Sunday, November 26, 2006

ఎవ్వరికోసం నీ మందహాసం

ముక్కావారి పల్లెలోని ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల పాఠశాలలో చదవడానికి స్ధానం సంపాదించడం నా యీడు పిల్లకాయల్లో ఒక గొప్ప.
ఎనిమిదో తరగతిలోకి నా ప్రవేశం. నేను మొట్టమొదటిసారిగా అమ్మానాయనలను వొదిలి దూరంగా స్కూలుహాస్టల్లో కొత్తగా చేరిన రోజు.
మా వూరినుంచి ఆ బడికి ఎంపికైన ఇంకో పిల్లకాయ నారాయణ. మాకంటే రెండేంఢ్ల ముందు ఎంపికైన మావూరి యీర్నాగయ్య అక్కడ పదోతరగతి.
బళ్లో చేరిపించినాంక మానాయనా నారాయణోళ్లనాయనా రాయచోటి బస్సెక్కి 'భద్రంగా ఉండండి' అన్జెప్తాండంగానే బస్సుకదిలిపాయ.
అది కనబణ్ణందూరమూ చూస్తానే వుంటిమి. మెదడులో ఆలోచనలేమీ లేకండా ఖాళీ ఐపోయినట్టుంది నాకు. బళ్లోకి మెల్లిగా నడిచినాం.
అదే ఆఖరిసారి మేం స్కూలు ప్రహరీని అనుమతిలేకుండా దాటి కడప-తిరుపతి రహదారి మీదకు అంత స్వేచ్చగా వెళ్లి నింపాదిగా రావడం.

హాయిగా మన పనులన్నీ అమ్మానాయన చేస్తావుంటే సుఖంగా మంచి పప్పు నెయ్యి పెరుగు తింటూ పెరిగిన సౌకుమార్యానికిది పూర్తి విరుద్ధం.
చిన్నచిన్న పొరబాట్లు చేస్తే 'పిచ్చినాయనా' అని మురిసిపోతూ సరిచేసి సాయంచేసే అవ్వ వుండదు. మార్గం కఠినం. ఇక్కడంతే.
'అయ్యో నాయనా దెబ్బ తగిలిందా' అనే ఓదార్పు మాటలిక్కడలేవు. దెబ్బతగిలితే నిబ్బరంగా లేచి మాన్పుకొనే ప్రయత్నం చెయ్యాలి.
వాతావరణం, అన్నం, గట్టిపిల్లనాయాండ్ల రౌడీతనం, సార్లు, మేడాలు, చాపమింద నిద్ర, చన్నీళ్ల స్నానం, తెల్లారుఝాము నాలుగ్గంటలకు నిద్రలేవడం, గుడ్డలుతుక్కోవడం, గంటలకొద్దీ నిశ్శబ్దంగా వుండగలగడం,బకెట్లతో నీళ్లుమోసి చెట్లకు పోయడం, గజ్జితో చేతివేళ్లు మరియు ఇతరములు పుండ్లు పడిన పిల్లకాయల్తో సహపంక్తి భోజనం, తత్‌పరిణామాలనెదుర్కొనడం, బెండకాయకూర నాకిష్టంలేదులాంటి మాటలు మానేయటం, ఇంకా ఎన్నెన్నో.
అక్కడ గడచిన మహత్తరమైన మూడేండ్లలోనూ నా చిన్నప్పటి సంగతొకటి తరచూ గుర్తొచ్చేది. గుర్తొచ్చినపుడల్లా చిన్న నవ్వొచ్చేదినాకు.

