ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అనువుగాని చోట అధికులమనరాదు

వీరసేనుని పాలన అజేయంగా సాగుతోంది. అనుకూలురైన అధికారగణం.
క్రమశిక్షణతో మెలిగే ప్రజ. శాంతిభద్రతల సమస్యలేమీ లేవు.
దేవతలు కూడా అతని పాలన మెచ్చారు. అగ్ని దేవుడు రాజ్యప్రజల్ని బాధించలేదు.
వరుణుడూ వాయుదేవుడు సఖ్యతతో ఆ రాజ్యాన్ని సస్యశ్యామలం, సుభిక్షం చేశారు.
వీరసేనుని ప్రతాపాగ్నికి ఎదురు నిలిచే సాహసులెవ్వరూ సరిహద్దుల ఆవల కూడా లేరు.

*****

"ఇంతకూ యెవుర్నాయినా ఈ యీరసేనుడు ? రాజ్యమేందీ... యేందికత?"


యెవురి పేర్జెప్తే బట్టుపల్లెలో పెద్దోళ్లంతా మామూలుగా "శివనారాయణరెడ్డి మనవడా...అట్టజెప్తేగదా..." అని దీర్ఘాల్దీస్తారో,
యెవురి పేర్జెప్తే మిగతా జనాలు కొంచేపు ఆగి, "ఓ.. కాదరయ్యా!
ఆపిల్లకాయకు యింగో పేరు గుడకా వుండాదాఁ?" అని వాపోతారో,
ఎవడు పీలగొంతుతో గాఠ్టిగా "స్కూల్ అటెన్షన్" అని అరిస్తే శ్రీనివాసకాన్వెటు మొత్తం
ఒక్కసారిగా సావధానమౌతుందో...... వాడే నేను.

శ్రీ శ్రీనివాసకాన్వెట్లో ఐదోతరగతి చదివేనాటి మాటన్నమాట.
పాఠశాల విద్యార్ధి నాయకుడనే పదవి వెలగబెట్టేవాణ్ణప్పుడు.

*****

ఆ సంవత్సరం యండాకాలం వేడి చానా జాస్తిగా వుండడంతో, మద్యానంపూట
లంచ్ బ్రేక్ లో పిల్లోళ్లెవరూ బయిటికిబొయ్యి యండలో తిరక్కుండా స్కూల్లోనేవుండి
రెండుగంటలు నిద్దరబోవాలని ఆదేశాలు జారీ అయినాయి. మద్యానం పూట అట్టా
బయిటికిబోకండా తిరక్కండా గొమ్మునుండాలంటేనే చానా కష్టమే... అట్టాడిది
నిద్దరగూడా బోవాలంటే అది యాణ్నించొచ్చాదబ్బా అని నేను మిగతా పిల్లకాయలూ
వొగటే బాదపడిపోతాంటే, రాజారెడ్డిసారు నన్ను పిలిపించి ఆ "బాధ్యత" నాకు
అప్పగించినాడు. నేన్నిద్రబోనవసరం లేదు. అలివిగాని ఆనందమైంది నాకు.
నాకేమాత్రం ఇష్టంలేని పనిని నేను మిగతా జనంతో చేయించాలన్నమాట.

నా ప్రత్యేకాధికారాలు కొన్ని
- ఈతబర్రాయుధం ధరించి తిరుగవచ్చును.
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించు వారిని శిక్షించవచ్చు.
- నా అధికారాలను వికేంద్రీకరించవచ్చు మరియు బదలాయించవచ్చు.

*****

రాజ్యమంతా దొంగనిద్ర నటిస్తున్న వేళ వీరసేనుడు పహరా కాస్తున్నాడు.
అది ప్రశాంత నిశ్శబ్ద వేడి నడిమధ్యాహ్నం. దూరంనుంచి గుసగుసలు.
అవి కర్ణభేరిని సోకీసోకకముందే వీరసేనుడు అప్రమత్తుడయ్యాడు.
కర్తవ్యోన్ముఖుడయ్యాడు. ఇంకా యేవేవో అయి ఆ దిశగా కదిలాడు.
ఆసలే దేవతలు అనగా కాన్వెంట్ టీచర్లు మెచ్చే పాలనకదా ఆయనదిమరి.

