మింద మాయవ్వ బిందెడు నీళ్లూ గుమ్మరించి పీర్లకు దండంబెట్టుకోగానే, సాయబుల పూజారి నెమలీకలతో అందరి తలలూ తాకించేవాడు శఠగోపంతో ఆశీర్వదించినట్టుగా. తరవాత నాకు, మిగిలిన పిల్లకాయలకు బండారుతో బొట్టుపెట్టి, తలా కొంత చక్కెరప్రసాదం నోళ్లలో పోసేవాడు. [బండారును పవిత్రపసుపు అని అనువదించవచ్చేమో - ఈ అనువాదంలో కొంత కిరస్తానీ వాసనవున్నా] తరవాత జగ్గనక్‌నక్‌ జగ్‌ జగ్గనక్‌నక్‌ అని ఐదేసుకుంటా పలకలు, పీర్లు, జనాలు అంతా వీరబల్లెతిక్కు పోతారు.

అంత సంబరమూ ఒక్కసారిగా సద్దుమడిగి ఉస్సూరుమంటా దిగులుగా నేను ఇంట్లోకిబోవాల్సిందే. ఎందుకంటే ఏమన్నా ఆడుకుండేదానికి ఊర్లో పిలకాయలెవురూ వుండరు. అంతా పీర్ల యనకంబటనే .

ఐనా, ఆయాలకే పొద్దుబాయ. మా మంటిమిద్దెలో తేళ్లకు భయపడి ఎక్కిన మంచాలు దిగేదానికే యీల్లేదు. దిగాలంటే పరుపు కిందుండే టార్చిలైటేసి, కాళ్లు కిందబెట్టకండానే అవాయ్ చెప్పులు సూసి, తొడుక్కోని దిగాల. తెల్లారంగానే మనం లేసేపాటికి యీరబల్లె, యీడిగపల్లె, తురకపల్లెల్లో ఆ రేతిరి గుండాలు యట్టెట్ట కాలినాయో, పీర్లు తెల్లారుజామున ఏట్లోకి ఎప్పుడుబోయనో ఇయ్యన్నీ చెప్తా ఇంట్లో సాకలోళ్లు గుడ్డలు మూటగడతా కనబడేవాళ్లు. వూర్లో వుండే సాయిబూలు ఇండ్లనుంచీ కీరు, అన్నము, చక్కెరచపాతీలు ప్రసాదాలుగా మా ఇంటికి తెచ్చిచ్చేవాళ్లు. ఇంటికొచ్చే ఆడోళ్లు, మొగోళ్లు, పిల్లోళ్లూ అందురూ కూడా పీర్లు ఏట్లోకి బొయ్యేటప్పుడు ఏమేం జరిగిందీ చెప్పేవాళ్లు - బాదల్లాసామి పీరుకు ఆవేశం వచ్చిందనీ, పగ్గాలేసి నలుగురు పట్టుకున్నా నలగర్నీ యీడ్చుకోని పోయిందనీ రకరకాలుగా.

ఇయ్యన్నీ నాకు ఒక పక్క కొంచెం భయం కలిగించేటియ్యి, కొంచెం అనుమానం కూడా కలిగించేటియ్యి. చూస్తేగానీ నమ్మబుద్ధిగాదు. ఆ వయసులో నమ్మకుండా వుండడానికీ భయమే. బిడ్డలు గలగాలని వరపడడం కూడా అంతే. అదేమంటే కొంతమందికి బిడ్డలుగలిగినారంట అనుకునేవోళ్లు. ఇప్పుడనిపిస్తుంది తిండి సరిగా లేక గర్భధారణకు సంసిధ్ధమయేసత్తా, బిడ్డల్ని మోసే సత్తా, కనే సత్తా లేని కరువుగాలంలో
ఈ మొక్కులుమొక్కి, వానలుబడగానే పనులకుబొయ్యి, సంపాదించి, రోంత తిండిబడేసరికి అన్నీ కుదురుకోనుంటాయని.