**** **** ****

"పొద్దెక్కిపాయ, ఆ గొడ్లను రోంచేపైనా (రవ్వంత సేపైనా) మేపుకోనిరాపోణ్ణాయినా. ఎండబడితే అయ్యి మెయ్యాలేవు, మీరూ తట్టుకోలేరు. తలుగులిడిసి తోలకపొయిరాపోండి సామీ". పొద్దున్నుంచి ఇదేమాట. ఇది నాలుగోసారి. వంటింట్లోంచి వచ్చిన ఆ మాటలో - మేమింకా తెమల్లేదనే కోపము విసుగుదలతోపాటు మాకిష్టంలేని ఆ పనిచేయించే బుజ్జగింపు కూడా కలిసివుంది. ఆ బుజ్జగింపు స్వరం ఎంత శక్తిమంతమంటే - ఆరోజు గొడ్ల మేపకపోతే నాకంటే పాషాణహృదయుడు, 'తల్లిదండ్రులమీద దయలేని పుత్రుఁడు' మరొకడుండని నాకే అనిపించేటంత.
పొద్దున్నే సద్దెన్నంతో పచ్చిపులుసులో మీగడపెరుగు కలిపి జుర్రికోని గిన్నెనాకేసింది ఆ యెనుములిచ్చే పాలవల్లనే (ఎనుములంటే గేదెలు లేక బఱ్ఱెలు). తరవాత్తాగిన పెద్దగలాసుడు చిక్కని చక్కెరపాలు వాటివే. కానీ ఎప్పుడన్నా వాటిని వంకలోకి తోలకపొయ్యి మేపకరమ్మంటేమాత్రం ఒళ్లంతా బరువు. ఎవురికోసరమో ఆ పన్జేయాల్సివొచ్చినట్టు బాధ. మాటిమాటికీ తలనొప్పి ఆనొప్పి ఈనొప్పి అన్జెప్పడం ఏంబాలా. ఇట్టగాదింగబోవాల్సిందే అనుకొని బద్ధకంగా కదలబోతాండగా "ముందు వాటికి రోన్ని కుడితినీళ్లు తాపి, మల్ల తోలకపోండి" అని మా పెంకుటింటి వరండానుంచి ఒక గదమాయింపులాంటి మాట.

అసలే ఊరికేదో ఉపకారంచేస్తాన్నిట్టు ఓ యిదైపోయి తెమిలేనాకు ఈ ఆజ్ఞలు అస్సలు గిట్టలా. కానీ చేసేదేమీ లేదు. కొన్నాళ్ల ముందు నా స్థాయిలో ప్రతీకారానికి ప్రయత్నించి కొంత ఆనందించేవాణ్ణి. ఎలాగంటే నిష్ఠూరాలాడి - "వంకలో నాకేంపొద్దుబోదు, నాకు రేడియో ఇస్తే పోతా. మీరింటికాడుండి పాటలింటారు, మర్నేను". మా నాయన 24గంటలూ రేడియో వింటూనే వుండేవాడు. అయినాగానీ "పుస్తకంబట్టుకుంటే పొద్దు అదేబోతుంది" అని నా మొహం మాడ్చెయ్యక, రేడియో ఇచ్చి పంపేవారు.
మనకు హిందీ రాదు, ఇంగ్లీషు వార్తలసలే అర్ధంకావు. తర్వాత కార్యక్రమం చిత్రసీమ ఫిలింగీతాలు. అన్నీ ఫుల్‌సౌండ్‌లో వినేవాణ్ణి. "...ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి మూడువందలా ముప్పైమూడు పాయింట్ మూడు మీటర్లూ అనగా తొమ్మిదివందల కిలోహెర్డ్జ్ పై పదకొండుగంటలా నలభై ఐదునిముషాలకు మా తరువాతి ప్రసారం ప్రారంభమౌతుంది. అంతవరకూ సెలవు. నమస్తే! కూ ...' ఐనా ఫుల్‌సౌండ్ అపేదిలేదు. ఇలా శక్తివంచనలేకుండా బేటరీలు అయిపోగొట్టడం నాస్థాయి కిరాతకం. ఒకసారి పొరబాటున ఆ రేడియోను కిందపడేసి దెబ్బతగిలించినాము.అప్పట్నుండి ఆ అవకాశం లేకుండాపోయింది. అప్పుడు నాకు ఆరేడేండ్లుంటాయి.