తీరా అక్కడికెళ్తే గుసగుసలు మాయం. తన ప్రాభవప్రభావమననుకున్నాడు.
అంతలోనే మళ్లీ గుసగుసలు. ఒక బుడ్డోడు కళ్లుతెరిచి ఇటే చూస్తున్నాడు.
వాడు ఒకటోతరగతి కూడా కాదు. వీరసేనుని భుజాలదాకా కూడా రాడు.

వీరసేనుడు గుడ్లురిమినాడు. బుడ్డోడు భయపళ్లా. పైగా ఏదో గొణిగాడు.
"ఆయ్.. ధిక్కారము సైతునా" అని కరవాలం చూపించాడు వీరసేనుడు.
బుడ్డోడు భయపళ్లా ...పడకుండా "కొట్టు, సూస్సాము" అన్నాడు గట్టిగా.
ఆ మాటతో శత్రుభయంకరుడైన వీరసేనుడు కంగుతిన్నాడు. అహం దెబ్బతింది.
కరవాలం ఝళిపించబోయేంతలో.. "ఆత్మవంచన" అంది అశరీరవాణి. ఆగాడు.

అసలే "గాఢనిద్ర"లో వున్న రాజ్యపౌరులంతా కళ్లుమూసుకునే చూడగలుగుతున్నారు.
"దమ్ముంటే కొట్రా... సూస్సామూ" కాలుదువ్వుతున్నాడు బుడ్డోడు.
ఇక తప్పదని వాని కాళ్లమీద ఈతబర్రాయుధంతో ఒహటిచ్చుకున్నాడు వీరసేనుడు .
అబ్బ - అని బుడ్డోడు లేచి పుస్తకాలసంచీ ఎక్కి సాగి నిలబడి,
ఏంజరుగుతోందో అర్ధమయేలోగా వీరసేనుని గూబ గుయ్య్ మనిపించాడు.

*****

తన రాజ్యంలో ప్రజలందరి సమక్షంలో జరిగిన ఈ హఠాత్పరిణామానికి
వీరసేనునికి దిమ్మతిరిగింది. కళ్లమ్మట నీళ్లుదిరిగినాయి.
తిరగడం ఆగినాక అవమానం అనిపించింది. పట్టరాని ఉక్రోషం వొచ్చింది.
ఆ తరువాత చెంపదెబ్బ తాలూకు నొప్పి తెలిసొచ్చింది.
ఇంకా ఇలాంటివే చాలా వొచ్చి వీరసేనుణ్ణి అయోమయంలో పడేశాయ్.

వాణ్ణి చితక్కొట్టొచ్చుగానీ, పెద్దరికం అనిపించుకోదు. వాడు చానా చిన్నోడు.
వీరసేనుడు మానవుడు. మృగత్వం పెద్దగా లేనివాడు.
అధికార దుర్వినియోగం చేసే బాపతు కాదు. ప్రతీకారేచ్ఛ లేదు.
తనకు.. ఘోరావమానం జరిగింది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. బాధ.
ఒక భయంకరమైన విలన్ తన అడ్డాలోనే తనంటే భయపడే జనాల మధ్యనే
ఒక బచ్చా[హీరో]గాడి చేత తుక్కుతుక్కుగా తన్నులు తిన్నపుడు పడే బాధ.
భయం... తనంటే ప్రజల్లో వున్న భయం పోతుందని.
హీరోనీ హీరోమనుషుల్ని హింసించి భయం పుట్టిస్తాడు విలన్.
వీరసేనుడు విలన్ కాదు. అతనికి చాలామంది అభిమానులున్నారు.