ఆ మాట పక్కనబెడితే, పీర్లు తెల్లవారుజామున యేట్లేకిబొయినాంక ఆరోజంతా వూర్లో జనాలు పసుపునీళ్లు, కుంకంనీళ్లు, బొగ్గు, సున్నము, మసి, మన్ను, బూడిద ఇట్టా ఏదిబడితే అది అందినోనికల్లా పూసే సంబరం మొదులుబెడ్తారు. భట్టుపల్లెలో ముఖ్యంగా మొగోళ్లందురూ ఈ సంబరంలో తడిసిపోవాల్సిందే. మనం పెద్దింటోళ్లం, మనజోలికి ఎవురొస్తార్లే మనకు రంగులుబడవు అని ఇంట్లోనుంచి బైటికిరాకుండా కూర్చుంటే, పెద్దోళ్లంతా వచ్చి నా కాళ్లూచేతులూ బట్టుకోని పైకిలేపి నేను వద్దొద్దని ఎంత మేకపోతుగాభీర్యం ప్రదర్శించినా యినకండా రంగులుబూస్తే, నేను ఏడుపెత్తుకొని నాకొచ్చిన బండతిట్లన్నీ తిడతాంటే నా పరిస్థితిజాసి నవ్వనోళ్లే లేరు. ఆ పరిస్థితి నాక్కళ్లగ్గట్టినట్టుగా ఇప్పు జ్ఞప్తికొస్తాంది.

ఈ సంబరానికే కాదు, పండగ మొదులుగాక ముందునుంచీగూడా వూర్లో అందురూ అన్ని పనులకూ ముందుండేవాళ్లు. "ఇది సాయిబూలపండగ" అని ఎవురికీ ఎరికే లేకండా అంతబాగా కలిసిపొయ్యి సుట్టాల బిల్నంపుకోని సంబరంగా వుండేది. కొన్నేండ్ల తరవాత "సాయిబూల పండగా? అంటే యేం మాగ్గాదా, మాకూ పండగే, మాకూ హక్కుంది" అనే మాట ఇనబడేది. యింగకొన్నేండ్లకు "ఈసారి పండగ యేమంత లేదురా, సప్పగా అయిపాయ" అనే మాటలు. యింగాకొన్నేండ్లకు "ఏందో, పండగంటే పండగ. యేదో జరిగిపాయ. యెవురికి పండగ!?" నిస్పృహలు. ఒకప్పుడు సంబరంగా ఊరిజనాన్నంతా కలిపే ఈ పండగ ఇప్పుడు ఎవురిండ్లలో వాళ్లకు పండగైపోయింది. కాదంటే రాజకీయాలు ముదిరి గ్రూపుకొక పీర్లపండగ, ఒక మెరవణి అయిపోయింది. 'ఇది సాయిబూలపండగలే, మనదిగాదు' అనే మాటగూడా వినబడుతూంది.

రాజకీయమా, జరుగుబాటా, విజ్ఞానమా, చదువులా,నాగరీకం ముదరడమా, ధనమా, అందరికీ సొంత అబిప్రాయాలుండటమా, సంపాదనే పరమావధికావడమా, అభివృద్ధా, ఎవరిబాధలు వాళ్లకు తలకుమించినవవడమా, కారణం ఏదైనా - చిన్నప్పటి పీర్లపండగ సంబరాలు ఇప్పుడు లేవనేబాధను ఒక నిట్టూరుపులో కనబరుస్తారు ఇప్పటి పెద్దోళ్లు - "అప్పుడు కడుపునిండితే సాలు, సంబరమే, ఆ కాలంబాయ. అది వొట్టి ఎర్రికాలం." అని. కొంతకాలానికి మనదీ 'ఎర్రికాలం'గా కనబడుతుందేమో.

10 comments:

spandana said...

ఎప్పట్లానే ఏమాత్రం వాడి, వేడి తగ్గకుండా పీర్ల పండగ గురించి ఆ రోజుల్లో వాళ్ళు వేరు అన్న స్పృహే లేకుండా ప్రజలెలా వున్నారో, ఇప్పుడెలా వున్నారో సినిమా తీసి చూపించారు. ఇలా రాయటంలో మీకు మీరే సాటి. గుండం తొక్కడం దానికోసం అంతకు ముందు నెల రోజుల్నుంచీ కర్రల కోసం బండ్లు కట్టడం గురించీ కూడా రాయాల్సింది.
ఇక వురుసుల గురించి/గంగమ్మ జాతర గురించి మీనోట.. వుహు.. మీ చేత చిలికితే చూడాలని వుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

రానారె,

ఎంత కాలమయిందయ్యా ఆ యాస భాష చూసి.