బడికిబోయి సదూకోడమెహటే మన డ్యూటీ అని గొడ్లమేపే పనిని మా ఇంటికి నేను చేస్తున్న గొప్పసేవగా గుర్తించి నన్ను గౌరవించలేదని మాత్రమే నాభాధ. అందుకే ఎనుములమీద నాకు కోపంలేదు. దొక్కలు పైకిలేచేదాక మేపేదే. మనపని మనం చేసుకుంటున్నాము అనే స్ప్రుహ లేకపోవడము, దానికి గుర్తింపును ప్రోత్సాహాన్ని ఆశించడం మూర్ఖత్వమనే జ్ఞానం నాకు కలగకపోవడం వల్ల అసంతృప్తి పెరిగిపోసాగింది.

కుడితినీళ్లు తాగితే కడుపులు నిండి త్వరగా మేతనుండి ఇంటికొస్తాయని నా ఆలోచన. కానీ తర్వాత్తెలిసిందేమంటే కుడితి తాగితే ఎండకు దప్పికకు తట్టుకొని ఎక్కువసేపు మేస్తాయని. కుడితిలో ఇంత కుట్ర వుందని తెలిసి మ్రాన్పడిపోయాను. నా సేవను గుర్తించకపోగా ఆజ్ఞలుజారీచేస్తున్నారు, అమలుచెయ్యక తప్పడంలేదు. కానీ ఏదో ఒకటి చేసి వీళ్లనూ బాధించాలి.'కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు'. ప్రతి మాటకూ విపరీతార్థాలుతీసి అది నాకు అవమానంగా భావించడంతో మనసు విషపూరితం కావడం మొదలైంది. ప్రతిరోజూ ఓడిపోతున్న భావన.

భట్టుపల్లె వంకలో సేద్యంబావి ఒకటుండేది, యీరనాగయ్యోళ్లదే అనుకుంటా. నేను దాంట్లో దుంకి చచ్చిపోతే అమ్మ నాయన అవ్వ తాత అందర్నీ గుండెపగిలేటట్టు ఏడిపించొచ్చు. అంతకంటే బలమైన ప్రతీకారం ఏమీ వుండదనిపించింది. అప్పుడు నాకు ఈత రాదు. ఒకరోజు ఆ బాయి దరిమీద కూర్చొని కాళ్లు బాయిలోకి పెట్టి చూసి ఈ రకంగా ఆలోచించినా:

"ఇప్పుడు నేను కూర్చోనున్న ఈ రాయి వుల్లిందంటే బాయిలో పడిపోతా. మునిగి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యేలోగా ఎవరైనా రాకపోతే ఇంతేసంగతులు, చిత్తగించవలెను, ఇట్లు మీ కుమారుడు.
కానీ వాళ్ల ఏడుపులు చూసి ఆనందించడానికి నేనెక్కడుంటాను? ఐనా అమ్మా నాయనలను మరీ ఇంతగా ఏడిపించకూడదు. ఎనుముల్ని మేపమంటారు అంతేగానీ ఇంక దేంట్లోను కొదవచెయ్యలేదుగదా.
నాకు తలనొప్పి వస్తే ఆనొప్పికి మా నాయన దాదాపుగా ఏడ్చినంతపనిచేస్తాడుగదా. కాబట్టి మనమంటే ఇష్టమే. ఈ బాయిలోదూకే కార్యక్రమం ఇంకోరోజు చూద్దాం."
"దుంకడానికి నాకేంభయంలేదు" అనికూడా మనసులో అనుకొని చిన్నసైజు ఆత్మవంచన చేసుకొని ఎనుములను తోలుకొని ఇంటిదారిపట్టినాం. నిజానికి దరిమింద కూర్చొని ఆ బాయి లోతెంతుంటుందో అని లోనికిచూడగానే కండ్లుదిరిగినాయ్, చెప్పరానంత భయమేసింది.