*****

వీరసేనుడి బుర్రలో ఆలోచన మొదలైంది, ఒక పద్ధతి ప్రకారం.
జరగకూడనిది జరిగింది. దాన్ని మార్చలేడు.
పాఠశాల విద్యార్ధి నాయకుడనే పదవి వెలగబెట్టేవాడుగా ప్రవర్తించాలి.
పరిస్ధితి చేయిదాటింది. ఈ విషయం దేవతలకు విన్నవించాడు.
దేవతలు బుడ్డోణ్ని రెండు తగిలిస్తారు, కాసింత పరువుదక్కుతుందని.

"వీడా! నిన్ను? కొట్నాడా!! హ హ హ మరియు హ" అన్నారు.
నిజంగానే బుడ్డోడు కొరకరాని కొయ్య.
టీచర్లను చూసి భయపడాలని కూడా తెలీనంత చిన్నోడు వాడు.
అని బుడ్డోణ్నిచూసి ముచ్చటపడి "రౌడీ నాయాలా" అని వదిలేశారు.

వీరసేనుడు ఆ సాయంత్రమంతా తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.


*****

కామెంట్‌లు

Naveen Garla చెప్పారు…
వీరసేన మహారాజా.. మా చిన్నప్పుడు, మాకునూ ఇటువంటి అవమానమే జరిగింది. ఒక మూడేండ్ల కుర్ర పన్నెండేడ్ల వయసు గల నన్ను చాచి లెంపకాయ ఒకటి కొట్టాడు. అక్కడే వాడి పీక పిసికి పారేద్దామనుకొన్నా.. కానీ వాడు మా స్కూలు కరెస్పాండెంట్ కొడుకు అయిపాయె. అవమానం దిగమింగుకొని.. ఎం తెలియనట్టు అక్కడి నుండి జారుకొన్నా. నేనెంత మెతకవాణ్ణంటే.. రెండో తరగతిలో .. ఆడపిల్లల చేత దెబ్బలు తినేవాణ్ణి :(
ఇప్పుడవన్నీ వొట్టి జ్నాపకాలు...

నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com
అజ్ఞాత చెప్పారు…
"ముక్కు పగిలేదాకా సూటిగానే పోదాం..." అని మీ ప్రొఫైల్‌లో వ్రాసుకుంటే ఏమిటో అనుకున్నాను... బాగుంది...
Dr.Pen చెప్పారు…
ఈరచేనా,

బలే గమ్ముగా సెప్పావబ్బా. అదేదో సందమామ కతలాగుండాది సదూతూంటే. పొర్లి పొర్లి నవ్వుకొన్నా సాన్నాళ్ల తొరువాత. సల్లగుండు మారాజా!
అజ్ఞాత చెప్పారు…
మీ జాబులు చదువుతుంటే అరిసెలు తింటున్నట్టు ఉంది రానారె! అరిసెలు కూడా మీ జాబుల్లాగే కావాలనుకున్నప్పుడల్లా దొరకేవి కావు, సంక్రాంతికే చేసేవాళ్ళు. ఏడాదంతా ఎదురుచూడాల్సిందే!
అజ్ఞాత చెప్పారు…
నేను నాలుగో తరగతి నాకంటే ఒక పది కేజీలు ఎక్కువుండే వాడిని ఏదో విషయంలో పిచ్చి కోపం వచ్చ్చి తలకాయ వంచి బాదేశా! మాష్టార్లందరు నాకే సపోర్టు ఇచ్చరనుకోంది, ఎందుకంటే నాకు "రా.మ.బా" ఇమేజ్ ఉండేది...:-) కొన్ని సార్లు బుడ్డోల్లు అలానే సేత్తారండి, పెద్దమనసుతో సద్దుకుపోయి, వీలయితే ఆడ్ని ఒక ముద్దెట్టుకుని, ఆ నెపాన బుగ్గ కొరికెయ్యాల :-)
అజ్ఞాత చెప్పారు…
[ఆనందంలో రాసిన ముందరి వ్యాఖ్యలో అక్షర దోషాలున్నాయి...దానిని బైగాన్ స్ప్రే తో నిర్మూలించగలరు..]