చూడుబ్బా! నువ్వు బాగా రాచ్చావుండావ్. నేను పీర్లపండగ మింద కుంచెం రాద్దామనుకునటా వుంటే నువ్వే చానా రాసి పారెచ్చావుండావ్. అయినా నీ అంత రాసేటొన్ని కాదు కానీ. చానాచక్క గా జెప్పినావ్. ఆ పీర్లు... ఆ జెండా మాను.... ఆ పీర్లు దీసుకోని బొయ్యి బాయి లో ముంచేది అన్నీ కనపడస్తా వుండాయ్ నాగిప్పుడు. పీర్ల సాయిబు తట్లో పెట్టుకుని ఇచ్చే బొరుగులు గూడా గుర్తొస్తావుండాయి.


ఇట్లొద్దు గానీ నువ్వు కొంచెం బిడువు జేసుకోని వారానిగొగ బ్లాగు బరుకబ్బా.

పొద్దు పాయె.ఇంగుంటా.

విహారి

Dr.Ismail said...

రానారె...పీర్ల పండుగ ఇంకా ఓ 10రోజుల్లో వస్తూందనంగానే ఆ ఊహల్లో ఉన్న నాకు నిజంగానే పీర్లపండుగలో చిందులేసినంత ఆనందంగా ఉంది ఇది చదివి.నేను అనంతపురం జిల్లా న్యామద్దల గ్రామంలో చేసుకొన్న ఎన్నో పీర్ల పండుగలు కళ్లముందు కదిలాయి.మా ఖలీల్ బావ, బనీను మీద ఉన్న నా మెడలో పూలదండ వేసి,చేతికి రాట్నం కర్ర ఇచ్చి(పీరు)లా అన్నమాట...చుట్టూ పది మందితో మధ్యలో డప్పు కొడుతూంటే 'అలావు'(డప్పు చుట్టూ తిరుగుతూ ముందుకు వెనక్కూ అడుగులేస్తూ చేసే పల్లె నృత్యం )తొక్కుతూంటే...రంగులు చల్లుకుంటూ,నీళ్లు పోసుకుంటూ...అబ్బో ఆ రోజులే వేరు! ఇప్పుడు పల్లెల్లో ఆ ఉత్సాహం, ఆ ప్రేమలు ఎంతైనా తగ్గాయి. నీవు చదివినట్టు నేటి ఇరాక్ లోని కర్బాలాలో జరిగిన ఆ చారిత్రాత్మక ఘటన ఇలా భారతదేశంలోని పల్లె సంస్కృతిలో అంతర్భాగమయిందంటే చరిత్ర చేసిన చిత్రాలెన్నో! ఏదేమయినా నీ కథనాశైలి చూస్తూంటే మరో ఖదీర్ బాబు తెలుగు సాహిత్యానికి లభించాడని గర్వం వేస్తోంది. చెబాచ్!

kiraN said...

భలే ఉంది రామూ పీర్ల పండగ. దీని గురించి నాకు ఆట్టే తెలీకపోయినా ఇప్పుడు కొంచెం అర్ధమయ్యింది.
సంక్రాంతి ఎలా జరుపుకున్నావు.

Ramanadha Reddy said...

ధన్వోస్మి. మీ అభిమానంతో నన్ను పెద్దల్లో కలిపేస్తున్నారు. ఇలాంటివి తప్ప ఇంకేమీ రాయలేదు నేనిప్పటివరకూ. అంతలోనే నన్ను అందలమెక్కిస్తే పాడైపోనూ?

Sudheer said...

chala baga rasinarabba....santhoshanga unnindi chaduvutha unte...maa oorloguda peerla pandaga choosedaniki naggooda baga ishtame.
spandana annatlu urusu gurinchi, danlo dorike bendu-bethas, khaja la gurinchi rayachu gademi..

కొత్త పాళీ said...

rAnAre,

Check out the 'pustakaala pandaga' post in here.
http://vinnakanna.blogspot.com

You may find something of interest :-)

కొత్త పాళీ said...

That books is titled
"ghaMTasAla pATaSAla"
compiled by one Ch. Ramarao.
More than 800 pages, priced at Rs. 250. To the extent I saw, it was well produced - can't swear to the accuracy or typos.

Sudhakar said...

Chala baga rasaru : Take a bow :)

memallni chustunte naaku kuda telugu lo rayalanipistundi

Nagaraja said...

చాలా చాలా బాగుంది.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.