**** **** ****

ఆ బడిలో జీవితం నాకెన్నో నేర్పింది. జీవితం పట్ల ఒక దృక్‌పథాన్ని ఏర్పరచింది. అందుకు మానసికంగా శారీరకంగా సిద్ధంచేసింది. గుర్తింపుపొందటం లక్ష్యంగా పనిచేస్తే దుఃఖమే ఫలితమని, చేతిలోవున్న పనిని బాగాచేయటం నాలక్ష్యంగా వుంటే గుర్తింపు దానంతటదే వస్తుందని అక్కడి జీవితమే నేర్పింది. అదొక మంచి దశ.

సందర్భోచిమో కాదోగానీ 'బ్రతుకు పూలబాట కాదు. అది పరవశించి పాడుకునే పాట కాదు...' అంటూ ఘంటసాలమాస్టారు పాడిన పాట గుర్తొస్తోంది. మహదేవన్‌గారి అద్భుతమైన ఈ స్వరకల్పనను ఆస్వాదించడానికైనా వినాలీపాటను. ఇందులోని రెండవ చరణము మరియు '...ఆరోజు వచ్చులే' అనే అశావాది ఆత్రేయగారి ముగింపు నాకెంతో ఇష్టం.

19 comments:

Anonymous said...

మీతోపాటు నాచేత కూడా ఎనుములు మేపించి,కూడా తిప్పారు. కాని పచ్చిపులుసు గుర్తు చేసి తప్పుచేసారు. ఇప్పుడు తినాలనిపిస్తోంది ఎలా? గుర్తింపు కోసం పని చేయడం కన్న పని ద్వారానే గుర్తింపు తెచ్చుకోవడం ఉత్తమం అని మీరు చెప్పిన మాట వేదవాక్యం. అలాగే మనకిష్టంలేకపోతే అన్నీ తప్పులే కన్పించడం కూడా సహజం. ఇది కూడా సత్యం.

నాగరాజు said...

అద్భుతంగా వుంది ఈ టపా. చాలా ఎంజాయ్ చేసాను.

balarami reddy bandi said...

ఇదిగో రామనాథన్నా!!!
చానా బాగా రాసినావన్నా.....
మాది పులివెందుల..నేను గూడా ముక్కవారిపల్లె లొ నె చదివినా
నువ్వు దీపావళి గురించి చానా బాగా రాసినావు.నేను BITS-PILANI(RAJASTHAN) లొ engineering 4 th year chaduvutunnanu..ఈడ చానా మన్ది తెలుగోల్లు ఉండారు అయినా ఒక్కడు కూడా దీపావళి అని అనరు అందరు దీవాళి అంటానారు..నాకు చానా బాధ గా ఉంది..నువ్వు రాసినది చదివినాక బాగా అనిపించింది..నా మాదిరి ఆలొచించెవాల్లు ఉండారు అని అనిపించింది...

radhika said...

టపా లో వుపయోగించిన భాష బాగుంది.అర్దం కాని పదాలను ప్రామాణికం లో చెప్పడం చాలా బాగుంది.ముందు చెప్పినదంతా పిల్ల కాయల మాటల్ల..ముక్తాయింపులో వాడిన భాష పరినితి చెందిన మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పినట్టు అనిపించింది నాకు.అలాగె టపా లో మీరు రాసిన [అదే మీరు పొందిన]అనుభవం ఇప్పుడు చిన్నదిగానే అనిపించినా అప్పట్లో అవే పెద్ద విషయాలు.నేను ఇలా ఆలోచించిన సందర్భాలు చాలానే వున్నాయి.మంచి విషయాన్ని మ్రుదువుగా,నవ్విస్తూ చాలా బాగ చెప్పరండి

Dr.isMail said...