నేను నాలుగో తరగతి చదువుతుండేటప్పుడు నాకంటే ఒక పది కేజీలు ఎక్కువుండే వాడిని ఏదో విషయంలో పిచ్చి కోపం వచ్చ్చి తలకాయ వంచి బాదేశా! మాష్టార్లందరు నాకే సపోర్టు ఇచ్చరనుకోండి, ఎందుకంటే నాకు "రా.మ.బా" ఇమేజ్ ఉండేది...:-) కొన్ని సార్లు బుడ్డోల్లు అలానే సేత్తారండి, పెద్దమనసుతో సద్దుకుపోయి, వీలయితే ఆడ్ని ఒక ముద్దెట్టుకుని, ఆ నెపాన బుగ్గ కొరికెయ్యాల :-)
అనిల్ చీమలమఱ్ఱి చెప్పారు…
వీరసేనా

నీ అధికార మదం తో, సామాన్యుడని తలచి, వానిని అణగద్రోక్కాలని ప్రయత్నించావు..చిన్నపుల్లెఘా విరిచిపారెద్దము అనుకొని చూసావు....కానీ అది మామూలు పుల్లకాదు,అగ్గి పుల్ల. ఇదే మీభాషలో "విప్లవం" అంటారు., ఐనా నీ పిచ్చి గానీ నువ్వే కాదు నీలాంటి నియంతలెందరో మా ఈ పోరాటాన్ని ఆపాలని ప్రయత్నించి ఓడిపోయారు..నువ్వేంత..

"long live Communism...Down with Imperialism"


చివరిగా

చాలా బాగుంది...పైన చెప్పింది సరదాగా తీసుకోండి.

అనిల్ చీమలమఱ్ఱి http://aceanil.blogspot.com
రానారె చెప్పారు…
గార్ల వారూ, కొన్నిగాయాల్ని కాలమే మాన్పాలి. అదంతే.

నాగ'మహా'రాజా, నా ముక్కు పొట్టిదని మా నాయనమ్మ ఎగతాళి చేసేది. పొట్టిదంత సులభంగా పగలదని నా ధైర్యం. చూద్దాం.

హెల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మీ దీవెనతో. సంతోషం.

చదువరిగారు, ధన్యోస్మి. మరో జాబు రాయించే వూపిరి మీ వ్యాఖ్య. ధన్యవాదాలు.
మనమాట- మావూళ్లో అరిసెలంటే జనాలకు అర్థంకాదు. అత్తిరాసాలు లేదా నిప్పట్లు అనాలి.

సుధాకర్ గారు, మీరూ ఒక బుడ్డోడన్నమాట. మీలో వీరసేనుడూ వున్నాడు. బుగ్గకొరికే వుపాయం బాగుంది.
మీ మొదటి వ్యాఖ్య ఆనందాతిరేకసూచిక అన్నారుగాన తొలగించబుద్ధి కాలేదు.

చీమలమఱ్ఱి వీరుడా, చిన్న చీమేకదా నలిపేద్దామనుకొన్నా. అక్షరాలా నిజం. కానీ అది కుట్టేసరికి ఆనొప్పిలో ఎన్నో ఆలోచనలు రేగినయ్.
అజ్ఞాత చెప్పారు…
రానారె (భలే వుంది సినారె లాగా),

మీ ఈర శేనుడు భలె మంచి పనులు చేస్తున్నాడు. గోడ కుర్చీ వేయించే వాడు కాదా?

విహారి.
http://vihaari.blogspot.com
spandana చెప్పారు…
రానారె, శివనారాయణరెడ్డి మనవడా, ఓ కాదరయ్యా,
చదువుతున్నంతసేపూ నవ్వుతో సంతోషంతో కన్నీళ్ళు ఆగలేదంటే నమ్మండి. చిన్న అనుభవాన్నైనా ఇంతలా రక్తి కట్టించడం నీకే సాద్యం నాయనా!

--ప్రసాద్
http://charasala.com/blog/
అజ్ఞాత చెప్పారు…
చాలా రోజుల తర్వాత తెలుగు టూత్ పేస్టుతో పళ్లు తోముకొన్నట్టు వు౦ది. ఇలానే అన్ని ప్రా౦తాల వారు తమ పదజాల౦ తో ఝుళిపిస్తే ఇక మన బ్లాగు హైదరాబాద్ మసలా చాట్ లా అద్బుత౦గా వు౦టు౦ది.
వీరసేన మహారాజు తమ అభిమాన్ల సామ్రాజ్య౦ ఇలాగే విస్తరి౦చగలరని ఆశిస్తున్నా౦.
రానారె చెప్పారు…
వీరసేనుడు శత్రుభయంకరుడే కానీ సొంతమనుషుల మీద స్వైరవిహారం చేయడు విహారీ.

ప్రసాద్ గారు, నవ్వించగలిగిందంటే ఈ రచన సార్థకమైనట్లే.

ఆసా గారు, మీ ఆస నెరవేరాలని నేనూ అశిస్తున్నాను. ధన్యవాదాలు.
cbrao చెప్పారు…
మీ బ్లాగ్ లోని మీ టపాలు చూశా. రాయలసీమ మాండలీకం చక్కగా విశదమౌతుంది వాటిలో. మీ శైలి నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే, ఇప్పుడు 'మిట్టురోడి పుస్తకం' -నామిని, చదువుతున్నా.
అజ్ఞాత చెప్పారు…
reDDigAru

nA pEru vamSI anDi.mundugA mimmalni abhinandincAli, ilAnTi vistRtamayina bhAvAlu annI oka cOTa cercinanduku.bAvundanDi mI abhiprAya vyaktIkaraNa.

Also Thanks for stopping by Maganti.org and thanks for your comments. I guess you tried to comment in telugu, but just wanted to let you know that my website is not yet equipped to handle telugu fonts....sorry about that.

I was out of town , so could not respond immediately to your comments.

Congratulations again on a good job done and for the good posts.

Vamsi
అజ్ఞాత చెప్పారు…
వీరసేన మహరాజుగారికి జయము కల్గు గాక. చాలా ఆనందింపచేసింది.
రానారె చెప్పారు…
రామ్ గారు, థాంక్యూ.
రావుగారు, ధన్యవాదాలు. మొన్ననే నేనూ తెప్పించా మిట్టూరోడి పుస్తకం. నేను శ్రీరమణ కథలు చదువుతుండగా, నామిని పుస్తకాన్ని నా మిత్రుడు తన్నుకెళ్లాడు.
వంశీగారు, "నా పేరు వంశీ అండి" అని మీ అంతటివారు పరిచయం చేసువడంతో నేనెంత చిన్నవాణ్ణో గుర్తెరిగాను. ధన్యవాదాలు.
అనామకులు గారికి కూడా.
అయ్యా, బ్లాగు అంటే నాకోసం రాసుకునేది, అది నా సొంతం అనే అభిప్రాయం నాది. అందులో కొంత మొండితనం కలిసి వ్యాఖ్యలతో నన్ను ప్రశంసించేవారికీ, శ్రేయోభిలాషులై విమర్శించే వారికీ కృతజ్ఞతలు చెప్పాలన్న ఇంగితం అప్పట్లో నాకు లేకపోయింది. క్షమించగలరు.
spandana చెప్పారు…
రానారె బహుశా ఇక్కడ చుసేననుకుంటా "మిట్టూరోడి పుస్తకం" తెప్పించా. ఇప్పుడు చదువుతున్నా. ప్రతి కథ చదువుతున్నపుడు మీరు, మీ శైలీ గుర్తుకు వస్తున్నాయి.
ఈ మిట్టూరోడి కథలు కదిలించినంతగా ఇంకేదీ నన్నింత వరకూ కదిలించలేదంటే నమ్మండి. ఏ కథ చదవాలన్నా ముందు paper tissue దగ్గర వుంచుకొని చదవాల్సి వస్తోంది. బహుశా మిట్టూరోడిలో నన్ను నేను చూసుకోవడం వల్లనో ఏమో!