రానారె,

ఎంత సక్కగా సెప్తూండావబ్బా! నీ శైలి చూస్తూంటే ఈనాడు లో చదివిన కేతువిశ్వనాథరెడ్డి కథలు గుర్తొస్తున్నాయి.చిన్నప్పుడు మా మేనమామ పని చేసే పల్లెకెళ్ళి విన్న రేడియో అనుభూతులు మళ్ళీ అనుభవించేలా చేయడమే కాకుండా...ఓ మంచి పాట కూడా వినిపించావు.ఇంతకీ ఇప్పుడు నీవు ఎక్కడ ఉంటున్నావబ్బా?

radhika said...

మీరు నా బ్లాగులొ రాసిన కామెంటు కి రెప్లెయ్ ఇక్కడ ఇస్తున్నను.పౌర్నమి నాడు ఆటు పోట్లు చాల ఎక్కువ వుంటాయి. కాబట్టి అంతా అలజడిగా వుంటుంది సముద్రం.న మనస్సు కుడా అంత అలజడి గా వుందని చెప్పలని నా వుద్దెస్యం.నా కవితని మెచుకున్నందుకు థాంక్స్ అండి.

spandana said...

బాల్య జీవితాన్ని గుర్తుకు తెచ్చి విచిత్ర అవస్థలో ముంచెంత్తి సంతోషపరుస్తున్న మీకు దన్యవాదాలు.
ఈ స్కూలుకే నేను కూడా 7వ తరగతి తర్వాత పరీక్ష రాయడానికి కడప వచ్చి ముత్తరాసుపల్లెలో మాబందువుల ఇంటికొచ్చి ఒకరాత్రంతా వీధిలైటు వెలుతురులో పక్కింటి వీధి అరుగు మీద చదువుకున్నది గుర్తుకొచ్చింది. నాకు సీటు రాలేదు.
అచ్చం మీలాగే పొద్దున్నే ఎనుములని మేపుకు రావాల్సిన డ్యూటీ నాదే! ఆ కడప స్టేషనులో వచ్చే వుదయం పాటలకోసం రేడియోమీద హక్కుకోసం నేను మా చెల్లీ తగువులాడుకొనేవాళ్ళం.
ఇక ఆదివారం వచ్చిందంటే పోటి ఇంకా ఎక్కువ. నాకేమొ ఎద్దుల మేపే పనిబడేది. దానంత బోర్ నాకు మరోటి వుండెది కాదు. గట్లెంబడి అవి పక్కనున్న చెనిక్కాయ చేలో తినకుండా పగ్గాలు పట్టుకొని ఉత్తినే నిలబడి వుండడమంత శిక్ష మరోటి లేదు. కానీ మీయంత తీవ్రమైన ఆలోచన నేనెప్పుడూ చేయలేదు. సంచీలో రేడియో దాచుకొని తెచ్చుకోవడం, లేదంటే చందమామలో మరో వీక్లీలో తెచ్చుకొని చదువుకోవడం. ఆదివారం గంటసేపు పాటలు ఆ తర్వాత ఓ పెద్ద నాటిక రావడం వాటికోసం వారమంతా ఎదురుచూడటం. తీరా నేను ఎద్దులకాడికి రేదియో తీసుకెల్తానని తెలిసి మా చెల్లి దాన్ని దాచేయడం. "ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం మళ్ళి 333.3 మీటర్లు అంటే 900 కిలో హెట్జ్ పై " అన్న మాట వినాలంటే దానితో పాటే మన ఆత్మీయుడు వెళ్ళిపోయినంత భాధ.
చిన్నదనపు జ్ఞాపకాల మత్తుమందు జల్లి తీయటి బాధకు గురిచేశింది మీ బ్లాగు.
--ప్రసాద్
http://blog.charasala.com

kiraN said...