-- ప్రసాద్
http://blog.charasala.com
రానారె చెప్పారు…
క్రీ.శ. 1990 ప్రాతంలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన 'మిట్టూరోడి కతలు', 'సినబ్బా కతలు' ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను ధారావాహిరంగా ప్రచురింపబడేవి. వీరబల్లె శాఖాగ్రంథాలయంనుండి ఇంటికి తెచ్చుకొని (వారపత్రికలు ఇంటికి ఇచ్చేవారుకాదు, కొంత పరపతి ఉపయోగించాల్సివచ్చేది) చదివేవాడిని, వినిపించేవాడిని. తరువాత మరచిపోయాను. ఈ బ్లాగు మొదలెట్టిన తరువాత వచ్చిన వ్యాఖ్యలతో మళ్లీ గుర్తొచ్చింది. రెండు నెలల క్రితం నేనూ ఈ పుస్తకం తెప్పించాను - మరికొన్నింటితోపాటుగా. ఇంకా చదవలేదు. అన్నింటింటే రుచిగా ఉన్న మామిడికాయను మిగతావన్నీ తిన్నాక చివర్లో తింటామే - అలా ఈ కతలను పక్కనపెట్టుకున్నాను. అవి చదివితే నా ఒరిజినాలిటీ దెబ్బతింటుందేమో అనే సందేహం కలుగుతోంది - మీ వ్యాఖ్య చదివాక.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బయటోళ్లకు జెప్పే కతగాదు

ఇది కత గాదు. వొక్కటంటే ఒక్క మాట. అంతే. బోయోళ్లెంగటసామి గుమ్మనాగని నాయనతో అన్నె మాట. చానా చిన్న మాట. నేను పుట్టక ముందెప్పటిదో చాన్నాళ్లనాటి మాట. భట్టుపల్లె జనాలు వాళ్ల బిడ్డలకూ, బిడ్డల బిడ్డలకూ గూడా చెప్పుకుంటానేవుంటారీమాటను పిట్టకత మాదిరిగా. ఈ మాటను యిని ఫక్కుని నవ్వి మరిసిపోతే పోవచ్చు. అదీ మంచిదే. మరిసిపోకండా గుర్తుబెట్టుకుంటే యింగా మంచిది. ఇంతకూ కతేందంటే ... వొకనాటి పొద్దునపూట భట్టుపల్లెలో ఛఱ్ఱఛఱ్ఱామని గాస్చాండాదంట యండ. ఆ యండలో దోవ పక్కన వొక బండమింద ఒక్కడే కుచ్చోనున్న్యాడంట బోయోళ్లెంగటసామి. గుమ్మనాగని నాయన ఆ దోవన పోతాపోతా యంగటసామిని సూశనంట. గుమ్మనాగడు మా సిన్నప్పుడు మా మడికాడ జీతగాడుగా వున్న్యాడులే. ఆ గుమ్మనాగని నాయన. సూసిన ముసిలోడు గొమ్మునుండకండా, "యేల నాయనా యండలో గుచ్చోనుండావే.." అన్న్యాడంట. దానికి యంగటసామి - తలకాయ గూడా తిప్పకండా, "నువ్వు జెప్పలేదనీ, **గానివి" అన్నెంట. ఇంతేబ్బా కత! పిట్టకొంచెం కూతఘనం అన్నిట్టుగా ఈ పిట్టకతలో తోడుకున్నోళ్లకు తోడుకున్నెంత. అంత యండ కూడా లెక్కలేనంత ఆలాశనలో వుండాడు. బాధలో వుండాడు. ఎవురిమిందనో దేనిమిందనో కోపంలో వుండాడు. యండలో బండమింద క

రాధ కోసం వొగపారి సూడొచ్చు

చిన్నాయనతో తిరగాల్నేగానీ బలే నవ్వుకోవొచ్చు. అంత తమాసాగా మాట్టాడే మనిసి ఇంగెవురూ వుండరేమో. యండాకాలం సెలవలు ఇంగా నలభై రోజులుండాయి. సెలవల తరవాత మనం ఐదోతరగతి. పొద్దన్నే బువ్వాగివ్వా తిని, తీరుబడిగా రోంచేపు పెద్దతోటలో తిరిగి, మజ్జాన్నంగా మూలపల్లెకు బయల్దేరినాం. అప్పిరెడ్డితాతోళ్ల వడ్లమిషన్ కాడ రాయచోటి బస్సెక్కి కుచ్చున్న్యాం. బస్సు సోమారంవడ్డెపల్లె దాటినాఁక చిన్నాయన మా ఇద్దరికీ టిక్కట్ తీసుకున్న్యాడు. నాదీ ఫుల్ టికట్టే. ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా వుండగా బస్సు ఏరు దాటింది. నేను కిటికీవార కూచ్చోని, చెట్లూ కొండలూ యనక్కు పోయేది చూస్తా వుంటి. బస్సు ఏరు దాటి వడ్డెపల్లెలో నిలబడింది. పల్లె మొగసాల తార్రోడ్డు నుంచి పడమటగాపోయే ఒక మట్టిబాటను చూపిచ్చి, "ఈ బాటెమ్మడీ పోతే మూలపల్లె వస్సాది" అన్న్యాడు. రాయచోటికి నేను మస్తుగా పొయ్యిన్యాగానీ అసలు ఆడొక బాటుందనే సంగతే సరిగా చూళ్ల్యా. "నిజ్జంగా?!!!" "నిజ్జంగానే" "ఐతే రాయచోటికెందుకూ? ఈణ్ణే దిగుదాం పట్టు." "ఈడ దిగితే మనం ఎక్కాల్సిన సర్వీసు వొకటే. నటరాజా సర్వీస్." "ఓహో..." "పూర్వం బస్సుల్యాడియ్యి?! అంత

న త్వం శోచితుమర్హసి!

మూడు నెలల క్రితం ఈ రచనను అందంగా ముస్తాబుచేసి ప్రచురించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు. మాంచి నిద్దట్లో వుండఁగా దవడకింద సురుక్కుమనింది. ముల్లుగర్ర [ 1 ] తో బొడిసినట్టు. దిగ్గున లేసినిలబడబోయి తలుగు [ 2 ] ముందరకాళ్లకు తగులుకోని దభీమని యడంపక్కకు పడిపొయ్‌నా. పెద్దపాటు. నా దవడ కిందినుంచి ఒక గుఱ్ఱపుటీగ యనక్కు తిరిగిసూడకండా అలికిడే లేకండా ఎగిరిపాయ నామింద అలిగినట్టు. ఈగ ఎగిరిపోయినదిక్కు మోరెత్తి [ 3 ] సూద్దామంటే మొగదాట్లో [ 4 ] యిరక్కపోయుండాది నా యనక్కాళ్లలో యడమది. ఈగ కుట్టఁగానే ఆ సురుక్కు నాకు తెలీకండానే దాన్నితోలబొయ్యి యనక్కాలు మొగదాట్లో యిరికించుకున్న్యా. కాలు యనక్కు తీసుకుందామంటే పక్కటెమకల్లో నొప్పి. ఊపిరి బిగబట్టి, నొప్పినీ బిగబట్టి రోంతసేపు నిమ్మళంగా అట్టే పండుకొన్న్యా. యండాకాలం. సాయంత్రం బిగిచ్చిన గాలి - నడిరేతిరి దాఁకా కదల్నేల్యా. మా రామునికి, రాముని పెండ్లానికిగూడా నడిరేయిదాఁక నిద్దరబట్టలా. గాలితోలినా తోలకపోయినా వాళ్లకు అంత తొందరగా నిద్దరబట్టదులే, మొన్నీమధ్యనేగదా మా రామునికి జతకుదిరింది. నడిరేయి దాటినాంక మొగుడూపెండ్లాలిద్దురూ దోమతెర తీసి టార్చిలైటేసి మంచం దిగొచ్చి నాకూ నా జతగాడు కోడె