గుర్తింపుపొందటం లక్ష్యంగా పనిచేస్తే దుఃఖమే ఫలితమని, చేతిలోవున్న పనిని బాగాచేయటం నాలక్ష్యంగా వుంటే గుర్తింపు దానంతటదే వస్తుంది.
చాలా మ౦చి మాట చెప్పావు.
నేను కూడా మా గేదెల్ని మేపాను, కానీ చాలా తక్కువ.

- కిరణ్

myriad enigmas said...

mee blog chaalaa baagundi andi. mee intro inkaa baagundi, especially the tagline. mee blog choosina tharvatha naakkoda telugu scrip nerchukovalani inspiration vocchesindi. next comment telugu lo post chesthaanu.

lucky said...

రామనాధరెడ్డి గారూ, తియ్యటి బాధ కలిగించారండి మీ బ్లాగ్ తోటి. చదువుతుంటే నా గురించి మీకెలా తెలిసి వ్రాశారా అనిపించింది.

నేను కూడా గురుకుల పాఠశాల లో చదివాను. చిన్న వయసులోనే మన పనులు మనం చేసుకోవడం, అంత క్రమశిక్షన గా వుండడం, ప్రతీ చిన్న తప్పుకి శిక్ష అనుభవించడం జీవితం లో పైకి రావడానికి మంచి బాటలు వేసాయి. కానీ punishment మాత్రం చాల తీవ్రంగా వుండేవి మా school లో.

ఇక నేను బర్రెలు తోలుకు పొతే, మా బర్రెలు నాకు తెలియదు కాబట్టి అందరు నాతోనే వాల్ల బర్రెలు కూడా అదిలించుకునేవారు పంటచేలలోకి పోకుండా. అందర్నీ చంపెయ్యలనేంత కోపం వచ్చేది.

myriad enigmas said...
This comment has been removed by a blog administrator.
narayana said...

రామూ, జీవితం అనుభూతుల సమాహారం
ఇత్లు నీ ప్రియ స్నేహితుదు నారాయణ

myriad enigmas said...
This comment has been removed by a blog administrator.
kotta pALI said...

ప్రియ రామూ,
ఇప్పుడే మీ భట్టుపల్లె కతలన్నీ తీరిగ్గా ఒక్క బిగిన చదివాను. ఒకే ఒక్క మాట - అద్భుతం! సుమారు నెలకో కత రాస్తున్నట్టున్నారు. ఆలస్యమైనా సరే .. రాయటం మాత్రం ఆపొద్దు ప్లీజ్!
ఆముక్త మాల్యద కొత్త సీరీస్ మొదలు పెట్టాను, చూడండి.

Anangi balasiddaiah said...

బాగవ్రాసారు చిన్ననతనం గురించి

భాస్కర్ said...

హలో రమానంద్ గారు,
నేను కూడ APRS లొనె చదివాను బీచుపల్లి, మహబూబునగర్ జిల్లా. It supposed to be one of the worst APRS Schools in terms of facilities and one of the best in terms of results. ఇంకా నేను ఐదవ తరగతి నుంచే చెరాను. నెను కూడ ఇదే state of mind లో ఉండే వాడిని. Even I wrote have some of my worst experiences in my scribble, hope soon I can blog them.
One more thing your style is good.

కొత్త పాళీ said...

ఓ కాదరయ్యోవ్, ఏందో గొడవల్లో ఉన్నావంటే ఏందో అనుకున్నా. ఇట్టా పొద్దులో మంచి సుద్దులు రాత్తన్నావనుకోలా. దాసరి కత కొత్త పుట తిరిగింది. ఓ కన్నేసుంచు :-)

Anonymous said...

Seeing the English comments, i realise this blog is good. unfortunately, i do not know to read or write telugu. May be this is only for those lucky men/women who knows to read this native script.

రానారె said...

మనస్తే. కృతజ్ఞుణ్ణి.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.